వేంకట పార్వతీశ్వర కవులు రాసిన పరమాద్భుతమయిన భావ కవిత్వ కావ్యం ఏకాంతసేవ. ఇది ప్రథమంగా 1919లో అనసూయ పత్రికలో ప్రచురితమయింది. పుస్తకరూపంలో తొలిసారిగా 1922లో ప్రచురితమయింది. ఎంతో ప్రఖ్యాతిపొంది ఉత్తమ కవిత్వానికి అత్యుత్తమ నిదర్శనంగా నిలచిన ఏకాంతసేవను (తొమ్మిదవ ముద్రణ) సరికొత్తగా, తాజాగా పుస్తకరూపంలో అందించి సంపాదకత్వం వహించిన మోదుగుల రవికృష్ణకు ఉత్తమ సాహిత్యాన్ని ప్రేమించేవారందరూ కృతజ్ఞతలు తెలపాల్సివుంటుంది. అతి చక్కని ముఖచిత్రంలో ఉన్నత ప్రామాణికాలు, ఉత్తమ విలువలు పాటిస్తూ చక్కని పరిచయ వాక్యాలందించారు రవికృష్ణ. ఏకాంతసేవ కావ్యంతో పాటూ, వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన కొత్తతలుపులు తెరచిన కావ్యం అన్న వ్యాఖ్య, దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి గారు రాసిన పీఠికలను పొందుపరచటం ఏకాంతసేవ కావ్యం గురించి తెలియని వారికి చక్కని అనుభూతినిచ్చే పరిచయం. అనుబంధంలో ఆరుద్ర, ఆచంట జానకీరాం, దేవులపల్లి, చిల్లర శేశగిరిరావు, సీ నారాయణరెడ్డి, బాలాంత్రపు రజనీకాంత రావు, నండూరి పాథసారథి, ఓలేటి పార్వతీశం వంటి ప్రముఖులు ఈ కావ్యానికి సంబంధించిన, ఈ కావ్య పఠనానుభూతిని వ్యక్తపరిచే రచనలను పొందుపరచటం బంగారానికి తావి అబ్బినట్టయింది. ఏకాంతసేవ పరిచయంవున్న తరానికి తెలుగు సాహిత్య గత వైభవాన్ని తలపింపచేస్తూ, పరిచయంలేనివారికి కావ్యాన్ని, కావ్య ఔన్నత్యాన్ని పరిచయంచేస్తుందీ పుస్తకం. ఈ పుస్తకాన్ని ఇంత చక్కగా, చక్కటి ఆలోచనతో గొప్పగా తీర్చి దిద్దిన మోదుగు రవికృష్ణ ౠణం తీర్చుకోవటం అంత సులభంకాదు. సాహిత్యాభిమానులంతా ఈ పుస్తకం కొని చదివి, పదిమందితో చదివించి, రవికృష్ణ ప్రయత్నాన్ని విజయవంతం చేయాలి. అయితే, ఈ అత్యద్భుతమయిన పుస్తకాన్ని 1925లో, అక్టోబర్ నెల భారతి పత్రికలో పోలవరపు రామబ్రహ్మం గారు విశ్లేషించినంతా లోతుగా, అత్యద్భుతంగా మరెవరూ విశ్లేషించలేరనిపించింది. అందుకని ఆ సమీక్షను సంచిక పాఠకులకు అందిస్తున్నాం. ఆనాటి పుస్తక విశ్లేషణలు ఎంత లోతుగా వుండేవో ఈ సమీక్ష నిరూపిస్తుంది.
***
[dropcap]శ్రీ [/dropcap]వేంకట పార్వతీశ్వర కవు లాంధ్ర పాఠక మహాశయులకుఁ జిరపరిచితులు కావున బ్రత్యేకించి వారి కవితా ప్రాశస్త్యము నభినుతింప నక్కరలేదు. ఆంధ్ర భాషా యోష నభిన వాలంకార భూషితఁజేసి, కవితా ప్రపంచమున నూతన మార్గములఁగనుగొని యాధునికాంధ్ర సారస్వతమున నవశకక ర్తలైరి. ప్రాచ్య పాశ్చాత్య విజ్ఞాన సమ్మేళన ఫలితమే వీరి కవిత్వమునఁ గల యాధిక్యము. దేశీయుల యభిరుచులు, మహదాశయములు, మార్పు సెందుటకు వీరే చాలవఱకుఁ దోడ్పడిరనవచ్చును. నేఁడే వంకఁ జూచినను నూత్న శోభ భావగోచరమౌచున్నది. ప్రాచీనకవితా సాంప్రదాయము లడుగంటుచున్నవి. అచిరకాలముననే యడుగంటనున్న ఇయ్యది శుభశూచకమో యశుభసూచకమో మన మిదమిత్థమని నేఁడు నిర్ణయింపఁ జాలము. స్వాతంత్ర్యము ప్రబలుచున్నది. సనాతన సిద్ధాంతములు సన్నగిలుచున్నవి. మానసిక స్వాతంత్ర్యమునకై పెనఁగులాడుచున్నాము. రచయితల ప్రాఁత మార్గముల వదలి వైచి వింతలకై పర్విడుచున్నవారు. పాఠకుల భావనాశక్తియు నూత్న పథాన్వేషణమునందే నిమగ్నమైయున్నది. అభిరుచులు మార్పు సెందుటకు, మానసిక విప్లవముఁ గల్గించుటకుఁ గవీంద్రులే తోడ్పడుచుందురు. నేఁడు మన విద్యాధికుల యాదర్శములు, దృక్పథము అపూర్వగతిఁ బరిణమించినది. ఇందలి యోగ్యతా యోగ్యతలఁ బరిశీలించుట యప్రస్తుతము. భవిష్యద్విమర్శకులు చేయవలసిన పని యది.
