[dropcap]క[/dropcap]విగా, కథకుడిగా, అనువాద కథకుడిగా, సినీ విమర్శకుడిగా, హిందీ సినిమా పాటలను తెలుగులో వివరించి చెప్పే వ్యాఖ్యాతగా తెలుగు పాఠకులకు పరేశ్ దోశీ చిరపరిచితుడు. ఆయన రాసి, ఆంగ్లంలోకి అనువదించిన కవితల సంపుటి ‘వానతనం’. దీనిని ఆంగ్లంలో ‘Rainhood’ గా వారే అనువదించారు. కవి స్వయంగా వానతనాన్ని rainhood గా అనువదించారు కాబట్టి ఆమోదించక తప్పదు కానీ ఆంగ్లంలో ‘rainhood’ అన్న పదమే లేదు. ఉన్న పదం rain hood. అంటే రెయిన్ కోటు పై భాగాన ఉండి, తలపై కప్పుకునేందుకు వీలుగా ఉండే దాన్ని rain hood అంటారు. కవి motherhood, manhood లా rainhood అన్న పదాన్ని వాడేరు. కానీ ఇది Snake hood లాంటిది rain hood. కానీ womanhood, brotherhood అన్నప్పుడు rainhood అనటంలో దోషం లేదు. ఎవరో సృష్టించకపోతే, కొత్త పదాలు ఎలా పుడతాయి?
‘వానతనం’ కవితలో సంపుటిలో ప్రధానంగా కొట్టొచ్చినట్టు కనబడేది భావుకత. మనకు అలవాటయిన వాదాలు, నినాదాలు, అన్యాయపు కేకలు, విద్వేషపు వెతలు కాక… ఒక ఆర్ద్రత, సృజనాత్మకత, భావుకత, అందమైన ఊహలు, ఆలోచనలతో కూడుకుని చాలా కాలానికి తెలుగులో ‘కవిత్వం’గా భావించదగ్గది చదివిన భావన కలుగుతుంది. ముకుంద రామారావు, ప్రసాదమూర్తిల సరసన పరేశ్ దోశీని నిలపవచ్చు. మచ్చుకు కొన్ని అందమైన ఊహలు, భావాలు:
~
నక్షత్ర ఖచిత ఆకాశాన్ని కప్పుకున్న పసివాడు
తెల్లారి లేచి చూస్తే ఆ సరికే ఎవరో ఆకాశానికి వెల్లవేసి ఉంటారు. (గానలత)
~
ఎవరికైనా ఏం కావాలి?
చలిలో వెచ్చని కౌగిలింత
చీకటిలో చూపుడు వేలు (చీకటిలో చూపుడు వేలు)
~
క్రితం జన్మ నుంచీ గమనిస్తున్నా
ప్రతి మేఘ శకలమూ కరిగి, చల్లగా కురిసేది
అమ్మతనపు పురా జ్ఞాపకం మల్లే (వానతనం)
~
జీవితంలో సత్యం చూస్తాను
సత్యంలో అందం చూస్తాను
మాట్లాడినా అందగా మాట్లాడుతానే అభియోగం
ఏం చెయ్యను?
ఏం చెప్పను?
అందమైన సత్యం జీవితమా?
జీవితంలోని అందం సత్యమా? (స్వప్న కాంతి)
~
కవిత్వమింకా అయిపోలేదు
జీవితమింకా మిగిలే ఉందిగా?
~
ఇలాంటి అందమైన భావాల కవితలు ఈ సంపుటిలో అడుగడుగునా దర్శనమిస్తాయి. అక్కడక్కడా గజళ్లు, నజ్మ్‌లను పోలిన కవితలూ తళుక్కుమని మెరిసి మురిపిస్తాయి.
ఈ పుస్తకం రెండవ భాగంలో ‘పక్క గడప నుంచి’ అన్న విభాగంలో తెలుగేతర భాషల కవితలను, గీతాలను అనువదించి అందించారు పరేశ్ దోశీ.
వీటిలో నర్సి మెహతాగా పేరు పొందిన నరసింహ మెహతా గీతాలు, ఇందులాల్ గాంధీ, గోపాల్ హొన్నల్గెరె, చంద్రశేఖర్ కంబార్ వంటి తెలుగేతర కవుల కవితల అనువాదాలూ ఉన్నాయి.
పరేశ్ దోశీ అందించిన ఈ ‘వానతనం’ కవితల సంపుటి నిజంగానే వానలోని చల్లదనంతో పాటు వానలోని అద్భుతాన్ని, మార్మికతను ఇముడ్చుకున్న కవితల సంపుటి. ఎంతో కాలానికి చక్కని కవితలు చదివిన అనుభూతిని మిగులుస్తుందీ పుస్తకం. మండుటెండల ఎడారిలో చల్లని వాన చినుకుల కవితలివి. కవిత్వ పిపాసులంతా ఆహ్వానించి, చదివి, ఆనందించాలి, కవిని అభినందించాలి.
***
వానతనం (కవిత్వం)
రచన: పరేశ్ దోశీ
పేజీలు: 134
వెల: ₹ 140/-
ప్రతులకు అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు
అమెజాన్ నుంచి
https://www.amazon.in/Vaanatanam-Rainhood-Poetry-Paresh-Doshi/dp/8194431832