విప్లవ చైతన్య ఉత్తుంగ తరంగం కొమరం భీం

0
4

జై భీం

విప్లవ చైతన్య ఉత్తుంగ తరంగం కొమరం భీం

[dropcap]‘పో[/dropcap]రాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప’ అన్నాడు శ్రీశ్రీ. జాగోరే జగావోరే అంటూ గిరిజనులను మేల్కొల్పి, సాయుధపోరాటం చేస్తేనే జీవితాలు బాగుపడతాయని పోరాడిన యోధుడు కొమరం భీం. అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులను సమీకరించి తిరుగుబాటు చేసిన గిరిజనబిడ్డగా ఆయనకు విశేష గుర్తింపు ఉంది. నిజాం నవాబు గుండెల్లో ఫిరంగులు మ్రోగించిన గిరిజన సింహం కొమరం భీం.

ఎటుచూసినా ఎత్తైన కొండలు. పచ్చని చెట్లు. ఇప్పపూల మత్తైన సువాసనలు. కుకూ పిట్టల స్వరాలతో ప్రకృతి శోభాయమానంగా అలరారే ప్రాంతం జోడెఘాట్ అటవీ ప్రాంతం. అడవిని నమ్ముకొని జీవించే అమాయక ప్రజలు గిరిజనులు. ఇక్కడ పన్నెండు గిరిజన గూడెంలు ఉన్నాయి. ఇందులో గోండు, కోలం, పర్దాన్, కోయ మొదలగు గిరిజన జాతులవారు ఉండేవారు. వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం వీరి వృత్తి. ఇక్కడి వ్యవసాయం రెండు రకాలు. ఏటవాలుగా ఉండే కొండల్లో మొనదేలిన వెదురు కర్రతో రంధ్రాలు చేసి విత్తనాలు నాటుతారు. దీనిని ‘కుకీ వ్యవసాయం’ అంటారు. కొండల పైభాగాన చెట్లు, పొదలు నరికి చదును చేస్తారు. దీనిని ‘పటార్లు’ అంటారు. కొంతకాలం వ్యవసాయం చేసి భూసారం తగ్గగానే మరో ప్రాంతానికి వెళ్లి చెట్లు నరికి వ్యవసాయం చేస్తారు. దీనిని ‘పోడు వ్యవసాయం’ అంటారు. ఇక్కడ వ్యవసాయం చేయటం చాలా కష్టం. అడవి పందులు, పక్షుల బారినుండి పంటను రక్షించుకోవాలి. ఇది ఒక జీవన పోరాటం. జొన్న, కంది, పెసర, నువ్వులు పండిస్తారు. వెదురు గింజలు ఉడకబెట్టి అన్నంలా తింటారు. అటవీ సంపదను చూసి ఆశ పుట్టిన షావుకార్లు బెల్లం, ఉప్పు, పొగాకు, పౌడరు, దువ్వెన, చెప్పులు, బిస్కెట్లు ఎరగా చూపి గిరిజనుల సరుకులను దోచుకొనేవారు. వాటి ధర ఎంతో తెలియని అమాయకులను మోసం చేసేవారు. చారెడు ఉప్పు ఇచ్చి కుండెడు అంటే సుమారు ఇరవైరెండు కిలోలు కందులు, ఒక బెల్లం ముక్క ఇచ్చి అడ్డెడు అంటే సుమారు రెండున్నర కిలోలు నువ్వులు, ఒక పొగాకు చుట్ట ఇచ్చి బుట్టెడు అంటే కుండలో సగం తేనె తీసుకుపోయేవారు.

పట్వారీల పట్టీ వసూలు :

పట్టీ అంటే పన్ను. పట్వార్లు నిజాం ప్రభువు అనుయాయులుగా ఉంటూ బలవంతంగా పట్టీలు వసూలు చేసేవారు. మేత మీద పట్టి, మేక మీద పట్టి, ఆవుమీద పట్టి దూడమీద పట్టి, చెట్టు మీద పట్టి కొలిచే పుట్ట మీద పట్టి. ఇలా ప్రతిదానిపై పట్టీ వేసి గిరిజనుల శ్రమను దోచేవారు. పట్టీ కట్టలేని వారిని కఠినంగా శిక్షించేవారు. వీరి చీకటి బ్రతుకులను దూరం చేయడానికి ‘ఉదయించిన సూర్యుడు’ కొమరం భీం.

