[box type=’note’ fontsize=’16’] తెలుగువారి అభిమాన రచయిత్రి ‘బలభద్రపాత్రుని రమణి’ రచించిన ‘వైకుంఠపాళి’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]
[dropcap]”చి[/dropcap]న్నప్పుడా?” అడిగాడు శశిధర్.
“చిన్నప్పుడైతే అనుకోవడానికేముందీ? ఇప్పుడే… మొన్నామధ్య వేసవిలో ఒకత్తే పైన పడుకుందిట. అప్పుడేమో ఆయనొచ్చి దాని పక్కలో పడుకునీ… ఎందుకులెండి… దానికేమీ తెలీదు. అమాయకురాలని చెప్పానుగా…” అని ఆపేసింది.
శశిధర్ ముఖంలో భావాలు మారాయి. “చెప్పండి… ఆ తర్వాతేం జరిగిందీ?” అన్నాడు.
“ఎంతైనా నా చెల్లెలు… దాని తెలివితక్కువతనాన్ని నేనెలా బయటపడేసుకోను చెప్పండీ, అదీ రేపు కట్టుకోబోయేవాడితో…” అని అతని ముఖంలో భావాలు గమనించింది మాళవిక.
ఇంతలో నందిని కాఫీలు తీసుకొచ్చింది.
“తీసుకోండి…” అంది మాళవిక.
“నందినీ… నాతో ఒకసారి బయటకి రా… నీతో మాట్లాడాలి” అన్నాడు శశిధర్.
“మీతోనా… నాన్నగారేమంటారో?” నసిగింది నందిని.
శశిధర్ లేచి నిలబడి ఆమె చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టుకోబోయాడు. ఆమె ఠక్కున చెయ్యి వెనక్కి లాక్కుంది.
“ఏం అలా వెనక్కి లాగేసుకున్నావ్? నేనంటే ఇష్టం లేదా…” మాళవిక కేసి చూస్తూ అడిగాడు.
నందిని సిగ్గుగా “పెళ్ళి అయ్యేదాకా ఎంత యిష్టమైనా కొన్ని కట్టుబాట్లలో వుంటేనే గౌరవం కదా!” అంది.
శశిధర్ – ఆశ్యర్యంగా ఇదంతా చూస్తున్న మాళవిక వైపు చూసి నవ్వాడు.
“ఆగండి, నాన్నగారిని అడిగి వస్తాను” అంది నందిని.
“అక్కర్లేదు. నీలాగే నేనూ సాంప్రదాయాన్నీ గౌరవాలనీ పాటిస్తాను. ఇంటి గౌరవాన్ని కాపాడడానికి చదువును మధ్యలోనే ఆపి పెళ్ళిచూపులకి చాప ఎక్కిననాడే నీ మర్యాదా, మన్ననా నాకర్థం అయ్యింది. జస్ట్ ఇప్పుడు నాతో పాటు మిగతా వాళ్ళకి కూడా అది అర్థం అవ్వాలని పరీక్షించాను అంతే!” అని మాళవికని చూసి హేళనగా నవ్వాడు.
నందినికి ఏమీ అర్థం కాక, “పరీక్షా, ఎందుకూ?” అంది.
శశిధర్ నవ్వేసి, “తర్వాత చెప్తాను గానీ… చాలా పనులున్నాయి… నే వెళ్ళొస్తా…” అన్నాడు.
మాళవిక మొహం నల్లగా మాడిపోయింది.
కిటికీలోంచి నందిని నవ్వు మొహం కనిపిస్తోంది.
శశిధర్ వెళ్ళలేక వెళ్ళలేక వెళ్తున్నట్టు స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు.
నందిని వెలుగుతున్న ముఖంతో ఇంట్లోకి వచ్చింది.
“అదృష్టవంతుల్ని ఎవరూ చెడపలేరమ్మా” చిన్న కూతురి తల నిమురుతూ అన్నాడు తండ్రి. అల్లుడి జీతం విషయం ఆయనకూ చాలా సంతోషాన్ని కలుగజేసింది.
