[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]
[dropcap]నె[/dropcap]ల్లూరుకు ఏడు మైళ్ల దూరంలో పెన్నానది ఒడ్డున పినాకిని సత్యగ్రహాశ్రమాన్ని మహాత్మా గాంధీజీ 1921 మే 7వ తారీకు ఉదయం ప్రారంభించారు. అప్పటికే సుమారు రెండు నెలలుగా దిగుమర్తి హనుమంతరావు దంపతులు, చతుర్వేదుల కృష్ణ, కొండిపర్తి పున్నయ్య, మరి కొంతమంది ఆశ్రమవాసానికి సిద్ధమై వచ్చారు. పొణకా కనకమ్మ 1915-16 ప్రాంతంలో పెన్న ఒడ్డున విస్తారంగా వున్న 13 ఎకరాల తోట, అందులో ఫలవృక్షాలతో కూడా ఖరీదు చేసి, దేశ భక్తులైన విప్లకారులు తుపాకులు కాల్చడం, దాచడం వంటి పనులకు ఇచ్చారు. ఆ తరువాత రెండు మూడేళ్లకే కనకమ్మ బృందం గాంధీజీని కలుసుకొని ఆయన భక్తులై హింసామార్గాన్ని విడిచి పెట్టారు. కనకమ్మ మిత్ర బృందంలో ఒకరైన చదుర్వేదుల వెంకటకృష్ణ సబర్మతి ఆశ్రమంలో కొంత కాలం వుండి, మహాత్ముల అనుజ్ఞతో సత్యాగ్రహాశ్రమాన్ని నెలకొల్పే ఉద్దేశంతో వెనక్కు వచ్చాడు. కృష్ణకు సబర్మతి ఆశ్రమంలోనే దిగుమర్తి హనుమంతరావు, బుచ్చి కృష్ణమ్మ దంపతుల పరిచయమయింది. వీళ్లు ముగ్గురూ కొండిపర్తి పున్నయ్య సహాయంతో పల్లిపాడులో కనకమ్మ సాయుధ విప్లవ ప్రయోజనాల కోసం ఖరీదు చేసిన తోటలోనే సత్యగ్రహాశ్రమాన్ని నెలకొల్పారు.
గాంధీజీ భావజాలంతో ప్రేరణ పొందిన వాళ్లు నలుగురు, ముగ్గురు యువకులు ఒక యువతి తమ స్వప్నాన్ని పినాకిని సత్యాగ్రహాశ్రమ రూపంలో సాకారం చేసుకొన్నారు. ఆశ్రమ నిర్మాణంలో వాడబడిన ప్రతి ఇటుకా, ఆ ప్రాంగణంలో పెరిగిన మహా వృక్షాలు వాళ్ల ఆదర్శ జీవనానికి, సేవా తత్పరతకు మౌన సాక్షాలుగా నిల్చివున్నాయి.
1921 ఏప్రిల్ 7వ తారీకు గాంధీజీ పల్లిపాడు ఆశ్రమాన్ని ప్రారంభించిన రోజు. పల్లిపాడు ఆగ్రహారీకులు గాంధీజీని ఊళ్లోకి రమ్మని ఆహ్వానిస్తే, అగ్రహారంలోకి హరిజన ప్రవేశానికి అంగీకరిస్తేనే, ఊళ్లోకి అడుగు పెడతానని గాంధీజీ అన్నారు. అగ్రహారీకులు అంగీకరించడంతో గాంధీజీ పల్లిపాడు బ్రాహ్మణ వీధిలోకి తన వెంట హరిజనవాడ ప్రజలను తీసుకొని వెళ్ళారు.
చతుర్వేదుల వెంకటకృష్ణ, కొండిపర్తి పున్నయ్య, దిగుమర్తి హనుమంతరావు, ఆయన భార్య బుచ్చి కృష్ణమ్మ తొలి యావజ్జీవిత ట్రస్టీలు. “పినాకిని సత్యాగ్రహాశ్రమం ఆత్మ వంటి వాడు హనుమంత రావు”. హనుమంతరావు నిరీశ్వరవాదైనా అతనిలో దివ్యత్వం ఉందని గాంధీజీ భావించారు. హనుమంతరావు ఆశ్రమంలో ప్రకృతి వైద్యం చేశాడు. వీరి భార్య బుచ్చి కృష్ణమ్మ ఆస్తికురాలు, ఇరవై ఏళ్ల యువతి. అప్పటికీ ఈ దంపతులు బ్రహ్మచర్య వ్రత దీక్ష తీసుకొన్నారు. నలుగురూ చేనేత, ఖాదీ ప్రచారం, హిందీ భాషా ప్రచారానికి కృషి, అస్పృస్యతా నివారణ వంటి విషయాల మీద పని చేశారు. చతుర్వేదుల వెంకటకృష్ణ ప్రజలను కూడగట్టడంలో, లౌకిక వ్యవహారాల్లో, యువకులను ఉద్యమంలోకి నడిపించడంలో నేర్పరి. ఈయన చొరవ వల్లనే జిల్లాలో అనేక ప్రదేశాల్లో తొలి హరిజన హస్టళ్లు ప్రారంభమయ్యాయి.
