[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ రచయిత్రి స్పందన అయాచితం – సంచిక పాఠకుల కోసం రచించిన ‘సీత‘ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]
“పర్లేదు.. పర్లేదు.. కూర్చో బాబూ.. “ అంటూ వచ్చి నాపక్కన కూర్చున్నారు.
“నీ పేరు రాజీవ్ కదా!”
“అవును అంకుల్…”
“నన్ను రవీందర్ అంటారు.”
నేను చిన్నగా నవ్వాను.
“ఏం చేస్తున్నావు లండన్‌లో….”
“లా ప్రాక్టీస్ చేస్తున్నాను….!”
“సరే! ఇదిగో… ఈ అమ్మాయే … మా అమ్మాయి… నందిని…” అంటూ నా ఎదురుగా కూర్చున్న అమ్మాయిని పరిచయం చేసారు….
అంతే … నా జీవితం గారెల బుట్టలో పడ్డట్టుంది…. తనే పెళ్ళికూతురట!!
“హలో…” అని నవ్వాను.
నందిని కూడా “హలో….” అంది.
ఈ అమ్మాయినా? తనా వద్దనుకుంది?…. ఎంతో ఛాన్స్ మిస్ అయ్యేది. అందరూ ఉన్నారని, ఊరుకున్నా…. ఎవ్వరు లేకపోయినట్లయితే… బాబాయికి గట్టిగా ముద్దిచ్చేవాడిని.
“మీ బాబాయ్‌తో నాది రక్త సంబంధం ఒక పక్క అయితే, ఇంకో పక్క మేము బిజినెస్ పార్టనర్స్ కూడా. ఆయన చేసే ప్రతి చిన్న బిజినెస్‌లో నాకు భాగం ఉంది, జీవితంలోని ప్రతి చిన్న సంతోషంలో భాగం ఉంది. మా వ్యాపారాలే కాదు, కుటుంబాలు కూడా ఎప్పుడో కలిసిపోయాయి.” ఆయన నవ్వుతూ మా బాబాయ్ వైపు చూసాడు.
“అందుకే నిన్ను చూడకుండానే ఈ సంబంధం ఒప్పుకున్నా…. మా మధ్య ఉన్న నమ్మకం అటువంటిది. కానీ మీ బాబాయే ‘అది అంతా కుదరదు. మా అబ్బాయి మీ అమ్మాయిని చూడాలి. నచ్చిందో లేదో చెబుతాడు. అప్పటి వరకు సంబంధం ఖాయం చేసేది లేదు.’ అని మొండికేశారు.” మళ్ళీ చెప్పాడు.
“అవునా? అలా అన్నారా? నేను మాత్రం బాబాయ్ ఎవర్ని చూపిస్తే వారిని పెళ్ళి చేసుకుంటా.” అని అమాయకంగా మొఖం పెట్టా.
అందరూ ఒక్కక్షణం నోరెళ్ళబెట్టి, నావైపు చూసారు.
నా మాటకి బాబాయికి పొలమారింది. గట్టిగా దగ్గుతూ… తలమీద కొట్టుకుంటూ… నావైపు కోపంగా చూసారు. నేను మాత్రం దించిన తల ఎత్తితే ఒట్టు. కాసేపటికి ఇంట్లోవారు వచ్చి, పరిచయం చేసుకున్నారు.
రవీందర్‌ది చిన్న కుటుంబం, కానీ బాగా పేరున్న కుటుంబం. రవీందర్ తల్లి మేడమీద ఉన్నారు, ఇప్పుడు కిందకు రాలేరని చెప్పారు.
టిఫిన్ అయ్యాక… మా ఇద్దరిని మాట్లాడమని ఒక గదిలోకి పంపించారు.
నందిని తలదించుకొనే ఉంది. ఏమీ మాట్లాడటం లేదు.
ఎలా మొదలెట్టాలో అర్థం కాలేదు. సంతోషం ఎక్కువైంది. నందిని అందం నా ఒంట్లో సన్నని వణుకు, తెలియని తడబాటు తెచ్చింది.
“మీ పేరు?” ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని అడిగాను.
“నందిని” తన తలదించుకొనే చెప్పింది.
ఏం మాట్లాడాలి దేవుడా….!
“మీకు ఈ పెళ్ళి ఇష్టమే కదా!”
చిన్నగా నవ్వుతూ… తల ఊపింది.
“నన్ను చూడలేదు, మాట్లాడలేదు. మరి ఎలా ఒప్పుకున్నావు?”
ఒక్క నిమిషం నందిని ఏమీ మాట్లాడలేదు.
