మరో మనిషి

0
3

[dropcap]”అ[/dropcap]మ్మా! ఈ కమల చూడు, నా గది లోకి వచ్చి, నన్ను చదువుకోనివ్వకుండా విసుగిస్తోంది!” ఏడేళ్ల వయసున్న పనిమనిషి కూతురు గురించి తల్లికి పిర్యాదు చేసాడు సుమారు అదే వయసున్న ఫణి.

“పోనీలేరా! పాపం, దానికి మటుకు ఆడుకోవడానికి ఎవరున్నారు? నువ్వు తప్ప” కొడుకును సముదాయించింది సుభధ్ర.

“చూడు, సుభద్రా! వాడు అన్నాడని కాదు కానీ, నువ్వు ఆ పనిమనిషి కూతురికి మరీ ఎక్కువ చనువు ఇస్తున్నావోయ్! ఎక్కడ ఉంచవలసిన వాళ్ళని అక్కడ ఉంచాలి. సరే ఇకనుంచైనా, ఆ పిల్లని మన గదుల్లోకి రాకుండా ఆ ఔట్ హౌస్ లోనే ఆడించుకోమని ఆ పనిమనిషి గంగికి చెప్పు” కొంచెం సీరియస్ గానే చెప్పాడు రంగనాథ్.

“ఔనండీ, మీరన్నది నిజమే! ఈ రోజే చెప్తా!!” అంటూ ఆ సంభాషణకు అంతటితో ముగింపు పలికి, ఒంటింట్లోకి వెళ్లింది సుభధ్ర.

***

కాలగమనంలో, గోడ మీద మూడు సంవత్సరాల కేలండర్లు మారాయి. ఓ రోజు,

“అమ్మగారూ, మా కమల కూడా ఫణి బాబులా చదువుకుంటాను అని ఒకటే గొడవపెడుతోంది. నాకు కూడా దానిని పెద్ద చదువులు చదివించాలని ఉంది. అయ్య గారికి చెప్పి, ఏదో ఏర్పాటు చేయండమ్మా!” ఇల్లు ఊడుస్తూ, సుభధ్రకి మొరపెట్టుకుంది గంగ.

“ఏమోనే! ఆయన ఒప్పుకుంటారో, లేదో? అసలు దాని పేరెత్తితేనే ఆ తండ్రీకొడుకులు కయ్యిమని లేస్తున్నారు నా మీద. అయినా ఈ వయసులో దానిని బడికి పంపడం అవసరమా?” దగ్గరుండి గదిని తుడిపిస్తూ చెప్పింది సుభధ్ర.

“ఏదో ప్రైవేటుగా కట్టి చదువుకోవచ్చుట కదమ్మా??”

“సరే, నా ప్రయత్నం నేను చేస్తా! నన్నడిగితే దానికి శుభ్రంగా అన్ని పనులు నేర్పి, పెళ్లి వయసు రాగానే ఓ అయ్య చేతిలో పెట్టి, నీ భారం దింపుకోవడం మంచిదని నా అభిప్రాయం” భర్త ఎలాగూ ఒప్పుకోడని తెలిసి, గంగను ముందుగానే సన్నద్ధం చేసింది సుభధ్ర.

ఆ రోజు సాయంత్రం, హాలులో కూర్చున్న భర్తకు కాఫీ అందిస్తూ,

“ఏమండీ! పాపం మన పనిమనిషి కూతురు కమల, చదువు కుంటానని ఒకటే మారాం చేస్తోందిటండీ. పోనీ ఏదైనా హాస్టల్లో వేయించి చదివిద్దామా?” గోముగా అడిగింది సుభధ్ర.