కవితా ప్రపంచమున స్వాతంత్ర్యవాతావరణము ప్రభవించిన దంటిమి కదా, ఇది యెట్టి స్వాతంత్ర్యము? నిజమగు స్వాతంత్ర్యమునకుఁ గట్టుబాట్లు, నియమములు, నుండక తప్పదు. గణయతిప్రాసలఁ ద్రోసిపుచ్చినంత మాత్రమున స్వేఛ్ఛకానేరదు. అష్టాదశవర్ణనములని యవసరమున్నను లేకున్నను అప్రస్తుత ప్రశంసలతో గ్రంథపూరణ మొనర్చి నంతమాత్రమున మహాకావ్యము కానేరదు. గ్రామ్య వాదులతో పాటు తొఱ్ఱిమొఱ్ఱిపదము లఁ గూర్చి రసాభాస మొనరించుటలో లేదు. రవీంద్ర మహాకవి, కవి కర్తవ్యము నిట్లు నిర్వచించుచున్నాఁడు……..
“Therefore the true poets, they, who are seekers, seek to express the universe in terms of music and reflect the infinite”
సత్యాన్వేషణమే కావ్య పరమావధి. విశ్వ గర్భమున మాటుమణఁగియున్న పరమాత్మ స్వరూపమును, విశ్వవ్యాప్తమైన దివ్యగానమును శ్రవణానందకరముగ సత్కవులు వినుపింతురు…..
My Song will transport your heart to the verge of the unknown –
హృదయమును కలఁచివేయుటే కాదు; పవిత్రభావమును గల్గింపవలయును; అనిర్వచనీయానందమును వెదచల్లవలయును. పరవశత్వమున మంత్రముగ్ధులమై యానందముద్రితులమై పోవునట్లు చేయునదే సత్కవిత్వము.
It will be like the faithful star overhead when dark night is over your road –
జీవయాత్ర దుర్ఘటమైనది. విశ్వసంరంభమున దరిగానక విపదంధకారమున మునిఁగియున్నపుడు దివ్యజోత్య్నవోలె మానసికాంధకారమును పోగొట్టి గమ్యస్థానముఁ జేర్చుటకుఁ గవితయే సాధనభూతమట.
My song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things –
పరమార్థమును గ్రహించుటే – గ్రహించుశక్తి ననుగ్రహించుటే – సర్వ సామాన్యములగు వస్తువులందే విశ్వస్వరూపముఁ జూచునట్లు అనుగ్రహించుటకుఁ గవితయే తోడ్పడఁ గలదు. ఇట్టి కవిత్వమే సుస్థిరమై భాసిల్లుచుండును.
And when my voice is silent in death my song will speak in your living heart –
మహాకవులును బుట్టుచున్నారు; గిట్టుచున్నారు. ప్రపంచ మున్నంతవఱకు ఆచంద్ర తారకము వర్ధిల్లునది సత్కవిత్వమొక్కటే కదా! విజ్ఞానవంతమై, విజ్ఞానప్రేరకమై, విశ్వశ్రేయము నాశించు కావ్యమే మహా కావ్యము.
ఆంధ్ర భాషా యోష నవనవాలంకార భూషితమై యపూర్వరమ్యవనవీథుల విహరించుచున్నదని గర్వించుచున్నారము. సకల విధముల సారస్వత మభివృద్ధిఁ జెందుచున్నదని యుప్పొంగుచున్నారము. లెక్కించి చూచినచోఁ గడచిన పదిపదునైదు వత్సరములలో నూఱులకొలఁది నవలలు, నాటకములు వెలువడినవి. ఇంకను వెలువడుచున్నవి. లెక్కలేని గ్రంథకర్తలు ~ ఇంక సాహిత్యము దినదిన ప్రవర్థమాన మగుట కేమికొదువయున్నది? చూడుఁడు ~ మన సాహిత్యమున నేఁడు ప్రాణము లేదు. సత్యము లేదు! గ్రంథ సంఖ్య యధికమగుచున్నదే కాని నిజమగు సాహిత్యము పెరుఁగుటలేదు. భావకవిత్వమని కాపుకన్నెపై నొకఁ డేవోనాల్గు పాటలు వ్రాయఁగనే వందమంది భావకవులు చర్విత చర్వణ మొనరింపుచున్నారు. “రైల్వేసాహిత్య” మధికమైపోవుచున్నది. చిరకాలము నిలువఁగల యుత్తమసాహిత్య మడుగంటుచున్నది. పోతనాది మహాకవులు దివ్యములగు జాతిరత్నముల నార్జించి మన కొసఁగిపోయిరి. మనమీ కృతిమ రత్నములఁ బ్రోవొనర్చి భవిష్య దాంధ్ర సంతతి కొసఁగనున్నాము. ఆంధ్రభాషావధూటి కియ్యవి నూత్నాలంకారములఁట; విలాసములఁట! లేదు; మన సాహిత్యమున నేఁడు సౌందర్యము లేదు. జీవము లేదు. “డిటెక్టివు నవలలు” సత్యముఁ జూపఁజాలవు. ఉత్తమగ్రంథములు… ఉత్కృష్ణభావములు, జన సామాన్యమునకు రుచింపనిచో అభిరుచిఁ బుట్టించుట రచయితల కర్తవ్యము. మహాకవులట్లు చేయనేర్తురు. కావుననే ఆర్నాల్డు “కవిత యనంతమైన” దని పల్కినాఁడు.
