బొంగరాలు విసురుతూ బాల్యంలోకి…
[dropcap]I[/dropcap]n praising or loving a child, we love and praise not that which is, but that which we hope for.
దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం, ఎనలేని కానుక, వెల లేని ఆస్తి – సంతానం. ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా, పిల్లలు లేని లోటు తీరేది కాదు. పూరి గుడిసెలో ఉన్నవాడికైనా, బిడ్డలు అండగా ఉంటే, ఆ ధైర్యమే వేరు. కోట్లకు పడగలెత్తినట్లే.
అయితే బిడ్డల్ని పెంచి పెద్ద చేయటం అంత తేలిక కాదు. ఒక ఏడాది లోనో, రెండేళ్లల్లోనో తీరిపోయేదీ కాదు. తల్లి బిడ్డను కనడానికి ఎన్ని నొప్పులు పడుతుందో, వాడిని పెంచి పెద్ద చేయటానికి, అంతకు మించి నొప్పులు పడాల్సి వస్తుంది.
పది నెలలు మూసి, ప్రసవవేదన భరించి, జన్మ నిచ్చిన తరువాత, ఆ పసికందును అందుకున్న సమయంలో తల్లి మొహంలో వెలిగే తేజస్సు దేనితోనూ పోల్చలేము. అది ఒక అద్భుతమైన, అనిర్వచనీయమైన, దివ్యమైన అనుభూతి. ఈ భువిలో దానికి సాటి రాగలది ఇంకొకటి లేదు.
తన ఒంటి మీద నున్న మైలను తనంత తానుగా కడుక్కోలేని నిస్సహాయ స్థితిని నుంచి ఎదిగి, రెండు మూడు దశాబ్దాలలో ఆ కుటుంబాన్ని ఆదుకొని, కొండంత అండగా నిలబడతాడు. ఈ నిస్సహాయ స్థితి నుంచీ, ఆ ధీరోదాత్తమైన స్థితికి ఎదగటానికి మధ్య గల కాలమే బాల్యం.
జీవితంలో అత్యంత సంతోషదాయకమైన కాలం బాల్యం. తన కాళ్ళ మీద తాను నిలబడలేక బుడి బుడి నడకలతో, అడుగులు వేసే బిడ్డను చూసి తల్లి పరవశించిపోతుంది. చేతులు చాచి రా రమ్మని పిలుస్తూ, అందీ అందనంత దూరంలో ఉండి, వినోదం చూస్తుంది. తల్లి కౌగిలిని మించిన ప్రశస్తమైన ప్రదేశం, ఈ భూమండంలో మరెక్కడా కానరాదు. ఊ, ఊల దగ్గర నుంచీ అమ్మ, అత్త దాకా వచ్చీ రాని మాటలు, ఊరీ ఊరని ఊరగాయ కన్నా రుచిగా ఉంటాయి. అందుకే మరీ, మరీ కొసరి కొసరి వాడి చేత ‘అమ్మ’ అనిపించటం. అంతకన్నా కమ్మనైన మాట, ఈ జన్మలో ఎవరు మాత్రం అనగలరు? వినగలరు?
చంకనెత్తుకొనే ఇంటి పని అంతా చక్కబెట్టుకుంటుంది తల్లి. ఈ లోకంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిదీ, వింతగా విప్పారిన నేత్రాలలో చూస్తుంటాడు వాడు సంభ్రమాశ్చర్యాలతో.
ఆడుకునే బొమ్మలే కాదు, అలరించే గాలీ, నేలా, వెలుతూ, చీకటి, భయం, బాధ, అన్నీ వింత గొలిపే విషయాలే. ఎన్ని సందేహాలు? ఎన్ని అంతు చిక్కని ప్రశ్నలు?… సూర్యోదయం, సూర్యాస్తమయం, ఆకాశంలో చంద్రుడు, నక్షత్రాలూ… అన్నీ ఆశ్చర్యార్థకాలే.
ఎవరేం చెప్పినా నిజమేనని నమ్మే అమాయకత్వం… వాన ఎందుకొస్తుంది? అంటే దేవుడు ఏడుస్తున్నాడు, అందుకే కన్నీరు వాన అయి కురుస్తొంది… అంటే… నిజమేనని నమ్మేస్తాడు.
మొలకెత్తిన గింజలు తింటే, కడుపులో చెట్లు పెరుగుతాయి అని అంటే, అవి తినటం మానేస్తాడు.
చీకట్లో బూచివాడు వచ్చి పట్టుకుపోతాడని భయపెడితే, కౌగిలించుకునే ఉంటాడు.
