సుగంధి

0
3

[dropcap]సూ[/dropcap]ర్యుడు ఎప్పుడు సమయం మారడు, మనుష్యులే సమయం మార్చేస్తు ఉంటారు. ఇంటి పనులు ఇల్లాలు సమయానికి చెయ్యకపోతే పిల్లల స్కూల్ సమయం, భర్త ఆఫీస్ సమయం, అదే ఉద్యోగిని అయితే ఆమె సమయం అన్ని మారుతాయి.

గడియారంలో ముళ్ళు మాదిరి జీవితం ముఖ్యంగా స్త్రీ కష్టపడాలి. అప్పుడే కుటుంబం వృద్ధి అయ్యి సవ్య మార్గంలో ఉంటుంది. అందుకే చిన్నప్పటి నుంచి ఆడపిల్లలని చాలా పద్ధతిగా పెంచుతారు. మగ పిల్లాడు మరి అవసరం లేదా అంటే తప్పకుండా ఉంది. పది సార్లు చెప్పించుకోకుండా అలవాటు చేసుకోమని జాగ్రత్త చెప్పి అలవాటు చేయాలి. అయితే ఈ సమాజం ఆడపిల్లని విమర్శించి విశ్లేషించినట్లు మగపిల్లాడు విషయంలో అంతగా పట్టించుకోదు. అదే మన సమాజ ఘనత కూడా.

పెళ్లి చేస్తే ఆ పిల్ల సరిదిద్దుతుంది అంటారు కానీ ఆ పిల్లకి ఆ ఇంట్లో స్వేచ్ఛ స్వతంత్రం ఇవ్వాలి కదా. అప్పుడే పెత్తనం పుచ్చుకున్నది అంటారు. దానికేం తెల్సు కొత్తగా వచ్చింది, వాళ్ళ ఇంటి పద్దతి వాళ్ళది, మన ఇంటి పద్దతి మనది అనే సంఘర్షణ వస్తుంది.

సుగంధి మంచి తెలివైన పిల్ల. కాలేజిలో ఫంక్షన్స్‌కి, మహిళ దినోత్సవానికి ఫుడ్ స్టాల్‌లు ప్రిన్సిపాల్ పెట్టించి వాళ్ళకి డబ్బు పెంచే విధానం నేర్పేవారు. అలాగే లయన్స్ క్లబ్ సెమినార్స్ అవుతుంటే కూడా ఈ ఫుడ్ ఎగ్జిబిషన్ పెట్టించేవారు. దీని వల్ల మనుష్యులకు మంచి ఆహారము అందుతుంది, ఆడపిల్లలకి వంట వార్పు ద్వారా ఆర్థిక స్తోమత పెంచుకునే శక్తి వస్తుంది. ఈ ఆలోచనలతో చక్కని కార్యక్రమం నిర్వహించేవారు. కొందరు అమ్మాయిలు వెయ్యి పెట్టుబడితో ఐదు వేలు సంపాదించేవారు.

“చదువు కాగానే ఏమి చేస్తావు?” అని స్నేహితులు అడిగేవారు. కానీ తన ఇంటి పరిస్థితి తెలుసు. బీకాం చేసింది. ఎమ్.బి.ఏ చెయ్యాలని కోరిక అన్నది.

కానీ “మా అమ్మానాన్నల ఇష్టం. మా అన్నయ్య పాలిటెక్నిక్ చదువుకొన్నాడు. వెంటనే జాబ్ పంచాయితీ రాజ్‍లో వచ్చింది. ఇప్పుడు బి.టెక్ చదువుతూ ఉద్యోగం చేస్తున్నాడు. అలా నాకు చెయ్యాలని ఉన్నది. కానీ పెద్ద వాళ్ళు ఒప్పుకోరు. తాత బామ్మ ఉన్నారు, ఆయన టీచర్ చేసి నాన్నని, పెద్ద నాన్ననీ చదివించారు. పెద్ద నాన్న టీచర్ అయ్యాడు. నాన్న బ్యాంక్ క్లర్క్ అయ్యారు. బదిలీలు బొంబాయి అటు వైపు చేశారు. అందుకని నన్ను అన్నయ్యని ఇక్కడ బామ్మ దగ్గర పెట్టారు. మరి నా ఇష్టం ఏమి లేదు, అంతా పెద్ద వాళ్ళదే” అన్నది.

