కైంకర్యము-26

0
3

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[dropcap]రా[/dropcap]ఘవకు నిజానికి హస్టలుకు వచ్చాక చాలా సుఖంగా ఉంది. దానికి కారణాలు రెండు. మొదటిది త్రాగి వచ్చి పడుకుంటే ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా పెద్దావిడ పట్టేస్తుందని భయం ఇక్కడ లేదు.

రెండవది డబ్బు కోసము వాళ్ళమ్మ దగ్గర నాటకాలు వెయ్యనక్కల్లేదు. తండ్రి నెలనెలా పంపుతున్న ఐదువేలు బానే ఉంటున్నాయి.

కాలేజీలో చేరిన నెలకు తన బండి తెప్పించుకున్నాడు రాఘవ. ఇక అతని ఆగడాలకు హద్దు లేకుండా పోయింది.

హస్టల్‌లో ఆదివారాలు సామాన్యంగా ఫ్యామిలీ టైం అని పెడతారు. ఆ రోజు చాలా మంది వాళ్ళ ఇంటికి వెళ్ళటమో, ఇంటి నుంచి ఎవరన్నా రావటం జరుగుతుంది.

ఆ ఆదివారం రాఘవ రూములో పడుకొని ఆలోచిస్తున్నాడు. అతను కాలేజీలో చేరి రెండు నెలలు అవుతోంది. ఫ్రెండ్సుతో బాగా చనువు పెరిగింది. అటెండరు వచ్చి పిలిచాడు.

“సారు నీకు ఫోను వచ్చింది. పిలుస్తున్నారు…”

‘ఆరోజు ప్లాను గురించి అనుకుంటా వీళ్ళు ఎవరైనా చేశారేమో’ అని మనసులో అనుకుంటా లేచి వస్తూ “ఎవరేంటి?” అడిగాడు.

“తెలియదు” అంటూ అటెండరు వెళ్ళిపోయాడు.

రాఘవ చిన్నగా ఈల వేస్తూ ఫోను దగ్గరకు వెళ్ళాడు. తీరా చూస్తే అది హైద్రాబాదు నుంచి.

“ఎలా ఉన్నావురా?” తండ్రి స్వరం.

“బానే ఉన్నా…”

“చదువుతున్నావా?”

“ఆ…”

“క్లాసులన్నీ సరిగ్గా జరుగుతున్నాయా?”

“ఆ…”

“అన్నీ పాఠాలు అర్థమవుతున్నాయా?”

“ఆ…”

“సెలవులు ఎప్పుడు?”

“తెలీదు…”

“తెలీదేంటి? దీపావళ్ళికి అన్నయ్య వాళ్ళు అమెరికా నుంచి వస్తున్నారు. నీవు వచ్చేయి…”

“ఆ…”

“అమ్మకు కొద్దిగా సుస్తీ చేసింది…”

“ఆ…”

“నీతో మాట్లాడుతుందట. మాట్లాడు.. ఆ అలు మానేసి మాట్లాడటం నేర్చుకో…”

“ఆ…”

“చంటీ! ఎలా ఉన్నావురా?”

“బాగున్నా అమ్మా”

“ఇంటికెప్పుడొస్తావురా…”

“దీపావళి సెలవలకు వస్తానమ్మా…”

“సమయానికి సాపాటు చేస్తున్నావారా?”

“తింటున్నా…”

“అక్కడ పూజ చేసుకోవటానికి వీలుగా ఉందా నాయానా?”

“ఏదో ఉందమ్మా…”

“సరే నాయనా. ఏమ్మనా కావాలంటే చెప్పు. నాన్నగారితో పంపుతాను…”

“ఆహా.. ఏమీ వద్దు. నే బానే ఉన్నాను. నీకేమయ్యింది? ఒంట్లో బాలేదన్నారు నాన్నగారు…”

“ఏదోరా.. బిపీ అనుకుంటా. పోతుందిలే. నీవు నా గురించి బెంగపెట్టుకోకు. చక్కగా చదువుకో బాబు. ఆ చదువయ్యాక ఎంచక్కా ఇంట్లో ఉండిపోవచ్చు…”

“సరే అమ్మా. టైంకు మందులేసుకో…”

“వేసుకుంటా కానీ నీవు టైంకి సాపాటు చేయి…”

“సరే అమ్మా. ఉంటమరి…”

“మంచిది నాన్న. జాగ్రత్త!”

తండ్రితో పొడి పొడిగా, తల్లితో కొంతప్రేమగా మాట్లాడటం రాఘవకు అలవాటేగా.

