బాల్యపు వీధులలో విహారం – ‘పగడాలూ… పారిజాతాలూ…’ పఠనం

0
4

[dropcap]బా[/dropcap]ల్యం అందరికీ మధురమైనదే. కానీ పేదరికం, లేమి – కొందరి బాల్యంలోని మధురిమలను వంచిస్తాయి. అయినా చాలామంది ఉన్న జీవితంలోనే సంతోషాన్ని వెతుక్కుని బాల్యాన్ని అందమైన స్మృతులుగా మలచుకుంటారు, మనసులో నిలుపుకుంటారు. రచయితలయితే వాటిని ఆసక్తికరంగా పాఠకులకు అందిస్తారు.

బాల్యంలో తాను ఆడుకున్న ఆటలు, తనకెదురైన సంఘటనలు, తాను పొందిన అనుభవాలను – పాఠకులతో పంచుకున్నారు రచయిత శ్రీ జిల్లేళ్ళ బాలాజీ. తన చిన్ననాటి కబుర్లను చిత్తూరు మాండలికంలో ముచ్చటయిన యాసలో అందించి, మనల్నీ బాల్యంలోకి నడిపారు.

‘పగడాలు… పారిజాతాలూ…’ పేరుతో వెలువరించిన ఈ బాల్య జ్ఞాపకాలన్నీ ‘సంచిక’ వెబ్ పత్రికలో ‘నా బాల్యం కతలు’ పేరిట ప్రచురితమైనవే.

ఈ కథలలో తరచూ ప్రస్తావనకి వచ్చే రచయిత ట్యూషన్ టీచరు శ్రీ సైదా అయ్యోరికే ఈ పుస్తకం అంకితం ఇవ్వడం ముదావహం.

***

శుక్రవారం పూట మిత్రులతో కలిసి కాలవలో చేపలు పట్టడానికి వెళ్ళిన బాలడికి ఎదురైన అనుభవం ‘శుక్రారం పూట – సేపల ఏట’ కథలో చదువుతాం. టైరాట లోని మజాని ఆస్వాదిస్తాం. ఆ రోజు తమ టైం బాలేదని ఆ పిల్లలు ఎందుకు అనుకున్నారో తెలిస్తే నవ్వాగదు పాఠకులకు.

తన నేస్తం సైకిల్ కొనుక్కున్నాడనీ, తాను కూడా సైకిల్ తొక్కాలని ఉబలాటపడి – అద్దెకు తెచ్చుకున్న సైకిల్‍తో బాలడు చేసిన ప్రయోగాలు నవ్విస్తాయి, చిన్నతనంలో మనమూ అలాంటివి చేశామే అని పాత సంగతులను గుర్తు చేస్తాయి. ‘పట్టు తప్పిన సైకిలు – గట్టు తెగిన బూతులు’ హాయిగా చదివిస్తుంది.

‘టప్పు టప్పులు – నిప్పు రవ్వలు’లో బాల్యంలోని అమాయకత్వం గోచరిస్తుంది. విహారయాత్రకెళ్ళిన బాలడు ఇంటికి సంచినిండా నిప్పురాళ్ళని మోసుకొచ్చి పిన్నితో తిట్లు తిన్న వైనం చదివితీరాల్సిందే. ‘నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం అంటే ఇదే’ అని బాలడి నాన్న అన్నప్పుడు చదువరుల పెదాలపై నవ్వు కదలాడుతుంది.

ప్రయివేటు ఉండదని దసరా పండుగ పదిరోజులు సంతోషమే పిల్లకాయలకి. ఆ పండగ పది రోజులూ పిల్లలేం చేస్తారో, గుడికి/పూజారికి ఎలా సహాయం చేస్తారో ‘దసరా ఉండి – సరదాకు గండి’ కథ చెబుతుంది. ఇతరుల సొమ్ముని – అది దేవుడిదే కావచ్చు – ఎంత జాగ్రత్తగా కాపాడాలో ఈ కథ ద్వారా అర్థమవుతుంది.

