[dropcap]ఎం[/dropcap]దుకు కాశ్మీర్ ఫైల్స్ చిత్రం సునామీలా అందరినీ తాకింది. ఎలాంటి పబ్లిసిటీ లేకున్నా జనం పోటెత్తారు.తనికెళ్ల భరణి పేర్కొన్నట్టు సినిమా ఒక సామూహిక ఉన్మాదం.ఆ ఉద్వేగాన్ని tickle చేసింది కాశ్మీర్ ఫైల్స్.దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఎలాంటి శషభిషలు లేకుండా కాశ్మీర్ అంటే ముస్లింలు మాత్రమే అని ఎవరన్నారంటాడు.
పదమూడవ శతాబ్దం వరకూ కాశ్మీరం ఆధ్యాత్మిక, బుద్ధిజీవుల కేంద్రం. It’s rather a cradle of civilization. కశ్యప ముని తపస్సు చేశాడు కాబట్టి ఇది కాశ్మీరమయింది. శంకరాచార్యుల వారొచ్చారు. వైద్యం,విజ్ఞానం వర్థిల్లాయి ఇక్కడ. కాళిదాసు, కల్హణుడు రచనలు చేశారిక్కడ. ఇది భూతలస్వర్గం కాబట్టి దురాక్రమణదారుల దృష్టి కాశ్మీరంపై బడింది. ఈ సంస్కృతిని ధ్వంసం చేసేందుకు పూనుకున్నారు. మెడపై కత్తిపట్టి మతమార్పిడి కాకుండా సూఫీలను,దెర్విష్ (dervish) లను ప్రయోగించారు. అవసరమైనచోట కత్తి ఝుళిపించారు.
ఫలితంగా కాశ్మీరీ పండిట్స్ మైనారిటీ వర్గంగా మారారు. అందుకే హిందూ అయినా, ముస్లిం అయినా ఇంటి పేర్లు(surnames) ఒకటేగా కనిపిస్తాయి.
ఇది దర్శకుడి premise ఈ చిత్రం గురించి.
అందుకే తడబాటు లేకుండా చెప్పదలుచుకున్నది చెప్పాడు.
సాధారణంగా చిత్రం మొదట్లో disclaimer వేస్తారు. పాత్రలన్నీ కల్పితాలని. అలా కాకుండా దర్శకుడు ఈ చిత్రం అనేక వీడియో ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందించాం అని disclaimer లో ప్రకటించాడు.
ఇలాంటి కథను చెప్పటంలో పాత్రలు బలమైనవిగా ఉండి ప్రేక్షకుడితో కనెక్ట్ కావాలి. ప్రేక్షకుడు మమేకం కావాలి. అలాంటి పాత్ర చిత్రంలో పుష్కర్ నాథ్ పండిట్‌ది. ఆ పాత్ర పోషించిన అనుపమ్ ఖేర్ ఆ పాత్రతో ప్రేక్షకుడి చేత కంట తడి పెట్టిస్తాడు. 1990 జనవరి 19 కాశ్మీరీ పండిట్స్‌కి దుర్దినమని దర్శకుడంటాడు. ఆ రోజునుంచి పండిట్లపై దాడి మొదలైంది అని పేర్కొంటాడు.
అంతకుముందు 1989 వ సంవత్సరం చివరిలో అప్పటి కేంద్ర హోంశాఖామంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుమార్తె రుబీనాను తీవ్రవాదులు కిడ్నాప్ చేసి తమ సహచరులను విడిపించుకోవటంతో కాశ్మీర్లో ప్రభుత్వం బలహీనమయిపోతుంది.
కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వం మౌనం మిలిటెంట్లకు ఊపిరి పోస్తుంది. ఇది మైనారిటీ కాశ్మీరీ పండిట్స్‌ని వెళ్ళగొట్టడానికి, వారిపై దాడులు జరగడానికి దారితీస్తుంది. దీన్ని exodus అని కొందరంటే genocide అని గొంతెత్తి చెబుతాడు దర్శకుడు.