ఒకటా, రెండా? ఎన్ని అనుభవాలు? ఎన్నెన్ని అనుభూతులు? కొంచెం ఊహ తెలిసినప్పటి నుంచీ, ఉద్వేగాలు ఉరకలు వేస్తయి. ఏది మంచీ, ఏది చెడూ అని వివరించి చెప్పే బాధ్యత తల్లిదండ్రులదే.
ముద్దు మురిపాల వరకూ మంచిదేగానీ, మంకుతనం మాత్రం మంచిది కాదు… అడిగినవన్నీ ఇచ్చేస్తుంటే, కోరికల శారికలు ఆకాశమంత ఎత్తున విహరిస్తుంటాయి. ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఎంత వరకు ఇవ్వాలో అన్న విజ్ఞత తల్లిదండ్రులదే.
పిల్లల మీద తల్లిదండ్రులకు ఉండే ప్రేమకు అవధులు లేవు. ఇదొక విచిత్రమైన విషయం. దేనికైనా ఇది మితము, ఇది అమితము అనే పరిమితులు ఉండొచ్చు గానీ, కని పెంచిన పిల్లల మీద ఉండే ప్రేమకు మాత్రం పరిమితులు లేవు. ఇది సృష్టిలోనే విచిత్రమైన విషయం. తమ పిల్లలు ఎంత అల్లరి చేసిన అదంతా చూడముచ్చటగానే ఉంటుంది గానీ, పక్కింటి పిల్లలు ఏ మాత్రం అరిచినా, ‘వెధవ గారాబం చేసి పిల్లల్ని చెడగొడుతున్నారు’ అని అనేస్తారు.
అయిదేళ్ల వయసు వచ్చేటప్పటికి, తల్లితో పాటు తండ్రి తోనూ సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈ ప్రపంచంలో తండ్రి అంత తెలివి అయినవాడూ, గొప్పవాడూ, మంచివాడూ ఇంకొకడు లేడనిపిస్తుంది. తండ్రితో గడప దాటి బాహ్యప్రపంచంలోకి అడుగుపెడతాడు. ఏది కావాలన్నా తండ్రి కొని ఇస్తాడు. అందుచేత ఆయనంత మంచివాడు మరొకరు ఉండరు. పిల్లలు అవసరం ఉన్నా, లేకున్నా కనిపించిన ప్రతిదీ కావాలనే అంటారు. ఇలా అడిగినదల్లా ఇస్తూ పోతే, కొంత కాలానికి డిమాండ్ చేయటం అలవాటైపోతుంది. అందుచేత ఏది అవసరమో, దానిని మాత్రమే ఇస్తుండాలి. మంకుతనం ముదరకుండా చూసుకోవాలి.
ఈ పృథ్విలో తండ్రిని మించిన శక్తిమంతుడు, ధైర్యవంతుడు ఇంకెవరూ ఉండరు. రోజూ స్కూలుకు స్కూటర్ మీద తీసుకెళ్తాడు. పుస్తకాలు, పెన్సిల్స్, బ్యాగులూ, బూట్లూ… అన్నీ నాన్నే ఇస్తాడు. నాన్నతో చెబితే చాలు, ఏదైనా తెచ్చి ఇస్తాడన్న భావన పిల్లలకు కలుగుతుంది.
పిల్లలతో వీలున్నంత ఎక్కువ సేపు గడపటమే కాదు, వాళ్ళకు వచ్చే సవాలక్ష సందేహాలనూ తీర్చాలి. ‘ఇది నువ్వు చెయ్యగలవు’ అన్న ధైర్యాన్ని కలిగించాలి. ‘ఇది నీ వల్ల కాదు’ అన్న ఫీలింగ్ ఏర్పడితే, ఎప్పటికీ ఏదీ సాధించలేరు.
తండ్రి శలవుల్లో విహారయాత్రకు తీసుకువెళ్తాడు. సముద్రపు ఒడ్డున నిలబడినప్పుడు ‘మా నాన్న చెబితే చాలు అలలు వచ్చి మా పాదాలు కడిగి వెళ్తాయి’ అన్న భరోసా పిల్లలకు కలిగించాలి. తండ్రి ఒక రోల్-మోడల్. కోపం రాదు. ఎప్పుడూ చిరునవ్వుతోనే కనిపిస్తాడు. ఆచి తూచి మాట్లాడతాడు. ఆ మాటలే ఆయన ఆలోచనలని వెల్లడిస్తయి. ఆ ఆలోచనలే కాగల కార్యాలన్నిటినీ చక్కబెడతాయి. ఇలా ఒకటి రెండుసార్లు ఏది చేస్తుంటే, అదే అలవాటుగా మారుతుంది. ఈ అలవాట్లే మనిషి వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తయి.
