ఔరా…!

67
3

[box type=’note’ fontsize=’16’] ఈ కథ ఎవరినీ ఉద్దేశించినది కాదు. కథలోని సన్నివేశాలు పాత్రలు కేవలం కల్పితం. పాఠకులు కాసేపు నవ్వుకోడం కోసం నేను అల్లిన కథ – తోట సాంబశివరావు. [/box]

[dropcap]క[/dropcap]వితలు వ్రాయడం అంత సులభమా?… అని ఎవరైనా అడిగితే… అవుననే అనాల్సి వస్తుంది…, నా స్నేహితుడు, ప్రఖ్యాత రచయిత డాక్టర్ ప్రశాంత్ ఒరవడి చూస్తుంటే…!

ప్రొద్దున్నే… ఉదయపు నడకపై, న్యూస్ పేపరు చదువుతూ ఆ రోజు వార్తలపై, కాఫీ తాగుతూ కాఫీపై, మొబైల్ చూస్తూ మొబైల్‌పై, టీ.వీ. చూస్తూ టీ.వీ.పై, భోంచేస్తూ పౌష్టికాహారంపై, టాబ్లెట్లు వేసుకుంటూ రోగాలపై, నిద్రపోతూ నిద్రపై… ఇలా దేని పైనైనా అవలీలగా కవిత వ్రాస్తాడు మా ప్రశాంత్.

ఈ మధ్య తను వ్రాస్తున్న కవితల్లో కొన్ని కొత్త పుంతలు గోచరిస్తున్నాయి. ఓ సారి ఓ దగ్గరి బంధువు డెంగ్యూ వ్యాధితో హాస్పిటల్‌లో చేరితే, చూడ్డానికి వెళ్లి, డెంగ్యూ వ్యాధి పై ఓ అద్భుతమైన కవిత వ్రాశాడు. అందులో ఆ వ్యాధి సోకడానికి కారణాలు, ఆ వ్యాధి లక్షణాలు, ఆ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల గురించి, చిన్నా, పెద్దా, అందరికీ అర్థం అయ్యేలా వ్రాసి పుణ్యం కట్టుకున్నాడు.

ఓ సారి నాతో మాట్లాడుతూ “ఆ… ఎలా వుంది నీ కథా రచనా పురోగతి” అని అడిగాడు దీర్ఘం తీస్తూ…

“ఆ! ఏం చెప్పమంటావ్! టైమే దొరకడం లేదు! తృప్తిగా రాయలేకపోతున్నా!” అంటూ నిట్టూర్చాను.

అంతే! అయిదు నిమిషాల్లో నా వాట్సప్‌లో ప్రశాంత్ కవిత ప్రత్యక్షం… సమయం యొక్క విలువ, ఆ సమయాన్ని వృథా చేసుకోకుండా ఎలా సద్వినియెగం చేసుకోవాలి,… అని తెలియజేస్తూ…

చాలా మంచిగా అనిపించింది నాకు…

ఓ సారి తన పుట్టిన రోజుకి, అత్యున్నతమైన మానవజన్మను ప్రసాదించినందుకు భగవుతుడ్ని ప్రార్థిస్తూ ఓ కవిత పంపాడు. ఎన్ థ బాగుందో!…

అది చదవగానే… ఆ రోజు ప్రశాంత్ పుట్టిన రోజు అని తెలుసుకున్న నేను… వెంటనే నా హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాను ప్రశాంత్‌కి…

అలా ఆరోజు ఎంత మంది బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆ కవితను చదివారో, వాళ్లంతా ప్రశాంత్‌కి శుభాకాంక్షలు తెలిపేవుంటారు. అంత మంది పంపిన శుభాకాంక్షలు వృథాగా పోతాయా? పోనే పోవు!… ప్రతిగా, ప్రశాంత్‌కి లెక్కకట్టలేనన్ని శుభాలను చేకూరుస్తాయనడంలో, ఏ మాత్రం సందేహం లేదు.

