ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి -13

0
4

[box type=’note’ fontsize=’16’] శ్రీమతి ప్రమీలా రాణి ఈరంకి రచించిన ‘ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]స్నే[/dropcap]హ స్కూలుకు బయలుదేరింది. ఈ మధ్య దుర్గతో కలిసి వెళ్ళడం లేదు. కొంతమంది పిల్లలకు ఒక అభిప్రాయం వుంటుంది. ఎంత తొందరగా స్కూలుకి వెళ్ళి కూర్చుంటే అంతమంచి అభిప్రాయం టీచర్లకు తమపై వుంటుందని. స్నేహకు ఇటువంటి పనులు నచ్చవు. ఆమె తను వుండే విధంగా వుంటుంది అంతే. రోడ్డుమీద వెళుతున్న వాళ్ళు కొందరు తనను ప్రత్యేకంగా చూస్తున్నట్టు అనిపించింది స్నేహకు. ఈ డ్రెస్‌కు మేచింగ్ ఆ గులాబీ కూడా వుంటే ఓహ్…. బ్రహ్మాండంగా వుండేది.

ఆమె మనసు ఊహాలోకంలో విహరించసాగింది. తను ఒక పెద్ద భవంతిలో నివసిస్తుంది. ఆ భవంతికి ముందువైపు గార్డెన్. అందులో అన్నిరకాల గులాబీలు, చేమంతులు, మందారాలు ఇలా అన్నిరకాల పువ్వుల మొక్కలు వుంటాయి. తను ఏ చీర కట్టుకుంటే అదే రంగు నగలు, అవే రంగు చెప్పులు. ముఖ్యంగా తలలో పువ్వులు తనని డ్రెస్ సెన్స్‌ని కలర్ కాంబినేషన్ని అందరూ మెచ్చుకుంటారు.

అసలు తన భవిష్యత్తులో ప్రేమకు, అభిమానానికి గుర్తింపుకి లోటు వుండదు. ఒక వ్యక్తి తనను తన ప్రేమను అంగీకరిస్తాడు. ఆ వ్యక్తి తన కోరికలన్నీ తీరుస్తాడు. ఆ జీవితంలో లేదు… కాదు… ఆ తర్వాత… అనే మాటలు వుండవు. ప్రతిరోజు ఒక అందమైన కలలాగా గడిచిపోతుంది.

ఈ ఆలోచనలతో స్నేహ నడుచుకుంటూ స్కూలుకి వచ్చేసింది. గులాబీ ధరించలేదనే భావం కూడా మాయమైంది.

***

స్నేహకు తన ఆలోచనలకు, ఆశలకు అడ్డంకి ఏర్పడిన ప్రతిసారి ఇలా ఊహాలోకంలో విహరించడం అలవాటు అయ్యింది. కాని ఆ ఊహలను నిజం చేసుకోవాలని ఎవరో ఒక వ్యక్తి ద్వారా తన కోరికలు, ఆశలు తీర్చుకోవాలని వుండేది కాదు సంహితలాగ. వ్యక్తులు తమ కళారూపాలను చూసి తామే మురిసిపోయినట్టుగా ఆమె ఊహాలోకం అందంగా వుండేది. కోపాలు, అపార్థాలు ఉండేవికావు. గడ్డిపువ్వు కూడా ఆమెకు అందంగా కనపడేది.

బి.యిడిలో చేరిన రవి దసరా శలవులకు వచ్చాడు. వస్తూనే ఒక బాంబు పేల్చాడు. మామయ్య కూతురు శ్రావణిని పెళ్ళి చేసుకుంటానని.

“మేనరికాలు నాకు యిష్టం లేవురా” ముందే తేల్చి చెప్పాడు జగన్నాధం.

“ఒరేయ్ చదువుకోమని నిన్ను ఆ వూరు పంపిస్తే నువ్వు చేసే పని యిదా” అంది ఆదిలక్ష్మి.

“పెళ్ళి చేసుకుంటాననడం తప్పు పని ఎలా అవుతుందమ్మా”

“పెళ్ళి తప్పుకాదురా, మావయ్య కూతుర్ని చేసుకుంటాననడం. నా అన్న కూతుర్ని చేసుకోమని నీకు నేనే చెప్పాననుకుంటారు మీ నాన్నగారు. అప్పుడు నేనేం జవాబు చెప్పాలి.”

“ఆయన ఆమాట అన్నప్పుడు చూద్దాంలే” నిర్లక్ష్యంగా అన్నాడు రవి.

ఈ విషయాలన్నీ సంహితతో చెప్పింది రవళి.

