కశ్మీర రాజతరంగిణి-75

1
3

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

ఇతః పచృతి యః కశ్చిద్రాజ్యస్యాస్య గతౌజసః।
చక్రికామాత్ర సాధ్యత్వం జానన్నాశం కరిష్యతి॥
(కల్హణ రాజతరంగిణి 7, 1420)

[dropcap]ఒ[/dropcap]క పతివ్రత లాంటి పవిత్రమైన ఈ భూమిని నా వ్యక్తిత్వ లోపాల వల్ల నేను, ఎవరు పడితే వారు, ఎలాంటి దుష్టుడయినా, నీచుడయినా, బలవంతంగా అనుభవించే వేశ్యలా మార్చివేశాను.

మరణించే సమయంలో తురుష్క హర్షుడికి తన వంటి రాజులు కొన్ని వందల సంవత్సరాలుగా ధర్మం తప్పి చేస్తున్న దుశ్చర్యల దుష్ఫలితం అర్థమయింది. పార్వతి లాంటి కశ్మీరును దిగజార్చారు. శివాంశజుడయిన రాజును మ్లేచ్ఛుడిని చేశారు. తమ ధర్మం మరిచి పర ధర్మం మోజులో పడి, సంస్కారవంతుడయిన హర్షుడు, తురుష్క హర్షుడయ్యాడు. అనేక దుష్కార్యాలు చేశాడు. అయితే, చేసిన దుశ్చర్యల ఫలితం హర్షుడు  అనుభవించాడు, పోయాడు. కానీ కశ్మీర ప్రజలు తరతరాలుగా ఆ దుశ్చర్యల ఫలితం అనుభవిస్తూనే ఉన్నారు. ఇది కూడా హర్షుడు చివరి దశలో గ్రహించాడు. పవిత్రమైన కశ్మీరాన్ని ఎవరు పడితే వాడు రాజై అనుభవించే వేశ్యలా మార్చివేశానని బాధపడ్డాడు [చూ. ‘తురుష్క హర్షుడు’, కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, రచన కస్తూరి మురళీకృష్ణ].

సాధారణంగా విజ్ఞులు ఏదైనా పని చేసే ముందు దాని ఫలితాలను విశ్లేషించి అడుగు ముందుకు వేస్తారు. మూర్ఖులు ఫలితంతో సంబధం లేకుండా ముందుకు దూకుతారు. తరువాత తీరికగా విచారిస్తారు. కానీ అప్పటికే జరిగే అన్యాయం జరిగిపోతుంది. దాని దుష్ఫలితాలు భవిష్యత్తు తరాలు అనుభవిస్తాయి. ఆనాడు ఎవడికి బలం వుంటే వాడే అనుభవించే చందంగా కశ్మీరును దిగజార్చానని హర్షుడు పడిన బాధ ఈనాటికీ కశ్మీరు అనుభవిస్తోంది. తుపాకీ బలం, పశుబలం, రాక్షస బలంతో సామాన్యులను భయభ్రాంతులను చేసి, మనుషులతో క్రూరంగా వ్యవహరించి, వారిని గొర్రెలుగా భావించి అధికారం సాధించాలని ప్రయత్నిస్తున్నారు. ఆనాడు తురుష్క హర్షుడు నీరు పోసి పెంచిన విష బీజం ఈనాటికీ విష ఫలాలను అందిస్తూనే ఉంది. కశ్మీరులో విషం విరజిమ్ముతూనే ఉంది.

హర్షుడి మరణంతో కశ్మీర సింహాసనం ఉచ్ఛలుడికి దక్కింది అనే కన్నా ఉచ్ఛలుడు సింహాసనాన్ని గెలుచుకున్నాడు అనవచ్చు. క్రీ.శ.1100 సంవత్సరంలో హర్షుడు రాజ్యానికి వచ్చాడు. అప్పటికి భారతదేశం ఇంకా అధికంగా ఇస్లాంమయం అవలేదు. కానీ వారి ప్రభావంతో భారతీయ సామాజిక, మానసిక వ్యవస్థ మారుతోంది. శత్రువుని క్షమించి ప్రాణాలతో వదిలే ఔన్నత్యం మూర్ఖత్వంగా పరిగణనకు గురవుతోంది. నీతి నియమాలు, సత్ప్రవర్తన వంటివి సంకెళ్ళుగా భావించి త్రెంచుకోవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. జీవితాన్ని అనుభవించటం అంటే ఎదుటివాడిని దోచుకుని ఐశ్వర్యాన్ని, అధికారాన్ని సాధించటం అన్న దుష్టపుటాలోచనలు బలపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో రాజ్యాధికారానికి వచ్చిన ఉచ్ఛలుడు ఆరంభంలో సత్ప్రవర్తననను ప్రదర్శించాడు. కశ్మీరుకు మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయన్న ఆశను కలిగించాడు.