ఉత్తమ సాహిత్యమును పెంపొందుచునే యున్నది. “ఏకాంతసేవ” సర్వజన సమాదరణీయమగు కావ్యము. అర్థజ్ఞానము లేక యూరక చదువువాఁడును నానంద పరవశుఁడవుననుటకు సంశయము లేదు. భాషా సౌష్టవమున నేమి, భావ సౌకుమార్యమున నేమి, పద లాలిత్యమున నేమి, భావగాంభీర్యమున నేమి, యర్థసంపదయం దేమి నేఁడు వెలువడు లలిత కావ్యములలో నిది సర్వోత్తమమైన కవుల భావనాబలిమిని, కల్పనాశక్తిని, గానమాధురిమను వేనొళ్లఁ జాటుచున్నది. చదువఁజదువఁ జవులూరుచుండును. నవనవానందసంధాయకమై, నవ్యవిలాసభాసురమై నవ్యభావకుసుమ సంశోభితమై యాంధ్ర కవితాలత వేంకటపార్వతీశ్వరుల యారామవన మధ్యమున మనోహరమై యొప్పుచున్నదనుట కీ చిన్ని కావ్యమాలి కయే తార్కాణము.
ఇయ్యది గీతాంజలి వంటి దనుటకు వీలులేదు. వీరి కవిత్వమున ధ్వనియే ప్రధానము. భావపరవశులై, భావోద్రేకమున బ్రకృతి సౌందర్యమును వీక్షింపుచున్నారు. ప్రకృతిఁ గల సౌందర్యమాధుర్యములు మాత్రమే చూపింపఁగల్గుచున్నారు. గంభీర ప్రకృతి గర్భమున నణఁగియున్న రహస్యముల కొక క్రొత్తయర్థమును స్ఫురింపఁజేయుచున్నారు. ఇంక గీతాంజలి యందన్ననో భక్తుని యంతరంగమునఁ గల వివిధ భావములు, మహదాశయములు, వివిధ రీతుల, నిరాటంకముగ, భావతరంగకల్లోలినియగు హృదయసముద్రమునుండి ప్రవహించుచున్నవి. విచారతరంగిణి, ఆనందలహరీతరంగముల నైక్యమొందినది. రవీంద్రుఁడు జీవిత సమస్యలనెల్ల నైవేద్యము సల్పినాఁడు. మనుజ స్వభావములు పరస్పరవిరుద్ధములు కదా! అనఁగా భిన్న భావసమన్వితములని దుర్జనసజ్జన సమ్మిశ్రితము ప్రపంచము. అనుక్షణమును క్లిష్టపరిస్థితు లేర్పడుచున్నవి. సనాతనధర్మములు, ఆచారములు… స్వాతంత్ర్య సంరంభమున నుఱ్ఱూఁత లూఁగింపఁబడుచున్నవి. నిర్మూలమైపోవుచున్నవి. మానసిక, ఆధ్యాత్మిక విప్లవకాంక్ష కార్చిచ్చువలె వ్యాపించుచున్నది. భారతదేశ విముక్తి యెటువోయిన లభించునని రవీంద్రుఁడు వెదకుచున్నాఁడు. సత్యాన్వేషణమే….. ధర్మోద్ధరణమే పరమౌషధమని విశ్వసించినాఁడు. అల్పాధిక వివక్ష లేక, ప్రతివాని హృదయకుహరము నుండియు నార్తత్రాణ పరాయణుఁడగు పరమేశ్వరుఁగూర్చి వెల్వడు నార్తధ్వనులిందుఁ బ్రతిధ్వనించుచున్నవి. రవీంద్రుని, మానసిక, ఆధ్యాత్మిక, నైతిక, రాజకీయ, సాంఘిక, మహదాశయములెల్ల గీతాంజలియందు మూర్తీభవించినవి. ఇది యొక విధమైన స్వీయ చరిత్ర మనవచ్చును. భక్తుఁడు భక్త్యావేశమునఁ బరమాత్మఁ జేరఁగోరి ప్రాపంచిక బంధ విముక్తిఁ జెందగోరిఁ పవిత్రుఁడై, నిర్మలచిత్తుఁడై, తదేక ధ్యానమున నంతరాత్మ ప్రబోధము నాలించి హృదయకలుషముల నెల్లఁ బరిత్యజించి దివ్య తేజము నాశించుచుఁ బరితపించుచుఁ బరమాత్మ సాన్నిధ్యమున నాత్మార్పణ మొనర్చి వినుతించునప్పుడు బహిర్గతంబగు నీశ్వర స్తవమే గీతాంజలి. విశ్వమోహనుఁడును, విశ్వవ్యాపియు, విశ్వస్వరూపియు నగు విశ్వేశ్వరుమ్రోల నంజలిబద్ధుఁడై, రవీంద్ర కవీంద్రుఁడు, విశ్వపతి సాక్షాత్కారమునకై విశ్వమోహన సంగీతము