[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము. [/box]
[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి కాగానే రాజు పింగపాంగుడు పక్కమీంచి లేచి జిట్టీభనాథుడి ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతడికోసం ఎదురుచూస్తున్న కొండచిలువ వెంటనే నిలువెత్తున లేచి, “రాజా! ఆశయాలు సాధించాలంటే చిత్తశుద్ధి ఉండాలి. ఆశ ఆ చిత్తశుద్ధిని జయించకుండా నిగ్రహం పాటించాలి. అలాంటి నిగ్రహం లేకే వెనుకటికి ఐలయ్య అనేవాడు, స్వంతింట్లో ఉండాలన్న తన ఆశయాన్ని సాధించలేకపోయాడు. ఆ కథ చెబుతాను. విను” అంటూ కథ చెప్పసాగింది.
ఐలయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు. పట్నంలో నాలుగు దుకాణాల్లో పద్దులు రాస్తున్నాడు. ఆ వచ్చే జీతం ఇంటిఖర్చులకు బొటాబొటీగా సరిపోతుంది. ఉన్నంతలో తృప్తిగా సంతోషంగా ఉండే ఐలయ్యకు స్వంతింట్లో ఉండాలన్నది ఒక్కటే కల. అందుకు కారణం – ఇంటి యజమానుల సతాయింపు భరించలేక తరచుగా ఇల్లు మారాల్సిరావడం. బావిలో నీళ్లెక్కువ తోడేస్తున్నారని ఒకడు. గోడకి మేకులు కొడుతున్నారని ఒకడు. అలాంటి వేధింపులుండవని తెలిసి మరో ఇంటికి మారితే, ఆ ఇంటి యజమాని మూణ్ణెల్లు తిరక్కుండా అద్దె పెంచేశాడు. అద్దె మరీ ఎక్కువని ఐలయ్య గోలెడితే, “ఐతే చెల్లయ్యింటికెళ్లు. చౌకగా ఉంటుంది” అన్నాడు.
ఐలయ్య ఆ ఇంటి గురించి వాకబు చేశాడు. చెల్లయ్యది పెద్ద ఇల్లు. దాన్ని రెండు వాటాలు చేసి – పెద్ద వాటాలో తనుంటూ, బాగా ఇరుగ్గా ఉండే పక్క వాటాని అద్దెకిచ్చాడు. తనింట్లో చోటు చాలదని, తాతలనాటి పెద్ద ఇనప్పెట్టెకి తాళమేసి అద్దె వాటాలో ఓ గదిలో ఉంచాడు. అందులో డబ్బు, నగలు, విలువైన పత్రాలు, వగైరాలుంటాయి. వాటిని తీసుకుందుకూ, దాచడానికీ తరచుగా ఆ ఇంట్లోవాళ్లు ఎవరో ఒకరొస్తుంటారు. వాళ్ల రాకపోకల్ని ఇబ్బంది అనుకోనివాళ్లకే – ఆయన ఇల్లు అద్దెకిస్తాడు.
ఐలయ్య చెల్లయ్యని కలుసుకుని ఇల్లడిగితే పై విషయాలన్నీ చెప్పి, “ఇల్లు మారేముందు ఇవన్నీ ఆలోచించుకో” అని హెచ్చరించాడు. దానికి ఐలయ్య, “ఆలోచనకేముంది? నిజానికి నాకు స్వంతింట్లో ఉండాలని కల. నువ్వు మంచివాడివి, స్నేహపాత్రుడివి. నా కల నిజమౌతుందో లేదో తెలియదు. కానీ ఈలోగా నీ ఇంట్లో ఉండడం నా అదృష్టంగా భావిస్తాను” అని ఆ ఇంట్లో ప్రవేశించాడు.
