[dropcap]కా[/dropcap]రు కనుమరుగు కాగానే ఫోన్ బూత్ వైపు నడిచింది మాళవిక.
ఆమె డయల్ చెయ్యగానే “హలో!” అన్నాడు శశిధర్.
“నేను మాళవికను… నందిని వుందా?” అడిగింది.
“లేదు… ఎక్కడికెళ్ళిందో తెలియదు, ఏం?” అడిగాడు.
“ఇక్కడి నుంచి బయలుదేరి చాలా సేపయిందే? సరే… మళ్ళీ చేస్తాలెండి” అని ఫోన్ పెట్టేసి మనసులో నవ్వుకుంది మాళవిక.
ఆ రోజు నందిని చెయ్యి వెనక్కి లాక్కోగానే అతను మాళవిక వైపు గర్వంగా చూస్తూ “నేనూ సాంప్రదాయాన్ని, మర్యాదల్నీ నీలాగే మన్నిస్తాను… ఆ సంగతి నాకే కాదు అందరికీ తెలియాలనీ…” అనడం గుర్తొచ్చింది.
‘శశిధర్… ఇప్పుడు చూపిస్తా నా తడాఖా!’ అనుకుంది.
***
‘ఎక్కడికెళ్ళిందీ? అసలే ప్రొద్దుట చిరాకు పడ్డాను కూడా!’ అనుకున్నాడు శశిధర్.
ఇంతలో కారు ఆగిన శబ్దం అయి కిటికీ లోంచి చూసాడు.
నందిని ఫ్రంట్ డోర్ తెరచుకుని దిగడం, ఓ గెడ్డం వ్యక్తి ‘బై..’ అని చెయ్యి వూపి కార్లో వెళ్ళిపోవడం కనిపించింది.
శశిధర్ భృకుటి ముడిపడింది.
నందిని అప్పుడే లోపలికి అడుగుపెట్టి, “ఎంతసేపయింది వచ్చీ?” అంది.
శశిధర్ ఆమెను ఆపాదమస్తకం పరిశీలనగా చూసాడు.
అప్పుడే ఫ్యాషన్ షో లోంచి వచ్చినట్టుగా వుంది నందిని. భార్య సరికొత్తగా, వింతగా కనిపించింది.
“అలా చూస్తున్నారేం? బాలేనా?” నవ్వుతూ అడిగింది.
“కొత్తగా వుంటేనూ” అన్నాడు.
“ఆ… ఆ… వద్దంటే వినలేదు అక్క” అంది.
“ఎక్కడికెళ్ళావు?” అడిగాడు.
“అక్కతో షాపింగ్‍కి” చెప్పింది నందిని.
“అక్కడి నుంచి ఎక్కడికెళ్ళావు?” అడిగాడు.
“అక్కతో హోటల్ కెళ్ళాను” చెప్పింది.
“అక్కడి నుంచి…” అడిగాడు.
నందిని వెంటనే, “ఇంటికే వచ్చేసాను” అంది.
శశిధర్ మొహంలో ఒక బాధావీచిక రెపరెపలాడింది. అభం శుభం తెలీని అమాయకురాలనుకుంటున్న తన భార్య అబద్ధాలాడ్తోంది. ఆమె తప్ప వేరే ప్రపంచమే లేదనుకునే తనతో అబద్ధాలాడ్తోంది… హే భగవాన్! ఇదెంతటి నరకమో అనుభవించిన వాడికి కానీ తెలీదు!
“ఏవిటలా వున్నారు?” అడుగుతూ దగ్గరికొచ్చింది నందిని.
శశిధర్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ “అతనెవరు?” అడిగాడు.
“అతనెవరూ? ఓ… కారు సంగతా? నాకు తెలీదు. అక్క ఫ్రెండుట…” అంది నందిని.
శశిధర్‍కి అదీ అబద్ధంగా అనిపించింది. బాల్కనీలోకి నడిచి సిగరెట్ త్రాగుతూ కూర్చున్నాడు.
“కాఫీ కలపనా?” అడిగింది నందిని.
‘అందులో ఎలకల మందు కూడా కలుపు’ అందామనుకున్నాడు.
అతనికి ‘ఆస్తా’ సినిమా గుర్తొచ్చింది. మధ్య తరగతి మగాడు ఇంత ఈజీగా మోసపోతాడా! అనుకున్నాడు.
నందిని కాఫీ పట్టుకొచ్చింది.
అతను మౌనంగా అందుకున్నాడు.
“సారీ… ఆలస్యంగా వచ్చాను. అప్పటికీ అక్కతో త్వరగా వెళ్దామని చెప్తూనే వున్నాను” అంది.