“వెరీగుడ్, అన్న అందంగా వుంటాడు. మీ శ్రావణేమిటి ఎవరైనా ప్రేమిస్తారు.”

“అబ్బా భలే చెప్పావ్”

“అవును అమ్మాయి మీ చుట్టాలే అయినప్పుడు అభ్యంతరం ఏముంది?”

“మా మామయ్య వాళ్ళు వ్యవసాయదారులు, తను ఇంటర్మీడియట్ కూడా పాసవ్వలేదు.”

“ఆ… పోనిద్దూ. అందరూ చదివి ఏం చేస్తారు. నీతో పోల్చి ప్రతి అమ్మాయి నీలా చదవాలంటే ఎలా?” అంది సంహిత.

“ఊ… నేను మాత్రం ఏం బాగా చదివాను. సెకండ్ క్లాసు తెచ్చుకున్నాను.”

“సంహితా నేనొకటి అడగనా…”

“అడుగు.”

“భార్గవ్… అదే మీ కజిన్ ఉత్తరాలు రాస్తున్నాడా? మళ్ళీ మా ఎడ్రస్‍కి ఉత్తరాలు రాలేదు.”

“నువ్వు ఇబ్బంది పడుతున్నావని నేనే రాయొద్దు అన్నాను.”

“మరి మీ ఆస్తుల గొడవలు….”

“నేను పట్టించుకోదలచుకోలేదు.”

***

రవళి ఇంటికి వచ్చేసరికి ఆదిలక్ష్మి, స్నేహా రిక్షాలోంచి దిగుతున్నారు. ఇద్దరి మొహాలు సీరియస్‍గా వున్నాయి.

“ఏం జరిగిందమ్మా ఎక్కడికి వెళ్ళివస్తున్నారు?”

“చెబుతాలే ముందు తాళం తియ్యి.”

స్నేహ బట్టలు మార్చుకుని పడుకుంది. మరోసారైతే అసుర సంధ్యవేళ పడుకోకూడదు లేచి కూర్చో అనేది ఆదిలక్ష్మి. కానీ ఇప్పుడేం మాట్లాడలేదు. కాఫీ కలిపి పిల్లలిద్దరికీ ఇచ్చి తను తాగసాగింది. ఆదిలక్ష్మి, రవళి పెరటివైపు అరుగుమీద కూర్చున్నారు.

“నువ్వు చదువు పూర్తయ్యాక పెళ్ళి చేసుకోవద్దు రవళి” అంది ఆదిలక్ష్మి.

“ఇప్పుడు నా పెళ్ళి గురించి ఎందుకమ్మా?”

“అవును రవళి, ఏదైనా లేకపోయిందే అనే దిగులు ఒకటే వుంటే దానితో వచ్చే సమస్యలు ఎన్నో. పెళ్ళి కాకపోతే ఒకటే బాధ కాలేదని. చేసుకుంటే భర్త పెట్టే బాధలు, అత్తగారి ఆరళ్ళు, పిల్లలు లేకపోతే లోకం అడిగే ప్రశ్నలు, వుంటే వాళ్ళు తెచ్చే సమస్యలు యిలా ఎన్నో….”

“ఇప్పుడు స్నేహ అలా వుండటానికి నువ్వు మాట్లాడేదానికి ఏమైనా…”

“సంబంధం వుంది అంటే వుంది లేదు అంటే లేదు”

రవళికి సహనం నశించిపోతోంది. చూస్తోందిగా అమ్మ ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతోంది. అందులో చాలాసేపటికి గాని విషయం బోధపడదు. తర్వాత ఆదిలక్ష్మి చెప్పిన విషయాలు ఆమెకు ఆశ్చర్యాన్ని ఆందోళనను కలిగించాయి.

స్నేహ తొమ్మిదో తరగతిలోకి వచ్చింది. యవ్వనపు మొదటిదశ. ఆమెకు ఏవేవో కోరికలు. అవి సఫలం చేసుకునేందుకు ఒక ఊహాలోకం. ఆ లోకంలో ఆమెకు సమస్యలు వుండవ్. ఎంత పెద్ద కోరికైనా తీరకపోవడం వుండదు. ఆమెను ఆ లోకంలో అందరూ ప్రేమించేవారే గానీ, ద్వేషించేవారు లేరు. ఆమె మాటకు తిరుగులేదు. డబ్బుకు లోటు లేదు.

ఊహా ప్రపంచం ఎవరికైనా ఎప్పుడైనా బాగానే వుంటుంది. వాస్తవప్రపంచంలో మనం అనుకున్నదొకటి, అయ్యేది మరొకటిగా వుంటుంది.