ఒకరోజు ఐలయ్య భార్య ఇల్లూడుస్తూ, ఇనప్పెట్టె పిడిని పట్టుకుంటే, తలుపు చటుక్కున తెరుచుకుంది. అంతే! కళ్లు జిగేల్మనేలా – దాన్నిండా ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, వెండి, బంగారు కాసులు, నగలు కనిపించాయి. వెంటనే భర్తను పిలిచి చూపించి, “నిన్న రాత్రి చెల్లయ్యగారి భార్య వచ్చి ఇనప్పెట్టె వాడి వెళ్లింది. తాళమెయ్యడం మర్చిపోయినట్లుంది. ఇప్పుడు పిలుద్దామంటే నిన్న రాత్త్రే వాళ్లు పెళ్లికని వేరే ఊరెళ్లారు. రెండ్రోజులదాకా రారు. వాళ్లకి బాగా డబ్బుందని తెలుసు కానీ, మరీ ఇంత ఉన్నవాళ్లనుకోలేదు. ఆయన మనకి కొంచెం డబ్బు అప్పిస్తే స్వంతిల్లు కొనుక్కోగలం. వాళ్లు తిరిగొచ్చేక అడిగి చూడు” అంది. ఐలయ్య వెంటనే ఇనప్పెట్టె తలుపు దగ్గరగా మూసి, మళ్లీ తెరుచుకోకుండా ఓ చెక్కబల్ల అడ్డంగా పెట్టి, “అప్పు సంగతి తర్వాత. వాళ్లు వచ్చేదాకా మనమీ ఇనప్పెట్టెకి కాపలా కాయాలి. ఇందులో ఒక్క కాసు తగ్గినా ఆ తప్పు మనదే ఔతుంది” అన్నాడు. దంపతులిద్దరిలో ఒక్కరికీ కొంత డబ్బు కాజేయాలన్న ఆలోచనే రాలేదు.
ఐలయ్య పనికెళ్లడం మానేసి చెల్లయ్య కుటుంబం వచ్చేదాకా ఆ ఇనప్పెట్టెకి కాపలాగా ఉన్నాడు. రాత్రిళ్లు సరిగ్గా నిద్ర కూడా పోలేదు. చెల్లయ్య కుటుంబం పెళ్లినుంచి తిరిగొచ్చేక, అతడు చప్పున వెళ్లి చెల్లయ్యకు జరిగింది చెప్పి, వెంటనే వచ్చి ఇనప్పెట్టెలో వస్తువులు అన్నీ ఉన్నదీ లేనిదీ సరిచూసుకోమన్నాడు. చెల్లయ్య నవ్వి, “అవసరంలేదు ఐలయ్యా! కావాలనే ఇనప్పెట్టెకి తాళమెయ్యకుండా ఊరెళ్లాము. మేము లేకున్నా ఈ ఇంటిమీద నా మనుషుల నిఘా ఉంది. మనసు చలించి తప్పుడు పనికి తలపడితే, పట్టుబడేవాడివి” అన్నాడు.
అది చెల్లయ్య తనకి పెట్టిన పరీక్ష అని గ్రహించిన ఐలయ్య చిన్నబుచ్చుకుని, “నువ్వు గొప్పవాడివే కావచ్చు. కానీ నావంటి పేదవాడితో ఇలా ఆడుకోవచ్చా? అదృష్టంకొద్దీ నా బుద్ధి వక్రీకరించలేదు కానీ – అంత సంపద కళ్లజూస్తే ఎంతటి నిజాయితీపరుడైనా ఒకోసారి ప్రలోభానికి గురయ్యే అవకాశముంది. ఐనా నీకు నన్ను పరీక్షించాల్సిన అవసరమేమిటి?” అన్నాడు.
చెల్లయ్య అతడి భుజం తట్టి, “నిన్ను మిత్రుడిగా భావిస్తున్నాను. స్వంతిల్లు నీ కల అని తెలిసినవాణ్ణి. అది ఫలించాలని కోరుకునేవాణ్ణి. అందుకే ఈ పరీక్ష తప్పనిసరి అయింది” అంటూ అసలు విషయం చెప్పాడు. ఆ ప్రకారం చెల్లయ్య మిత్రుడు రత్నగుప్తుడు మధుపురం అనే గ్రామంలో ఉన్నాడు. ఆయనకి ఎన్నో వ్యాపారాలున్నాయి. ఆ వ్యవహారాలు చూడ్డానికి ఓ మనిషి కావాలి. అతడు సమర్థుడే కాక, నిజాయితీపరుడు కూడా అయుండాలి. చెల్లయ్యకి ఐలయ్య సమర్థత తెలుసు. నిజాయితీని ఇలా పరీక్షించాడు.