శశిధర్‍కి ఆమె నోటి నుంచి వచ్చే ప్రతీ మాటా అబద్ధంలా వినడానికి దుస్సహంగా వుంది!
నందిని మొహంలోకి చూసాడు. ఆ కళ్లు నిర్మలంగా, అమాయకంగా వున్నాయి. అతనికి తెలీకుండానే ‘ఇంత అందమైన ముఖాన్ని ఎవడి చేతులో దగ్గరకి తీసుకుంటే… ఆ పెదవులని ఎవడో ఆత్రంగా జుర్రుకుంటే… నేను భరించగలనా?’ అన్న ఆలోచనొచ్చింది.
నందిని తనలో తానే నవ్వుకుంటోంది. బహుశా ఆ కార్లో గెడ్డం వాడు చేసిన చిలిపి పనులు తలచుకునేమో అనుకున్నాడు.
“అతను శ్యామ్ అని ఏడ్ ఫిల్మ్స్ తీస్తాడట. నన్ను ఏక్ట్ చేయమంటాడేమిటండీ? తలచుకుంటేనే నవ్వొస్తోందీ!” అంది.
‘ఏం తలచుకుంటే… చిన్న బికినీలో స్నానం చేస్తున్నట్లు తలచుకుంటేనా?’ అందామనుకున్నాడు.
“నా ఫేస్‍లో అన్ని ఏంగిల్స్ అద్భుతం అన్నాడు” అని పకపకా నవ్వింది.
‘బాడీలో ఏ కర్వ్ బావుందో కూడా తడిమి చూసాడా!’ అనుకున్నాడు.
“నేషనల్ లెవెల్‌లో ఫేమ్ వస్తుందిట” అంది.
“వాంతొస్తోంది… కాఫీ ఛండాలంగా వుంది” అన్నాడు శశిధర్.
తెల్లబోయి చూసింది నందిని.
శశిధర్ అక్కడి నుంచి లేచి విసవిసా వెళ్ళిపోయాడు.
నందినికి అతని కోపానికి కారణం ప్రొద్దుట జరిగిన గొడవేనేమో అనిపించింది.
“మీకిష్టం లేకపోతే చీర వాపస్ ఇచ్చేస్తాలెండి… ఐదువేలకి మన మధ్య గొడవెందుకు?” అంది.
‘మీ ఆడవాళ్ళు తలచుకుంటే ఏదైనా వాపస్ ఇచ్చేయగలరు!’ అనుకున్నాడు.
నందిని ఆ రాత్రి తలలో సన్నజాజులు పెట్టుకుని వచ్చి అతని పక్కన పడుకుని, “ఏయ్, కోపం తగ్గలేదా? ఇటు తిరగండి” అంది.
శశిధర్ అటు తిరిగి ఆమె వైపు చూసి ‘నిజంగా అద్భుతమైన అందం! అందాన్ని భరించడం ఎంత కష్టం?’ అనుకున్నాడు.
నందిని అతని గుండెల మీద వాలి, “మీకంటే నాకు చీరలూ, నగలూ ఎక్కువ కాదండీ!” అంది.
శశిధర్‍కి ఆమె మాటలు కృతకంగా అనిపించాయి.
“నీకు ఏక్ట్ చెయ్యడం వచ్చన్న మాట!” అన్నాడు.
నందిని నవ్వి, “అబ్బా… వదిలేద్దురూ… ఊరికే చెప్పాను. నాకు ఏక్షన్ ఏమిటీ? ఏదో అతనలా భ్రమ పడ్డాడు.” అంది.
అతను మళ్ళీ గుర్తొచ్చాడు శశిధర్‍కి.
నీలిరంగు బెడ్ లైట్ కాంతిలో మెరుస్తున్న ఆమె చెక్కిళ్ళూ, ఎత్తైన స్తనద్వయం… పక్కకి తిరిగి పడుకున్నప్పుడు అందంగా ఒంపు తిరిగి పైకి లేచిన నడుము భాగం… చూస్తున్న కొద్దీ, వాడు ఒంటరిగా దొరికిన ఇంత అందాన్ని ఏమీ చెయ్యకుండా వదిలేసుంటాడా అనే భావన ముల్లులా పొడుస్తోంది.
నందిని చెయ్యి అతని నడుము నుండి క్రిందకి జారింది.
‘ఇలాగే ఈ చేతులు వాడ్ని కూడా…’ ఆపైన వూహించలేకపోయాడు.
“ఏవిటా బెట్టు… నా వైపు తిరగండి” అంది నందిని.
శశిధర్ అటు తిరిగాడు.