మరునాడు నందినిని పెళ్ళికూతురుని చేసారు. తల్లి మిగిల్చిన ఒక్క ఆనవాలూ అయిన జాజిపిందెల నెక్లెసు నందినికి పెట్టారు. నందిని పట్టుచీరలో పూలజడలో ధగధగలాడుతూ కనిపించింది.
మాళవిక ఆరోజు అందరినీ తప్పించుకోవడానికి ప్రొద్దుటే బయటకు వెళ్ళిపోయింది.
***
“నా మనసేం బాగాలేదు” అంది వాసుదేవరావుతో.
“అది బాగుపడే మంత్రం నా దగ్గరుంది” అన్నాడు.
“మూడ్ లేదు” అంది.
“మూడ్ తెప్పించే మందు ఇస్తాను” అన్నాడు.
ఆ రోజు అతనితో కలిసి మాళవిక మొట్టమొదటిసారిగా త్రాగింది. తాగుడులో నిషాని తనివితీరా అనుభవించింది.
సాగర్, శశిధర్ అందరూ తనని తిరస్కరించినట్లూ వెక్కిరిస్తున్నట్లూ అనిపిస్తోంది. వాళ్ళు తనని చూసి కుళ్ళుకునేట్లు చెయ్యాలి. చాలా గొప్ప పేరు తెచ్చుకోవాలి… ఎలా? ఆమెకి స్ఫురించింది… కీర్తీ, పేరూ, డబ్బూ సంపాదించాలి.
ఆమె వాసుదేవరావుతో చెప్పింది. “నాకు అర్జెంటుగా పేరు కావాలి. ఆ తర్వాత డబ్బు ఎలా సంపాదించాలో నాకు తెలుసు. పేరు సంగతి చెప్పు చాలు!”
వాసుదేవరావు నవ్వి, “అర్జెంటుగా నీ కవితల సంపుటి ప్రచురించాలి. దానికో గొప్ప రాజకీయ నాయకుడినో, సినిమా ఏక్టరునో పిలిచి హంగామా చెయ్యాలి. ఆ తరువాత ఈ సంవత్సరం ఉత్తమ కవితా సంకలనంగా ఎవార్డు తెప్పించాలి. అందులో రెండు వివాదాస్పద కవితలుండేట్లు చూసి గొడవలు చేయించాలి. అసరమైతే కోర్టు సమన్లు కూడా అందేట్లు చూసుకోవాలి. దాంతో పాపులారిటీ దానంతట అదే వచ్చి పడుతుంది. నీ పేరు ఆంధ్ర దేశం అంతటా మార్మ్రోగిపోతుంది. నువ్వు మన పత్రికలో వాదాల్ని పెంచుతూ ఇంటర్వ్యూ ఇవ్వాలి. దాని మీద వాదప్రతివాదాలు ఓ శీర్షిక పెట్టి సీరియల్‍గా ప్రచురించాలి. దాంతో నువ్వు ఈ శతాబ్దపు రచయిత్రివి అయి కూర్చుంటావు” అన్నాడు.
అతను చెప్తుంటే ఆమె అవన్నీ వూహించేసుకుంది. గబుక్కున అతని చేతిని పట్టుకుని “ఆలా జరగాలంటే ఏం చెయ్యాలి?” అంది.
“డబ్బు కావాలి. కనీసం ఓ ఇరవై వేలన్నా కావాలి” అన్నాడు.
ఆమె ముఖంలో నిరుత్సాహం ఆవరించింది.
వాసుదేవరావు ఆమెను దగ్గరకి తీసుకొంటూ “మీ నాన్న నీకు యాభై వేలు ఖర్చు పెట్టి పెళ్ళి చేయడానికి రెడీ అయ్యాడు. ఈ మాత్రం డబ్బు ఇవ్వలేడా?” అన్నాడు.
“ఇవ్వడు” అంది.
“అయితే కష్టం!” అన్నాడు.
మాళవిక ఆలోచిస్తూ వుండిపోయింది.
***
మాళవిక ఇంటికి వెళ్ళేసరికీ అందరూ నిద్రపోతున్నారు, ఆమె తండ్రి తప్ప!
“ఇప్పటిదాక ఎక్కడ తిరిగొచ్చావే?” అని ఆయన గర్జించాడు.