బాల్యం :

రౌట సంకెపల్లిలో 1901వ సంవత్సరంలో అక్టోబర్ 22 నాడు కొమరం చిన్ను, మైనుబాయిల మూడవ సంతానంగా కొమరం భీం జన్మించాడు. కొమరం చిన్ను ఆ గూడెంకు పెద్ద. కొమరం చిన్నుకు ఇద్దరు తమ్ముళ్ళు. కుర్దు, యశ్వంతు. యశ్వంతుని యేసు అని పిలిచేవారు. చిన్నతనం నుండి భీంకు దైవభక్తి ఎక్కువ. నాగోబా, జంగుబాయి దేవతలను కొలిచేవాడు. భీం వదిన కుకుబాయికి మరిది అంటే ఎంతో వాత్సల్యం. చిన్నప్పుడు కట్టెలకోసం అడవికి తీసుకు వెళ్లి భీముని కథ, ఘటోత్కచుని కథ చెప్పేది.

పట్వారీ, జంగ్లాత్‌ల ఆగడాలు :

నిజాం నవాబు అడవిలో కాపలా కోసం అటవీ అధికారులుగా జంగ్లాత్ లను నియమించాడు. పట్టీల వసూలు కోసం పట్వారీలు ఉండేవారు. పట్టీ కట్టలేదనే నెపంతో జంగుదాదాని అమీన్ సారేదార్ కొట్టి చంపాడు. ఒక గోండు తన కూతురి పెళ్లికి అనుమతి లేకుండా పందిరి వేశాడని పీకించి వేశాడు. పెళ్ళికూతురు లక్ష్మిబాయిపై అఘాయిత్యం చేశాడు. ఆ అవమానాన్ని భరించలేక లక్ష్మిబాయి ఆత్మహత్య చేసుకొంటుంది. ఆ సంఘటన చూసి కోపంతో రగిలి పోతూ భీం సారేదార్‌పై రాయి విసిరాడు. భీం చేసిన దానికి కొట్టబోతే కొమరం చిన్ను అమీన్ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుతాడు. సరేనని మొదటి తప్పుగా వదిలేశాడు.

ఒక రోజు కొమరం భీం తన స్నేహితులు కొండల్, జంగు, పైకు లతో కలిసి మేకలు తోలుకొని అడవికి వెళ్ళాడు. పైకు చెట్టు ఎక్కి చిన్న కొమ్మల్ని మేకలకు వేస్తున్నాడు. ‘పైకు తొందరగా దిగు జంగ్లాత్‌లు వస్తారు’ అని జంగు అన్నాడు. అనుకున్నట్లుగానే అటుగా వెళుతున్న అమీన్ సాహెబ్ రహమత్ చూశాడు. ‘ఈ చెట్లను ఎవరు తెంపమన్నారురా? వీళ్ళను గూడెం దగ్గరికి తీసుకురండి’ అని చౌకీదార్లకు చెప్పాడు. గూడెంలో అందరూ చూస్తుండగానే కొట్టాడు. పైకు చేతి వేళ్ళను నరికించాడు. పైకు అడవి దద్దరిల్లేటట్లు ఏడ్చి స్పృహ తప్పి పడిపోయాడు. భీం కంటి నుంచి నిప్పులు చెలరేగాయి. పైకు తండ్రి కుర్దు పటేల్. దీనికి కారణమైన భీం అంతు చూస్తానని కుర్దు పటేల్ శపథం పూనాడు. కొమరం చిన్ను నుండి బలవంతంగా ఇంట్లో వస్తువులను, కోళ్ళను, మేకలను అమీన్ తోలుకుపోయాడు. చిన్ను ఈ అవమానాన్ని భరించలేక మానసిక క్షోభకు గురి అయ్యాడు. దీనితో కొన్ని రోజులకు మంచం పట్టాడు. తాను చనిపోతూ భీం చేతిని కొమరం కుర్దు చేతిలో పెట్టి ‘ఇకపై నీవే చూసుకోవాలి ఇక్కడ ఉంటే మంచిది కాదు’ అని చెప్పాడు. అన్నకు ఇచ్చిన మాట ప్రకారం కొమరం కుర్దు కెరిమెరి దగ్గరలోని సుర్దాపూర్‌కు వీళ్ళందరినీ తీసుకెళ్ళాడు. అక్కడ చెట్లను నరికి జొన్న సాగు చేసారు. ముత్యాల్లాంటి జొన్నలు చూసి ఆనందపడ్డారు. అంతలోనే అక్కడికి లక్ష్మణ రావు పట్వారి సిద్ధిక్‌తో కలిసి వచ్చాడు. ఈ భూమి సిద్ధిక్ సాహెబ్ గారిది అని, దీనిలో పంట వేసినందుకు కౌలు చెల్లించాలని గొడవ చేశాడు. పగలనక రేయనక కష్టపడి పండించిన పంటను సిద్దిక్ తీసుకుపోతుంటే ఆవేశంతో భీం రగిలి పోయాడు. ఎదిరించిన యేసును సిద్ధిక్ కొట్టబోయాడు. అదిగమనించి సిద్ధిక్ తలపై భీం కట్టెతో చావబాదాడు. పట్వారీ పారిపోయాడు. ‘పోలీసు వాళ్ళు వస్తారు పారిపో’ అని కుకు బాయి భీంకు చెప్పింది. భీం అడవిలోకి పరిగెత్తాడు. కొంతసేపటికి విషయం తెలుసుకున్న జమీందారులు వచ్చి గూడెంను తగల బెట్టారు.