‘ఈ తరంలో కూడా ఇలా పాత చింతకాయ పచ్చడి అమ్మాయిలు ఉన్నారా’ అంటూ కొందరు అమ్మాయిలు వెక్కిరించారు.

“అహ ఎందుకు లేరు? ఇప్పటికీ మా ఇంట్లో నైటీలు వేసుకోనివ్వరు. అబ్బాయిలు ఉన్నారు, అన్నయ్య ఉన్నాడు వద్దు అంటారు, మసకలీ డ్రస్సులు వద్దు అన్నారు. ఏవో నాలుగు పట్టు లంగాలు అవి కూడా బామ్మ చీరలు బరువుగా జరీ ఎక్కువ అని నాకు పరికిణీలు కుట్టించింది. రెండు అద్దాల లంగాలు అద్దాల జాకెట్స్ ఉన్నాయి, వాటితో కాటన్ ఓణితో నా డిగ్రీ అయిపోయింది. బొంబాయి నుంచి రక రకాల గాజులు లోలకులు తెస్తారు కానీ బామ్మ అవి పెట్టుకుని కాలేజీకి వద్దు, పండుగల్లో ఇంట్లో పెట్టుకో అంటుంది. ఏమిటా వేషం అంటుంది. తాతగారు మాత్రం ఆడపిల్లకి పుట్టింట్లో అరాట్ల ఉంటే ఎలా? అత్తింట సుఖ పడటం కష్టం, అక్కడ ఎలాగూ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అంటారు” అంది సుగంధి.

సుగంధి చక్కగా క్యాసెట్ లు పెట్టుకుని పాడుతుంది. సుగంధి బామ్మ దగ్గర జాకెట్స్ కుట్టడం, వంట చెయ్యడం అన్ని నేర్చుకున్నది. నేర్చుకోకపోతే బామ్మ ఊరుకోదు. ఇంకా ఏమిటి? చాదస్తం అంటారు స్నేహితులు. కానీ ఎవరి ఇంటి పద్దతి వాళ్ళది, కాదని ఎలా అంటారు.

***

‘సరే డిగ్రీ అయ్యింది కాబట్టి పిల్ల పెళ్లి చెయ్యరా వెంకట రవణా’ అని సుగంది నానమ్మా, తాతలు పట్టు పట్టారు. ఈలోగా అన్నయ్య శ్యామ్‌కి ఒక సంబంధం వచ్చింది. కట్నం బాగా ఇస్తాం అన్నారు. వాళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు. డబ్బు ఉన్నది, పొలం ఉన్నది. అతను పుణెలో ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నాడు.

“మా పిల్లాడికి మీ పిల్లని కట్నం లేకుండా చేసుకుంటాము. మా పిల్లకి దండిగా డబ్బు ఇస్తాము” అని చెప్పారు.

మా అన్నయ్య ప్రభుత్వ ఉద్యోగి. మరి వాళ్ళ అబ్బాయి ప్రైవేట్ వస్త్ర కంపెనీలో జాబ్ కదా. మనకి కట్నం వద్దు, పిల్లకి ప్రైవేట్ సంబంధం వద్దు అని ఊరుకున్నారు

పట్టు వదలని విక్రమార్కుడిలా వాళ్ళు “మీ సంబంధం మంచిది. ఈ రోజుల్లో పెద్ద వాళ్ల దగ్గర పెరిగిన పిల్లలు దొరకరు. మాకు ఆస్తులు ఉన్నాయి. ఉద్యోగం పురుష లక్షణమని చేస్తున్నాడు. మీ పిల్లని కూడా కలిపితే మా వృద్ధాప్యం వెళ్లిపోతుంది” అని చెప్పారు.

పెద్ద వాళ్ళు మళ్లీ ఆలోచనలో పడ్డారు. కాళ్ళ దగ్గరికి వచ్చిన బేరం కాశీ వెళ్ళిన రాదు కనుక పెళ్లి చేసేద్దాం అని నిర్ణయించి సరే శుభస్య శీఘ్రంగా చేద్దాము అన్నారు

సుగంధి మాత్రం నెమ్మదిగా పిజి గురించి పెళ్లి వారితో చెప్పమన్నది.

