కర్ణాటక సాంస్కృతిక రాజధాని – మైసూరు

0
4

[dropcap]మొ[/dropcap]హం మీద ముసురుకుంటున్న

చీకటి ముంగురుల్ని సవరించుకుంటూ,

పరుగులెత్తే పిల్ల సమీరాలు

మెత్తగా ఒళ్ళంతా స్పృశిస్తుంటే

పరవశంతో ఆరుబయట నిలబడ్డ

సంధ్యకాంత నునులేత బుగ్గలు

ఆకాశాన గుంపులుగా వెళుతున్న

నీలి మబ్బుల్ని చూసి

సిగ్గుతో పగడవు దీవులయ్యాయి.

బెంగుళూరు వెళ్ళేందుకు విమానం ఎక్కి కూర్చుని సంధ్యా సమయాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు పై విధంగా అన్పించింది. విమానం ఎక్కి కూర్చున్నా తరువాత ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల గంట లేటుగా బయల్దేరింది. అలా సూర్యాస్తమయాన్ని, సంధ్యా సమయాన్ని ఆస్వాదించే అవకాశం కలిగింది. 7.00 గంటలకు బెంగుళూరులో విమానం దిగబోయేముందు క్రింద కొన్ని లైటు చుక్కలు కదుల్తూ కనిపించాయి. సాధరణంగా విమానంలో నుంచి చూస్తే మనుషులు చీమల్లా కనబడతారంటారు. కానీ ఈ రోజు కదులుతున్న వాహనాలను చూస్తే టార్చిలైట్లు పట్టుకొని చీమలదండు నడుస్తున్నట్లుగా అన్పించింది. ఇది కొత్తగా కట్టిన ఎయిర్ పోర్టు. చాలా బాగుంది. మూడు ఎస్కలేటర్లు దిగక గాని ఎగ్జిట్ రాలేదు. రన్ వే రోడ్లు ఏ బ్యూటీ పార్లర్‌లో మసాజ్ చేయించుకున్నాయో ఏమో గాని నున్నగా మెరిసిపోతున్నాయి. వచ్చిపోయే విమానాల అందాల్ని కళ్ళప్పగించి చూస్తూ కదలక మొదలక నిలబడిపోయినట్లున్నాయి లైటు స్తంబాలు. ఎయిర్ పోర్టంతా డాక్టర్లతో హడావిడిగా ఉన్నది. అన్నీ ఫార్మసీ కంపెనీల డాక్టర్ల పేర్లు రాసిన కాగితాలను పట్టుకొని మా అందరి కోసం నిలబడ్డారు. 46వ జాతీయ పిల్లల వైద్య నిపుణుల సమావేశం కోసం మేము బెంగుళూరు వెళ్ళాం. అక్కడ లిమోరిడియన్ హోటల్లో దిగాం.

బెంగుళూరులో కబ్బన్ పార్కు, బన్నర్ గట్ట నేషనల్ పార్కు, లాల్ బాగ్, ఇస్కాన్ టెంపుల్, విశేశ్వరయ్య మ్యూజియం చూశాం. అన్నింటికన్నా విశేశ్వరయ్య ఇది మ్యూజియంను చాలా ఎంజాయ్ చేశాం. యంత్రాలు, పుల్లీ, లీవర్లు, జిప్ మెకానిజం అన్నీ ఎలా కనుక్కోబడ్డాయి? రూపాంతరం చెందుతూ ఇప్పటి టెక్నాలజీ ఎలా వచ్చింది చిత్ర సహితంగా సోదాహరణంగా సజీవంగా చూపబడ్డాయి. మొట్టమొదటి రైలు వ్యాగన్‌ను ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ చూసి ప్యాలెస్ గ్రౌండ్స్ లోని జాతీయ సమావేశం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఇస్రో ఛైర్మన్ జి.మాధవన్ నాయర్ రావడంతో మాకు ఆయన్ను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్గింది. ఆయన ఎక్కువగా చంద్రయాన్ గురించే ప్రసంగించారు. ‘అందానికి ప్రతిరూపంగా కవులు చందమామను గురించి చెపుతారు. కానీ చందమామలో ఎన్నో లోయలూ, ఎగుడుదిగుళ్లూ, ఏడారులు ఉన్నాయి. భవిష్యత్తులో చందమామ గురించి మన ఊహలు మారతాయి’ అన్నారు. ఈ ప్రోగ్రామ్ జరిగిన ప్యాలెస్ గ్రౌండ్స్ మైసూరు వెళ్ళి చూసి రావాలని అప్పుడే నిర్ణయించుకున్నాము. ఈ ప్యాలసే ఇంత అందంగా ఉంది మైసూరు ప్యాలెస్ ఇంకెంత అందంగా ఉంటుందో అని ఊహించుకుంటూ నిద్రలోకి జారుకున్నాం.