“నాన్న మంచి సంబంధం అని చెప్పారు. ఆయన చూసారంటే అన్నీ నచ్చాకే చెప్తారు కదా!”
ఇంకా ఏవేవో మాట్లాడాం. కాసేపటికి బయటికి వచ్చాం.
***
మాకు ఓకే ….అని అందరికీ చెప్పాశాం….
ఈ శుభవార్త విని మామయ్య, బాబాయ్ ఎగిరి గంతేస్తారేమో.
బాబాయ్ వైపు సిగ్గుపడుతూ చూసాను.
బాబాయ్ కంగారుగా నా దగ్గరకి వచ్చాడు.
“అదేంటిరా అలా చెప్పావు? నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని ఇప్పుడే నందినివాళ్ల నాన్నకి చెప్పుతున్నాను రా! నీకు కావల్సింది కూడా అదే కదా. రవీందర్ కూడా నా పరిస్థితి అర్థం చేసుకున్నారు. ఓకే చెప్పారు. ఇప్పుడేంట్రా ఇలా చెప్పావు? నేనిప్పుడు ఆయనకు ఏమని చెప్పాలి?” కోపంగా అడిగాడు.
అయ్యో ఇలా జరిగిందేంటి? నేను అందరినీ చూసాను.
అందరిలో మొఖాల్లో ఏదో అలజడి స్పష్టంగా కనిపిస్తుంది. తుఫాను ముందు ప్రశాంతతలా… అందరు నిశ్శబ్దంగా ఉన్నారు. నాకు భయం, దుఃఖం రెండూ వచ్చాయి.
ఒక ముప్పై సెకన్లు అలా ఉండి … బాబాయ్ భళ్ళున నవ్వాడు. అందరూ గట్టిగా నవ్వారు.
“ఏరా! నీకే వచ్చనుకున్నావా? ఏడిపించడం. మాకూ వచ్చు.”
బాబాయ్ వచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు. అందరూ నన్ను చుట్టుముట్టారు. మరో అరగంట ఓ పండుగలా అయిపోయింది.
ఇంకో అరగంటలో మా అమ్మానాన్నకు ఫోన్ వెళ్ళిపోయింది. కాసేపు నవ్వుతూ, కోలాహలంగా గడిచిపోయింది.
***
“రా! మా అమ్మకు నిన్ను పరిచయం చేస్తాను.” రవీందర్ మా ఇద్దరినీ పైకి తీసుకువెళ్ళారు. మా వెనక అందరూ వచ్చారు.
అది మూడంతస్తుల మేడ. రెండో అంతస్తు దాటి, మూడో అంతస్తులోకి వెళ్ళాం. అందులో రెండు రూములు ఉన్నాయి. మిగతా సగభాగం ఓపెన్ ప్లేస్. రెండు రూముల్లో ఒకటి పెద్ద హాలు. అందులో టి.వి., సోఫా, ఇతర అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లా ఉంది. ఇంకోటి బెడ్రూమ్ అనుకుంటా.. లోపలికి వెళ్ళలేదు…. కానీ ఊహించుకున్నా…
కాసేపటికి ఒక ముసలావిడ మెల్లగా బయటకి వచ్చింది.
నందిని పరిగెత్తుకుంటు వెళ్ళి, ఆమెకు సహాయంగా చేయి పట్టుకుంది. రవీందర్ చుట్టాల్లో ఒక అమ్మాయి కూడా వెళ్ళి, మెల్లగా నడిపించుకుంటూ తెచ్చి, సోఫాలో కూర్చోపెట్టారు.
వాళ్ళు సహాయం చేయడం ఎందుకో ఆవిడకి నచ్చలేదు. చేయి విదిలించుకొని, చిరాగ్గా సోఫాలో కూలబడింది.
“అమ్మా! ఎలా ఉంది ఇప్పుడు నీకు?” రవీందర్ ఆప్యాయంగా అడిగాడు.
“ఏదో ఉందిలే…” విసుగ్గా సమాధాన మిచ్చింది, అందరి చుట్టూ చూస్తూ.
“ఏంటీ కొత్త మొఖాలు? చుట్టూలొచ్చారా?” కళ్ళద్దాలు సరిచేసుకుంటూ…. మొఖం చిట్లించింది.
“ఏంటమ్మ ! మర్చిపోయావా? నందినిని చూడటానికి పెళ్ళివారు వచ్చారు. ఎవరో కాదు… మన రామ్మోహన్ లేడూ? వాడి అన్న కొడుకు.”
రవీందర్ నా భుజం మీద చేయేసి, దగ్గరగా తీసుకున్నాడు.
