స్ఫూర్తిని ఇచ్చే నాగమోహన్ ప్రస్థానం

5
3

[dropcap]”చూ[/dropcap]చి నేర్చుకోండయ్యా!” ఈ మాటలు నా ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి బోధనల్లో ఒకటి.

అదే విధంగా వ్యక్తిత్వ వికాస శిక్షకులు బ్రియాన్ ట్రేసీ, జిమ్ రాన్లు కూడా తరచు చెప్పే మాట ఇదే.

అంటే ఒక విజేత జీవితాన్ని చూసి అతను చేసిన పనులను మనం కూడా ఫాలో అయితే విజేతగా ఎదగవచ్చు అనేది ఈ మాటల సారం.

***

“మైలేజి ఎంతిస్తోంది?” అడిగాను అతన్ని.

ఆ రోజుల్లో హీరో హోండా మోటార్ సైకిల్ నడిపే వ్యక్తిని అందరూ అడిగే ప్రశ్న అది.

కానీ అతనిచ్చిన సమాధానం విని నాకు పొలమారింది. ఖంగు తిన్నాను అతని సమాధానం విని.

అతనేమన్నా వెటకారంగా మాట్లాడుతున్నాడేమో అన్నట్టు కంగారుగా చూశాను.

ఎవరా వ్యక్తి, ఏమా కథ అని అనుకుంటున్నారా. చదవండి మీకే తెలుస్తుంది.

***

ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను ఈ మాటలన్నీ అంటే, నా మిత్రుడు నాగమోహన్ జెయినిల్ ఫార్మా అనే ఒక చిన్న కంపెనీలో, సాధారణ మెడికల్ రెప్రజెంటేటివ్‌గా గుంటూరులో జీవితాన్ని మొదలెట్టి, ఇప్పుడు భారతదేశంలోని నెంబర్ వన్ స్థానంలో ఉన్న కంపెనీ సన్ ఫార్మా వారి ‘అవెస్టా’ డివిజన్‌కి ఆల్ ఇండియా హెడ్‌గా ఉన్నాడంటే, ఆ ప్రస్థానం స్ఫూర్తిదాయకం కద.

అతనేదో ఐఐఎంలోనో లేక ఏదో ప్రీమియర్ బీ స్కూల్స్‌లోనే చదువుకోలేదు కూడా. సాధారణ తెలుగు మీడియం విద్యార్థిగా మొదలుపెట్టి బీ.ఎస్సీ చదివి ఎంబీఏ చదువుకున్నాడు అందరిలాగానే.

కానీ అతని అనూహ్యామైన విజయానికి ఏమిటి కారణం అనే దిశగా చూద్దాం. అది ఎంతో స్పూర్తిదాయకంగా ఉంటుంది.

అతని ఫార్ములా ఒకటే – కష్టపడి పనిచేయటం.

అవరోధాల్ని అవకాశాలుగా మలచుకోవటం.

అతని గూర్చి ఓ నాలుగు మాటలు చెబుతా. ఇవి యువతకి ఎంతైనా స్పూర్తిని ఇస్తాయనటంలో సందేహం లేదు.

***

కొత్తగా నేను మెడికల్ రెప్రజెంటేటివ్‍గా ‘ఇప్కా’లో కడప పట్టణంలో పని చేస్తున్న రోజులవి.

అప్పుడే డాక్టర్ ఈవీ రామమోహన రెడ్డి గారిని కలిశాక ఆ పక్కనే ఉన్న ఉడుపి సెల్ఫ్ సర్వీస్ రెస్టారెంట్‌లో టీ త్రాగుతూ ఉన్నాను.

ఉదయం దాదాపు పదకొండున్నర అయి ఉంటుంది.

కడప ఎండలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. ఊండుండి పల్చగా వీస్తున్న వేడి గాలి. ఆ వేడిమికి చెమటలు ధారాపాతంగా కారిపోతున్నాయి.

ఆ రెస్టారెంట్ ముందు ఎండలో నా కైనెటిక్ హోండా వెండిరంగులో మిల మిల మెరుస్తోంది. దాని మైలేజి గూర్చే నా దిగులల్లా. ఎక్కడ 100 సీసీ మోటార్ సైకిల్ కనపడ్డా దాన్ని చూసేవాడిని.

