[dropcap]ఈ[/dropcap] వ్యాసం లౌకికవాదం (సెక్యులరిజం) ఆధునికత (మోడర్నిటీ) మరియు హిందూ ధర్మం గురించిన కొన్ని ఆలోచనల సమాహారం. ఈ వ్యాసానికి ప్రొఫెసర్ ఏ కె శరణ్ (A K Saran – 1922-2003) గారి రచనలు ఆధారం. వాటిలో ప్రధానంగా ఆయన రాసిన పుస్తకం “On the theories of secularism and modernization” ఈ వ్యాసానికి ఆధారం.
సంప్రదాయ చింతనకు ఆధునికీకరణ (modernization) మరియు లౌకికవాదంకు మధ్యన జరుగుతున్న సంఘర్షణ గురించిన చర్చ ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం.
సంప్రదాయం (tradition) అనేది నేర్చుకుంటే వచ్చేది కాదు. ఎప్పుడో ఒకసారి బుద్ధి పుట్టినప్పుడు ఇదిగో నేను ఇప్పటి నుంచి సంప్రదాయం నేర్చుకుంటా అంటే కూడా కుదిరే పని కాదు. ఎలాగైతే ఒక మనిషి తన పూర్వీకులను తాను ఎంచుకోవటం అనేది జరగదో అలాగే సంప్రదాయం అన్నది కూడా అంతే అన్న ప్రస్తావనతో మొదలు ఈ పుస్తకం. ఇది Wittgenstein అనే తత్వవేత్త చెప్పిన మాట.
నా మతం నుంచి వేరుపడిన ఇతరులను నా మతంలోకి తిరిగి మార్చాలి అన్న భావనను పక్కకు పెడితే దాదాపుగా మన సమాజంలో హిందూ ధర్మం అన్నది పైన Wittgenstein సిద్ధాంతానికి అనుగుణంగానే చలామణిలో ఉంది తరతరాలుగా. పుట్టుక నుంచి ఒక సంప్రదాయం చుట్టూ జీవితం అల్లుకుపోతూ ఉండేది నిన్న మొన్నటి వరకు కూడానూ మన దేశంలో. అందుకనే బహుశా హిందూ ధర్మం విషయంలో ఇదిగో ఇవి ఈ మతం తాలూకా నియమాలు ఇది మా పుస్తకం ఇందులో ఉన్నది ఉన్నట్టుగా పాటించావంటే నువ్వు హిందువు అయిపోయినట్టే అన్న ఏర్పాటు జరగలేదు. ఆ అవసరం కూడా రాలేదు. హిందూ ధర్మంలో సహజంగానే బహుళత్వానికి పెద్దపీట వేశారు కాబట్టి దేశ ప్రాంత కాల కుల జాతి భేదాలకు అనుగుణంగా రకరకాల సంప్రదాయ పరంపరల సమ్మేళనమే హిందూ ధర్మం అన్న చందాన సాగిపోతూ ఉండింది.
అయితే అబ్రహామిక్ మతాల తీరు వేరు. ఇక్కడ అబ్రహామిక్ మతాలు అంటే ప్రధానంగా చర్చ క్రైస్తవం గురించి ఇస్లాం గురించి. ఈ రెండిటిలో కూడా దేనికి దానికి ఒక మత గ్రంథం అన్నది ఉంది. ఆ గ్రంథం సాక్షిగా మతమార్పిడి జరపాలి మన మతంలోకి ఇతరులను చేర్చుకోవాలి మన మతానుయాయుల సంఖ్యా బలం పెంచుకోవాలి అనే తపన ఉంది. ఇటువంటి తపన హిందూ ధర్మంలో సహజంగా స్వతః సిద్ధంగా లేదు. చరిత్రను పరిశీలిస్తే హిందూ ధర్మం రకరకాల ప్రాంతాలకు వ్యాప్తి చెందినా కూడా కర్ర విరగలేదు పాము చావలేదు అన్న చందాన ఒక ప్రత్యేకమైన తీరులో వ్యాప్తి చెందింది. ఈ విషయంలో హిందూ ధర్మానికి అబ్రహామిక్ మతాలతో పోలిక లేదు.
అయితే ఇప్పుడిప్పుడే ఇటువంటి ప్రయత్నాలు హిందూ ధర్మం విషయంలో కూడా చర్చలోకి వస్తున్నాయి. అసలీ బహుళత్వంతోనే వచ్చింది చిక్కంతా ఈ క్రైస్తవాన్ని ఇస్లామును తట్టుకొని మనం నిలబడాలంటే మనం కూడా కొన్ని అబ్రహామిక్ మతాల లక్షణాలను అలవరచుకోవాలి. వాళ్ళకు మల్లే మనకు కూడా ఒక పుస్తకం ఉంటే బాగుండును అన్న ఆలోచన గత కొన్నేళ్ళుగా కొన్ని వర్గాలలో ప్రబలుతోంది.
ఇది కాక ఇప్పుడు రాజ్యాంగాన్ని ఆరాధించే వారు కూడా పుట్టుకొచ్చారు హిందువులలో. ఇది కూడా ఒక పుస్తకం పైన ఆధార పడిన మతం లాగానే అనిపిస్తోంది ఈ మధ్యన. ఈ రాజ్యాంగ మతానుయాయులు ముఖ్యంగా హిందువులలో లెక్కకు మిక్కిలి ఇప్పటి కాలంలో. వీటన్నిటి దృష్ట్యా ఈ పుస్తకంలో శరణ్ గారి ప్రతిపాదనలను ఇప్పటి కాలంలో మనం తరచి చూడాల్సిన అవసరం ఉంది.
సరే ఇప్పుడు చర్చ లౌకికవాదం గురించి ఆధునికత గురించి. శరణ్ గారు ఇంచుమించుగా 1960-70ల కాలం నాటి భారత దేశ పరిస్థితుల గురించి వ్యాఖ్యానించారు ఈ పుస్తకంలో. అయితే మనం ఇప్పటి మన పరిస్థితులకు కూడా అన్వయించుకోవచ్చును. నిజానికి అప్పటికంటే కూడా ఈ ప్రతిపాదనలు ఇప్పటి రోజులకు సముచితంగా అనిపిస్తాయి.
ముందుగా లౌకికవాదం పుట్టు పూర్వోత్తరాలు లౌకికీకరణ గురించిన చరిత్ర కొంత. ఇప్పుడు చెలామణిలో ఉన్న లౌకికవాద భావన మనకు యూరోపు నుంచి వచ్చింది. అయితే అక్కడ జరిగిన మత సంఘర్షణలు వేరు. మన దగ్గరి భూమిక వేరు. మన దేశంలో స్వాతంత్ర్య ఉద్యమ కాలం చరమాంక దశకు హిందూ ముస్లిం మత సంఘర్షణలు హెచ్చరిల్లాయి. ఇది కాక ఇంగిలీషు వారి సంస్కృతి మరియు క్రైస్తవ భావాలు ప్రవేశించాయి. మన దేశంలో లౌకికవాదాన్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అర్థం చేసుకోవాలి అని అంటారు శరణ్.