ఈ ప్రపంచం నిండా అంతా దేన్నో ఒకదానిని ఇష్టపడే వాళ్లే ఉంటారు. కొందరు కష్టపడి పని చేయటానికి ఇష్టపడతారు. మరి కొందరు తప్పించుకు తిరగటానికి ఇష్టపడతారు.
తండ్రి ఎలాంటివాడు అయితే, పిల్లలూ అదే నేర్చుకుంటారు. ఆయన అడుగులోన అడుగువేసి నడవటమే తెలుస్తుంది.
వజ్రానికి సానబెడితే గాని మెరుపు రాదు. కొంతమంది పిల్లలకు అనుభవాలే పాఠాలు నేర్పుతయి. తల్లి ఊరికి వెళ్ళినా, తండ్రి దగ్గర ఉంటే చాలు. ఎంతో ధైర్యం గాను, సంతోషంగాను ఉండే పిల్లలు ఉంటారు. ఒకసారి తండ్రి ఆఫీసు పని మీద వారం, పది రోజులు ఎక్కడికో వెళ్లొస్తుంటాడు. అప్పుడు అమ్మ దగ్గరుంటే చాలు. నిజానికి పిల్లలు తల్లి మీద చూపించిన అథారిటీ తండ్రి మీద చూపించరు. స్కూలు నుంచి వస్తూనే బ్యాగు అవతల పారేసి, టిఫెను పెట్టమని తల్లిని దబాయిస్తారు – ఫ్రెండ్స్‌తో ఆడుకోవటానికి వెళ్లటానికి ఆలస్యమైందంటూ. తల్లి దగ్గర చనువు ఎక్కువ. అందువల్ల అమ్మ మాట లెక్క చేయక పోవటమూ కద్దు.
పిల్లలకు క్రమశిక్షణ కూడా చాలా అవసరం. ఈ క్రమశిక్షణ దండించటం వల్ల రాదు. ఏది ఎందుకు మంచీ, ఏది ఎందుకు మంచిది కాదు అన్న విషయాన్ని వివరించి చెప్పాలి, నచ్చచెప్పాలి. అందుకు ముందు తల్లిదండ్రులు ఉండవలసిన పద్ధతిలో ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడల్లా ఇరుగుపొరుగు వారిని విమర్శిస్తూనో, దూషిస్తూనో ఉన్నారనుకోండి, బయట ఎక్కడన్నా వాళ్లని కల్సినప్పుడు పిల్లలు అవే మాటలతో వాళ్లను విమర్శిస్తారు.
ఇక పెద్దలందరూ ఒకేలా ఉండనట్లుగానే పిల్లలూ అందరూ ఒకేలా ఉండరు. కొందరు భయం భయంగా ఉంటారు. కొందరు దూకుడుగా ఉంటారు. స్కూలుకు వెళ్లినప్పుడు నలుగురితో కల్సిమెల్సి ఉండాల్సి వస్తుంది. ఒక కొంటె పిల్లాడు పక్కన చేరితే, వీడి పెన్సిల్స్, పుస్తకాలు లాక్కుంటాడు. కనబడకుండా గిచ్చుతుంటాడు. తిడుతుంటాడు. మానసికంగా వేధిస్తుంటాడు. ఈ పిరికివాడు ఎవరికీ చెప్పుకోలేదు. లోలోపల భయపడుతూంటాడు. ఇంటికి వచ్చినా అదే భయం వెంటాడుతూ ఉంటుంది. ఒకసారి ఒక కుర్రాడిని, పక్క కుర్రాడు లావెటరీ లోకి పంపి బయట గడియ పెట్టాడు. రెండు గంటలు వాడు అక్కడే ఉండిపొయ్యాడు. అలా ఏడిపించినవాడిని నిలదీస్తే, ఇంట్లో వాళ్ల అమ్మ వాడిని అలాగే శిక్షిస్తూ ఉంటుందట. ఇలాంటివి పిల్లలు తల్లిదండ్రులతో చెప్పుకోలేరు. నల్లగా ఉన్నావనో, తెల్లగా ఉన్నావనో, మూతీ ముక్కూ వంకర అనో సాటి పిల్లలు వెక్కిరిస్తుంటే, వేధిస్తుంటే, పిల్లలు లోలోపల ఏడుస్తూ కృంగిపోతుంటారు. వాళ్లు ఉండవల్సినంత సంతోషంగా లేకపోతే, తల్లిదండ్రులు కారణం తెల్సుకుని, తగిన దిద్దుబాటు చర్యలు చేసి పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలి.