మాళవిక నిలబడలేనట్లు తూలిపోతూ “నా ఇష్టం! అడగడానికి నువ్వెవరు?” అంది.
“నేనెవరా?” అంటూ ఆయన ముందుకొచ్చి, ఆమె నుంచి కొట్టిన వాసనకి అలాగే నిశ్చేష్టుడై నిలబడిపోయి, “నువ్వు… నువ్వు… తాగావా?” అన్నాడు.
“ఏం? నీకూ కావాలా?” తూలిపోతూ గోడ ఆసరా చేసుకొని అడిగింది.
“నోర్ముయ్!” అని అంతలోనే గొంతు తగ్గించి, “ఇంట్లో బంధువులున్నారు… గొడవ చెయ్యకుండా వెళ్ళి పడుకో!” అని పళ్ళ బిగువన కోపాన్ని అదిమిపెట్టాడు.
“అలాగే! నేను బుద్ధిగా వుండాలంటే నాకు అర్జెంటుగా ఇరవై వేలు కావాలి!” అంది.
“చచ్చినా ఇవ్వను” ఖరాఖండీగా చెప్పాడు.
“నీ చిన్న కూతురికైతే ఇస్తావు కానీ నాకియ్యవా? అటు నే కోరిన సంబంధం తెచ్చి పెళ్ళీ చెయ్యలేవు… ఇటు డబ్బూ ఇవ్వవా? ఊరుకుంటాననుకున్నావా?” వేలు ఆడిస్తూ అడిగింది.
దాంతో ఆయన నిగ్రహించుకోలేకపోయాడు. “నాకే వేలు చూపిస్తావటే? దరిద్రపు మొహమా… నా పరువు తీయడానికే పుట్టావే నువ్వూ… నీకూ నా బంగారు తల్లికీ పోలికా?” అంటూ జుట్టు పట్టుకుని లెంపలు వాయించాడు.
“ఆగు… ఆగు…” అంది.
ఆయన ఆగలేదు.
ఆయన వూహించనంతటి వేగంతో, ఎదురుతిరిగి ఆయన చెంప అదిరేటట్లు కొట్టింది.
ఆయన అవాక్కయి వుండిపోయాడు.
“ఈడొచ్చిన కూతురికి ఏం కావాలో అది తెలుసుకోలేవు, కానీ కొడ్తావా? మొగుడు కొట్టినా పడడు… తండ్రి కొట్టినా పడదు. తెలుసుకో” అని హుంకరించింది.
ఆయన ఏం మాట్లాడలేనంత నిస్సత్తువతో చెంప పట్టుకొని చూస్తుండిపోయాడు.
మంచం మీద నుండి ఆయన జబ్బు తల్లి “ఏం జరిగిందిరా ప్రకాశం?” అని అరుస్తోంది.
ఆయన నెమ్మదిగా ఆవిడ పక్కలో కూలబడి, ఆవిడ పాదాల మీద ముఖం ఆన్చి జరిగినదానికి కుమిలి కుమిలి ఏడ్చాడు.
***
పెళ్ళివారు తరలి వచ్చారు.
ప్రకాశరావు లేని ఓపిక తెచ్చుకుని తిరుగుతున్నాడు.
“నాన్నా… నాన్నా…” అంటూ నందిని గాభరాగా వచ్చి పిలిచింది.
ఆయన ఆమె కళ్ళల్లో కంగారు చూసి, “ఏమైందమ్మా? మాల ఏం చేసుకోలేదు కదా!” అని భయంగా అడిగాడు. రాత్రి అయిన గొడవ తర్వాత ఆయన పెద్ద కూతుర్ని చూడలేదు. అనవసరంగా దాన్ని రొస్టు పెడ్తున్నానేమో అని ఆలోచించి కన్నీళ్ళు పెట్టుకున్నాడు కూడా!
“దానికేం కాలేదు కానీ… ” నందిని తండ్రికి చెప్పాలా వద్దా అన్నట్లు భయంగా చూసింది.
“ఆఁ… ఏం జరిగిందీ?” ఆతృతగా అడిగాడాయన.