సరే ప్రైవేట్‌గా ఎన్ని పిజిలు అయినా చదవవచ్చును అన్నారు. ఈ రోజుల్లో విశ్వవిద్యాలయాలు ఇంటి ముంగిటకు వస్తున్నాయి కదా అన్నారు. హమ్మయ్య, అయితే పెళ్లికి ఓకే అన్నారు.

ఘనంగా పెళ్లి చేశారు. అటు ఇటు అంతా మెచ్చుకున్నారు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అని సన్నాయిలో శ్రావ్యంగా వాయించారు. వాళ్ళు అన్ని కోడలికి, అల్లుడికి పెట్టారు. “మీరు ఏమి పెట్టవద్దు, పిల్లని పంపండి చాలు” అన్నారు

పుణెలో కొత్త కాపురం. అన్ని అత్తవారి ఇంటి నుంచే వచ్చాయి. సరే అదృష్టవంతులు అంటే వారే. ఈ లోగా మూడేళ్లు గడిచాయి. పిజి అయ్యింది.

సుగంధి ఆలోచనలు వేరే ఉన్నాయి. పుణెలో ఎన్నో రకాల బిజినెస్‌లు పరిశీలించి చూసింది. కొన్నాళ్ళు షేర్స్ బిజినెస్ చేసింది. చేతిలో కంప్యూటర్ దాని ద్వారా పది లక్షలు సంపాదించింది. భర్తకి చెపితే “నీ ఇష్టం నీ డబ్బు నచ్చినట్లు చేసుకో” అన్నాడు.

“ఇక్కడ నా ఫ్రెండ్ సుష్మ ఉన్నది. వాళ్ళది సుగంధ ద్రవ్యాల బిజినెస్. నన్ను ఎప్పుడు నీ పేరు సుగంధి. నువ్వు కూడా ఇలాంటి బిజినేస్ చేస్తే బాగుంటుంది. నీ పేరుకి సార్థకత వస్తుంది అని అంటుంది” అన్నది.

“ఆమెది చిన్న చదువు. నా దగ్గర ఈ విషయాలు చర్చిస్తూ ఉంటుంది. నాకు చదువు తెలివి అన్ని ఉన్నాయి. నేను చేస్తాను” అన్నది సుగంధి భర్తతో.

“మా అమ్మ నాన్న ఒప్పుకోరు. నన్నే ఉద్యోగం మాని రమ్మని అంటున్నారు. ఇంకా నిన్ను చెయ్యనిస్తారా?” అన్నాడు.

“మనిషి ఒకే వృత్తి మీద ఆధారపడకూడదు. రెండు మూడు విద్యలు వచ్చి ఉండాలి” అన్నది.

“సరే నువ్వు చెప్పి ఒప్పించుకో” అన్నాడు భర్త కాశ్యప్.

“సరే మీరు ఉద్యోగం మానెయ్యమని అంటున్నారు కదా, ఈ రకంగా చెపుతాను. వాళ్ళు ఎలాగ సేలం దగ్గర ఉన్నారు. ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మసాలా ఆకు ఇవన్నీ బాగా దొరుకుతాయి. కనుక నేను ఒప్పిస్తాను” అన్నది.

కోడలు తెలివి అత్తకి మామకి నచ్చింది. కొడుకు కోడలు దగ్గర ఉండటం మంచిది. అసలు వాళ్ళు ఆ ఉద్దేశం తోనే పెద్ద వాళ్ళ దగ్గర పెరిగిన పిల్లను అడిగి చేసుకున్నారు.

ఇంకేమి కొడుకు కోడలు వస్తున్నందుకు హారతి పట్టారు.

మద్రాస్‌లో ఉన్న అత్తమామలు కోడలు తెలివికి మెచ్చుకుని ఇంటికి దగ్గరలో స్టాల్ పుచ్చుకుని వాళ్ళు పెట్టారు. మామగారు కూడా కోడలికి సహకరించారు. ఆయనకి తెలుసున్న స్నేహితుడిని షాప్‌లో గుమాస్తాగా పెట్టీ ఇద్దరు కుర్రాళ్ళని ఇంటింటికీ పంపే పద్దతి పెట్టారు.

సుగంధి డబ్బును ‘నువ్వు బంగారం కొనుక్కో నేను పెడతాను డబ్బు’ అని మామగారు ముచ్చట పడ్డారు.