బాలడు ఈత నేర్చుకునే ప్రయత్నం ఎలా సాగిందో ‘చేంతాడుతో ఈత – ఎదురుదబ్బతో వాత’లో తెలుస్తుంది. మొదట ఈత నేర్చుకోవడానికి భయపడిన బాలడు, తన తోటి అమ్మాయిలు కూడా సులువుగా ఈత కొట్టడం చూసి సిగ్గుపడతాడు. ఎలాగైనా ఈత నేర్చుకోవాలని సాహసం చేస్తాడు మిత్రులతో కలిసి. అందులోని ప్రమాదాన్ని గ్రహించిన బాలడి నాన్న పిల్లల్ని దండించి, హెచ్చరించడంతో మనం కూడా ‘అమ్మయ్య’ అనుకుంటాం.

బాల్యంలో తోబుట్టువులతో దెబ్బలాటలు సర్వసాధారణమే. పైగా ఇంట్లో పెద్దవాళ్ళు లేనప్పుడు – ఏదైనా గొడవ జరిగితే – పిల్లలు కొట్టేసుకునేదాక వెళ్తుంది. బాలడి అక్క బాలడి పైకి గిన్నె విసిరితే జరిగిన సంఘటన మన తోబుట్టువులని, వాళ్ళతో మన చిన్ననాటి ప్రవర్తననీ మనకు గుర్తు చేస్తుంది. ‘స్టీలు గిన్నె దెబ్బ – తల పగిలిందబ్బ’ కథ ఈ కోవ లోదే!

ఆలయాలలో కోతుల బెడద ఎక్కడయినా ఉండేదే. భక్తుల చేతుల్లోంచి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పూజాసామాగ్రి ఎత్తుకుపోయి ఆకలి తీర్చుకుంటాయి కోతులు. ‘సోలింగపురం కోతులు’ ఇందుకు మినహాయింపు కాదు.

మొక్కు తీర్చుకుని దేవుడికి తలనీలాలు ఇచ్చిన బాలడు – గుండుని, చెవి రింగులను దాచుకునేందుకు తలపాగాలా కట్టుకుని బడికి వెళ్ళి – లెక్కల మాస్టారి మొట్టికాయలు తప్పించుకోడానికి అప్పటికప్పుడు ఓ కథ అల్లేస్తాడు. ఆ పూటకి బాలడిని వదిలేస్తారు మాస్టారు ‘మొక్కుతో తిప్పలు – అయ్యోరు ముందు గొప్పలు’ కథలో.

సినిమాలు చూడడమంటే అందరికీ సరదానే. పిల్లలకి మరీ సరదా. పెద్దవాళ్ళని అడిగి ఒప్పించి సినిమాకి వెళ్ళేందుకు పిల్లలు ఎన్నో వేషాలేస్తారు. అలాగే బాలడు, వాళ్ళక్క ఎన్నో దొంగ ఏడుపులు ఏడ్చి – సాధించి మొత్తానికి ‘సరస్పతి శపదం’ సినిమాకి వెళ్తారు. థియేటర్‍లో సోడాలమ్మే కుర్రాళ్ళ మధ్య పోటీలో ఒక సోడా సీసా పగిలి బాలడికి బుగ్గలో గుచ్చుకుని బాగా రక్తం కారుతుంది. సకాలంలో వైద్యం జరగడంతో ప్రమాదం తప్పుతుంది. పిల్లాడ్ని చూడడానికి ఇంటికొచ్చిన ఇడ్లీలమ్ముకునే ఆచారవ్వ అభిమానం కళ్ళని చెమ్మగిల్ల చేస్తుంది. ‘దుర్గా కొటాయిలో రత్తపాతం’లో మంచి మనుషుల పరిచయం కలుగుతుంది.

జోతిసామి ఆశ్రమంలో జీవితంలో మొదటిసారిగా డోలు వాయిస్తాడు బాలడు. డోలు వాయించడంలోని మెళకువలను తాత సులువుగా చెప్పడంతో బాలడు సిద్ధమవుతాడు. ఆ స్వామి బాలడిని పరీక్షించి ఇంగ్లీషు పేపర్ చదివించి మెచ్చుకుని ఆశీర్వదిస్తారు ‘జోతిసామి ఆశీర్‌వాదం’లో.

