[dropcap]పు[/dropcap]స్తకంలోని పేజీల నడుమ దాచుకున్న
అపూర్వమైన అందమైన నెమలికలా
ఆకాశంలో తారల మధ్యన
వెలుగుతున్న చందమామలా
పూల వనంలో విహరిస్తున్న
రంగురంగుల సీతాకోక చిలుకల్లా
విశాలంగా పరుచుకున్న సంద్రం నుండి
వడివడిగా ఉర్కలేస్తున్న కెరటాల్లా
నా గుండెలో మబ్బుతునకలా
గూడుకట్టుకుంది మా ఊరు..!
ఇక్కడే నేను కనులు తెరిచాను
బుడిబుడి అడుగులు వేసాను
ముద్దు ముద్దు మాటలు నేర్చాను
కనిపించిన ప్రతి దృశ్యానికి
పరవశంతో ఉక్కిరి బిక్కిరయ్యాను
అనురాగాల జల్లుల్లో
తడిసి ముద్దనై పోయాను
కువకువరాగాల సంగీతంతో
జీవన తరంగాలను ఆస్వాదించాను..!
ఇప్పుడైనా.. ఎక్కడైనా
మరెక్కడైనా.. కానీ
నా ఆలోచనలన్నీ
నీ చుట్టూనే అల్లుకుంటాయి
అమృతధారల వంటి జ్ఞాపకాలు
ఒకటో రెండో అయితే చెప్పుకోవచ్చు
అపరిమితమైన వాటినెలా వ్యక్తం చేయను
నేనొక ప్రేమికుడిగా మారడానికి
నా మార్గాలు అసాధ్యమైనవి కావడానికి
నాలో విప్లవాంకురాలు చిగురించడానికి
నీవందించిన స్ఫూర్తిని మరువనెప్పుడు..!
కాల గమనంలో
బతుకుదెరువు కోసం
మరో చోటుకు వెళ్ళినా కూడా
నిన్ను వదిలింది లేదు ఏనాడూ
అప్పుడప్పుడు నా పాదాలు
నిన్ను స్పృశించినప్పుడు
తల్లిలా అక్కున చేర్చుకున్నావు
ఎట్లున్నవని పలకరిస్తున్నప్పుడు
తప్పిపోయిన పిల్లాడు
తల్లి ఒడిని చేరినట్టుగుంటది నాకెప్పుడు..!
నా కలల వాకిళ్ళను
అక్కున చేర్చుకున్న ఇండ్లవి
ఎందరెందరో గుర్తు పడుతుంటారు
ఏమేమో అడుగుతుంటారు
తెలిసీ తెలియని బాల్యం సంగతులు
మదిలో నిత్యం నెమరు వేస్తూనే ఉంటాయి
కొన్ని చిరునవ్వులు కొన్ని చిరు కోపాలు
కొన్ని అనురాగపు అనుబంధాలు
కొన్ని విషాదాలు కొన్ని కౌగలింతలు
ఒక తరానికి సరిపడినంత అనుభవాలు..!
ఒక వీధి అరుగును చూస్తాను
నా అనుభూతులు జ్ఞప్తికి వస్తాయి
ప్రతి గడప చెప్పే సంగతులు
మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తుంటాయి
ఆ మనుషులతోడి సంబంధాలను
ఇప్పుడున్న పరిస్థితులతో పోల్చడం
నాకు అసాధ్యమే అవుతుంది..!
చెరువు గట్లమీద తాడి చెట్లు
మిత్రులతో కలిసి తిరిగిన దారులు
చుట్టూ అల్లుకున్న కంచెలలో
జులాయిగ తిరిగిన రోజులు
తెరిచిన పుస్తకంలా కనిపిస్తాయి
గుంపులు గుంపులుగా నడుచుకుంటూ
బడికెళ్ళిన తీపి గుర్తుల
తాజాదనమింకా తగ్గనేలేదు..!
ఊరంటే సకల శాస్త్రాల విశ్వవిద్యాలయం
ఊరంటే కురుస్తున్న వెన్నెల చల్లదనం
ఊరంటే విడువని అనుబంధాల స్రవంతి
ఊరంటే వెలుగులనిచ్చే తూర్పు కొండ
ఊరంటే పరవళ్ళు తొక్కే సమూహం
ఊరంటే పంట పొలాల కౌగిలింత
ఊరంటే అడవుల పచ్చదనం
ఊరంటే సామూహిక జీవనానికి పతాక
ఊరంటే సర్వ విజ్ఞాన గని
ఊరంటే ఆధిపత్యంపై ధిక్కార స్వరం
ఊరంటే అమరుల నెత్తురు చారిక
ఊరంటే అనేక దుఃఖాల కలబోత
ఊరంటే దారిచూపే మార్గదర్శి
ఊరు సరిహద్దులను దాటుతూన్నప్పుడల్లా
స్మరించుకుంటూనే ఉంటాను
పునర్దర్శన ప్రాప్తిరస్తు..! పునర్దర్శన ప్రాప్తిరస్తని…!