తెల్లవారిన తరువాత మధ్యాహ్నం మాకు కేటాయించిన ఇస్కోమ కారులో మైసూరు బయల్దేరాం. దారిలో వచ్చే శ్రీరంగ పట్టణాన్ని చూసుకుంటూ వెళ్ళాలనుకున్నాం. మండ్యా జిల్లాలో ఉన్నది. “ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమలా ఉంటుంది.” అన్నాడు కారు డ్రైవరు. “అంటే ఇక్కడ కూడా పంటలు, నీళ్ళు తక్కువా” అన్నారు మా పిల్లలు. ‘లేదు రాయలసీమలా ఇక్కడ క్రైమ్ జాస్తి’ అన్నాడు డ్రైవరు.

క్రీ.శ. 1610 నుండి 1699 వరకు శ్రీరంగపట్నం మైసూరుకు రాజధానిగా ఉండేది. ఇక్కడ శ్రీరంగనాథుడు ఆదిశేషునిపై పవళించి, కుడిచేయితల కింద పెట్టుకొని, ఎడమచేయి చాపుకొని, వక్షస్థలమందు శ్రీమహాలక్ష్మిని ధరించి, పదాలను కావేరి జలాలు తడుపుతుండగా భక్తులకు దర్శనమిస్తాడు. మైసూరు మహారాజు ముమ్మడి కృష్ణరాజవడయార్ సేనాధిపతియైన హైదర్ అలీ శ్రీరంగనాథునకు గొప్ప భక్తుడట. ఓ యుద్దంలో ఒక వైపు పరవళ్ళు తోక్కే గోదావరి, మరొకప్రక్క శత్రుసైన్యం మధ్యలో హైదర్ సైన్యం అవలీలగా దాటుటకు అవకాశం కల్పించిందట. శత్రుసైన్యం దగ్గరకు రాగానే గోదావరి మరలా ఉగ్రరూపం దాల్చిందట. మైసూరు మహారాజు కుటుంబీకులు శ్రీరంగనాథుని అత్యంత భక్తి శ్రద్దలతో సేవిస్తారు. ఆంగ్లేయులకు చెల్లించవలసిన ధనము తనవద్ద లేకుండుటచే టిప్పు రంగనాథుని ఆభరణములను ఆంగ్లేయుల కిచ్చాడట. ఆ తర్వాత కొన్ని అభరణములను ఫ్రెంచివారికీ, మరికొన్ని అభరణములు రష్యావారికీ చిక్కినవట. రష్యాలోని క్రెమ్లిన్ రాజభవనము నందు ఇప్పటికీ ఈ ఆభరణములు కనిపిస్తాయట. అలుమేలమ్మ అను మహభక్తురాలు తన నగలను స్వామివారికి అలంకరించి ఆనందించేదట. ఈ సంగతి విన్న మైసూరు మహారాజు ఆ నగలను స్వామికిచ్చేయమని ఆజ్ఞాపించాడట. ఆమె పారిపోగా సైనికులు వెంబడించారు. ఆమె మాలాంగి దగ్గర అగాధంలో దూకి ఆత్మహత్య చేసుకుంటూ “మైసూరు రాజులు నిస్సంతులవుతారు, తలకాడు ఎడారి అగును” అని శాపమిచ్చింది. ఆ శాప ఫలితముగానే మైసూరు రాజులకు పిల్లలు లేరు. ఇప్పటికీ తలకాడు ఎడారి గానే ఉన్నది. ఇవి శ్రీరంగనాథుని మహాత్మ్యములు.

శ్రీరంగపట్నం నుంచి ‘రంగన్నతిట్టు బర్డ్ శాంక్చురీ’ కి వెళ్ళాం. ఇక్కడ ప్రఖ్యాత పక్షి ప్రేమికుడు డా. సలీం అలీ ఇంటర్ ప్రిటేషన్ సెంటర్ ఉన్నది. ఇక్కడ పక్షులు పంజారాలలో బంధించి ఉండవు. కానీ అవి ఇక్కడే నివాసం ఉండేందుకు కావలసిన పరిస్థితుల్ని కల్పించారు. కావేరినదీ పాయలు, మధ్యలో వెదురుచెట్ల పొదలు ఆకసాన గుంపులుగా ఎగిరే రకరకాల పక్షులు, నీళ్ళలో చెట్లపైన సేదతీరే వింత పక్షులు వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉందిక్కడ. ఇక్కడ నుంచి బృందావన్ గార్డెన్స్‌కు వెళ్ళాం. మైసూరుకు 20 కి.మీ దూరంలో కృష్ణరాజసాగర్ అనకట్టకు దిగువన పచ్చని మైదానములు, పరిమళ భరిత పుప్పాలు, సెలయేళ్ళు, నీటిని పైకి చిమ్మే ఫౌంటెన్లు, నాయనానందకరంగా బృందావన్ గార్డెన్స్ దర్శనమిస్తాయి. కమ్మని సంగీతానికి హోయలోలుకుతూ నర్తించే నీళ్ళు విశ్వేశరయ్య అధ్బుత సృష్టికి నీరాజనం పడుతున్నాయి. రాత్రివేళల్లో విద్యుద్దీపల అలంకరణతో బృందావన్ గార్డెన్స్ కళ్ళు చెదిరే అందాలతో అలరారుతున్నాయి. బృందావన్ గార్డెన్స్ చూసి మైసూరు చేరుకుని హోటల్ లో రూం తీసుకొని నిద్రపోయాం.