యూరోపు దేశాలలో లౌకికవాదం ఆవిర్భాన్ని మనం గమనిస్తే ముందుగా అక్కడ నేచురల్ సైన్సు మరియు టెక్నాలజీ అనేవి అభివృద్ధి చెందిన విధానాన్ని పరిశీలించాల్సి వస్తుంది. ఇంచుమించుగా 13వ శతాబ్దం నాటి క్రైస్తవ సమాజంలో జరిగిన రకరకాల భావ సంఘర్షణలకు విరుగుడుగా ఈ మతపరమైన సమస్యలు ఎలాగూ తేలేవి కాదు మనమధ్య ఎటువంటి వైరుధ్యాలు ఉన్నా కూడానూ సైన్సు టెక్నాలజీ విషయంలో అందరం ఏకం అవుదాం అని ఒక ప్రతిపాదన వచ్చిందట. ఆ విధంగా సైన్సు టెక్నాలజీల పరిశోధన మత వైరుధ్యాలతో సంబంధం లేకుండా ఒక సమాంతర భావధారగా రూపొందుకుందిట. ఈ విధంగా సైన్సు పరిశోధన అనే విషయంలో ఆటోనమీ అంటే స్వయం ప్రతిపత్తి కావాలి అన్న భావన ప్రబలడంతోనే లౌకికవాదానికి యూరోపులో బీజం పడింది అని అంటారు శరణ్. ఇలా మొదలైన లౌకికీరణ అనే భావజాలం మెల్లగా మతానికి ఒక ప్రత్యర్థిగా ప్రత్యామ్నాయ భావజాలంగా రూపుదిద్దుకుంది. అయితే ఇది యూరోపు విషయం. భారత దేశంలో ఇటువంటి సంఘర్షణ జరిగిన దాఖలాలు లేవు. కాబట్టి యూరోపు లౌకికవాదం భారతీయ లౌకికవాదం యొక్క భూమిక వేరు. రెండిటిని ఒకే గాటన కట్టరాదు అంటారు ప్రొఫెసర్ శరణ్.
యూరోపు లాగా భారత దేశంలో సైన్సు పరిశోధన అన్నది ఎప్పుడు కూడా మతం నుంచి వేరు పడలేదు. నిజానికి ఇస్లాములో కూడా అంతే. అయితే భారత దేశంలో లౌకికీకరణ అన్న భావజాలం స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో బలపడటానికి కారణం అప్పటికే రాజుకున్న ఇస్లాం హిందూ భావ వైరుధ్యాలు, హేతువాద దృక్పథంతో వచ్చిన బలమైన సంఘ సంస్కరణ భావాలు వగైరాలు. ఇస్లాంకు హిందూ మతానికి సంఘర్షణ అన్నది అంతకు ముందే కొన్ని శతాబ్దాల ముందు నుంచే ఉన్నా కూడాను ఆ సమస్యకు లౌకికీకరణ అని మతానికి వెలుపల పరిష్కారం వెతుక్కోవలసిన అవసరం రాలేదు. అది బ్రిటీషు వలస పాలనానంతరమే వచ్చింది. బ్రిటిషు పాలన ఎన్నడూ లేనట్టుగా హేతువాద భావాలను సంఘ సంస్కరణ వాదనను హిందూ ధర్మానికి ఒక సమాంతర శక్తిగా తయారు చేసింది. భారత దేశంలోని లౌకికీకరణ స్రవంతిని ఈ ప్రాతిపాదికన అర్థం చేసుకోవాలి.
అయితే ఈ లౌకికవాదం అనేది మనకు యూరోపు నుంచే వచ్చింది కాబట్టి యూరోపు గతాన్ని క్రైస్తవ మత ఆవిర్భాన్ని గురించి కొంత అధ్యయనం చేస్తే తప్పితే ఈ లౌకికవాదం యొక్క మూలాలు మనకు అవగతం అవ్వవు. క్రైస్తవ మతానికి చరిత్ర అంటే హిస్టరీ అవసరమయ్యింది కానీ హిందూ మతానికి బౌద్ధానికి చరిత్రతో పని పడలేదు. ఎందుకంటే క్రైస్తవం సృష్టి గురించి సృష్టికర్త గురించి కొన్ని నిర్దుష్టమైన భావాలతో బయలుదేరింది. కాబట్టి అప్పటి కాలంలో ఉన్న ఎన్నో ఆలోచనాధారాలతో దానికి సామ్యం కుదరలేదు. ఈ విషయంలో సమన్వయము సాధించటానికే “చరిత్ర” సృజనలో క్రైస్తవం పాలుపంచుకోవలసి వచ్చింది. అంటే నా మతంలో చెప్పేదే నిజమైన చరిత్ర గతం గురించిన మీ మతంలోని చింతన నిజం కాదు అనే భావన క్రైస్తవ మత ప్రచారం నుంచే మొదలైంది. అయితే హిందూ ధర్మం అనాది అనంతం అపౌరుషేయం అనే భావాలపై ఆధారపడింది. ఈ భావాలపై రకరకాల వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి మన విచారధారలో. కాబట్టి క్రైస్తవానికి మల్లే మత ప్రచారానికి మరియు ఆచరణకు హిందూ మతానికి “చరిత్ర” అవసరం రాలేదు. “ఇంగిలీషు వారి సహవాసముచే మనము నేర్చుకున్న విచిత్ర విద్యలలో చరిత్ర రచన ఒకటి” అని అంటారు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఒక చోట. కాబట్టి ఆధిపత్య భావజాలం బలంగా ముడిపడి ఉన్న కొన్ని మతాల వారిలోనే చరిత్ర గురించిన ఈ తీవ్ర భావం కనపడుతుంది. క్రైస్తవంలోనే కాదు చరిత్ర గురించిన విపరీత వ్యామోహం మార్క్సిస్టులలో కూడా కనపడుతుంది మనకు. హిందువులలో గతం గురించిన స్పృహ ఆది అంతం లేని యుగ పరంపరల చుట్టూ అల్లుకుంది. కాబట్టి మన ఆలోచనలలో గతానికి ఉన్నంత ప్రాముఖ్యత చరిత్రకు లేదు. క్రైస్తవ సమాజానికి మనకు ఇది ఒక ప్రధాన తేడా అంటారు శరణ్.
అలాగే క్రైస్తవంలో మొదటి నుంచి రెండు భావ వైరుధ్యాల సమాంతర ప్రయాణం సాగింది. ఈ ద్వంద్వాన్ని మనం అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. అది గ్రీకు రోమన్ సంస్కృతికి మరియు క్రీస్తు పుట్టుకతో ముడి పడి ఉన్న పాలస్తీనా ప్రాంత సంస్కృతికి మధ్యన కలిగిన సంఘర్షణ. నిజానికి లౌకికం అంటే గ్రీకు రోమన్ సంస్కృతుల ప్రభావానికి లోనైన క్రైస్తవం అని మతపరమైన విషయాల దగ్గరికి వస్తే అది పాలస్తీనా సంస్కృతితో ముడిపడిన క్రైస్తవం అని అనే వారు ఉన్నారని అంటారు శరణ్. కాబట్టి లౌకికవాదం క్రైస్తవ ప్రపంచంలో పుట్టుకు రావటానికి ఇవన్నీ కూడా కారణాలు అయ్యి ఉండచ్చునని ఆయన భావన.
ఇలా మొదలైన లౌకిక వాదం మెల్లగా రూపాంతరం చెందింది. లౌకికీకరణ అంటే మతం నుంచి రాజకీయాలకు (పాలిటిక్స్) సంబంధించిన విషయాలను మరియు విద్యాబోధనకు (ఎడ్యుకేషన్) సంబంధించిన విషయాలను వేరు చేయటం అన్న అర్థం వాడుకలోకి వచ్చింది. చర్చ్ మరియు స్టేట్‌ను వేరు చేయటం అన్న ప్రస్తావన ఈ వాదంలో భాగంగానే వచ్చింది. అయితే ఈ భావాలు ప్రబలటం వెనకాల రెండు ఆలోచనాధారలు ఉన్నాయి. ఒకటి సాంఘిక జీవనం నుంచి మతాన్ని వేరు చేయచ్చు అన్న నమ్మకం. రెండవది మతం అన్నది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం అన్నది.
అయితే లౌకికవాదానికి మరొక భావజాలంతో కూడా సామ్యం ఉంది అని అంటారు శరణ్. చర్చ్‌ను స్టేట్‌ను వేరుగా చూడటం మతాన్ని పూర్తిగా వ్యక్తిగతమైన విషయంగా భావించడంతో మొదలయ్యే ఈ లౌకికవాదం చివరాఖరికి ఈ మూడో భావజాలంలోకి కలుస్తుంది అని అంటారు ఆయన. ఫలానా విషయం పవిత్రమైనది అంటే sacred లేదా దైవికమైనది అన్న భావనను తిరస్కరిస్తుందట ఈ తరహా లౌకికవాదం. పరలోక భావనను ఇంద్రియాలకు అతీతమైన భావాలను వివిధ రకాలైన ఆధ్యాత్మిక ఆధిదైవిక భావాలను పూర్తిగా తిరస్కరిస్తుందట ఈ లౌకికవాదం. అంతే కాక ఇటువంటి భావాలపై ఆధారపడి సృజించిన సాంఘిక వ్యవస్థలను కూడా తిరస్కరిస్తుందట. ప్రపంచాన్ని ఆ దృక్పథంతో చూడటం సరికాదని శాస్త్రీయ దృక్పథం అంటే సైన్సు దృక్పథంతో చూడాలనీ మానవతావాదాన్ని హేతువాదాన్ని పరిణామవాదాన్ని వగైరాలని ముందుకు తెస్తుందట ఈ వాదం. దైవికమనే భావనను పారలౌకిక భావనను పూర్తిగా పక్కకు పెట్టి కేవలం లౌకికమైన భావాలకు మాత్రమే తన పరిధిని తగ్గించి వేస్తుందట చివరికి లౌకికీకరణ ఇలా. ఆధునిక కాలంలో ఇటువంటి లౌకికవాదానికి తీవ్ర ప్రతిరూపమే మార్క్సిజం అంటారు ప్రొఫెసర్ శరణ్. కాబట్టి కేవలం భౌతికానికి మాత్రమే కట్టుబడి దైవికం ఆధ్యాత్మికం అనే భావనలను పక్కకు పెట్టిన ఏ ఆధునిక తత్వధార అయినా కూడా మార్క్సిజంతో దగ్గరి సంబంధం మరియు బంధుత్వం కలిగి ఉంటుందని అంటారు శరణ్. ఇది చాలా గాఢమైన పరిశీలన. ఇది మతానికి సంబంధించిన విషయం ఇది లౌకికమైన సెక్యులర్ విషయం అని ప్రతీ దాన్ని విభజించటం మొదలు పెడితే ఆ భావజాలం చివరికి మార్క్సువాదంలో కలవాల్సిందే అని అంటారు శరణ్.
Studies in Hindu Law and Dharmasastra అని Ludo Rocher మరియు Donald Richard Davis Jr రాసిన పుస్తకంలో ఒక వాక్యం ఉంటుంది. భారత దేశంలో చట్టం (లా / law ) మరియు మతం ఒకదానితో ఒకటి పెనవేసుకు పోయి ఉన్నాయి అని ఎవరైనా ఒక ప్రతిపాదన చేస్తే అది కేవలం పాశ్చాత్య ధృక్పథంతో చూస్తే నిజమవచ్చునేమో కానీ భారతీయ దృక్పథం ప్రకారం ఆ మాట సత్యదూరమే అవుతుంది అని అంటారు ఆ పుస్తక రచయితలు. ఎందుకంటే భారతీయులకు మతం మరియు చట్టం అని రెండు విభాగాలు లేవు వారికి తెలిసిందల్లా ధర్మము మాత్రమే అని. హిందూ దృక్కోణం ప్రకారం లౌకికవాదాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఈ వాక్యంలోని మర్మాన్ని అర్థం చేసుకోవాలి.
ఇప్పటి మనకాలంలో జరుగుతున్న రకరకాల సంఘర్షణలకు మూలం ఈ లౌకికవాదం ఏర్పరచిన విభజనలో ఉంది. హిందూ ధర్మం అన్నది మనిషి యొక్క జీవితంలోని ప్రతీ అంకంలోనూ పూర్తిగా చొచ్చుకుపోయి ఉంది. ఇది సెక్యులర్ ఇది మతానికి సంబంధించిన విషయం అని హిందువుల విషయంలో విభజించటం అంత తేలిక కాదు. ఇంచుమించుగా ఇస్లాం విషయం కూడా ఇంతే. రెండు మతాల విధానాలు వేరే అయినా కూడా కొన్ని సామ్యాలు ఉన్నాయి. రెండూ కూడానూ సాంఘికానికి పెద్ద పీట వేసిన మతాలు. వీటిని పూజా మందిరానికో నమాజుకో మాత్రమే కట్టి పడేస్తాం అంటే కుదరని పని. లౌకికవాదానికి మతానికి కలిగే ఈ రాపిడినే ఈ దేశంలో మనం ఇప్పటికీ చూస్తూ ఉన్నాము.
అయితే భారత దేశంలో ఈ లౌకికీకరణను సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటే స్వతంత్ర సంగ్రామం నాటి పరిస్థితులను సమగ్రంగా అవగాహన చేసుకోవాలని అంటారు శరణ్. అప్పటి భారతంలో జాతీయత భావం (nationalisation). పునరుజ్జీవన వాదం (renaissance). సంఘ సంస్కరణ వాదం (reformism) వగైరాలన్నీ బాగా ప్రబలిన కాలం ఇదనీ అంటారు. ఈ పునరుజ్జీవన వాదం అన్నది పాశ్చాత్యీకరణ ఆంగ్లీకరణ వంటి భావాలతో ముడిపడి ఉండేదని అంటారు శరణ్. ఈ కాలంలోనే హిందూ జాతీయతావాదం (hindu nationalism) అన్న భావన కూడా పుట్టుకువచ్చింది అని అంటారు శరణ్. అయితే హిందూ మతం అనేది ఇతర మతాల వంటిది కాదని జాతి భావన (ethnic). బహుళత్వం (diversity) మరియు ఒకటే చోట కేంద్రీకృతమవకుండా తీవ్రంగా వ్యాప్తి చెందటం (diffused) వగైరాలు ఇతర మతాల కంటే హిందూ మతంలో ఎక్కువని ఈ ధోరణికి భిన్నంగా నేషన్ స్టేట్ మీద ఆధారపడిన జాతీయతావాదం అన్నది వచ్చిందనీ అంటారు శరణ్. ఈ రెండు భావనల మధ్యన కూడా వైరుధ్యాలు ఉన్నాయని సమన్వయము అంత సులభం కాదని అంటారు శరణ్.
ఈ విధమైన విభిన్నమైన వాదాలను అన్నిటిని కలుపుకొని ఒక రకమైన కొత్త తరహా ఉద్యమం గాంధీ మహాత్మునితో బయలుదేరింది. గాంధీ స్వదేశీ స్వరాజ్యం అన్న భావనలు ముందుకు తేవటమే కాకుండా పాశ్చాత్య నాగరికతను కూడా ప్రశ్నించాడని పాలిటిక్స్ అంటే రాజకీయాలలోకి ధార్మిక ఆధ్యాత్మిక భావాలు చొచ్చుకు రావటాన్ని సమర్ధించాడని అంటారు శరణ్. అయితే చివరికి ఆ ప్రయత్నంలో గాంధీ విఫలుడయ్యాడని అంటారు శరణ్. దేశ విభజన జరగటంతో గాంధీ సిద్ధాంతాల మీద ఎన్నో ప్రశ్నలొచ్చాయని అయితే అందుకు విరుగుడుగా లౌకికవాదాన్ని (సెక్యులరిజం) జాతీయతాభావాన్ని (నేషనలిజం) అప్పటి నాయకులు అంటే నెహ్రు వంటి వారు వెనకేసుకొచ్చారని అంటారు శరణ్.
నిజానికి ఈ జాతీయతాభావం అనేది నేషన్ స్టేట్ అనే పాశ్చాత్య భావం నుంచి వచ్చిందని భారతీయ దృక్కోణం ఈ విషయంలో భిన్నమైనది అని అంటారు శరణ్ పైన పేర్కొనట్టుగా. ఆధునిక పాశ్చాత్య సిద్ధాంతాల ప్రకారం నేషన్ అంటే దేశం అనేది ప్రజల అభీష్టానికి ఒక ప్రతిబింబం లాంటిదని ప్రజలే సార్వభౌమికాధికారులని ఇది భారతీయ భావనకు ఒకింత భిన్నమైనదని అంటారు శరణ్. ఈ నేషన్ స్టేట్ అన్న భావనలో జాతి ఐక్యతకు మూలం మతంలోనూ ధర్మంలోనూ ఉండదని ఈ ఐకమత్యానికి మూలం వేరే ఇతర విలువలతో ముడిపడి ఉంటుందని ఈ తేడా చాలా ముఖ్యమైనదని అంటారు శరణ్. ఉదాహరణకు పుట్టిన నేల, మాతృ భూమి, మానవతా విలువలు వంటి భావనలు.
అయితే సాంప్రదాయ భారతీయ దృక్కోణం ప్రకారం స్టేట్ అంటే రాజ్యం అనేది ప్రజల అభిప్రాయానికి ప్రతీక కాదని రాజ్యం అనేది ప్రజలకు తలొగ్గదని ధర్మానికి తలొగ్గుతుందని అంటారు శరణ్. ఈ ధార్మిక రాజ్యం అనే భావనకు పాశ్చాత్యంలో పుట్టుకొచ్చిన నేషన్ స్టేట్ అనే భావనకు ఆట్టే సామ్యాలు లేవు. ఈ నేషన్ స్టేట్ తెచ్చిపెట్టే లౌకికవాద భావనకు కూడా ధార్మిక రాజ్య భావనతో సామ్యాలు లేవు. కాబట్టి ధార్మికమైన రాజ్య భావనకు లౌకికవాదంతో కూడుకున్న జాతీయతావాదానికి గల సంఘర్షణకు గాఢమైన తాత్విక కారణాలు ఉన్నాయి.
హిందూ నేషనలిస్ట్ ముస్లిం నేషనలిస్ట్ అనే భావం అంటే మతాన్ని ముందు గణించి తర్వాత దేశాన్ని గుర్తించే భావజాలం మెల్లగా నేషనలిస్ట్ హిందూ నేషనలిస్ట్ ముస్లింగా రూపాంతరం చెందింది అని అంటారు శరణ్. ఇది ఒక రకంగా మతంలోకి లౌకికవాదం చొచ్చుకురావటమే అంటారు ఆయన. నిజానికి అప్పటి కాలపు ఇస్లాము వాదులలో ఇటువంటి భావనల గురించి చాలానే చర్చలు జరిగాయని. మౌలానా మౌదూదీ వంటి వారు నేషనలిజం అనేది మరొక సమాంతర మతంగా మారే ప్రమాదాన్ని అప్పుడే గుర్తించి వ్యతిరేకించిన విషయం మరువకూడదని అంటారు శరణ్. ఇటువంటిదే మహమ్మద్ అలీ జిన్నాకు రాసిన లేఖలో మహమ్మద్ ఇక్బాల్ ప్రస్తావిస్తారు. ఇక్కడ ప్రస్తావన “సారే జహా సే అచ్చా” రాసిన ఇక్బాల్ గురించి వేరే ఎవరో కాదు. హిందూ మతం అనేది ఎప్పుడైతే సోషల్ డెమాక్రసీను ఒప్పుకుంటుందో మరుక్షణం అది హిందూ మతం కాకుండా పోతుంది అని అంటారు ఇక్బాల్. సోషల్ డెమోక్రసీకి మరియు బ్రాహ్మణ మతానికి ఉన్న వైరుధ్యం బుద్ధిజానికి బ్రాహ్మణ మతానికి గల ఘర్షణల వంటిదే అని అంటారు ఆ లేఖలో ఇక్బాల్. అంతేకాక ఈ సమస్యకు ఇస్లాం దృక్కోణంలో పరిష్కారం కావాలంటే ఇస్లాం మత సిద్ధాంతాలకు అనుగుణంగా రాజ్యం రూపకల్పన జరగాలని బహుశా నెహ్రూ కలలుగంటున్న అథీయిస్టిక్ సోషలిజంకు అంటే దైవం అనే భావన లేని నాస్తిక భావాలతో కూడుకున్న సోషలిజంకు ఇదే సరైన విరుగుడేమో అని అంటారు ఇక్బాల్ జిన్నాకు రాసిన ఆ లేఖలో. కాబట్టి శరణ్ గారు మతానికి జాతీయతావాదానికి లౌకికవాదానికి గల వైరుధ్యాలను గురించి చేసిన ప్రస్తావనను ఆ దృక్కోణంలో చూడాలి.
