[dropcap]శ్రీ[/dropcap]మతి మద్దూరి బిందుమాధవి రచించిన కథల సంపుటి ‘శతక పద్యాలు’. ఈ పుస్తకంలో వివిధ శతకాలలోని పద్యాల ద్వారా అల్లిన 49 కథలున్నాయి. పిల్లల, యువతీయువకుల వ్యక్తిత్వ వికాసానికీ కథలు దోహదపడతాయి.
***
“బిందుమాధవి ఈ రచనలో సుమతి, వేమన, భాస్కర, కుమార, నృసింహ శతక పద్యాలను కథారచనతో అన్వయించి మంచి కథలు వ్రాసింది. శతక పద్యం మానవ జీవిత ప్రస్థానానికి వెలుగుబాట వేసింది. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకి సమాధానం చెప్పిన కర దీపిక శతక పద్యం.
కథా రచనకి పద్యాలని ఎన్నుకోవటంలోనే బిందుమాధవి నేర్పరితనం కనిపిస్తుంది. ఆణిముత్యాల లాంటి పద్యాలని తీసుకుని ‘సరస్వతీదేవి కంఠాభరణం’లా ముత్యాలహారాన్ని సమర్పించింది బిందుమాధవి.
~
ఈ కథలు కేవలం నీతి కథలు మాత్రమే కాదు. ఇవి యువకుల వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మవిశ్వాసానికి ఉపకరిస్తాయి. మిత్ర లాభం, మిత్ర భేదం కథల్లా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో స్నేహం చెయ్యాలి. డబ్బు సంపాదించటమే కాదు… ఆ సంపదని జాగ్రత్తగా కాపాడే నిర్వహణా సామర్యం (management) తెలిసిన వ్యక్తులు… ఇలా ఎన్నో విధాల బిందుమాధవి శతక కథలు నేటి యువతరానికి మార్గ నిర్దేశాలు అయ్యాయి. ఇవి సామాజిక బాధ్యతను కూడా నిర్వహిస్తున్నాయి.
~
ఈ కథల్లో ధర్మం గురించి, దానం గురించి ఎన్నో విశేషాంశాలు కథా రూపంలో చెప్పింది బిందుమాధవి. మన సంపాదన అంతా మనకే కాదు.. ఏదీ మన వెంట రాదు. కనుక దీనులకి దానం చేయటం సామాజిక బాధ్యత అంటూ నరసింహ శతక పద్యాన్ని వ్రాసింది కథగా!
~
బిందుమాధవి శతక పద్య కథలు అన్నీ కుటుంబ కథలు. మనందరి కథలు. మనందరి జీవితానుభవాలకి అద్దం పట్టిన కథలు. శతక పద్యాన్ని ఎంచుకోవటంలోనే బిందుమాధవి వివేకం గుర్తించి అభినందిస్తున్నాను. ఈ కథలు ఆత్మీయంగా ఉన్నాయి.” అన్నారు డా. ముక్తేవి భారతి తమ ముందుమాట ‘పుస్తక పరిచయం – కుటుంబ కథలు’లో.
***
“పద్యాలు తెలుగుకు తలమాణికాలు, నాలుగు వరుసల్లో ఉన్న పద్యం జీవితంలో ఏదో ఒక సందర్భంలో గుర్తొస్తూ ఉంటుంది. అందుకే చిన్న పిలలకు శతకపద్యాలు నేర్పించాలి.
పద్యాలను చిరకాలం గుర్తుంచుకునే విధంగా శ్రీమతి బిందు మాధవి గారు కథల రూపంలో చెప్పారు. ఇవి భావి తరానికి అమూల్య సంపదలుగా నిలుస్తాయి. పద్యం నేర్చుకోవడం కఠినం కావచ్చు కానీ పిల్లలకు కథలంటే ఎంతో ఇష్టం. అందుకే పద్యాల నీతిని కథల రూపంలో పొందు పరిచి భావితరానికి మరిచిపోలేని మంచి బామ్మగా నిలిచారు. ఈ పుస్తకం ప్రతి ఇంట ఉంచుకుంటే తరతరాల బామ్మలకు ఉపయోగంగా ఉంటుంది.” అని వ్యాఖ్యానించారు శ్రీ టి. వేదాంత సూరి తమ ముందుమాట ‘అభినందన’లో.
***
“ఇవి మన కథలు. మనల్ని మనం మరల ఆవిష్కరించుకోవలసిన అవసరాన్ని తెలిపే కథలు. తరతరాలు దాచుకోదగిన మంచి పుస్తక మాణిక్యం” అన్నారు సుష్మ విజయకృష్ణ.
***
కొన్ని కథలను సంక్షిప్తంగా పరిచయం చేసుకుందాం.
ఓ వ్యక్తి తండ్రి ఆసుపత్రిలో ఉంటాడు. అతనికి కొంత డబ్బు అవసరం అవుతుంది. అదే ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేస్తున్న బంధువు మొహం చాటేస్తాడు. అప్పుడు అతన్ని స్నేహితులే ఆదుకుంటారు. సుమతి శతకంలోని ‘అక్కరకు రాని చుట్టము’ పద్యానికి అల్లిన కథ ఇది.
కొత్తగా పెళ్ళయి వచ్చిన ఓ యువతి అత్తగారింట్లో వంటలో ఒక పొరపాటు చేస్తే, బామ్మగారు ‘రుచి బావుందిలే, ఇదొ కొత్త వెరైటీ’ అంటూ వాతావరణాన్ని తేలిక చేస్తారు. ఆ తర్వాత ఆ యువతి వంటలు నేర్చుకుని ఇంటిల్లిపాదికీ రుచిగా వండిపెడుతుంది. ‘సాధనమున పనులు సమకూరటం’ అంటే ఇదే అని అంటారు రచయిత్రి.
దైవదర్శనానికి వచ్చి కూడా, తమ అధికార హోదాని ప్రదర్శించి సామాన్యులకు ఇబ్బందులు కలిగించేవారిని కొన్నిసార్లు భరించాలి, వారిపై దురుసు ప్రవర్తన పనికిరాదు. అందుకే అనువుగాని చోట అధికులమనరాదు పద్యాన్ని గుర్తు చేసుకోమంటారు.
అన్నదమ్ములు ఎలా నడుచుకోవాలా రామాయణంలో రాముడి పలికిన మాటల ద్వారా గుర్తు చేస్తారు. అలాగే మరో కథలో – ఓ బాలుడిని బడిలో హేళన చేస్తారు. ఇంటికొచ్చాకా, దిగులుగా ఉన్న వాడిని గమనించిన బామ్మ, రామయణంలోని ఓ కథ చెపి, ఉత్సాహపరుస్తుంది. పోటీలో విజయం సాధించేలా చేస్తుంది.
ఇంకా చక్కని సందేశాల కథలు ఉన్న ఈ పుస్తకం ఆసక్తిగా చదివిస్తుంది.
***
శతక పద్యాలు (కథా కదంబం)
రచన: మద్దూరి బిందు మాధవి
ప్రచురణ: మాధవి పబ్లికేషన్స్
పుటలు: 170
వెల: ₹110
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. 9000413413
రచయిత్రి: 9491727272