అలనాటి అపురూపాలు-109

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

విశిష్ట నటుడు టైరోన్ పవర్:

భానుమతి గారి స్వర్గసీమ సినిమా గుర్తుందా? ఆ సినిమాకి ప్రేరణ అయిన ‘బ్లడ్ అండ్ సాండ్’ అనే ఆంగ్ల చిత్రం కథానాయకుడు టైరోన్ పవర్.

స్వర్గసీమ చిత్రంలో ‘ఓ పావురమా’ పాటకి ఆధారమైన ‘బ్లడ్ అండ్ సాండ్’ సినిమాలోని  పాటని ఈ లింక్‍లో చూడవచ్చు.

https://www.youtube.com/watch?v=bjs2oIToFT4

టైరోన్ పవర్ – ఈ పేరు స్టూడియో పబ్లిసిటీ డిపార్ట్‌మెంట్ వారి ఉత్పాదనలా అనిపిస్తుంది. అది నిజమే. నల్లని, అద్భుతమైన అందగాడైన ఈ స్టార్ (మిత్రులంతా ‘టై’ అని పిలుస్తారు) తన సొంత పేరునే సినిమాల్లో వాడారు. ఈయన తండ్రి పేరు కూడా టైరోన్ పవరే. ఆయన కూడా నటుడే. జూనియర్ టైరోన్ ముత్తాత కూడా పంతొమ్మిదో శతాబ్దంలో ఐర్లాండ్ దేశంలో గొప్ప నటుడిగా రాణించారు.

సీనియర్ టైరోన్ పవర్ 1880లలో బ్రిటన్ నుంచి వలస వచ్చారు. కొంత కాలం వ్యవసాయం చేశారు, ఆపై కుటుంబ వ్యాపారంలోకి దిగారు. నటుడిగాను రాణించారు. 45 ఏళ్ళ వయసులో 1914లో వారి పుత్రుడు జన్మించడంతో కుటుంబం పెరిగింది.

తండ్రి ఎక్కువ కాలం ఇంట్లో ఉండకపోవడంతో చిన్నారి టై, అతని చెల్లెల్ని వాళ్ళ అమ్మ సిన్సినాటిలో పెంచారు. 1920లో టై తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. హైస్కూలు చదువు పూర్తయ్యాక, కాలేజీ చదువుని కొనసాగించడానికి ఇష్టపడక  టై నటనని వృత్తిగా చేసుకోవాలనుకున్నారు. లాస్ ఏంజిల్స్‌లో తండ్రిని కలిసి నటనలో మెళకువలు తెలుసుకోవాలనుకున్నాడు.

అప్పటికి సీనియర్ టైరోన్ రంగస్థలంపైనే కాక, మూకీ సినిమాలలోనూ నిలదొక్కుకున్నారు. అప్పుడే ఆయన తన మొదటి టాకీ సినిమా ‘The Big Trail’ (1930) పూర్తి చేశారు. John Wayne మరో కీలక పాత్ర పోషించారీ చిత్రంలో. ఆయన తదుపరి సినిమా Lon Chaney ‘మిరాకిల్ మ్యాన్’ రీమేక్. నాన్నతో కలిసి పనిచేయాల్న జూనియర్ టై కోరిక తీరలేదు. 1931లో సీనియర్ టైరోన్ ఒక సినిమా షూటింగ్‍లో గుండెపోటుతో కొడుకు చేతుల్లోనే కన్నుమూశారు. తండ్రి మరణం తర్వాత ఓ సినిమాలో చిన్న వేషం పొందగలిగారు జూనియర్ టైరోన్. కానీ ఆ పై అవకాశాలు రాలేదు. ఆ తర్వాత రంగస్థలం వైపు మరలారు.