పేదరికం కొందరి పాలిట శాపం అయితే, అనుకోకుండా వచ్చే ఆపదలు మరికొందరికి పిడుగుపాటులా వచ్చిపడిపోతయి.
చిన్నతనంలోనే తల్లినో, తండ్రినో కోల్పోయినవాళ్ల మనోవేదన వర్ణనాతీతం. దుఃఖమే ముఖాన ముసురు పట్టినట్లు ఉంటుంది. నవ్వటమే మర్చిపోతారు.
ఇలాంటి దురదృష్టవంతుల జీవితం ఎప్పుడో ఒకసారి అనూహ్యంగా మలుపు తిరుగుతుంది. ఎవరూ ఊహించని స్థితికి వెళ్తారు.
స్కాట్‌లాండ్‌లో చాలా ఏళ్ల కిందట ఒక కుర్రాడు అల్లరి చిల్లరగా తిరుగుతుండేవాడు. ఒక ధనవంతుడి తోటలోకి గోడదూకి వెళ్లబోయాడు. తోటమాలి తరిమికొట్టాడు. “పోరా, వెధవా, ఏదో ఒక రోజు ఈ తోట నేనే కొంటాను” అని వెళ్లిపోయాడు. నలభై ఏళ్ల తరువాత ఒకనాడు గోడ దూకబోయిన ఆ కుర్రాడే డన్‌ఫెర్మ్‌లైన్ లోని ఆ తోట కొని పార్కుగా మార్చి ఆ ఊరి వాళ్ళకి కానుకగా ఇచ్చాడు. దానిని పిటెన్‍క్రీఫ్ పార్క్‌గా పిలుస్తుంటారు. ఆ కుర్రాడి పేరు ఆండ్రూ కార్నెగీ. ఆయన తీరిక లేనంత బిజీగా ఉన్నప్పటికీ, చిన్ననాటి ఆ చిన్న విషయాన్ని మరిచిపోలేదంటే, మనిషి జీవితం మీద బాల్యం ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
లార్డ్ రోజ్‌బెరీకి చిన్నప్పుడు మూడు కోరికలు ఉండేవి. ధనవంతురాలు అయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. డెర్బీ గెల్చుకోవాలి. ప్రధానమంత్రి కావాలి. ఆయన తన మూడు కోరికలూ తీర్చుకున్నాడు. జీవితంలో ఒక లక్ష్యాన్నీ, గమ్యాన్నీ ఏర్పరుచుకుంటే, ఆ దిశగానే ప్రయాణం సాగుతుంది మరి.
ఒకామెకు ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా మొత్తం చదవాలన్న కోరిక ఉండేదిట. ఒక సంవత్సరమంతా కష్టపడి మొత్తం చదివింది.
ప్రతివాడు ఇంట్లో కూర్చుని నేను ఇలా ఎందుకున్నాను, అలా ఎందుకు లేను అని ఆలోచిస్తూంటాడు. అలా ఉండటానికి ప్రయత్నించకపోవటమే కారణం.
కొన్నేళ్ల క్రిందట పద్ధానుగేళ్ల కుర్రాడు చదువు మానేశాడు. ఒక ఆఫీసులో జవానుగా చేరాడు. అయితే మిగిలిన జవానులకీ, వీడికీ కొంచెం తేడా ఉంది. ప్రతిదీ చూసి నేర్చుకోవాలన్న తపన ఉండేది. కంపెనీ పనులలో ఆసక్తి పెంచుకున్నాడు. శలవు రోజులలో కూడా ఫాక్టరీకి వెళ్లి అక్కడ వాళ్లు ఎలా పని చేస్తున్నారో గమనించేవాడు. ఫాక్టరీలో పని చేయడానికి పర్మిషన్ అడిగాడు. ఇతని విషయం బోర్డు మీటింగులో ప్రస్తావనకి వచ్చింది. మూడేళ్ల తరువాత అతనికి ప్రమోషన్ ఇచ్చి జీతం పెంచారు. సంబంధించిన పుస్తకాలు చదివి పరిజ్ఞానం పెంచుకున్నాడు. కొంతకాలానికి అదే కంపెనీకి మేనేజింగ్ డైరక్టర్ అయ్యాడు. అతని క్రింద మూడు వేల మంది పని చేస్తుండేవారు.
చదువు అనేది హైస్కూలు తోనూ, కాలేజీ తోనూ పూర్తి అయ్యేది కాదు. జీవితమంతా చదువుతూనే ఉండాలి.
రూజ్‌వెల్ట్ అన్నాడు “హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడను అయ్యాను. అప్పటి నుంచీ నా విద్యాభ్యాసం మొదలైంది” అని.