నందిని పెదవులు అతని పెదవుల్ని హత్తుకున్నాయి. అవి ప్రతి రోజూ చేసే అల్లరే చేస్తున్నా, శశిధర్‍కి ఎందుకో ఎబ్బెట్టుగా అనిపించింది. ‘ఇన్ని మెళకువలు తెలిసిన స్త్రీ కొంగు నిండా కప్పుకుని వంచిన తల ఎత్తకుండా వుంటుందని భావించడం బుద్ధి తక్కువ’ అనిపించింది.
ఆమె చేతుల్ని నెమ్మదిగా తప్పించి, బైటికి వెళ్ళిపోయాడు.
నందిని వింతగా చూసింది.
ప్రతి రోజూ తన కోసం ఆతృతగా ఎదురుచూసే భర్త ఈ రోజు తనంతట తను ప్రేరేపించినా ఇలా దూరంగా వెళ్ళిపోవడం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగించింది.
లేచి అద్దంలో చూసుకుంది.
కొత్తగా చేసుకున్న అలంకరణలో తనకి తనే పరాయిగా అనిపించి ‘ఛీ! ఆయనకి అక్కర్లేని అలంకరణలు నాకెందుకూ? రేపట్నించీ మాములుగానే వుంటాను!’ అనుకుంది.
రేపటికి ఆయనే సర్దుకుంటారు అనుకుంది. కానీ ఆమె అనుకున్నట్లుగా జరగలేదు.
శశిధర్ సర్దుకోలేకపోయాడు.
ఏ వ్యాధికైనా మందుంది కానీ, అనుమానం అనే వ్యాధికి ముదరడమే తప్ప, నయమవడం తెలీదు!
***
వాసుదేవరావుకి పెద్ద చిక్కొచ్చి పడింది. ఆ రోజు ఆయన పనిచేసే పత్రిక ప్రొప్రయిటర్ తనని కలవమని కబురు పెట్టాడు.
వాసుదేవరావు లోపలికి అడుగుపెట్టడానే అక్కడో అమ్మాయి కూర్చుని కనిపించింది. ఆ అమ్మాయిని చూడగానే వాసుదేవరావు గతుక్కుమన్నాడు.
పెద్ద బొట్టు పెట్టుకుని భుజాల చుట్టూ కొంగు కప్పుకుని కూర్చుని వున్న ఆ అమ్మాయి అతన్ని చూసి నవ్వింది.
ప్రొప్రయిటర్ వాసుదేవరావుని చూసి కుర్చీ చూపించాడు.
వాసుదేవరావుకి ఆ అమ్మాయి తన దగ్గరకి వచ్చినప్పటి తన ప్రవర్తన గుర్తొచ్చి భయం భయంగా చూసాడు.
“వాసుదేవరావు, ఈ అమ్మాయి నీకో నవల పంపి ఆరు నెలలు అయిందట నిజమేనా?” అడిగాడు ప్రొప్రయిటరు.
వాసుదేవరావు తల వూపాడు.
“ఆ నవల ప్రచురించడం కానీ తిప్పి పంపడం కానీ ఎందుకు జరగలేదూ?” అడిగాడు ఆయన.
“అదీ… అదీ… అంత యోగ్యంగా లేదండీ!” నసిగాడు వాసుదేవరావు.
“మరైతే ఆ విషయాన్ని ఆమెకి ఎందుకు తెలియబర్చలేదూ?” గద్దిస్తున్నట్లుగా అడిగాడాయన.
ఆమె సన్నగా నవ్వడం వాసుదేవరావు దృష్టిని దాటిపోలేదు.
“ఆ నవల పేరు గుర్తుందా?” ఆమె అడిగింది.
వాసుదేవరావు కోపంగా, “రోజుకి వంద పైగా రచనలొస్తుంటాయి. అన్నీ ఎడిటర్‍కి గుర్తుంటాయా?” అన్నాడు.
“నేను గుర్తు చేస్తాలెండి. ‘తీర్పు’ దాని పేరు. సబ్జెక్ట్ ఏమిటో తెలుసా?” ఆ అమ్మాయి అడిగింది.
అతను చెప్పలేకపోయాడు.
ఆమె నవ్వి “అసలు మీరు దాని వైపు చూస్తే కదండీ గుర్తుండేదీ, మీకు తెలిసిన వాళ్ళవీ, దగ్గర వాళ్ళవీ ప్రచురించడంలోనే మీరు బిజీగా వున్నారు. ఇంక కొత్త వాళ్ళవి ఏం చూస్తారూ?” అంది.
వాసుదేవరావు విసుగ్గా “సార్… ఆమె ఎక్కువగా మాట్లాడ్తోంది. నా విధి నిర్వహణ గురించి నాకెవరూ చెప్పక్కర్లేదు” అన్నాడు.