ఈ మధ్యనే ప్రశాంత్‌కి కంటి శుక్లం ఆపరేషన్ జరిగింది. అప్పుడో వింత జరిగిందట! తనే మరీ చెప్పాడు…

ఆపరేషన్ టేబుల్ పైన పడుకున్న తను, ఆ విషయాన్ని మరిచిపోయి ‘కంటి చూపు’పై కవిత రాయాలనే తలంపుతో మస్తిష్కంలో ఆలోచనలను మర్దనం చేయసాగాడుట! మొత్తానికి, పూర్తి చేసిన కవితను తన మనోఫలకంపై ఆవిష్కరించాడట!

అప్పుడే ఆపరేషన్ పూర్తి చేసిన డాక్టరుగారు “ఆ! ప్రశాంత్ గారు! ఆపరేషన్ అయిపోయింది. మీరు లెగవచ్చు!” అని తట్టి లేపినప్పుడే ఇహలోకంలోకి వచ్చిన ప్రశాంత్, “అరే! అప్పుడే ఆపరేషన్ అయిపోయిందా!” అని ఆశ్చర్యచకితుడయ్యాడట!

ఉండబట్టలేక, ఓ రోజు ప్రశాంత్‌ని “ఆ! ప్రశాంత్! నాకు చాలా ఆశ్చర్యమేస్తుంది! అంతులేకుండా, అవిశ్రాంతంగా, అంత ఈజీగా కవితలను ఎలా వ్రాయగలుగుతున్నావ్? అదెలా సాధ్యం?” అని అడిగాను.

“ఆ ఏముంది! మంచి రచయిత అవాలనుకున్నప్పుడు, వ్రాయలనే తరగని తపన, దృఢసంకల్పం, అకుంఠిత దీక్ష, పక్కా ప్రణాళికతో, ముందుకు సాగాలి. ముఖ్యంగా రచయితకు తన చుట్టూ వున్న సమాజ స్థితిగతులపై, వివిధ వర్గాల ప్రజల జీవన విధానాలపై పూర్తి అవగాహన వుండాలి. మరీ ముఖ్యంగా తెలుగు పదాలపై పట్టు, ఆ పదాల కూర్పుపై మెళకువలు, ఓ మంచి రచయితకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు…” అని ప్రశాంత్ చెప్తుంటే, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత చెప్తుంటే, అర్జునుడిలా వినడం నా వంతయింది.

ఇలా చెప్పుకుంటూపోతే, ఎన్నో ప్రయోగాలు, మరెన్నో విశేషతలు, కొట్టొచ్చినట్లు కనపడతాయ్, ప్రశాంత్ కవితల్లో…

అందుకే, ఏనాడో చెప్పారు మహాకవి, శ్రీశ్రీ గారు… ‘కాదేదీ కవితకనర్హం…’ అని.

***

మరి ఈనాడు నేను కూడా… ఓ విషయం చెప్దామనుకుంటున్నాను… అదే

‘కాదేదీ సమస్యకనర్హం…’

‘అదేంటి?… ఏం చెప్పదలచుకున్నారీయన!’ అని అనుకుంటున్నారు కదూ!

అవును… విషయం ఎంత చిన్నదైనా, సమస్య పెద్దదే అవచ్చు.. నమ్మడం లేదు కదూ!

అయితే పదండి! ఈ ఊర్లోనే ఉంటున్న, నా మరో మిత్రుడు, సదానంద్ ఇంటికి! అక్కడే నేను చెప్పింది నిజమా… కాదా…! అనేది మీకే తెలుస్తుంది… పదండి మరి!

***

ఆ! ఇక్కడ ఆగండి! ఇదిగో ఈ అపార్ట్‌మెంటులోనే ఓ మూడు పడకల ఫ్లాట్‌లో నివసిస్తున్నారు… సదానంద్, శ్రీవల్లి దంపతులు. భార్యా భర్తలిద్దరూ… రాష్ట్ర ప్రభుత్వ వేర్వేరు శాఖలల్లో సుదీర్ఘకాలం పని చేసి,… ఈ మధ్యనే ఉద్యోగ విరమణ చేసి హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు.

ఇద్దరు పిల్లలు బాగా చదువుకుని, చెన్నైలో ఒకరు, బెంగళూరులో ఒకరు, ఉద్యోగాలు చేస్తూ, పెళ్ళిళ్లూ చేసుకుని, పిల్లా పాపలతో సుఖంగా జీవిస్తున్నారు.