అన్ని మతాల సారం ఒక్కటే అని ఈశ్వర్ అల్లా తేరో నామ్ అంటూ గాంధీ ఎలాగో ఒకలాగా రాజకీయాలలో ఆధ్యాత్మిక విలువలు (స్పిరిట్యుయల్ వాల్యూస్) పోకూడదని ఏదో ప్రయత్నమయితే చేసాడు కానీ ఆయన ఉద్యమం అంతా హిందువులను సంస్కరించడం పైనే దృష్టి సారించింది కానీ ఈ స్థాయి ప్రయత్నం ఉద్యమం అప్పటి ముస్లిములలో జరగలేదని కాబట్టి గాంధేయవాదం ఈ దేశాన్ని కట్టిపడేయటంలో విఫలమయ్యిందని అంటారు శరణ్.
చివరకు మనం అంతా మన కాళ్ళ మీద నిలబడాలనీ ఆర్ధిక సామజిక అభివృద్ధి కోసం మన సమాజం ముందుకు వెళ్లాలంటే మనం అంతా కలిసి ఉండాలి అన్న లౌకికపరమైన ఐకమత్య భావన ఆధారంగా స్వతంత్ర భారత సృజన జరిగిందని అంటారు శరణ్.
ఇక్కడే గాంధేయవాదంతో కాంగ్రెసుకు వచ్చిన మరొక భిన్నాభిప్రాయం గురించిన ప్రస్తావన వస్తుంది. గాంధీ హిందూ మతంలోని తాత్విక మూలాల ఆధారంగా క్రైస్తవ భావనలను ఇస్లామును కలుపుకుని పోయి మతం విషయంలో ఒక విశ్వజనీనమైన ఐకమత్యాన్ని గురించి కలగన్నాడు. ఆ విషయంలో ఇందాక చెప్పినట్టుగా ఆయన విఫలమయ్యాడు. అలాగే పాశ్చాత్య ఆర్ధిక విధానానికి నాగరికతకు వ్యతిరేకంగా ఆర్థికపరమైన విషయాలలో గ్రామాన్ని కేంద్రంగా భావించి జాతి పునర్నిర్మాణం కావాలని తాపత్రయపడ్డాడు. అయితే ఈ వాదాన్ని నెహ్రూనే కాదు అంబేడ్కర్ వంటి వారు కూడా తప్పుబట్టారు. గ్రామం వెనుకబాటుతనం నుంచి విముక్తి పారిశ్రామీకరణ పట్టణీకరణలో ఉందని పట్టణాలలో అభివృద్ధిని స్వేచ్ఛను దర్శించారు వారు. ఈ క్రమంలోనే స్వతంత్ర్యానంతరం నెహ్రు అధ్యక్షతన భారత దేశాన్ని ఆధునీకరించాలి అన్న భావన లౌకికీకరణ అన్న భావనతో పాటుగా బయలుదేరింది. అయితే ఈ ప్రయాణంలో హిందూ మతం పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న రావచ్చును. లౌకికవాదం పూర్తిగా మతాన్ని కాలదన్నలేదు. హిందూ సమాజాన్ని పూర్తిగా పాశ్చాత్యీకరించాలి అన్న తపనను కూడా వ్యక్తం చేయలేదు. అయితే దేశం అభివృద్ధి చెందాలి అంటే హిందూ మతాన్ని వదులుకోనక్కర్లేదు కానీ హిందూ మతాన్ని సంస్కరించుకుంటే చాలు అన్న భావం మాత్రం బలంగా వ్యక్తీకరించబడింది.
విచిత్రం ఏమిటంటే రాజ్యం ఈ సంస్కరణ భావం హిందువుల విషయంలో మాత్రమే చూపింది. హిందూ కోడ్ బిల్ విషయంలో ఇది తేటతెల్లం అయ్యింది. హిందువుల పర్సనల్ లా మాత్రమే సంస్కరణకు గురైంది. కానీ ముస్లిములకు మినహాయింపు లభించింది. ఇది భారతీయ లౌకికవాదంలోని ఒక విచిత్ర కోణం. లౌకికవాదం అంటే మతపరమైన విషయాలలో నిష్పాక్షికంగా ఉండాలి కానీ ఈ విషయంలో సాధ్యపడలేదు. ఆధునికీకరణ అనేది వ్యక్తి యొక్క ఆటోనమీని కాంక్షిస్తుంది. అంటే మనిషి సర్వ స్వతంత్ర జీవి అన్న భావన నుంచే ఆధునికీకరణ మొదలు. ఈ ఆధునికీకరణ అన్నది లక్ష్యంగా భావించే లౌకికవాద రాజ్యం ఖచ్చితంగా మతపరమైన విషయాలలో నిష్పాక్షికంగా ఉండాలేదు. అది మతాన్ని సంస్కరించటానికి ఉవ్విళ్ళూరుతుంది. పోనీ సాంఘిక విషయాలలో మత ప్రమేయం ఉండకూడదు మతపరమైన విషయాలలో రాజ్యం ప్రమేయం ఉండకూడదు ఈ సిద్ధాంతం అనుగుణంగా ఆధునీకరణ జరుపుదాం అన్నా కూడా అది క్రైస్తవంతో చెల్లిందేమో కానీ హిందూ మతంతో ఇస్లాంతో చెల్లదు. ఇలా ఇది మతపరమైన విషయం ఇది సెక్యులర్ విషయం అని విభజించటమే మతాన్ని ఎదిరించటం అవుతుంది. కాబట్టి ఇలా చూసినా కూడా రాజ్యం మతం విషయంలో నిష్పాక్షికంగా ఉండటం అన్నది కుదరదు.
