జ్ఞాపకాల తరంగిణి-38

0
3

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డాకాళిదాసు పురుషోత్తం. [/box]

[dropcap]ఆ[/dropcap] రోజు మా కళాశాలలో విద్యార్థి యూనియన్ ఎన్నికలు. వారం రోజులుగా కాలేజీలో కోలాహలంగా వుంది. అసెంబ్లీ ఎన్నికలను తలపించేంత తీవ్రంగా పోటీ, పార్టీల అభ్యర్థుల మధ్య. కాంగ్రెస్, ఎస్.ఎఫ్.ఐ. అభ్యర్థులే పోటీలో ముందున్నారు. మా ప్రిన్సిపాల్ వనమా మాధవరావు గారికి ఈ ఎన్నికల నిర్వహణలో కొంతమంది సీనియర్ అధ్యాపకులు సహకారం అందించాము. ఏమైనా కాలేజీలో వాతావరణం చాలా ఉద్రిక్తంగా, వేడిగా ఉంది.

ఉదయం నేను డ్యూటీకి తయారవుతున్నాను. నేను టిఫిన్ చేస్తుంటే నా భార్య చల్లగా విషయం చెప్పింది – “వారు రైలు దిగి ఇంటికి వెళ్తూ, మన వాకిట్లో ఆగి, మిమ్మల్ని, ఎన్నికల బాధ్యత చూసుకోమని చెప్పారు. ఆయనకు అంతకన్నా ముఖ్యమైన పని వుందట!”.

ఆయన, మా ప్రిన్సిపాల్ గారు నోటితో చెప్పినా, కాగితం మీద రాసి ఇచ్చినా ఆర్డరే కదా! నిజానికి ఆయన తానే స్వయంగా ఎన్నికలు జరిపిస్తానని, బ్యాలట్ పత్రాలు ముద్రించడం వంటి ఏర్పాట్లు చేసిపెట్టమని బాధ్యత నా మీద ఉంచారు.

నేను వెంటనే కాలేజీకి వెళ్లి ఎన్నికల బాధ్యత తీసుకొని ముందుగానే ఏర్పాటు చేసినట్లు అన్ని తరగతులకు అధ్యాపకులను పంపడం, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు పంపడం వంటి ఏర్పాట్లన్నీ పర్యవేక్షించాను. మా కళాశాల కార్యదర్శి గదిలో మా ప్రిన్సిపాల్ యుజిసి నుంచి వచ్చిన విచారణ సంఘం వారితో ఆ రోజంతా తీరిక లేకుండా వున్నారు.

ఉదయం 11 గంటలకు ఎన్నికల తతంగం పూర్తయింది. 12 గంటలకు బ్యాలెట్ పేపర్లు లెక్కిస్తాము. పెద్ద హాలులో నాలుగు టేబుళ్ళు వేసి, నాలుగు బృందాలు బ్యాలెట్ పేపర్లు లెక్కించే ఏర్పాటు చేశాము. ఆ రోజుల్లో టౌన్‍లో వున్న అలజడి వాతావరణం వల్ల ఉదయం నుంచే గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటై వుంది. కౌంటింగ్ జరుగుతోంది. ఒక్కో అభ్యర్థికి అతని తరఫున ప్రతినిధులు, ప్రతి ఓటు పత్రాన్ని శల్యపరీక్ష చేసి కాని విడవడం లేదు. వివాదాస్పదంగా, సమస్య వస్తే, ఆ టేబుల్ వద్దకు వెళ్ళి, ఎన్నికల అధికారిగా నేను తీర్పు చెప్పేవాణ్ణి. మొత్తం మీద ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొనేంతలో ఊహించని సమస్య ఎదురైంది. ఒక టేబుల్‍లో వివాదస్పదమైన ఓట్లని రెండు ఓట్లు పక్కన పెట్టి మిగతా ఓట్లను లెక్కపెట్టారు. గణన మధ్యలోనే నా దృష్టికి తెచ్చి ఉంటే అప్పుడు అవి చెల్లుతాయనో, చెల్లని ఓట్లనో ఏదో తీర్పు అప్పటికప్పుడే చెప్పేవాణ్ణి. ఆ రెండు ఓట్లే కీలకం. చెల్లితే ఒక ప్యానల్ గెలుస్తుంది. చెల్లకపోతే ఒక ప్యానల్ ఓడిపోతుంది.

అసలు పేచీ ఏమంటే – ఆ రెండు ఓట్లు చెల్లనివని ఒక ప్యానల్, చెల్లుతాయని మరొక ప్యానల్ మొండి వాదన చేశారు. బ్యాలట్ పేపర్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు… అట్లా అన్ని పదవులకు పోటీ చేసిన విద్యార్థుల పేర్లు అకారాది క్రమంలో అచ్చు వేయించాము. అధ్యక్ష పదవి తర్వాత, ఖాళీ విడిచి ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసే విద్యార్థుల పేర్లు వరుసగా వేశాము. రెండు బ్యాలెట్ పత్రాలలో పొరపాటుగా ఈ ఖాళీ స్థలంలో ముద్ర వేశారు, తరువాత పొరపాటు గ్రహించి అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న గడిలో ముద్ర వేశారు. నా విచక్షణ, నా సహ అధ్యాపకుల సలహా మేరకు ఆ రెండు ఓట్లు చెల్లుతాయని భావించాము. మా తీర్పును ఒక ప్యానెల్ విద్యార్థులు సుతరాం అంగీకరించలేదు. కళాశాల కాంపౌండ్ వెలువల దాదాపు రెండువేల మంది విద్యార్థులు గుమిగూడి, కొట్లాట జరిగేటట్లనిపించింది. ప్రిన్సిపాల్ గారు యుజిసి కమీషన్ వారితో ఉన్నారు. ఆయనను సంప్రదిస్తే, కాసేపాగు చూస్తామని రెండు పర్యాయాలు సమాధానం చెప్పారు. భోజనాల వేళ కావడంతో అధ్యాపకులు ఒక్కొక్కరే, ఇక్కడి ఘర్షణ వాతావరణం నుంచి తప్పించుకొని వెళ్లిపోయారు. పోలీసులకు వార్త వెళ్లినట్లుంది, సర్కిల్ ఇన్‌స్పెక్టరు మురళిగారు బలగంతో దిగారు. ఆయన రాగానే కేంపస్‍లో విద్యార్థులందరినీ పంపించి, అభర్థులు, వారి ప్రతినిధులను మాత్రమే ఉండమన్నారు.