పుష్కర్ నాథ్ ఒక లెక్చరర్. అతని దగ్గర చదువుకున్న విద్యార్థి బిట్టా వేర్పాటువాద నాయకుడై పండిట్ల కుటుంబాలను తరిమేయటం, చంపేయటం చేస్తుంటాడు. అందుకు పుష్కర నాథ్ కుటుంబాన్నీ వదిలిపెట్టడు. ఇండియన్ స్పై అన్న నెపంతో పుష్కర్ నాథ్ కొడుకును చంపేస్తారు మిలిటెంట్లు. కొడుకును పోగొట్టుకొన్న పుష్కర్ నాథ్ కోడలు మనవళ్ళతో జమ్మూలో పండిట్ల కోసం ఏర్పాటుచేసిన కేంపులో దుర్భర పరిస్థితులలో తలదాచుకుంటాడు. పుష్కర్ నాథ్ తన కుటుంబాన్ని ఆదుకోమని తన మిత్రులైన డివిజన్ కమీషనర్ బ్రహ్మదత్‌ని మరో డాక్టర్ ఫ్రెండ్‌ని, జర్నలిస్టు ఫ్రెండ్‌ని, సీనియర్ పోలీసు అధికారిని వేడుకుంటాడు. ఎవరూ సహాయం చేసే పరిస్థితిలో ఉండరు. పరిస్థితులు విలన్‌గా మారిన కాలమది.
కాశ్మీర్ వ్యాలీలో పండిట్ల వలస మొదలైనప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేష్టలుడిగున్నాయని దర్శకుడు పుష్కర్ నాథ్ స్నేహితుల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాడు.
కాలం మాన్పే గాయాలులానే కాశ్మీరీ పండిట్ల కడగండ్లను, కష్టాలను మెయిన్ స్ట్రీం మీడియా పెడచెవిని పెట్టిందనేది దర్శకుడి ఆరోపణ. మీడియా నెరేటివ్స్ గురించి ఒక సందర్భంలో ఈ అంశాన్ని చర్చ ద్వారా చెప్పిస్తాడు.
మళ్ళీ కథలోకి వస్తే పుష్కర్ నాథ్ నిరంతరం ఒక డెలీరియం స్టేట్‌లో ఉండి పాత జ్ఞాపకాలను పలవరిస్తుంటాడు. మనవడు కృష్ణ పండిట్‌తో కాశ్మీర్ అంటే పంచతంత్రం పుట్టిన చోటని కాశ్మీర్ భారతీయ సంస్కృతి పుట్టిల్లని తన ధోరణిలో చెబుతుంటాడు. ANU (JNU)లో చదువుకునే కృష్ణ పండిట్ వామపక్ష భావజాల ప్రొఫెసర్ రాధిక మీనన్ వాక్పటిమతో ప్రభావితమై కాశ్మీర్‌కు ఆజాదీ అవసరమే అనే ఆలోచనలో పడతాడు. ఒక confusing soul అయిపోతాడు.
ఈలోగా తీవ్రనిరాశతో కనుమూస్తాడు పుష్కర్ నాథ్.
కనుమూసే ముందర తన నలుగురి స్నేహితుల పేర్లు, నంబర్లు ఇచ్చి వాళ్ళని కలవమని, తన చితిభస్మాన్ని కాశ్మీర్ లోని తన ఇంటిలో వెదజల్లమని కోరతాడు.
ప్రొఫెసర్ రాధిక ANU స్టూడెంట్స్ ఎలక్షన్స్‌లో కాశ్మీర్‌పై జరుగుతున్న నిర్బంధానికి ప్రతినిధిగా అధ్యక్ష పదవికి పోటీచేయాలని ఒత్తిడి తెస్తుంది. తాత అస్తికలు కలిపేందుకు కాశ్మీర్ వెళుతున్నావు కాబట్టి అక్కడి వారి ఇబ్బందులు రికార్డు చేయమని ఆదేశిస్తుంది. అందుకు అవసరమైన సహాయం పొందేందుకు ఒక కాంటాక్ట్ నంబరిస్తుంది.
కృష్ణ కాశ్మీర్ వెళ్ళాక తన తాత స్నేహితులను కలిసినప్పుడు ఏం జరిగింది రాధిక మేడం ఇచ్చిన కాంటాక్ట్ పర్సన్ ఏం చెప్పాడు అనే దానిమధ్య ఊగిసలాడిన కృష్ణ 1990లో ఏం జరిగిందో అర్థం చేసుకుంటాడు.. తల్లీ, అన్న ఎలా మరణించారో అర్థమవుతుంది కృష్ణకు..
ఈ సినిమా ఒక ఎమోషనల్ జర్నీ.