ఆ మరుసటి రోజు ఉదయాన్నే మైసూరు ప్యాలెస్ కు వెళ్ళాం. ఎంత అధ్బుతమైన కట్టడమదీ అని ఎంతసేపు చూసిన కళ్ళు మూసుకోబుద్దికాలేదు. ఇప్పుడు మనం చూస్తున్న ప్యాలెస్ 19వ శతాబ్దంలో కట్టినదేనట. మొదటగా ఈ ప్యాలెస్‌ను చెక్కతో నిర్మించగా అగ్నిప్రమాదం బారినపడింది. తరువాత వడయార్ రాజులు దీనిని పునర్నిర్మించారు. ప్రస్తుత మైసూరు మహారాజు శ్రీ కంఠదత్త వడయార్. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్దించేదాకా వడయర్ రాజులు మైసూరు రాజ్యాన్ని పరిపాలించారు. మధ్యలో టిప్పు 1761 నుండి 1799 దాకా మైసూరు రాజ్యానికి సుల్తానుగా ఉన్నాడు. ఈ ప్యాలెస్ ఇండో శార్సినిక్ స్టైల్‌లో కట్టబడింది. అత్యద్బుతమైన నగిషీ చెక్కడాలతో శోభయమానంగా వెలిగే మైసూరు ప్యాలెస్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది.

ఉదయం పూట కన్నా రాత్రిపూట ఇంకా అందంగా ఉంటుందని చెప్పడంతో మరలా రాత్రిపూట వెళ్ళి రంగు రంగుల లైట్లతో అందంగా మెరిసిపోయే ప్యాలెస్ ను కన్నులారా చూచాం. మైసూరు మహారాజు మూడవ కృష్ణరాజ వడయార్ పట్టణాన్ని బాగా అభివృద్ధి చేశాడు.

తరువాత చాముండేశ్వరి ఆలయాన్ని, జయా చామరాజేంద్ర ఆర్ట్ గ్యాలరిని చూడటానికి వెళ్ళాం. ఈ ఆలయంలో ప్రతి ఏటా పదిరోజుల పాటు జరిగే దసరా ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది పొందాయి. పార్వతీదేవి మహిషాసుర వధగావించి చాముండి కొండపై చాముండేశ్వరిగా వెలసినదట. ఈ ఆలయానికి కొంచెం దిగువ బాగాన నందీశ్వరుని రతి విగ్రహం చాలా పెద్దది ఉన్నది. అమ్మవారి ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నట్లుగా జీవం ఉట్టిపడుతూ ఉంది. ఆర్ట్ గ్యాలరీలో రవివర్మ వేసిన తైల వర్ణ చిత్రాలు ఉన్నాయి. రాజారవివర్మ మైసూరు మహారాజు స్నేహితులైనందున మైసూరు సందర్శించినప్పుడు వేసిన పెయింటింగులన్ని ఇక్క ఆర్ట్ గ్యాలరీలో ఉంచారు. కృష్ణ, సుధామల చరిత్ర, హరిశ్చంద్రుడు, ఇంద్రజిత్తు, శకుంతల పాత్రలేఖనం ఇలా అనేక రవివర్మ చిత్రాలు ఉన్నాయి. ఇందులో వెన్నెల్లో ఆడపిల్ల చిత్రంలో వెన్నెల ఆ అమ్మాయి మీద ఎక్కడెక్కడ పడుతుందో, ఆ వెలుగు ఎలా ప్రతిఫలిస్తుందో చాలా చక్కగా చిత్రించాడు. ఇంకా ‘జటాయువధ’ అనే చిత్రంలో చాలా విచిత్రం ఉన్నది. ఆ బొమ్మను కుడివైపు నుంచి చూసినా, ఎడమ వైపునుంచి చూసినా అది మనవైపే చూస్తున్నట్లనిపిస్తుంది. ఎంతసేపు చూసినా తనివి తీరలేదు.

కర్నాటక రాష్ట్రం జానపద కళలకు పుట్టినిల్లు. జానపద కళలు అంతరించి పోతుండడాన్నిగుర్తించిన మైసూరు యూనివర్సిటీ కళారూపాల్ని ఒక్క చోట చేర్చి మ్యూజియంగా రూపొందించింది. అంతేగాకుండా మాస్టర్స్ డిగ్రీ లెవెల్లో జానపద కళల్ని చేర్చారు. ఇది వాళ్ళకు కళల పట్ల ఉన్నమక్కువను తెలియచేస్తున్నది. మైసూరు కర్నాటక రాష్ట్రానికి సాంస్కృతిక రాజధాని అనడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here