చాలా ఏళ్ళ తరువాత దర్శకుడు హెన్రీ కింగ్ – ‘టై’ని గుర్తించారు. వెండితెరకి సరిగ్గా సరిపోతారని భావించారు. ఫాక్స్ ప్రొడక్షన్ వారి ‘Lloyds of London’ (1936) చిత్రానికి కథానాయకుడిగా ప్రతిపాదించారు. కానీ ఆ వేషానికి తొలుత Don Ameche ని అనుకున్నారు. స్టూడియో యజమాని Darryl Zanuck అయిష్టంగానే టైరోన్‌ని అంగీకరించారు. కానీ తను ఆమోదించినందుకు ఆయన తరువాత ఎంతో సంతోషించారు, హెన్రీ కింగ్ కూడా సంతోషించారు; ఆయన, టైరోన్ కలిసి పది సినిమాలు చేశారు తరువాతి కాలంలో.

తన సమకాలీనుడు Errol Flynn లానే టైరోన్ కూడా రాత్రికి రాత్రి రొమాంటిక్ స్టార్ అయిపోయారు. Flynn లానే గ్రేస్, శరీర సౌష్టవం ఉండడంతో – సాహసోపేత పాత్రలు టైరోన్‍ని వరించాయి. నటుడు, విశిష్ట ఫెన్సర్ అయిన Basil Rathbone దృష్టిలో – ఈ ఇద్దరు నటులు సమఉజ్జీలే అయినా, కత్తి యుద్ధంలో టైరోన్ కాస్త ఎక్కువ ప్రతిభ కలవారు (ముఖ్యంగా 1940 నాటి ‘ది మార్క్ ఆఫ్ జోర్రో’ సినిమాలో టైరోన్ తన ఫెన్సింగ్ పాటవాన్ని విశేషంగా ప్రదర్శించారు).

1930 చివర్లలో టైరోన్ విమానాలని నడపడం నేర్చుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం సంభవించినప్పుడు, ఆయన తనకి వీలైన సేవలందించాలనుకున్నారు. తన ముందుస్తు శిక్షణకి అదనంగా, మరింత శిక్షణ తీసుకుని మెరైన కార్ప్స్ లో చేరి యుద్ధ ప్రాంతాలయిన ఇవో జిమా, ఒకినావా – లకు రవాణా విమానాలను నడిపారు. సాహసోపేతమైన ఈ సేవలకు గాను ఆయన ఎన్నో పతకాలు గెల్చుకున్నారు. యుద్ధం ముగిసాకా, కూడా మెరైన్ కార్స్ప్ వారి రిజర్వ్స్ లో ఒకరిగా చాలా కాలం ఉన్నారు. మేజర్ హోదా పొందారు. యుద్ధం, ఇంకా (లారా టర్నర్‍తో సహా) ఇతర సంబంధాల వల్ల దాంపత్యద్రోహం చేయడంలో తన మొదటి భార్య, ఫ్రెంచ్ నటి అన్నాబెల్లాకు 1948లో విడాకులు ఇవ్వవలసి వచ్చింది. ఆ తరువాత టైరోన్ మరో అందాల నటి లిండా క్రిస్టియన్‍ని పెళ్ళి చేసుకుని, ఇద్దరు కూతుర్లను కన్నారు.

విదేశాల నుంచి తిరిగి వచ్చాకా, నటుడిగా తన ప్రతిభను వెల్లడించే పాత్రలను పోషించాలనుకున్నారు. “సాహసవీరుడి పాత్రలు విసుగొస్తున్నాయి, నాటకాలలో లాగా సినిమాలలోనూ నా లోని నటుడిని వ్యక్తం చేయగలిగే పాత్రలు ధరించాలనుకుంటున్నాను” అని చెప్పారు. ఐతే స్టూడియో యజమాని, Zanuck ఇందుకు అంగీకరించలేదు. విన్నింగ్ ఫార్ములాని మార్చడానికి ఆయన ఇష్టపడలేదు. అయినా, టైరోన్‍ని సంతోషపరిచి, తన ఆధీనంలోనే ఉంచుకోవాలనుకున్నారు.

అందగాడిగా టైరోన్ ఇమేజ్‌ని సవాలు చేసే రెండు సినిమాలు వచ్చాయి. మొదటిది ‘ది రేజర్స్ ఎడ్జ్’ (1946) కాగా, రెండవది, ముఖ్యమైనది ‘నైట్‌మేర్ అల్లే’ (1947). రెండవది ఆఫ్-బీట్ నోయిర్ చిత్రం, దీనికి ఎడ్మండ్ గౌల్డింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి Zanuck ప్రచారం చేయాలనుకోకపోవడంతో, విడుదలయిన కొద్దిరోజులకే ఈ సినిమాని అందరూ మరిచిపోయారు. అయినప్పటికీ, అది ఓ చక్కని చిత్రమనీ, టైరోన్ గొప్పగా నటించారని విమర్శకులు పేర్కొంటారు. తాను ఆ సినిమాలో నటించినందుకు టైరోన్ గర్వపడ్డారు.