సుగంధికి కాలేజి రోజుల నుంచి బాగా వంటకాలు, ఆహార పదార్థాల ఎంపిక తెలుసు. అందుకని మొలకలతో ఆరోగ్యానికి అమృత ఆహారము వంటివి ప్యాకెట్లలో పెట్టి బిజినెస్ మొదలు పెట్టింది. ఒక ప్రక్క రోజుకి రెండు గంటలు బ్యాచిలర్స్ బిర్యాని అని మొదలు పెట్టింది. ఉదయం పన్నెండు నుంచి రెండు వరకు కాలేజి విద్యార్థులు ఉద్యోగస్థులు ఉన్న చోటికి వ్యాన్‌లో ఫుడ్ పంపేది. ఇళ్ళల్లో వంట రాని వాళ్ళు హోటల్స్ అన్ని ఎక్కువ ధర ఉన్నప్పుడు కొంచెం తక్కువ ధర వల్ల అమ్ముడు పోయేవి. వెన్న చెక్కలు, మురుకులు. కొబ్బరి బొబ్బట్లు చక్కగా మసాలాలు వేసి చేయించి ప్యాకెట్లలో అమ్మేది.

అలా అలా అది పెద్దదైంది. ఆంధ్ర సారె కావాల్సిన వారికి మిఠాయి, మైసూర్ పాక్, సున్ని ఉండలు, పూతరేకు, అరిసెలు; మన ప్రాంతం పెళ్లి సారెలో పెద్ద పెద్ద పంచదార చిలకలు గొల్ల భామలు వంటివి ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. రంగు రంగుల చిలకలు అందరూ కొనేవారు. అలా ఏడాదికి పెట్టిన సొమ్ముకాక రెండు రెట్లు లాభం వచ్చింది.

అత్తమామల ఆనందం అంతా ఇంతా కాదు. కొడుకు తమ దగ్గర ఉండాలి అన్నది వారి కోరిక. కానీ అప్పట్లో కొడుకు వినలేదు. రాత్రి డ్యూటీలు. చిక్కు. నల్లబడ్డాడు. ఏడాది ఇంటిపట్టున ఉండి బిజినెస్ చెయ్యడంతో మళ్లీ రంగు వచ్చాడు. సుగంధి లాంటి కోడలు తమకు వచ్చిందుకు సంతోషించారు.

కాల గమనంలో ఇద్దరు పిల్లలు తల్లి అయినా సుగంధి మాత్రం పిల్లల పెంపకం అత్తకు మామకు అప్పజెప్పి విదేశీ ఎగుమతిలో కూడా మంచి విజయం పొందింది. ఆడది వ్యాపారం చెయ్యడం ఏమిటి అని కొందరు విమర్శించారు కానీ సుగంధి అందరినీ అత్తింట ఒప్పించి – లాభాల బాటలో కుటుంబాన్ని నడిపింది

కొందరి కోరికలు విచిత్రంగా నెరవేరుతాయి. ఇదే విషయం ప్రముఖ జాతీయ పత్రికలో ఇంటర్వ్యూ ఇచ్చినపుడు తన చిన్నప్పటి ఆలోచనలు గురించి చెప్పింది సుగంధి.

ఏది అయిన సరే పిల్లల్లో ఆలోచనలు వచ్చి చెప్పినప్పుడు పెద్దలు వద్దు అనకుండా అందులో సాధక బాధకాలు చెప్పి ముందడుగు వెయ్యడానికి సహకరించాలి అని చెప్పింది.

ఆ తరువాత కొన్ని చానల్స్‌లో కూడా ఇంటర్వ్యూలలో ‘సుగంధి విజయ సుగంధాలు’ అని చెప్పినప్పుడు అత్తమామల, భర్త సహకారం; పెద్దల అభిప్రాయాలు అన్ని గౌరవించి ముందుకు వచ్చాను అని తనని పెంచిన బామ్మ తాత, తల్లి తండ్రి, అన్న వదిన స్నేహితులు విషయాలు అన్ని చెప్పినప్పుడు అందరూ కూడా సంతోషించారు.

స్త్రీ చదువు ఇంటికే కాదు సమాజానికి వెలుగే అని అని చెప్పింది సుగంధి.

శాంతి శుభము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here