“చూడు సుభద్రా! మా బంధువు,అదే డాక్టర్ శ్రీదేవి చెప్పడం మూలంగా, మూడునెలల పసిగుడ్డును తీసుకుని, తనకు ఎవరూ లేరని, ఏదైనా పని చూపించమనీ వచ్చిన ఈ గంగను, సరే అని జాలిపడి, పని మనిషిగా ఉండమని, మన ఔట్ హౌస్‌లో ఆశ్రయమిచ్చాం. ఆ సమయంలో నీకు కూడా ఒంట్లో బాగాలేక పోవడంతో ఓ పనిమనిషి అవసరం పడడంతో, అలా మన అవసరం, గంగ అవసరం రెండు కూడా తీరాయి. అంతే చెల్లుకు చెల్లు. అక్కడితో సరిపెట్టు” వ్యాపార ధోరణిలో చెప్పాడు రంగనాథ్.

“కానీ, పాపం పది సంవత్సరాలుగా మన ఇంట్లో పనిమనిషి గా కాకుండా బద్దకించకుండా ఓ మరమనిషిగా పని చేసింది కదండీ! అంతేకాక కిందటేడాది మన ఫణిగాడికి దెబ్బ తగిలి రక్తంపోతే, ఏమీ ఆలోచించకుండా వెంటనే రక్తదానం కూడా చేసింది” తను కూడా కాఫీ తాగుతూ, చెప్పింది సుభధ్ర.

“ఇదిగో చూడు, పనివాళ్ళను నెత్తికెక్కించుకోవద్దని నీకు గతంలో కూడా చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు చూడు, నీ మంచితనం అలుసుగా తీసుకుని ఎలాంటి కోరికలు కోరుతోందో? ఇప్పుడు చదువు అంటుంది, రేపు ఆ పిల్ల పెళ్లి ఖర్చులు కూడా మననే పెట్టుకోమంటుంది….” భర్త చెబుతున్న మాటలు వినలేక ఖాళీ కాఫీ గ్లాసులు తీసుకుని లేచింది సుభధ్ర.

వెనుకగది నుండి ఒంటింట్లో అంట్లు తోమడానికి వచ్చిన గంగ, ఆ సంభాషణ అంతా విని, సుభధ్ర ఒంటింట్లోకి రాకముందే, మౌనంగా అక్కడ నుంచి నిష్క్రమించింది, భారమైన మనసుతో.

***

కాలచక్రం కింద ఇంకో పది సంవత్సరాలు నలిగి పోయాయి.

“ఏంటమ్మా! ఏం జరిగింది? ఎందుకు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసారు? నాన్న గారు బాగానే ఉన్నారా? ఔట్ హౌస్ దగ్గర ఆ జనం ఏమిటి?” గుమ్మంలోనే ప్రశ్నల వర్షం కురిపించాడు, పట్నంలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతూ, తల్లి ఫోన్ చేయడంతో నాలుగు గంటలు ప్రయాణం చేసి హడావుడిగా ఇంటికి వచ్చిన ఫణి.

“అంతా బాగానే ఉన్నాంరా! పాపం మన గంగకి ఒంట్లో బాగాలేక, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతే నాలుగు రోజుల క్రితం మన శ్రీదేవి ఆంటీ హాస్పిటల్లో జాయిన్ చేసాం. ఈరోజు మధ్యాహ్నం కొంచెం స్పృహలోకి వచ్చింది”

“ఏంటమ్మా! పనిమనిషికి ఒంట్లో బాగాలేక పోతే నన్ను రమ్మనడం దేనికి?”

“మెలకువ రాగానే అందరినీ పేరు పేరునా అడిగిందిరా! నిన్ను ఓ సారి చూడాలని నీ కోసం కొట్టుకుంది. అందుకే నీకు ఫోన్ చేసా! కానీ ఆ తర్వాత కొద్ది సేపటికే ప్రాణాలు వదిలేసింది” రోదిస్తూ చెప్పింది సుభధ్ర.

“ఔనా? పాపం కమలను అనాథను చేసి పోయిందన్నమాట!” అంటూ భుజాన ఉన్న బేగ్ పక్కన పడేసి, ఫ్రెష్ అవ్వడానికి వాష్ రూమ్ లోకి వెళ్లాడు ఫణి.