“ఆహ! అవునవును. ఎవరు శంకరం కొడుకా?” అంది నీరసంగా.
“ఇదిగో సంబంధం ఖాయం అయింది. ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే…”
“సరే….” అని ఆవిడ తలాడిరచింది.
“చూడు ఎలా ఉన్నాడు మీ మనవడు?” నవ్వుతూ నన్ను చూపించాడు.
ఆవిడ నన్ను ఎగాదిగా చూస్తూ “ఆ… ఆ… ఉన్నాడులే. దొంగకోళ్ళు పట్టేవాడిలా…” అని గొణుక్కుంది … అయినా అందరికి వినిపించింది.
“అయినా నాదేముంది? నందినికి నచ్చాలి గాని…” మొఖం తిప్పుకుంది. “ముందు నీ కూతురు మనసు తెలుసుకో…” అంది.
ఆ మాటతో రవీందర్ మొఖం ఎర్రగా మారిపోయింది. తన కోపాన్ని అణచుకుంటూ… మెల్లగా తలాడించాడు.
“నందినిని కనుక్కున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నా… అమ్మా….”
నాకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు.
‘ఏంటీ… ఈవిడ ఇలా మాట్లాడింది? అబ్బాయి బాగున్నాడని ఒక్కమాట చెబితే …. ఏం కొంపలు మునిగిపోతాయా?’ నాన్న మీద కోపం కావొచ్చు.
అందరు మౌనంగా కిందకి వచ్చాం.
“ఏమీ అనుకోకు బాబు. అత్తయ్యగారికి కొంచెం కోపం ఎక్కువ. ఏదైనా చెబుదాం అంటే పెద్ద వయసు. కానీ నువ్వేమి పట్టించుకోకు.” నందినివాళ్ళ పిన్ని నన్ను బుజ్జగించింది.
“అయ్యో! ఫర్వాలేదు. నేనేమీ అనుకోలేదు.” అని చిన్నగా నవ్వి, ఊరుకున్నా.
ఆ రోజంతా సందడి సందడిగా గడిచిపోయింది.
మరుసటిరోజు పంతులుగారిని పిలిపించారు. మూడు రోజుల్లో ఎంగేజ్‌మెంట్, ఆ తరువాత నెలలో పెళ్ళి అని ఖాయం చేసారు.
మొత్తానికి ఇన్ని కష్టాల తరువాత నా పెళ్ళి కుదిరింది… అదీ నందిని లాంటి అమ్మాయితో…. అయినా ఇలాంటి అమ్మాయి రాసి పెట్టి ఉంటే…. ఈ మాత్రం కష్టపడటం తప్పులేదులే… అందుకే కష్టే ఫలి అన్నారు పెద్దలు.
అవును …. ఏదీ? నందిని కనిపించటం లేదు. కూర్చున్న చోటు నించి నా మెడని మూడు వంద అరవై డిగ్రీలు తిప్పి చుట్టూ చూసాను. లాభం లేదు. వెళ్ళిపోయింది.
మూడు రోజుల్లో ఎంగేజ్‌మెంట్…. మళ్ళీ హైదరాబాదుకు వెళ్ళడం ఎందుకు? అని అందరం ఇక్కడే ఉండిపోయారు.
ఏంటో నందినితో మాట్లాడటం అస్సలు కుదరటంలేదు.
***
అయ్యో! ఈ హడావిడిలో అమ్మతో సరిగ్గా మాట్లాడనేలేదు.
“హలో అమ్మా!”
“ఏంట్రా! ఇంత రాత్రి ఫోన్ చేశావు?”
“అయ్యో అక్కడ ఇప్పుడు రాత్రి కదా! ఏంటో మర్చిపోయానమ్మా. ఇక్కడ ఇప్పుడే తెల్లారింది.”
“హు…! అంతే బాబు … పెళ్ళి సెటిల్ అయితే పగలు, రాత్రి తెలియలేదు… ఇక పెళ్ళైతే ఏం చేస్తావో?”
“అమ్మా …. ప్లీజ్!” సిగ్గో … మరేమిటో… శరీరం నా కంట్రోల్లో లేకుండా మెలికలు తిరిగిపోతుంది.
“ఒరేయ్ నువ్వు చేసిన మేలు మరచిపోలేను. నా పాతికేళ్ళ భారాన్ని దించేశావు.”
“సరే గానీ… ఏంటమ్మా? నువ్వు, నాన్న నా ఎంగేజ్‌మెంట్‌కి లేకపోవడమేమిటి?”