రాజ్యాన్ని పంచుకోవాలన్న ఆలోచన ఉన్న తమ్ముడు సుస్సలుడిని ‘లోహారం’ పంపించాడు. తనకు సహాయం చేసిన వీరుల దుష్ప్రవర్తనను సహిస్తూనే, వారి అహంకారపూరిత ప్రవర్తనను మార్చాడు. శత్రువునయినా క్షమించే సహనాన్ని ప్రదర్శించాడు. అలాగని రాజద్రోహం చేసే ఆలోచనలతో ఉన్నవారిని, రాజుతో అవమానంగా, నిర్లక్ష్యంగా ప్రవర్తించినవారినీ వదలలేదు. ఏ మాత్రం ద్రోహచింతన కనబరిచినా నిర్దాక్షిణ్యంగా చంపించాడు. అయితే, విచిత్రంగా, హర్షుడి కొడుకు భోజరాజు సంతానం అయిన రెండేళ్ళ వయసు కల భిక్షుచారుడిని శత్రువులా కాక సన్నిహితుడిలా భావించాడు. రక్షించాడు. ఆశ్రయమిచ్చాడు. భవిష్యత్తులో అతడు రాజ్యాధికారం కోసం తనతో పోటీ పడతాడన్న ఆలోచనకు తావివ్వలేదు ఉచ్ఛలుడు. డామరులు తనకు పోటీగా ఎదుగుతారన్న ఆలోచనతో వారి నడుమ పోరుపెట్టి వారిని బలహీనం చేశాడు. దేశంలోంచి చోరులందరని ఏదో ఓ వంకతో కశ్మీరు నుంచి వెడలనడిపాడు. ప్రజలపై అమితమైన ప్రేమ కురిపించాడు. ఎవరైనా అవసరమై ఒక నాణెం అడిగితే, వారికి రెండు నాణేలిచ్చి పంపేవాడు.

రాత్రిళ్ళు మారువేషంలో రాజ్యం అంతా తిరిగి ప్రజల బాగోగులు చూసేవాడు. ఎవరు తనను ఏ మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు అనుమానం వచ్చినా నిర్దాక్షిణ్యంగా వారిని అణచివేసేవాడు. ప్రజలు బలహీనంగా ఉండకూడదని వారికి తన భండారం నుంచి ధాన్యం అందించేవాడు.  ప్రజలంతా యోగ చేయాలని, వ్యాయామం తప్పనిసరిగా చేయాలని నిర్దేశించాడు. దాంతో కశ్మీరీ ప్రజలు బలంగా, ఆరోగ్యంగా, శక్తిమంతులుగా జీవించసాగారు. పండుగల సందర్భాలలో ప్రజలపై బహుమతుల వర్షం కురిపించేవాడు. దాన ధర్మాలు చేసేవాడు. కశ్మీరులో శిధిలమైన భవనాలను పునర్నిర్మించాడు. దేవాలయాలను పునరుద్ధరించాడు. ఉచ్ఛలుడు చేసిన ఓ గొప్ప పని ఏమిటంటే – సింహాసనంపై తనతో పాటు రాణిని కూర్చోబెట్టేవాడు. ‘రాజు ప్రజలకు తండ్రిలాంటి వాడు. వారిని రక్షించాలి’ అన్న ప్రాచీన సూత్రాన్ని నమ్మి ఆచరించేవాడు. నిరంతరం ఆ శ్లోకాన్ని వల్లె వేసేవాడు. అవినీతికి పాల్పడిన అధికారులను శిక్షించేవాడు. దాంతో రాజుకు భయపడి అధికారులు బుద్ధిగా తమ కర్తవ్యాన్ని నిర్వహించేవారు. ప్రజలు ఉచ్ఛలుడి పాలనలో సుఖంగా, సంతోషంగా ఉన్నారు.

