మధురమైన బాధ – గురుదత్ సినిమా 11 – బాజీ

0
3

[box type=’note’ fontsize=’16’] గురుదత్ దర్శకత్వం వహించిన ‘బాజీ’ సినిమాని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

[dropcap]న[/dropcap]వకేతన్ ఫిలింస్‌ను దేవ్ ఆనంద్ స్థాపించిన తరువాత తీసిన రెండవ సినిమా ‘బాజీ’. ‘హం ఏక్ హై’ అనే సినిమాలో నటిస్తున్నప్పుడు దేవ్ ఆనంద్‌కు ఆ సినిమా కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న గురుదత్ పరిచయం అయ్యారు. గురుదత్ తన షర్టు ధరించి ఉండడం చూసిన దేవ్ ఆనంద్ అతన్ని దాని గురించి ప్రశ్నించినప్పుడు చాకలికి ఇచ్చిన తన షర్టుకి బదులుగా అతను ఈ షర్టు తనకిచ్చాడని, మరో షర్టు తనకు లేనందువలన అదే వేసుకోవలసి వచ్చిందని గురుదత్ బదులు ఇచ్చారు. దేవ్ ఆనంద్ దానికి బదులుగా ఆ చాకలి అతను తనకు మరొకరి షర్టు ఇచ్చినట్లు చెప్పారు. ఈ షర్టులు మారడంతో మొదలయిన వీరి పరిచయం తరువాత స్నేహంగా మారింది. సినీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్న సమయంలో వారిరువురు ఒక ప్రతిపాదన చేసుకున్నారు. గురుదత్ మొదట దర్శకుడిగా బ్రేక్ సంపాదిస్తే, దేవ్ ఆనంద్‌కు హీరోగా అవకాశం ఇవ్వాలి. దేవ్ ఆనంద్‌కు మొదట బ్రేక్ వస్తే గురుదత్‌కు దర్శకుడిగా అవకాశం ఇవ్వాలి అన్నది వారి మధ్య జరిగిన ఒప్పందం. దానికి జవాబుగా నవకేతన్ ఫిలింస్ ప్రారంభించిన వెంటనే దేవ్ ఆనంద్ గురుదత్‌కు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమానే 1951 లో వచ్చిన ‘బాజీ’.

బాజీ సినిమాకు కథ గురుదత్, బల్రాజ్ సాహ్నీ కలిపి తయారు చేసుకున్నారు. ఈ సినిమాకు సంభాషణలు రాసింది, స్క్రీన్ ప్లే చేసింది బల్రాజ్ సాహ్నీ. రచయితగా బల్రాజ్ సాహ్నీ పని చేసిన ఏకైక సినిమా ‘బాజీ’. 40 లలో హాలీవుడ్‌లో వచ్చిన ‘గిల్డా’ అనే సినిమా ప్రభావంతో రాయబడిన కథ ఇది. ఈ సినిమాలో మొదటి షాట్లో గురుదత్ కామియో రోల్‌లో కనిపిస్తారు కూడా. బలరాజ్ సాహ్నీ ‘హల్చల్’ సినిమా చేస్తున్నప్పుడు బద్రుద్దీన్ జమాలుద్దీన్ ఖాజీ అనే ఒక నటుడిని గమనించారు. ప్రేక్షకులను నవ్వించగల అతని చాతుర్యం నచ్చి అతన్ని గురుదత్‌కి ఆయన పరిచయం చేసారు. ‘బాజీ’ సినిమాలో ఖాజీకి ఒక చిన్న పాత్ర లభించింది. కాని దర్శకుడు గురుదత్‌తో ఏర్పడిన స్నేహం అతన్ని గురుదత్ టీంలో సభ్యునిగా చేసింది. తరువాత జానీ వాకర్ పేరుతో అతను దేశంలో గొప్ప కమెడియన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. గురుదత్ జానీ వాకర్ మధ్య స్నేహం ఎంతగా ఉండేదంటే అతని కోసం ఒక పాత్రను తప్పకుండా తన సినిమాలలో సృష్టించేవారు గురుదత్. ‘కాగజ్ కే ఫూల్’ సినిమాలో అనవసరంగా జానీ వాకర్‌కు ఒక పాత్రను ఇవ్వడం ఆ సినిమా కథకు జరిగిన పెద్ద లోపం అని ఇప్పటికీ సినీ విశ్లేషకులు చెప్పుకుంటారు. తన సినిమాలలో జానీ వాకర్ తప్పకుండా ఉండాలని చూసే గురుదత్ స్నేహ భావం కొన్నిసార్లు ఇతరులను ఇబ్బంది పెట్టేది. జానీ వాకర్‌తో గురుదత్ పరిచయం కూడా ‘బాజీ’ సినిమా సందర్భంలోనే జరిగింది.