నమ్మకం మీద పనిచేసే కొన్ని నాటు వైద్యాలు/గృహ వైద్యాలలోని మందుల రహస్యం తెలుసుకోకూడని బాలడు అనుభవ పూర్వకంగా గ్రహిస్తాడు ‘మా అత్త వైదిగ రగస్యం’లో. చివరిలో నవ్విస్తుంది కథ.

‘ఇంట్లో పెద్దోళ్లు లేపోతే రాజ్జిం మందే గదా! ఎంత సేపు ఆడుకున్నా అడిగేటోళ్లు ఎవురుండారనీ’ అనుకున్న బాలడు పెద్దమ్మ చెప్పిన ఓ పని చేయడం మరిచిపోయాడు. ‘పెద్దమ్మను ఎట్టయినా నమ్మించేయొచ్చు’ అనుకున్న బాలడు పడ్డ తిప్పలు ‘గుడ్డొచ్చె, తోక పాయె… ఢాం ఢాం ఢాం!’ కథలో చదవచ్చు.

మనిషికి మనిషి చేసిన సాయాన్ని గుర్తుంచుకున్న వ్యక్తుల ప్రవర్తన పిల్లలకే కాదు, పెద్దలకీ వెన్నెలంత చల్లగా ఉంటుంది. ‘రెడ్డిగుంట సుట్టూ రవుండు’ పాఠకుల హృదయాన్ని తాకే కథ.

ద్రౌపతోత్సవాలలో జరిగిన ఓ ఘటనతో బాలడికి జ్వరం వస్తుంది. ‘ముత్తెమంత ముద్దు’ బాలడికి ఎంత ప్రమాదం తెచ్చిపెట్టిందో. తిరణాల వర్ణన చదివితే, మనమూ ఆ ప్రాంతంలో తిరుగాడినట్టు అనిపిస్తుంది.

ఒకప్పుడు కొంతమంది వైద్యులు ఎంతో కరుణతో ఉంటూ, పేదసాదలని ఎంతో ఆదరంగా చూసేవారు. ముఖ్యంగా గ్రామీణుల వద్ద డబ్బు ఉన్నప్పుడే పుచ్చుకుని వైద్య సేవలందించిన డాక్టర్లు గొప్పవాళ్ళు. అలాంటి ఓ వైద్యుడి కథ ‘కిష్ణమూర్తి డాకట్రు కరుణ’ ఆసక్తిగా చదివిస్తుంది.

***

ప్రతీ కథకూ ముందుగా ఆ కథాసారాన్ని ప్రతిబింబించే బొమ్మ ఉంది. ఆయా కథలలోని ప్రధాన ఇతివృత్తాన్ని చిత్రకారులు తుంబలి శివాజీ అద్భుతంగా చిత్రించారు.

ఈ కథలలో అల్లరి పిల్లలు, అమాయకమైన పిల్లలు, గడుగ్గాయిలు, మంచి కోసం కసిరే పెద్దలు, మేలుకోరే ఉపాధ్యాయులు, మంచితనంపై అమితమైన విశ్వాసం ఉన్న మనుషులు ఉన్నారు. ఈ పుస్తకం చదవడమంటే బాల్యపు వీధులలో విహరించడమే.

***

పగడాలు… పారిజాతాలూ…
(నా బాల్య స్మృతులు-1)
రచన: జిల్లేళ్ళ బాలాజీ
పేజీలు: 120, వెల: ₹ 120/-
ప్రచురణ: పార్వతి విశ్వం ప్రచురణలు
ప్రతులకు:
జిల్లేళ్ళ బాలాజీ, 9-535, ఓం శక్తి గుడి పక్క సందులో,
లింగేశ్వర నగర్, బైరాగిపట్టెడ,
తిరుపతి 517501
7382008979, 9866628639
gillella.balaji@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here