అది మండుటెండ గానీ, జడివాన గానీ సర్వకాల సర్వావస్థల యందు కాఫీ, టీలు త్రాగటం ఒక ప్రధాన విధిగా ఉండేది నాకు ఆ రోజుల్లో.

హోటల్ బయట వరండాలో గుండ్రంగా ఉండే నిలువెత్తు టేబుల్ వేసి ఉంటారు. దాని పక్కన నిలబడి టీ త్రాగుతూ రోడ్ వంక చూస్తూ ఉంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేము. ఇంకా నాకు పెద్దగా పరిచయాలు ఏర్పడలేదు. టీ త్రాగుతూ ఒక్కణ్ణే రోడ్ జంక్షన్ వైపు చూస్తున్నాను.

కడప పట్టణం భలే గమ్మత్తుగా ఉంటుంది.

ప్రముఖ జంక్షన్‌గా భావింపబడే ఏడు రోడ్ల జంక్షన్‌కి అతి దగ్గరలోనే అనేక చిన్న చిన్న రోడ్ జంక్షన్లు ఉంటాయి అలాంటి వాటిలో ఒకటి ఈ చిన్ని జంక్షన్. ఈ జంక్షన్ నుంచి ఒక రోడ్ క్రిష్టియన్ లేన్‍కి, ఇంకో రోడ్ ఏడు రోడ్ల వైపుకి, మరో రోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి, ఒక రోడ్ ఎస్.ఎఫ్ స్ట్రీట్‍కి, మరో రోడ్ రమేష్ థియేటర్ వైపుకి దారి తీస్తాయి. (అప్పట్లో ప్రభుత్వ ఆసుపత్రి ఈ జంక్షన్ దగ్గర్లోనే ఉండేది. ఇప్పుడు రిమ్స్‌గా మారి తిరుపతి రోడ్డులో నగర శివార్లలోకి మారిందట.)

ఈ క్రిష్టియన్ లేన్‌కి చుట్టు పక్కల ఉన్న రోడ్లన్నీ కడప పట్టణంలోని ప్రముఖ డాక్టర్లకి చిరునామా అని చెప్పవచ్చు.

ఈ రోడ్ జంక్షన్ పక్కన ఉన్న రెస్టారెంట్ ముందరే నేను నిలబడి తేనీరు సేవిస్తున్నాను.

అప్పుడు నా దృష్టిని ఆకర్షించాడు ఓ యువకుడు. ఎర్రరంగు హీరో హోండా మోటార్ సైకిల్ పై వచ్చి నా కైనెటిక్ హోండా పక్కనే ఆపి తను కూడా అదే రెస్టారెంట్‌కి టీ త్రాగటానికి వచ్చాడు. అతను మరీ పొడగరి కాదు. అతని నడకలో ఆత్మవిశ్వాసం కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది.

అతన్ని చూడగానే మెడికల్ రెప్రజెంటేటివ్ అని అర్థం అయిపోయింది బండికి తగిలించి ఉన్న మెడికల్ కిట్‌గా వ్యవహరింపబడే తోలు బ్యాగును చూడంగానే.

అతను టీ తెచ్చుకుని నా పక్కనే నిలబడ్డాడు.

ఈ బయట ఉన్న టేబుళ్ళ యొక్క ప్రాథమిక ఉద్దేశం – ధూమపానం అలవాటున్న వ్యక్తులు బయటే సిగరెట్, టీ రెండు త్రాగి వెళ్ళి పోవాలని. నాకు సిగరెట్ త్రాగే అలవాటు లేకున్నా రోడ్డు చూస్తూ టీ త్రాగటం ఇష్టం అందుకే అక్కడ నిలబడి టీ త్రాగుతున్నాను.

ఈ యువకుడికి సిగరెట్ త్రాగే అలవాటుందేమో, ఇక సిగరెట్ తీసి త్రాగటం మొదలెడతాడు అనుకున్నాను. కానీ అతను కూడా నాలాగే సిగరెట్ త్రాగే అలవాటు లేని వాడనుకుంటా చక్కగా టీ మాత్రమే తాగుతున్నాడు.

