శంకర్ జైకిషన్‌లు సంగీత దర్శకత్వం వహించిన ఒకే ఒక డైరెక్ట్ తెలుగు సినిమా ‘జీవిత చక్రం’

1
4

[dropcap]కొ[/dropcap]న్ని సినిమాలను కథ, కథనం లాంటి విషయాల కోసం కాకుండా భారతీయ సినీ ప్రపంచంలో వాటికున్న చారిత్రక నేపథ్యం కోసం గుర్తు చేసుకోవాలి. 1971లో నవశక్తి ప్రొడక్షన్స్ బానర్‌లో ‘జీవిత చక్రం’ అనే సినిమా వచ్చింది. ఎన్.టి.రామారావు, వాణిశ్రీ, శారద, నాగయ్య గార్లు నటించిన ఈ సినిమా గొప్ప విజయం సాధించింది. అయితే ఈ సినిమాను శంకర్ జైకిషన్‌లు సంగీత దర్శకత్వం వహించిన ఒకే ఒక డైరెక్ట్ సినిమాగా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ అనడానికి కారణం, 1953లో వీరి సంగీత దర్శకత్వంలోనే ‘ప్రేమలేఖలు’ అనే తెలుగు సినిమా వచ్చింది. అయితే ఇది తెలుగులో తీసిన చిత్రం కాదు. 1953లో హిందీలో వచ్చిన ‘ఆహ్’ సినిమాను తమిళంలో ‘అవన్’ పేరుతో, తెలుగులో ‘ప్రేమలేఖలు’ పేరుతో డబ్ చేసారు. హిందీలో ఈ సినిమా పాటలన్నీ పెద్ద హిట్లు. తెలుగులో ఆ పాటలను ఆరుద్ర గారు తిరిగి రాస్తే శంకర్ జైకిషన్ బాణీలతోనే వాటిని జిక్కీ, ఏ.ఎమ్. రాజాలు ఆలపించారు. ఈ సినిమాలో చిత్రించిన ‘పందిట్లో పెళ్లవుతున్నదీ’ అన్న పాట ఇప్పటికీ చాలా పాపులర్ పెళ్ళి పాట.

శంకర్ జైకిషన్‌లలో శంకర్ హైదరాబాద్‌లో జన్మించారు. తెలుగు బాగా వచ్చిన వ్యక్తి. అతనికి తెలుగు భాషపై ఉన్న మమకారం చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకు వారు పని చేసిన కొన్ని సినిమాలలో కనిపిస్తూ ఉంటుంది. 1952లో వచ్చిన దిలీప్ కుమార్ సినిమా ‘దాగ్’లో కొన్ని తెలుగు డైలాగులు వినిపిస్తాయి. ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించింది శంకర్ జైకిషన్‌లు. శంకర్ అలా కొన్ని చోట్ల తన తెలుగు అభిమానాన్ని చాటుకున్నారు.  శంకర్ జైకిషన్‌లు ‘జీవిత చక్రం’ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారన్నది తెలుసుకొవలసిన విషయం. శంకర్ జైకిషన్ లను భారత దేశంలోనే అతి గొప్ప సినీ సంగీత ద్వయంగా గుర్తిస్తారు సినీ సంగీత ప్రేమికులు. అందువలన వీరు సంగీత దర్శకత్వం వహించిన ఒకే ఒక్క డైరెక్ట్ తెలుగు సినిమాగా ‘జీవిత చక్రం’ సినీ చరిత్రలో నిలిచిపోతుంది.