చివరకు మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో ఎన్నికల అధికారిగా, ఆ రెండు ఓట్లు చెల్లుతాయని, అందువల్ల ఫలానా ప్యానల్ విజయం సాధించినట్లు తీర్పు చెప్పాను. గెలిచిన ప్యానల్ విద్యార్థులు, వారి అనుచరులు కళాశాల నుండి జయజయ ధ్వానాలు చేస్తూ ఊరేగింపుగా టౌన్లోకి వెళ్లిపోయారు. ఓడిన ప్యానల్ వాళ్లు నా రూమ్‍ను చుట్టుముట్టి వెలుపలికి రానివ్వలేదు. ఇద్దరు ముగ్గురు సహచరులు, ఆఫీసు ఉద్యోగులు మాత్రమే నాతో వున్నారు. చివరకు సాయంత్రం ఫైరింగ్ ప్రారంభిస్తానని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అనగానే క్యాంపస్ ఖాళీ అయింది. పోలీసుల సహకారంతో ఇల్లు చేరాను. ఆ రాత్రికి కాపలాగా మా వాకిట్లో పోలీసులున్నారు, అక్కరలేదన్నా. అది తమ డ్యూటీ అని వాళ్లు వెళ్లలేదు.

ఎన్నికల తర్వాత మూడో రోజు కళాశాలకు వెళ్లాలి. నన్ను కళాశాలకు రావద్దని, వాతావరణం చల్లారలేదని చెప్పి పంపారు. చివరకు నాలుగైదు రోజుల తర్వాత కాలేజీకి వెళ్లాను. మా సహ అధ్యాపకులు కామర్స్ హెడ్ “కాఫీ తాగుదాం, నా వెంట రా” అని కాలేజీ ఎదురుగా వున్న క్యాంటిన్‍కు తీసుకొని వెళ్లారు. కాఫీ ఆర్డరు చేశామో లేదో మమ్మల్ని విద్యార్థులు చుట్టుముట్టారు. మా మిత్రుడు వెంటనే స్కూటర్ స్టార్ట్ చేసి ఎక్కమన్నారు. స్కూటర్ కదులుతున్నప్పుడే నా మెడ మీద ఒక చెయ్యి, చిన్న దెబ్బ తగిలింది. అతను మా కళాశాల విద్యార్థి కాడు, విద్యార్థి నాయకుడు. అట్లా ఆ రోజు బయటపడ్డాము. ఇది జరిగాకా మా స్టాఫ్ కూడా నాకు దూరం దూరంగా వున్నారు విద్యార్థుల కోపం ఇంకా తగ్గలేదని.

వారం తర్వాత ఒక పూర్వ విద్యార్థి మా ఇంటికి వచ్చి తనకు కేంద్ర ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగం వచ్చిందని, ఆ సంతోషం నాతో పంచుకోవాలని, నన్ను, మంచి పేరున్న హోటల్‍కు తీసుకొని వెళ్లాడు. అతని వెంట హోటల్‍కి వెళ్లాను. అక్కడ మా ఎదురుగా వున్న టేబుల్ ముందు వారం క్రితం నా మీద చేయి చేసుకున్న విద్యార్థి నాయకుడు, అతని మనుషులు కూర్చుని వున్నారు. నాకు గుండె ఝల్లుమన్నది. అయితే విచిత్రంగా, అతను తన బృందంతో కలిసి హోటల్లోంచి వెళ్లిపోయాడు, నా వైపు కూడా చూడకుండా.

నాకు తర్వాత, కొన్ని రోజులకు కారణం లీలగా తెలిసింది. లెఫ్ట్ టు లెఫ్ట్ భావజాలం ఉన్న పెద్దల వల్ల తీవ్రమైన మందలింపు వారికి వెళ్లిందని. ఈ సంఘటన తర్వాత నా ఉద్యోగ విరమణ వరకు కాలేజీలో నా వెనుక ఎవరో వున్నారనే అపవాదు ప్రబలంగా పాతుకొని పోయి, నాకు కాలం హాయిగా గడిచిపోయింది. అజ్ఞాత సోదరులెవరో వారికి సదా కృతజ్ఞుణ్ణి.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మా ప్రిన్సిపాల్ రెండు సార్లు మళ్ళీ చెప్తా అని వాయిదా వేశారంటే ఓడిపోయిన వర్గం జిల్లా కోర్టుకు వెళ్లి ఇంజక్షన్ ఆర్డరు తెచ్చుకోడానికి అవకాశం వుంటుందని అట. ఆ విధంగా రెండు ఓట్లు తక్కువ వచ్చిన వర్గం ఇంజక్షన్‌కు ప్రయత్నం చెయ్యలేదు. నాపైకి వచ్చిన నాయకుడు రెండు పర్యాయాలు ఎంఎల్.ఎ అయ్యాడు, నాతో బాగానే ఉంటాడు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here