అయ్యప్ప భక్తులు ఒకరికొకరు పరిచయం లేకున్నా వారి నల్ల డ్రస్ చూసి గ్రీట్ చేసుకుంటారు కద, అదే విధంగా గడ్డం పెంచుకుని టోపీలు పెట్టుకున్న సాహెబ్ గార్లు అపరిచితులైనా సరే ఒకరినొకరు పలకరించుకుంటారు కద, అలాగే మా మెడికల్ రెప్రజెంటేటివ్స్ మధ్య కూడా అలాటి అలిఖిత ఒప్పందం ఒకటి అమల్లో ఉండేది.

పరిచయం ఉన్నా లేకున్నా చిరునవ్వుతో గ్రీట్ చేసుకునేవారం.

‘హలో’ అతను నన్ను చూసి పరిచయ పూర్వకంగా నవ్వుతూ చేయి కలిపాడు.

అతనే నాగమోహన్, మన కథా నాయకుడు.

మా మొదటి పరిచయంలోనే అతను భేషజాలు లేని వ్యక్తి అని, చక్కటి స్నేహశీలి అని, నేను అంచనా వేయగలిగాను. అదెలాగంటారా చెబుతాను. ఉత్తిగా చిరునవ్వు చిందిస్తారు కానీ, పరిచయం పెంచుకోవాలి అంటే, ముందుగా ఎదుటివ్ రెప్‍ని పలకరించే ముందు సాధారణంగా మెడికల్ రెప్రజెంటేటివ్స్ చేసే పని అతని మెడికల్ కిట్‌పై నున్న కంపెనీ లోగోని చూసి అతనే కంపెనీనో తేల్చుకుని అది ఒక స్థాయి గల కంపెనీ అయితేనే చేయి చాచి పరిచయానికి నాంది పలుకుతారు. నేను ఆ కొద్ది రోజుల అనుభవంలో కనుగొన్న విషయాల్లో అదొకటి.

నిజానికి నేను పని చేస్తున్న ‘ఇప్కా’ కంపెనీ దేశంలోని మొదటి పది అత్యుత్తమ కంపెనీలలో ఒకటి అప్పటికే. కానీ అతను నా కంపెనీ పేరు తెలుసుకుని పరిచయం పెంచుకునే ప్రయత్నం చేశాడు అని చెప్పలేం. ఎందుకంటే, నా మెడికల్ కిట్ అప్పుడు బయట ఉన్న నా స్కూటర్‌కి ముందు భాగంలో ఉంది, దానిపై లోగో కనిపించే అవకాశం లేదు.

అతని పేరు నాగమోహన్ అని బీఈ (BE- Biological Evans) కంపెనీ రెప్‌గా పని చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు.

“ఓ! బీఈ నాగమోహన్ అంటే మీరేనా” అని నేను ఆనందాశ్చార్యాలతో కళ్ళు పెద్దవి చేసి చూశాను అతని వంక. నా ఆశ్చర్యానికి కారణం లేకపోలేదు. ఆ కొద్ది రోజుల ఫీల్డ్ వర్క్‌లో అతని కంపెనీ ప్రాడక్ట్స్ నాకు అనేకం చాలా దగ్గర్ల తారసపడ్డాయి, అతని గూర్చి చాలా మంది మంచిగా చెప్పారు, ఇంకొందరైతే ఒకడుగు ముందుకేసి, “కొత్తగా కెరియర్ ప్రారంభించావా, గుడ్, బీఈ నాగమోహన్ని ఆదర్శంగా తీసుకో” అని చెప్పారు.

మన కడప మార్కెట్‌లో కష్టపడి పనిచేస్తున్న కొందరు వ్యక్తులలో నాగమోహన్ ఒకరు అని, అలాంటి వ్యక్తులతో సాన్నిహిత్యం పెంచుకోమని కూడా సలహా ఇచ్చి ఉన్నారు కొందరు.

అందువల్ల ఇంచుమించు ఒక సెలబ్రిటీ స్థాయిలో ఆ పేరు నా మనసులో నమోదు అయి ఉంది అప్పటికే.

అదే మాట చెప్పాను అతనితో. అతను కాస్త మొహమాట పడ్డాడు.

ఇతన్ని మెడికల్ షాప్స్ వాళ్ళు ముద్దుగా తుఫాన్ అని పిలుచుకునే వారు.

“ఏమీ లేదు బాస్ కష్టపడి పని చేయటమొక్కటే నాకు తెలిసింది. దానికి పోయి ఇంత ప్రశంసలు అవసరమా” అని తేలిగ్గా కొట్టి పడేశాడు ఆ విషయాన్ని.

