[dropcap]వా[/dropcap]సు తన పెరడులో చెట్టు పాతాలని లోతుగా గుంట తవ్వసాగాడు. అలా కొంత తవ్విన తరువాత వాడికి ఒక మూత బాగా బిగించిన చిన్న రాగి పాత్ర కనబడింది! వాసు ఆశ్చర్యపోయి దానిని ఇంటిలోకి తీసుక వెళ్ళి మూత తీసాడు. అందులోంచి పొగ రూపంలో ఒక వింత మానవ ఆకారం బయటకు వచ్చింది! ఆ ఆకారం చూసిన వాసుకి మొదట భయం వేసింది, తరువాత ఆశ్చర్యపోయాడు. ఆ సమయంలో వాసు అమ్మ,నాన్న పొలం పనులకు వెళ్ళారు.
ఆ ఆకారం “నాకు ఆకలి…ఆకలి” అంటూ అరవసాగింది! వాసు కొంత స్తిమితపడి వెంటనే వంట గదిలోకి వెళ్ళి డబ్బాలో ఉన్న లడ్లను తెచ్చి ఇచ్చాడు. ఆ ఆకారం వెంట వెంటనే లడ్లు తినేసింది! మరలా “ఇంకా కావాలి… ఇంకా కావాలి ఆకలి!” అంటూ అరచింది. వేరుశనగ బస్తాలోని వేరుశనగ కాయలను తెచ్చి ఇచ్చాడు, వాటిని తొక్కతో కూడా తినేసింది.
అప్పుడు అది కొంత శాంతించి ఈ విధంగా చెప్పింది. “కొన్ని వేల సంవత్సరాల క్రితం నేనూ మనిషినే,కానీ బద్ధకంతో ఏ పనీ చేయక తిండి దొంగలించి, తినేవాడిని. ఆ విధంగా ఒక ముని అడవిలో తపస్సు చేసుకుంటుంటే ఆయన పెంచుకుంటున్న చెట్లనుండి పండ్లు దొంగలించి తిన్నాను. అది చూసి ఆయన “దొంగతనం ఎందుకు చేస్తున్నావు? పని చేసి సంపాదించుక తినవచ్చు కదా” అని గట్టిగా అడిగేసరికి, నాకు కోపం వచ్చి కట్టెతో ఆయనను కొట్టి గాయపరిచాను! అప్పుడు ఆయన నన్నొక పొగపిశాచ రూపంలోకి మార్చి ఈ రాగి పాత్రలో బంధించి ఇక్కడే పాతాడు. నాకు తెలిసి ఆయన ఆశ్రమం అప్పట్లో ఇక్కడే ఎక్కడో ఉండేది” చెప్పింది పిశాచం.
వాసు దానిని ఆకలి పిశాచంగా గుర్తించాడు. దానికి ఎక్కడ తిండీ చాలదని కూడా గ్రహించాడు. ఎందుకైనా మంచిది దానిని మరలా పాత్రలో బంధించి ఊరికి దూరంగా ఎవరూ తిరగని చోట పాతి పెట్టాలని నిర్ణయించాడు.
“చూడండి, పిశాచం గారు మీ పేరేమిటి?” అడిగాడు.
“నా పేరు వృకోదర (పెద్ద బొజ్జ కలవాడు)” చెప్పి ఆకలితో వంట ఇంటి వైపు చూడ సాగింది.
“మాలో కొంతమందికి పిశాచాలకు మంత్రాలు వేసి బంధించే విద్య తెలుసు. నీవు నా దగ్గర ఉన్నట్టు తెలిస్తే, అటువంటి మంత్రాలు తెలిసినవాడు వచ్చి నిన్ను బంధించడమే కాకుండా నీకు అనేక బాధలు కలిగించవచ్చు” అని చెప్పి దానిని భయపెట్టాడు.
కానీ, దానిని బంధించే ముందు తెలివిగా కొన్ని పనులు చేయించుకుంటే తన తల్లిదండ్రులకు శ్రమ తగ్గుతుందని కూడా వాడు తెలివిగా ఆలోచించాడు.
వాసు పిశాచాలను బంధించే వారిని గురించి చెప్పినప్పటినుండి ఆ పిశాచం భయపడసాగింది.
ఇంతలో వీధిలో బుడబుక్కలవాడు చిత్రంగా గంట వాయిస్తూ, “అంబ పలుకు, జగదంబ పలుకు” అంటూ గట్టిగా అరుస్తూ బిచ్చం అడుక్కుంటున్నాడు.
ఆ పిశాచం బుడబుక్కల వాడి అరుపు విని భయపడి,
“ఏమిటి ఆ అరుపు?” అని అడిగింది.
అప్పుడే వాసుబుర్ర చురుగ్గా పని చేసింది.
“వాడే పిశాచాలను బంధించి బాధలు పెట్టేవాడు!” అని దానికి చెప్పాడు.
ఆ మాటలకు పిశాచి వణికి పోయింది.
“మరి ఇప్పుడు నేనేం చేయాలి” అని భయంతో అడిగింది.
“నేను చెప్పిన పనులు చెయ్యి, నీవు వాడికి కనబడవు నేను నిన్ను రక్షిస్తాను, తిండి పెడతాను” చెప్పాడు వాసు.
అది ఇప్పుడు వాసూనే నమ్ముకుంది.