సదానంద్ దంపతులకు ఒకరిపై ఒకరికి విపరీతమైన ప్రేమ, అమితమైన అనురాగం… వృధ్ధాప్యంలోకి అడుగిడిన వాళ్లిద్దరూ… ఒకరిని చూడకుండా ఒకరు… కొన్ని గంటలు కూడా ఉండలేరంటే అతిశయోక్తి కాదు. అప్పుడప్పుడు గోముగా కీచులాడుకుంటారు… మూతి ముడచుకుని అలక పాన్పుపై పవ్వళిస్తారు కూడా! ఏది ఏమైనప్పటికీ వాళ్ళు, అన్యోన్యంగా, ఆప్యాయంగా, ఆదర్శంగా, ఉంటూ సంతోషంగా, ప్రశాంతంగా జీవనయాత్రను కొనసాగిస్తున్నారు.

***

 ఇక విషయానికొద్దాం! ఈ ఇంట్లో జరిగే తతంగం, అంతా ఇంతా కాదు, మీరే చూడండి మరి!

 ***

“ఏంటండీ! ఇంకా ఆ పేపర్లోనే మునిగిపోతారా? స్నానం చేసే ఉద్దేశం ఉందా? లేదా? … ఒకింత కోపంగానే అడిగింది శ్రీవల్లి.

చదువుతున్న న్యూస్ పేపర్ ను పక్కకు జరిపి…

“అయినా… నేను ఎప్పుడు స్నానం చేయాలనేది నా ఇష్టం… మధ్యలో నీ కేంటి సమస్య?” అంటూ విసుక్కున్నాడు సుదానంద్…

ఆ! అదండి!! ఇక్కడ అసలు సమస్య!

అదే… సదానంద్ స్నానం… అర్థమయింది కదా! ఇంకా చూడండి..!

***

“మార్నింగ్ వాక్‌కి వెళ్లొచ్చారు. ఒళ్లంతా చెమటలు పట్టాయ్! చక్కగా చన్నీళ్లతో స్నానం చేస్తే, ఎంతో హాయిగా ఉంటుంది కదా!… అందుకే చెప్తుంటా… త్వరగా స్నానం చేయండి… అని!” అంటూ ఓ ఉచిత సలహా ఇచ్చింది శ్రీవల్లి.

“ఆ! తెగ చెప్పొచ్చావులే!… ఏదో… వార్తలు, విశేషాలు తెలుసుకుందామని పేపరు చదువుతుంటే… అసలు… ఏంటి నీ నస!… ఆ! నీ పని నువ్ చూసుకో!… ఆ!” కొంచం కోపంతోనే అని మరల పేపర్‌లో తల దూర్చాడు సదానంద్.

అదే సమయంలో తన ఫ్లాట్ ముందు ఎవరివో మాటలు వినబడుతుంటే చూద్దామని బయటకి వచ్చాడు సదానంద్. పక్క ఫ్లాట్ ఓనర్ కుటుంబరావు, ఆ అపార్ట్‌మెంటు ఓనర్స్ అసోషియేషన్ ప్రెసిడెంటుగారు… ఇద్దరూ మట్లాడుకుంటున్నారు.

“మీ ఇద్దరికీ శుభోదయం… దేని గురించో చర్చించుకుంటున్నట్లున్నారు… ఏంటండీ విషయం!” నవ్వుతూ అడిగాడు సదానంద్.

“ఆ ఏంలేదండీ! ఈ మధ్య నీటి ఎద్దడి కారణంగా నీళ్లట్యాంకులు కొంటున్నాం కదా! ఆ నీళ్లు బాగా మురికిగా వుంటున్నాయి… ఆరోగ్యానికి హాని చేసే విదంగా వుంటున్నాయి… పైగా కుళాయిలు, బకెట్లు కూడా పాడైపోతున్నాయి… కొంచెం శుభ్రమైన నీళ్లు వచ్చేట్లు చూడమని చెప్తున్నాను ప్రెసిడెంటుగారికి!” అన్నాడు కుటుంబరావు.

“నిజమేనండి! మాకు అలాగే వస్తున్నాయ్! బహుశా అందరికీ అలాగే వస్తుంటాయనుకుంటా!” అన్నాడు సదానంద్ వంత పాడుతూ.

