మధురమైన బాధ – గురుదత్ సినిమా 12 – భరోసా

0
4

[box type=’note’ fontsize=’16’] గురుదత్ నటించిన ‘భరోసా’ సినిమాని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

[dropcap]1[/dropcap]963లో గురుదత్, ఆశా పారెఖ్ కలిసి నటించిన సినిమా ‘భరోసా’. ఈ సినిమాకు అప్పట్లో దక్షిణ భారత దేశంలో పెద్ద దర్శకుడిగా పేరు పొందిన కె. శంకర్ దర్శకత్వం వహించారు. సెంట్రల్ స్టూడియోస్, పక్షిరాజా స్టూడియోస్, ఏవిఎం స్టూడియోస్ లాంటి పెద్ద సంస్థలతో పని చేసిన దర్శకుడు ఆయన. తెలుగు, తెమిళం, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 80కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు కె. శంకర్. ‘భూకైలాస్’, ‘శ్రీ కాళహాస్తీశ్వర మహత్యం’ సినిమాల దర్శకుడిగా తెలుగువారు ఆయనను ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. తమిళంలో ఎం.జి.ఆర్.కు ఇష్టమైన దర్శకుడు ఈయన.

‘భరోసా’ సినిమా పెద్ద మ్యూజికల్ హిట్. ఇప్పటికీ కూడా ఈ సినిమాలోని అన్ని పాటలూ పాపులరే. సినిమాలో మొత్తం ఎనిమిది పాటలుంటే రఫీ, లత, ఆశా లతో పాటూ ఒక పాటను మహేంద్ర కపూర్ పాడారు. ఈ సినిమా తయారయ్యే సమయంలో గాయకులకు రాయల్టీ విషయంలో లతా రఫీల నడుమ విభేదాలు పొడచూపాయి. ఇద్దరూ కలసి పాడటం మానేశారు. అందుకే ఈ సినిమాలోని రెండు యుగళగీతాల్లో రఫీ, ఆశాలు కాహే ఇత్నా గుమాన్ అనే పాటపాడితే, లతా మహేంద్రకపూర్‌లు ఆజ్ కె ములాకాత్ బస్ ఇత్నీ అనే యుగళగీతం పాడారు. అందుకే, ఒకే సినిమాలో ఇద్దరు గాయకులు గురుదత్ పాటపాడేరు. గురుదత్ కు మహేంద్ర కపూర్ స్వరం ఈ ఒక్క సినిమాలోనే వాడేరు. మహేంద్ర కపూర్ హిట్ పాటలలో ఒకటిగా శాశ్వతంగా నిలిచిపోయింది ఈపాట . ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించింది రవి. రవి సంగీత దర్శకత్వంలో మహేంద్ర కపూర్ చాలా హీట్ గీతాలు పాడారు.

మిగతా  పాటల్లో,  “వో దిల్ కహా సే లావూ” అంటూ లతా మంగేష్కర్ పాడిన విషాద గీతం వారి సూపర్ హిట్ పాటలలో ఒకటిగా నిలిచిపోతుంది. “యె జుఖె జుఖె నైనా”, “ఇస్ భరీ దునియా మే” అనే సోలో గీతలు రఫీ హిట్స్‌లో కనిపిస్తాయి. ఈ పాటలను రాజేంద్ర కిషన్ రాసారు. అప్పట్లో సినీ రచయితలలో చాలా లో-ప్రొఫైల్ మెయింటెయిన్ చేసిన వ్యక్తి రాజేంద్ర కిషన్. పెద్దగా ఎక్కడా సినీ ఫంక్షన్లలో కూడా కనిపించే వారు కాదు. కాని గొప్ప సంభాషణల, పాటల రచయితగా పేరు తెచ్చుకున్నారు.

ఈ సినిమాలో కథానాయకుడు గురుదత్. వారిలోని ఆత్మ అంతరించిపోయిన తరువాత ఇతరుల దర్శకత్వంలో ఒక కీ ఇచ్చిన బొమ్మగా మాత్రమే నటించే ఒక సాధారణ నటుడిగా ఆయన మారిపోయిన క్రమంలో వచ్చిన ఈ సినిమాలో గురుదత్ చాలా చలాకీగా కనిపించే ప్రయత్నం చేసినా, వారి నటన పెద్దగా ఆకట్టుకోదు. కాని సినిమా మొత్తం నడిపించిన నటులు ఇద్దరు. ఒకరు కన్హైయాలాల్. ఇది పూర్తిగా అతని సినిమా అని చెప్పుకోవాలి. రెండవది సులోచనా చటర్జీ అనే బెంగాలీ నటి. కన్హైయాలాల్ భార్యగా ఆవిడ ఫర్మామెన్స్ చాలా బవుంటుంది. వీరి గురించి చాలా మందికి తెలియదు కాని ఈ సినిమాలో వారు తన పాత్రకు చేసిన న్యాయం మిగతా పాత్రల వైపు ఆడియన్స్‌ను చూడనివ్వదు.

