[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]
మోసానికి మోసం సమాధానమా!!
[dropcap]మో[/dropcap]సం – ఎవరూ ఆహ్వానించదగ్గ అంశం కాదు! మోసం చేయడం, మోసపోవడం ఈ మధ్యకాలంలో అధికంగా వినవస్తున్న మాటలు. నీతి – నిజాయితీ అనేవి పూర్తిగా కోల్పోయిన మనిషి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం స్వలాభం మాత్రం చూసుకుంటున్న వ్యక్తి, సమాజ శ్రేయస్సును విస్మరిస్తున్నాడు. ఇప్పుడు మనం నివసిస్తున్న సమాజంలో మోసం లేని విభాగం అంటూ లేదు. మోసం నుండి తప్పించుకుని స్వచ్ఛమైన జీవితాన్నీ గడపడం ఇప్పుడు గగనం అయిపొయింది. మోసానికి ఎక్కడా హద్దులు లేవు. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, బంధువర్గం మధ్య, వర్తకుడికి -వినియోగదారుడు, నాయకులు – ప్రజలు, మోసం సంచరించని ప్రదేశమంటూ లేదు. నిత్య పెళ్లికొడుకులా చలామణి అవుతూ అనేక పెళ్ళిళ్ళు చేసుకుని కట్నం కూడగట్టుకుని ఉడాయించే మోసగాళ్ల గురించి మనం వింటూనే వున్నాము. అమాయకపు ఆడపిల్లలను పెళ్లి చేసుకుంటామని చెప్పి అన్ని రకాల ఆమెను దోచుకుని ఆనక కనిపించకుండా అదృశ్యమై పోయేవాళ్లు ఎంతమందో!
మెరుగుపెడతామని బంగారం బాహాటంగా తీసుకుపోయే సంఘటనలు వింటూనే ఉంటాం. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, అక్కడికి వెళ్ళాక బిచ్చగాళ్లుగా తయారు చేసిన ఉదంతాలు ఎన్నో.. ఎన్నెన్నో! ఇలా చెప్పుకుంటూ పొతే లెక్కలేనన్ని మోసాలు గురించి వింటుంటాం. ధనాశ గలవారు, దొంగనోట్ల మార్పిడిలోనూ, నమ్మించి చిట్టీలు వేయించి మొత్తం సొమ్ముతో కాలికి బుద్ధికి చెప్పిన సంఘటనలు రోజుకు ఒకటైనా వార్తాపత్రికల్లో చూస్తుంటాం. యెంత అప్రమత్తంగా ఉన్నా ఏదో విషయంలో మనం ఎక్కడో ఒకచోట మోసపోతూనే ఉంటాం. విద్యారంగము, వైద్యరంగము దీనికి ఏమాత్రం అతీతం కాదు. మోసం వెనుక వున్నది ఒకటే అంశం, ‘అత్యాశ‘. ఒకడు బాధపడుతుంటే (మోసపోయినవాడు), ఇంకొకడు ఆనంద పడుతుంటాడు (మోసం చేసినవాడు). కానీ అలంటి ఆనందం కేవలం తాత్కాలికం అన్న విషయం ఎప్పటికో కానీ తెలుసుకోరు.
అయితే మోసానికి మోసం సమాధానం అవుతుందా? అలా అయితే ఇద్దరికీ తేడా ఎక్కడ ఉంటుంది? మోసగాడిని సంస్కరించే దిశగా ప్రయత్నం చేయాలి గానీ, మరో మోసానికి తెర తీయకూడదు. మోసగాళ్లను గుర్తిస్తే, తక్షణం అధికారుల దృష్టికి తీసుకు రావాలి. ఆ అలవాటు అక్కడితో అంతం కావాలి. చాలామంది ఎంతో కస్టపడి సంపాదించుకున్న సొమ్ము అత్యాశతో, ప్రైవేట్ చిట్ ఫండ్స్‌లో పెట్టి, మోసపోయిన వారు ఎందరో! అందుచేత మోసగాళ్లను గుర్తించేదీ, వాళ్లకు సరైన గుణపాఠం చెప్పవలసింది ప్రజలు, సమాజమే. మరి చిన్న చేపల్ని పెద్ద చేపలు తిన్నట్టే, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు ఎలా మోసం చేసి రాక్షసానందం పొందుతారో తెలిస్తే బాధ కలుగుతుంది. అలాంటి వాళ్ళు మన లోనే వుంటే, మన బంధువులలోనే ఉంటే, మన కుటుంబంలోనే ఉంటే అది ఎంతటి దౌర్భాగ్యమో చెప్పడానికి మాటలు దొరకవు.