‘బాజీ’ సినిమాకు కొరియోగ్రఫీ చేసింది జోహ్రా సెహగల్. సంగీతనికి నాట్యానికి గురుదత్ కొంచెం ఎక్కువ ప్రాధ్యాన్యతే ఇచ్చేవారు. డాన్స్ పాశ్చాత్య ధోరణులలో ఉన్నా పాటల్లో భారతీయాన్ని జోడించిన పాశ్చాత్య బాణీలను ఇష్టపడేవారు ఆయన. ఆయన సినిమాలన్నిటిలో కూడా పాటలలో ఈ కొత్తదనం కనిపిస్తుంది. తరువాత ఆయన తీసిన క్లాసిక్స్‌లో సాంప్రదాయపు సంగీతం, జానపద బాణీలు వినిపిస్తాయి. సినీ రంగంలో ఆయన నిలదొక్కుకుంటున్న సమయంలో పాశ్చాత్య శైలిలో సినిమాలు తీసే ప్రయత్నం చేసారనే వాదాన్ని ‘బాజీ’ సినిమా నిరూపిస్తుంది.

నలభైలలో హాలీవుడ్ సినిమాల నోయిర్ స్టైల్‌కి ప్రభావితం అయి గురుదత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలోనే మొదటి క్రైం నోయిర్ సినిమా. ఎస్.డి.బర్మన్ సంగీతం, సాహిర్ లుధియాన్వి గేయరచన, గీతా రాయ్ పాటలు ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. గీతా రాయ్ అప్పట్లో పాపులర్ గాయని. తద్బీర్ సే పాట రికార్డింగ్ సమయంలోనే గురుదత్ గీతాల నడుమ ప్రేమ చిగురించింది. ఈ ప్రేమ  1953లో వీరి వివాహానికి దారి తీసింది. గీతా రాయ్ అప్పటి నుండి గీతా దత్‌గా మారారు. ఈ చిత్రంతో సినీ ప్రపంచానికి పరిచయమైన కల్పనా కార్తిక్ తరువాత తొమ్మిది సినిమాలలో హీరోయిన్‌గా నటించి దేవ్ ఆనంద్‌ను వివాహం చేసుకుని సినిమా ప్రపంచం నుండి నిష్క్రమించారు. ‘బాజీ’ సినిమా దేవ్ ఆనంద్, గురుదత్ ఇద్దరికీ వారి జీవన సహచరులను పరిచయం చేసిన సినిమా. సినిమాలో మొత్తం ఎనిమిది పాటలుంటే వాటిలో ఆరు పాటలు గీతా రాయ్ పాడారు. ఒకటి శంషాద్ బేగం, మరొకటి కిషోర్ కుమార్ గానం చేసారు. శంషాద్ బేగం పాడిన షర్మాయె కాహే, గీతా దత్ పాడిన ఆజ్ కీ రాత్ పియా దిల్ నా తోడో పాటలు సూపెర్ హిట్లుగా నిలిచాయి. ముఖ్యంగా ఆజ్ కీ రాత్ పియా చక్కని రొమాంటిక్ పాట. ఈ సినిమా పాటలన్నీ సూపర్ హిట్ గీతాలే. వాటిని రాసిన సాహిర్ లుధియాన్వి గురించి ఇక్కడ ప్రస్తావించుకోవాలి.