“ఇంట్లో వున్న బంగారం, నా నగలూ అన్నీ పోయాయి నాన్నా” అని నందిని భోరున ఏడ్చింది.
ప్రకాశరావు స్థాణువే అయ్యాడు.
“ఇది తప్పకుండా…” అని నందిని సందేహంగా ఆగిపోయింది.
“మాళవిక పనే!” ఆయన పూరించాడు.
ఆయనకి రమామణి తనతో “నాకు పోయినది వస్తువే… కానీ మీకు అంతకన్నా విలువైనది పోతుంది మీ కూతురి వల్ల” అనడం గుర్తొచ్చింది.
“అక్క ఇలా చివరికి…” అంటున్న నందిని నోరు మూసి, “గట్టిగా అనకు! కడుపు చించుకొంటే కాళ్ళ మీద పడిపోతుంది” అన్నాడు.
నందిని ఏడుపు మింగేసింది.
మాళవిక గదిలో ఆమె బట్టలతో సహా ఏమీ మిగల్చకపోవడం వాళ్ళు గమనించారు.
ప్రకాశరావు రామ్మూర్తిని చాటుగా పిలిచి జరిగిన సంగతి వివరించాడు. కూతురి పనేనని మాత్రం చెప్పలేదు.
“దొంగతనమా! ఇంకా నిలబడ్డారేం? పోలీసు రిపోర్టు ఇవ్వండి” అన్నాడు రామ్మూర్తి.
“వద్దండీ! ఎవరో అయినవాళ్ళే అయ్యుంటారు. ఎందుకొచ్చిన నిష్ఠూరాలు?” అన్నాడు ప్రకాశరావు.
“ఎక్కడో సత్యకాలపు మనిషిలా వున్నారండీ మీరూ?” అన్నాడాయన.
ఇద్దరూ కలిసి కాసేపు మంతనాలాడుకున్నాకా రామ్మూర్తికి ప్రోనోటు వ్రాసిచ్చి ప్రకాశరావు అప్పటికప్పుడు నందినికి గొలుసూ, గాజులూ కొనగలిగాడు! పెళ్ళి జరిగిపోయింది.
ప్రకాశరావుకి ఎప్పుడూ రానిది భార్య మీద చెప్పలేనంత కోపం వచ్చింది. కూతురి దొంగబుద్ధి తనకి కూడా తెలియకుండా దాచిపెట్టినందుకు!
***
మాళవిక కవితా సంకలనం ఆవిష్కరించబడింది.
ఆ రాత్రి సంకలనాన్ని ఆవిష్కరించిన పెద్ద మనిషి నుండి ఆమెకు కబురొచ్చింది.
మాళవిక ఆ సినిమా నటుడ్ని కలుసుకోవడానికి వెళ్ళింది.
ఆయన ఎదురొచ్చి తన పర్సనల్ రూం లోకి ఆహ్వానించాడు. అంతటి గొప్ప నటుడు తనకి చూపిస్తున్న గౌరవానికి ఆమె వుబ్బితబ్బిబ్బయింది. ఆ తర్వాత షరా మామూలే… ఆయన ఆమెతో తన పరిచయం మరువలేనిదనీ, ఆ సాన్నిహిత్యం తన ఒంటరితనాన్ని దూరం చెయ్యాలనీ కోరిక వ్యక్తం చేశాడు.
మాళవికకి ఒక్కసారిగా తన మీద తనకే ఎనలేని కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఆయనకి స్నేహహస్తం అందించింది. లైఫ్‌లో ఇదో పెద్ద అఛీవ్‍మెంట్ అనుకుంది.
ఆ తర్వాత చాలా పరిచయాలయ్యాయి. చాలామంది ఆమె స్నేహం కోసం పరితపించిపోయారు. స్నేహహస్తాల స్కేర్సిటీ ప్రపంచంలో ఇంతగా వుందా? అని ఆశ్చర్యపడింది.
వాసుదేవరావు ఆమె కోసం చాలా కష్టపడ్డాడు.
ఆమె కవితా సంపుటికి ఓ సంస్థ వారు ఉత్తమ సంకలనం బహుమతి ఇవ్వడానికి ఒప్పుకున్నారు.
