‘లాయర్ విశ్వనాథ్’
[dropcap]ఈ [/dropcap]పేరుతో 1978లో నటరత్న ఎన్.టి.ఆర్ నటించిన చిత్రం ఒకటి విడుదలై ప్రజాదరణ పొందింది.
మళ్ళీ 43 సంవత్సరాల తరువాత అదే పేరుతో నిర్మించిన చిత్రమే అయినా ఈ చిత్ర కథ చాలా భిన్నమైనది. నేడు సమాజంలో పసిపిల్లల మీద, వృద్ధుల మీద జరుగుతున్న అత్యాచారాలు హత్యలు చూసి ఆవేదన చెందిన ఒక లాయర్ వాటికి మూల కారణాలు అన్వేషించి, వారికి శిక్ష విధించటం కరెక్టా అని సభ్య సమాజానికి సంధించిన ప్రశ్న ఈ చిత్ర కథ.
శ్రీ రవి కుమార్ మూకాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద, వి బాలనాగేశ్వర రావు రచన – దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అందించారు. సంభాషణలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి.
లాయర్ విశ్వనాథ్ పాత్రలో ‘ఆలి’ నటిస్తే, అతని కూతురు అక్షర పాత్రలో అతని స్వంత కూతురు ‘జువేరియా’ మొదటిసారి నటించింది. లాయర్ భార్య కమల పాత్రలో ‘నియ సంక్రాంతిల్’, న్యాయమూర్తి పాత్రలో ‘కోటేష్ మనవ’, ఇంకా ఇతర ముఖ్య పాత్రల్లో జయలలిత, శుభలేఖ సుధాకర్, సి.వి.ఎల్ నరసింహారావు నటించారు.
చిన్న పిల్లలపై అత్యాచారం చేసి, హత్య చేసిన కేసుల్లో నేరం నిరూపించబడి ఉరి శిక్ష విధించబడిన నేరస్థుల కేసులని పునః పరిశీలించాలని లాయర్ విశ్వనాథ్ వేసిన రీకాల్ పిటిషన్ విచారణకి స్వీకరించటంతో సినిమా మొదలవుతుంది. న్యాయస్థానంలో ఎక్కువ మంది లాయర్లు దాన్ని వ్యతిరేకిస్తారు. ఒక లాయర్ మాత్రం రీకాల్ పిటిషన్ గురించి ఆలోచించాలని విశ్వనాథ్ ఆలోచనని అంచనా వెయ్యాలని సమర్థిస్తాడు.
***
ప్రతి రోజు టీవీలో ప్రసారమయ్యే చిన్నారులు, యువతుల మీద అత్యాచారం వార్తలతో ఆందోళన చెందిన లాయర్ భార్య కమల తీవ్రమైన అభద్రతా భావంతో కలవరపడుతూ ఉంటుంది. తమ ఐదారేళ్ళ కూతురు ఒంటి మీద యధాలాపంగా ఇంటికొచ్చే ఇస్త్రీ అబ్బాయి, స్కూల్ బస్‌లో పిల్లలని ఎక్కించటానికి సహాయపడే అసిస్టెంట్, ట్యూషన్ చెప్పటానికి వచ్చే టీచర్ …ఇలా ఎవరు చెయ్యి వేసినా చిరాకు పడుతూ ఉంటుంది.
అలా భయపడుతూ ఎంతకాలం బ్రతుకుతామని లాయర్ ఊరడిస్తాడు.
ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఒక స్త్రీ, వ్యసనపరుడైన భర్తతో కలిసి జీవించలేనని తన దగ్గరకి విడాకుల కొరకు వచ్చినప్పుడు సామాజిక స్పృహ, కుటుంబ జీవితం పట్ల గౌరవం కలిగిన లాయర్.. భర్తకి ఇంకొక అవకాశం ఇచ్చి చూడమని, ఒంటరిగా ఆడపిల్లలని పెంచటం కష్టమని విడాకులు తీసుకోవటం సరైనది కాదని నచ్చచెబుతాడు.
