[dropcap]ఎ[/dropcap]ప్పుడైనా యుద్ధం ఒక ఉన్మాదం
అది దేశాల అహంకార విస్ఫోటనం
నియంతల స్వార్థపూరిత ప్రకోపం
ముష్కర పాలకుల వికటాట్టహాసం
చెలరేగే రాక్షసగణాల విన్యాసం
మనుషులను మట్టుపెట్టే మృగత్వం
క్రూరత్వపు పడగల విష ప్రవాహం
ప్రాణాల్నిగాల్లో ఎగరేసే అమానుషత్వం
ప్రశాంతి ఒప్పందాలు ఎగిరిపోయే పత్రాలే
దండయాత్రల్తో నమ్మకాలు శకలాలే
సౌభ్రాత్రవాదాలు ఉత్తుత్తి భావనలే
అవి పునాదుల్తో కుప్పకూలే భవనాలే
ప్రపంచ శాంతి సంస్థల శుష్కహాసాలు
భద్రతనివ్వలేని మండలి మౌనముద్రలు
లాభనష్టాలెంచి స్పందించే తోటిరాజ్యాలు
ఆయుధాలమ్ముకునే కొన్నికిరాతకాలు
నిరంకుశుల పోరు బాట ఆధిపత్యం
టెక్నాలజీ చెక్కిన విధ్వంసకర విన్యాసం
భూఆక్రమణలో మంట కలిసిన మానవత్వం
తన నేలమట్టిలో తానే కలిసే మూర్ఖత్వం
మానవ అజ్ఞానం భస్మాసుర హస్తం
ఇది చరిత్ర చక్రంపై లిఖించబడుతుంది
యుద్ధమూల్యం మళ్ళీ మళ్ళీ చెల్లిస్తూ
ఆ పాఠాలతో కొత్తతరం సాగిపోతుంది