నిజానికి రాజ్యం అంటే నేషన్ స్టేట్ దృష్టిలో ఈ ఆధునికీకరణ అన్నది చాలా బలమైన ఎజెండా. హిందూ లా విషయంలోనే ఇది ప్రస్ఫుటం అయ్యింది. ఇది మతపరమైన విషయం ఇది లౌకికం అన్న విభాగాన్ని కూడా ఆధునికీకరణ నిరసిస్తుంది. ముఖ్యంగా హిందూ ధర్మం విషయంలో. నిజానికి కర్మ సిద్ధాంతం అన్నది ఆర్ధిక ప్రగతికి అడ్డంకిగా ఉందని ఆ సిద్ధాంతాన్ని పూర్తిగా పక్కకు తీసివేయటమో లేదా దాని స్థానే మరొక కొత్త సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తేవాలి అన్న కాంక్ష ఆధునికీకరణ వాదంలో బలంగా కనపడుతుంది. ఆధునీకరణ విషయంలో ఈ సంఘర్షణల గురించిన చింతన అంతగా కనపడదు మన మేధావులలో అంటారు శరణ్. ఆయన ఈ విషయాలు రాసిన 70ల దశకం లోనే ఇది లేనప్పుడు మన కాలంలో అసలుకే లేదని అనచ్చునేమో. మనలో చాలామందికి మతమంటే ఇంట్లో చేసుకునే పూజలు వారానికి ఒకసారి వెళ్ళే మొక్కుబడి గుడి దర్శనం అంతే. సాంఘికపరమైన విషయాలలో మతాన్ని మనం ఎప్పుడో వద్దనుకునేశాం. ఇలా ఆధునికీకరింపబడుతూ నాస్తికం వైపుగా ప్రయాణం చేస్తున్నామా అని ఆలోచించటం కూడా ఆపేశాం దాదాపుగా.
మానవతా విలువలకు అనుగుణంగా ఆర్ధిక సామజిక వ్యవస్థల అభివృద్ధి అనేది ఒక టోటల్ సిస్టం అంటే దానికదే పూర్ణమైన ఒక భావజాలం. అటువంటి భావజాలానికి ఇస్లాం లేదా హిందూ మతం అనే భావజాలానికి సమన్వయము కుదరదు. ఎందుకంటే ఇస్లాం అయినా హిందూ మతం అయినా వేటికవే టోటల్ సిస్టమ్స్ అంటే వేటికవే పరిపూర్ణమైనవి. ఒక సంపూర్ణమైన భావజాలం మరొక సంపూర్ణమైన భావజాలాన్ని తనలో తాను ఇమడ్చుకోలేదు. ఏదో ఒకటి మరొక దానిపైన ఆధిపత్యం ప్రదర్శించాల్సే వస్తుంది. మన విషయంలో లౌకికీకరణ ఆధునికీకరణ అనే భావజాలం మతం మీద ఆధిపత్యం చలాయిస్తుంది. చాలా మందికి ఈ వైరుధ్యం అర్థమే అవదు. నిజానికి లౌకికవాదంలో భాగంగా అటోనామీ ఆఫ్ మేన్ అనే భావనను అందరు ఒప్పుకున్నట్టే అనిపిస్తుంది మన లౌకికీకరణ ఆధునికీకరణ విధానాలను చూస్తే. అంటే మనిషి మాత్రమే ఉన్నాడు ఇంద్రీయాలకు అతీతమైన ప్రపంచం దాని తాలూకా ఊహ మాకు అక్కర్లేదు అని తీర్మానించినట్టే అనిపిస్తుంది.
అయితే దీనికి విరుద్ధంగా మరొక భావన కూడా వినిపిస్తూ ఉంటుంది భారతీయులలో. అది సమన్వయ వాదం అంటే సింథసిస్. అంటే మనం ఎంత లౌకికీకరించబడినా కూడా ఆధునికీకరించబడినా కూడా మనలోని భారతీయ విలువలకు వచ్చే నష్టం ఏమీ లేదు మనం వాటినన్నిటినీ కాపాడుకుంటూనే ఆధునికులం అవుతాము అన్న వెర్రి నమ్మకం. ఈ గుడ్డి నమ్మకం మూలంగానే ఆధునికీకరణ గురించిన విమర్శనాత్మక చింతన టెక్నాలజీకి సమాజం విపరీతంగా దాసోహం అవ్వటం వల్ల వచ్చే నష్టం గురించిన చింతన మితిమీరిన లౌకికీకరణ గురించిన చింతన మనలో పెద్దగా కనపడదు లేదా కనపడాల్సినంతగా కనపడదు. అయితే ఈ సమన్వయం సాధ్యమే అన్న నమ్మకం ఏదో పామరులకు మాత్రమే గల అపోహ కాదు. వివేకానందుడు అంతటివాడే ఇలా అన్నాడు ఇరవయ్యో శతాబ్దపు తొలినాళ్ళలో
“Can you make a European society with India’s religion. I believe it is possible, and must be” అంటే భారతీయ (హిందూ?) మత భావనల ఆధారంగా యూరోపు సమాజం వంటిదాన్ని సృజింపవచ్చునా అనే ఊహ చేశారాయన. అది కచ్చితంగా సాధ్యమే. మనం తక్షణమే ఆ దిశగా ప్రయత్నం చేయాలి అని అన్నారాయన.
అసలుకైతే ఈ లౌకికీకరణ ఆధునికీకరణ అనేది ఈశ్వర భావనను ఇంద్రియాతీత ప్రపంచమనే భావనను పరలోక భావనను కాదనింది కాబట్టి ఈ ప్రాజెక్టు పరిధి పెరిగే కొద్దీ మతం పరిధి తగ్గుతూ చివరికి మతం అంతర్ధానం అయిపోతుంది అన్నది ఒక వాదన. లేదు లేదు అలా కాదు లౌకికీకరణ ఆధునికీకరణ జరిగినా కూడా ఇలా కొన్ని విలువలు ఏవో నిలబడతాయి అని అనుకున్నా కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. సరే ఈ ఆధునికీకరణ అన్న ప్రాజెక్టు పూర్తి అయ్యాక కొన్ని సాంప్రదాయ విలువలు నిలబడ్డాయి అనే అనుకుందాం. ఈ ఆధునీకరింపబడిన భారతంలో మిగిలిన విలువలు హిందూ సాంప్రదాయ విలువలా లేక ముస్లిం సాంప్రదాయ విలువలా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. వీటిలో ఏదో ఒకదానికి సమాధానము అవును అని చెప్పినా కూడా లౌకికవాదం అంటే ధర్మ నిరపేక్షత అన్నదానికి ఆటంకం ఏర్పడుతుంది. శరణ్ గారు రాసిన 70ల కాలంలోనే కాదు ఇప్పటికీ ఎవరికీ అర్థం కానీ బ్రహ్మ పదార్థం ఈ లౌకికవాదం మరియు అది నెత్తినపెట్టుకున్న ఆధునికవాదం. ముఖ్యంగా ఈ భావాజాలానికి దాసోహమైన భారత దేశంలో సామాజిక జీవనంలో మతం లేదా ధర్మం పాత్ర ఏమిటి అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఎవరి దగ్గరా లేదు.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఇప్పుడొక కొత్త వాదం మొదలైంది. అసలీ కష్టాలన్నీ కూడా నెహ్రూ సోషలిజంను పట్టుకున్నందుకు వచ్చింది. అసలుకైతే ఆధునికీకరణ సరిగ్గా జరగాలంటే క్యాపిటలిజమే కరెక్టు. రాజ్యం – మార్కెట్టు అనే రెండు శక్తివంత శక్తులు చేతులు కలిపితే అందరికీ అనంత సుఖాలు ప్రాప్తమవుతాయి అనేవారు కూడా పుట్టుకొచ్చారు ఇప్పుడు. ప్రొఫెసర్ శరణ్ ఈ విషయాలను చర్చిస్తూ మార్క్సు భావజాలాన్ని ఆడమ్ స్మిత్ భావజాలాన్ని కూడా కూలంకషంగా చర్చిస్తారు. మాన్ అండ్ ప్లాన్ మధ్య ఉన్న టెన్షన్ గురించిన ప్రస్తావన చేస్తారు ఇక్కడ. అంటే ఒక వైపు వ్యక్తి స్వేచ్ఛకు పట్టం కడతాము అంటూనే సామజిక అభివృద్ధి విషయంలో ఒక ప్లానింగ్ అంటే ప్రణాళికాబద్ధమైన వ్యవస్థ ఉండాలి అని రాజ్యం తాపత్రయ పడుతుంది. ఈ మ్యాన్ అండ్ ప్లాన్ మధ్యన ఉండే రాపిడిని మనం అర్థం చేసుకోవాలి అని అంటారు శరణ్.