“నువ్వు పరీక్షలో నెగ్గావు. నువ్వు మధుపురం వెళ్లి రత్నగుప్తుడివద్ద చేరు. ఆయన తన ఇంటి పెరట్లోనే ఉన్న చిన్న ఇంట్లో, నీ కుటుంబానికి వసతి సౌకర్యం కల్పిస్తాడు. ఇక్కడొస్తున్నకంటే ఎక్కువ జీతమే ఇస్తాడు. దినవెచ్చాలూ ఆయన ఇంటినుంచే వస్తాయి. అలా నీకు బోలెడు డబ్బు ఆదా. అది పల్లెటూరు కాబట్టి అన్నీ చౌక. తొందరలోనే మంచి ఇల్లు కొనుక్కుని స్వంతింట్లో ఉండొచ్చు” అన్నాడు.
ఐలయ్యకిది ఊహించని అవకాశం. అతడు చెల్లయ్యకి కృతజ్ఞతలు తెలుపుకుని మధుపురం వెళ్లి రత్నగుప్తుణ్ణి కలుసుకున్నాడు. ఆయన అతణ్ణి పనిలో పెట్టుకుని, “స్వంతిల్లు నీ కల అని చెల్లయ్య చెప్పాడు. ఈ చిన్న ఊళ్లలో ఎవరూ ఇళ్లని అమ్ముకోరు. స్థలాలు దొరుకుతాయి. త్వరలో నీకో మంచి స్థలం చూస్తాను. అందులో నీకు నచ్చినట్లుగా మంచి ఇల్లు కట్టుకోవచ్చు. డబ్బు వృథా చెయ్యకుండా పొదుపు చేస్తే ఒకటి రెండేళ్లలో నీ కల సాకారమౌతుంది. అందుకు నా వంతు సాయం నేనూ చేస్తాను” అన్నాడు.
రత్నగుప్తుడు అన్నట్లే జరిగింది. రెండేళ్ల లోపులో ఐలయ్య మంచి ఇల్లు కట్టాడు. చివర్లో డబ్బు తక్కువైతే, రత్బగుప్తుడు ఓ ఐదొందల వెండి కాసులు అప్పిచ్చాడు. ఇక స్వంతింట్లోకి మారడానికి ముహూర్తం చూస్తున్నాడు ఐలయ్య. ఆ సమయంలో రత్నగుప్తుడు ఐలయ్యని పిలిచి, “నా మేనమామ స్వర్ణగుప్తుడికి ఆరోగ్యం చెడింది. చికిత్స చేస్తున్న వైద్యులు, ఓ ఏడాదిపాటు గాలిమార్పు అవసరమన్నారు. ఆయన మధుపురం వస్తున్నాడు. మా ఇంట్లో ఉండమన్నాను. ఒకటో రెండో రోజులైతే ఏమో కానీ, ఏడాదిపైన ఐతే వేరే ఇంట్లో ఉంటానని అంటున్నాడు. ఆయన నాకంటే ధనవంతుడు. నాకంటే వైభవంగా జీవిస్తాడు. ఈ ఊరికి, మా అత్తయ్యతోపాటు నలుగురు పనివాళ్లు కూడా వస్తారు. వాళ్లంతా ఉండడానికి నీ ఇల్లు బాగుంటుందని నాకనిపించింది. ఏమంటావ్?” అన్నాడు.