హర్షుడి కాలంలో బూడిద అయిన మందిరాలను పునరుద్ధరించటంతో, కశ్మీరును వదిలివెళ్ళిన అదృష్ట దేవత తిరిగి కశ్మీరుకు వచ్చినట్టు అనిపించింది. ఉచ్ఛలుడు పండితులను గౌరవించాడు. దాంతో అన్ని రంగాలలో కశ్మీరు పునర్వైభవం సాధిస్తున్న భావన కలిగింది. తాను రాజుగా కాకముందు సత్ప్రవర్తనతో ప్రజలకు మేలు చేద్దామని ఆలోచించిన వాటన్నిటినీ ఉచ్ఛలుడు అమలు పరిచాడు. అయితే మంచిని వెన్నంటే చెడు ఉంటుంది. దీపం క్రింద చీకటి ఉంటుంది. అన్ని మంచి లక్షణాలతో ప్రజలను సంతోష పరుస్తున్న ఉచ్ఛలుడు అసూయా వ్యాధి పీడితుడయ్యాడు. దాంతో ప్రజల మెప్పు పొందినవారిని, ప్రజాదారణ పొందే వారిని హింసించటం ప్రారంభించాడు. వారు కోపంతో రాజును దూషించేవారు. హేళన చేసేవారు. మనుషులు నిద్రిస్తున్న సర్పాల వంటివారు. వారికి ఆవేశం కలిగితేనే విషం విరజిమ్ముతారు. దాంతో రాజు పట్ల విమర్శలు, హేళనలు వెల్లువయ్యాయి. ఉచ్ఛలుడు కూడా తన అధికారుల నడుమ గొడవలు పెట్టి వారు పోరాడుతుంటే చూసి ఆనందించేవాడు. సైనికుల నడుమ యుద్ధాల పోటీలు పెట్టేవాడు. వారు ఒకరినొకరు గాయపరుచుకుని చంపుకుంటుంటే  ఆనందించేవాడు. రక్తాలోడుతున్న వారి శరీరాలు ఉచ్ఛలుడికి పైశాచికానందాన్ని కలిగించేవి.

రాజభవనంలో అడుగుపెట్టటం అంటే మృత్యుముఖంలోకి వెళ్ళి రావటమన్నట్టే భావించే వారందరూ. ఎవరెవరికి తాను ఉన్నతాధికారాలు కట్టబెట్టాడో వారందరిని ఏదో ఓ వంకన అధికారాల నుంచి తొలగించి సంతోషించేవాడు. దాంతో ఉచ్ఛలుడికి అండగా నిలబడ్డవారూ, విధేయులై ఉన్నవారూ, తమ శౌర్యంతో ఉచ్ఛలుడికి విజయాన్ని సాధించిపెట్టిన వారందరూ కశ్మీరం వదిలి పారిపోసాగారు. తన మాట విననివారి పట్ల అసహనం ప్రదర్శించేవాడు ఉచ్ఛలుడు. దాంతో ప్రజలలో ఉచ్ఛలుడంటే అంతవరకూ ఉన్న అభిమానం నిరసనగా పరిణమించింది.

ఇదే సమయానికి కొందరు దుష్టులు సుస్సలుడిలో రాజ్యకాంక్షను ప్రేరేపించారు. జరుగుతున్నదేమిటో ఉచ్ఛలుడికి అర్థమయ్యే లోగా సుస్సలుడు కశ్మీరు దగ్గరి ‘వరాగం’ చేరుకున్నాడు. కశ్మీరు తలుపులు తట్టాడు. అయితే అనూహ్యమైన వేగంతో ఉచ్ఛలుడు, సుస్సలుడిని ఆశ్చర్యపరిచాడు. సుస్సలుడు తేరుకునేలోగా అతడి సైన్యాన్ని పారద్రోలాడు. ఈ యుద్ధంలో గగ్గ చంద్రుడు అమితమైన శౌర్యం ప్రదర్శించాడు. సుస్సలుడు మిగిలిన సైన్యంతో పారిపోవాల్సి వచ్చింది. ఉచ్ఛలుడు అతడిని వెంబడించాడు.