ఇలా లౌకికవాద సోషలిస్టు రాజ్యమైనా సరే లేదా ఫ్రీ మార్కెట్టు వ్యవస్థ మీద ఆధారపడిన సమాజమైనా సరే మనిషి యొక్క పరిపూర్ణ జీవనాన్ని శుద్ధ ఇహలౌకిక సిద్ధాంతాలకు అనుగుణంగా నిర్దేశించటం అన్నది సాంప్రదాయ దృక్కోణానికి పూర్తిగా విరుద్ధమైన ఆలోచన. అది హిందూ సంప్రదాయం దృష్టితో చూసినా సరే లేదా ఇస్లాం దృష్టితో చూసిన సరే. సోషలిస్టు సమాజంలో భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా ప్రస్తుత కాలపు వస్తు ఉత్పత్తి మరియు వినియోగం అనేవి నిర్దేశింపబడతాయి. ఫ్రీ మార్కెట్టు సమాజంలో ప్రోడక్టు మాత్రమే కాదు కన్స్యూమర్ అనే వాడు అంటే వినియోగదారుడు కూడా నిరంతరం సృష్టింపబడుతూ ఉంటాడు. అంటే సోషలిస్టు సమాజంలో అయినా కూడా క్యాపిటలిస్టు సమాజంలో అయినా అవసరాలు అనేవి నిరంతరం ఒక ప్రణాళికకు అనుగుణంగా సృజింపబడతాయి అని. అంటే వ్యాపారస్తుల లాభాపేక్షను అనుసరించి లేదా ప్రభుత్వం వారి ప్రణాళికలను అనుసరించి కొత్త కొత్త అవసరాలు సృష్టింపబడుతూ ఉంటాయి. అయితే ఇలా సృష్టింపబడుతున్న అవసరాలలో ఏది న్యాయమైన అవసరం ఏది అన్యాయమైనది అనే చింతన ఈ వ్యవస్థలో స్వతః లేదు. ఈ తాత్విక భూమిక ఈ లౌకికవాద వ్యవస్థలకు ఎక్కడి నుంచి రావాలి ? ధర్మాన్ని మతాన్ని కాదనుకున్నాక వాటికి విలువలు ఎక్కడి నుంచి వస్తాయి అన్నది ప్రశ్న. లౌకికవాదంలో కూరుకుపోయిన వ్యవస్థలకు విలువల దగ్గరకు వచ్చే సరికి మళ్ళీ మతమో ధర్మమో లేదా మతం ధర్మం వంటిది ఇంకేదోనో అవసరమవుతుంది.
అయితే ఇలా అన్నిటిని ప్రశ్నించుకుంటూ వెళితే ప్రశ్న వైజ్ఞానిక ప్రగతి దగ్గరకు వచ్చి ఆగుతుంది. ఈ లౌకికీకరణ ఆధునికీకరణ అంతా కూడాను కొత్త టెక్నాలజీలు పుట్టుకు వస్తాయి అవి మన పేదరికాన్ని దూరం చేస్తాయి అందరం ప్రగతి సాధిస్తాము అన్న నమ్మకానికి అనుగుణంగానే నడుస్తూ ఉంటాయి. ఒకవేళ టెక్నాలజీ వలన ఏదన్నా అనుకోని అవాంతరం ఎదురైనా కూడా ఆ సమస్యను అధిగమించటానికి మరొక టెక్నాలజీ వస్తుంది. దానివల్ల వచ్చే కష్ట నష్టాలను మరొక టెక్నాలజీ సరిచేస్తుంది. ఇది ఒక అనంతమైన టెక్నాలజీ ప్రవాహం. ఇది ఒక కల్పన లేదా ఊహ టెక్నాలజీ సమాజాల విషయంలో మన సామాజిక జీవనం గురించి.
అయితే ఇలా మనిషి స్వేచ్ఛకు కళ్ళెం వేయకుండా నీ స్వేచ్ఛకు హద్దులు లేవు నీ ఇష్టమొచ్చిన టెక్నాలజీ నువ్వు సృష్టించుకుంటూ వెళ్ళు అంటే కుదరదు. అప్పుడు ఆ టెక్నాలజీ వల్ల పుట్టుకొచ్చే నష్టాలు అనర్థాల విషయంలో దానిని కనిపెట్టిన మానవుడనే సృష్టికర్తకు బాధ్యత ఉండదు. కాబట్టి మనిషి స్వేచ్ఛకు కళ్ళెం వేయాలి. దానికి మానవాతీతమైన సిద్ధాంతాలు అంటే ఈశ్వర భావన. పరలోక భావన. పుణ్యం పాపం కర్మఫలంల గురించిన చింతన వంటి వాటి గురించిన ఊహ కావాలి. అప్పుడిక సైన్సు టెక్నాలజీ ప్రగతి అని గుడ్డిగా ముందుకు వెళ్తాము అంటే కుదరదు. ఆ సైన్సు టెక్నాలజీలను కూడా ఈ మానవాతీత సిద్ధాంతాలకు తలోగ్గేలా చూడాలి. అంటే మన సిద్ధాంతాలకు అనుగుణంగా సైన్సును టెక్నాలజీని మార్చాల్సి వస్తుంది. సైన్సు టెక్నాలజీ గమనానికి అనుగుణంగా సిద్ధాంతాలను మారుస్తాము అంటే కుదరదు.
