[box type=’note’ fontsize=’16’] శ్రీమతి ప్రమీలా రాణి ఈరంకి రచించిన ‘ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]డి[/dropcap]గ్రీ పరీక్షలు అయిపోయాయి. ఫస్ట్ క్లాస్ గ్యారంటీ ఆత్మవిశ్వాసంతో అనుకుంది రవళి. ఇంకో ముఖ్యమైన పరీక్ష వుంది. అది సంహిత అనే పరీక్ష. అందులో ఫస్ట్ క్లాస్ లభిస్తే తన సంతోషం పట్టశక్యం కాదు.
కానీ సంహితతో ఇన్నిరోజులు మాట్లాడింది వేరు. ఇప్పుడు మాట్లాడబోయేది వేరు. తను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దాన్ని సంహిత చక్కగా రిసీవ్ చేసుకోగలగాలి. అప్పుడు సంహిత కళ్ళల్లో కాదు నీరజ కళ్ళల్లో ఆనందం, సంతృప్తి చూడాలి.
“ఏమిటి రవళీ, ఎప్పుడూ లేనిది ఇలా పార్కులో కలుద్దామన్నావు.”
“ఏం ఇంటిలో ఏమైనా పని వుందా?”
“లేదు. కానీ నీకిలా పార్కుల్లో, పబ్లిక్ ప్లేసుల్లో కలవడం ఇష్టం ఉండదుగా.”
“అప్పుడంటే చిన్నవాళ్ళం సంహితా, ఎవరైనా అబ్బాయిలు ఎంత చిన్న కామెంట్ చేసినా ఏడుపు వచ్చేది. ఇప్పుడు మనం డిగ్రీ పూర్తిచేశాం. ఏమిటీ నీ ఫ్యూచర్ ప్లాన్స్.”
“నీ ప్లాన్స్ ఏమిటి?” అడిగింది సంహిత.
“అమ్మ బ్యాంక్ ఎగ్జామ్స్ రాయమంటోంది. సి.ఎ చేస్తే ఎలా వుంటుంది అని కూడా ఒక ఆలోచన ఉంది.”
సంహిత మాట్లాడలేదు.
“మాట్లాడవేం సంహితా”
“నా ఆలోచన నీకు నచ్చదు. నాకు పెళ్ళి చేసుకుని సెటిల్ అవుదామని వుంది.”
“మంచి ఆలోచనే సంహితా, ఇందులో నాకు నచ్చకపోవడానికేముంది. ఇది నీకు వచ్చిన ఐడియానా లేక అమ్మగారు, నాన్నగారు సంబంధాలు చూస్తున్నారా?”
“ఎవరి ఆలోచన అయితేనేం? ఇప్పుడు పెళ్ళి చేసుకోవడం మంచిదా కాదా?”
“ఇంకా క్వాలిఫికేషన్ సంపాదించి ఉద్యోగం వచ్చాకే పెళ్ళి చేసుకోవచ్చుగా”
“అబ్బా ఇంకా చదివే ఓపిక నాకు లేదోయ్. లైఫ్‍లో సెటిల్ అవ్వడం అంటే మొదటిది ఉద్యోగం. రెండవది పెళ్ళి. నా సెలక్షన్ రెండోదానికే.”
“సరే నీ ఇష్టం. యింతకీ ఆ అబ్బాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా”
“నీకు తెలిసినవాడే, భార్గవ్.”
“అతనా… ఏం ఉద్యోగం చేస్తాడు? ఏం చదువుకున్నాడు?”
“పాలిటెక్నిక్ పాసయ్యాడు. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తాడట.”
“ఇవన్నీ ఎప్పటికి అవుతాయి సంహితా. అతని అందం, అర్హత ఏమాత్రం నీకు సరితూగవు. అప్సరసలా ఉండే నీ అందం, చక్కని తెలివితేటలు, మంచి కుటుంబం, ఇన్నివున్న నీకు అతను సరితూగడు. వయసు కూడా ఎక్కువే అతనికి. ఇన్ని లోపాలతో ఈ పెళ్ళి…. ఆలోచించు సంహిత.”
