[dropcap]“మ[/dropcap]ళ్లీ ఆన్లైన్లో ఆర్డర్ చేశావా” అంటూ మధు మాడు మొహం పెట్టాడు.
“భలేవాడివే, ఇంట్లో చేసుకున్నా అంతే అవుతుంది. పైగా కూరగాయలు కొనుక్కునీ, కడుక్కునీ, కోసుకునీ, తరుక్కునీ, వండుకునే శ్రమ ఉండదు. పైగా ఇలా ఆర్డర్ చేస్తే చాలు, అలా ఫుడ్ మన ఇంటి బోర్డర్ లోకొస్తుంది. పైపెచ్చు కూల్ డ్రింక్ కూడా ఫ్రీగా ఇస్తారు తెలుసా” అంది ఆ ఫుడ్ ప్యాకెట్స్‌తో లోనికి వస్తూ.
“ఎప్పుడో అంటే పర్లేదు కానీ, ఎప్పుడూ అంటేనే తంటా. నాకసలే బయటి ఫుడ్డు తింటే పడదు. కడుపు తడబడుతుంది. ఆరోగ్యం తగలడుతుంది.”
మధు మాటలు వింటూనే, కాస్త గుర్రుగా చూస్తూ, “కమాన్ మధు, నువ్వు కూడా అత్తయ్య, మావయ్యలా సణుగుతూ నస పెట్టకు. థాంక్ గాడ్, మీ ఊర్లో వాళ్లకి వేరేగా ఓ ఇల్లు కట్టించేసాం. కాబట్టే, మనం ఇంత ఫ్రీగా ఉండగలుగుతున్నాం. లేదంటే మనకి రోజూ నీతి పురాణాలూ, మంచి చెడులూ, పూజా పునస్కారాలు, సాంప్రదాయం, సత్తుబండలూ అంటూ వాళ్ళు చెప్పేవి వింటే, నా బుర్ర గిర్రున తిరిగిపోయేది. నువ్వు మళ్ళీ వాళ్ళు లేని లోటుని తీర్చాలని, లోతులకి వెళ్ళి ఆలోచించకూ ప్లీజ్” చెప్పిందామె తలపై చెయ్యిపెట్టుకుంటూ.
“నువ్వు అనాస పండంత విషయాన్ని పనసపండంత చేయకు. అక్కడ అంత లేదు. అయినా వాళ్ళకి మనం ఇల్లు కట్టించి ఇచ్చేసాక, హాయిగా వాళ్ళ మానాన వాళ్ళు ఉంటున్నారు. నాన్నకి వచ్చే పెన్షన్‌తో టెన్షన్ లేకుండా జాలీగా ఉండుంటారు. మనకి కూడా ప్రశాంతంగానే ఉందిపుడు. ఇక వాళ్ళ టాపిక్ ఎందుకిపుడు” అడిగాడు.
“కరక్టే లే” అని లలిత అంటుండగానే, ట్రింగ్ అంటూ కాలింగ్ బెల్ మోగింది. అది వింటూనే ఇద్దరూ అయోమయంగా ముఖముఖాలు చూసుకున్నారు.
“కొంపదీసి మీ బాబాయ్ కొడుకు గిరి కాదు కదా!” భయం భయంగా మధు వంక చూస్తూ అంది.
“వాడా! వామ్మో” అన్న మధు, తర్వాత కాస్త తేరుకుని “వాడు లంచ్, డిన్నర్ సమయాలలోనే వచ్చి తగలడతాడు. కనుక ఇది వాడు అయిఉండకపోవచ్చు” చెప్పాడు.
“వస్తే రావచ్చు మధూ, కానీ వాళ్ళ ఆవిడ ఒక పరమ వీర నస పార్టీ. ఎంచక్కా ఇంట్లోనే వంట చేసుకుందాం అక్కా అంటూ, వంట ఎలా చేయాలి, ఏవిటీ, నీకు ఏ కూర ఇష్టం అని మొదలు పెట్టి, వంట అంతా నా నెత్తిన పెట్టి, నాతోనే చేయిస్తుంది.”
“అవునా, పోన్లే అలా అయినా నువ్వు కాస్తోకూస్తో వంట నేర్చుకున్నావు. ఆన్లైన్ ఫుడ్డుతో, పాడె ఎక్కాల్సిన నా జీర్ణశక్తి కాస్తా, ఓ గాడిన పడింది” చెప్పాడు పొట్ట తడుముకుంటూ.
మళ్ళీ కాలింగ్ బెల్ మోగడంతో, “సరే సరే,వస్తున్నా” అని వెళ్లి తలుపు తీసింది .ఎదురుగా ఉన్న ఓ బక్కపల్చని వ్యక్తి “పేపర్ బిల్ మేడం” అన్నాడు.
“పో బే” అని నాలుక కరుచుకుని, “అదే అదే ఫోన్ పే చేస్తా” అని తలుపు వేసి హుషారుగా వస్తూ, “బ్రతికాం, గిరి వాళ్లు కాదు” అని ఆమె చెప్తుండగానే, మధు ఫోన్ రింగ్ అయ్యింది .