నారంభించినాఁడు. ఆ గానలహరీ తరంగముల మైమఱచినప్పుడే హృదయకమలము సంపూర్ణ వికాసముఁ జెందినది. సహస్రభావ దళములు సహస్రరాగముల విశ్వగానముననైక్యమొందినవి. ఏకాంత సేవయందు సహస్ర రాగములు లేవు. లేకున్నను గీతాంజలితో సరితూగఁగల దనుటకు సంశయము లేదు. గీతాంజలియందు భావవైశల్య మఖండము. జీవితత్త్వము క్రోడీకరింపఁబడినది. దుర్భరమనఁదగు మానవ జీవిత మానందప్రదమని నిరూపింపబడినది. దీనినే కాఁబోలు నాంగ్లమున
(“Robust optimism, a sound and mature philosophy of life”)
అని పిలుతురు. ఇదియే కావ్యపరమావధియఁట; ఉత్తమ కావ్యలక్షణమఁట. ఇదియే సత్యమట – సౌందర్యమట –
Poetic truth and poetic beauty high seriousness and a philosophy of Life.
తేటతెనుగున నీభావము వెల్లడించుట దుస్సాధ్యము. కావున నీ విషయములందు మాత్రము మన ‘ఏకాంతసేవ’ గీతాంజలి యనుకరణ మైనను పరిపక్వము చెందలేదు. ఐనను గవులయభిప్రాయమ మంతదూరము పోనట్లు తోఁచుచున్నది. సృష్టిఁగల సౌందర్యమును నిరూపించినారు. అందలి యంతరార్థ మును జాలవఱకు వ్యక్తపఱిచినారు. వీరి గానము నిత్యనిర్మలమై నిత్యానందసంధాయకమై మనోజ్ఞమై పరగుచున్నది. ఈ సందర్భమున గీతాంజలితోఁ బోల్చునపుడు నా హృదయ భావములఁ దెలుఁగున వ్యక్తీకరించుటకు మనకు వలసిన పరిభాష లేనందున నా యభిప్రాయము సుబోధకము కాదని భీతి జనించుచున్నది. “ఏకాంత సేవ”
(A highly poetic interpretation of the best and the most beautiful aspects of nature where the poets read a deeper meaning and significance and discern the mysterious working of the divine hand)
యిట్టి యుత్కృష్ట కావ్యము. భావోద్రేక జనితమగు భక్త్యావేశమున నిర్మలనిశ్చల భక్త వరుని హృదయపరితాపమును భక్తి ప్రబోధకముగ వర్ణించియున్నారు. భక్తుఁడు భగవానుని ‘ప్రియా’యని సంబోధించుచున్నాఁడు. ప్రియాప్రియులకుండు పరస్పర ప్రణయ సంబంధమే – ప్రవిమలానురాగమే – భక్తునకును యీశ్వరునకును గల సంబంధము. నిర్మలానురాగ పూరితయై ప్రియాన్వేషణ మొనరించుచు విరహభరమ్మున ప్రియతముఁ జూచు కోర్కెతో సతీమణి యెట్లు ప్ర్రయాసఁ జెందునో యట్లే భక్తుఁడును పరమేశ్వరసాక్షాత్కారమునకై హృదయపీఠము నాయత్తపరచుచుండును. ఈ సంబంధమునే ఏకాంతసేవయందు సమన్వయమొనరించు టెంతయు సమంజసముగ నున్నది.
ఇఁకఁగథా భాగమునించుక పరిశీలింతము. సుబోధక మగునట్లు వివరించినఁగాని యిందలి భావసౌందర్యము ప్రస్ఫుటము కానేరదు. నాయికానాయకుల విరహగానమును, ఈశ్వర సాక్షాత్కారమునకై భక్తుని యనుతాపమును, రెండును ప్రేమైక ప్రేరితములే కావున నిర్వురగమ్యస్థానము నొక్కటే కదా.
భక్తుఁడు ప్రభాత సంగీతము నారంభించినాఁడు. దివ్యతేజోలేశము లభించుటకై భక్తుని హృదయాంతరాళమునుండి వెడలు ప్రణయగానము – తేజోమయుదివ్య సందర్శనాపేక్షచే జీవుఁడు పరమాత్మను సందర్శింపుటకై యనురాగతిరేకమున నుదయగానముఁ – జేయుటతో గ్రంథ మారంభమైనది.