ఊహ, వాస్తవాలను రెండింటినీ బాలెన్స్ చేసుకోవడం ఎంతో జీవితానుభవం వున్నవాళ్ళకే సాధ్యం కాదు. అటువంటిది స్నేహలాంటి చిన్నపిల్లల వల్ల అస్సలు కాదు.

“రవళీ! నీకొక విషయం చెబుతాను, నువ్వు ఎవరికీ చెప్పకూడదు.”

“ఎవరికీ చెప్పనమ్మా, నాకా మాత్రం తెలియదా?”

“దానిలో ఇప్పుడే శారీరకమైన కోరికలు చాలా వస్తున్నాయట. అది మనసుకి సర్ది చెప్పుకోలేక బాధపడుతుంది.”

రవళి భరించలేకపోయింది, ఆమె ఒకసారి లేచి మళ్ళీ కూర్చుండిపోయింది. అస్థిమితంగా వున్నట్టు చేతులు కలుపుతోంది, విడదీస్తోంది.

“ఇవన్నీ నీకెవరు చెప్పారు? అసలు మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు?”

“ఈమధ్య దానికి తరుచూ కడుపులో నొప్పి వస్తోంది. అన్నం సరిగా తినలేకపోతోంది. చదువు కూడా అంతంత మాత్రమే. బడి మానేస్తోందని ఆ మధ్య నువ్వు దాన్ని కోప్పడ్డావు కూడా…”

“అవును…”

“ఆ కడుపు నొప్పికి  కారణం కూడా ఈ ఆలోచనలేనని మన డాక్టరు అన్నారు.”

“అబ్బా ఆవిడ ఏం చెప్పారో ఏమోనమ్మా… స్నేహ యింకా చిన్నపిల్ల దాని గురించి అలా మాట్లాడటం…” రవళికి కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తున్నాయి.

“స్నేహ అంటే నాకేమైనా కోపమా రవళీ? అన్ని టెస్టులు చేయించాము. పులుపు, కారం పెట్టవద్దు అంటే తగ్గించాను. అయినా నిండా పదిహేనేళ్ళు దానికి ఈ ఆలోచనలేమిటి చెప్పు.”

“నీతో నాకే సమస్యా లేదు రవళీ. నువ్వెప్పుడూ కొత్తబట్టలు కుట్టించమని కూడా అడగలేదు. స్నేహ నీలా కాదు దానికి కొత్తబట్టలు, సినిమాలు, షికార్లు అన్నీ కోరికలు. దీన్ని ఎలా కాపాడాలో ఏమో…”

జగన్నాధం రావడంతో ఆయనకు కాఫీ ఇవ్వడానికి వెళ్ళింది ఆదిలక్ష్మి. రవళికి తల్లిని చూసి జాలి అనిపించింది. ఆవిడకు పిల్లలు తప్ప వేరే ప్రపంచం లేదు. తను మెడిసిన్ చదవకపోవడం, అన్న ఏ ఇంజనీరింగ్ లాంటి కోర్సో చదవకుండా బి.యిడి చదవడం, శ్రావణికి చేసుకుంటాననడం, ఇంక స్నేహ చూస్తే యిలా…. స్నేహ చురుగ్గా వుంటుంది. లాజిక్‍గా మాట్లాడుతుంది. కొంచెం సరదాలు, ఫ్యాషన్‍లు ఎక్కువే కానీ యిలా… పెరట్లో దోమలు మనసులో ఆలోచనల కంటే ఎక్కువ కుడుతుంటే లోపలికి వచ్చేసింది రవళి.

***

చినుకులు పడుతూ వుంటే హ్యాండ్ బ్యాగ్ తలమీద పెట్టుకుని ఇంటివైపు అడుగులు వేస్తోంది రవళి. కాస్త దూరంలో స్నేహ.. ఎవరో అబ్బాయితో మాట్లాడుతూ నడుస్తోంది. రవళికి చెప్పలేని ఆశ్చర్యం వేసింది. స్నేహకి మగ స్నేహితులు కూడా వున్నారా? తల్లీ తండ్రీ వూళ్ళో లేరు. దగ్గర బంధువుల పెళ్ళికి వెళ్ళారు. రాత్రికి వచ్చేస్తారు. ఆమె, స్నేహ ఒకేసారి ఇంట్లోకి అడుగుపెట్టారు. కాస్సేపు అయ్యాక….

“ఎవడే వాడు… వాడితో మాట్లాడుతున్నావ్” అడిగింది రవళి.

“నేనా? నేనెవరితో మాట్లాడాను?”