రాంజి గోండురాజు పోరాటం :

సంకినపల్లిలో కొండల్ అనే మిత్రుడి దగ్గరికి వెళ్లి జరిగినదంతా చెప్పాడు భీం. కొండల్ తండ్రి ముత్తు వచ్చి మన గూడేలకు అన్నింటికి పెద్ద ముఖాసి అని, ఆయన భారీలొర్జిలో ఉంటాడని, ఆయన నిన్ను కాపాడతాడని సలహా ఇచ్చాడు. కొండల్ తో కలిసి భీం ముఖాసి దగ్గరికి వెళ్ళాడు. ‘రాం రాం దాదా’ అని చెప్పి జరిగిన విషయం పూసగుచ్చినట్లు చెప్పాడు. ‘పట్టీలు కట్టమని దౌర్జన్యం చేస్తున్నారు. అసలు పట్టీ ఎందుకు కట్టాలి? ఈ అడవి వాళ్ళ సొత్తా?’ అని ప్రశ్నిస్తున్న భీంని చూసి ‘నిన్ను చూస్తుంటే రాంజి గోండురాజు గుర్తుకొస్తున్నాడు. తెల్లదొరలను పట్టీలు కట్టనే కట్టమని ఎదిరించాడు. మాలో ఉత్సాహం నింపాడు. మమ్మల్ని యుద్ధానికి సన్నద్ధం చేశాడు. తుడుం మ్రోగింది. కొండపైకి ఎక్కి సైన్యంపై రాళ్ళను దొర్లించారు. విల్లు, బాణాలతో యుద్ధం చేశారు. కానీ వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి. మూడు రోజులు యుద్ధం వీరోచితంగా సాగింది. మేం తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. మాకు ఆహారం అందకుండా చేశారు. ఆకలితో యుద్ధం చేయలేక పోయాం. బాణాలు అయిపోయాయి. రాంజీని బంధించి చంపి నిర్మల్ వద్ద చెట్టుకు వ్రేలాడదీశారు. అంతటి వీరుడు మళ్ళీ పుట్టడనుకున్నా. నిన్ను చూస్తే రాంజీ మళ్ళీ పుట్టాడనిపిస్తోంది.’ అని ముఖాసి అన్నాడు. ‘కానీ నాకు ఇప్పుడు వయస్సు పై బడింది. సత్తువ లేదు. మీకు సహాయం చేసి గూడెం వాసులందరినీ కష్టాల పాలు చెయ్యలేను’ అని ముఖాసి చెప్పాడు.