ఇది కూడా భారతీయులకు అలవాటు లేని కొత్త సంప్రదాయం. ‘నువ్వు రాజ్యం తీసుకో, అంటే, నువ్వు రాజువి కా’ అని అన్నదమ్ములు ఒకరి కోసం మరొకరు రాజ్యాన్ని త్యాగం చేయటం భారతీయుల సంప్రదాయం. అన్నను రాజుగా నిలిపి అవసరమైతే తమ్ముడు సంరక్షకుడిగా నిలవటం భారతీయుల జీవన విధానం. కానీ మ్లేచ్ఛ సంపర్కంతో అధికారం అనేది దైవదత్తమైన పవిత్ర బాధ్యత అన్న భావన అంతరించి, గెలుచుకున్న వాడిదే రాజ్యం, రాజ్యం అనుభవించటానికే అన్న దుర్భావన సమాజంలో వ్రేళ్ళూనుకుంది. దాంతో ‘త్యాగం’ ఉన్నతం అన్న భావన పోయి ‘అనుభవించటమే అసలు గొప్పతనం’ అన్న భావన సమాజంలో నాటుకుంది. ఫలితంగా ఏదో ఒక రకంగా ‘అనుభవించటమే’ పరమార్థం అన్న ఆలోచనతో ప్రజలు నీతి నియమం వదిలి ‘సౌఖ్యం’ వెంట పరుగులిడటమే ‘పరమపదం’ అన్నట్టు ప్రవర్తించసాగారు. ఇది చివరికి అధికారం కొసం అన్నదమ్ములిద్దరూ ఒకరిపై ఒకరు యుద్ధం చేసి, వేటాడి మరీ చంపుకునే స్థితికి దిగజారింది. మ్లేచ్ఛుల అలవాటుగా భావించి, అసహ్యంతో ఈసడించుకునే పద్ధతి భారతదేశంలో ఆనవాయితీ అయింది.

వెన్నంటి వస్తున్న ఉచ్ఛలుడి నుంచి తప్పించుకునేందుకు సుస్సలుడు తన అనుచరులతో దరదుల భూమికి పారిపోయాడు. సుస్సలుడికి పారిపోయే సమయంలో ఆశ్రయమిచ్చిన దరదులను, వారి కుటుంబాలను ఉచ్ఛలుడు హతమార్చాడు. ఈ రకంగా దరదుల రాజ్యం చేరుకుని దౌత్యంతో సుస్సలుడికే కాదు, తనకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న వారెవరికీ దరదులు, డామరులు ఆశ్రయం ఇవ్వకుండా చేశాడు ఉచ్ఛలుడు. సుస్సులుడు సైతం అతి కఠినమైన దారుల్లో దొంగతనంగా ప్రయాణిస్తూ, సురక్షితమైన ప్రాంతం చేరుకున్నాడు. ఈ రకంగా తనను వ్యతిరేకించిన వారందరినీ అణచివేసి రాజ్యం చేరుకున్న ఉచ్ఛలుడు అంతవరకూ తాను సంరక్షిస్తున్న భిక్షుచారుడిని సైతం చంపించాలని నిశ్చయించాడు. అతడి కాలికి బరువు కట్టి వితస్త నదిలో తోయించివేశాడు.

ఈ సందర్భంగా కల్హణుడు కొన్ని అత్యద్భుతమైన శ్లోకాలు రాశాడు. మనుషులు కుట్రలు, కుతంత్రాలు, జిత్తులతో అధికారం సాధించాలని ప్రయత్నిస్తారు. కానీ విధి రాతను ఎవ్వరూ మార్చలేరు.

మనిషి చేసే ప్రయత్నాలన్నీ గడ్డిలో నిప్పులాంటివి. గాలి అనే విధి ఆరిపోయే నిప్పును ఎగద్రోసి ప్రజ్వలింపజేస్తుంది. మరోచోట ఎగసే మంటను ఆర్పేస్తుంది. ఒక పక్షి ఎంత ఎత్తుకు ఎగిరినా, ఎంత దూరం ఎగిరినా తన తోక నుంచి ఎలా తప్పించుకోలేదో, మనిషి కూడా అలాగే విధి నిర్ణయం నుంచి తప్పించుకోలేడు. ఒక మనిషి ఎంత కాలం బ్రతకాలి, ఏమేం అనుభవించాలి అన్నది విధి నిర్ణయించిన తరువాత ఎవరెంత ప్రయత్నించినా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అతన్ని – వాయువులు, విషం, కత్తి, బాణాలే కాక, శిఖరం పై నుంచి తోసివేసినా అతడిని చంపలేరు. విధి నిర్ణయించినంత కాలం వ్యక్తి బ్రతికి తీరతాడు. విధి నిర్ణయించినవన్నీ అనుభవించి తీరతాడు.