“అమాయకత్వం నటించకు. చినుకులు పడుతున్నాయని నేను గబగబా నడిచి వస్తుంటే నువ్వు ఆ సైకిలు పట్టుకున్న కుర్రాడితో నడిచి వస్తూ మాట్లాడలేదు.”

“అతనెవరో నాకు తెలియదు. స్కూలు నుంచి నడిచి వస్తుంటే మాటలు కలిపాడు. అతనూ ప్రయివేటు స్కూల్లో నైన్త్ క్లాసు చదువుతున్నాడట.”

“అయితే రోడ్డు మీద మాట్లాడతావా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు?”

“బాగుంది, ఎవరో ఎడ్రస్ అడుగుతారు లేదా నువ్వు ఎవరి అమ్మాయివి అని అడుగుతారు. జవాబు చెప్పడంలో తప్పేముంది?”

“లాజిక్‍లు మాత్రం బాగా మాట్లాడతావే. అమ్మ వూళ్ళో వుండి వుంటే పెద్ద గొడవ అయ్యేది.”

“ఎందుకు గొడవ? నేను తనతో అయినా వున్న విషయం చెప్పేదాన్ని.”

“నిన్ను నువ్వు సపోర్ట్ చేసుకుంటావ్ తప్పించి తప్పు ఒప్పుకోవు.”

“అది తప్పే కానప్పుడు ఒప్పుకునే ప్రసక్తే లేదు.”

స్నేహ ఏ మాత్రం తగ్గకుండా వాదించింది. తను చెప్పాలనుకున్న విషయం చెప్పే సమయం వచ్చినట్లు స్నేహ అక్క వైపు ఒకసారి చూసి అంది.

“అక్కా! ఈ మధ్య నా ఆరోగ్యం గురించి అమ్మ నీకు చెప్పినవన్నీ విన్నాను. అవును నాకు కోరికలు వున్నాయి. అందులో మీరనుకునే చెడు లేదు. ఏ కండీషన్లు లేకుండా నన్ను ఒకరు అభిమానించాలనుకోవడం తప్పా. ఇంటికి పెద్దకొడుకని, వంశానికి వారసుడని తాతగారికి, నాయనమ్మ, అమ్మకు, నాన్నగారికి అన్నయ్యంటే యిష్టం. అందంగా వుంటావని బాగా చదువుతావని నువ్వంటే యిష్టం. మరి నేను… ఆఖరున పుట్టినందున నేనెప్పుడూ ఆఖరున ఉండాలా? నాకు పుట్టినరోజులు, ఫంక్షన్లు చేసుకోవడం యిష్టం. నాకేమైనా జరిగాయా? నువ్వు అడగకపోయినా అమ్మ నీకు అన్నీ కొంటుంది. అడిగినా నాకు కొనరు. ఎందుకీ తేడా… ఎవడో వాడు నాకు తెలియదు మొర్రో అంటే నువ్వు వింటున్నావా. నేను ఎవరికీ ఉత్తరాలు రాయలేదు. ఎవరితోనూ సినిమాలకు వెళ్ళలేదు. ఏ వస్తువునైనా బలంగా అణచివేస్తే అది రెట్టింపు వేగంతో పైకి వస్తుంది అన్నది ఏ పుస్తకాల్లోనూ చదవనవసరం లేదు. కాస్త ప్రాక్టికల్ నాలెడ్జి వుంటే చాలు. ఆకర్షణ, వ్యామోహం, ప్రేమ… ఇవన్నీ హార్మోన్స్ చేసే తమాషాలు. నాకంటే పెద్దదానివి, ఒకప్పుడు మెడిసిన్ చదవాలనుకున్నదానివి. ఇవన్నీ నీకు నేను చెప్పనవసరం లేదు. నేనెంత సరదాగా వున్నా, ఎన్ని సినిమాలు చూసినా నాకూ కాస్త వివేకం, విచక్షణ వున్నాయి. ఒక్కమాట చెప్పనా అక్కా, సంహితా నేను ఒకేలా ఆలోచిస్తాము దాదాపు. నువ్వు తనని చాలాసార్లు క్షమించావు. క్షమిస్తావు కూడా. నన్ను మాత్రం కాదులే….” స్నేహ మాటల వర్షం ఆగింది.

బయట ఉరుములు, మెరుపులతో వాన. కరెంటు పోయింది. స్నేహ లేచి లాంతరు వెలిగించింది. రవళికి ఏం మాట్లాడాలో, అసలు ఏం ఆలోచించాలో అర్థం కాలేదు. స్నేహ తనకంటే చాలా పెద్దది. ఇది నిజంగా నిజం.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here