‘ప్రకృతి యదియేమొ రాగసంపన్నమయ్యె
భావ మదియేమొ యానందభరిత మయ్యే
చిత్త మదియేమొ ప్రేమసంసిక్తమయ్యె-‘
ఏకాంతసేవాసమయము ప్రశాంతసుప్రభాతము. శ్రీపాదములఁ గొల్చువేళ కావుననే ప్రకృతి రాగసంపన్నమైనది. హృదయ మానందపూరిత మైనది. ఔను. కల్మషరహితమై, నిశ్చలమై, పవిత్రమై ప్రశాంత మనోహరమై యున్ననే కదా పరమేశ్వ రారాధన కనువుపడును. పైఁగా, భావసహకారమునఁ బ్రేమ పల్లవించినది. అట్టి మానసికా వస్థయందే నిర్మలప్రేమ తరంగము లుప్పతిల్లును. అట్టిప్రేమయే ఫలసిద్ధికి ముఖ్యమార్గము. ఆరాధన సమయమైనది. నిర్మలానురాగాపూరితుఁడై భక్తుఁడు (ప్రియురాలు ప్రియుఁజేరఁ గోరి) భక్తి రసావేశమునఁ దన్మయుఁడై ప్రకృతి సౌందర్యముద్రితుఁడై యుండఁగ వాని “యాత్మ కేమేమొ యుద్బోధమగుచునుండె” ను. ఇదియే యంతర్వాణియై యుండనోపు (Voice within) లేదా ప్రకృతిఁ బ్రతిధ్వనించు దివ్యవాణి (The divine voice in nature) యై యుండనోపు. సృష్టి యెల్లెడలను, సత్వాంతర్యామియగు పరమేశ్వరుని కృపాకటాక్షమునే, యవ్యాజప్రేమనే ప్రకటించుచుండును కదా! చరాచర జంతుజాలమెల్ల నేకగ్రీవముగ పరమేశ్వరు నభినుతించుచున్నవి. లేనిచో వాటికి నిలుకడయే లేదు. ఆనందమయుఁడును, ఆనందసముద్రుఁడును, సౌందర్యఖనియునగు పరాత్పరు తేజోలేశము నౌదల ధరించియే ప్రకృతి గణమెల్ల యుప్పొంగిపోవుచున్నది. అందుకనియే “ఘనతరంబైన యుదయరా గంబుతోడ, నాత్మరాగ ప్రభాపుంజ మైక్య” మొందినది- ‘భావవిద్యుల్లతాప్రదీపంబుతోడ భానుదివ్యప్రభారాశిలీన్’ మైనది. అందందు డాఁగియున్న దివ్యస్వరూపము, అందలి మధుర వీణాస్వరము, దివ్యవాణి మనబోంట్లకు వినరాదు. ప్రకృతిత్త్వమును గ్రహించువారికే మహాకవులకే – గోచరించును. ఈ యుద్బోధనయు భక్తులకే కల్గును. ప్రేమాంతరంగులకే విననగును. అప్పుడే యీశ్వరసంకీర్తనమునమగ్నుఁ ఢై పోవును. అందు మానవుఁడే కాదు; ప్రకృతియంతయు దివ్యజ్యోత్స్యాపులకితయై, ప్రేమ భరితమై, సంతోషముద్రితయై చలించిపోవును. భువనేశ్వరు మహాత్మ్యమును వెల్లడించుచుండును. కాకున్నచో “నప్పుడే వింతగాఁ బురి విప్పుకొనుచు, నెమ్మినెఱజాణ నృత్యంబునెఱపనేల? గొరవంకకులుకులాడి, వింత యొయ్యారమునఁ జెవిచెంతఁ జేరి, చిలుకచెలితోడ నేమేమొ చెప్పు” చుండనేల? ఈశ్వరసాన్నిధ్యముఁ జేర్చుటకు మనుజహృదయము నీశ్వరునివంకకు మరల్చుటకుఁ బ్రకృతియే తోడ్పడు చుండును. అనంతమైన యమ్మహా ప్రభావమునే ప్రకృతి ప్రతిబింబింపఁ జేయుచున్నది. కావుననే భక్తుఁడు ‘వరమనోహర పంచమస్వరము నెత్తి, మధురముగ మార్దవంబుగా మంజులముగ, మానసానందకరముగా మంగళముగ’ కోకిల పాడుచుండఁగ ‘ప్రాణవిభు నామమంత్ర జపంబునందు – మగ్నుఁడై, మేను మఱచినాఁడు. కళ్యాణగీతిలో కలకంఠి చొక్కియున్నది. ప్రణయగానములో భ్రమరిక చిక్కినది. ఆనందవార్ధిలో భక్తుఁడవశుఁడైయున్నాఁడు. కళ్యాణమూర్తి ప్రసన్నుఁడు కానున్నాఁడు.’