***

మర్నాడు ఉదయం, గంగ ఆఖరి ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

“బాబూ ఫణీ! నా మాట కాదనకుండా ఓ పని చెయాలి. నువ్వు చేస్తానంటేనే చెబుతాను” సెల్ ఫోన్‌లో మెసేజులు చూసుకుంటున్న కొడుకును ఆర్ద్రతగా అడిగాడు రంగనాథ్.

“నాన్నగారూ, నన్ను రిక్వెస్ట్ చేయడం ఏమిటి? ఆర్డర్ వేయండి. ఏ పనైనా చేస్తా!”

“అయితే, మన గంగకి దహనసంస్కారాలు అన్నీ నువ్వే చేయి” గంభీరంగా చెప్పాడు రంగనాథ్.

“ఏమిటి నాన్న గారూ! ఆఫ్ట్రాల్ ఓ పనిమనిషికి నేను చెయ్యడం ఏమిటి?”

“లేదు బాబూ! గంగ పనిమనిషి మాత్రమే కాదు. ఇరవై ఏళ్లుగా మన ఇంట్లోనే ఉంటున్న మనమనిషి. మన సొంత మనిషి. నిన్ను మీ అమ్మ కంటే తనే ఎక్కువగా చూసుకుంది. అంతే కాదు, నీకు రెండు మూడు సార్లు రక్తం కూడా దానం చేసింది. బలవంతం ఏమీ లేదు. నువ్వు కాదంటే చెప్పు, వాళ్ల అమ్మాయి కమల చేత ఈ సంస్కారాలు జరిపిస్తా” ఆఖరి మాటగా చెప్పాడు రంగనాథ్.

తండ్రి మాట కాదనలేక, అయిష్టంగానే రంగంలోకి దిగాడు ఫణి.

“అయ్యో, అయ్యో తల్లి తండ్రులు బతికుండగానే ఆ కుర్రాడి చేత అపరకర్మలు చేయిస్తారా? అవి కూడా ఓ పనిమనిషికి?”

గుసగుస లాడుకున్నాయి కొన్ని ఛాందస గొంతులు, రంగనాథ్ వైపు చూస్తూ .

“హూ.. మీ దృష్టిలో మాత్రమే, ఆమె పని మనిషి. మా దృష్టిలో మాత్రం ఆమె మహామనిషి. మా కుటుంబానికి చేసిన ఆమె సేవలకు మేము ఏమిచ్చినా ఆ ఋణం తీర్చుకోలేము. ఈ అపరకర్మలు ఓ లెక్కా?” అని మనసులో అనుకుంటూ, వారి వైపు తీక్షణంగా చూస్తూ, నిన్న సరిగ్గా ఇదే సమయానికి జరిగిన ఓ సంఘటనను తిరిగి మననం చేసుకున్నాడు రంగనాథ్.

***

“రంగనాథ్ అన్నయ్యా! నేను డాక్టర్ శ్రీదేవిని. గంగ పరిస్థితి ఏమీ బాగాలేదు, కొంచెం అటూ ఇటూగా ఉంది. స్పృహలోకి వస్తోంది. మళ్లీ కాసేపటికే స్పృహ కోల్పోతోంది. అర్జెంటుగా నువ్వూ, వదిన ఓ సారి బయలుదేరి వస్తే బాగుంటుంది” ఫోన్ వినగానే సుభద్రని తీసుకుని హాస్పిటల్ కి బయలుదేరాడు రంగనాథ్.

రంగనాథ్ దంపతులను చూడగానే, తన గదిలోకి తీసుకుని పోయిన డాక్టర్ శ్రీదేవి, వారితో,

“మీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలి. అందుకే రమ్మన్నాను. ఈ విషయం ఇంతవరకు నాకూ, మా నర్సు సుశీలకు తప్ప ఎవరికీ తెలియదు” ఏదో రహస్యం చెప్పడానికి అన్నట్టు కుర్చీని వారి దగ్గరకు లాక్కుంది శ్రీదేవి.

“ఏ విషయమమ్మా? సస్పెన్స్‌లో పెట్టక చెప్పు. అసలు మా పనిమనిషి గంగకు ఎలా ఉంది?” విసుగ్గా అడిగాడు రంగనాథ్.