గాంధీజీ ఆశ్రమవాసుల యోగక్షేమాలు ఉత్తరాలు రాసి విచారించేవారు. వారి ఆహార వివరాలు, నెలసరి భోజనం ఖర్చులు అన్నీ అడిగి తెలుసుకొనేవారు. ఈ అత్యుత్సాహులు ఆరోగ్యాన్ని ఉపేక్షిస్తారేమోనని ఆయనకు సంశయం. గాంధీజీ పల్లిపాడులో హరిజన ప్రవేశం చేయించినా, తర్వాత అగ్రవర్ణాలు ఆశ్రమవాసులందరినీ బహిష్కరించారు. వెంకటకృష్ణయ్యకు గాంధీజీ సిద్ధాంతాల మీద అచంచల విశ్వాసం. ఆశ్రమవాసుల కృషి వృథా కాలేదు. 1926లో కమతం షణ్ముగం సహకారంతో ఆశ్రమ ప్రాంగణంలో నెల్లూరు జిల్లా తొలి ఆది ద్రావిడ సభలు జయప్రదంగా జరిగాయి.
1923 డిసంబరులో ఆశ్రమం మీద బందిపోటు దొంగలు దాడి చేసి, అడ్డుకున్న వారందరినీ చావగొట్టి, హింసించి మహిళల నగానట్రా దోచుకొనిపోయారు. ఇస్కా చెంచయ్య వంటి కొందరు ఆశ్రమవాసులు రక్తగాయాలతో రాత్రంతా స్పృహ లేకుండా పడివున్నారు. ఆశ్రమ నియమాల ప్రకారం పోలీసులకు ఫిర్యాదు చెయ్యకపోయినా పోలీసులు బందిపోటు దొంగలను బంధించారు. న్యాయస్థానంలో బుచ్చి కృష్ణమ్మ సాక్ష్యం చెబుతూ, దండ తనది లాగే వుందిగాని, తనది కాదని అంటుంది. న్యాయస్థానం బందిపోట్లకు ఆరు సంవత్సరాల కారాగార శిక్ష విధించినట్లు నా పరిశోధనలో తేలింది. మరొక విషయం మత్సరగ్రస్థులైన స్థానిక భూస్వాములే ఈ దొగంలను ప్రోత్సహించినట్లు జమీన్ రైతు పత్రిక రాసింది.
బందిపోట్ల ఉదంతం జరిగిన తర్వాత, ఆశ్రమవాసుల్లో చాలా మంది వెళ్లిపోయినా, కొందరు ఆశ్రమ కార్యక్రమాలు కొనసాగించారు. 1926లో దిగుమర్తి హనుమంతరావు తన ఆదర్శాలకు వ్యతిరేకమని ఆధునిక వైద్యాన్ని నిరాకరించి క్షయవాధితో చనిపోయాడు. బుచ్చి కృష్ణమ్మను, ఆశ్రమవాసులను ఓదారుస్తూ మహాత్ముడు ఉత్తరాలు రాశారు.
గాంధీజీ అనుయాయి రుస్తుంజీ ఆర్థిక సహకారంతో 1926లో ప్రస్తుతం ఉన్న ఆశ్రమం శాశ్వత భవన నిర్మాణం జరిగింది. 1927లో నెల్లూరులో కురిసిన పెద్ద గాలివానలో రుస్తుంజీ భవనం కప్పు మొత్తం ఎగిరిపోతే, మళ్లీ బాగు చేయించారు.