బండరాయి కట్టి భిక్షుచారుడిని వితస్తలో విసిరేసినా, గాలి విపరీతంగా వీయడం వల్ల, నీటి ప్రవాహాన్ని అనుసరించి భిక్షుచారుడు ఒడ్దుకు కొట్టుకువచ్చాడు. అతడిని ఓ బ్రాహ్మణుడు రక్షించాడు. భిక్షుచారుడిని గుర్తించాడు. అతడిని ‘జయమతి’ అనే బంధువుకు అప్పజెప్పాడు. జయమతి, భిక్షుచారుడికి ఉచ్ఛలుడి నుంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి రహస్యంగా అతడిని కశ్మీరు నుంచి తప్పించింది. భిక్షుచారుడిని తీసుకుని దక్షిణ ప్రాంతం (దక్కను) వెళ్ళి తలదాచుకుంది.

కశ్మీర రాజవంశానికి చెందినవాడు దక్కనులో పెరిగాడన్న మాట. ఆమె దక్కను వెళ్ళటం ఎందుకంటే, ఉత్తర భారతమంతా ఆ సమయంలో తురుష్కుల తాకిడితో అల్లకల్లోలంగా ఉంది. అదీగాక, కశ్మీరుకు ఏ మాత్రం అందుబాటులో ఉన్నా, ఉచ్ఛలుడు భిక్షుచారుడిని ప్రాణాలతో వదలడు. కాబట్టి కశ్మీరుకు చాలా దూరంలో ఉన్న దక్కను ప్రాంతానికి భిక్షుచారుడిని తీసుకువెళ్ళింది ‘జయమతి’. మాల్వా రాజు ‘నరవర్మ’ భిక్షుచారుడికి ఆశ్రయం ఇచ్చాడు.

జయమతి భిక్షుచారుడిని రక్షించేందుకు అదే వయసున్న తన సంతానాన్ని సైనికులకు అప్పజెప్పిందని కొందరంటారు. నిజమేదయినా మాల్వా రాజు భిక్షుచారుడికి రక్షణ నివ్వటమే కాదు, అతడికి యుద్ధ విద్యలలో శిక్షణను కూడా ఇప్పించాడు. ఈ విషయం తెలిసిన ఉచ్ఛలుడు, మాల్వా నుంచి కశ్మీరం చేరే దారిలో ఉన్న ఇతర రాజులందరికీ భిక్షుచారుడికి దారి ఇవ్వకుండా ఒప్పందాలు చేసుకున్నాడు.  అసలు భిక్షుచారుడు చనిపోయాడని, జయమతి తన కొడుకునే భిక్షుచారుడని అందరినీ నమ్మిస్తోందనే వార్త కూడా ఆ కాలంలో ప్రచారంలోకి వచ్చింది. ఏది ఏమైనా భిక్షుచారుడనే పేరు గల వ్యక్తికి మాత్రం కశ్మీరు చరిత్రలో అత్యంత ప్రాధాన్యం లభించింది. గుబురు పొదల్లో నిప్పు రహస్యంగా ఎదిగి జ్వాలగా మారి ఊళ్ళను, నగరాలను పరశురామ ప్రీతి కావించినట్టు భిక్షుచారుడు మాల్వాలో రహస్యంగా పెరిగాడు. భగవంతుడి సృష్టిలో గొప్ప అద్భుతం ఉంది. విషం ఉన్నట్టే దానికి విరుగుడు ఉంటుంది. ఎండాకాలం వెన్నంటే వర్షాకాలం ఉంటుంది. నాశనం చేసే వాడి వెన్నంటే నిర్మాణం చేసే వాడుంటాడు. అలాగే, సుస్సలుడికి ఆ సమయంలో మునిగిపోతున్న కశ్మీరు అదృష్టాన్ని కాపాడేటటువంటి పుత్రుడు ‘జయసింహుడు’ ఉదయించాడు. పేరుకు తగ్గట్టు జయసింహుడు పుట్టినప్పటి నుంచి సుస్సలుడికి అంతటా జయం కలగసాగింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here