“అదే అన్నయ్యా! సుమారు ఇరవై ఏళ్ళ క్రితం, మన ఫణి పుట్టినప్పుడు, ఆ రోజు ఉదయమే నువ్వు సుభధ్రని తీసుకుని హాస్పిటల్‌కు వచ్చి, “చెల్లాయ్ ఒదినకి ఇంకా నెలలు నిండలేదు కానీ , ఉదయం నుండి కొంచెం అన్ఈజీగా ఉంది అంటోంది. నేను ఇప్పుడు బయలుదేరి బిజినెస్ పనిమీద అర్జెంటుగా మద్రాసు వెళ్లాలి. ఇప్పటికే మూడు సార్లు గర్భశోకం అనుభవించాము. ఈ సారైనా ఓ పండంటి బిడ్డను మా చేతుల్లో పెట్టమ్మా!” అని చెప్పి వెళ్లావు జ్ఞాపకం ఉందా?”

“ఔను, జ్ఞాపకం ఉంది. ఆ సాయంత్రమే కదా నువ్వు మా మద్రాసు ఆఫీసుకు ఫోన్ చేసి చెప్పావు! అబ్బాయి పుట్టాడని!” చెప్పాడు రంగనాథ్.

“ఔనన్నయ్యా! కానీ పుట్టిన ఆ అబ్బాయి మీ అబ్బాయి ఫణి కాదు”

“శ్రీదేవీ, ఏమిటి నువ్వు అంటున్నది?” ఉలిక్కిపడి ఒక్కసారిగా అడిగారు సుభధ్ర, రంగనాథ్ దంపతులు.

“ఔను. సుభధ్రకు నాలుగో సారి కూడా మృతశిశువే పుట్టేడు. ఈ విషయం తెలిస్తే మీరు ఇరువురూ తట్టుకోలేరని నాకు తెలుసు”

“అయితే ఫణి నాకు పుట్టిన బిడ్డ కాదా?” ఎంతో బాధతో అడిగింది సుభద్ర.

“నీ బిడ్డ కాదు ఒదినా! కానీ, నీకు తెలివివచ్చే సమయానికి భగవంతుడు మా నర్సు సుశీల రూపంలో మీకు ఓ సహాయం చేసాడు. అది ఎలాగంటే, అదే రోజు ఉదయం తన పక్కింట్లో ఉన్న గర్భిణీ అయిన గంగను డెలివరీ కోసం మన హాస్పిటల్‌కు తీసుకుని వచ్చింది మా నర్సు సుశీల”

“గంగ అంటే మా పనిమనిషి గంగేనా?” ఆశ్చర్యంగా అడిగాడు రంగనాథ్.

“ఔను, ఆ గంగే ఈ గంగ. పాపం, కట్టుకున్న భర్త ఓ యాక్సిడెంట్‌లో పోయాడు. అప్పటికే ఈమె ఆరో నెల గర్భిణి. డెలివరీ కోసం తీసుకుని వచ్చిన రోజున, నేను మన సుభధ్రకి జన్మించిన మృతశిశువు గురించి, మీరు పడుతున్న పుత్ర శోకం గురించి మా సుశీలకు చెప్పగానే ఆమె ఓ చక్కటి సలహా ఇచ్చింది” చెప్పడం ఆపి, టేబుల్ మీద ఉన్న గ్లాసులో ఉన్న మంచినీళ్లు తాగి, తిరిగి చెప్పడం మొదలెట్టింది డాక్టర్ శ్రీదేవి.