కోర్టు నించీ వస్తూ దారిలో… అత్యాచారం చేసి చంపబడిన ఒక చిన్న పిల్లని, ఆమె కుటుంబ సభ్యులని చూసి ఆవేదన చెందుతాడు. ఆ నేరం చేసింది మైనర్ కుర్రాళ్ళని, వారి మీద నేరం ఋజువు కాలేదు కాబట్టి వారి భవిష్యత్తు పాడవుతుందని, వారికి బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టులో వాదనలు జరిగినప్పుడు ఆవేశపడతాడు.
***
కూతురు పుట్టిన రోజు పండుగ భార్యతో కలిసి బయట వేడుకగా జరుపుకుని, రాత్రికి ఇంటికి చేరుకుంటున్న లాయర్ స్కూటర్ని….స్కూటర్ మీద ట్రిపుల్స్ వెళుతున్న కుర్రాళ్ళు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ గుద్దేసి ఆగకుండా నిర్లక్ష్యంగా కామెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు.
పాడైన స్కూటర్ రిపేర్ చేసే అవకాశం లేక దగ్గరున్న ఆటో వాడిని ఇంటి దగ్గర దింపమని పిలుస్తుంటే, స్మార్ట్ ఫోన్‌లో అశ్లీల ఫొటోలు చూస్తున్న ఆటో డ్రైవర్ ముందు రానని చెప్పి తరువాత హఠాత్తుగా లాయర్ భార్యని చూసి ఆసక్తితో వస్తానని వారిని దారి మళ్ళించి నిర్జన ప్రదేశానికి తీసుకెళతాడు. అక్కడ ఇంకా కొందరితో కలిసి ఆమెపై అత్యాచారం చేసి, అది వీడియోలో చిత్రించే ప్రయత్నం చేస్తున్న ఆ యువకులని కొట్టి తప్పించుకుని పరుగెత్తుతున్న లాయర్ కుటుంబాన్ని పోలీసులు పెట్రోల్ వాహనం క్షేమంగా ఇంటికి చేరుస్తుంది.
ఆ రోజు రాత్రి పడుకున్న లాయర్ …కలత నిద్రలో స్కూల్ నించి తన కూతురు ఇంటికి రానట్టు, అసలు ఆ అమ్మాయి బస్సే ఎక్కలేదని తెలుసుకుని.. పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ ఇచ్చినట్టు ..పోలీసులు అనుమానంతో ఆ కాంప్లెక్స్‌లో ఉండే ఇస్త్రీ అబ్బాయిని, రోజూ ఆ పాపకి ట్యూషన్ చెప్పే టీచర్‌ని సెల్లో వేసి కొట్టినట్టు, తన కూతురిని అత్యాచారం చేసి చంపి ఊరి చివర పడేసినట్టు కలగని ఉలిక్కి పడి నిద్ర లేస్తాడు.
తనలాగే ఇంకా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు కనిపించట్లేదని పోలీసు స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తున్నట్టు తనకొచ్చిన కలలో భావించి… ముందు జాగ్రత్త చర్యగా తన కూతురిని కాపాడుకోవటానికి ఇంటికి వచ్చే ఇస్త్రీ అబ్బాయిని, ట్యూషన్ టీచర్‌ని రావద్దని చెబుతాడు.
***
ఆ ఊళ్ళోనే హోటల్ నడుపుతున్న మరొక వ్యక్తి తన హోటల్‌కి వచ్చే వారు తిండి మీద దృష్టి పెట్టకుండా సెల్ ఫోన్ చూస్తున్నట్టు, ఆటో నడిపేవాడు ప్రయాణికుల మీద శ్రద్ధ పెట్టకుండా స్మార్ట్ ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూస్తున్నట్టు గమనించి వారికి కొత్త పద్ధతిలో పాఠం చెబుతుంటాడు.
