[dropcap]గ[/dropcap]డియారము ముళ్ళ మధ్యలోంచి
పగటిని పదిలంగా తీసేసుకుని
వెళ్ళిపోతాడు అతడు ఉదయాన్నే
సమాజపు సంతలోకి ఉత్సాహంగా
క్షణాలు నిమిషాలు గంటలుగా
సమయాన్ని అమ్మకానికి పెట్టి
కీర్తి కనకాల విజయాల సంపదల
కొనుగోలు చేస్తాడు కావలసినంతగా
సాయంత్రపు కూడలిలో
రాత్రి సమయాన్ని హుషారుగా వేలంవేసి
అలసటనూ నిషానూ నిదురనూ
తెచ్చేసుకుంటాడు తనకూడా
అతనికోసం
ఎదురుచూపుల అశోకవనంలో
పగటిని ఒంటరితనానికి
వస్తుమార్పిడి చేసుకున్న ఆమె
ఎడతెగని రాత్రిని తెగనమ్మి
నిరాశను నిస్పృహను నిదురలేమిని
నింపేసుకుంటుంది
ఓటమిరంగుల ఒడినిండా
గది మూలన
ఆమె వెలిగించుకున్న ఆశాజ్యోతి
గడియారంలోని రేపటి ఉదయం వైపు
మినుకుమినుకుమంటూ చూస్తూంటుంది
ఎప్పట్లాగే…
నిన్నా మొన్నట్లాగే