పినాకిని సత్యాగ్రహాశ్రమం పది సంవత్సరాల లోపలే పాడు పడిపోయింది. ఆశ్రమానికి సి.వి.కృష్ణ, హనుమంతరావు ఇద్దరూ రెండు కళ్లు వంటివారు. హనుమంతరావు ఆకస్మిక మరణం తర్వాత, రెండు మూడేళ్లు ఆశ్రమాన్ని నిర్వహించిన కృష్ణయ్య వైరాగ్యంతో పాండిచ్చేరి వెళ్లి అరవిందుని భక్తుడై చివరిదాకా పాండిచ్చేరి అరవింద ఆశ్రమంలోనే ఉండిపోయాడు. 1930 నుంచి ఆశ్రమం నిర్వహణ అనేక చేతులు మారి, చివరకు బుచ్చి కృష్ణమ్మ వారసులు పినాకిని సత్యాగ్రహాశ్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సంస్థకు 2005లో అప్పగించారు. అప్పుడు డాక్టర్ ఏ.వి.సుబ్రహ్మణ్యం నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ డాక్టరు గారు, స్థానికంగా పల్లిపాడు సమీపంలో, నిడిముసలి అధ్యక్షులుగా చేసిన నేదురుమల్లి సుబ్బారెడ్డి ఆశ్రమాన్ని పునరుద్ధరించడానికి కంకణం కట్టుకొని పని చేశారు. డాక్టర్ ఏ.వి సుబ్రహ్మణ్యం ప్రోత్సాహంతో నేను కూడా స్వచ్ఛందంగా ఆశ్రమ కార్యక్రమాల్లో ఆనాటి నుంచి పాల్గొంటూనే వున్నాను.
ఆశ్రమ చరిత్ర అక్కడక్కడ, ఒకటి రెండు పేజీలు దొరకుతుందిగాని, దాదాపు 85 సంవత్సరాలలో ఆశ్రమం ఎట్లా జరిగింది, పూర్తిగా మూతపడి వుందా, ఎవరైనా అన్నాళ్లు వుంటూ ఆశ్రమ కార్యక్రమాలు కొనసాగించారా? వంటి ప్రశ్నలకు సమాధానం కోసం నేన చాలా కాలం పరిశోధన చేశాననే చెప్పాలి. నా అన్వేషణలో అనేక శకలాలు, చిన్న చిన్న అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆశ్రమ చరిత్రలో భాగంగానే ఆశ్రమ స్థల దాత శ్రీమతి పొణకా కనకమ్మ స్వీయ చరిత్రను సంపాదించి, పరిష్కరణ చేసి 2011లో మనసు ఫౌండేషన్ సంస్థాపకులు డాక్టరు ఎం.వి.రాయుడు ద్వారా వెలుగులోకి తెచ్చాను.
గాంధీజి ఆశ్రమ స్థాపనకు వచ్చిన నాటి సంగతులన్నీ కనకమ్మ తన స్వీయ చరిత్రలో వివరంగా రాశారు. ఆ రోజు గాంధీజీ వెంట వుండి, వారిని పల్లిపాడు తీసుకొని వెళ్లిన వారిలో వెన్నెలగంటి రాఘవయ్య ‘స్మృతిశకలాలు’ పేరుతో తన అనుభవాలను 1973 నాటి నెల్లూరు పత్రిక యూత్ కాంగ్రెస్‌లో ధారావాహికంగా రాశారు. ఐతే 30 సంవత్సరాల పైగా నడిచిన ఆ పత్రిక ఒక్క సంచిక కూడా లభించలేదు. ఆచార్య వకుళాభరణం రామకృష్ణ దాచుకున్న ‘స్మృతి శకలాల’లో కొన్ని వ్యాసాలు మిగిలాయి. అందులో ఆశ్రమస్థాపన ప్రయత్నం, గాంధీజీ మొయిలు బండిలో రావడం వంటి విషయాలన్ని వారి జ్ఞాపకాలు రికార్డయి వున్నాయి. ఈ వ్యాసాలను స్థానిక పత్రికలో మళ్లా ధారావాహికగా ప్రచురించారు.
ఆశ్రమ స్థాపకులు నలుగురిలో కొండిపర్తి వున్నయ్య ఒకరు. ఆయన వివరాల కోసం ఎంతో అన్వేషిస్తే, స్వర్ణకారుల సంఘం బాధ్యులు ఏకాంబరాబారి ఆ సంఘ చరిత్ర పుస్తకంలోంచి కొన్ని వాక్యాలు పంపించారు. ఆశ్రమ కార్యక్రమాలు మందగించిన తర్వాత, పున్నయ్య గుంటూరు, విజయవాడ ప్రాంతాలలో ఖద్దరు ఉద్యమం, సంఘ సంస్కరణ ఉద్యమంలో జీవితమంతా గడిపారని, గాంధీజీ లాగా కొల్లాయి పంచె మాత్రం కట్టుకొనేవారని, ప్రకాశం పంతులు మేనగోడలు ఒక వింతంతువుని పెళ్ళాడి బందరులో స్థిరపడ్డట్లు తెలిసింది. ఈ చిన్న భోగట్టా కోసం ఎన్నో ప్రయత్నాలు చేయవలసి వచ్చింది.
