[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]
జాతీయోద్యమంలో నెల్లూరు – కొన్ని కెలడిస్కోప్ దృశ్యాలు
[dropcap]మ[/dropcap]హాత్మా గాంధీజీ నెల్లూరుకు మొత్తం అయిదు పర్యాయాలు వచ్చారు. మొదటి పర్యాయం గాంధీజీ దంపతులు 1915 మే 4,5 తారీకుల్లో నెల్లూరు రేబాల లక్ష్మీనరసారెడ్డి పురమందిరంలో జరిగిన 21వ మద్రాసు ప్రెసిడెన్సి సభకు హాజరు కావడానికి నెల్లూరు వచ్చారు. అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టరు ఆర్.రామచంద్రరావు గాంధీజీ దంపతులకు ఆతిథ్యమిచ్చారు. 4వ తారీకు మధ్యాహ్నం 2.30కి మహా సభ ప్రారంభమైంది. 5వ తారీకు గాంధీజీ ముక్తసరిగా మాట్లాడి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. గాంధీజీ దంపతుల గౌరవార్థం మహా సభ గౌరవాధ్యక్షులు పురమందిరం ప్రాగణంలోనే అతిథులకు విందు ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలోనే నెల్లూరు పట్టణ విద్యార్థులు గాంధీజీ దంపతులకు సన్మానపత్రం సమర్పించారు.
పురమందిరం ఆవరణలో 4,5 తేదీలలో ఉదయం 7.30కి జరిగిన మద్రాసు ప్రెసిడెన్సి సంఘసంస్కరణ సభలకు, 5వ తేదీ ఉదయం నెల్లూరు పర్మనెంటు ఫండాఫీసులో జరిగిన ‘సనాతన ధర్మరక్షణి’ సభకు గాంధీజీ దంపతులు ప్రేక్షకులుగా వెళ్లారు.
5వ తారీకు పొలిటికల్ కాన్ఫరెన్సు సందర్భంగా నెల్లూరు పురమందిర నిర్మాత రేబాల లక్ష్మీనరసారెడ్డి, ఇండియన్ రెవ్యూ పత్రికా సంపాదకులు జి.ఎన్.నటేశన్, వి.ఆర్. హైస్కూలు ప్రధానోపాధ్యాయులు కె.వి.వీరరాఘవాచార్యులు – గాంధీజీతో తీయించుకున్న ఫోటో ఇప్పుడు కూడా పురమందిరం ప్రవేశద్వారం వద్ద గోడకు అలంకరించబడి వుంది.
మహాత్ముడు పల్లిపాడు పినాకిని సత్యాగ్రహాశ్రమాన్ని ప్రారంభించడానికి 7-4-1921న నెల్లూరు వచ్చారు. నెల్లూరు స్టేషన్లో మహాత్ముడికి ఘనస్వాగతం లభిచింది. పొణకా కనకమ్మ పెనిమిటి సుబ్బరామరెడ్డి రెండెద్దులబండిలో మహాత్ముణ్ణి పల్లిపాడు తీసుకొని వెళ్లాడు. పెన్న యిసుకలో కాస్త ఎద్దుల్ని అదిలించవలసి వచ్చింది. వెంటనే మహాత్ముడు బండిలోంచి కిందకి దిగి నడిచారు. మహాత్ముని పల్లిపాడు యాత్ర పొణకా కనకమ్మ – కనక పుష్యరాగంతోనూ, వెన్నెలకంటి రాఘవయ్య స్మృతిశకలాల్లోనూ, స్వర్ణ వేమయ్య బాల్య స్మృతుల్లోను వివరంగా వర్ణించారు. ఆశ్రమాన్ని ప్రారంభించిన తర్వాత, నెల్లూరు తిరిగి వచ్చి, గాంధీజీ తిలక్ విద్యాలయాన్ని ప్రారంభించారు, పురమందిరంలో 5 వేలమంది హజరయిన స్త్రీల సభలో ఉపన్యాసించారు. సభలో తిలక్ స్వరాజ్యనిధికి నగదు, నగలు విరాళాలు వచ్చాయి. అదే రోజు వి.ఆర్. కాలేజి మైదానంలో గాంధీజీ ఉపన్యసించిన సభకు పదివేల మంది హాజరయ్యారు. హిందూ, మహామ్మదీయుల మధ్య నెల్లూరులో తల ఎత్తిన విరోధాలను ఐకమత్యం ప్రదర్శిస్తూ, సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఆ తర్వాత నెల్లూరు పురమందిరం ఉత్తర భాగంలో నెలకొల్పిన వర్ధమాన సమాజ గ్రంథాలయంలో తిలక్ మహాశయుని తైలవర్ణ చిత్రాన్ని ఆవిష్కరించారు. ఆ రాత్రి మహాత్మాజీ రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించి తిక్కవరపు రామిరెడ్డి సుదర్శన్ మహాల్‌లో విశ్రాంతి తీసుకున్నాట్లు, మూడేళ్ల రామిరెడ్డి కుమారుడు పట్టాభిరామిరెడ్డి చేతిలో ఒక అరటి పండు పెట్టినట్లు గ్రంథస్థం అయింది.