ఆనందవార్ధిలో నవశుఁడై యుండఁగా విభ్రాంతిలో మున్గి పరమేశ్వరుని లీలావిలాసముఁ జూచి ముగ్ధుఁ డయ్యెను. భక్తుఁ డట్లు సమ్మోహితుఁడై యుండఁగాఁ గళ్యాణమూర్తి యదృశ్యుఁడయ్యెను. తేజోలేశము మాత్రము కంటఁబడినది. జ్యోత్స్నామయుని సందర్శన భాగ్యము సులభసాధ్యము కాదుగదా! భక్తపరాధీనుఁ డయ్యును, భక్తు”ఁబరీక్షించుండును. సర్వాంతర్యామియయ్యును, సర్వతోముఖుఁడయ్యును “సదమలకోకిల కుహూ స్వరములలోన భావంబు చిగురించు పాటలు పాడి – లలితమోహనశుకాలాపంబులందుం బ్రణయంబుదొలుకాడూపాటలు పాడి…. యెలదేఁటినాదంబులోనఁ బ్రణయమంత్రంనును బాఠంబు సెప్పి – అంటఁగా ముట్టఁగా నందలి గారాక, అసలఁ గొల్పుచు నలయింపు” చుండును. ఈశ్వరార్చన సల్పుచు, మంత్రజపంబు సేయుచు, ధ్యానించుచు, నెంతయుఁ బరితపించుచునే యున్నను భక్తులతో మంతనమాడుచుండును. వారిని బరీక్షించుటకు – ఎప్పుడేని సాక్షాత్కారము లభించినను ఛాయామాత్రమే. ఆ దివ్యమంగళ సుస్వరూపము సుస్థితముగ హృదయకమలమునఁ బాదుకొన్నపుడే యీప్సితార్థసిద్ధి; లేనిచో నింకను బరితాపమే. భక్త్యనురాగములు పెంపొందుచుండును. గమ్యస్థానము సమీపించుచుండును. విద్యుత్ర్పభాపుంజము కనులఁబడును. అదృశ్యమగుచుండును. కర్మపరిపాకమైననే కాని సాక్షాత్కారము, ఆత్మ పరిజ్ఞానము లభింపదు కదా! ఈ లోపుగ నెన్ని యవస్థలు మారవలయును? ఎంతశ్రమ కోర్వవలయును? రవీంద్రుఁడీ భావమునే యిట్లు వ్యక్తీకరించుచున్నాఁడు…..
“He came and sat by my side but I woke not. What a cursed sleep it was, O, miserable me! He came when the night was still, he had his hart in his hands, and my dreams became resonant with its melodies. Alas! why are my nights all thus lost; Ah ~ why do lever miss his sight whose breath touches my sleep?”
కళ్యాణమూర్తి సర్వకాల సర్వావస్థలందును మనలఁ గాపాడుచునే మనయొద్ద కేతెంచుచునే యున్నాఁడు. అజ్ఞానతమ మావరించి యుండఁగా మనమెట్లు చూడఁగలము? అందుకనియే యమూల్యావకాశములు చేయిజారి పోవుచున్నవి. కావుననే మన భక్తుఁడు “అవశనైయుండుటే యపరాధమనుచు, మది నెంచి యీతీతి మాయలుసేయ, భావ్యమై తోచెనా” యని మొఱవెట్టుచున్నాడు. “ఎఱిఁగియో యెఱుఁగకో యేఁ జేసినట్టి తప్పులమన్నించి… దరిసెనం బీవయ్య తత్త్వస్వరూప!” యని పిలుచుచున్నాఁడు?
విశ్వమొక ప్రణయసామ్రాజ్యము. విశ్వమోహనమూర్తియు సుధామధురమూర్తియునగు విశ్వనాధుఁడే ప్రణయ సామ్రాజ్యాధినాధుఁడు. సృష్టిఁగల జీవసంతతులెల్ల ప్రేమ పాశములచే నొండొంటితోఁగట్టువడియున్నవి ప్రేమబంధము లెల్లెడల నల్లిబిల్లిగఁ బెనవైచి కొనిపోయినవి. అట్లే కాకున్నచో పద్మాలయముఁజూచినంతనే రాయంచ పరువెత్తనేల? విశ్వమోహనమూర్తి యందున్నవాఁడు కావుననే!
“సహకారవనములో సఖుఁ డుండఁబోలు
భావించి కీరంబు పలుకాడుచుండె.
అలరుఁగొమ్మల మనోహరుఁ డుండఁబోలు
పేరెత్తి కలకంఠి పిలుచుచు నుండె….
మయూరంబు పురివిప్పుచుండె…..”
కావున విశ్వమంతటఁ జూచి వెదకంగ వలయును. ప్రణయ దేవతాలయము లెవ్వియో ప్రేమైకమూర్తికి ఉనికిపట్లెవ్వియో విచారించి యందందు జాడలఁబట్టీ వెదకవలయును కదా! “శృంగార సరసిలో శ్రీమంటపమున, గుసుమ పీఠంబుపైఁ గొలువుండెనేమొ? – అనురాగ జలధిలో నమృతవీచికల, విరిదమ్మి దోనెపై విహరించునేమొ? – శాంత వనంబులో స్వర్గ సౌధమునఁ, బరువంపు విరిశయ్యఁ బవళించెనేమొ? – చిద్రూపనగరిలో శృంగాటకమున, నిండు వెన్నెలబైట నిదురించెనేమో?” – చూచి వెదకి తేవలయునని భక్తుఁడు పయనమయ్యె. ఇకఁ బ్రణయస్వరూపుఁ జూచినను గుర్తించి వట్టికట్టూట కానవాళ్ళు లేవా? ఉన్నవి!