“ఏం చేస్తావండీ! అప్పటికీ చెప్తూనే వున్నా ఆ ట్యాంకర్ అతనికి… అయినా అలాగే తెస్తున్నాడు… పైగా ఈ సమ్మర్‌ అవి దొరకడమే కనాకష్టంగా ఉందంటాడు… ఏం చేస్తాం! అయినా, మరలా ఓ సారి చెప్తాన్లెండి!” అని సముదాయించారు ప్రెసిడెంటుగారు…

“అన్నట్లు… మీరుండేది ఇద్దరే కదా! ప్రెసిడెంట్ గారూ!… మన సదానంద్ గారింట్లో కూడా ఇద్దరే కదా!… మరి మీకేమో నెలకి రూ. 600/- వాటర్ ఛార్జీలు. సదానంద్ గారికి రూ.1200/- ఎందు కా తేడా!” కుతూహలంగా అడిగాడు కుటుంబరావు.

“ఆ! ఏముంది… సదానంద్ గారు, ఆ కాలం ఈ కాలం అని లేకుండా ప్రతి రోజూ ప్రొద్దునా, సాయంత్రం… రెండు పూట్లా స్నానం చేయాల్సిందే…! అందుకే వాళ్ల కంత బిల్లు!” అంటూ తేల్చేచారు ప్రెసిడెంటుగారు.

“ఓ! అందుకేనా! సదానంద్ గారు అంత ఎర్‌ర్రగా ఉంటారు!” కొసమెరుపుగా అన్నాడు కుటుంబురావు.

“ఛ… ఛ… నా స్నానం వీళ్లకీ ఓ సమస్యలా వుందే!” అని మనసులో అనుకుంటూ, రుసరుసలాడుతూ ఇంట్లోకి వచ్చాడు సదానంద్…

స్నానానికి వెళ్లబోతుంటే…

“ఏవండీ!”

… అని ఎవరో పిలిచినట్లుంటే గుమ్మం వైపు చూశాడు సదానంద్… ఎవరూ లేరు!

“ఏవండీ! మిమ్మల్నే!”

… తీరా చూస్తే, టి.వి.లో వచ్చేయాడ్‌లో పిలుస్తుంది ఓ అందమైన అమ్మాయి.

“స్నానానికి వెళ్తున్నారా?”

అడిగింది ఆ అమ్మాయి.

అవునన్నట్లు… కిందికి పైకి తలూపాడు సదానంద్…

“మీ చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు, మేము తయారు చేసే, ‘సుగంధ’ సబ్బునే వాడండి! ఎందుకంటే… చర్మసౌందర్యం పెంచడం అంత ఈజీ కాదు! అది మా ‘సుగంధ’ తోనే సాధ్యం!” అని చెప్తుంది ఆ అందాల సుందరి,

 “అబ్బా! ఆఖరికి ఈ టీ.వి. వాళ్లకి కూడా నా స్నానం గురించే యావ! ఛ!…”

… విసుక్కుంటూ బాత్ రూమ్ లోకి గబగబా వెళ్లాడు సదానంద్.

వేసుకున్న డోర్ ఓపెన్ చేసి, తల మాత్రమే బయట పెట్టి…

“ఇదిగో… నిన్నే… ఇక్కడ… బాత్ రూమ్‌లో!… ఓ సారిలా రా!” అంటూ శ్రీవల్లిని పిలిచాడు.

“ఆ! ఏంటండీ! ఏంటి!… అవతల పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయ్! త్వరగా చెప్పండి…” హడావిడి పడుతూ అడిగింది శ్రీవల్లి.

“సబ్బయిపోయింది… కొత్త సబ్బు… ఒకటివ్వు!” అడిగాడు సదానంద్.

కొత్త సబ్బు ఇస్తూ…

“ఆ! ఇదిగోండి! అన్నట్లు పదిహేను రోజులు కూడా కాలేదు, మీరు కొత్త సబ్బు మొదలు పెట్టి… అప్పుడే అవగొట్టారా?… సబ్బుతో ఒళ్లు తోముకుంటున్నారా?!… లేకపోతే బాత్ రూమ్ టైల్స్ తోముతున్నారా?!” అన్నది శ్రీవల్లి… వ్యంగ్యం, వెటకారం కలబోసి.