డ్రామా ఆర్టిస్ట్‌గా కెరియర్ మొదలుపెట్టిన కన్హైయాలాల్ దర్శకత్వం, లేదా రచనా రంగంలో తనను తాను నిరూపించుకోవాలనే ఉద్దేశంతో బొంబాయి వచ్చారు. కాని అనుకోకుండా నటుడిగా మారిపోయారు. మెహబూబ్ ఖాన్ ‘ఔరత్’ సినిమా తరువాత ఆయన వెనుతిరిగి చూడలేదు. ఇదే సినిమా పదిహేడు సంవత్సరాల తరువాత మళ్ళీ ‘మదర్ ఇండియా’గా తీసినప్పుడు అందరు నటులు మారినా సుఖీలాల్ పాత్రలో మాత్రం మళ్ళీ కన్హైయాలాల్‌నే మెహబూబ్ ఖాన్ తీసుకున్నారంటే ఆయన నటనా ప్రతిభ అర్థం అవుతుంది. ‘భరోసా’ సినిమాను కన్హైయాలాల్ ఆసాంతం నడిపిన తీరు అద్భుతం.

ఒక వ్యాపారస్థునికి టీబీ వస్తుంది. అతను శానిటోరియంలో చేరాలని డాక్టర్లు చెబుతారు. భార్య చనిపోయిన ఈ వ్యాపారస్థునికి ఒక చిన్నకొడుకు ఉంటాడు. ఆ బిడ్డను తన దగ్గర పని చేసే రౌనక్ లాల్ వద్ద వదులుతూ ఆ దంపుతులు తన బిడ్డను జాగ్రత్తగా పెంచాలని అతను కోరతాడు. ఆ బిడ్డ పోషణకు తన దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చి శానిటోరియంలో చేరడానికి వెళ్ళిపోతాడు. రౌనక్ లాల్ స్వార్ధపరుడు. యజమాని డబ్బుతో తన భవిష్యత్తు నిర్మించుకోవాలని ఆలోచిస్తాడు. యజమాని చనిపోయాడని పుకారు పుట్టించి తాను రంగూన్ వెళ్ళిపోతున్నానని అక్కడి వారికి చెప్పి మరో ఊరు చేరుకుంటాడు. అక్కడ ఒక పెద్ద ఇల్లు, పొలం కొనుక్కుని యజమాని కొడుకు బంసీని పొలం పనికి ఉపయోగించుకుంటూ ఉంటాడు. మరో ఊరు చేరిన తరువాత, అతని భార్య లక్ష్మి ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డకు దీపక్ అని పేరు పెట్టుకుని, అతన్ని పెద్ద చదువులు చదివిస్తూ, ఆ చదువు కోసం డబ్బు ఖర్చుపెడుతూ ఉంటాడు రౌనక్ లాల్.

రౌనక్ లాల్ మిత్రుడు శివచరణ్ దాస్ అతనికి ఎంతో సహయం చేస్తాడు. దీపక్ చదువుకు డబ్బు అప్పుగా ఇస్తాడు. అతని కూతురు గోమతిని దీపక్‌కి ఇచ్చి వివాహం జరిపించాలని కోరతాడు. కాని గోమతి బంసీని ప్రేమిస్తుంది. దీపక్ కోసం బంసీ గోమతి ప్రేమను త్యాగం చేయాలనుకుంటాడు. కాని గోమతి తాను దీపక్‌ను వివాహం చేసుకోనని తండ్రికి ఎదురు తిరుగుతుంది. గోమతి ఆస్తిపై కన్ను వేసిన రౌనక్ లాల్ బంసీ అదే ఊరిలో ఉంటే గోమతి తమ మాట వినదని ఆలోచించి అతన్ని ఇంటి నుండి గెంటేస్తాడు. ఈ లోపు పట్నంలో చెడు స్నేహాలు చేస్తూ విలాసాలకు అలవాటు పడిన దీపక్ చదువు మానేసి తానో కోటీశ్వరుని కొడుకునని లక్ష్మీప్రసాద్ అనే లక్షాధికారిని మోసగించి అతని కూతురికి దగ్గరవుతాడు. ఈ సంగతి తెలిసి రౌనక్ లాల్ కొడుకు తెలివికి సంతోషించి, ఈ సారి గోమతి ఆ ఊర్లో ఉంటే ప్రమాదం అని ఆమెను బంసీని వెతకమని చెప్పి పట్నం పంపేస్తాడు. ఆమె అడ్డు తొలగించుకుని దీపక్ పెళ్ళి లక్ష్మీప్రసాద్ కూతురుతో జరిగేలా సహాయపడతాడు. దీపక్ మోసం తెలిసిన తరువాత లక్ష్మీ ప్రసాద్ ఏమీ చేయలేని నిస్సహాయుడవుతాడు.