తమ అపార్ట్మెంట్స్‌లో ఎక్కువ భాగం స్మార్ట్ ఫోన్లల్లో మొహాలు దూర్చేసి ఏవో దృశ్యాలు ఆసక్తిగా చూస్తూ… నడుస్తూ కూడా తల పైకెత్తకుండా ఎదుటి వారిని గమనించకుండా ఉంటున్న ఆడ-మగ అన్ని వయసుల వారూ, ఇంట్లో స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని తల్లిదండ్రుల మీద యుద్ధం ప్రకటిస్తున్న యువకులు లాయర్ దృష్టిలో పడతారు.
ఆ కాంప్లెక్స్ లోనే మరొక యువకుడు, తన ఫోన్ చార్జర్ పని చెయ్యట్లేదనే నెపంతో పక్క వారింట్లో ఫోన్ చార్జింగ్ పెట్టుకుంటానని ఆ ఇంట్లో ఆడవారి కదలికలు వీడియో తీసి, తదుపరి అది గమనించిన ఆ ఇంటివారు అతన్ని పోలీసులకి పట్టించారని భార్య ద్వారా తెలుసుకున్న లాయర్ ఆలోచనలో పడతాడు. అన్ని నేరాలకి మూలకారణం స్మార్ట్ ఫోన్లు అనే ముగింపుకి వస్తాడు.
కోర్టుకొచ్చిన లాయర్ పోలీస్ వ్యాన్లోనించి దిగుతున్న మైనర్ కుర్రాళ్ళని చూసి, పోలీసుల ద్వారా వారు అత్యాచారం చేసి అది వీడియోలో చిత్రించిన నేరం చేశారనీ, రోజు రోజుకీ ఇలాంటి కేసులెక్కువవుతున్నాయని తెలుసుకుంటాడు.
***
ఇక అప్పుడు… చిన్నప్పుడే చిదిమివేయబడుతున్న పసిపిల్లల మొహాల్లో నవ్వులని శాశ్వతం చేస్తానని… వారికి ఆరోగ్యకరమైన భవిష్యత్తునిస్తానని.. అత్యాచార నేరాలు జరగకుండా చూస్తానని ఆత్మ సాక్షిగా ప్రమాణం చేసిన లాయర్ ఆ దిశగా తన అడుగులు వేస్తాడు. .
అందులో భాగంగా… అత్యాచారం చేసి తదుపరి హత్య చేసి ఉరి శిక్ష పడిన నేరస్థులందరి రికార్డులు సంపాదించటం మొదలుపెడతాడు. అలా సంపాదించి వారి ఇళ్ళకి వెళ్ళి కుటుంబ సభ్యులని కలుస్తూ ఉంటాడు. కొన్ని చోట్ల వారికి ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉంటాడు. అలా సంపాదించిన సమాచారంతో ఆ నేరస్థుల కేసులపై కోర్టులో రీకాల్ పిటీషన్ వేస్తాడు. ఇవన్నీ గమనించిన ఒక రిపోర్టర్ అతన్ని అనుసరిస్తూ ఉంటుంది.
ఈ పని చేస్తున్నందుకు ఆ లాయర్ ప్రజలనించి, పోలీసుల నించి తీవ్రమైన వ్యతిరేకత నెదుర్కుంటాడు.
అతని ఆలోచన తెలియక, చుట్టుపక్కల వారి విమర్శలు-చీత్కారాలు భరించలేక భార్య ఆందోళన పడుతూ ఉంటుంది.
***
రీకాల్ పిటిషన్ వేసిన లాయర్ ఈ అన్ని కేసుల్లోను విచారణ సమగ్రంగా జరగలేదని, అసలు నేరాన్ని గురించి విచారించకుండానే సదరు నేరస్థులకి శిక్ష పడిందని తన భావన అనీ…. అలా అనుకోవటానికి అవసరమైన బలమైన సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని చెబుతాడు. ఆ కేసులని వాదించి, శిక్ష వేయించిన అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని కూడా పునః సమీక్ష కోసం కోర్టుకి పిలిపించాలని న్యాయమూర్తిని కోరతాడు.
