కైంకర్యము-27

0
3

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[dropcap]ఆ[/dropcap] దీపావళికి హైద్రాబాదు వచ్చాడు రాఘవ.

ఆ పండగకు అతని అక్కలు, అన్నలు అందరూ కూడా ఇల్లు చేరారు.

తల్లి ఆరోగ్యంగా తిరగటం చూసి సంతోషపడ్డారు అన్నగారు. ఇల్లంతా హడావిడి. అసలు ఆండాళ్ళుకు సమయం చాలటం లేదు.

“ఏంటమ్మా ఎలా ఉన్నావు? నీకు బిపి వచ్చిందని నాన్నగారు చెప్పారు…” అడిగాడు రాఘవ.

“నీవు పెట్టిన టెన్షనేరా. బాగా కంగారు పెడుతున్నావురా అమ్మని…” పెద్దక్క అన్నది తమ్ముడిని ఉడికిస్తూ.

“అవునురా దగ్గరుండి అమ్మను చూసుకోరా అంటే పూనే వెళ్ళిపోతావురా బడుద్దాయి…” చిన్నక్క చనువుగా కసిరింది.

“అమ్మకు నే ఉంటే టెన్షను, అని వెళ్ళిపోయానే…” అన్నాడు నవ్వుతూ రాఘవ.

“బావుందిరా. చిన్నవాడు వాడి మీద పడ్డారా మీరంతా…” అంటూ పెద్దన్న తమ్ముడికి వంత వచ్చాడు.

“మీరంతా ఇలా కబుర్లేనా? లేచి స్నానాలు జపాలు ఉన్నాయా?” పెద్దావిడ అదిలించింది.

“మా స్నానాలు జపాలు అయ్యాయి బామ్మా…” చెప్పాడు పెద్దబ్బాయి.

“నీవు కాదురా. ఈ చిన్నవాడినిలే అనేది. ఇదిగో ఈ ఆడపిల్లలని. పుట్టింటికి వస్తే ఒక్కరూ తెమలరు…” అన్నదామె.

“బామ్మా! నీకు సుందరకాండ చదివి వినిపిస్తాగాని ముందు ఇలా వచ్చి కూర్చో. అందరితో కాసేపు మాట్లాడు. క్రిందటి జన్మ రోగాలు కూడా పోతాయట నవ్వుతూ కుటుంబంతో గడిపితే…” అన్నది చిన్నకూతురు.

అందరు సరదాగా, ఒకళ్ళను ఒకరు ఆట పట్టిస్తూ కాలక్షేపం చేస్తున్నారు.

రాఘవకు టైం చిక్కితే పాత మిత్రబృందాన్ని కలవాలనుకున్నాడు కాని సమయం చిక్కటం లేదు. ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటున్నారు. ఎవ్వరూ లేకపోతే కాకపోతే పిల్లలు… బాబాయి.. అంటూ మామయ్య అంటూ అతని గదిలోనే కాపురం పెట్టేశారు.

రాఘవ చేసేది లేకపోయింది.

మరుసటి రోజు పెద్దన్న వచ్చి పిలిచాడు.

“రాఘవా! బజారుకు వెడదాంరా. అందరికీ బట్టలు కొందాము. పండక్కి…” అన్నాడు.

“నేనెందుకు అన్నయ్యా! వదిననో, అక్కలనో తీసుకుపో…”

“సరేలేరా. వాళ్ళూ వెడుతున్నారు. మనం నాన్నగారికీ, నాగన్నకు మిగిలిన వాళ్ళకీ తెద్దాం. నీవు తయారుగా మాట్లాడకుండా…”

రాఘవ తయారయినాడు.

అన్నదమ్ములు బయటకెళ్ళారు. నాలుగు షాపులు తిప్పి అందరికీ బట్టలు తీసుకున్నాడు రాఘవ అన్న.

ఇద్దరూ షాపింగు అయ్యాక ఒక రెస్టారెంటులో కాఫీ త్రాగటానికి కూర్చున్నారు.

“రాఘవా ఎలా సాగుతోంది నీ చదువు? నీ ఫ్యూచరు ప్లాన్సు ఏంటి?” అడిగాడు అన్న.

“బానే సాగుతోంది. మేనేజ్‌మెంటు అయ్యాక నేను ఎక్కడైనా చేరుతాను. లేదా కుదిరితే ఒక ఇండస్ట్రీ మొదలెడతా…”

“అమ్మ నిన్ను వదిలి ఉండలేదని నీకు తెలుసు కదా!”

“అందుకేగా నే ఇక్కడే చూసుకుంటా అంటున్నా…” కొద్దిగా చికాకు ధ్వనించింది రాఘవ గొంతులో.

అది అర్థమయింది అన్నకు.

“సరేరా. అమ్మ హెల్త్ కొంచెం సెన్సిటివైయింది. తనకు మైల్డ్‌గా స్ట్రోకు వచ్చింది. ఇది అందరికీ తెలియదు. చెప్పకెవరికీ. కాని అమ్మ మాటకు ఎదురుచెప్పకు. ఆమెకు హార్టు మీదకు తీసుకుంటుంది…” చెప్పాడతను.