నిర్మొహమాటంగా చెప్పాలి అంటే, అతని కంపెనీ ‘బీఈ’ అనేది ఏదైతే ఉందో, అది మంచి కంపెనీనే కానీ దేశవ్యాప్త రాంకింగ్, టర్నోవర్, ఉద్యోగుల సంఖ్య తదితర అంశాల ఆధారంగా చూస్తే మరీ పెద్దదేంకాదు. కానీ మన తెలుగు నేలకి గర్వకారణమైన పెద్ద కంపెనీలలో ఒకటి.

ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, కడపలో బీఈ వైభవం చూస్తే ఈ రంగం లోతులు తెలియని కొత్త వారికి ఇది చాలా పెద్ద కంపెనీ ఏమో అనే అభిప్రాయం కల్గుతుంది. దాని వెనుక ఒకే ఒక కారణం ఆ రోజుల్లో ఈ కుర్రాడు చేసిన కృషి అని నిర్వివాదంగా చెప్పవచ్చు.

హెచ్చార్ మేనేజర్లు చెప్పే మాట అదే. ఫీల్డ్‌లో మీ ప్రవర్తన ద్వారా కంపెనీకి ఒక ఇమేజి, గుర్తింపు ఏర్పడుతుంది.

‘యూ ఆర్ ది ఫేస్ ఆఫ్ ది కంపెనీ’ అనేది కంపెనీ యాజమాన్యం చెప్పే మొదటి మాట.

క్షేత్ర స్థాయిలో నీకు తారస పడే ఒక వ్యక్తి నీ కంపెనీ గూర్చి మంచిగా కానీ చెడుగా కానీ ఒక అభిప్రాయం ఏర్పరచుకోవటానికి నీ యొక్క ప్రవర్తన మాత్రమే కారణం. ఎక్కడో బొంబాయిలోనే, అమెరికాలోనే ఉండే కంపెనీ ఎలాంటిది, ఆ కంపెనీ యొక్క స్థాయి ఏమిటి అనే వివరాలు క్షేత్ర స్థాయిలో ఉండే ప్రజలకి తెలియదు కద. కాబట్టి కంపెనీలో ఆ పర్టిక్యులర్ జిల్లాకి సంబంధించినంతవరకు నువ్వే ఫేస్ ఆఫ్ ది కంపెనీ.

ఇవి ఏ హెచ్చార్ మేనేజర్ అయినా చెప్పే సాధారణమైన మాటలే. కానీ ఈ మాటల్ని నిజం చేసి చూపించిన ఘనత మన నాగమోహన్‌దే.

***

అప్పట్లో హీరో హోండా స్ప్లెండర్, ఇండ్ (టీవీఎస్)సుజుకీ, యమహా ఆరెక్స్ 100, కవసాకి బజాజ్ 4s తదితర మోటార్ సైకిళ్ళు ఎన్ని ఉన్నప్పటికి హీరోహోండా బండ్లు మైలేజి ఎక్కువ ఇస్తాయని ఒక నమ్మకం ఉండేది.

హీరో హోండా కంపెనీ వారు హోండా తమ నుంచి విడిపోతే స్వంతంగా బ్రతకడానికి సిద్ధంగా ఉండటానికా అన్నట్టు హోండా అన్న పేరుని ఎక్కువ వాడకుండా స్ప్లెండర్ అనే మోడల్ మీద తమ సర్వశక్తులని ఒడ్డి ప్రమోట్ చేస్తున్న రోజులవి.

మన నాగమోహన్ మాత్రం పాత మోడల్ అయిన హీరోహోండా సీడీ 100 మోడల్నే వాడుతూ కనిపించాడు. అది రెడ్ కలర్‌లో ఉండేది నాకు బాగా గుర్తు.

హీరో హోండా యజమానుల్ని అందరూ అడిగే ప్రశ్నే నేను యధాలాపంగా అడిగేశాను “మైలేజి ఎంతిస్తోంది?”

కానీ అతనిచ్చిన సమాధానం విని నాకు పొలమారింది. ఖంగు తిన్నాను అతని సమాధానం విని.