“అతనికి నేనంటే చాలా యిష్టం. నాకోసం ఈ వూరు వచ్చాడు. విశాఖ కూడా వచ్చాడు. నీరజ అతన్ని తిట్టి పంపించింది. నన్ను అతను ప్రేమిస్తున్నాడని దానికి ఈర్ష్య.”
రవళి నవ్వింది.
“ఆ… ఇంతోటి రాకుమారుడు దొరకడని నీరజా నేనూ ఈర్ష్వ పడాలా?”
“అతని ప్రేమించే హృదయం…”
“సినిమాల్లో పాత్రలాగ మాట్లాడకు సంహిత. ఏమిటి ప్రేమించే హృదయం. తల్లి తండ్రుల కంటే, తోబుట్టువుల కంటే అతడు నిన్ను ఎక్కువ ప్రేమించేస్తాడా? అసలు ప్రేమంటే మీ యిద్దరికి తెలుసా… అది బాధ్యతతో కూడినది.”
“అతనికి బాధ్యత ఉందో లేదో నీకేం తెలుసు.”
“బాధ్యత ఉన్నవాడు తరుచూ ఉత్తరాలు రాసి నిన్ను డిస్ట్రబ్ చెయ్యడు. అసలు అంత బాధ్యత గలవాడైతే నీలాంటి వజ్రం ముందు తనెంత గాజుపూసో తేల్చుకుని నీకు దూరంగా తొలగిపోతాడు. ఇంతకీ నీవెంట వూళ్ళోకి వచ్చాడంటావా, రైలు ఇంజన్లు, గుర్రబ్బళ్ళు కూడా వస్తాయి” కోపంగా అంది రవళి.
“నేను ప్రేమించినవాడిని గుర్రబ్బండితో పోలుస్తావా” కోపంగా అంది సంహిత.
“తప్పే. అసలైన గుర్రానివి నువ్వే, కళ్ళకు గంతలు కట్టుకు ప్రవర్తిస్తున్నావ్. అతడు నీ ప్రేమకు ఏమాత్రం అర్హుడు కాదు అంటే వినిపించుకోవేం.”
“అవన్నీ ఆలోచించి ప్రేమిస్తే ప్రేమ కాదు అది. అతను నన్ను ఎప్పటికీ ప్రేమగా చూసుకుంటే చాలదా.”
“అలా చూసుకుంటాడని ఏమిటీ గ్యారంటీ.”
“పెద్దవాళ్ళు సంబంధం చూసి చేస్తే మాత్రం బాగా చూసుకుంటాడని నమ్మకం ఏమిటీ?”
ఈ ప్రశ్నకు రవళి దగ్గర సమాధానం లేదు.
“కానీ ఒకటి మాత్రం నిజం సంహితా. నువ్వు చెప్పే ప్రేమ ఒక మనిషి తీసుకునే నిర్ణయం. పెద్దవాళ్ళు చేసే పెళ్ళిలో ఆలోచన వుంటుంది. పదిమంది ఆలోచిస్తారు కాబట్టి తప్పులు జరిగే అవకాశం తక్కువ.”
“అంటే అక్కడ మనకేం ప్రాధాన్యత లేదు. ఫలానా వాడివి నువ్వు ప్రేమించు, మేం సెలక్ట్ చేశాం అంటారు, అంతేగా…”
“నీ దగ్గర విలువైన వజ్రం వుందనుకో, దాన్ని బంగారంతో కలిపి ధరిస్తావు గాని ఎదురుగా వుందని బంకమట్టిలో పొదగలేవుగా. ఎంతో కష్టపడి, ప్రేమగా పెంచిన ఆడపిల్లని దారినపొయ్యే దానయ్యకి ఇస్తారని నువ్వెలా అనుకుంటున్నావు.
సంహితా నామాట విను నీకు వయసు మించిపోలేదు. ఈ కాలంలో ఈ డిగ్రీ విద్యార్హత సరిపోదు. కొన్నాళ్ళు నీ మనసుని, టైముని చదువులో పెట్టు. చదవాలని లేకపోతే…. మరే కళారంగంలోనూ నిన్ను నువ్వు లీనం చేసుకో. వయసు, అనుభవం పెరిగే కొద్దీ ఒకప్పుడు మనం ఆశపడ్డది ఈ అల్పమైన విషయాల కోసమా అనిపిస్తుంది.”