స్వంతింట్లో ఉండాలన్న తన కల తెలిసీ ఆయనలాగనేసరికి ఏమనాలో తోచలేదు ఐలయ్యకి. అతడి సందిగ్ధాన్ని కనిపెట్టిన రత్నగుప్తుడు, “బలవంతమేం లేదు. కానీ బాగా ఆలోచించుకో. నువ్వు స్వంతింట్లోకి మారిపోయావనుకో, మా ఇంటినుంచి వచ్చే దినవెచ్చాలుండవు. అదో అదనపు ఖర్చు. ఇల్లు మారకపోతే, ఆ ఖర్చు నీకు ఆదా. అదికాక నా మేనమామ నీకు నెలకి పది వెండి కాసులు అద్దె చెల్లిస్తాడు. మా ఇల్లు నీకు స్వంతిల్లులా అనిపించకపోతే మాత్రం, నువ్వు కొత్తింటికి వెళ్లవచ్చు” అన్నాడు. ఆ మాటలు సబబుగా ఉన్నాయి. ఆపైన స్వర్ణగుప్తుడుండేది ఒక్క ఏడాదే కదా అనుకుని ఐలయ్య సరేనన్నాడు.
స్వర్ణగుప్తుడా ఇంట్లో ఓ ఏడాది గడిపి పూర్తిగా స్వస్థుడయ్యాడు. ఐలయ్యకు రత్నగుప్తుడి బాకీ కొంత చెల్లు అయింది. ఐతే స్వర్ణగుప్తుడు తన ఊరికి తిరిగి వెడుతూ తన మిత్రుడు కోటిరాజు గురించి చెప్పాడు. కోటిరాజు పిల్లలు విదేశాలకి వెళ్లి స్థిరపడ్డారుట. ఇప్పుడాయన భార్యతో ఒంటరిగా ఉంటున్నాడు. కొన్నాళ్లీ ఊరొచ్చి ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాడు. ఐలయ్య ఇల్లు అద్దెకిస్తే, నెలకి పదిహేను కాసులిస్తాట్ట. అప్పుడు ఐలయ్య రత్నగుప్రుణ్ణి సలహా అడిగితే, “స్వంతింట్లోకి మారితే – ఖర్చులు పెరిగి, ఆదాయం తగ్గుతుంది” అన్నాడాయన. ఐలయ్య కోటిరాజుకి ఇల్లద్దెకిస్తే, ఆయనా ఇంట్లో రెండేళ్లుండి వెళ్లాడు. అప్పటికి రత్నగుప్తుడి బాకీ కూడా తీరిపోయింది. ఐనా ఐలయ్య స్వంతింటికి మారలేదు. ఆ ఇల్లు మంగళకరమన్న పేరొచ్చి, నిత్యం ఎవరో ఒకరు అద్దెకి అడుగుతున్నారు. ఆ ఆదాయానికి అలవాటుపడ్డ ఐలయ్య స్వంతింటి కలను వాయిదా వేస్తున్నాడు. అలా పదిహేనేళ్లు గడిచేసరికి ఐలయ్య ఊళ్లో నాలుగెకరాల పొలం కొన్నాడు. కూతురికి మంచి సంబంధం చేశాడు. కొడుకుని బాగా చదివించాడు. వాడికీ పెళ్లయింది. పిల్లలిద్దరూ పట్నంలో స్థిరపడ్డారు. ‘ఉద్యోగం మానేసి, ఇల్లమ్మేసి వచ్చి- మాతో ఉండండి. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం” అని వాళ్లు తలిదండ్రుల్ని బలవంతపెడుతున్నారు. ‘పిల్లలు చెప్పినట్లే చేద్దాం. కానీ ఈలోగా మనసుపడి కట్టుకున్న స్వంతింట్లో కొన్నాళ్లుందాం’ అంది ఐలయ్య భార్య. సరేనన్నాడతడు.