ప్రొప్రయిటర్ ఇంకా కోపంగా, “ఆమె సరిగ్గానే అంది. ఆ నవల కాపీ నాకు పట్టుకొచ్చి ఇచ్చింది. ఏ మాత్రం సాహిత్య జ్ఞానం వున్నవాడైనా వెంటనే ప్రచురించాల్సినంత ఉదాత్తంగా వుంది. కానీ నువ్వేం చేసావు? నవల సంగతి పక్కన పెట్టి అమ్మాయి అందం సంగతి మాట్లాడావు. గెస్ట్ హౌస్‌కి ఒంటరిగా వస్తే సీరియల్ ఛాన్స్ ఇస్తానన్నావు. ఏం? ఇవన్నీ నాకు ఎలా తెలిసాయని కంగారు పడ్తున్నావా?” అడిగాడాయన.
వాసుదేవరావు లేస్తూ “అబద్ధం సార్! నేను అలాంటివాడిని కాదు. ఈ అమ్మాయి తన నవల ప్రచురించలేదన్న కోపం కొద్దీ అలా కల్పించి చెప్తోంది!” అన్నాడు.
“ఆ అమ్మాయి నీకు ఫోన్ చేసి ఎపాయింట్‌మెంట్ తీసుకున్నప్పుడల్లా నువ్వేం మాట్లాడావో నాకు చెప్తూనే వుంది. నేనూ ప్యూన్ ద్వారా సంగతులు తెలుసుకుంటూనే వున్నాను. ఆ అమ్మాయికి నాలుగింటికి అపాయింట్‌మెంట్ ఇచ్చి ఆరింటిదాకా వెయిట్ చేయించడం, ఆ తర్వాత నిగూఢంగా మాట్లాడి అన్నింటికీ ఒప్పుకుంటేనే నవల వేస్తాననడం… అన్నీ మన ప్యూన్ ద్వారా నాకు తెలిసాయి. నువ్వు నవలలు ఏ విధంగా అప్రూవ్ చేస్తావో, ఎలా రచయిత్రుల్ని పరీక్షిస్తావో నాకు తెలిసిపోయింది. మాళవిక ఎవరో నాకు తెలియదు. ఆమె రచనలు మన పుస్తకంలో అలా చైన్‍లా ఎందుకు వస్తున్నాయో తెలపమంటూ అసంఖ్యాకంగా వస్తున్న ఉత్తరాలు నేను చూడడం తటస్థించింది. ఉప్పూ, పప్పూ లేని ఆ రాతలు ఎందుకు ప్రచురిస్తున్నావో, అంత హెచ్చు పారితోషికం ఎందుకు ఇస్తున్నావోనని ఆరా తీస్తే నాకు అన్ని నిజాలూ తెలిసాయి. కానీ నీకు తెలీని నిజం ఒకటి నేను చెప్తా… తెలుసుకో. ఈ అమ్మాయి నా అన్న కూతురు! బాబాయ్ ఇలా జరుగుతోందని చెప్తే నేను మొదట నమ్మలేదు. అందుకే నిరూపించి చూపించింది. థాంక్స్ నీరజా!” అన్నాడు.
నీరజ నవ్వుతూ చూసింది.
వాసుదేవరావు ముఖంలో కత్తివేటుకి నెత్తురు చుక్క లేదు.
అమాంతం ఆయన కాళ్ళ మీద పడ్డాడు.
“సార్… ఈ ఒక్కసారికీ నా తప్పు కాయండి. ఉద్యోగం మీదే ఆధారపడి బ్రతుకుతున్న వాడిని. అది కాస్తా వూడిపోతే పెళ్ళాం బిడ్డలతో రోడ్డున పడిపోతాను సార్!” అన్నాడు.
“ఇప్పుడు మాత్రం నీ పెళ్ళాం బిడ్డలు రోడ్డున పడలేదా? నీ సంపాదనలో ఎంత నీ ఇంటికెళ్తోంది?” అన్నాడు ప్రొప్రయిటర్.
వాసుదేవరావు కన్నీళ్ళతో ఆయనని క్షమించమని ఎంతగానో వేడుకున్నాడు.
ఆయన వినలేదు. “చూడు వాసుదేవరావు… నేను వ్యాపారం కోసమే ఈ పత్రిక నడపడం లేదు. నా తాతా, తండ్రుల కాలం నుండీ సాహిత్యాభిమానంతో మేమీ పత్రిక నడుపుతున్నాం! నీ లాంటి అసమర్థుల చేతికి పగ్గాలిచ్చి మేము సరస్వతీదేవికి అపకారం చేస్తున్నామని నాకిప్పుడే తెలిసింది. నీది క్షమించరాని తప్పు… ఇంక ఇంటికి వెళ్ళు!” అన్నాడు.
(ఇంకా ఉంది)