“టికెట్స్ దొరకలేదు రా, నాన్నకి కూడా కుదరదు కదా! అయినా ఇలా ఉన్న ఫలంగా కుదురుతుందని మాకెలా తెలుస్తుంది?”
“టికెట్స్ దొరకలేదా? నిజం చెప్పు.”
“అంటే దొరకక కాదు…!”
“మరీ మూడురోజుల్లో రావాలంటే ఎలా రా? నాన్న డాక్టర్ కదా! పాపం ఎమర్జెన్సీలు ఉంటాయి. అయినా ఎంగేజ్‌మెంట్ ఏముంది? మీ బాబాయ్ ఉన్నాడు కదా! పెళ్ళికి ఉంటాం కదా!” అమ్మ నచ్చచెప్పింది.
ఫోను పెట్టేసి …. వెనక్కి తిరిగాను.
గుండె ఝల్లుమంది.
నాకు ఎదురుగా ఓ కొత్త వ్యక్తి కాఫీ కప్పు పట్టుకుని ఉన్నాడు.
టైట్ ఎర్ర టీషర్ట్, టైట్ జీన్స్ తొడుక్కున్నాడు. గట్టిగా ఊపిరి తీస్తే, ఫట్మని ఎరిగిపోతాడు. చింపిరి జుట్టుతో విచిత్రంగా ఉన్నాడు.
“మీరు…?”
“నేను ఇక్కడ పనివాడు కమ్ డ్రైవర్‌ని.” ఏదో కలెక్టర్ కమ్ సి.ఎమ్. అన్న లెవల్లో చెప్పాడు.
“ఓ! మరి నిన్న మొన్న కనిపించలేదు?”
“ఊరెళ్ళాను. ఇదిగో ఇప్పుడే వచ్చాను.” అని కాఫీ కప్పు నా చేతికిచ్చాడు.
“పేరు ఏంటి?”
“రాహుల్…!”
వాడి అవతారానికి రాహుల్ ఏంటి? పనోడికి, పేరుకి కొంచెం అతకనట్టు అనిపించింది. అందుకే మళ్ళీ అడిగా.
“ర్రాహుల్ల్ …” ఒత్తి పలుకుతూ చెప్పాడు.
“రాహులా? వావ్….” అన్నా అశ్చర్యంగా….
“వావ్ … ఏంటి సార్? ఏదో రాహుల్, రాజీవ్ లాంటి పేర్లు హీరోలకే ఉంటాయా? ఏం మాలాంటి పనోళ్ళకి ఉండకూడదా?” నా చేతిలో కాఫీ కప్పు తీసుకున్నాడు…. కాదు లాక్కున్నాడు. నన్ను పైకి కిందకి చూస్తూ…. అక్కడనుండి వెళ్ళిపోయాడు.
హార్ని! నేనేమన్నాను… వీడిని? ఇంత బిల్డప్ ఇచ్చాడు.
***
ఏవేవో మాట్లాడుకుంటూ, నవ్వుతూ అందరు షాపింగ్ చేస్తున్నారు.
ఓరి నాయనో! చీరల షాపింగ్ ఎంతకీ తెగదు.
ఇవ్వన్నీ కాక … చీరలమ్మేవాడి అభిప్రాయాలు. అబ్బో ఒక పట్టాన తేలేటట్లు లేదు.
‘అవును నందిని ఏది? ఏంటో ఆ అమ్మాయి త అటునుంచి ఇటు తిప్పేలోగా మాయమౌతుంది.’ చుట్టూ వెతికాను. దూరంగా ఎవరితోనో మాట్లాడుతుంది.
“హాయ్” వెనుకనుంచి వెళ్ళి పలకరించాను.
నందిని నా మాట విని… ఉలిక్కిపడింది. నావైపు చూసి ఇబ్బందిగా నవ్వింది.
“సారీ! డిస్టర్బ్ చేసానా?” అక్కడ నుంచి వెళ్ళబోయాను.
“లేదు! ఉండండి” నందిని నన్ను టక్కున ఆపేసింది.
“ఇతను మా క్లాస్‌మేట్ సతీష్.” నాతో చెప్పింది.
“తను రాజీవ్…. ఇతనితోనే వచ్చే నెల నా పెళ్ళి.” అ అబ్బాయికి పరిచయం చేసింది.
హలో అంటే హలో అనుకున్నాం. ఎందుకో తెలియదు. పలుకరించి అనవసరంగా ఇబ్బంది పెట్టాననిపించింది. నేను రావడం నందినికి నచ్చలేదు. స్పష్టంగా అర్థమయింది. ఆ ఆలోచనలతోనే ఇల్లు చేరాం.
