సీత-8

0
3

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ రచయిత్రి స్పందన అయాచితం – సంచిక పాఠకుల కోసం రచించిన ‘సీత‘ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]”అ[/dropcap]వునులే! పాపం మంచిదే కాని ఇదిగో ఇలాంటివే అర్థం కాని విషయాలు. మన రచన కూడా అంతే! ఏదో అరవింద్ ఇష్టపడి, పెళ్ళి చేసుకున్నాడని మేం ఏం అనటం లేదు. కాని, అసలు ఇంటి పట్టున ఉంటే కద! ఎప్పుడూ ఉద్యోగం, ఉద్యోగం.”

“తనకి ఉద్యోగం చేయడం ఇష్టం అని చెప్పింది. అందులో తప్పేముంది? అత్తయ్య!” నేను అడ్డుపడ్డాను.

“తప్పేం లేదు. కాని అవసరం లేదు కదా! మాకు ఇంత ఆస్తి ఉంది. అరవింద్ బాగానే సంపాదిస్తున్నాడు.”

“సంపాదన కోసం అని ఎందుకనుకుంటున్నారు? ఇష్టమైన పనిచేయడంలో ఉన్న ఆనందం ఇంకెందులో ఉంది? ఈ రోజుల్లో అమ్మాయిు అన్ని రంగాల్లో ఉంటున్నారు?” నేను నచ్చచెప్పాను.

“అవును అరవింద్ ఇలానే చెబుతాడు. చూడు రచనని ఎంత అర్థం చేసుకుంటాడో. మాకు నచ్చకపోయినా సరే, రచనని ఏమీ అనడు. అయినా సరే…. రెండు రోజునుండి ఆ మహా తల్లి వాడితో గొడవ పడుతోంది. అవును, దేని గురించి గొడవ?” పిన్ని అత్తయ్యను అడిగింది.

“ఆఁ మనకి చెబుతారా? ఏంటి? రచన అరవింద్ గొడపపడం అందరిలాగే నేను గమనించాను.”

మాయ విషయం విని, కొంచెం విచిత్రంగా అనిపించినా… అరవింద్‌ని చూసి గర్వం వేసింది. ఇంత మంచివాళ్ళకి ఇన్ని రోజునుండి దూరం అయినందుకు కొంచెం బాధ కూడా వేసింది.

***

ఉన్నటుండి వారం తరువాత కళ్యాణి తండ్రి దగ్గర నుండి ఫోన్ వచ్చింది.

ఎందుకో అని ఆలోచించే లోపలే అయన తిట్టడం మొదలు పెట్టాడు.

“ఏంటి? మా అమ్మాయిని పబ్‌కి తీసుకు వెళ్ళావంట? మాకు ఈ పెళ్లి సంబంధం అస్సలు ఇష్టం లేదు. ఏదో మాట్లాడతావని అడుగుతే పోనీలే అని అమ్మాయిని పంపించాను. అసలు పబ్‌లో వదిలేసి వస్తావనుకుంటే మళ్లీ నీ మొహం చూసేవాడిని కాదు.”

ఇది విని ఇక నాకు కోపం ఆగలేదు.

“హలో సర్, కొంచం అగండి. ఏం మాట్లాడుతున్నారు? పబ్‌కి మీ అమ్మాయి పిలుస్తే నేను వెళ్ళాను. లండన్ నుంచి వచ్చిన వాడిని నాకు పబ్ ఎక్కడ ఉంటుందో తెలుసా? అసలు మీకు అమ్మాయి ఎలాంటిదో తెలుసా? తాగుతుంది, స్మోక్ చేస్తుంది. మీ ముందు ఉన్నట్టు ఉండదు. అంత చీప్ క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని నేనే పెళ్లి చేసుకోను. అసలు మీకు బుద్ధిలేదు. మీ అమ్మయి గురించి మీరు ముందు తెలుసుకోండి.” ఫట్‌మని ఫోన్ పెట్టేసాను.

ఈ దెబ్బతో నాకు అమ్మాయిలు అంటే విరక్తి పుట్టింది.

అవసరమైతే ఎదుటివాడి మీద అబద్దాలు పుట్టిస్తారా? ఇంత ఘోరంగా ఉంటారా?