అయితే ఇటువంటి వాదనకు రెండు ప్రధాన ఆక్షేపణలు ఎదురవుతాయి అని అంటారు శరణ్. నెహ్రూ కాలం నాటి లౌకికవాదాన్ని ఆధునికీకరణను మనం తప్పు పట్టకూడదు. ఎందుకంటే అవన్నీ లేకపోతే మన పేదరికం పోయేది ఎలాగూ. అందరికి తిండి గుడ్డ గూడు దొరికేది ఎలాగా. ఈ ఆధునికీకరణ లౌకికీకరణ మీద ఆధారపడిన అభివృద్ధి విధానం కాకుండా మీ దగ్గర పేదరికాన్ని నిర్మూలించడానికి అలౌకికమైన మతపరమైన ఆధ్యాత్మిక విలువలతో కూడుకున్నదైన విధానం ఏదన్నా ఉందా అన్న ప్రశ్న వస్తుంది. అలాగే అప్పటికే కొంత ఆర్ధికంగా వెనకేసుకున్న అభివృద్ధి చెందిన సమాజాలలో ఇటువంటి విషయాలు లేవనెత్తితే ఇంకొక ప్రశ్న వస్తుందని అంటారు శరణ్. కెన్ వీ టర్న్ ద క్లాక్ బ్యాక్ అని అంటే గడియారాన్ని వెనక్కి తిప్పుదామని అనుకుంటున్నారా ఏమిటి అని. లేదా మరొక ప్రశ్న ఇలా ఉంటుంది. సైన్సు టెక్నాలజీ ద్వారా ఏదన్నా సమస్య వస్తే రావచ్చును కానీ మన మేధోశక్తిని ఉపయోగించి మరింత కొత్త రకం సైన్సు టెక్నాలజీ కనిపెట్టాలి అదే ఈ సమస్యకు పరిష్కారం. అంతకు మించి ఆధునిక టెక్నాలజీ మీద అతిగా ఆధారపడిన ప్రపంచపు సమస్యల నుండి బయటపడటానికి మీ దగ్గర వేరే ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా అని?
అంటే తన రకం వాదన వినిపిస్తే ప్రతిగా వచ్చే ప్రశ్నల గురించి ప్రస్తావించారు శరణ్ గారు. ఇది డెబ్భైలలోనే కాదు ఇప్పటికి కూడా సరిపోయే విషయమే. ఇప్పుడు కూడా ఇవే ప్రశ్నలు వస్తాయి. మతం గురించి మరీ ఛాందసంగా వాదిస్తే వారిని ప్రగతి నిరోధకులు అని అనటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ఆక్షేపణలు సమాధానంగా శరణ్ గారు ఇలా అంటారు.
భారతీయ దృక్పథం ప్రకారం కాలం గురించిన చింతన చాలా దూర దృష్టితో ఉంటుంది. ఇప్పటి సమస్యలు అవసరాలు కొన్ని ఉండచ్చును. వాటిలో కొన్ని సమస్యలను మనం ఎప్పటికీ నిర్మూలించలేకపోవచ్చు. కాబట్టి వీటన్నిటికీ దీర్ఘ కాలిక పరిష్కారాలను వెతకటమే సబబుగా ఉంటుంది భారతీయ దృక్పథం ప్రకారం. తాత్కాలిక పరిష్కారాలు పేరుకు తగ్గట్టే ఎక్కువ కాలం నిలబడవు. అలాగే ఇప్పటి అవసరాలకు తక్షణమే పరిష్కారం కావాలి అని అన్నా కూడా ఆ పరిష్కారాల విషయమై మతపరమైన నైతికపరమైన తాత్త్విక పరమైన ప్రశ్నలు అడిగాక వాటికి సముచితమైన సమాధానాలు లభించాకే పరిష్కారం వైపు అడుగువేయాలి. అదే సాంప్రదాయ దృక్కోణం.
ఇక రెండవ ఆక్షేపణ విషయం అంటే సైన్సు టెక్నాలజీ విషయం. ఇప్పుడు ఆ ప్రశ్నలోనే సమాధానం ఉన్నదనుకోండి అంటే ఎలాగూ ఈ టెక్నాలజీ ప్రపంచానికి మనం తలొగ్గక తప్పదు దీనికి ప్రత్యామ్నాయం లేదు అన్న తీర్మానం చేసేసి ఈ ప్రశ్న అడిగితే అప్పుడు అది నిరుపయోగమైన ప్రశ్న. చర్చ కూడా అనవసరం. అయితే ఇలా కాకుండా నిజంగా ప్రత్యామ్నాయాల గురించిన చింతనతోనే ఈ ప్రశ్న వేసినట్లయితే అప్పుడు చర్చ చేయవచ్చును. ఇప్పటి కాలపు టెక్నాలజీ ప్రపంచపు సమస్యలకు ధార్మికమైన తాత్వికమైన పరిష్కారాలను కనిపెట్టే దిశగా ప్రయత్నం చేయవచ్చు. అయితే ఏదో ఒకవిధంగా రాజీపడటమో సర్దుకుపోవటమో మాత్రమే సమాధానం కానక్కర్లేదు. ప్రతిఘటన కూడా సమాధానం కావచ్చును అని అంటారు శరణ్.
ఇది కేవలం ప్రొఫెసర్ శరణ్ గారు రాసిన “On the theories of secularism and modernization” అన్న పుస్తకంలోని మొదటి 75 పేజీలకు విస్తృత వ్యాఖ్యానం. వీలు చూసుకుని శరణ్ గారి రచనల గురించిన పరిశీలనాత్మక వ్యాసాలు మరికొన్ని వ్రాస్తాను. ఎప్పుడో యాభై ఏళ్ళ కిందటి వ్యాసాలలో ఆయన సంధించిన ప్రశ్నలకు ఇంకా మన కాలంలో సరైన సమాధానాలు లేవు. అందుకనే ఇటువంటి ఆలోచనాధారను మన కాలంలో కూడా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. హిందూ ధర్మం గురించిన చింతన గలవారు ఇస్లాము గురించి క్రైస్తవం గురించి మాత్రమే కాదు లౌకికీకరణ ఆధునికీకరణ గురించి కూడా ఆలోచించాలి. ఆ దిశగా మన భారతీయ మేధావుల ఆలోచనలను పరిచయం చేసే ప్రయత్నమే ఇది. ఆయన పుస్తకాల కొనుగోలుకు సంబంధించిన లంకె https://www.adityaprakashan.com/index.php?String=Saran%20AK&p=sr&Field=author. ఏ కే శరణ్ గారి ఆలోచనలను ఆనంద కుమారస్వామి గారి ఆలోచనలను కలిపి విశ్లేషించిన మరొక పుస్తక పరిచయం ఇక్కడ https://sanchika.com/re-membering-tradition-ak-coomaraswary-and-ak-saran-book-intro/