కస్తూర్బా, మహత్ముడు ఖద్దరు నిధి సేకరణ కోసం నెల్లూరు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ 1929 మే పదకొండవ తారీకు సాయంత్రం చాలా ఆలస్యంగా పల్లిపాడు ఆశ్రమానికి వచ్చి విశ్రమించారు. పల్లిపాడులో మహాత్మాజీకి ఖద్దరు నిధికి రూ.714-9-0 ప్రజలు సమర్పించారు. 12వ తారీకు గాంధీజీ అవిశ్రాంతంగా కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆ సాయంత్రం 4 గంటలకు నెల్లూరు కస్తూరిదేవి నగర్‌లో పూరిపాకల్లో కనకమ్మ నిర్వహిస్తున్న కస్తూరిదేవి విద్యాలయం బాలికా పాఠశాలకు పునాదిరాయి వేశారు. తర్వాత వి.ఆర్. కళాశాల మైదానంలో జహిరంగ సభలో ఉపన్యసించారు. ఈ సభలోనే నెల్లూరు పురపాలక సంఘం, నెల్లూరు జిల్లా బోర్డు, నెల్లూరు తాలూకా బోర్డు సన్మాన పత్రాలు సమర్పించాయి. నెల్లూరు పాకీ వాళ్ల సంఘం వారు కూడా సన్మానపత్రం సభలో చదివి గాంధీజీకి సమర్పించారు. ఆ తర్వాత గాంధీజీ దంపతులు స్థానిక అనాథ శరణాలయానికి వెళ్లి రామదాసు నాటక ప్రదర్శన చూశారు. ఆ దినం గాంధీజీ గోరక్షణ సంఘానికి వెళ్లి అక్కడి గోవులను చూచి వచ్చారు. ఆ సంస్థ నిర్వాహకుడు నాగరాజు పిచ్చిరాజు 5 రూపాయల, రెండుణాల కానీతో ఒక సన్మాన పత్రం సమర్పించాడు. రేబాల పట్టాభిరామరెడ్డి అతిథిగా గాంధీజీ వారి బంగళాలో నాలుగైదు రాజులున్నారు. ఈ మొత్తం పర్యటనలో రెండు ఫోటోలు మాత్రమే, అదీ రెడ్డి రాణి పత్రికలో ప్రచురించిన ఫోటోలే, ఇప్పుడు లభిస్తున్నాయి. మొదటిది కస్తూరిదేవి విద్యాలయ భవానానికి పునాది వేస్తున్న దృశ్యం, రెండోది రేబాలవారి బంగళా తోటలో గాంధీజీ ముందు కస్తూరిదేవి విద్యాలయం బాలికలు యోగాసనాలు ప్రదర్శిస్తున్న దృశ్యం.