‘నెఱచూపు జూడ వన్నెలు గల్కునమ్మ
నెఱనవ్వు నవ్వ వెన్నెల చిల్కు నమ్మ
నెఱపల్కు పల్క తేనియ లొల్కునమ్మ”
భక్తున కాత్మేశుఁడే లోకమై పరగచుండును. ప్రియాప్రియుల వియోగ సమయమునఁ బ్రకృతియెల్లఁ బులకరించును. వారి విరహగానము నాలకించి ప్రకృతిఁగల జంతుజాలమెల్ల సానుభూతిఁ జూపుననుట కవుల మనోజ్ఞ భావస్ఫురణముఁ జాటుచున్నది…. భక్తుఁడు సఫలీకృతమనోరథుఁడయ్యె. హృదయతాపము శమించినది. హృదయోద్వేగము నణఁచిపెట్టి ఈశ్వర సందర్శనోత్సుకుఁడై అన్యచింతలఁ బారఁద్రోలి యేకాగ్రచిత్తుఁడై పరంధాముఁ గనుఁగొనుచున్నవాఁడు. ప్రణయదేవతాసాక్షాత్కారమైనది. ప్రణయ సుందరి తపంబు ఫలించినది. సంతోషమొన గూర్చు శకునంబు లైనవి. సౌభాగ్యము ఫలించు సమయమేతెంచినది. “ఉన్నతాసనము పైనుండి నావిభుఁడు, పేరెత్తి చేయెత్తి పిలుచుచున్నాఁడు” తిరుగఁ బ్రకృతియంతయు నా నందమయమై కన్పట్టుచున్నది. “జగమెల్ల నవసుధాసారంబైనది. భువనమంతయు గంధపూరం బైనది…. వెదకి వెదకి ప్రణయాధినాథుని యునికిపట్టెఱిఁగి వాని సన్నిధి కేగుచున్నాఁడు…..” ఇప్పట్టున మనోహర కవితామృతసరము చిప్పిలుచున్నది –
ప్రణయపురంబులో ప్రాసాదవీథి
వేణుగానరవంబు వినవచ్చుచుండె
కళ్యాణనగరిలో కమలాలయమున
వీణాస్వనంబులు వినవచ్చుచుండె
విశ్వగీతరవంబు వినవచ్చుచుండె
వేదసాధురవంబు వినవచ్చుచుండె
పదిలంబు పదిలంబు! పాణిద్వయంబ!
అవధాన మవధాన మంతరంగంబ!
వేదాంతమయుఁ జేరువేళ యేతెంచె
భద్రంబు – భద్రంబు!-
హృదయేశ్వరునితో నైక్య మొందినంతనే పరవశమయ్యెనే ప్రకృతియంతయును… ఆనంద మయమూర్తి పొడసూపినంతనే “మధురహాసంబులో మాధురీ ప్రకృతి యానంద ముద్రితం బైనట్టు లుండెను.”
“ప్రణయాతిథేయుని భావనామయుని
దర్శనంబు లభించె… నెమ్మేను పులకించె.”
తుద కెందుఁ బరమాత్మ సాక్షాత్కారము లభించినది? ప్రియురాలు హృదయేశ్వరునెందుఁ బొడగాంచినది?
“మాణిక్యమయమూర్తి మనపజ్జనుండ
సంజకెంజాయలోఁ జరియింపనేల
సిద్ధౌషధము మనచెంతనే యుండ
ఘోరాటవులలోనఁ గ్రుమ్మరనేల?
విజ్ఞానధన మాత్మవీథినే యుండ
మంత్రకోశములలో మసలంగ నేల?
భ్రాంతిలోఁబడి వెఱ్ఱిపడ నేటికమ్మ!
చిత్తమా! నాతోడఁ జేరిరావమ్మ!
విశ్వమంతయు వెదకినది. తనలో నున్న పరమాత్మ నెఱుఁగఁజాలక భ్రాంతిలోఁ బడిపోయినది. తుదకాత్మ పరిజ్ఞానము (Self realisation) లభించినంతనే బ్రహ్మానంద మబ్బినది. దీనినే రవీంద్రునాథుఁడు.
Leave this chanting and singing and telling of beads! whom dost thou worship in this lovely dark corner of a temple with doors all shut; Open thine eye and see thy God is not before thee.
మంత్రంత్రములేల? రుద్రాక్షమాలలేల? నీ యెదుట సాక్షాత్కరించిన భగవానుఁ జూఁడుము! ఛాయవలె నిన్నంటియే యున్నాడు. నిన్నావరించుయున్నాఁడు –
I came out alone to my tryst. But who is it that follows me? I move aside to avoid his presence but I escape him not…. He is my own little self – my lord!
మనోరథము సిద్ధించినది. శ్రీ పుష్పయోగ సంసిద్ధి చేకూరినది… భక్తుఁ డేమికోరుచున్నాఁడు?
హృదయేశ! నినుఁగోరితిని చరితార్థ నైతిని. నీ విఛ్ఛయింపనినాఁడు ‘బంగారువీణెతోఁ బనియేమినాకు?’…. భక్తుఁ డేమి కోరఁగలఁడు. ఐశ్వర్యములా? కాదు?
