[box type=’note’ fontsize=’16’] విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘Fireflies’ కవితా సంపుటిని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ ముకుంద రామారావు. [/box]
61
నామీద నేనే నవ్వుకుంటే
నా బరువు నాకే తేలికవుతుంది
62
శక్తిహీనులు ఆగ్రహంతో
శక్తిమంతుల్లా కనిపించడానికి ప్రయత్నిస్తారు గనుక
వారు ఘోరంగా విఫలమవుతారు
63
స్వర్గం గాలికి
ప్రాణాలకు తెగించి బురదని గట్టిగా పట్టుకుంటుంది లంగరు
సంకెళ్ల మీద దాని రొమ్ములు బాదుకుంటుంది నా పడవ
64
మరణం స్ఫూర్తి ఏకం
జీవితం స్ఫూర్తి అనేకం
దేవుడు మరణిస్తే మతం ఏకమవుతుంది
65
ఆకాశపు నీలం, భూమి పచ్చదనం మీద ఆశపడుతుంది
వాటి మధ్య గాలి అయ్యో అని నిట్టూరుస్తుంది
66
దినం బాధ దాని ప్రకాశంతో కప్పబడి
రాత్రి నక్షత్రాల మధ్య మండుతుంది
67
దాని ఏకాంతాన్ని ఎన్నడూ తాకలేని
విస్మయ నిశ్శబ్దంలో
నక్షత్రాలు, రాత్రి కన్య చుట్టూ గుమికూడతాయి
68
మేఘం తన బంగారాన్నంతా
వీడ్కోల సూర్యునికిచ్చేసి
ఉదయిస్తున్న చంద్రునికి
పాలిపోయిన నవ్వుతో అభివాదం చేస్తుంది
69
ఎవరైతే మంచి చేస్తారో వారు గుడి ద్వారం దగ్గర కొస్తారు
ఎవరైతే ప్రేమిస్తారో వారు గర్భగుడిని చేరుకుంటారు
70
తుమ్మెద కాని పురుగు మీద
జాలిపడుతుంది పుష్పం
దాని ప్రేమ ఒక అపరాధం, ఒక భారం
71
తీవ్రవాద విజయాల శిధిలాలతో
వాళ్ల బొమ్మలకు ఇల్లు కడతారు పిల్లలు
72
పగలంతా దాని అలక్ష్యాన్ని సహిస్తూ
రాత్రి జ్వాల చుంబనం కోసం
దీపం నిరీక్షిస్తుంది
73
ధూళిలో బద్దకంగా పడున్నాయి ఈకలు
తృప్తిలో వాటి ఆకాశాన్ని మరచిపోయి
74
ఏకాకి అయిన పుష్పం
అసంఖ్యాక ముళ్లను చూసి
అసూయపడాల్సింది లేదు
75
శ్రేయోభిలాషుల నిరాసక్త నిరంకుశత్వంతో
ప్రపంచం చాలా నష్టపోతుంది
(మళ్ళీ వచ్చే వారం)