సంహిత మాట్లాడలేదు. ఆమెకు రవళిని చూస్తే ఆశ్చర్యంగా వుంది. నిజానికి ఆమె తనకంటే రెండు నెలలు చిన్నది. కానీ ఎంత మెచ్యూర్డ్‌గా మాట్లాడుతోంది. కానీ తను భార్గవ్‍ను వదులుకోగలదా? అతని అభిరుచులు, ఇష్టాలు తనకి తెలుసు. అలాగే తన అభిప్రాయాలు, ఇష్టాలు అతనికి తెలుసు.
సంహిత మనసు భార్గవ్ వైపే మొగ్గుతోంది. ఇద్దరూ అయిదు నిమిషాలు మాట్లాడుకోలేదు. ఆలోచించుకోవడానికి ఒకరికొకరు టైము ఇచ్చుకోవాలి అన్నట్టు, ఏ నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు.
***
జరిగిన చర్చ గురించి నీరజకు ఉత్తరం రాయాలనుకుంది రవళి. ఏమని రాస్తుంది? ఆమె చెప్పిన పని మొదలుపెట్టింది గానీ పూర్తిచేయలేదు. సంహిత ఆ భార్గవ్‍ను వదిలేటట్టు లేదు. నీరజే ఊరినుండి వచ్చింది. ఆమె ఇంటర్మీడీయట్ అవ్వగానే సెకండరీ గ్రేడు టీచర్ ట్రైనింగ్ తీసుకుని వైజాగ్‍లోనే ఓ ప్రయివేటు స్కూల్లో టీచరుగా పనిచేస్తోంది. తల్లీ, తండ్రి, అక్క ఎంత చెప్పినా వినలేదు.
“నేనేం తప్పు చేయడం లేదు. గౌరవంగా టీచర్ జాబ్ చేస్తున్నాను. ప్రైవేటుగా డిగ్రీ చదువుతున్నాను. కావాలంటే మీరే ట్రాన్స్‌ఫర్ చేయించుకుని వైజాగ్ రండి” అంది.
ఇంత తల్లిదండ్రులు ఏమీ మాట్లాడలేకపోయారు. ఎప్పుడూ లేనిది నీరజ ఒక్కత్తి వచ్చి సంహితను కలిసింది. సంహితకు రవళితో మాటలు అయిన దగ్గరనుండి ఆలోచనలు ఎక్కువయ్యాయి.
“డిగ్రీ తర్వాత ఏం చేస్తావు అక్కా” అడిగింది నీరజ.
“ఏం చేసినా, చెయ్యకపోయినా నీలా టీచర్‍ను కాను” అంది సంహిత.
“నీ హోదాకి సి.ఎ. చేస్తే బాగుంటుంది.”
“చూద్దాంలే…” సంభాషణ తుంచేసింది సంహిత.
***
రవికి పెళ్ళి కుదిరింది. గవర్నమెంటు జాబ్ వచ్చాక చేసుకోవచ్చు అని ఎందరు చెప్పినా వినలేదు. చాలారోజుల తర్వాత ఇంట్లో పెళ్ళి. ఈ తరంలో మొదటి పెళ్ళి. అందరికీ ఆనందంగానే వుంది.
రవళి తల్లి తండ్రులను తీసుకువెళ్ళి సంహిత కుటుంబాన్నంతా పెళ్ళికి ఆహ్వానించింది. దాదాపు ఆరేళ్ళుగా అదే వూళ్ళో వుంటున్నా ఇరు కుటుంబాలు కలుసుకోవడం అదే మొదటిసారి.
“మీ సంహిత అలా వుందేమిటి? ఎప్పుడూ నవ్వుతూ పలకరించేది” అంది ఆదిలక్ష్మి.
“బి.కాం తను మామూలుగా పాసయ్యిందమ్మా, క్లాసు రాలేదు.”
“పరీక్షకు వెళ్ళిన అందరికీ ఫస్ట్ క్లాస్ వస్తుందా? దానికి బాధపడితే ఎలా” అన్నాడు జగన్నాథం.
“వాళ్ళింట్లో అందరికన్నా సంహిత అందంగా వుంది. మనవాళ్ళమ్మాయైతే అన్నయ్యకు చేసుకునేవాళ్ళం”
ఆ మాట విన్న స్నేహ పకాపకా నవ్వింది.