గాంధీజీ నెల్లూరు బజారు వీధి గుండా పోతుంటే కాంగ్రెసు కార్యకర్త ఒకరు 116 రూపాయలు సమర్పించారు. ఆయనే మరొక మొత్తం 287 రూపాయలు ఖద్దరు నిధికి, 20 రూపాయలు తిలక్ నిధికి ఇచ్చారు. గాంధీజీ రాక కోసం నెల్లూరు బజారు వీధి చక్కగా అలంకరించబడింది. హిందీ అధ్యాపకులు ఖద్దరు నిధికి 50 రూపాయలు ఇచ్చారు. నెల్లూరు మునిసిపాలిటి వి.ఆర్.కళాశాలలో ఏర్పాటు చేసిన నూలు వడికే ప్రదర్శనలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో ముగ్గరు ‘పంచమ బాలికలు’ కూడా వున్నారు. సాయంత్రం వి.ఆర్. కళాశాల మైదానంలో గాంధీజీ హిందీలో ఉపన్యసించారు. ఈ సభలో అనేక సంఘాల నిర్వాహకులు గాంధీజీకి సన్మానపత్రాలు సమర్పించారు, ఖద్దరు నిధికి వ్యక్తులు కూడా విరాళాలిచ్చారు. ముకుంద రామారావు వేసిన చిత్రపటాన్ని గాంధీజీకి బహుకరించారు. ఆ పటాన్ని గాంధీజీ సభలో వేలానికి పెడుతూ “నన్ను నేను అమ్ముకొంటున్నాను” అని హస్యంగా అన్నారు. ఆ పటాన్ని రేబాల పట్టాభిరామిరెడ్డి గారు 80 రూపాయలకు కొన్నారు. పరిమితంగా తాగడాన్ని సమర్థించే ‘మిత పాన సమితి’ సన్మాన పత్రాన్ని స్వీకరిస్తూ గాంధీజీ ఈ సమితి ఖద్దరు నిధికి విరాళం ఇవ్వడంలో గూడా తగినంత నిగ్రహం ప్రదర్శించిందని అన్నారు ఛలోక్తిగా.
13వ తారీకుగా మహాత్మాలు మౌన వ్రతంలో వుండి రాత్రి 7 గంటలకు మౌనవ్రతం విరమించారు. రేబాల పట్టాభిరామిరెడ్డి భవనంలో వుండి, పినాకిని సత్యాగ్రహ ఆశ్రమ భవిష్యత్తు గురించి, ఖద్దరు అభివృద్ధి గురించి, నెల్లూరు జిల్లా కార్యకర్తలతో సమావేశమై చర్చించారు. నెల్లూరు జిల్లాలో ఖద్దరు నిధికి సుమారు 28 వేల రూపాయలు, లాలాజి నిధికి 700 రూపాయలు వసూలైనట్లు బెజవాడ సుందరరామిరెడ్డి ప్రకటించారు.
1933 డిసెంబరు 30న ఉదయం గాంధీజీ కలకత్తా మెయిల్‌లో బిట్రగుంట స్టేషన్‌లో దిగారు. అక్కడ్నించి కావలి, అల్లూరు, బుచ్చి ఊళ్లన్నీ పర్యటించి నెల్లూరు చేరే వేళకు మధ్యాహ్నం 3.30 దాటింది. ఆయన దర్శనం కోసం నెల్లూరు వీధుల్లో ప్రజలు బారులు తీరి వున్నారు. ముత్యాలపాలెం హరిజనవాడలో పఠనమందిరం ప్రారంభించి, చిన్నబజారులో దిగుమర్తి హనుమంత రావు స్మారకార్థం నెలకొల్పిన ‘హనుమంతరావు హిందీ విద్యాలయం’ ప్రారంభించారు. హిందీ మండలి ఆయనకు ఒక రజత పేటిక బహుకరించింది.
తర్వాత నెల్లూరు పురమండలిలో సమావేశమైన మహిళల నుద్దేశించి మాట్లాడుతూ హరిజన నిధికి విరాళాలర్థించారు. కస్తూరిదేవి విద్యాలయం బాలికలు మహత్ములకు ఈ సభలోనే సన్మానపత్రం సమర్పించారు. ఆ తర్వాత వి.ఆర్.కళాశాల క్రీడా మైదానంలో గొప్ప బహిరంగ సభ జరిగింది, 15 వేల మంది సభకు హజరైనట్లు అంచనా. నెల్లూరు మునిసిపాలిటి చైర్మన్ యాహ్యారి సాహెబ్ రజత కరండంలో పెట్టి సన్మానపత్రం ఇచ్చారు. జిల్లా బోర్డు వైస్ ప్రెసిడెంటు, బార్ అసోసియోషన్ తరుపున ఏనుగ రాఘవ రెడ్డి సన్మాన పత్రాలు సమర్పించి గౌరవించారు. బార్ అసోసియేషన్ తరుపున హరిజన నిధికి రాఘవ రెడ్డి 371 రూపాయలు బహుకరించారు.