తగినన్ని ఆధారాలు, సాక్ష్యాలు లేకపోయినా… కేసుల్లో గానీ వాదనల్లో గానీ పస లేక కోర్టు సమయం వృథా అయినట్లు కోర్టు భావించినా… అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని న్యాయమూర్తి, లాయర్ విశ్వనాథ్‌ని హెచ్చరిస్తాడు.
కోర్టులో అనేక అపరిష్కృత కేసులుండగా ఇలాంటి రీకాల్ పిటీషన్లని అనుమతించటం కోర్ట్ సమయాన్ని వృథా చెయ్యటమేనని, దీని వెనకాల పైకి కనపడని మరేదో కారణం ఉందనీ… ఆ నేరస్థులకి లాయర్‌కి ఏదో సంబంధం ఉన్నదనీ…. లాయర్ విశ్వనాథ్‌కి డైరెక్ట్ కేసులు తీసుకుని వాదించి తన సత్తా నిరూపించే శక్తి లేక ఇలాంటి వాటిల్లోకి దిగాడని, ఇది అనైతికమని మిగిలిన లాయర్లు కసిగా వాదిస్తారు.
***
ఒక రోజు బస్టాండులో బస్సు కొరకు వేచి ఉన్న ఒక అమ్మాయిని నలుగురు కుర్రాళ్ళు (ఆమెకి పరిచయస్థులే) కలిసి బలవంతంగా కారులో ఒక నిర్మాణంలో ఉన్న భవంతిలోకి తీసుకెళ్ళి అత్యాచార ప్రయత్నం చేస్తూ…. అది వీడియో తీస్తూ రాక్షసానందం పొందుతూ ఉండగా, టీవీ రిపోర్టర్ వారిని వెంబడించి వచ్చి ఆ అమ్మాయిని కాపాడుతుంది. అదే టైంలో లాయర్ కూడా వారిని వెంబడిస్తూ ఆ భవనంలోకి వెళ్ళి, ఆ కుర్రాళ్ళు వదిలేసి పారిపోయిన సెల్ ఫోన్ వీడియోని ఆ రిపోర్టర్‌కి చూపించి ఇవి ఆపటానికే తను ఆ రీకాల్ పిటీషన్ వేశానని ఆ రిపోర్టర్‌కి చెబుతాడు.
తమని అడ్డగించిన లాయర్ మీద ఆ కుర్రాళ్ళు నలుగురు హత్యా ప్రయత్నం చేస్తారు. అలా ఆ లాయర్ హాస్పిటల్ పాలవుతాడు.
ఆ భవనంలో జరిగిన సంఘటనని చిలవలు పలవలు చేసి, అసలు నిజాన్ని అన్వేషించకుండా…. ఆ టీవీ రిపోర్టర్, అత్యాచార సమస్య బారిన పడిన అమ్మాయి ఫొటోలతో మరునాడు వార్తా పత్రికల్లోను, టీవీలోను ప్రముఖ వార్తలు పెద్ద పెద్ద అక్షరాలతో ప్రసారమౌతాయి.
ఆందోళన పడుతున్న కుటుంబ సభ్యులతో…. టీవీ న్యూస్ లో చూపించినట్లు తనకేమీ కాలేదని, ఆ ఇంకో అమ్మాయికి కూడా టీవీలో చూపించిన ఫొటోలో లాగా ఏమీ అన్యాయం జరగలేదని…. తల్లిదండ్రులతో గట్టిగా వాదించి… ఇంట్లో నించి బయటికి వచ్చిన ఆ రిపోర్టర్ దారిలో… షాపులో మద్యం కొనుక్కుని ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వీడియో తీస్తున్న రిపోర్టర్‌తో నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న మైనర్ కుర్రాళ్ళు, తాగిన మత్తులో స్కూటర్ నడుపుతున్న మధ్య వయస్కుల ఫొటోలు తీస్తుంది.