ఏం చెయ్యాలో తెలీక, ఎక్కడికి వెళ్ళాలో పాలుపోక రాత్రంతా నడిచారు. ప్రొద్దున్నే ఒక పెద్ద పట్టణం కనబడింది. అది బల్హార్షా. అక్కడి రైల్వే స్టేషన్‌లో చాలా మంది రైలు ఎక్కుతుంటే వీళ్ళూ ఎక్కారు. అలసిపోయి రైల్లోనే నిద్రపోయారు. చాందా రైల్వేస్టేషన్ వచ్చింది. టిసి వచ్చి టికెట్ అడిగాడు. టికెట్ లేకపోవడంతో అక్కడి పోలీస్‌లకు అప్పజెప్పాడు. ఇకపై టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కవద్దని వారించి స్టేషన్ నుంచి గెంటి వేశారు. అక్కడ విఠోబా అనే ప్రయాణికుడు తన సామాను మోయలేక అవస్థ పడటం చూసి భీం సహాయం చేశాడు. తన ఇంటి వరకూ తెచ్చినందుకు ఒక రూపాయి ఇచ్చాడు. మాకు ఇక్కడ ఎవరూ లేరని చెప్పడంతో విఠోబా ఇంటిలోకి తీసుకెళ్ళాడు. ఆ ఇంట్లో ప్రింటింగ్ యంత్రం ఉంది. నేను ఈ యంత్రం తిప్పుతాను నాకు పని ఇప్పించండి అని అన్నాడు భీం. సరే నన్నాడు విఠోబా. ఆకలిగా ఉన్న వాళ్ళు కడుపు నిండా భోంచేశారు. రాత్రి కొండల్ ఏడుస్తున్నాడు. రేపు ఇంటికి వెళ్ళు అని భీం చెప్పాడు. రేపు బల్హార్షా రైలు ఎక్కిస్తానని విటోబా చెప్పాడు. కొండల్ వెళ్ళిపోయాడు. భీం విఠోబా దగ్గరే ఉండిపోయాడు. విఠోబా తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ నేర్పించాడు. బ్రిటీష్ వాళ్ళు దేశాన్ని ఎలా దోచుకొంటున్నారో వివరించాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఈ ప్రింటింగ్ ప్రెస్ రహస్యంగా నడుపుతున్నానని చెప్పాడు. ఒక రోజు రాత్రి విఠోబాను, భీంను పోలీసులు అరెస్ట్ చేశారు. బాగా కొట్టారు. భీంకు ఈ ప్రింటింగ్ ప్రెస్‌తో ఏం సంబంధం లేదని వదిలేశారు.

శ్రీ కొమరం భీం, కొమరం భీమ్ పాత్రలో జూ. ఎన్.టి.ఆర్

చాయ్ పత్తా దేశంలో :

ఎక్కడికెళ్లాలో తెలీక రైల్వే స్టేషన్లో ఆలోచిస్తూ కూర్చున్న భీంని చూసి మంచిర్యాల నుంచి వచ్చిన ఒక వ్యక్తి ‘నేను చాయ్ పత్తా దేశం వెళుతున్నాను. అక్కడ కూలి ఎక్కువ ఇస్తారు. నీవూ వస్తావా?’ అని అడిగాడు. చాయ్ పత్తా దేశం అంటే అస్సాం. సరేనని అతనితో పాటు వెళ్ళాడు. ‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అన్నట్లు అక్కడ కూడా కూలీల కష్టాలను కళ్ళారా చూశాడు. పనిచేయని కూలీలను జంతువులను కొట్టినట్లు కొరడాతో కొడుతున్నారు. రాత్రిళ్ళు రేకుల షెడ్లలో పండుకోవాలి. విపరీతమైన చలి. వానాకాలంలో పడే అవస్థ చెప్పనలవి కాదు. అక్కడ మన్నెం ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తితో పరిచయం అయ్యింది. అతడి ద్వారా అల్లూరి సీతారామరాజు పోరాట విధానాలను తెలుసుకున్నాడు. బ్రిటీషు వారిని ఎదిరించి అమరుడైన ఆ మన్నెం వీరుడిని స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఒక రోజు పని సరిగ్గా చేయలేదని కూలీలను కొరడాతో కొడుతున్నమేస్త్రీని చూసి కోపంతో ఆ కొరడాను లాక్కొని మేస్త్రీని చితకబాదాడు. ఇది తెలుసుకొని యజమాని భీంని పోలీసులకు అప్పజెప్పాడు. పోలీసులు భీంని అరెస్టు చేసి జైలులో వేశారు. జైలు వార్డెన్ నిద్ర పోతున్నప్పుడు ఇనుప చువ్వలను వంచి, జైలు గోడ దూకి పారిపోయాడు. గూడెం గుర్తొచ్చింది. అప్పటికే గూడెం విడిచిపెట్టి అయిదు సంవత్సరాలయింది. రైలు ఎక్కి వచ్చాడు. చివరికి అడవికి చేరుకున్నాడు. ఆ గాలి తగులగానే భీం ఒళ్ళు పులకరించింది. అడవి తల్లికి దండాలు పెట్టాడు. కాకస్ ఘాట్ లో ఉన్న తన అన్నల దగ్గరికి వచ్చాడు. వదిన కుకుబాయికి భీంని చూడగానే పట్టరానంత ఆనందమేసింది. ఇప్పుడు భీం మాట తీరు, ఆలోచనా విధానం మారింది.