అది కావాలా, ఇది కావాలా అని మర్యాదగా అడిగితే, అబ్బాయి స్పేస్ ఇవ్వటంలేదు అన్నారు. అడగకపోతే కనీసం మ్యానర్స్ లేవు అన్నారు. కారు డోర్ ఓపెన్ చేయలేదని క్యారెక్టర్ లేదన్నారు. కారు డోర్‌కి, మనిషి కారెక్టర్‌కి లింక్ ఉంటుంది అని అప్పుడే తెలిసింది .ఇది ఇక్కడ జ్ఞానోదయమైంది.

ఛీ ఛీ ఇక్కడేంటి ఇలా ఉన్నారు?

అయితే బ్రెయిన్ ఉండదు, ఉంటే అతి తెలివి.

వీలైతే కింగ్‌లా ఉండమంటారు. లేకపోతే కుక్కలాగా పడుండమంటారు. కానీ నార్మల్ మనిషిని మాత్రం ఇష్టపడరు.

తల తోక లేని లాజిక్స్, ముందు వెనుక ఆలోచించకుండా నిర్ణయాలు, అసలు ఏం కావాలో? ఏం వద్దో? కూడా తెలుసుకోలేక తికమక పడిపోయి, ఎదుటివాళ్లను తికమక పెట్టేసి, టార్చర్ చేస్తున్నారు.

“బాబోయ్ నాకు ఇక్కడ పెళ్ళి వద్దు, అమ్మాయిు వద్దు. నేను నా లండన్‍లో ఏ మేరినో, గోరినో చూసుకుంటాను. నన్ను వదిలేయి అమ్మా.” గుక్క తిప్పుకోకుండా, ఊపిరి తీసుకోకుండా గడగడ మా అమ్మకు చెప్పేశాను.

“అది కాదురా! ఏవో రెండు మూడు చేదు అనుభవాలు వచ్చాయని అలా అంటే ఎలారా? ఇదొక్కటి చూడు మీ బాబాయ్ మంచి స్నేహితులు రా. పైగా నీ గురించి విని, పెళ్ళికి ఒప్పేసుకున్నారు. అబ్బాయి చూసాకనే ఏ సంగతి చెబుతాం అని నేను ఆపించాను. లేకపోతే ఈ పాటికి నీకు పెళ్ళి అయిపోయి ఉండేది. ఇది ఒక్కటి చూసి రారా! ప్లీజ్ రా!” అంది.

‘‘అమ్మ నా వల్ల కాదు!’’ తేల్చి చెప్పేశాను.

“ఒరేయ్ నా మాట వినరా, మీ బాబాయ్ దగ్గరుండి చూసిన సంబంధం.”

“పోయినసారి కూడా అలానే చెప్పారు. బాబాయ్ తెచ్చిన సంబంధం అని.”

“బాబాయ్‌తో వెళ్లి ఒక్కసారి చూసి రా, నచ్చకపోతే అప్పుడు ఆలోచిద్దాం ప్లీజ్”.

“అమ్మా! నేను ఫోన్ పెట్టేస్తున్నా!

“అమ్మా నీకు ఎలా చెప్పాలో అర్థం కావటంలేదు.”

అమ్మ నేను చెప్పేది వినడం లేదు.

“మన తెలుగు అమ్మాయి కాంప్రమైజ్ వేరు రా, మాటల్లో చెప్పేది కాదు. అది మనకు స్వయంగా తెలిసి రావాలి అంతే, పైకి వాళ్ళు ఎలా ఉన్నా, గుండె చాలా లోతుగా ఉంటుంది. ప్రేమించిన వారికోసం వారు ఏమైనా చేస్తారు రా.’’

“అమ్మా నాకింకేమి వద్దు. అయిన ఘోరాలు చాలు. నేను లండన్‌కి వచ్చేస్తున్నాను. అంతే!”

***

లండన్‌కి తిరిగి వెళ్ళిపోదామని కచ్చితంగా నిర్ణయించాను….

‘ఒరేయ్! మేడమీద ఉన్నా. ఒక్కసారి పైకి రా.’ అరవింద్ మెసేజ్ పెట్టాడు.

సాయంత్రం పూట, టీ తాగుతూ, మేడ మీద నుంచి హైదరాబాద్ చూస్తే, అబ్బా! ప్రపంచంలో ఏ సీనూ పనికిరాదు అనిపిస్తుంది.