“చాల్ చాల్లే… వెళ్లి పన్చూసుకో!… ఈపాటికి పాలు పొంగి పోయుంటాయ్… వెళ్లు… వెళ్లు…!” అంటూ కసురుకుని, బాత్ రూమ్ తలుపుని, ధడేల్ మనిపించాడు సదానంద్.

కాసేపటికి బాత్ రూమ్ తలుపు తడుతున్న శబ్దాలు.

“ఎవరది?” అడిగాడు సదానంద్ లోపల్నుంచే.

“నేనేలెండి… పనమ్మాయి పనంతా చేసింది. మీరు త్వరగా వస్తే, బాత్ రూమ్ కడిగి వెళ్తుందట. ఇంకా ఆలస్యమవుద్దంటే వెళ్లిపోతానంటుంది! మరి, ఏంటి మీ పరిస్థితి?” అడిగింది శ్రీవల్లి.

“ఆ! ఇదిగో… రెండు నిమిషాల్లో వచ్చేస్తా!” చెప్పాడు సదానంద్.

పనమ్మాయి, బాత్ రూమ్ నుండి బయటికొస్తున్న సదానంద్ కేసి చూస్తూ….

“సార్! రేపట్నించి, నేనొచ్చే సరికే స్నానం చేయండి సార్!” అంటూ విసురుగా బాత్ రూమ్ లోకి వెళ్లింది, చీపురుకట్టతో.

ఏం మాట్లాడాలో అర్థం కాని సదానంద్ తల తుడుచుకుంటూ, శ్రీవల్లి దగ్గరికెళ్లి,…

“ఏంటిది శ్రీవల్లి… నువ్వే అనుకంటే.. ఆఖరికి పనమ్మాయి కూడా నేనెప్పుడు స్నానం చేయాలో నిర్ణయిస్తుందేంటి? నా ఖర్మ కాకపోతేనూ!” అంటూ బిక్కముఖం వేశాడు… సదానంద్

సదానంద్‌ని కొరకొరా చూసి, మారుమాట్లాడకుండా, తన పని చేసుకుంటుంది శ్రీవల్లి.

బాత్ రూమ్ నుండి బయటికొచ్చిన పనమ్మాయి

“సార్! స్నానం చేసేటప్పుడు కాస్త తక్కువ నీళ్లు వాడండి…! లేకపోతే… అమ్మ నన్నంటుంది! వాటర్ మీటర్ తెగ తిరిగిపోతుందట! అప్పటికి నేనేదో ఎక్కువ నీళ్లు వృథా చేస్తున్నానట! నన్ను కోప్పడుతుంది అమ్మ!”… అని చెప్తూ పరిగెత్తుకుంటూ బయటికెళ్లింది పనమ్మాయి.

“హ! హతవిధీ…! చివరికి పనమ్మాయికి కూడా నా స్నానం ఓ సమస్య అన్నమాట!” విస్తుపోయాడు సదానంద్.

అప్పుడే సదానంద్ మొబైల్ మోగింది… బెంగుళూరు నుండి కూతురు ఫోన్ చేసింది.

 “ఆ! నాన్నగారూ! స్నానం అయిందా?”

‘అబ్బా! మళ్లీ స్నానం!’ అని తనలోనే అనుకుంటూ… “ఆ! ఆ! ఇప్పుడే అయిందమ్మా!” అని బాహాటంగా అన్నాడు సదానంద్.

“ఏంలేదు నాన్నగారూ! శాండల్ ఉడ్ ఆయిల్ గురించి మీరు వినే వుంటారనుకుంటాను! స్నానం చేసేటప్పుడు, బకెట్ నీళ్లల్లో రెండు, మూడు చుక్కలు వేసుకుని స్నానం చేస్తే, ఆ రోజంతా మీ వంటి నుండి సుగంధపు వాసన గుబాళిస్తుంది!”

“ఆ! ఆ!… తెలుసమ్మా! కాని అది చాలా ఖరీదు కదమ్మా!”

“అవున్నాన్నగారు!… ఖరీదే!… కాని… మీరు ఎంతో శ్రద్ధగా చాలా సేపు స్నానం చేస్తారు కదా!… మీకు బాగా ఉపయోగపడుతుందని, నిన్ననే ఆన్‌లైన్‍లో ఆర్డరు చేశాను… ఇవాలో రేపో మీకు అందుతుంది!”