చతుర్వేదుల కృష్ణ తండ్రి వెంకటకృష్ణయ్య తిలక్ అభిమాని, చాలా సంప్రదాయ బ్రాహ్మణుడు, జాతీయోద్యమంలో హిందూ బాంధవి పత్రికను కొంత కాలం నడిపాడు. ఆయన పల్లిపాడులో ఆశ్రమం నెలకొల్పిన మరు సంవత్సరమే, 1922 జూన్‌లో పల్లిపాడు బ్రహ్మణ అగ్రహారంలో సంస్కృత పాఠశాల నెలకొల్పి మా తండ్రిగారు కాళిదాసు వెంకటసుబ్బాశాస్త్రిని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాపకులుగా నియమించారు. 1927 వరకు మా నాయన అక్కడ పాఠశాల నిర్వహించారు. నా బాల్యంలోనే మా తండ్రిగారు పోయారు. అమ్మగారు 1992లో 84 ఏళ్ల వయసులో వెళ్లిపోయారు. మా అమ్మగారిని అడిగి ఆమె జీవిత వివరాలు తెలుసుకోవాలని నేను ఎప్పుడూ ప్రయత్నం చెయ్యలేదు. పల్లిపాడు ఆశ్రమ వివరాల కోసం నెల్లూరు పాత పత్రికలన్ని తిరగవేస్తున్నప్పుడు మా నాయనగారి స్కూలు, జీవిత వివరాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. మా పెద్దక్క వెంకటసుబ్బమ్మ 1927 మార్చి 14న పల్లిపాడులోనే జన్మించారు.
ఆశ్రమం స్థాపకుల్లో ఒకరైన దిగుమర్తి హనుమమంతరావు మరణం గురించి, కారణాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తూంటే గాంధీజీ కరస్పాండెన్సులో హనుమంతరావుకు రాసిన ఉత్తరాల్లో ఆయన క్షయరోగ పీడితులై చనిపోయినట్లు, ఆధునిక పాశ్చాత్య వైద్యం చేయించుకోమని గాంధీజీ చెప్పినా వినకుండా తిరస్కరించినట్లు తెలిసింది. ఆంధ్రపత్రిక పాత సంచికలు తిరగేస్తూంటే, ఆయన 1926 మార్చి 18వ తారీఖు విశాఖపట్నంలో ఆత్మీయుల మధ్య పోయిన వివరం తెలిసింది.
1926-29 మధ్య చతుర్వేదుల కృష్ణ ఆశ్రమాన్ని నిర్వహించారు. ఆశ్రమ స్థాపకుల్లో ఆయన ప్రయత్నము గొప్పది. ఆశ్రమంలో దాతల, భక్తుల ఫోటోలు పెట్టినా కృష్ణ ఫోటో దొరకక ఏమీ చెయ్యలేకపోయాము. నెల్లూరులో చతుర్వేదుల వాళ్లున్నారు గాని వాళ్లేమీ చెప్పలేకపోయారు. పాండిచ్చేరి ఆశ్రమాన్ని సంప్రదించాము. ఆయన ఆశ్రమ పత్రిక ‘అర్క’ సంపాదకులు కూడా. మా డాక్టర్ ఏ.వి.ఎస్ తనకున్న పలుకుబడంతా వినియోగించి ఆశ్రమం నుంచి ఒక ఫోటో తెప్పించారు. అయితే అది జడలు గట్టిన పొడవాటి వెంట్రుకులతో, గడ్డంతో ఒక యోగిదిలాగా అనిపించి, మళ్లీ నెల్లూరు స్థానిక పత్రకలన్నీ వెతుకుతూంటే 1953లో ఆయన మరణ వార్త వేసి, జడలు గట్టిన తల వెంట్రుకలతో వున్న ఫోటో ముంద్రించారు. ఆ విధంగా సందేహవివృత్తి అయింది.