అలాంటి సంఘటన ఒకటి నా దృష్టికి వచ్చింది. అది నేను కలలో కూడా ఊహించనిది. ఆ వ్యక్తి ఎవరో కాదు నాకు అత్యంత సమీప బంధువు. ఇంతకు మించి చెప్పలేను ఆయన గురించి. పైగా ఆయన ప్రస్తుతం జీవించి లేరు. గమ్మత్తు ఏమిటంటే, ఆయన పరమ భక్తుడు, దేవుడంటే భయము, భక్తి వున్నవాడు. బంధువుల పట్ల ఆత్మీయత, అభిమానం, ప్రేమ, అమితంగా చూపించే వ్యక్తి. మామూలుగా చెప్పాలంటే, సహృదయుడు, మంచివాడు. కానీ ఒక్క విషయంలో ఆయన అసలు నచ్చలేదు సరికదా ఆయనంటే అసహ్యం పుట్టింది. ఆయన మంచితనం అంతా నా మనసులోనుండి తుడిచిపెట్టుకు పోయింది, ఒక సంఘటన వల్ల. మనుష్యుల అసలైన వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు అలాంటప్పుడే బయట పడతాయనుకుంటాను.
మనిషి అసలు రూపం, స్వరూపం బయట పడితే అంతకు ముందు ఆ వ్యక్తి మీద వున్న అభిమానం, గౌరవం హరించుకుపోతాయి. ఇక్కడ, ఆ పేరు ఉచ్ఛరించలేని వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం, కుటుంబ సమేతంగా మా ఇంటికి వచ్చారు. ఎప్పుడు వచ్చినా మా దగ్గర చాలా ఆనందంగా గడిపి వెళుతుంటారు. అలా వచ్చి నాలుగు రోజులు మా దగ్గర గడిపి తిరిగి వెళ్లిపోతున్న క్రమంలో, వారికి వీడ్కోలు పలికే నిమిత్తం నేను కూడ ఖాజీపేట రైల్వే స్టేషన్‌కు వెళ్లడం జరిగింది. విజయవాడకు రిజర్వేషన్ చేసుకొనక పోవడంతో, జనరల్ టికెట్లు కొనుక్కున్నారు. నేను కూడా వారితో పాటు ఫ్లాట్‌ఫామ్ నం. 3 కు వెళ్లాను. మధ్యలో ఆయన టిక్కెట్లు సరి చూసుకుని తనలో తాను నవ్వుకోవడం మొదలు పెట్టాడు. అది గమనించిన నేను “ఏమిటి మీలో మీరే నవ్వుకుంటున్నారు?” అని అడిగాను. ఆయన నవ్వుతూనే – “పిచ్చి బుకింగ్ క్లార్క్, ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చాడు” అని అదేదో హాస్యానికి సంబందించిన విషయంలా ఆపకుండా నవ్వుతూనే వున్నాడు. అప్పుడు ఆయనను ముందుకు కదలకుండా ఆపి “మరి అతడు ఎక్కువ ఇచ్చిన సొమ్ము వాపస్ చేద్దాం పదండి, లేకుంటే అతని జీతంలో కోత పడుతుంది పాపం” అన్నాను. దానికి ఆయన కాస్త వెటకారంగా నవ్వుతూ – “మీరు భలేవారే, వాళ్ళు మనలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా కొట్టేస్తారో మీకు తెలుసా?” అన్నాడు.
“ఎవరో ఎక్కడో ఒకరు అలంటి వారు ఉంటారని అందరూ అలాంటివారి అనుకుంటే ఎలా?” అన్నాను.
“మీకు తెలీదు లెండి వాళ్ళ సంగతి” అని నన్నొక చేతకాని వ్యక్తిలా ఎగాదిగా చూస్తూ నోట్లు జేబులో కుక్కుకున్నాడాయన. నాకు ఆశ్చర్యమూ బాధ కూడా కలిగినాయి. నా బంధువుల్లోనే అలాంటి మనస్తత్వం వున్న వ్యక్తులు వున్నప్పుడు బయటి వారికి నేను ఏమి చెప్పగలను? ఎలా చెప్పగలను. నేనే నోరుమూసుకోవలసి వచ్చింది. రైలు రాగానే, ఎక్కి ఆనందంగా వెళ్లిపోయాడాయన. అప్పటినుండీ ఆయనంటే ఒకవిధమైన ఏహ్యభావం నాకు కలిగేది.
విద్యావంతులైన వారు సమాజ శ్రేయస్సుకోరి తప్పుచేసిన వారిని ప్రశ్నించవలసింది పోయి, వారు కూడా అదే తప్పు చేస్తే ఇక ఇద్దరికీ తేడా ఏముంటుంది? ఆరోగ్య ప్రదమైన సమాజం యెట్లా ఏర్పడుతుంది? ఇలాంటి వారు మన మధ్యనే ఎంతోమంది వుంటారు. బాధ్యతగల పౌరులుగా మోసం ఏ రూపంలో వున్నా దానిని ప్రతిఘటించవలసిందే! అది తిరిగి పునరావృతం కాకుండా చూడవలసిందే. దేశ పౌరులుగా ఇది అందరి బాధ్యతానూ. ఆ రోజు మా బంధువు చేత ఎక్కువ వచ్చిన సొమ్మును తిరిగి బుకింగ్ క్లార్క్‌కు ఇప్పించలేకపోయినందుకు ఇప్పటికీ నేను సిగ్గుపడుతూనే వున్నాను. ఆయన మాత్రం చచ్చి స్వర్గాన వున్నాడో, మరి ఎక్కడ వున్నాడో..!!
(మళ్ళీ కలుద్దాం)