“ఆ సలహా ఏమిటంటే, “మేడమ్, మనం గంగకు జరిపిన పరీక్షలో ఆమె కడుపులో కవలలు ఉన్నారని తెలిసింది కదా! కొద్ది సేపట్లో ఆమెకి ఎలాగైనా డెలివరీ అవుతుంది. భగవంతుని దయవల్ల అన్నీ అనుకూలంగా జరిగితే, ఆ కవల పిల్లలలో ఒకరిని, సుభధ్రగారికి పుట్టిన శిశువుగా మార్చేద్దాం. అలాగే గంగకు, ఒక మృత శిశువు, ఒక మామూలు శిశువు జన్మించారు అని చెబుదాం! ఎందుకంటే గంగకు ఇద్దరు పిల్లలను పోషించే ఆర్థిక స్తోమత కూడా లేదు. మీరు ఇంక పాపం పుణ్యం గురించి ఆలోచించకండి మేడమ్. ఇలా చేయడం వలన రెండు కుటుంబాలకు మేలు చేసిన వాళ్ళం అవుతాము” సుశీల చేసిన ఈ సూచనతో గంగకు పుట్టిన కొడుకును మన సుభధ్రకు పుట్టిన కొడుకుగా మార్చేసాము. ఆ కుర్రాడే మన ఫణి” చెప్పడం ఆపింది డాక్టర్ శ్రీదేవి.

“అయితే, ఫణి, కమల ఇద్దరూ కవలలా? ఇద్దరూ గంగ పిల్లలా?” కన్నీటిని దిగమింగుకుంటూ అడిగింది సుభధ్ర.

“ఔను. ఆ ఇద్దరూ కవలలు. ఆ తరువాత ఓ మూడు నెలలు మా హాస్పిటల్ లోనే ఆమెకు ఆశ్రయం కల్పించి, నేను చేసిన పనికి నాకు కొంచెం సాంత్వన చేకూరేలా గంగను, కమలను మీ ఇంట్లో ఏదైనా పని కల్పించమని మీ ఇంటికి చేర్చాను. ఈ విధంగానైనా పిల్లలు ఇద్దరినీ చూసుకొనే అవకాశం గంగకు లభిస్తుందని” చెప్పడం ఆపింది శ్రీదేవి.

“ఇదేదో సినిమా స్టోరీలా ఉంది చెల్లాయ్!” అన్నాడు రంగనాథ్, కణతలు రుద్దుకుంటూ!

ఈలోగా …”డాక్టర్, ఆ పేషెంట్ గంగ స్పృహలోకి వచ్చింది. తొందరగా రండి” అంటూ పరుగెట్టుకొచ్చింది ఓ నర్సు.

“సరే, వస్తున్నా!” అని ఆమెకు చెప్పి, “ఇప్పుడు మీరిద్దరూ చెప్పండి. ఏం చేస్తారు? ఆఖరి ఘడియల్లో ఉన్న గంగకు, ఫణి తన కొడుకే అని చెబుతారా?” అంటూ కుర్చీ లోంచి లేచింది డాక్టర్ శ్రీదేవి.

“అయ్యో, తప్పకుండా చెబుతాం!”అంటూ ఆందోళనగా డాక్టర్ ని అనుసరించారు ఆ దంపతులు.

హాస్పిటల్ రూమ్ లో బెడ్ మీద నీరసంగా పడుకుని శూన్యం లోకి చూస్తోంది గంగ. పక్కనే కళ్ళలో నీళ్ళు తుడుచుకుంటూ మౌనంగా రోదిస్తోంది కమల.

“గంగా! ఇలా చూడు. నేను సుభద్రను. ఒక్కసారి నన్ను చూడు. అదిగో మీ అయ్యగారు” అంటూ గంగ మొహం మీద సున్నితంగా అదుముతూ, కమలను దగ్గరకు తీసుకుని , గంగ తలను తనవైపు తిప్పుకుంది సుభధ్ర.

నెమ్మదిగా తల తిప్పిన గంగ, కుడి చేతిని పైకి లేపి, కమల చేతిని ఆ దంపతులు చేతిలో పెట్టి, ఎవరి కోసమో ఎదురు చూస్తున్న చూస్తున్నట్టు గుమ్మం వైపు భావ రహితంగా చూడసాగింది, మసకబారిన కళ్లతో.

వెంటనే తేరుకున్న సుభధ్ర, “ఏమండీ! మన ఫణి కోసం చూస్తోందేమోనండీ. మీ ఫోన్‌లో ఉన్న వాడి ఫొటో నాకు ఇవ్వండి. నేను చూపిస్తా ! ఈలోగా మీరు కమలను కాసేపు బయటకు తీసుకుని వెళ్ళండి” భర్తకు సలహా ఇచ్చింది.

