యుద్ధ రంగస్థలం

0
3

[dropcap]నా[/dropcap]కోసం

కలలు కంటానన్నావు
ఇదేదో బాగుందనుకున్నాను…
కష్టపడతాననీ అన్నావు
బద్ధకం కదా నాకు… సంతోషపడ్డాను…
నిర్ణయాలు నీవే తీసుకుంటాననన్నావు
ఏదో అనుమానం మొలకెత్తింది
అయినా… ఆ మొలక తల కత్తిరించి
మొద్దు నిద్రపోయాను

ఇప్పుడు
ఎక్కడో ఏవో కూలిన శబ్దాలు
ఎక్కడో మరోవో విరిగిన చప్పుళ్ళు
సుప్రభాతాలలో ఆర్తనాదాలు
అశుభరాత్రులంటోన్న కలత నిద్దురలు
సరిహద్దుల్లో వినిపించాల్సిన యుద్ధభేరీ
ఊరి పొలిమేరలు దాటి
వాకిట్లో, ఇంటి ముంగిట్లో మోగుతోంది

నిజంగా నిద్రపోయానో
నిన్ను చూసి నటించానో తెలియదు కానీ
పడుకున్నవాణ్ణి పడుకున్నట్టు
పట్టుకొచ్చి పద్మవ్యూహం మధ్యలో వదిలేసావు
పక్కకెళ్ళిపోయి ఇపుడు పళ్ళికిలిస్తున్నావు

వచ్చిన దారేదో ఏమాత్రం తెలియదు
తప్పించుకుందామనుకున్నా
తలలు తరిగేస్తూ తొలగిపోదామనుకున్నా
బయటకెళ్ళే దారేదో ఊహకందడం లేదు

ఇపుడిపుడే తెలిసిపోతోంది…
కష్టమైనా నష్టమైనా నాదేననీ
బతికి బట్టకట్టాలనుకున్నా
భ్రష్టుపట్టిపోవాలనుకున్నా
నేనే నిర్ణయించుకోవాలనీ
నాకోసం నా యుద్ధాన్ని నేనే చేయాలని
నా మీది ఈ యుద్ధాన్ని నేనే ముగించేయాలనీ

ఇపుడిపుడే తేటతెల్లమవుతోంది
సూత్రధారివి నీవైన ఈ యుద్ధ రంగస్థలంపై
పాత్రధారిని నేనేనని
వెఱ్ఱిబాగుల పాత్రధారిని నేనేనని

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here