“అత్తయ్యా…! రండి చీరలు చూద్దురు గాని…” నందిని పిన్ని, బామ్మని మెల్లిగా కిందకు తీసుకువచ్చింది.
“కొంచెం టీ పట్రామ్మా…” అంటూ వచ్చి ఆవిడ కుర్చీలో కూర్చుంది.
అప్పుడే రాహుల్ వేడివేడి పకోడీలు తెచ్చి ఇచ్చాడు.
తినేముందు “బామ్మా… మీరూ తింటారా?” చాలా వినయంగా అడిగాను. ఏదో ఇంప్రెషన్ కొట్టేద్దామని కక్కుర్తితో…
“నేను అలాంటి చెత్త తినను… నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటాను…” మొఖం ఎత్తకుండానే… నా మొఖం మీద కొట్టినట్టు అంది.
ఆమెని పట్టించుకోకుండా…. “నందినీ! నీకు నచ్చిన రంగు ఎరుపు కదా… అది తప్ప అన్ని రంగులు తీసావు.”
నందిని ఏం మాట్లాడలేదు.
అసలు ఏంటీ పిల్ల మాట్లాడదు?
“నాకు ఇప్పుడు ఎరుపు నచ్చటం లేదు….” పొడిపొడిగా అంది.
అందరూ మాటల్లో పడిపోయారు. ఆవిడ ఓపిగ్గా చీరలన్నీ చూస్తోంది…. ఒక్కొక్కటి విప్పించి మరీను.
ఏంటో! నేనంటే ఈవిడకి అంత కోపం?
అయినా నోరు మూసుకొని పెట్టింది… తినకుండా. ఎందుకంట? నాకు ఈ దురద?లెంపలేసుకున్నా…!
చెప్తా…. నాకూ టైం వస్తుంది. అప్పుడు చెబుతా.
***
“లోపలికి రావచ్చా నందిని?”. గది తలుపులు తెరిచే ఉన్నాయి. కొంచెం చొరవ తీసుకొని లోపలికి వెళ్ళాను.
“అరే! రండి… రండి….” బెడ్ మీద పడుకున్నదల్లా కంగారుగా లేచింది. తన డ్రస్ సర్దుకుంది.
“అండి, రండి… ఎందుకులే? రాజీవ్ అని పిలువు చాలు.”
“ఏం చేస్తున్నావు?” తన రూమ్‌ని చుట్టూ చూస్తూ అడిగాను.
“ఏం లేదు…. జస్ట్ పడుకున్నా అంతే!”
“డిస్టర్బ్ చేయలేదు కదా!”
“అయ్యో! లేదు…! కూర్చోండి.”
“సో… ఏంటి విశేషాలు?”
తను తల అడ్డంగా ఊపుతూ నవ్వింది.
“మీకు తెలుగు బాగానే వచ్చే!”
“నేను లండన్‌కి వెళ్ళేటప్పుటికి నాకు ఎనిమిదేళ్ళు. కాబట్టి అప్పటికే తెలుగు వచ్చు. ఇక మర్చిపోకుండా ఉండడానికి…. నాన్న ఇంట్లో ఎప్పుడు తెలుగు మాట్లాడేవారు. అంతేకాదు.. వారంలో ఒక్కసారైనా తెలుగు సినిమా చూడాల్సిందే!”
“మరి చదవడం వచ్చా?”
“రాదు…! కొన్ని అక్షరాలు గుర్తుపట్టగలను. అంతే…..”
“అయితే తెలుగు సినిమాలు చూస్తారా?”
“అబ్బో చెప్పొద్దులే… ప్రతి సినిమా చూడాల్సిందే…. ఒక పదేళ్ళ కిందట అయితే కాసెట్లు, సిడిలు ఉండేవి. ఇప్పుడు మొత్తం ఆన్‌లైన్ లోనే కదా… థియేటర్లు కూడా చాలానే వచ్చాయి.”
నందిని కళ్ళు పెద్దవి చేసి వింటోంది. నాకు ఇంకా ఉత్సాహం వచ్చింది.
“నాకు తెలుగు సినిమాంటే పిచ్చి. నీకో విషయాం తెలుసా?”
“ఏంటి?”
“అన్నీ తెలుగు సినిమాల్లోలాగా క్లైమాక్స్‌లో పెళ్ళి మండపం నుంచి ఒక పిల్లని లేపుకుపోవాలని నా జీవిత ఆశయం….” కాలర్ ఎగరేస్తూ అన్నా….
“అవునా? హా హా హా….!” నందిని పడీపడీ నవ్వుతోంది.
(సశేషం)