“తద్బీర్ సె బిగడీ హుయీ తక్దీర్ బనాలే.. అప్నే పె భరోసా హై తో యే దావ్ లగాలే” అన్నది ఒక ఘజల్ రూపంలో రాసిన గీతం. ఈ పల్లవిని క్లబ్ పాటకు రాసి ఆ సందర్భాన్ని రక్తి కట్టించడం ఒక్క సాహిర్‌కే సాద్యమవుతుంది. ఎలాంటి పాటలోనయినా తన భావజాలన్ని చొప్పించకుండా ఉండరాయన. “క్యా ఖాక్ వో జీనా హై జో అప్నే హీ లియే హో… ఖుద్ మిట్టే కిసే ఔర్ కో మిట్నే సే బచాలే” అన్న సోషలిస్ట్ భావజాలాన్ని ఒక క్లబ్ పాటలో పెట్టి ఆ గీతాన్ని ఆ స్థాయిలో ప్రజలు ఆమోదించేలా చేయగల సత్తా ఉన్న గీత రచయిత సాహిర్. అలాగే “సునో గజర్ క్యా గాయే సమయ్ గుజర్తా జాయే…” అనే మరో సందేశాత్మక గీతం కూడా క్లబ్ నేపథ్యంలోనే వస్తుంది. సాహిర్ పాటలలో స్త్రీలు తమ ప్రేమను వ్యక్తీకరించడానికి అస్సలు మొహమాటపడరు. ఆ రోజుల్లో స్త్రీ పాత్రలతో మొదట ప్రేమ ప్రస్తావన తెచ్చే డ్యూయెట్లను సాహిర్ ఎక్కువగా రాసేవారు… “ఉడే జబ్ జబ్ జుల్ఫే తేరి” అంటూ మగవాని కురులను మెచ్చుకుంటారు ఆయన ఊహలలోని స్త్రీలు (నయా దౌర్), అలాగే “తుమ్ ముఝె భూల్ భి జావో తొ యె హక్ హై తుమ్కో, మేరి బాత్ ఔర్ హై మైనె తో ముహబ్బత్ కీ హై” (దీది) అనే ధైర్యం సాహిర్ హీరోయిన్లకు తన పాటలలో సహమైన లక్షణంగా చూపేవారు. ఆయన హీరోయిన్లకు రాసేటప్పుడు అనవసరమైన సిగ్గు బిడియాల మధ్య వారిని కట్టి పడేయలేదు. “యె దిల్ తుం బిన్ కహీ లగ్తా నహీ హమ్ క్యా కరే” (ఇజ్జాత్) అనే ధైర్యం వారికి ఉండేది. “సంసార్ సే భాగే ఫిర్తే హో భగవాన్ కో తుమ్ క్యా పావోగే” (చిత్రలేఖ) అంటూ సవాలు విసిరే ధైర్యాన్ని స్త్రీలకు సాహిర్ గీతాలు ఇచ్చేవి. “తుమ్ అప్నా రంజో గమ్ అప్నీ పరేషానీ ముఝే దే దో” (షగున్) అని ధైర్యంగా పురుషుని పక్కన నిలిచేవారు ఆయన పాటలు రాసిన స్త్రీ పాత్రలు.

‘బాజీ’ సినిమాలో రజని, లీనా పాత్రల పాటలు గమనిస్తే సాహిర్ అతని స్త్రీ పాత్రలకు ఆపాదించిన వ్యక్తిత్వం అర్థం అవుతుంది. లీనా ఒక క్లబ్ డాన్సర్ కాని ఆమె పాటలలో జీవితం కనిపిస్తుంది. రజని తన ప్రేమను మదన్‌కు తెలుపుతూ “దిల్ కీ కహాని అప్నీ జుబానీ తుమ్కో సునానే ఆయి హూ, ఆంఖో మే లేకే సప్నె సుహానే అప్నా బనానే ఆయీ హూ” అంటుంది. తన ప్రేమను అంత నిస్సంకోచంగా మదన్‌కి ఆమె చెప్పుకోవడం పాట రూపంలో చూస్తాం. సాహిర్ స్త్రీలకు సంబంధించిన వాక్యాలలో ఎంతటి ధైర్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఆపాదించారో ఆయన రాసిన ప్రతి పాటలో చూడవచ్చు. ‘బాజీ’ ఇటువంటి పాటలకు బాట వేసింది.