అతనేమన్నా వెటకారంగా మాట్లాడుతున్నాడేమో అన్నట్టు కంగారుగా చూశాను. ఇంతకూ అతనేమి చెప్పాడో మీరు కూడా వినండి.

నేను మైలేజి గురించి ఎప్పుడూ ఆలోచించను ఆనంద్! జస్ట్ ఫిల్ ఇట్, షట్ ఇట్, ఫర్గెట్ ఇట్. నా ఆలోచనంతా వర్క్ గూర్చే ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని గూర్చి ఆలోచించను”

‘ఫిల్ ఇట్,

షట్ ఇట్,

ఫర్గెట్ ఇట్’ అనేది అప్పట్లో హీరోహోండా వారి ఫేమస్ స్లోగన్.

నేను అతని వంక అయోమయంగా చూస్తూ వెర్రి నవ్వు నవ్వాను.

అతనికి ఓ క్షణంలో అర్థం అయిపోయింది, తన మాటలవల్ల ఎదుటివారు హర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని.

అప్పుడు నా భుజం మీద చేయి వేసి చెప్పాడు “సారీ ఆనంద్. ఏదో గొప్ప కోసం చెప్పలేదు అలా. నిజంగానే నేను ఫాలో అవుతున్న పద్దతి అది. నాకసలు ఇవన్నీ చూసుకోవటానికి టైం ఉండదు. నందలూరు, రాజంపేట, కోడూరు, ప్రొద్దుటూరు ఇలా ఒకటేమిటి అన్నీ ఊర్లూ ఈ బండి మీదనే తిరుగేస్తా. ఎక్కడ పెట్రోల్ అయిపోతే అక్కడ పట్టించేస్తా,మళ్ళీ నా పనిలో నేను మునిగిపోతా”.

“హే కమాన్! నో వర్రీస్” అనేసి నేను కూడా సర్దుకున్నాను.

అదీ మా మొదటి పరిచయం.

ఆ తర్వాత అతన్ని నాకు తెలియకుండానే అబ్జర్వ్ చేయటం మొదలెట్టాను.

గణాధ్యక్ష పదవికి వినాయకుడితో స్కందుడు పోటీకి వస్తే, శివపార్వతులు వారిద్దరికి భూలోకంలోని తీర్థాలన్నీ చుట్టి రావాలని ఓ పోటీ పెడతారు కద. ఆ కథ మీకు తెలిసిందే. కుమార స్వామి ఎక్కడికి వెళ్ళినా, అప్పటికే వినాయకుడు అక్కడికి వెళ్ళి వెనక్కి తిరిగి వస్తూ కనపడుతాడు కద.

నాకు అతనితో ఇంచుమించు అలాంటి అనుభవమే ఎదురయ్యేది ఆ రోజుల్లో.

అతనికి నాకు ప్రత్యక్ష పోటీ ఏమీ లేకున్నా, ప్రతి ఊరికి నేను వెళ్ళే సరికి ఆయా డాక్టర్ల ఛాంబర్స్‌లో అతని పోస్టర్లు, సాంపిల్స్, స్టికర్స్ నాకు స్వాగతం పలికేవి.

రైల్వే కోడూరు, రాజంపేట, పులివెందుల, నందలూరు, పోరు మామిళ్ళ, మైదుకూరు, రాయచోటి, ఎర్రగుంట్ల, ప్రొద్దుటురు, జమ్మలమడుగు ఇలా ఎక్కడికి వెళ్ళీనా అతనక్కడికి అందాకే వచ్చి పని చేసి వెళ్ళాడన్న ముద్రలు కనిపించేవి.

ఒక్కోసారి ప్రొద్దుటూరులో బస చేసినప్పుడు కాస్త కుదురుగా కబుర్లు చెప్పుకోటానికి వీలయ్యేది.

***

ఆ తరువాత కొద్ది నెలలకే అతనికి పదోన్నతి మీద కేరళకి బదిలి అయింది. అతి తక్కువ ఎక్స్‌పీరియెన్స్‌తో బీఈలో ప్రమోషన్ పొందిన వ్యక్తిగా ఇది ఒక రికార్డ్ అని అతనే చెప్పాడు ఇటీవల.

పదోన్నతి, చక్కటి ప్రకృతికి ఆలవాలమయిన కేరళ లాంటి పదాలు వినటానికి బాగున్నా అది ఒకరకంగా అతని ముందున్న పెనుసవాల్ అని చెప్పవచ్చు.