మాళవిక పేరు అన్ని పత్రికలలో పెద్ద పెద్ద అక్షరాలలో వచ్చింది.
మాళవిక వాసుదేవరావు కౌగిలిలో కృతజ్ఞతతో కరిగిపోయింది.
ఆ మరునాడు ఆమెకు నీరజ దగ్గర్నుండి ఉత్తరం వచ్చింది.
“మాలా… ఈ ఉత్తరం ఫూర్తిగా చదువుతావని కూడా నేను అనుకోను. కానీ ఒక హితైషిగా వ్రాస్తున్నాను. సమాజంలో బలహీనతలని ఉపయోగించుకుని బలపడడం గొప్ప కాదు. బలహీనంగా వున్న సమాజంలోని బలహీనతల్ని పోగొట్టడానికి కృషి చేయడం వుత్తమ లక్షణం! నీ రచనల ద్వారా ఏం చెప్పదలచుకున్నావో దానికి పూర్తి విరుద్ధంగా నువ్వు జీవిస్తున్నావని అందరూ అంటున్నారు. ఓ స్త్రీ ఆస్తిని దోచుకుంటూ, అన్యాయంగా అనుభవిస్తూ ‘ఓ స్త్రీ మేలుకో’ లాంటి పుస్తకాలని వ్రాయడం ఆత్మవంచన. ఆత్మవంచన అన్నిటికన్నా అధమాధమైన పాపం! ఈ విషయం నువ్వు తెలుసుకునే రోజు దగ్గరలోనే వుంది. నేను ఏ విషయాన్ని ప్రస్తావిస్తున్నానో నీకు అర్థం అయ్యే వుంటుంది. సాహిత్యం అంటే సమాజానికి హితం చేసేది కానీ రెచ్చగొట్టేది కాదని నువ్వు తెలుసుకోవాలని నా కోరిక… – నీ నీరజ.”
మాళవిక ఉత్తరాన్ని పూర్తిగా చదివి, ‘బ్రతకడం చాతకాని ప్రతీ వాళ్ళూ నీతుల గోతుల్లో నిలబడి పైనున్న వాడి కాలు పట్టుకుని లాగడానికి చూస్తుంటారు. వేస్ట్ ఫెలోస్’ అనుకుని దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి డస్ట్ బిన్‍లో పడేసింది.
మాళవిక జీవితం ఆ తర్వాత వూహించని వేగంతో మలుపులు తిరిగింది. ఇల్లు కొంది. ఫ్లాట్ కొంది. అందులోకి ఫర్నిచర్ కొంది. ఫోన్ వచ్చింది. ఫోన్‍తో పాటే స్నేహాలు పెరిగాయి. పరపతుల సంఖ్యా పెరిగిపోయింది! ఆంధ్ర దేశంలో ప్రముఖ రచయిత్రైపోయింది.
సతీష్ చంద్ర పరిచయంతో తిరగడానికి కారు కూడా వచ్చింది. అతనికి డబ్బంటే లెక్క లేదు. అతనికి కావల్సింది ప్రేమ… దాని స్వరూపం, రుచీ, వాసనా అతనికి తెలీదు. మాళవిక పెదవుల మధువుల్లో దానిని కనుగొన్నాననుకొన్నాడు.
“ఓ సతీష్.. నువ్వు వారం రోజులు క్యాంప్ కెళ్తే నేనెలా బ్రతకడం? అరె..రే నా గుండె నీతో తీసికెళ్ళిపోతే ఎలా… అది కొట్టుకుంటేనేగా ఈ దేహం నిలిచేదీ!” లాంటి మాటలకి అతను పడిపోయాడు. ఆమెకు సర్వం అర్పించేయడానికి సిద్ధమయ్యాడు.
మాళవిక స్వర్గం అంటే ఇదే కదా అని ఆనందంగా జీవించేస్తుండగా ఆమె స్పీడ్‌కి బ్రేక్ పడింది!
ఓ పబ్లిక్ ఫంక్షన్‍లో నందిని కనిపించింది.
జనం మధ్యలోంచి “అక్కా…” అని పిలిచింది.
(ఇంకా ఉంది)