ఐలయ్య ఇల్లు అమ్మకానికుందని తెలిసి, కొనడానికి అతడి దూరపు బంధువులు ఎగబడ్డారు. బంధువులకి అమ్మితే, కొన్నాళ్లా ఇంట్లో గడిపి, స్వంతింటి కల తీర్చుకోవచ్చని ఐలయ్య అనుకున్నాడు. కానీ ఈలోగా రత్నగుప్తుడతణ్ణి పిలిచి, “పట్నంలో ఉండే నా అల్లుడు, కూతురు ఇక్కడికొచ్చి స్థిరపడతారుట. నీ ఇల్లు కొని వాళ్లకిద్దామనుకుంటున్నాను. నీ ఇంటి విలువ మూడువేల కాసులు. నేనింకో ఐదొందల కాసులిస్తాను. లేదూ నువ్వుంటున్న నా ఇల్లు ఉచితంగా నీ పేరిట వ్రాసేస్తాను. అలా నీ స్వంతింటి కల తీరుతుంది. నువ్వు, నీ భార్య జీవితకాలమంతా ఇప్పుడుంటున్న నా ఇంట్లో ఎప్పటిలా ఉండొచ్చు” అన్నాడు. దానికి ఐలయ్య, “మీరు నాకు అదనంగా ఐదొందల కాసులివ్వండి. మీ ఇల్లు మీ పేరిటే ఉండనివ్వండి. ఇక్కడున్నన్నాళ్లూ మీ ఇంట్లోనే ఉండి మిమ్మల్ని సేవించుకుంటాను. ఇక స్వంతింటి కల అంటారా, అదెప్పుడో తీరింది” అన్నాడు.
కొండచిలువ ఈ కథ చెప్పి, “ఐలయ్యకి డబ్బాశ తప్పితే, స్వంతిల్లు పట్ల నిజంగా ఆసక్తి ఉన్నదా? ఉంటే మనసు పడి కట్టుకున్న ఇంట్లో ఒక్కరోజైనా ఉండకుండా, అద్దెలకెందుకిచ్చాడు? చివరికి రత్నగుప్తుడు తనిల్లు అతడి పేరిట వ్రాస్తానంటే, వద్దనడానికి కారణం డబ్బేనా? బంధువులకి అమ్మితే వాళ్ల అనుమతితో ఆ ఇంట్లో కొన్నాళ్లు గడపొచ్చని తెలిసినా, రత్నగుప్తుడికే ఇల్లమ్మడమూ డబ్బు కోసమేనా? లేకపోతే ఐలయ్యకు స్వంతింటి కల ఎప్పుడు తీరింది? తెలిస్తే నా ఈ సందేహాలకి సరైన సమాధానం చెప్పి నా ఆకలి చల్లార్చు. లేదా నగరంలోకి వెళ్లి నీ పౌరుల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది.
దీనికి పింగపాంగుడు ఏమాత్రం తడుముకోకుండా ఇలా బదులిచ్చాడు: “రత్నగుప్తుడు ఐలయ్యని ఆత్మీయంగా చూస్తూ, ఎంతో మేలు చేశాడు. ఐలయ్యకా కృతజ్ఞతుంది. ఆయన చెప్పాడనే ఇల్లద్దెకివ్వడం మొదలెట్టాడు. ఆయన అడిగేడనే బంధువుల్ని కాదని ఆయనకే ఇల్లమ్మాలనుకున్నాడు. ఆయనిస్తానన్న ఇల్లు ఐదొందల కాసులకంటే ఎక్కువై ఉంటుంది. ఆయన నష్టపోవడం ఇష్టం లేకనే అతడా ఇంటిని స్వంతం చేసుకోలేదు. ఇక ఐలయ్య నిజాయితీపరుడు. అసత్యమాడడు. అతడి స్వంతింటి కల నిజమే కానీ, అది పుట్టడానికి కారణం వేధించే ఇంటి యజమానులు. చెల్లయ్య మంచివాడు కావడంతో ఇల్లు ఇరుకైనా సద్దుకు పోయిన ఐలయ్యకి, ఆ మాత్రం ఇబ్బంది కూడా లేని రత్నగుప్తుడి ఇల్లు స్వంతిల్లులాగే తోచి ఉండాలి” అన్నాడు.
అది సరియైన సమాధానం కావడంతో కొండచిలువ నేలకు వ్రాలి చుట్టలు చుట్టుకుని నిద్రకు పడింది. రాజు తన అంతఃపురానికి తిరిగి వెళ్లాడు.
(వచ్చే ‘సంచిక’లో కరనాగభూతం 18వ కథ)