ఎందుకంటే ఒక మేనేజర్‌గా కేరళలో విజయవంతంగా పని చేయటం అనేది దాదాపు అసాధ్యం. అక్కడి ఆవేశపరులైన ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు మూడు హడ్తాళ్ళు, నాలుగు ఘెరావ్లు అన్నట్టు మేనేజర్ పనికి అడ్డు తగులుతుంటారు. మెమొరాండంలు స్వీకరించమంటారు. ఫీల్డ్ వర్క్ చేయనివ్వరు. ఏదో ఒక ఆటంకం కల్పిస్తారు.

‘ఎందుకు ఈ ప్రమోషన్ పొందామురా భగవంతుడా’ అని తిట్టుకునేలాంటి పరిస్థితులు కల్పిస్తారు.

దేశంలో ఎక్కడో ఏదో కంపెనీ ఎవరికో ఇబ్బంది కలిగిస్తే, ఇక్కడ కేరళలో మేనేజర్లని ఘెరావ్ చేస్తారు.

మొహమాటం లేకుండా చెప్పాలి అంటే, చాలా మంది అతను అతి త్వరలోనే బ్రతుకు జీవుడా అని, గోడకు కొట్టిన బంతిలా వెనుకకి వస్తాడు అని భావించారు.

ఈలోగా నాకు కూడా ప్రమోషన్ మీద కోయంబత్తూర్‌కి ట్రాన్స్పర్ కావటం నా కెరియర్‌లో నేను బిజీ అయిపోవడంతో అతనితో టచ్‌లో ఉండటం కుదరలేదు.

వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాలు ఉండేవి కావు ఆ రోజుల్లో.

ఇటీవల అతనే నా నెంబర్ పాత మిత్రుల ద్వారా సంపాయించి మమ్మల్నందర్నీ మళ్ళీ ఓ వాట్సప్ గ్రూప్‌లో పెట్టాడు.

ఆ విధంగా అతని గూర్చి తెలుసుకోవటానికి వీలయింది మళ్ళీ.

***

చెప్పాను కద, నాకు అతని మీద నమ్మకం ఉండేది అని. అతను ఆ నమ్మకాన్ని వమ్ము కానివ్వలేదు.

అదేదో సినిమాలో అల్లు అర్జున్ ఒక డైలాగు చెబుతాడు చూడండి “నేను తెలుగు లెక్క, ఆడా ఉంటా ఈడా ఉంటా” అని. సరిగ్గా అదే విధంగా, అతను కడపలో ఉండగా కంపెనీ పనులెంత చక్కగా చేసేవాడో, ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్‌లో కూడా అంత చురుకుగా పాల్గొనేవాడు. తనే స్వయంగా ధర్నాలలో పాల్గొనేవాడు. ఈ క్రియాశీలక అనుభవం కారణంగా కావచ్చు, అతను కేరళలో కూడా విజేతగా నిలిచాడు.

ఆ తర్వాత ‘టీడీపీఎల్’ అనే తమిళనాడుకి చెందిన ఒక కంపెనీలో చేరి మరో పదోన్నతిపై హైదరాబాద్‌కి వచ్చాడు.

కష్టపడేవ్యక్తికి అదృష్టం కూడా కల్సి వస్తుంది అంటారు చూడండి, అలాగా ఈ టీడీపీఎల్ అనే కంపెనీని ఇండియాలో అతి వేగంగా ఎదుగుతున్న సన్ ఫార్మా వారు కొనుగోలు చేయటం జరిగింది. ఈ విధంగా అతను ఆటోమేటిగ్గా సన్ ఫార్మా ఎంప్లాయిగా మారిపోవటం జరిగిపోయాయి.

ఆ తరువాత అతను సన్ ఫార్మాలో జోనల్ మేనేజర్ హోదాలో మరో పదోన్నతి పొంది కలకత్తాకి వెళ్ళాడు. మేనేజర్లకి సింహ స్వప్నం, యూనియన్ ఆక్టివిస్టులకి స్వర్గధామం అని చెప్పుకోదగ్గ పశ్చిమబెంగాల్‌కి ప్రమోషన్ రూపంలో అతనికి ట్రాన్స్ఫర్ అయింది.