దర్శకుడు తను చెప్పదలుచుకన్న పాయింట్‌ని చెప్పటంలో తడబడలేదు.మొహమాటపడలేదు. ఆడియన్స్ అంతగా కనెక్ట్ కావటానికి కారణం అదే.నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయంచేశారు. ఈ సినిమాను ఆకాశానికెత్తేసిన వారిగానూ గట్టిగా విమర్శించేవారిగాను ఆడియన్స్ విడిపోయారు.
కాశ్మీర్ ఫైల్స్ ఒక మాటలో చెప్పాలంటే history revisited.
జాతీయవాదులు కాశ్మీర్ ఫైల్స్‌ని ప్రాపగాండా చిత్రం చేస్తే వామపక్షవాదులు అబద్ధాలు, అసత్యాలు కలిపి వడ్డించిన చిత్రమంటున్నారు.
Truth perhaps lies in between.
ఏ పార్టీ కాశ్మీరీ పండిట్లకు ఏమీచేయలేదన్నది కాదనలేని సత్యం. కొన్ని పార్టీలు భయం ముసుగు తగిలించుకుని తప్పుకున్నాయి. కొన్ని పార్టీలు మతాల మధ్య చిచ్చుకు మరో అస్త్రం దొరికిందనుకుంటున్నాయి.
అవన్నీ పక్కన పెట్టేస్తే కాశ్మీర్ ఫైల్స్ కాశ్మీరీ పండిట్‌ల బాధ, దుఃఖం, వేదనలు, సంఘర్షణలకు గొంతుక నిచ్చిందనటంలో అతిశయోక్తి లేదు.
1990లో కాశ్మీర్‌లో ఏం జరిగిందో అన్న సత్యశోధనలో మీరెలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారనేది ఫాక్ట్స్ కన్నా మీ భావజాలంపై ఆధారపడుండటం మాత్రం విషాదం.
సినిమా ఎందుకు బలమైన మాధ్యమమో మరోసారి నిరూపించిన చిత్రం కాశ్మీర్ ఫైల్స్.ఇంత ఇంటెన్స్ మూవీ ఈమధ్య చూడలేదు. రాలేదు కూడా.
చివరిగా ఒకమాట –
ఈ చిత్రంలో ‘రాలివ్/గాలివ్/యా చాలివ్’ (మతం మార్చుకో/వెళిపో/లేదా చావు) అనే మాట పదేపదే వినిపిస్తుంది.
నిజంగా ఈమాట ఆ కాలంలో వినిపించి ఉంటే అప్పటి గడ్డుకాలానికి గుర్తు. సినిమా కోసమే సృష్టిస్తే ప్రాపగాండా.. కాశ్మీర్ సబ్జక్ట్‌గా ఈమధ్య వచ్చిన ‘షికారా’, అంతకుముందొచ్చిన ‘హైదర్’ కానీ అంతగా ఆకట్టకోలేదు. ఆర్టికల్ 370 రద్దుతో దేశమంతా ఆనందోత్సాహాలు వ్యక్తమైనట్టే కాశ్మీరీ ఫైల్స్ ఒక హిస్టీరియా సృష్టించింది.
నాలుగు సంవత్సరాలకు పరిశోధనకు పడితే చిత్రీకరణ ముప్ఫైరోజుల్లో అయిపోయిందని చిత్రంలో రాధికా మీనన్ పాత్ర పోషించిన పల్లవి జోషి (దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి భార్య) పేర్కొంటారు. గతం నుంచి వర్తమానానికి వర్తమానం నుంచి ప్రయాణం చేసినట్టు సాగే ఈ సినిమా ఊరటనిచ్చిందా అలజడి రేపిందా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పటం కష్టం.చాలా సైద్ధాంతిక చర్చలు చేస్తాడు దర్శకుడు. కౌంటర్ ఆర్గ్యుమెంట్‌కు చోటిస్తాడు కానీ తన స్టాండ్ నుంచి అంగుళం కూడా కదలడు.
కాశ్మీరీ పండిట్ల వధ.. అది మిగిల్చిన వ్యథను హింసాత్మకంగా చూపటంతో justify చేశాడేమో దర్శకుడు అనిపిస్తుంది.
పండిట్ల మౌనరోదనను గుచ్చిగుచ్చి చూపిన చిత్రం ‘కాశ్మీర్ ఫైల్స్’.
Photo credit: Internet