తల్లి ఆరోగ్యం గురించి క్షణ మాత్రం కూడా అతనికి ఆలోచన లేదు.

ఫోను అవగానే, మిత్రుల గురించి ఆలోచిస్తూ హాస్టలు బయటకొచ్చి క్యాంపసు వైపు నడక మొదలెట్టాడు.

ఎక్కడా కనపడటంలేదు మిత్రులు. కొందరు విద్యార్థులు మాత్రం అక్కడక్కడా కూర్చొని చదువుకుంటున్నారు.

నెమ్మదిగా నడుస్తున్న రాఘవకు వెనక నుంచి వీపు మీద డబ్బుమని ఒక దెబ్బపడింది. అదిరిపోయి వెనక్కి చూస్తే విద్య పగలబడి నవ్వుతూ. ఆమె నవ్వుకు పన్ను మీద పన్ను మెరుస్తోంది.

“భయపడ్డావా…” అంది నవ్వు కంటిన్యూ చేస్తూ.

వీపు తట్టుకుంటూ తల పైకి కిందకీ ఊపాడు రాఘవ.

“అరే భయపడకు…” అంటూ చెయ్యి పట్టుకు లాగి నడవటం మొదలెట్టింది “ఎక్కడికి?” అంటూ

“ఊరికే…తిరుగుతున్నా…”

“ఏదో వెతుకుతున్నావు…”

“నేనా?”

“చూశానులేవోయి. ఇందాకటి నుంచి వెతుకుతూ తిరుగుతున్నావు. నా కోసమేనా?”

“ఛా! కాదు… అందరి కోసము…”

“నీకు ఆడాళ్ళంటే భయమా?”

“భయమా? ఎందుకు”

“నన్ను చూసినప్పుడల్లా పారిపోతూ ఉంటే డౌటు వచ్చింది…చలో క్యాంటిన్ వెళ్ళి టీ తాగుదాం రా…”

క్యాంటిన్లో టీ త్రాగారు.

రాఘవ ఆ అమ్మాయిని తప్పించుకు తిరుగుతుంటే ఆమె వచ్చి పట్టుకుంటూ ఉంటుంది. అతనికి అబ్బాయిలతో తిరగటమే కొంచం వీలుగా అనిపించింది. కాని విద్య వాళ్ళను వదలదు. పైపెచ్చు రాఘవను టీజ్ చేస్తూనే ఉంటుంది. ఆమె టీజింగుకు అతని ముఖం దానిమ్మలా ఎర్రబడటం అందరూ నవ్వటం సామాన్యమైయింది.

“నీకు నేనంటే ఎందుకంత భయం?” టీ త్రాగుతూ అడిగింది.

“నా కెందుకు భయం?”

“నేను నిన్ను తిననులేవోయి. మన స్నేహాలు నీకు నచ్చటం లేదన్న విషయం అందరికీ తెలుసు. ఆ రాకేష్ గాడిని తన్నాలి. ఇలా అమ్మాయిలను వింత జంతువులా చూసే వాళ్ళను గ్యాంగులో కలపటం చేశాడు చూడు…”

“అరే అలాంటిదేమీ లేదు…” అన్నాడు రాఘవ

“కాకపోతే ఏంటి? నిన్నేమైనా తినేస్తున్నానా…”

“సారీ. నిన్ను కష్టపెడితే…” రాఘవ మనస్పూర్తిగా అన్నాడు.

“సరేలే. కొద్దిగా ఫ్రెండ్లీగా ఉండు…” అన్నదామె.

అలా రాఘవ అమ్మాయులను తన గ్యాంగులో చూడటం అలవాటు చేసుకుంటున్నాడు. ఆమె చాలా స్నేహశీలి. పైగా జీవితం జీవించటానికే ఉంది. అనవసరపు అర్థం లేని నీతులతో దానిని ఇబ్బంది పెట్టకూడదన్న అభిప్రాయం.

ఆమెకు రాఘవ నచ్చాడు. ఆరు అడుగుల అందగాడు. ఉన్నవాళ్ళలో కాస్త డీసెంటుగా ఉంటాడు. రిజర్వుడుగా కూడా ఉండి, అమ్మాయిలను కామెంటు చెయ్యడు.

తాగుడు పేకాట సిగరెట్టు తప్ప మరో విషయంలో రాడు. విద్యకు కూడా అదే బ్రాండు. కాబట్టి ఆమెకు రాఘవకు నెమ్మదిగా స్నేహం కుదిరింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here