“ఈ శైలవాహిని యింకిపోకుండ
నమృతార్ణవముఁ జేరె నంతియే చాలు
ఈమల్లెవిరిదండ యెండిపోకుండ
నమృతమూర్తి వహించె నంతియేచాలు
నాపుణ్యమునఁ జేసి నా జీవితేశ~
నీ దర్శనముఁ జేసి నే ధన్యనైతి!…..
కన్నులు చల్లగాఁ గనుఁగొనఁగంటి
…… నా భాగ్యమే భాగ్యమయ్య!!”
రవీంద్రుఁడిట్లు ధ్యానింపుచున్నాఁడు,
This is my prayer to thee, my lord! give me the strength to surrender my strength to thy will with love…. That I want thee – only – thee let my heart repeat without end. All desire that distract me are empty.
‘ఐహికసుఖములు బుద్బుదప్రాయములు. భగవానుఁడా! నీ సేవామృతమే నాకుఁ గావలసినది! భక్తుల ప్రార్థన మిట్టిదే కదా!
“అగమాంతోక్తుల కందఁగారాని
అఖిలంబునకు నంటియంటక యున్న
నిర్వికారుని నిన్ను నేఁ బొందఁగంటి
నన్నుద్దరింపవే!”
యని మొరవెట్టుచు భక్తుఁడు శ్రీధామమున కెట్టులో చేరినాఁడు.
“ఆయాసము ఫలించె నాసలుతీరె
కనుఁగొంటిఁ గైకొంటిఁ గైవల్య పదము”
నిర్మలాత్మ ప్రేమపూరితమై తపించి తపించి తుదకు; గైవల్యపదము జేరినది. ‘బుద్ధిమంతులకైన, బోద్ధలకైన…. సాధ్యముకాని పదవి కేవలము భక్త్యానురాగములచే లభింపఁ గల్గినది. గమ్యస్థానముఁ జేరినది. విశ్వమంతయు బ్రేమ భరితమై కన్పట్టుచున్నది –
“నవ మనోజ్ఞైకవీణాగానలహరి
నొక్కింతసుఖలేశ ముండునుగాక
గీర్వాణకాంతల గీతామృతమున
నొక్కింత యానంద ముండునుగాక
దివ్యతేజంబుతో దీటుసేయుటకు
బ్రకృతి సౌందర్య మేపాటిది నాథ!!!”
అని స్తుతింపుచున్నాఁడు…. ఇంకఁ గోరఁదగిన దేమున్నది?
‘సర్వలోకేశ! యీ సాలభంజికను
నీకేళిగృహమందు నిలువఁగానిమ్ము
భువనసంత్రాణ! యీపుష్పవల్లికను
నీపూలతోఁటలో నిలువగానిమ్ము.
దయతోడఁ దిలకించి దాస్యం బొసంగి
నన్నేలుకొనుమయ్య!………!!
ఔను! భక్తమందారుఁడు ప్రత్యక్షమైన చోఁ గోర్కెలుండునా? ఆ దివ్యసందర్శనమే చాలును!
“In one salutation to thee, my God! let all my senses spread out and touch this world at thy feet. Like a rain cloud of July hung low with its burden of unshed showers let all my mind bend down at thy door in one salutation to thee. Let all my songs gather together their diverse strains and flow to a sea of silence in one salutation to thee… Let all my life take its voyage to its eternal home in one salutation to thee.”
“అను రవీంద్రుని ధ్యానమే…. భక్తవరుని నోట వెల్వడుచుండును. ఏకాంత సేవఁ జదివిన కొలఁది యానంద ముప్పతిలుచుండును. ఇంత కన్న విపులముగ నా సంతోషమును, నాకుఁ దోఁచిన భావమును బాఠకోత్తములకు వెల్లడింపవలయునని కోర్కె జనించినను అనుభవజ్ఞులును, బండితోత్తములును, గవీంద్రులును బలువురుండగా అల్పజ్ఞఁడనగు నా విమర్శన మంతగా రుచింపదను నధైర్యమునను…. నా హృదయభావముల నుచిత గతి నాంధ్రమున వెల్లడింపఁ జాలననియు నమ్మి శ్రీ వేంకట పార్వతీశ్వరులందు నాకుఁ గల భక్తియు, గౌరవమును, బురికొల్పఁగా నిట్లు వారి యుత్తమోత్తమ గ్రంథ మగు ‘ఏకాంత సేవ’ పై నీ చిన్ని వ్యాసమును రచించి మద్గురు సమానులగు వారికే యుపాయనముగ సమర్పించుచున్నాను. ఈ కావ్యమున నల్పజ్ఞుఁడనగు నాకుఁ దోఁచినయర్థమునే సమన్వయించితిని. వేదాంతులకుఁ, బండితులకుఁ నిందుఁ బ్రతిపాదింపఁబడిన యంతరార్థ మేదేని తెలిసి యున్నచోఁ బ్రకటింతురేని పాఠకలోకమున కెంతయు మేలుచేసినవారయ్యెదరు.
పోలవరపు రామబ్రహ్మం గారు, బి.ఏ
***