వివాహం :

దేవడంలో లచ్చుపటేల్ గ్రామ పెద్దగా ఉండేవాడు. అతని వద్ద పాలేరుగా భీం చేరాడు. పత్తి, మిరప వంటి వ్యాపార పంటలు వేశాడు. తానే పంటను తీసుకెళ్ళి మంచి రేటుకు అమ్మాడు. లాభం వచ్చింది. లచ్చు పటేల్‌కు చెందిన కొంత భూమిని శ్యాం రావు ఆక్రమించాడు. న్యాయవాది పైకాజీతో మాట్లాడి కేసు వేయించి లచ్చు పటేల్‌కు భూమి వచ్చేటట్లు చేశాడు భీం. దీనితో లచ్చు పటేల్ భీంపై అభిమానం పెంచుకున్నాడు. తన భూమి వ్యవహారాలను చూసుకొనే అంబతి రావు కూతురు సోం బాయి తో వివాహం జరిపించాడు.

పత్తి పంటను రాజోరా జాతరలో అమ్మాలని వచ్చిన భీం ఒక యువతిని కొంతమంది యువకులు వెంటబడి వేధిస్తుంటే కాపాడాడు. తన పేరు పైకు బాయి అని, తనది బూరుకొండ అని, తల్లిదండ్రులు చనిపోయారని, తనకు ఎవరూ లేరని చెప్పింది. తనతో పాటూ వస్తావా అన్నాడు. సరే అని భీం ఇంటికి వచ్చింది. కొంతకాలం తరువాత పైకు బాయితో భీం వివాహం జరిగింది.

పోలీసులు కేసులు బనాయించటం :

జంగత్ వాళ్ళు అడవిని నరకవద్దంటారు. జమీందార్లు పండించిన పంటను లాక్కుపోతున్నారు. చౌకీ దార్లు చావగొడుతున్నారు. అడవిని నమ్ముకుని బ్రతికే వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఎలా బ్రతకాలి? తమ అనుమతి లేకుండా అడవిలో వ్యవసాయం చేసినందుకు కొమరం కుర్దు పై పోలీసులు కేసు బనాయించారు. కేసు విషయం పై పైకాజీని కలవమని పైకు బాయి సలహా ఇచ్చింది. జనగాం లోని దండనాయకుల రామచంద్రరావు అనే న్యాయవాదిని కలిసాడు. ఆ భూములు అమన్ మెహసురా భూములని అంటే రిజర్వు చేయబడిన అటవీ భూములని పైకాజి చెప్పాడు. జంగ్లాత్ కానున్ ప్రకారం వాటికి పట్టా చేయరని చెప్పాడు. నిజాం ప్రభువు దగ్గరికి వెళ్లి చెప్పుకుని పట్టా పొందితే కేసులు ఉండవని పైకాజి సలహా ఇస్తాడు. హైదరాబాద్‌కు వెళ్ళిన భీంని అక్కడి అధికారులు మోసం చేసి నిజాంను కలవకుండా చేసారు. కొంత డబ్బు తీసుకొని పట్టా అని వ్రాసి ఇస్తారు. కానీ అది నిజమైన పట్టా కాదని పైకాజీ చెప్పాడు.