టి.బి.తో బాధపడుతున్న తన చెల్లెలి వైద్యం కోసం ఒక క్లబ్‌లో జూదగాడుగా చేరతాడు మదన్. అతన్ని డాక్టర్ రజని ప్రేమిస్తుంది. ఆమె తండ్రికి ఈ సంబంధం ఇష్టం ఉండదు. రజనిని ఆమె చిన్ననాటి మిత్రుడు, పోలీస్ ఆఫీసర్ అయిన రమేష్ ప్రేమిస్తాడు. మదన్‌ని లీనా అనే క్లబ్ డాన్సర్ కూడ ఇష్టపడుతుంది. అతన్ని కాపాడుతూ ప్రాణాలు వదులుతుంది. ఆమెను మదన్ హత్య చేసాడని ఉరి శిక్ష విధిస్తుంది ప్రభుత్వం, రజని తండ్రే ఆ క్లబ్ ఓనర్. అతను తన కూతురిని మదన్ నుండి తప్పించాలని అతన్ని హత్య చేయించాలనుకుంటాడు. కాని అతన్ని కాపాడే ప్రయత్నంలో లీనా మరణిస్తుంది. ఆమెను హత్య చేసిన నేరం మీద మదన్ జైలు పాలవుతాడు. నేరాన్ని ఒప్పుకోకపోతే అతని చెల్లెలిని చంపేస్తామని బెదిరించడం వలన ఆ హత్య తానే చేసానని కోర్టులో చెబుతాడు మదన్. కాని నిజాయితీగా పని చేసే రమేశ్ అతన్ని రక్షించి, అసలు నేరస్థుడైన రజని తండ్రిని పట్టుకుని చట్టానికి అప్పగించి ప్రేమికులను కలుపుతాడు.

ఇటువంటి కథనంతో హిందీలో వచ్చిన మొదటి చిత్రంగా ‘బాజీ’ సినీ చరిత్రలో నిలిచిపోతుంది. పాశ్చాత్య సినిమా ప్రభావం, శైలి ఇందులో కనిపిస్తాయి. హాలీవుడ్‌లో ఈ నోయిర్ సినిమా శైలి 1941లో వచ్చిన ‘ది మాల్టీస్ ఫాల్కన్’తో మొదలయ్యింది. జాన్ హస్టన్ ఈ సినిమాకు దర్శకులు. మన దేశంలో ‘బాజీ’ సినిమా మొదటి ఫిలం నోయిర్. ఈ విషయం చాలా మందికి తెలియదు. జాన్ హస్టన్‌కు హాలీవుడ్ ఇచ్చే గౌరవం గురుదత్‌కి ఎవ్వరూ ఇవ్వలేదు. జాన్ హస్టన్‌ను సినీ ప్రపంచంలో హెమింగ్వే అంటారు సిని విశ్లేషకులు. కాని గురుదత్ కాంట్రిబ్యూషన్ బాలీవుడ్ కాని భారతీయ సినిమా కాని పెద్దగా ప్రస్తావించదు. లియొస్ కారక్స్ అనే ప్రెంచ్ దర్శకుడు 2021లో తాను తీసిన ‘ఆనెట్’ అనే సినిమాను గురుదత్ సినిమాల ప్రభావంతో తీసానని, ఆ సినిమా తీస్తున్నప్పుడు చాలా సార్లు గురుదత్‌ని గుర్తుకు తెచ్చుకున్నానని చెప్పారు. మన దేశంలో సినీ ప్రముఖులు చాలా మంది గురుదత్ సినిమాలు కూడా చూడరు.