రోజూ నేను చేసే పనుల్లో అదీ ఒకటి. అప్పుడప్పుడు అరవింద్ అక్కడ వచ్చి, నాతో ఏవో కబుర్లు చెబుతాడు.

నేను వెంటనే పైకి వెళ్ళాను.ఈ రోజు మాత్రం అక్కడ అరవింద్‌తో పాటు మాయ కూడా ఉంది.

నేను వెళ్ళి వెంటనే ఒక నిమిషం టైం వేస్ట్ చేయకుండా పురాణం మొదలు పెట్టాడు.

“చూడరా! అన్నీ మాట్లాడేశాక అస్సలు బాగోదు.”

బాబోయ్, ఇరుక్కుపోయాను అనుకున్నా.

ఇబ్బందిగా మొఖం పెట్టాను.

వాడు అవేమీ పట్టించుకోవటంలేదు. లొడలొడ వాగేస్తున్నాడు. అమ్మాయి అందంగురించి, వాళ్ళ హోదా గురించి, చేసుకుంటే నాకు వచ్చే ఉపయోగాల గురించి, మన కుటుంబానికి జరిగే మంచి గురించి, లాభం గురించి, ఇలా రకరకాలుగా వివరిస్తున్నాడు.

నాకు నచ్చినా, నచ్చకపోయినా, ఇబ్బందిపడినా, ఏడ్చినా, ఏం చేసినా పట్టించుకోకుండా చెప్పుకు పోతున్నాడు.

మాయ మాత్రం చాలా కోపంగా ఉంది

నా బాధపడలేక చివరికి ఆ దేవుడు కరుణించాడు. ఆఫీస్ నుండి ఫోన్ అని, అర్జంట్ అని అరవింద్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

‘హమ్మయ్య’ అని ఊపిరి తీసుకున్నా.

“ఏంటి నువ్వు చేసిన పని? కళ్యాణి పేరెంట్స్‌కి తన సంగతి చెప్పావంట?”

“అవును” నేను తాపీగా అన్నాను.

“ఇప్పుడు ఆ అమ్మయికి పెళ్ళి చేస్తున్నారు.”

“తెలుసు, అత్త చెప్పింది. నా పెళ్ళి సంబంధాలు చూసే అతనే చెప్పాడంట”

“ఏంటి అంత కూల్‌గా చెబుతున్నావ్. ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు. కానీ నువ్వు అన్నీ సంగతులు చెప్పక , కోపంతో తన పేరెంట్స్ బలవంతంగా ఈ పెళ్ళి చేస్తున్నారు.” మాయ కోపంతో అరుస్తుంది

“తెలుసు, మంచి పనైంది. లేకపోతే నాతో పెట్టుకుంటుందా? నా మీదే అబద్దాలు చెబుతుందా? ‘అసలు తెలుగు అమ్మాయిు తలదించుకుంటే ఎత్తరు.’ అని మా అమ్మ చెప్పింది. ఆడపెళ్ళివారు ఏ సంబంధాన్ని వద్దనే ఛాన్స్ లేదు. పైగా లండన్నుంచి అంటే నెత్తిమీద పెట్టుకుంటారు అంది”

“ఆహాహా! చాయిస్ నీదే. నచ్చినది, నచ్చనిది నిర్ణయించేది నువ్వే.”

“మా అమ్మ చెబితే విని, ఇలా ఎగురుకుంటూ వచ్చేసాను. పూర్తిగా గడ్డిపెట్టారు.”

“పెళ్లి ఇష్టం లేకపోతే లేదు అని చెప్పాలి. ఇంకొకరి జీవితంతో ఆడుకునే హక్కు నీకు లేదు.”

“ఆడుకోవడమా… అసలు కుదిరితే మర్డర్ చేసే వాడిని”

“నీకు కొంచం కూడా మనసు లేదు” మాయ తల తిప్పుకుంది.

 “పోరా! మీలాంటి అబ్బాయిల్ని అసలు కేర్ చేయం.” మాయ నన్ను తీసిపారేసింది.

అసలే ఇగోతో ఉన్న నాకు ఆమాట ఎందుకో నా చెంప ఛెళ్లు మనిపిచింది.