జల్, జంగల్, జమీన్ :

నిజాం దగ్గరికి వెళ్లాడనే సంగతి తెలుసుకొన్న పెత్తందార్లు గూడెంకు నిప్పు పెట్టారు. భీం కోపంతో నిప్పులు చెరిగాడు. యుద్ధమే శరణ్యం అని నిశ్చయించాడు. బందూకు చేతబట్టాడు. ‘జల్, జంగల్, జమీన్’ అంటే ఈ నీరు, ఈ అడవి, ఈ భూమి మనదే అనే నినాదం చేశాడు. మన రాజ్యంపై పెత్తందార్ల పెత్తనం ఇక చెల్లదని నినదించాడు. జంగ్ సైరన్ జమాయించాడు. బాబేఝురిలో పోరాటాన్ని ప్రారంభించాడు. పన్నెండు గూడేల గిరిజనులను యుద్ధానికి సన్నద్ధం చేశాడు. గెరిల్లా పోరాటంలో యువకులకు శిక్షణ నిచ్చాడు. బాకులు, బల్లేలు, బాణాలు, విల్లులు తయారు చేశారు. తుడుం మ్రోగింది. బూరలు, కొమ్ములు ఊదారు. రగల్ జెండా రెపరెప లాడింది. రజాకార్లు, నిజాం సైన్యం ఆకృత్యాలను అడ్డుకున్నారు. విషయం నిజాం నవాబుకు తెలిసింది తహసిల్దారుతో నీకు కావలసినంత భూమి ఇస్తామని, మీ పన్నెండు గూడేల గిరిజనుల భూములకు పట్టాలిస్తామని చెప్పి పంపారు. కానీ భీం దీనికి ఒప్పుకోలేదు. ‘మావ నాటే మావ్ రాజ్’ అంటే మా వూళ్ళో మాదే రాజ్యం అన్నాడు. గోండు రాజ్యం కావాలన్నాడు. నిజాం భీంను పట్టుకోవటానికి మూడువందల మందితో ప్రత్యేక సైన్యం పంపాడు. భీం ఆచూకీ తెలపమని గూడెంలో ఉన్నవారిని చిత్ర హింసలకు గురిచేసారు. అయినా వారు నోరు మెదపలేదు. తన భర్త జాడ తెలపమని పైకు బాయిపై దాడి చేశారు. వీరోచితంగా వారితో పోరాడిన ఆ వీర వనిత వీర మరణం పొందింది.

నమ్మక ద్రోహం :

గూడెం వాసి కుర్దు పటేల్‌కు అధికారులు సారా, డబ్బు ఇచ్చి లొంగదీసుకున్నారు. పగలు పట్టుకోలేమని రాత్రి దాడి చేయాలని పన్నాగం పన్నారు. అది ఆశ్వీయుజ నిండు పౌర్ణమి. అర్ధరాత్రి అలసిపోయి ఆదమరచి నిద్రిస్తున్న కొమరం భీంను కెప్టెన్ అలీరాజాకు కుర్దు పటేల్ చూపించాడు. అంతే భీం గుండెను చీల్చుకొంటూ తూటా దిగింది. నమ్మక ద్రోహం గెలిచింది. ‘జై రగల్ జెండా, గోండు రాజ్యం జిందాబాద్’ అంటున్న భీం గొంతులో కాల్చారు. అంతే గిరిజన స్వేచ్ఛా గీతం మూగబోయింది. పోరాట యోధుడు నేలకొరిగాడు. భీంతో సహా పన్నెండు మంది అమరులయ్యారు. వీర మరణం పొందిన గిరిజన పులి కొమరం భీం.

నిజాం నవాబు గిరిజన తెగల పరిస్థితులపై అధ్యయనం కోసం హైమన్ డార్ఫ్‌ను నియమించాడు. ఆసిఫాబాద్ వద్ద పెద్దవాగుపై నిర్మించిన రిజర్వాయరుకు శ్రీ కొమరం భీం ప్రాజెక్టుగా పేరు పెట్టారు. నేటి ప్రభుత్వం ఆసిఫాబాద్‌ను కొమరం భీం జిల్లాగా ప్రకటించింది. జోడెఘాట్‌లో ఉన్న మ్యూజియంలో ఇప్పటికీ కొమరం భీం ఆనవాళ్ళు ఉన్నాయి. అయినా నేటికీ గిరిజనులు భూములకు పట్టాలు పొందలేదు. పులుల సంరక్షణార్థం అటవీ భూములను రిజర్వు చేశారు. తెలంగాణా ప్రజా పోరాటాలకు దిక్సూచిగా నిలిచాడు కొమరం భీం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here