‘అఘోరించావ్ లే!’ అని తనలో అనుకుంటూ… “ఆ! ఎందుకమ్మా అంత ఖర్చు! అది లేకపోతే నేను స్నానం చేయనా ఏంటి” అని బాహాటంగా అన్నాడు సదానంద్…

“పర్వాలేదు నాన్నగారూ! మీ కోసం ఆ మాత్రం చేయలేనా? శాండల్ వుడ్ ఆయిల్ రోజూ వాడండి! సంతోషంగా, తృప్తిగా స్నానం చేయండి! వుంటాన్నాన్నగారూ!…” అంటూ ఫోన్ కట్ చేసింది.

“ఏమిటీ విడ్డూరం! ఎక్కడో బెంగళూర్‌లో వుంటున్న నా కూతురు కూడా నా స్నానం గురించే ఆలోచించడం… హు… వింతగా వుంది!” అనుకుంటూ మొబైల్‌ని టీపాయ్ మీద పెట్టాడు సదానంద్.

పూజ ముగించుకుని, టిఫిన్ చేసి, చేయి కడుక్కుంటుంటే… కాలింగ్ బెల్ మోగింది.

శ్రీవల్లి తలుపు తీసింది… ఫణీంద్ర… సదానంద్ తమ్ముడు… వస్తూనే…

“ఏం వదినా! అన్నయ్య స్నానం అయిందా?…” అడిగాడు.

“స్నానం, పూజ, టిఫిన్ అన్నీ అయినాయ్ లే! రా… కూర్చో!”

“బతికిపోయా!… ఇంకా… స్నానం చేస్తూ ఉంటాడేమో! అనుకున్నా!” …అంటూ, ఊపిరిపీల్చుకున్నాడు ఫణీంద్ర..

చేతులు తుడుచుకుంటూ వస్తూ…

“చాల్లేరా! నీ వెటకారం, నువ్వూనూ! ఆ! ఏంటి? పొద్దు పొద్దునే… ఎంట్రీ యిచ్చావ్?.. (శ్రీవల్లి వైపు చూస్తూ) ఆ! శ్రీవల్లి! వీడికి టిఫిన్ వడ్డించు… వాడు తింటుండగా, మాట్లాడుకుంటాం!…” అంటూ ఆర్డరు జారీ చేశాడు.

“వద్దన్నయ్యా! నేను టిఫిన్ చేసే బయల్దేరాన్లే!…” అంటూ సున్నితంగా తిరస్కరించాడు.

“ఆ! ఇప్పుడు చెప్పు! ఏదైనా పని మీద వచ్చావా?”

“ ఆ! పనేం లేదన్నయ్యా! అన్నట్లు, ఇవాల్టి పేపర్‌లో ఈ న్యూస్ చదివావా?”

“ఏంట్రా? ఆ న్యూస్!”

“మన ఆరోగ్యశాఖా మంత్రిగారు బాత్ రూమ్‌లో స్నానం చేస్తూ… కాలు జారి కింద పడిపోయారట! తలకు దెబ్బ తగిలి, స్పృహ కోల్పోయారట! వెంటనే హాస్పిటల్‌లో చేర్చారట!”

“అయ్యో పాపం! అలా జరిగిందా!!”

“ప్రాణాపాయం ఏమీ లేదట కానీ… కోమాలోకి వెళ్ళారట! ఎప్పుడు స్పృహలోకి వస్తారో చెప్పలేమన్నారట డాక్టర్లు.. అన్నయ్యా! ఆ న్యూస్ చదువుతుంటే భయం వేసిందన్నయ్యా!”

“ఇందులో భయపడాల్సిందేముందిరా? ఇలాంటివి అప్పుడప్పుడు వింటుంటాం కదా!”

“నా భయమంతా నీ గురించే అన్నయ్యా!”

“నా గురించా!!”

“అవునన్నయా! నువ్వేమో… బాత్ రూమ్ లోకి వెళ్లి గంటకు తక్కువ కాకుండా స్నానం చేస్తుంటావ్!”