మరో ఫ్రెంచ్ ఫిలిం మేకర్ ఒలీవియర్ అసాయాస్ SIGHT AND SOUND MAGAZINE లో తనకు బాగా నచ్చిన నేపథ్య సంగీతం, సినీ సంగీతం గురించి చెప్పమంటే, డేవిడ్ మాన్స్ఫీల్డ్ ‘హెవెన్స్ గేట్’ గురించి చెబుతూ ‘ప్యాసా’ సినిమా సంగీతం అంత కన్నా విషాదంగా ఉంటుంది అని ప్రస్తావించారు. 1984లో అంటే గురుదత్ మరణించిన 20 సంవత్సరాల తరువాత ప్రాన్స్‌లో ‘ప్యాసా’ సినిమా ప్రదర్శించినప్పుడు ప్రెంచ్ సినీ విశ్లేషకులు గురుదత్‌ని మొదటిసారి గుర్తించారు. అప్పటి నుండి చాలా మంది సినీ దిగ్గజాలు విదేశాలలో ఆయన్ని స్టడీ చేస్తూనే ఉన్నారు. కాని భారతీయ సినిమా గురుదత్‌ని అప్పటికే మర్చిపోయింది. ఎనభైలలో విదేశీ ప్రముఖులు ఆయన్ని ప్రస్తావించడం మొదలెట్టిన తరువాత మళ్ళీ మనకు ఆయన గుర్తుకు వచ్చినా గురుదత్‌ని తరువాత తరానికి అందించడంలో మన సినీ మేధావులు విఫలం అయ్యారన్నది మాత్రం నిజం.

బాజీ సినిమానుంచే పాటలను కథలో అంతర్భాగం చేసి విడదీయరాని రీతిలో స్క్రిప్టు రచించే గురుదత్ పద్ధతిని గమనించవచ్చు. ముఖ్యంగా తదెబీర్ సే పాట ద్వారా గీతా బాలి పాత్ర దేవ్ ఆనంద్‌ను ఆకర్షించాలని ప్రయత్నిస్తూ స్ఫూర్తి నివ్వటం, దేవ్ ఆనంద్ పాత్రపై హత్యా ప్రయత్నం జరుగుతుందని సొనో గార్ క్యా గాయే పాట ద్వారా సూచించటం వంటివి ఇందుకు నిదర్శనాలు. బాజీ సినిమా మరో ప్రత్యేకత ఏమిటంటే అంతవరకూ భజనలూ, విషాద గీతాలకు పరిమితమయిన గీతారాయ్ ఈ సినిమాతో క్లబ్ పాటలూ, హుషారయిన పాటలూ పాడగలదని అందరికీ తెలిసింది. ఆమె స్వరంలోని సెక్స్ అప్పీల్ అర్థమయింది. ఈ సినిమా తరువాత గీతారాయ్ పాడిన విషాద గీతాలు గుప్పెడే.  బాజీ సినిమా విజయంతో దేవ్ ఆనంద్ దిలీప్ కుమార్, రాజ్ కపూర్‌ల సరసన సూపర్ స్టార్‌గా నిలిచాడు. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని, విశిష్టమయిన నటనా పద్ధతితో అందరినీ అలరించాడు.

గురుదత్ ‘బాజీ’ సినిమాతో దర్శకుడిగా తన మొదటి చిత్రంతోనే ప్రజలకు దగ్గర కాగలిగారు. ఆయన మొదట తీసిన సినిమాలన్నీ కూడా అప్పట్లో సామాన్యులకు దగ్గరయిన సినిమాలు, అంటే మాస్ సినిమాలు గానే పరిగణించాలి. అయనలోని ఆ కొత్తతనం, కొత్త టేకింగ్ అప్పట్లో సినీ వర్గం గుర్తించింది. సినీ రంగంలో ఆయన తన మొదటి చిత్రంతోనే ఒక కొత్త బాట వేయగలిగారన్నది ‘బాజీ’ సక్సెస్ నిరూపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here