కానీ ఫ్రెండ్ కద! సరే! పట్టించుకోలేదు.

“ఏమోలే! నాకు అమ్మాయిలే వద్దు. హ్యాపీగా లండన్ వెళ్ళిపోతాను. నీక్కూడా ఒక ఎడ్వైజ్. నువ్వు నాతో లండన్‌కి వచ్చేయి. ఇదిగో ఈ చీరలు, సల్వార్ పక్కన పడేసి, స్వేచ్ఛగా ఏ డ్రస్ అయిన వేసుకోవచ్చు. ఎవ్వరు పట్టించుకోరు. ఇలా సొసైటీ కోసం, పేరెంట్స్ కోసం అంటూ ఎవ్వరూ మనసు చంపుకొని బతకాల్సిన అవసరం లేదు.”

“ఏంటి?” మాయ మొఖం చిట్లించింది.

“హలో! సర్! బ్రేకింగ్ న్యూస్!! నాకు ఇవి ఇష్టంతో, మనస్ఫూర్తిగా వేసుకుంటున్నాను. ఎవరి కోసమోకానీ, ఏమనుకుంటారో అని కానీ, నువ్వు చెప్పినట్టు మనసు చంపుకొని కానీ అస్సలు కాదు.”

‘‘ఓ అయితే నువ్వు ఫెమినిస్ట్‌వి కాదన్నమాట. వైన్ తాగడం, పిచ్చిపిచ్చిగా గెంతులు వేయడం ఇష్టం అనుకున్నా! మంచిది” అన్నాను.

మాయ నన్ను ఒక్క క్షణం విచిత్రంగా చూసింది.

తల గట్టిగా విదిలించి, “అవన్నీ చేయడం ఫెమినిజం ఎలా అవుతుంది? ఫెమినిజం మన స్వేచ్ఛకి, స్వాభిమానానికి సంబంధించింది. నువ్వు చెప్పేది హద్దు దాటటం. అది మగవారికి కూడా మంచిది కాదు. అర్థం అయ్యిందా?

నేను ఫెమినిస్ట్ ని… ఖచ్చితంగా ఫెమినిస్ట్‌నే…” అంది ఒత్తి పలుకుతూ.

“మరి?” నేను భుజాలు ఎగురేశాను.

“హు…. సిద్ధాంతాలు వేరు .. అభిప్రాయాలు వేరు. అలవాట్లు వేరు… ఇష్టాలు వేరు.… రెండిటిని కలుపుతావేంటి? చూడు బాబు! నువ్వు తెలియక అంటున్నావో లేక తెలిసినా తెలియనట్టు అంటున్నావో నాకు తెలియదు. అయినా చెబుతాను విను.” అంది.

“చీర కట్టుకోవటం, ట్రెడిషనల్‌గా ఉండడం నాకు ఇష్టం. బలవంతం కాదు. అలాగే ఇండిపెండెంట్‌గా ఉండటం, ఫెమినిజం నా సిద్ధాంతం. అది ఆలోచన, వ్యక్తిత్వానికి సంబంధించింది, పైకి చూపించేది కాదు.”

మాయ చెప్పినట్టు నాకు నిజంగా అర్థం కాలేదో లేక అర్థం అయినా అర్థంకానట్టు చేస్తున్నానో లేక అసలు అర్థం చేసుకోదలచుకోలేదు తెలియదు.

కాని నాలో ఏదో కసి …. విపరీతమైన కసి…..

మాయ ముందు ఓడిపోతున్నాననో…. లేక అమ్మాయిు ముందు ఒకసారి ఓడిపోయాననో … కారణం తెలీదు.

కానీ ఏదో పిచ్చి కసి. చేతికందింది నలిపేయాని … కాలికింద కొచ్చిందాన్ని తొక్కేయాలని… కనపడ్డవారిని కత్తితో పొడిచేయాలని…. ఏదో పూనకం వచ్చినట్టు.

అదే సమయానికి మాయ దొరికింది. అంతే! తనని చిత్రవధ చేయాలనిపించింది.

“ఓ! అలా చెప్పు…” ఎగతాళిగా నవ్వుతూ అన్నా.

“దీన్ని ఇంగ్లీషులో హిపోక్రసి అంటారు.”

“అంటే?” మాయ కోపంగా చూసింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here