రాఘవకు తల్లి హెల్త్ విషయం షాకింగులా ఉంది. అతను మాట్లాడలేదు. మౌనంగా తల ఊపాడు.

***.

ఎంత మంది పనివారున్నా ఆండాళ్ళుకు పిల్లలకు తనే చెయ్యాలన్న సరదా.

కానీ ఎవ్వరూ ఆమెను పని చెయ్యనివ్వటం లేదు. ఇంట్లో ఆటలు, పాటలతో రోజుకో పండుగలా సాగుతోంది. దీపావళి చాలా ఘనంగా హడావిడిగా జరిగింది.

నరక చతుర్దశి రోజు పిల్లలకు తలస్నానాలు, పెద్దలకు దిష్టి తీసే పని ఆండాళ్ళే నిర్వహించింది.

అందరూ ఉదయమే నరకుడిని కాల్చి టపాసులతో పండుగ చేసుకున్నారు.

దీపావళికి లక్ష్మి పూజ చేసారు. వేద పండితులు వచ్చి ఘనం చదివి ఆశీర్వదించారు. వారికి దక్షిణలు బట్టలు ఇచ్చి పంపింది ఆండాళ్ళు.

పండుగ మూలంగా చాలా సంవత్సరాలకు పిల్లలంతా ఇంటికి వచ్చారని సుదర్శనాచారి సంతోషపడ్డాడు.

ఈ రకంగా ఆండాళ్ళు హృద్రోగం తగ్గుతుందని ఆయన భావించాడు.

దీపావళి తరువాత అందరూ ఒకరొక్కరే వెళ్ళిపోయారు.

“నీవు కొద్ది రోజులు ఉండరా…” అన్నది రాఘవతో ఆండాళ్ళు.

“లేదమ్మా! క్లాసులు మిస్సైతే మళ్ళీ పరీక్ష తప్పుతాను…” అన్నాడు. ‘అసలు మిస్ అయ్యేది విద్యను’ అనుకున్నాడు మనసులో మాత్రం.

“అందరి మధ్య నీతో సమయం చిక్కలేదు. ఓ వారం ఉండి వెళ్ళరా…” బ్రతిమిలాడుతూ ఆండాళ్ళు.

“మళ్ళీ వస్తాను…” అన్నాడు.

ఆమెకు రాజన్నకూతురు ప్రసన్నలక్ష్మి విషయం చెప్పాలని అనిపించినా రాఘవ సమయం ఇవ్వక వెళ్ళిపోయాడు.

ఏమీ తోచక మౌనంగా ఉండిపోయింది ఆండాళ్ళు. ఆమెకు కొడుకు చేత ‘సరే’ అనిపించి రాజన్న వాళ్ళతో మాట్లాడాలనుకుంది. అంతా సరే అనుకున్నాక కొడుకొచ్చి వద్దంటే పరువు నిలబడదని ఆమె భయం. తను చెబితే కొడుకు వింటాడన్న గట్టి నమ్మకం కూడా ఉంది ఆమెకు. కాని ఎక్కడో ఒక చిన్నపాటి అనుమానం.

ఆమెకు ప్రసన్నలక్ష్మి చాలా సార్లు గుర్తుకువస్తుంది.

కూతుర్లతో ఆ అమ్మాయి గురించి మాట్లాడింది కూడా.

“మా రాజన్న అదే నీకు మామ వరస అవుతాడులే, వాళ్ళ పిల్లను సంక్రాంతికి రంగమామ ఇంటికెళ్ళినప్పుడు చూసానే…” అంది దీపావళి కొచ్చిన పెద్ద కూతురుతో

పెద్దకూతురు విని సంతోషపడింది. “నీకు నచ్చిందా ఆ అమ్మాయి?”

“అవును. మన రాఘవకు అడగాలనుకున్నా, కానీ వాళ్ళు చాలా పేదవాళ్ళు. ముందుగా నాన్నగారితో మాట్లాడి, వాడేమంటాడో తెలుసుకొని అడగాలని ఆగాను…”

“నాన్న కానీ వాడు కాని ఏమంటారమ్మా. నీకు నచ్చింది. పైపెచ్చు మేనకోడలే. నీవు దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నావు. నీకు నచ్చినదైతే హాయి.” అన్నది కూతురు.

“అంతే నంటావా…”

“అమ్మా! నీవు అన్నింటికీ కంగారు పడకు. హాయిగా ఉండు. నీకు నచ్చితే తమ్ముడు కాదంటాడా ఏమి? నే చెప్పనా వాడికి?”

“వద్దులే. నేనే చెబుతానుగా…” అంటూ ఆపింది.

మొత్తానికి రాఘవకు ఆండాళ్ళు తెచ్చిన పెళ్ళికూతురు విషయం తెలియనేలేదు. అతను పూనే వెళ్ళిపోయాడు. ఆండాళ్ళూ రాజన్న వాళ్ళకు కబురు పంపాలనుకున్నా దుడుకుదుడుకుగా అనిపించి లోలోపల మౌనంగా ఉండిపోయింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here