“అరే! ఆగరా! ఏంట్రా నువ్వనేది? నేను గంట సేపు స్నానం చేస్తానా? ఏం నువ్ చూశావా? ఆ! నువ్వు… చూ…శా…వా…? ప్రతి వాళ్లకీ ఇదొక వేళాకోళం అయింది… ఏదో.. మీ అందరికంటే కొంచెం ఎక్కువ సేపు స్నానం చేస్తాను… నిజమే! అంత మాత్రానికే,… మీ అందరూ… అంతగా నన్నాడిపోసుకోవాలా?”

“… సరే! రేపుదయం రారా! నేను ఎంత సేపు స్నానం చేస్తానో చూద్దూవుగాని… ఆ! వచ్చేటప్పుడు ఒక స్టాప్ వాచ్ కూడా తెచ్చుకోరోయ్!!” కోపంతో ఊగిపోయాడు సదానంద్.

“కోప్పడకన్నాయ్యా! పొరపాటునో, గ్రహపాటునో… బాత్ రూంలో… నువ్ కూడా కాలు జారి పడి… ఆ మినిష్టర్ గారిలా… ఎక్కడ కోమాలోకి వెళ్తావో… అని భయంగా ఉందన్నయ్యా!” దీనంగా చెప్పాడు ఫణీంద్ర.

“పైగా ఇదొటి! వెధవ సెంటిమెంటు నువ్వూనూ!” అన్నాడు సదానంద్ కోపంగానే.

“అంత తేలిగ్గా తీసుకోకన్నాయ్యా! బాత్ రూమ్‌లో జారిపడిపోకుండా వుండేందుకు నాన్ స్కిడ్ టైల్స్… వెంటనే వేయించన్నయ్యా!” …బ్రతిమాలుతూ చెప్పాడు ఫణీంద్ర.

“అలాగేలే! నీకో దండం! నీ సలహాకో దండం!” అంటూ రెండు చేతులు జోడించి దండం పెట్టాడు సదానంద్.

మధ్యలో కల్పించుకొని…

“అయినా… నాకు తెలియకడుగుతా! మీ తమ్ముడు చెప్పిందాంట్లో తప్పేముంది? ఆ!… సరి సరేలే! మీరు మాత్రం బాత్ రూమ్‌లో స్నానం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి… లేకపోతే… ఆ తరువాత… నా పాట్లు…హు!… వద్దులేండి… తలచుకుంటేనే భయమేస్తుంది! అవేవో… నాన్ స్కిడ్ టైల్సట! వెంటనే వాటి సంగతి చూడండి.. మరి!” … అంటూ… జలపాతం జాలువారుతున్న కన్నీళ్లను పైట కొంగుతో తుడుచుకుంది శ్రీవల్లి.

“సరే! వెళ్లొస్తానన్నాయ్యా! ఆఫీసుకి టైం అవుతుంది…! వస్తానొదినా!” అని చెప్పి బయలుదేరాడు ఫణీంద్ర.

“సరే! వెళ్లిరా!” అంటూ లిఫ్టు దాకా వెళ్లి సాగనంపాడు సదానంద్.

కాసేపు టీ.వీ చూద్దామని ఆన్ చేశాడు సదానంద్. ఏవో! ప్రవచనాలు చెప్తున్నారు!

“నిజానికి… చాలా మంది… స్నానం చేయడాన్ని… చాలా తేలికగా తీసుకుంటారు… కాని… ఈ స్నానమనేది… ఎంతో శ్రద్ధగా చేయవలసిన ఓ ముఖ్యమైన కార్యక్రమం….”

“అబ్బా! ఈయన కూడా స్నానం గురించేనా?… హు…” అని విసుక్కుంటూ… ఛానల్ మార్చాడు సదానంద్.

అక్కడ కూడా… ఎవరో ప్రవచనాలు చెప్తున్నారు.

“కుమార స్వామి స్నానమాచరించడానికి… ఏ నది దగ్గరకు వెళ్ళినా… అప్పటికే స్నానం ముగించుకుని ఎదురు పడేవాడు వినాయకుడు…”

“అబ్బబ్బా! ఈయన కూడా స్నానం గురించేనా?… ఛా!…” అనుకుంటూ రిమోట్ బటన్‌ని, కచ్చగా గట్టిగా నొక్కి టి.వి.ని ఆప్ చేశాడు సదానంద్.