ఈ సినిమాకు దర్శకత్వం వహించింది సి.ఎస్.రావు గారు. సి. పుల్లయ్య గారి కుమారులు ఈయన. సుమారు అరవై అయిదు సినిమాలకు దర్శకత్వం వహించి రెండు జాతీయ పురస్కారాలు అందుకున్న దర్శకులు రావు గారు. విద్వాన్ కన్నవశ్రీ కథ అందించిన ఈ సినిమా అప్పట్లో చాలా రోజులు ఆడింది. ఈ సినిమాలో మొత్తం ఏడు పాటలుంటాయి. వీటిలో అయిదు పాటలు ఆరుద్ర గారు రాస్తే రెండు పాటలను సి. నారాయణ రెడ్డి గారు రాసారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ ఆడుతూ ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అని స్త్రీలు పాడే పాటను ఈ సినిమా కోసం చిత్రించారు. తెలుగు సినిమా పాటల్లో బతుకమ్మ వినిపించటం ఇదే ప్రథమం. అంతకుముందు హిందీ పాటల్లో, రాజ్ కుమార్ సినిమాలో ‘నాచేరే మన్ బతుకమ్మా’ అన్నపాటను, శత్రంజ్ అనే సినిమాలో ‘బతుకమ్మ బతుకమ్మ ఎక్కడకు పోతవురా? ఇక్కడ ఇక్కడ రా’  అన్న పాటనూ శంకర్‌జైకిషన్ రూపొందించారు. సి. నారాయణ రెడ్డి గారు తెలంగాణ సాంప్రదాయ పదాలతో కూర్చిన పాట ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో. తెలంగాణ ప్రాంతంలో జన్మించిన కవిగా ఆ పాటను ఆయన రాస్తే, దానిలోని సాంప్రదాయపు ఛాయలకు నష్టం జరగకుండా జాగ్రత్తగా ఈ పాటకు బాణీ కూర్చారు శంకర్ జైకిషన్ ద్వయం. హైదరాబాద్‌లో పుట్టిన శంకర్ ఈ పాట ద్వారా తెలంగాణా ప్రాంతపు సాంప్రదాయాన్ని అప్పట్లో సజీవం చేసారు. సాంప్రదాయిక బతుకమ్మ బాణీకి పాశ్చాత్య సంగీతానికి లంకె పెట్టి ఫ్యూజన్ సంగీతాన్ని సృజించారు శంకర్‌జైకిషన్.

సినిమాలో పాటలను శారద అనే  గాయని గానం చేసారు. శంకర్ వీరి ప్రతిభను గమనించి వారికి చాలా ప్రోత్సాహం ఇచ్చారని, హిందీ సినీ ప్రపంచంలో వారిని గాయనీగా నిలబెట్టాలని చాలా ప్రయత్నించారని అంటారు. తమిళనాడులో పుట్టిన శారద అయ్యంగార్ తమిళంలో మాత్రం పాడలేదు కాని హిందీతో పాటు తెలుగు, మరాఠీ, గుజరాతీ, ఇంగ్లీషు భాషలలో పాటలు పాడారు. గాయనీగా మన దేశంలో మొదటి పాప్ ఆల్బం విడుదల చేయడమే కాకుండా కొన్ని హిందీ సినిమాలకు సంగీత దర్శకత్వం కూడా వహించారు. వీరు పాడిన ‘కళ్ళల్లో కళ్లు పెట్టి చూడు’, ‘మధురాతి మధురం’ పాటలు తెలుగు వారికి సుపరిచితమే. ‘జీవిత చక్రం’ సినిమాకు ఘంటసాల గారితో కలిసి శారద గానం చేసిన గీతాలు అవి.

సినిమా కథకు వస్తే రాజా ఒక ధనవంతుని కొడుకు. విదేశాలలో చదువుకుని దేశం తిరిగి వస్తాడు. అతనికి తమ వ్యాపార బాధ్యతలు అప్పగించి విశ్రాంతి తీసుకోవాలని రాజా తండ్రి అనుకుంటాడు. రాజా మేనత్త దగ్గర కొన్నాళ్ళూ పెరుగుతాడు. అతనికి మరదలు కమలతో వివాహం జరిపించాలని కుటుంబం అంతా కోరుకుంటారు. కాని రాజా సుశీల అనే పేద యువతిని ప్రేమిస్తాడు. సుశీల తండ్రి, తమ్ముడు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఇంటి బాధ్యత సుశీల తీసుకుంటుంది. ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటుంది. ఆమెలో ఈ సహనం రాజాని ఆకర్షిస్తుంది. ఆమెను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు. కమల మాత్రం రాజానే తన భర్త అని చిన్నప్పటి నుండి నమ్ముతుంది. వివాహ ప్రస్తక్తి వచ్చినప్పుడు కమలను తాను ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదని చెప్పి రాజా అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. ఈ విషయం విని కమల స్పృహ తప్పి పడిపోతుంది. ఆమె ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇక ఆమె బ్రతకదని డాక్టర్లు తేల్చివేస్తారు. ఆమె ఆఖరి కోరికగా రాజా ఆమె మెడలో తాళి కడతాడు. ఆమెకు సపర్యలు చేసాడు. కాని ఆశ్చర్యంగా అ సపర్యలతో కమల కోలుకుంటుంది. ఆమెకు సుశీల సంగతి తెలియదు. ఇక ఆ వివాహ బంధాన్ని వదులుకోలేక, సుశీలను మర్చిపోలేక, కమలకు భర్తగా మారలేక రాజా నలిగిపోతుంటాడు.