“ఎందుకే ఆ నవ్వు” అడిగింది ఆదిలక్ష్మి.
“ఏం లేదులే నా చిన్నప్పటి జోక్ గుర్తుకువచ్చింది” అంది స్నేహ అక్క వైపు చూసి నవ్వుతూ. రవళి నవ్వేసింది.
***
పెళ్ళి రాజమండ్రిలో. ఆదిలక్ష్మి అన్నగారికి ఒక్కతె అమ్మాయి, అందుకని పెళ్ళి వైభవంగా చేశారు. పెళ్ళికి రవళితో పాటు, నీరజ, సంహితా వచ్చారు. ముకుందరావు, శకుంతల రిసెప్షన్‍కు వస్తామన్నారు. ఆ ఫంక్షన్‍లో అందరి కళ్ళూ సంహితమీదే. ఎవరా అమ్మాయి అని ఆరాలు గుసగుసలు. చాలా విచిత్రం ఏమంటే పెళ్ళికి భార్గవ్ వచ్చాడు. అంత వెలుగులో అంత దగ్గరగా ఫుల్ సూట్‍లో వున్న అతడిని పరిశీలనగా చూసింది రవళి. ఊహు సంహితకు ఎలా నచ్చాడో. ఆమె ముందు తేలిపోయాడు. నీరజకు మాత్రం ఒళ్ళు మండిపోతుంది. పరిస్థితులు అనుకూలించక వీళ్ళిద్దరికీ పెళ్ళి కాకపోతే ఏమిటి అక్క పరిస్థితి.
“అక్కా! భార్గవ్‍ను ఎవరు పిలిచారు? ఎందుకొచ్చాడీ పెళ్ళికి” అడిగింది నీరజ.
“కార్డులో బంధుమిత్ర సపరివార సమేతంగా అంటారుగా అలా వచ్చాడులే”
“పిలవని పేరంటానికి రావడం ఏంటక్కా…”
“అబ్బా రవళీ వాళ్ళకు లేని బాధ నీకెందుకే, పెళ్ళిని ఎంజాయ్ చెయ్యి”
“చేసినట్టే వుంది, మీ భార్గవ్ ఆడపిల్లలందరినీ చూస్తూ….”
“వెర్రి మాటలు మాట్లాడకు, మన చిన్నప్పటి పాతఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారేమో చూడు”
“అక్కర్లేదు ఉన్న మొహాల్ని వదిలించుకుంటే చాలు.”
నీరజకి మహా చిరాగ్గా కోపంగా ఉంది. విశాఖలో మొహం వాచేట్లు చివాట్లు పెట్టినా ఈ భార్గవ్‍కి బుద్ధి రాలేదు. అయినా వాడినని ఏం లాభం మన బంగారం మంచిది కానప్పుడు.
***
రవళి బి.కాంతో చదువు ముగించి బ్యాంక్ టెస్టులు రాయసాగింది. రవి ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా తనే రాజమండ్రి దగ్గర ఒక పల్లెటూరిలో స్కూలు పెట్టాడు. దాన్ని అతనూ శ్రావణి చూసుకుంటున్నారు.
రవళికి పెళ్ళి చేయాలని జగన్నాథంగారికి గట్టిపట్టుదలగా వుంది. తన తల్లీ, తండ్రి తను కన్యాదానం చేయడం చూడాలి. రవళికి మాత్రం పెళ్ళి చేసుకోవాలని లేదు.
రవి మగవాడైనా ఇంటి బాధ్యతలు తీసుకుంటాడన్న నమ్మకం కలగడం లేదు. పైగా తను ఉద్యోగం చేస్తే చూడాలని తల్లికి చిరకాల వాంఛ.
ఆ రోజు తెల్లవారుజామునే లేచి తను చదువుకుంటూ చెల్లెల్ని నిద్రలేపుతోంది రవళి… ఇంతలో ఫోన్. ఇంట్లోవాళ్లంతా లేస్తారని రవళి చప్పున ఫోన్ దగ్గరికి పరుగెత్తింది. అటునుంచి నీరజ.
“రవళీ! అక్క యింట్లో నుంచి వెళ్ళిపోయింది తెలుసా?”