ఆ తరువాత టీవీ స్టూడియోకి వస్తుంది. అక్కడ నిర్మాణంలో ఉన్న భవనంలో జరిగిన సంఘటన గురించి ప్రత్యక్ష ప్రసారమవుతున్న గ్రూప్ డిస్కషన్ చూసి, ఇలాంటి చర్చల వల్ల ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవటం తప్ప ఒరిగేదేమీ లేదని ముందు ఆ చర్చ ఆపమని గట్టిగా అరిచి చెబుతుంది.
తరువాత టీవీ డైరెక్టర్ రూం లోకి వెళ్ళి టి.ఆర్.పి రేటింగ్ పెంచుకోవటానికి, ఎక్కువ సంఖ్యలో వీక్షకులని సాధించటానికి, ఎక్కువ డబ్బులు సంపాదించటానికి ఇలా ఫొటోలు పబ్లిక్ లోపెట్టి ఆడపిల్లలని బజారున పడెయ్యటమే కానీ వారికి జరిగే అన్యాయాన్ని నివారించలేరు అని గట్టిగా చెబుతుంది.
చేతనైతే లాయర్ విశ్వనాథ్ గారి ఆలోచనలని గౌరవించి …కోర్టులో జరిగే వాద ప్రతివాదాలని తన చానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేద్దామని డైరెక్టర్‌ని ఒప్పిస్తుంది.
టీవీ రిపోర్టర్ చేత రక్షించబడిన అమ్మాయి ఇంట్లో వారి విమర్శలు భరించలేక రోడ్డు పక్కన ఉన్న హోటల్లో కూర్చుని ఒక చీటీ రాసి పెట్టి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంటే ఆ హోటల్ యజమాని కాపాడి… ఆడపిల్లలు చావకూడదని, బతికి చూపించాలని ధైర్యం చెబుతాడు.
***
కేసుల వివరాల్లోకి వెళితే…. శిక్ష పడిన ఒక నేరస్థుడు… తప్పు చేశాడని తన కొడుకుని చంపిన తండ్రి, రెండవ నేరస్థుడు స్వంత బాబాయి కూతురిపై అత్యాచారం చేసిన కుర్రాడు, మనవరాలి వయసున్న పనిపిల్లపై అత్యాచారం చేసిన 65 సంల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి మరొక నేరస్థుడు, ఆటో డ్రైవర్‌గా ఉండి తన ఆటో ఎక్కిన ప్రయాణికురాలిని అత్యాచారం చేసిన వ్యక్తి మరొక నేరస్థుడు. వీరెవరికీ అంతకు ముందు నేర చరిత్ర లేదు.
***
రీకాల్ పిటీషన్‌లో విచారించిన ఆటో డ్రైవర్ కేసులో…. అతను చాలా కాలంగా సెల్ ఫోన్లో బూతు బొమ్మలు చూస్తున్నానని, ఆ రోజు అలా చూస్తున్న సమయంలో తను మద్యం సేవించి లేనని… తన ఆటో ఎక్కిన అమ్మాయిని దారి మళ్ళించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళి అత్యాచారం చేశానని.. ఆ అమ్మాయికి తనకి ఎటువంటి పూర్వ పరిచయం లేదనీ… ఆ బూతు బొమ్మలు చూడటం వల్ల కలిగిన తాత్కాలిక ఆవేశమే తన చేత ఆ నేరం చేయించిందని చెబుతాడు.
రెండో కేసులో అడగంగానే స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌ట్యాపు కొనిచ్చి కొడుకు తప్పు చెయ్యటానికి పరోక్షంగా తనే కారణమని తెలుసుకుని… విద్యార్ధుల భవిష్యత్తు తీర్చి దిద్దే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న తను ఆ నేరాన్ని ఆమోదించలేక కొడుకుని చంపేశానని చెబుతాడు.