పట్నంలో బంసీ తన కన్నతండ్రి రామ్ దాస్ వద్దే పనిలోకి చేరతాడు. రామ్ దాస్ తన కొడుకు కోసం ఇంకా వెతుకుతూనే ఉంటాడు. లక్ష్మీ ప్రసాద్ ఈయన స్నేహితుడు. తన కూతురి పెళ్ళి ఆల్బం రాందాస్‌కు చూపినప్పుడూ అతను రౌనక్ లాల్‌ని గుర్తు పడతాడు. అతని కథ విన్న లక్ష్మీ ప్రసాద్ దీపక్ రామ్ దాస్ కొడుకని, కోట్లకు వారసుడని నమ్ముతాడు. బంసీ గురించి అతనికి తెలియదు. దీపక్‌ను రామ్ దాస్‌కు పరిచయం చేస్తాడు. అతనే తన కొడుకు అని రామ్ దాస్ అనుకుంటాడు. ఆస్తి కోసం దీపక్ కూడా రామ్ దాస్ కొడుకుగా ఆ ఇంట్లో చేరతాడు.

పెళ్ళి తరువాత దీపక్ తల్లి తండ్రులను నిర్లక్ష్యం చేయడంలో రౌనక్ లాల్ కాలు పోగొట్టుకుంటాడు. ఆ భార్యా భర్తలు హీన స్థితిలోకి చేరినప్పుడూ బంసీ వారిని చేరదీస్తాడు. అతని కోసం వెతుక్కుంటూ పట్నం వచ్చిన గోమతి, గోమతి తండ్రి అందరూ పట్నంలో తిరిగి కలుసుకుంటారు. చివరకు కొన్ని నాటకీయ పరిణామాల తరువాత బంసీ రాందాస్ కన్న కొడుకని చెబుతూ తాను చేసిన పాపం అందరి ముందు ఒప్పుకుని రౌనక్ లాల్ బంసీని క్షమాపణ కోరతాడు. కుటుంబంలో అందరినీ తనతో పాటు ఉండమని చెబుతూ బంసీ తన మంచి గుణాన్ని ప్రదర్శిస్తాడు.

ఈ సినిమాలో బంసీ పాత్ర కోసం గురుదత్ చేత జానపద నృత్యం చేయిస్తారు దర్శకులు. ఆయన సినిమా కెరీర్‌లో ఇలా నృత్యం చేసిన పాత్ర ఇది ఒక్కటే. కాని ఆశా పారెఖ్ ముందు తేలిపోతారు గురుదత్. హీరోగా అతన్ని చాలా అందంగా చూపడంలో శంకర్ సఫలం అయ్యారు. కెరీర్ చివర్లో గురుదత్ చేసిన సినిమాలలో అన్నీ కూడా పల్లెటూరి అమాయక పాత్రలే. వారి సొంత సినిమాలో చూపే క్లోజ్ అప్ షాట్లు ఇందులో కనిపించవు. ఎక్కడా గురుదత్ సొంత స్టైల్ ఉండని సినిమాలు ఇవి. పూర్తిగా ఆ దర్శకుల చేతిలో నటుడిగా ఆయన మిగిలిపోయారన్నది గమనించవచ్చు.