“అలాగా… ఎప్పుడు… ఏమైనా గొడవ జరిగిందా? ఇంత పొద్దున్నే ఫోన్ వస్తే ఎవరికైనా బాగాలేదేమో అనుకున్నాను. సంహిత గురించి వినవలసి వస్తుందనుకోలేదు.”
“రాత్రి అందరూ బాగానే నిద్రపోయారు. నేను ఇప్పుడే నిద్రలేచి చూస్తే అక్క మంచం ఖాళీగా ఉంది. తను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానని వెతకవద్దని ఉత్తరం రాసి మంచంపై పెట్టింది. పెరటివైపు తలుపులు అటునుంచి గడియపెట్టబడి వున్నాయి.”
“అమ్మ, నాన్నగారికి చెప్పావా”
“లేదు… ముందు నీకే చెప్పాలనిపించింది”
“మా అన్నయ్య ఇక్కడ వుండడం లేదు. లేకపోతే వాడినైనా వెతకమని పంపేదాన్ని.”
“పారిపోయేవాళ్ళు మనం వెతికితే దొరుకుతారా? పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం అంత మంచిది కాదేమో కదా”
“అవును, ఏం చెయ్యాలో నాకు తెలియడం లేదు నీరజా. అమ్మ లేచింది ఏమిటని అడుగుతోంది. నేను కాసేపు అయ్యాక ఫోన్ చేస్తాను.” అని పెట్టేసింది.
“అందరూ నిద్రపోయే వేళ ఏమిటే ఆ ఫోన్‍లో కబుర్లు? ఏం చెయ్యాలో తెలియదంటావ్, ఎవరి గురించి?”
తల్లికి చెప్పాలా వద్దా…
“ఏమిటి ఫోను అందరు బాగానే ఉన్నారుగా” అంటూ వచ్చాడూ జగన్నాథం గారు.
జరిగింది చెప్పింది రవళి. దెబ్బకు నిద్రమత్తు వదిలిపోయింది ఇద్దరికీ.
“అయినా నీకు చెప్పడం ఏమిటి? పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలిగానీ”అన్నాడు జగన్నాథం.
ఇంతలో బామ్మగారు వచ్చి “ఏమిటే ఫోను మీరందరూ మాట్లాడుకుంటున్నారు, ఎవరికీ ఏం కాలేదుకదా.”
ఏం చెప్తారు ఆవిడకి? సంహిత ఎవరో తెలియదు. అయినా తను పారిపోయిన విషయం చెబితే బాగుంటుందా? కోపంలో సంహితను తిడితే తను భరించలేదు. ఇంతలో ఎప్పుడు లేచిందో స్నేహ – బామ్మగారు మరోసారి ప్రశ్నించే సరికి “అందరూ బాగానే వున్నారు బామ్మా. రైల్వే స్టేషను అనుకుని మనకు ఫోన్ చేశారు” అంది. ఆ మాటకి రవళికి తప్ప అందరికీ నవ్వొచ్చింది.
మిగతావాళ్లంతా ఎవరి పనుల్లో వాళ్ళున్నా రవళి ఇంక చదవలేకపోయింది. ఆమె మనసు దాదాపు ఆరేళ్ళ క్రితానికి సంహిత స్కూల్లో చేరిన మొదటిరోజులోకి వెళ్ళిపోయింది. ఎంత అందంగా ముగ్ధత్వంతో సంహిత తనకి పరిచయం అయ్యింది. తనకి ఎన్ని విషయాల్లో సహాయం చేసింది.
ఆమె పరిచయం అయ్యేవరకు తనకి తనమీద శ్రద్ధ వుందేది కాదు. జడవేసుకు పువ్వులు పెట్టుకోవాలని, రంగురంగు బట్టలు కట్టుకోవాలని పెద్ద సరదా వుండేది కాదు. స్నేహకు అన్నీ సరదాలు. తల్లి అలంకరణపై శ్రద్ధ వున్నందుకు దాన్ని, లేనందుకు తనని తిడుతుండేది. సంహిత ఎంత సుకుమారంగా, నాజుకుగా ఉంటుంది, ఆ మొరటువాడిని ఎలా ప్రేమించింది….
(ఇంకా ఉంది)