కొన్నేళ్ల క్రితం మా దంపతులం రెండు రోజులు పినాకిని సత్యాగ్రహాశ్రమంలో ప్రశాంతంగా గడిపివద్దామని వెళ్లాము. ఆ రాత్రి కొందరు యువకుల వెంట ఊళ్లో వృద్ధులను కలిసి వారి జ్ఞాపకాలను రాసుకుంటూంటే, 90 సంవత్సరాలు పైబడిన దళిత వృద్ధులు తాను ఆశ్రమంలో చదువుకున్నానని, తనకు హిందీ చదవడం, రాయడం వచ్చని, తనకు సరళాదేవిగారు హిందీ నేర్పించారని, ఆమెతో పాటు దమయంతి, మరి కొందరు స్త్రీలు కూడా ఉన్నారని చెప్పాడు. ఆశ్రమం 1929 తర్వాత పాడు పడిపోయిందని అందరూ అంటారు, అట్లాగే రాశారు కూడా.
నేను సరళాదేవి ఆచూకి కనుక్కోనేందుకు డిజిటల్ మీడియాను వాడుకొన్నాను. ప్రజాసాహితి సంపాదకులు కొత్తపల్లి రవిబాబు నాకు ఉత్తరం రాసి, సరళాదేవి తమ అమ్మగారనీ, ఆమె చిత్తూరులో హిందీ పరీక్షలు, శిక్షణ పూర్తి చేసి 1952 ప్రాంతంలో కొన్నేళ్లు ఆశ్రమంలో ఉంటూ స్థానికులకు హిందీ నేర్పించారని, ఆమె ఫోటో కూడా పంపారు. సరళాదేవి ఫోటో ఇప్పుడు మా ఆశ్రమంలో ఉన్నది.
ఇబ్బందేమంటే పెద్దవారు, ప్రసిద్ధుల వివరాలు తెలుస్తాయి. అనేక మంది అజ్ఞాతంగా ఆశ్రమ సేవకులుగా ఉంటారు. వారి వివరాలు తెలియవు. మనమూ పట్టించుకోము. ఆశ్రమం ప్రారంభించిన రోజునే రెంటాల వెంకట క్రిష్ణమ్మ, ఆయన భార్యా వెంకట సుబ్బమ్మ ఆశ్రమంలో ఒక సాల వేసుకొని ఉండిపోయారు. కృష్ణమ్మ నేతకార్మికుడు, జాతీయోద్యమ కాలంలో ఆశ్రమవాసులకు ఖాదీ, చేనేత వస్త్రాలు అందజేశారు.
నెల్లూరు పత్రిక జమీన్ రైతు పాత సంచికలు (1930 నుంచి 2005 వరకు) వారం వారం తిరగేస్తే ఆశ్రమానికి సంబంధించిన 37 వార్తలున్నాయి. 1935లో కనకమ్మ ఏకైక కుమార్తె వెంకట సుబ్బమ్మ 26 సంవత్సరాల వయసులో చనిపోయింది. అప్పుడు కనకమ్మ ఆశ్రమంలో కొంత కాలం గడపాలనుకొంటుంది గాని, సత్యనారాయణ మూర్తి ఆనే ఒక నకిలీ డాక్టర్ ఆశ్రమ భవనాన్ని ఆక్రమించుకొని, బాలికల పాఠశాల నడుపుతున్నట్లు అందిరినీ నమ్మంచి, చందాలు తెచ్చుకుంటూంటాడు. తర్వాత ఆ మోసగాణ్ణి ఎట్లాగో ఖాళీ చేయించారు. ఆశ్రమ చరిత్రంటే ఇట్లా ఎన్నెన్నో సంఘటనలు. పుచ్చలపల్లి సుందరయ్య, మిత్ర బృందం స్థానిక భూస్వాములు ఆశ్రమ పోలాలను ఆక్రమిస్తే వాళ్లను ఖాళీ చేయిస్తారు. 1921లో గాంధీజీ పల్లిపాడుకు వచ్చినప్పటి విశేషాలను పన్నెండేళ్ల బాలుడుగ తాను చూచిన దృశ్యాలను స్వర్ణా వేమయ్య రాసిపెట్టారు.
జయంతి ధర్మతేజ సోదరి ఇరవై ఏళ్ల యువతి ఆత్మప్రభ, ఆమె తల్లిగారు 1952లో ఆశ్రమంలో ఉన్నట్లు కొన్ని పత్రాలు, జాబుల వల్ల తెలిసింది. వారితో పాటు నెల్లూరు యువకుడు కొత్తగా ఆయిర్వేద పరీక్షలు పాసై ఆశ్రమంలో ఉండి కొంత కాలం వైద్యం చేశాడు. ఇట్లా చిన్న చిన్న ముక్కలు, వీరందిరి చరిత్రే, ఆశ్రమంతో సంబంధమున్న వారి చరిత్రే ఆశ్రమ చరిత్ర ఆవుతుంది.
(మళ్ళీ కలుద్దాం)