ఈ పశ్చిమ బెంగాల్ మార్కెట్ కేరళకి తాత వంటిది యూనియన్ యాక్టివిటీస్ విషయంలో.

ఇందాక చెప్పుకున్నట్టు అతను తనకు వచ్చిన కష్టసాధ్యమయిన సవాళ్ళని అవకాశాలుగా మలచుకుని విజేతగా నిలబడ్డాడు. కేరళలో, పశ్చిమబెంగాల్ రాష్టాలలో మేనేజర్ హోదాలో విజేతగా నిలబడటం ఆషామాషి కాదు.

హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ లతో పాటు మానవీయ విలువలతో కూడిన నాయకత్వ లక్షణాలు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే కానీ ఇది సాధ్యం కాదు.

ఎమోషనల్ కోషంట్ (ఈక్యూ), ఇంటెలిజెన్స్ కోషంట్ (ఐక్యూ) ఈ రెండిటితో పాటు ఆధ్యాత్మిక ధోరణి (స్పిరుచ్యువల్ కోషంట్) కూడా సమృద్దిగా ఉంటేనే ఇది సుసాధ్యం అవుతుంది. ఎవరినీ విరోధులుగా భావించకుండా అందరినీ తనతో కలుపుకుపోగల్గిన గుణం ఈ విజయానికి కారణం.

పూర్వం ఘంటసాల గారి పాట ఉంది కద, ‘ద్వేషించే కూటమిలోనా నిలచి, ప్రేమించే మనిషే కద మనిషి’ అన్నట్టు.

ఈ రెండు రాష్ట్రాల యూనియన్ ఆక్టివిటీస్ని కించపరచటం నా ఉద్దేశం కాదు కానీ, వారు తత్వతః పై అధికారిని ఎదిరించి సహాయ నిరాకరణం చేయటమే తమ విధి అన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఇది నేను ప్రత్యక్షంగా చవిచూశాను.

ఆ తర్వాత అతను ఎకాఎకి ఆల్ ఇండియా హెడ్‌గా అదే సన్ ఫార్మాలో ఆప్థాల్మిక్ డివిజన్‌లో ముంబాయి కేంద్ర స్థానంగా పని చేస్తున్నాడు ప్రస్తుతం.

***

నాగమోహన్ వయస్సు ప్రస్తుతం యాభై ఆరు సంవత్సరాలు. భార్య శ్రీమతి బబిత, ఒకే కొడుకు విహార్ భరధ్వాజలతో ముంబాయిలో ఉంటున్నారు. విహార్ ప్రస్తుతం ఎంబీబీఎస్ పూర్తి చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు.

నాగమోహన్, శ్రీమతి బబిత, విహార్ భరద్వాజ

నాగమోహన్ తండ్రి శ్రీ కృష్ణమూర్తిగారు పంచాయితీ ఆఫీస్‍లో ఒక చిన్న గ్రామంలో గుమాస్తాగా పనిచేసే వారు, తల్లి శ్రీమతి రాజ్యలక్ష్మీ గారు.

తమ కొడుకు ఈ స్థాయికి చేరుకుంటారని వారు ఎన్నడూ ఊహించి ఉండరు.

***

నాగ మోహన్‌లో పత్యేకతలు

కడపలో అప్పట్లో అతని రూం మేట్ బిడిల్ సాయర్ రెప్ ప్రసాద్ మాటల్లో విందాం.

“అతను తన జీవితాన్ని చాలా ప్లాన్డ్‌గా రూపుదిద్దుకోవడంలో విశ్వసిస్తాడు. నెల రోజుల ముందుగానే తన టూర్ ప్రోంగ్రాంని రూపుదిద్దుకునేవాడు. ఆ తరువాత ఇక ఆరు నూరయినా నూరు ఆరయినా ఆ ప్లాన్‌ని మీరి ప్రవర్తించేవాడు కాదు”

అతను విశ్వసించే విషయాలు

-హార్డ్ వర్క్

-స్మార్ట్ వర్క్

-ప్లానింగ్

-గోల్ సెట్టింగ్

-అచీవింగ్ ది గోల్

-డ్రీం బిగ్ -నెవర్ సెటిల్ విత్ ఆవరేజ్ రిజల్ట్స్.

***

ఇదండీ ఇతని ప్రస్థానం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here