మూడో కేసులో యౌవనంలోకి అడుగు పెడుతున్న కుర్రవాడు ఫ్రెండ్స్‌తో కలిసి పోర్న్ వీడియో చూసి ఇంటికెళ్ళి… టీవీలో వస్తున్న అత్యాచార వార్తల దృశ్యాలు చూసి ఉద్రేకపడి…. లెక్కల్లో సందేహాలు తీర్చమని ఇంటికొచ్చిన బాబాయి కూతురిపై అత్యాచారం చేస్తాడు.
నాలుగో కేసులో… రాఘవయ్య అనే నేరస్థుడు తన ఉద్యోగంలో ఉన్నప్పుడు అనేక అవార్డులు, రివార్డ్స్ పొందానని గౌరవప్రదమైన జీవితం గడిపానని చెబుతాడు… రిటైర్ అయ్యాక తోచక, కాలక్షేపానికి టీవీ చూడాలన్నా, వార్తాపత్రికలు చదవాలన్నా, ఫోన్‌లో యూట్యూబ్‌లో పుణ్య క్షేత్రాల కార్యక్రమాలు చూడాలన్నా అన్నీ అశ్లీల కార్యక్రమాల వార్తలే.. ఆ దృశ్యాలే… మనసులని అల్లకల్లోల పరుస్తూ నేరాలకి ప్రేరేపిస్తున్నాయి. అలాంటి ఒక బలహీన క్షణంలో తనింట్లో పని చేసే తన మనవరాలి వయసు పిల్లతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు.
వాద ప్రతివాదాలు అయ్యాక ప్రేక్షకుల్లోనించి ఒక వ్యక్తి నిలబడి …వీరు ఖచ్చితంగా నేరస్థులే అని ఆవేశపడతాడు. చేతిలో ఫోన్ ఉండి పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న ప్రతి వ్యక్తి అవకాశం ఉన్నప్పుడల్లా పోర్న్ చానెల్స్ చూస్తారని.. అది నిరూపించటానికి లాయర్ విశ్వనాథ్ అక్కడున్న అందరినీ తమ ఫోన్లు జడ్జికి చూపించమంటే ఏవో సాకులు చెప్పి వారు తప్పించుకుంటారు.
నేరాలు వాటంతట అవి ఊరికే జరగవనీ… కక్ష కార్పణ్యాలతో కాకుండా క్షణికోద్రేకంతో జరిగితే ఆ తప్పు ఎవరిది? సమాజం మొత్తాన్ని లక్ష్యం చేసుకుంటున్న ఈ ఆధునిక పరికరాలు నేరస్థులు.. వాటిని కట్టడి చెయ్యటానికి ప్రయత్నించాలని లాయర్ విశ్వనాథ్ వాదిస్తాడు.
నేరాలు, అత్యాచారాలు కామంతో కాకుండా ప్రేరణతో జరుగుతున్నాయి. తొమ్మిది నెలల పిల్ల ఏ విధంగా మగవారిని రెచ్చకొడుతున్నది? తొంభయ్యేళ్ళ స్త్రీ ఏ అసభ్యతని ప్రదర్శిస్తున్నది?
ఆడవారికి ఎక్కడా రక్షణ లేదు. వారు అభద్రతా భావంతో, భయంతో బతుకుతున్నారు. ఏ తప్పు జరిగినా దాని నేపథ్యాన్ని ఆలోచించకుండా పైకి కనిపించే కారణాలతో తీర్పు ఇవ్వకూడదు. మూలాలకి వెళ్ళి విచారించి వాటిని పరిష్కరించాలని సూచిస్తూ మనని ఆలోచింపజేశాడు లాయర్ విశ్వనాథ్.
నేడు మనమందరం ఎదుర్కుంటున్న సమస్య ఈ పోర్న్ వీడియోలు. ఆఖరికి చట్ట సభల్లో కూడా వీటిని వీక్షిస్తున్న గౌరవనీయ ప్రజా ప్రతినిధులెందరో చెప్పక్కరలేదనుకుంటా!