ఈ రెండు సినిమాల మధ్య టైరోన్ – గతంలో ఫాక్స్ స్టూడియోకి హిట్ లిచ్చిన కొన్ని ఫార్ములా ఆధారంగా సినిమాలూ చేశారు. కానీ, తర్వాత టైరోన్ స్థాయి పెరిగింది. చిన్న మొత్తాలని వదిలి, లాభాలలో వాటా అడగసాగారు. లేకపోతే కమర్షియల్ ప్రాజెక్టులలో నటించననేవారు. రంగస్థలంపై నటించడానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. 1950లలో లండన్ లోని వెస్ట్ ఎండ్‌లో విశేషంగా ప్రదర్శితమైన ‘మిస్టర్ రాబర్ట్స్’ నటించారు. ఆపై ఆయనకు రంగస్థలమే ముఖ్యమైపోయింది.

1955లో రెండవ భార్య లిండా క్రిస్టియన్‍కి విడాకులిచ్చి స్వీడిష్ నటి మాయ్ జెట్టర్‌లింగ్‍తో సుదీర్ఘకాలం సహజీవనం చేశారు, రెండుసార్లు విఫలం కావడంతో పెళ్ళి వద్దనుకున్నారు. అయితే, 1957లో డెబ్బీ మినార్డోస్‌తో పరిచయం అయినప్పుడు ఆయన తన నిర్ణయం మార్చుకున్నారు. తనకంటే పాతికేళ్ళు చిన్నదయిన ఆ అందాల భామని 1958లో పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళి వెంటనే ఆమె టైరోన్ మూడవ సంతానాన్ని గర్భం ధరించింది. ఐతే డెబ్బీకీ తనకి పుట్టిన కొడుకుని టైరోన్ చూసుకోలేకపోయారు. బిల్లీ విల్డర్ గారి థ్రిల్లర్ ‘విట్నెస్ ఫర్ ది ప్రాసిక్యూషన్’ (1957) సినిమా పూర్తి చేసి టైరోన్ – చారిత్రక చిత్రం ‘సోలోమన్ అండ్ షెబా’ కోసం మాడ్రిడ్ ప్రయాణించారు. సహ నటుడు జార్జ్ శాండర్స్‌తో ఓ కఠినమైన సన్నివేశం చిత్రించాకా, అలసిన టైరోన్, తన తండ్రి వలె, సెట్ లోనే కుప్పకూలిపోయారు. సినిమా షూటింగ్ మధ్యలో గుండెపోటు రావడంతో ఆకస్మిక మరణం పాలయ్యారు. తన తండ్రి కనీసం 60 ఏళ్ళ వరకూ జీవించారు, కానీ టైరోన్ 45 ఏళ్ళు దాటలేదు (రోజుకు మూడు పాకెట్ల సిగరెట్లు తాగే అలవాటు కూడా ఇందుకు కారణం కావచ్చు). కొన్నాళ్ళు మిలిటరీ సర్వీసులో ఉండడం వల్ల ఆయన కెరీర్ రెండు దశాబ్దాలు కూడా కొనసాగలేదు. అయినా ఆయన – క్విగ్‍లే టాప్ హండ్రెడ్ బాక్సాఫీస్ స్టార్స్ జాబితాలో స్థానం సంపాదించుకోగలిగారు. ఇది ఆయనకున్న జనాదరణని తెలుపుతుంది. ఇందులో పేర్లున్న కొందరు ఆయన కన్నా ఎక్కువ కాలం నటించారు. అయినా తనని తాను గొప్ప స్టార్‌గా చూసుకునే కన్నా, గొప్ప నటుడిగా చూసుకోవడానికే ఆయన ఇష్టపడ్డారు. కానీ నిజమేంటంటే – ఆయన ఈ రెండిటిలోనూ విశేషంగా రాణించారు.