ఫణి ఫొటోను గంగకు చూపిస్తూ, ఆమె చెవిలో, నెమ్మదిగా,

“గంగా! మా ఫణి ఎవరో కాదు. నీ కొడుకే! స్వయంగా నీ రక్తం పంచుకుని పుట్టిన ఇద్దరు కవల్లలో ఒకడు. ఈ రహస్యం నాకు ఇప్పుడే తెలిసింది. మా వలన ఏదైనా పొరబాటు జరిగుంటే మటుకు మమ్మల్ని క్షమించు. ఇకముందు కూడా మీ బిడ్డలు ఇద్దరినీ కంటికి రెప్పలా, కన్నబిడ్డలకంటే ఎక్కువగా చూసుకుంటాను” అంటూ గంగను హత్తుకుని, గంగ కంటిదగ్గరగా సెల్ పెట్టి, ఫణి ఫొటోను చూపించింది సుభధ్ర.

కన్నీటి పొరల మధ్యే ఫణి ఫొటోను చూసిన తరువాత గంగ కళ్లలో వచ్చిన మెరుపు అక్కడే ఉన్న డాక్టర్ శ్రీదేవి కంట్లో పడింది. ఆ తరువాత ఓ పావుగంటకే సుభధ్ర చేతిలో తల వాల్చేసి, ఈ లోకం నుంచి శెలవు తీసుకుంది గంగ.

***

“అమ్మా! నన్ను ఒంటరిని చేసి వెళ్ళి పోయావా?” అంటూ తల్లి మృతదేహం మీద పడి బిగ్గరగా విలపిస్తున్న కమల మాటలతో ఉలిక్కిపడి వాస్తవం లోకి వచ్చాడు రంగనాథ్.

“ఎవరి ఇంట్లో అయినా పనిమనిషి ఇంటి పనులు చేస్తుంది. అంతే! కానీ మా గంగ? వీటితో పాటు మా ఇంట్లో ఓ దీపం వెలిగించింది” అని మనసులో అనుకుంటూ, తల్లి మృతదేహం వద్ద రోదిస్తున్న కమల తల నిమురుతూ,

“చూడు కమలా! ఈ రోజు నుంచి నువ్వు ఒంటరివి కాదు. నీకు ఈ రోజు నుంచి మేమే అమ్మా నాన్నలం. నీ బాగోగులు అన్నీ ఫణి అన్నయ్య చూసుకుంటాడు. మీ అమ్మ కోరిక ప్రకారం నిన్ను బాగా చదివించే పూచీ నాది” అంటూ ఆ అమ్మాయిని ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్నాడు రంగనాథ్.

ఇవేమీ తెలియని ఫణి, నాన్నకు ఈ ఛాదస్తం ఏమిటో? ఈ పనిమనిషికి తను అంత్యక్రియలు చేయడం ఏమిటో? అని మనసులో అనుకుంటూ, తనకు తెలియకుండానే తన కన్నతల్లి మృతదేహం ముందు నడుస్తున్నాడు.

ఈలోగా, ఎక్కడో దూరం నుంచి రేడియోలో

“ఈ జీవన తరంగాలలో

ఆ దేవుని చదరంగంలో

ఎవరికి ఎవరు సొంతమూ

ఎంతవరకీ బంధమూ”

అనే పాట మంద్రస్థాయిలో వినిపిస్తోంది.

“ఇంతకీ, ఈ చదరంగం ఆడింది నేనా? లేక ఆ దేవుడే నా చేత ఆడించాడా?” అని మనసులో అనుకుంటూ, పనిమనిషిగా ఈ ఇంటికి వచ్చి, మహామనిషి రూపంలో ఉన్న గంగ పార్థివ దేహానికి మౌనంగా అంజలి ఘటించింది అప్పుడే వచ్చిన డాక్టర్ శ్రీదేవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here