కామాంధుడైన ప్రధానోపాధ్యాయుడు ….కూతురి పైనే అత్యాచారం చేసి తన్నులు తిన్న తండ్రి… వావి వరుసలు మరిచి సోదరిపై ఆరు నెలలుగా లైంగిక దాడి చేస్తున్న ప్రబుద్ధుడు…. ఇవేగా అన్ని ప్రింట్, ఎలెక్ట్రానిక్ ప్రసార మాధ్యమాల్లో అనుక్షణం మనం చూస్తున్న వార్తలు! ఈ నేరాలకి కారకులెవరు?
చట్టాలు నేరాలని ఆపలేవు. మనిషిలో పరివర్తనని తీసుకురాలేవు. మంచి సంఘటన కంటే చెడు దృశ్యానికి ప్రభావం ఎక్కువ అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు.. ఇప్పుడు మనస్తత్వవేత్తలు అదే చెబుతున్నారు.
ఆడది అంటే అమ్మ, ఆ అమ్మని చిదిమేస్తున్నాం! అక్షరం చెరిపేస్తే భాష పోతుంది ..అమ్మనే చెరిపేస్తే మనకి మిగిలేది శూన్యం? అన్న లాయర్ మాటల్లో ఆవేదన అర్థం చేసుకోవాలి.
అమ్మ వద్దనుకుంటే ఒక్క మగవాడు కూడా జన్మించడు.
మగవాళ్ళు ఒక స్నేహితుడిగా, సోదరుడిలాగా ఉండాలే కానీ రేపిస్టులాగా మిగిలిపోకూడదు. ఈ విషయం ప్రతి మగవాడు గుర్తు పెట్టుకోవాలి అన్న లాయర్ మాటలతో ప్రతివాది అయిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ భానుమతి ఏకీభవిస్తుంది.
లాయర్ విశ్వనాథ్ వాదన వెనుక ఉన్న ఆవేదనని అర్థం చేసుకున్నానని ఒప్పుకుంటుంది.
***
పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం పూనుకుని అశ్లీల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రదర్శించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తమ ఫోన్లల్లో ఇలాంటి దృశ్యాలు ఫార్వార్డ్ చేసిన వారిపై కేసులుపెట్టి పోలీసులు వారిని కఠినంగా శిక్షించాలని న్యాయమూర్తి తీర్పు ఇచ్చి, ఆడవారి మీద అసభ్య వ్యాఖ్యలు చేసిన తోటి లాయర్‌ని బార్ కౌన్సిల్ నించి సస్పెండ్ చేస్తున్నట్టు తీసుకున్న నిర్ణయం ప్రకటించటంతో చిత్రం ముగించి…. మనందరికి బాధ్యతగా ప్రవర్తించమని ఒక హెచ్చరిక చేశారు ఈ చిత్ర నిర్మాతలు.
ఒక హత్య జరిగితే అక్కడ లక్ష్యం ఆ ఒక్క వ్యక్తి మాత్రమే! కానీ సెల్ ఫోన్లో చిత్రించే ఈ అశ్లీల చిత్రాల లక్ష్యం మొత్తం సమాజం!
వావి వరుసలు మర్చిపోయి, వయసుతో సంబంధం లేకుండా తొమ్మిది నెలల పసి గుడ్డు నించి తొంభయ్యేళ్ళ వృద్ధురాలివరకు ఆడ వారి మీద జరుగుతున్న అత్యాచారాలు హత్యలకి సభ్య సమాజం తలదించుకోవాలి.
కుటుంబ సభ్యుల నించి భద్రత లేదు. తోటి ఉద్యోగుల నించి, స్నేహితుల నించి భద్రత లేదు. సమాజం నించి భద్రత లేదు. ఆడది ఎలా బతకాలి?
కమర్షియల్ మసాలా లేకుండా, ఆద్యంతం సీరియస్‌గా ఒక సీనియర్ ఆర్టిస్ట్ ప్రధాన పాత్రధారిగా సభ్య సమాజానికి సంధించిన బాణం ఈ చిత్రం.