బేబీ సోనియా నుంచి నీతూ సింగ్ వరకు:

బేబీ సోనియాగా బాలనటిగా రాణించి – అద్భుతమైన నటన కనబరిచి – హీరోయిన్‍గా ఎదిగి అప్పుడు కూడా విజయవంతమైన నటిగా పేరు తెచ్చుకున్నారు నీతూ సింగ్. ఓ దశాబ్దం పాటు విశేషంగా సాగిన కెరీర్‍లో యాభైకి పైగా సినిమాలు చేసి లక్షలాది మంది అభిమానులను అలరించారు.

చైల్డ్ సూపర్‌స్టార్:

నీతూ సింగ్ అసలు పేరు హర్నీత్ కౌర్ అని చాలా తక్కువ మందికి తెలుసు. జింక కళ్ళ వంటి కళ్ళున్న హర్నీత్ 8 జూలై 1958 నాడు ఢిల్లీలో ఓ జాట్-పంజాబీ కుటుంబంలో జన్మించారు. రాజీ కౌర్, దర్శన్ సింగ్ దంపతులకు హర్నీత్ ఏకైక సంతానం. ఆ కుటుంబం తర్వాత బొంబాయి లోని పెద్దర్ రోడ్‍కి మకాం మార్చింది. అక్కడ హర్నీత్ హిల్ గ్రాంజ్ హై స్కూల్‍లో చదువుకున్నారు. ఆమె చిన్నతనంలో తండ్రిని కోల్పోయారు. అయితే ఆ తర్వాత కొద్ది కాలంలోనే, బేబీ సోనియా పేరిట బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. తొలి సినిమా టి. ప్రకాశరావు దర్శకత్వంలో రాజేంద్ర కుమార్, వైజయంతిమాల నటించిన రొమాంటిక్ చిత్రం ‘సూరజ్’ (1966). ఈ అందాల పాపని తొలుత వైజయంతిమాల గుర్తించి దర్శకుడికి సూచించారని ఓ కథనం వినికిడిలో ఉంది.

తరువాత బేబీ సోనియాగా దేవేంద్ర గోయల్ గారి ‘దస్ లాఖ్’ (1966) చిత్రంలో ‘రూప’  పాత్రలో నటించారు నీతూ సింగ్. అయితే మాల సిన్హా – బిస్వజీత్ నటించిన ‘దో కలియాఁ’ (1968) చిత్రం విజయవంతం కావడంతో ఆమెకి మంచి పేరు వచ్చింది. విడిపోయిన తల్లిదండ్రులను కలిపే కవల పిల్లల పాత్రను పోషించారామె. ఆర్ కృష్ణన్, ఎస్. పంజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళ చిత్రం ‘కుళందైయుమ్ దైవముమ్’ కి రీమేక్. దీనికి ‘పేరెంట్ ట్రాప్’ (1961) అనే ఇంగ్లీషు సినిమా ప్రేరణ. తరువాత ఈ సినిమానే తెలుగులో ‘లేత మనసులు’గా తీశారు.

స్వరకర్త రవి, గేయ రచయిత సాహిర్ లుధియాన్వీ పిల్లలకి ఓ గొప్ప పాటని కానుకగా ఇచ్చారు. అది ‘బచ్చే మన్ కీ సచ్చే’ అనే పాట. బాలల దినోత్సవం రోజున ఈనాటికీ రేడియోలో వినిపిస్తూనే ఉంటుంది. చిన్నారి చింటూ కపూర్ ఈ సినిమాని మాట్నీ ఆట చూడడానికి బడి ఎగ్గొట్టేవారట! బాలనటిగా నీతూ ఇతర సినిమాలు ‘వారిస్’ (1969), ‘పవిత్ర పాపి’ (1970).

***

‘దో కలియాఁ’ (1968) చిత్రంలోని ‘బచ్చే మన్ కీ సచ్చే’ పాట యూట్యూబ్‍లో చూడవచ్చు:

https://www.youtube.com/watch?v=6v-Q9u-i7Gc

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here