ఆ ఫోను వంక చూస్తూనే, “చచ్చాo రా దేవుడా, ఫోన్‌లో గిరి, ఇక మన పని ఆలూ కర్రీ” అని చెప్పి ఫోన్ లిఫ్టు చేసి, “ఎలా ఉన్నావ్, ఒహ్హ్ అదా!, అలాగే, సరే ఓకే. గీత కూడా వస్తుందా సరే” చెప్పి ఫోన్ పెట్టేసి “ఇద్దరూ సాయంత్రం డిన్నర్‌కి వస్తున్నారు”.
“అమ్మో, చంపుకు తినేస్తారు. బయట ఆర్డర్ చేసినవి వద్దు. హోటల్‌కి వద్దు అని విసిగిస్తారు. ఇంట్లోనే వంట చేసుకుని తిందామని ఏవేవో అంటారు. పైగా మనం సాయంత్రం అలా బీచ్‌కి వెళ్ధాo అనుకున్నాంగా. వాళ్ళు వచ్చినపుడు మనం కొంచెం సూటి పోటి మాటలన్నా పట్టించుకోకుండా మళ్ళీ వచ్చేస్తారు” అంటూ మెడ ఓ వైపుకి వాల్చేస్తూ డీలా పడింది లలిత.
“వాళ్ళు ఇలా వెళ్ళగానే మనం అలా బీచ్‍కి వెళ్లిపోదాం” అని క్షణం ఆలోచించి “నాదో ఐడియా లలితా, ఈసారి డోస్ పెంచుదాం. వాళ్ళు వచ్చాక మనం ఎడ మొహం, పెడ మొహం పెట్టుకుని, వాళ్ళని సరిగా రిసీవ్ చేసుకోవద్దు. వాళ్ళతో సరిగా మాట్లాడొద్దు. సరిగా వాళ్లకి వడ్డించకుండా ఊరుకుందాం. అప్పుడు వాళ్ళు ఇక చచ్చినా మన గుమ్మం తొక్కరు ఎలా ఉంది నా ఐడియా” అడిగాడు మధు కళ్ళు పెద్దవి చేసి.
“చాలా బావుంది.అద్భుతహ, అలానే చేద్దాం” అంది లలిత తెగ ఉత్సాహ పడిపోతూ.
వాళ్ళు వచ్చాక, మధు,లలితలు మొక్కుబడిగా పలకరించారు,తూతూ మంత్రంగా భోజనం పెట్టారు. ఆ తర్వాత ముక్కి, ముక్కీ మాట్లాడి పంపేసారు.
లిఫ్టు దిగి, రెండు అడుగులు వేసిన గీత “ఎందుకు గిరీ, వీళ్ళ ఇంటికి మనం రావడం. వాళ్ళ మొహాలు చూసావా, కంద గడ్డల్లా ఎలా పెట్టుకున్నారో. నువ్వు ఆమెకి వంట నేర్పమన్నావ్ అని నేర్పాను. కానీ ఆ మాత్రం వంట నేర్చుకోవడానికి కూడా ఆపసోపాలు పడిపోయింది మహాతల్లి. ఈ రోజు మనతో వాళ్ళు సరిగా మాటే మాట్లాడలేదు, ఇక వీళ్ళ గుమ్మం తొక్కకూడదు” చెప్పింది గీత.
“ఏం చేయను, మా పెద్దమ్మ, పెదనాన్న, అదే మధు వాళ్ళ అమ్మ నాన్న, వీళ్ళు ఎలా ఉన్నారో చూసి రమ్మని నన్నుతెగ బ్రతిమాలతారు. గీతని, లలితకి వంట నేర్పమను. మధు అన్నయ్యకి బయట ఫుడ్ పడదు అని పెద్దమ్మ అంది. అందుకే నేను నిన్ను తనకి వంట నేర్పమని చెప్పాను. ఇక పెద్దమ్మ ఫోన్ చేస్తే వీళ్లు రిసీవ్ చేసుకోరట. పైగా వాళ్ళు వస్తానంటే చాలట, వద్దనేస్తారట. మేము బయటకు వెళ్తున్నాం, ఆఫీస్‌లో ఉన్నాం లాంటి ఏదో కారణం చెప్తున్నారట. అందుకే ఇలా నన్ను రెండువారాల కోమారు వెళ్ళి చూసి రమ్మని బ్రతిమాలతారు. ఇల్లు కట్టి వాళ్ళను గాలికి వదిలేసారు. కానీ వాళ్ళకి మాత్రం, వీళ్ళు ఎలా ఉన్నారూ ఏవిటీ అని ఒకటే బెంగ, తాపత్రయం. వాళ్ళ తాపత్రయం చూసి, నేను ఇలా బలవంతంగా వీళ్ళ కొంపకి రావడం. సరే వెళదాం పద, కార్ ఎక్కు” చెప్పాడు.
బీచ్‌కి వెళదాం అని, వాళ్ళ వెనకాలే కిందకి వచ్చిన మధు, లలితలు అంతా విన్నారు. క్షణం తర్వాత, “అంటే గిరి, మా అమ్మానాన్నల తాపత్రయం అర్థం చేసుకుని, మనం ఛీ అన్నా ఛా అన్నా, ఇలా మన ఇంటికి వచ్చి వెళ్తున్నాడన్నమాట.” నేల చూపులు చూస్తూ చెప్పాడు మధు, లలితతో.