“ఇస్ భరీ దునియా మే” అన్న విషాద గీతం గురుదత్ స్టైల్‌కు దగ్గరగా నిలిచే గీతం. ఇందులో చరణాలు ‘ప్యాసా’ సినిమాలో ‘జానె వొ కైసే లోగ్ థె జిన్కే” పాటకు చాలా దగ్గరగా ఉంటాయి. “లోగ్ రోరో కె భీ ఇస్ దునియా మె జీ లేతే హై, ఇక్ హమ్ హై కి హసే భీ తొ గుజారా నా హువా” అనే ఈ పాటలోని వాక్యాలు విన్నప్పుడు ‘ప్యాసా’ సినిమా లోని పాట నుంచి “హమ్ నె తొ జబ్ కలియా మాంగీ కాకాంటో కా హార్ మిలా” అన్న వాక్యం గుర్తుకు వస్తుంది. అలాగే “ఇక్ ముహబ్బత్ కె సివా ఔర్ న కుఛ మాంగా థా, క్యా కరే యె భీ జమానే కొ గవారా నా హువా… ఆసమాన్ జిత్నె సితారె హై తెరీ మెహఫిల్ మె అప్ని తకదీర్ కా హీ కొయీ సితారా నా హువా” అన్న మిగతా వాక్యాలన్నీ కూడా అదే పాట మూడ్‌ని మళ్లీ గుర్తుకు తెస్తాయి. కాని పాట చిత్రీకరణను గమనిస్తే, ‘ప్యాసా’లో పాటకు ఈ పాటకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ పాటలో భావన బంసీ అనుభవిస్తున్న ఒంటరితనం, ప్యాసా సినిమాలో విజయ్ ఒంటరితనం ఒకటే అయినా, అద్భుతంగా ఈ పాటను రఫీ గానం చేసినా, చిత్రీకరణ విషయానికి వస్తే గురుదత్ దర్శకత్వం వహించిన సినిమాలలోని పాటలకు ఈ పాటను పోల్చి చూసుకుంటే ఇది ఆ పాటలు ముందు నిలవదు. దర్శకత్వం, పాట చిత్రీకరణ ఎంతగా పాటను సజీవం చేయగలవో ఈ రెండు సినిమాలలో ఇదే సందర్భంలో వచ్చే పాటలను గమనించి, ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ‘ప్యాసా’ పాట లోని విషాదాన్ని స్క్రీన్‌పై అప్పుడు పండించింది గురుదత్. ‘భరోసా’ సినిమాలోని ఈ పాటలో ఉన్నది కూడా గురుదత్. కాని ‘ప్యాసా’ పూర్తిగా గురుదత్ తన మనసుతో చిత్రించిన కావ్యం, ‘భరోసా’లో గురుదత్ మరో దర్శకుడు చెప్పినట్లు నటించిన నటుడు. ఒకే రకమైన విషాదం, సాహిత్యం ఈ రెండు పాటలలో గమనిస్తాం కాని చిత్రీకరణ ఈ రెండు పాటల స్థాయిని మార్చివేసింది. గురుదత్ దర్శకత్వ ప్రతిభను విశ్లేషించే క్రమంలో ఇలా అతనే నటించిన ఒకే రకమైన రెండు పాటలు ఒకటి ఆయన దర్శకత్వం వహించింది, మరొకటి మరొకరి దర్శకత్వంలో వచ్చింది ఈ రెంటిని పరిశీలిస్తే కనిపించే తేడా ఆశ్చర్యపరుస్తుంది. అందుకే సినీ విశ్లేషకులు, సినిమాలో పాటల చిత్రీకరణలో గురుదత్‌ని మించిన మరో దర్శకుడు రాలేదని ఇప్పటికీ అంటారు.

‘భరోసా’ సినిమా అప్పట్లో హిట్ గానే నిలిచింది. ఈ సినిమాలోని పాటలు సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంటాయి. హాస్య పాత్రలలో మెహమూద్, శోభా ఖోటే బాగా చేసారు. గురుదత్ మెహమూద్‌ని ఎప్పుడూ ప్రోత్సాహపరుస్తూనే ఉన్నారు. గురుదత్ ప్యాసాలో అతనికి మొదట నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెహమూద్‌కి అవకాశం ఇచ్చారు. అయితే తరువాత మెహమూద్ గురుదత్ నటించిన ‘సాంజ్ ఔర్ సవేరా’లో ఒక సాత్వికమైన పాత్ర పోషించి, ‘భరోసా’లో మరో హాస్యం కలగలిసి ఉన్న పాత్రలో కనిపిస్తారు. అరవైల నుండి మెహమూద్ హాస్య పాత్రల వైపుకి మెల్లగా మరలడం గమనించవచ్చు. మెహమూద్ సోదరి మిన్నూ ముంతాజ్ గురుదత్ దర్శకత్వం వహించి నిర్మించిన అన్ని సినిమాలలో నాట్య ప్రధానమైన పాత్రలు పోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here