సుశీలకు రాజా వివాహం సంగతి తెలుస్తుంది. కమలకు సుశీల గురించి తెలుస్తుంది. తన భర్త సుఖం కోసం ఆమె సుశీలతో రాజా వివాహం మరోసారి జరపాలని కోరుకుంటుంది. కాని సుశీల పెద్ద మనసుతో రాజా సమస్యను పరిష్కరించడానికి సిద్దపడుతుంది. కమల మంచితనం, రాజాపై ఆమెకున్న ప్రేమను అర్ధం చేసుకుని వారిని కలిపి ఆమె వారి జీవితంలో నుండి నిష్క్రమిస్తుంది. కథా పరంగా చనిపోతున్న కమల కోరిక మేరకు ఆమెకు తాళి కట్టడం తరువాత ఆమె భర్తగా ఉండలేక రాజా బాధపడడం లాంటి కొన్ని సంఘటనలు వ్యక్తిగతంగా నాకు మింగుడు పడకపోయినా ఈ సినిమాలోని వినూత్నమైన సంగీతం కోసం ఈ సినిమాను చూడడం జరిగింది. ముఖ్యంగా ‘సుడి గాలిలోన దీపం’ అనే విషాద గీతంలోని సాహిత్యం, సంగీతం బాగుంటాయి.

ఒక కన్ను నవ్వేటి వేళలో.. ఒక కన్ను చమరించసాగునా?

ఒకచోట రాగాలు వికసించునా.. ఒక చోట హృదయాలు ద్రవియించునా ?

ఒకచోట హృదయాలు ద్రవియించునా?

ఎనలేని ప్రాణదానం.. ఎద బాధ తీర్చునా?..

అంటూ సినిమా కథను ఆ పాత్రల మనసులోని అంతర్మథనాన్ని ఘంటసాల గారు అద్భుతంగా గానం చేసారు. ఈ సినిమాలో మర్చిపోలేని పాట ఇది. చిన్న పాత్రల్లో కూడా శ్రీరంజని, నాగయ్య, రమణా రెడ్డి, పద్మనాభం, హేమలత, జగ్గయ్య గార్లను చూస్తాం. ముఖ్యంగా సుశీలను కుటుంబ సభ్యులు తమ స్వార్థం కోసం వాడుకోవడాన్ని ప్రశ్నించే పాత్రలో రేలంగి గారు వారి రొటీన్ కామెడీ పాత్రలకు భిన్నంగా పెద్దతరహాతో కనిపించి అలరిస్తారు. ‘జీవిత చక్రం’ సినిమా కథా పరంగా అలరించదు కాని మంచి సంగీత ప్రధాన కుటుంబ కథా చిత్రాన్ని అలనాటి పాత సినిమాని చూడాలనుకునే వారిని ఆనందింపజేస్తుంది. చిన్న చిన్న పాత్రలలో కనిపించే ప్రధాన తారలు, తెలుగుతనంతో నిండిన వారి డైలాగ్ మాడ్యులేషన్ ఎంజాయ్ చేస్తాం ఈ సినిమాలో. ఇందులో సీనియర్ ఎన్.టి.ఆర్. గారితో అన్ని రకాల ఎమోషన్లను పండించే ప్రయత్నం చేసారు దర్శకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here