 ఏం చేయాలో అర్థం కావడం లేదు సదానంద్‌కి… తల నొప్పెడుతున్నట్లుంది. బెడ్ రూమ్ వైపు భారంగా నడిచి, బెడ్ పైన వాలాడు..

“అదేంటండీ! ఈ టైంలో ఇలా పడుకున్నారేంటి? ఎప్పుడూ పడుకోరే! ఏమైందండీ?!!” ఆదుర్దాగా అడిగింది అప్పుడే అక్కడికి చేరిన శ్రీవల్లి.

“ఆ! ఏం లేదులే! నువ్ వెళ్లి నీ పని చూస్కో! ప్రస్తుతానికి నన్ను ఒంటరిగా వదిలేయ్, నువెళ్లు!…” అంటూ చేయి విదిలించాడు.

“ఏవండీ! నాకు భయమేస్తుందండీ! డాక్టరు దగ్గరి కెళ్దాం పదండి…!” అంటూ సదానంద్ చేయి పట్టుకుని లేపబోయింది.

“ఇందులో నువ్వంతగా భయపడాల్సిందేమీ లేదు శ్రీవల్లీ!…

…ఇవాళ ఉదయం నుంచి… అందరూ… నీతో సహా!… అందరూ.. నాపైన, నా స్నానం పైనా మూకుమ్మడిగా దాడి చేశారు. బాధేస్తుంది శ్రీవల్లీ…

… నా స్నానం ఇంత మంది ఆలోచనలకు కేంద్రబిందువుగా మారుతుందని నేనూహించలేకపోయాను శ్రీవల్లి. ఇంత మందికి సమస్యగా తయారవుతందని…. తలచుకుంటేనే బాదనిపిస్తుంది శ్రీవల్లి…

… హు… స్నానం అంటేనే అసహ్యం వేస్తుంది!… విరక్తి పుడుతోంది కూడా!” అంటూ కుడి ముంజేతిని నుదుటిపై పెట్టుకున్నాడు.

‘శుభపరిణామమే!!…’ అని మనసులోనే అనుకంటూ… “ఓ!… అదా సంగతి!… నేనింకేందో అనుకుని భయపడడ్డాను! అయితే… కాసేపు వేరే ఆలోచనలను ప్రక్కన పెట్టి, హాయిగా నిద్రపొండి! అంతా సర్దుకుంటుంది!…

…లేచింతర్వాత, మరలా ఓ సారి స్నానం చేద్దురుగాని!!”… అని చెప్పి వంటగది వైపు వడివడిగా నడిచింది శ్రీవల్లి,

ఆ మాటలతో, పుండు మీద కారం చల్లినట్లుయింది సదానంద్ పరిస్థితి…

“దేవుడా! వీళ్లు మారరు!!”… అని గొణుక్కుంటూ, నిద్రలోకి జారుకున్నాడు.. సదానంద్.

***

చూసారుగా! స్నానం అనే, ఓ చిన్న విషయం, సదానంద్‌తో సహా… ఎంత మందికి ఓ పెద్ద సమస్యగా మారిందో…!! మరిప్పుడైనా నమ్ముతారా? ‘కాదేదీ సమస్య కనర్హం’ అని! ఇక పదండి! వెళ్దాం!

***

ఇంత వరకు ఓపిగ్గా ఈ కథ చదివిన పాఠకులకు ఓ చిన్న ఆఫర్…

ఈ కథలో ‘స్నానం’ అనే పదాన్ని ఎన్ని సార్లు ఉపయోగించారో, లెక్కేసి, కరెక్టుగా చెప్పిన ఓ ముగ్గురికి, బంపర్ ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాను.

ఇకెందు కాలస్యం! లెక్కట్టండి! చూస్తారెంటండీ! మొదలెట్టండీ!…

ఆల్ ది బెస్ట్!

ఒన్… సెకండ్!

వద్దులెండి! ఎందరికో సమస్యగా తయారైన సదానంద్ స్నానాన్ని, మీకూ, ఓ సమస్యగా చేయడం, నాకు ససేమిరా ఇష్టం లేదు. అందుకే, ప్రైజూ లేదు! బంపర్ లేదు! సారీ అండీ!… ఇంతటితో ఈ విషయాన్ని వదిలేద్దాం!… సరేనా! వుంటానండీ! బై!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here