ఈ సభ నుంచి కబడిపాళంలో హరిజన హాస్టల్ చూచి, అక్కడ్నుంచి, రామకృష్ణ మందిరం సందర్శించి వెంకటగిరికి ప్రయాణమయ్యారు.
1946 జనవరి 21వ తారీకు మధ్యాహ్నం 12.45 గంటలకు దర్గామిట్ట వేమాల సెట్టి బావి సమీపంలో బాపూజి ప్రత్యేక రైలు ఆగింది. రైల్వే లైను పక్కనే ఏర్పాటయిన ఎత్తైన వేదిక మీద గాంధీజీ, ఇతర నాయకులు నిలబడి ఉండగా నెల్లూరు చుట్టు పక్కల పల్లెల నుంచి, నెల్లురు ప్రజలు వేల కొలది వచ్చి మహాత్ముడ్ని దర్శించుకొన్నారు. నెల్లూరు టౌను జన సముద్రంగా మారిపోయింది. కస్తూరి దేవి విద్యాలయం విద్యార్థినులు గాంధీజీకి సన్మాన పత్రం సమర్పించారు. నెల్లూరు పురప్రముఖులు చాలా మంది హరిజననిధికి విరాళాలు సమర్పించుకున్నారు. తరువాత రైలు కదిలిపోయింది. ఇదే మహాత్మడు చివరి పర్యాయం నెల్లూరులో సభలో దర్శనమవ్వడం.
ఇంతకూ నెల్లూరులో మహాత్ముని స్మృతి చిహ్నాలను గురించి పట్టించుకొంటున్నారా? సుదర్శన మహల్ ఇప్పుడు లేదు. రేబాల పట్టాభిరామరెడ్డి గారి భవనాన్ని గత ప్రభుత్వ కాలంలో తొలగించడానికి ప్రయత్నం జరిగింది. గాంధీజీ దర్శించిన అనాథ శరణాలయం ఇప్పుడు బాలికల పాఠశాలగానో, హాస్టల్ గానో వుంది. పొగతోట సమీపంలో గాంధీజీ కస్తూరిదేవి విద్యాలయ భవనానికి శంకుస్థాపన చేసినందుకు గుర్తుగా ఆ రెండు వీధులను కలిపి కస్తూరిదేవి నగర్ అని పిలుస్తూ వచ్చారు. మూడేళ్ల క్రితం ఒక ధనికుడు ఆ వీధులకు తన పేరుతో బోర్డులు వేయించుకుంటే ఒక పెద్ద పోరాటం జరిగిన తర్వాత, ప్రభుత్వం ఆ బోర్డులు తొలగించింది. వి.ఆర్.కాలేజీ మైదానంలో మహాత్ముడు మూడు పర్యాయాలు ఉపన్యసించారు. ఇంకా మరెందరో జాతీయ నాయకుల ఉపన్యాసాలకు మైదానం మౌన సాక్షి. వర్ధమాన సమాజ గ్రంథాలయంలో గాంధీజీ ఆవిష్కరించిన తిలక్ తైలవర్ణ చిత్రం, దాని కింద ఆ సమాచారం రాసి పెట్టిన బోర్డు; టౌన్ హాల్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద 1915లో గాంధీజీ మరి కొందరు ప్రముఖులతో వున్న ఫోటో కూడా అలాగే వుంది. వి.ఆర్ కాలేజి మైదానం లాగే టౌన్ హాల్ ఆవరణలోను గాంధీజీ ఉపన్యసించారు. ఇవే నెల్లూరులో మిగిలిన బాపు స్మృతి చిహ్నాలు.
ఆధారాలు: కొడాలి ఆంజనేయులు సంపాదకులుగా తెలుగు అకాడమి ప్రచురించిన ‘ఆంధ్రప్రదేశ్‌లో గాంధీజీ’ పుస్తకం, 1978; జమీన్ రైతు, ఇతర నెల్లూరు పత్రికలు.
(మళ్ళీ కలుద్దాం)