“నీవు వెళ్ళి మా బావిలో దాగి అందులో రాళ్ళు రప్పలు పేరుకున్న మట్టి తీసి లోతు చెయ్యి, నీళ్ళు బాగా ఊరతాయి. నీవు బావిలో ఉంటావు కాబట్టి ఆ మాంత్రికుడికి తెలియదు” చెప్పాడు వాసు.
వెంటనే ఆ పిశాచం బావిలోకి వెళ్ళి తన శక్తితో రాళ్ళు, మట్టి ఒక్కసారిగా బయటకు తెచ్చి పడేసింది. బావి లోతు పెరిగి వాసూ వాళ్ళకి వేసవిలో కూడా నీటి సమస్య తీరిపోయింది!
బావిలోంచి అది ఇంటిలోకి వచ్చింది. దూరంగా బుడబుక్కలవాడి అరుపులు వినబడుతూనే ఉన్నాయి. మరలా అది భయపడసాగింది.
“వాడు దూరంగా ఉన్నాడు, ఈసారి నీవు మాయింటి కప్పు మీదకు వెళ్ళి నీ శక్తితో కన్నాలను పూడ్చివేయి, నీకు మంచి తిండిపెడతాను” అన్నాడు వాసు.
వెంటనే అది ఇంటి కప్పు పైకి గడ్డి, పచ్చమట్టి తీసుకవెళ్ళి ఆ కన్నాలను పూడ్చి వేసింది. అది ఇంట్లోకి వచ్చి, “నాకు ఆకలి” అన్నది.
వాసు తనకు అమ్మ వండిపెట్టిన అన్నం మొత్తం దానికి ఇచ్చాడు. అది మొత్తం తిని వేసింది.
“నీవు చిన్న పని చేయి, నేను బయటికి వెళ్ళి మంచి తిండి తెస్తాను” చెప్పాడు వాసు.
“నేనేం చెయ్యాలి?” అడిగింది పిశాచం.
“మా పెరటిలో చెట్లకు పాదులు తీయి” అని ఏ విధంగా చెట్లకు పాదులు తీయాలో ఒక చెట్టుకి పాదు పెట్టి చూపించాడు వాసు.
అంతే అది వెంటనే కుంకుడు,జామ, కొబ్బరి, దానిమ్మ,నిమ్మ మొదలైన చెట్లకుచక్కగా పాదులు తీయడం మొదలు పెట్టింది.
బయటకు వెళ్ళిన వాసు గబగబా వెళ్ళి బుడబుక్కల వాడిని కలసి, “మా ఇంటి దగ్గరకు వచ్చి గట్టిగా జగదంబను పిలువు, నీకు పది రూపాయలు ఇస్తాను” అని చెప్పాడు. బడబుక్కలవాడు మొదట ఆశ్చర్యపోయినా పది రూపాయలు ఇస్తున్నాడు కనుక వాసు ఇంటి దగ్గరకు వెళ్ళి అరవసాగాడు. ఈ లోపలచెట్ల ఆకుల్ని ఒక సంచీలో కూరుకుని చకచకా ఇంటికి వెళ్ళాడు.
బుడబుక్కల వాడి అరుపు విని పిశాచం భయపడిపోయి, “ఇప్పుడెలా?” అన్నది.
“నిన్ను కాపాడే బాధ్యత నాది, ఎందుకైనా మంచిది నీవు మరలా పాత్రలోకి వెళ్ళు ఎవరికీ కనబడకుండా దాచి పెడతాను” అన్నాడు.
“ఆ బుడబుక్కల మంత్రగాడు వెళ్ళి పోయాక, నీకు మంచి తిండిపెడతాను” అని ఆకులు నింపిన సంచీ చూపించాడు.
అశతో మరలా పాత్రలోకి వెళ్ళి పోయింది, వాసు గబుక్కున మూత గట్టిగా బిగించి గుడ్డ చుట్టి దానిని ఒక సంచీలో పెట్టాడు. బయటకు వెళ్ళి బడబుక్కలవాడికి పదిరూపాయలు ఇచ్చి పంపాడు.
కొద్ది సేపటికే వాసు తల్లిదండ్రులు పొలం పని ముగించుకుని వచ్చారు.
ఆకలి పిశాచం సంగతి దాని చేత చేయించుకున్న పనులు,మరలా దానిని బంధించిన విధానం అన్నీ వాళ్ళకి చెప్పాడు.
“మంచి పని చేశావు నాయనా, పిశాచాలు దుష్ట శక్తులు, వాటిని నమ్మకూడదు, బతికి ఉన్నప్పుడు చెడు పనులు చేసినవారే చావు తరువాత పిశాచాలుగా మారతారని చెబుతుంటారు! ఏదీ ఆ పాత్ర ఇవ్వు ఊరికి దూరంగా అడవిలో లోతు గొయ్యి తీసి పాతి వస్తాను” అని వాసు దగ్గర నుండి ఆ పాత్ర తీసుకుని అడవికి వెళ్ళి లోతు గుంట తీసి పాతి పెట్టి వచ్చాడు తండ్రి.
‘తన బద్ధకం, తిండిపోతుతనం వ్యవహారం వలనే తన బతుకు పాత్రలో కూరకపోయింది’ అని పిశాచం తలచుకుంటూ ఏడవ సాగింది!
వాసు చేసిన పనికి వాడి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు