[dropcap]“నా[/dropcap]న్నా, నాకు ఎంతమంచి రాంక్ వచ్చిందో చూడు” అంటున్న కూతురిని చూసి, రాఘవ కళ్ళల్లో ఆనందం వెల్లి విరిసింది. కూతురుని దగ్గర కూర్చోపెట్టుకొని అభినందిస్తూ….
“నా కోరిక తీరిందిరా తల్లీ. ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకోగలను. రాఘవ కూతురు ఐఐటియన్ అని” మురిసిపోతూ కళ్ళు తుడుచుకుంటూన్న రాఘవని చూసి
“ఊరుకోండి నాన్నా. ఎందుకని అంత భావుకత. మీరు చదివించేరు; నేను కష్టపడి చదువుకున్నాను. ఎందుకా కన్నీళ్ళు” అంటూ తండ్రి కళ్ళు తుడిచింది రాధ. రాఘవ కళ్ళు తుడుచుకుంటూ…
“నాన్న కథ చెప్పాలని ఉంది, తిట్టకుండా వినమ్మా!” అన్నాడు.
“మళ్లీ గతంలోకి వెళ్లిపోతారా? నా ప్రతీ రిజల్ట్స్‌కీ చెప్తూనే ఉంటారు. వద్దు నాన్నా!”అంది రాధ గారాబంగా.
“నీ పిల్లలకు నా కథని నువ్వు చెప్పాలి. ఈ ఒక్కసారికీ విను. మరెప్పుడూ నేను నీకు చెప్పను. ఆఖరి సారి చెప్పనియ్యమ్మా!” అంటూ బతిమాలేడు రాఘవ.
“సరే చెప్పండయితే. అంటూ తండ్రి ఒళ్ళో తల పెట్టుకొని పడుకొంది మురిపెంగా రాధ.
***
నా ఆరవ సంవత్సరంలో మా అమ్మా, నాన్న నన్ను తీసుకు వెళ్లి; మా తాత గారి ఇంట్లో వదిలి పెట్టేరు. అమ్మ నాన్న వెళ్లిపోతుంటే… మామ్మ నన్ను ఎత్తుకొని చెయ్యి ఊపించితే.. అమ్మకోసం ఏడిచేనుట. తరువాత మరెప్పుడూ ఏడవలేదటమ్మా.
తాతగారి, ఇంట్లో ప్రతీరోజు ఒక పండగే. అత్తలు ఎప్పుడూ పుట్టింట్లోనే ఉండేవారు. మామ్మ చెల్లెళ్ళు, తాత అప్పచెల్లెళ్ళు సందడిగా ఉండేది వాతావరణం.
పొద్దున్నే, తాతతో పాటే లేవటం, సాగరంకి వెళ్లి స్నానం చెయ్యటం. మామ్మ పిల్లలందరితో పాటు కూర్చోపెట్టి చద్దెన్నం, తెలగపిండి వడియం పెట్టేది. కడుపునిండా తిని అందరితో పాటు స్కూలుకి వెళ్ళేవాడిని. వయసు ఎక్కువైందని ఒక సంవత్సరం తగ్గించి స్కూల్‌లో వేసేరు.
స్కూలులో వెయ్యటం అయితే వేసేరు కానీ… తాత ఎప్పుడూ నన్ను తన వెంట పొలంకి, కానీ పౌరోహిత్యంకి కానీ తీసుకుని వెళ్ళేవారు.
అత్తలు వాళ్ళపిల్లలకి అన్నాలు తినిపిస్తూ ఉంటే; ఆశగా వుండేది నాకు తినిపిస్తే బాగుండునని, అమ్మ చేతి బువ్వ ఎప్పుడు తిన్నానో ఎరుగను.
అత్తలు, వాళ్ళ పిల్లల్ని ముద్దుగా పడుకో పెడుతుంటే.. నన్ను కూడా ఎవరైనా దగ్గరకి తీసుకొని పడుకోపెడితే బాగుండును అనిపించేది. అమ్మపక్కన ఎప్పుడు పడుకున్నానో కూడా నాకు తెలీదు.
అమ్మకి, నా తరువాత రెండేసి సంవత్సరాల తేడాతో ఆరుగురు పిల్లలు. నేను తాతగారి ఇంటికి వెళ్ళేసరికి, అమ్మకి మరి ఇద్దరు పిల్లలు.
ఇంట్లో ఉండే అందరికీ పడుకోవటానికి దరీలు వెయ్యటం, పొద్దున్న లేచి మడతలు పెట్టటం, అలా నాకెవరూ పని చెప్పకుండానే పని చేసేవాడిని.
నాన్నది చిన్న జీతం. తమ్ముణ్ణి కూడా ఇక్కడ తెచ్చి వదిలేసేరు నాన్న. డబ్బులు పంపలేక పోయేవారు. తాత పొలాలన్నీ తనఖాలోకి పోయాయి. ఆదాయం తక్కువ, తినే వాళ్ళు ఎక్కువ.
అత్తలెప్పుడూ, నన్ను తమ్ముణ్ణి ‘కూర్చోపెట్టి మేపుతున్నారు’ అని తిట్టేవారు. ఎపుడైన ఎదురు సమాధానం ఇద్దామనిపించేది. నన్ను ఏమైనా అంటే మామ్మ ఒప్పుకునేది కాదు.
అలా, పెద్దవాణ్ణి అవుతున్నాను.. చదువు ఒంట పట్టక పోయినా ‘కాసు బ్రహ్మానందరెడ్డి గారి’ దయ వలన తొమ్మిదో తరగతి పాసై మెల్లిగా పదవ తరగతికి చేరుకున్నాను.
తాత పడే ఆర్థిక బాధలు చూసి రెండెకరాల భూమిని కౌలుకు తీసుకొని, పగలు రాత్రి కష్టపడి పంట పండించి, దుకాణాలకి పాత అప్పులు తీర్చి వేసేను. అప్పుడు అందరూ..
“రఘుబాబు ఏం కావాలన్నా తీసుకు వెళ్ళు” అని కొత్త అప్పులు ఇచ్చేరు.
జీవితంలో నేను ఆ రోజులను మర్చిపోలేను. నన్ను పెంచిన మామ్మ తాతల కళ్ళల్లో ఆనందాన్ని చూడగలిగేను.
పదవతరగతి పరీక్ష తప్పేను. మామ్మ తాత నన్ను ఏమి అనలేదు కానీ.. అత్తలు, అత్తల పిల్లలు ఎగతాళిగా చూసేవారు.
పొలం పనులు చూసుకొంటూ.. సెప్టెంబరుకి కట్టేను. మళ్లీ నాలుగు విభాగాలలో ఉండిపోయాయి. పక్కవాళ్ళ అబ్బాయి ట్యూషన్‌కి వెళుతుంటే నాకూ అనిపించింది. ట్యూషన్ చదివితే పాస్ అవుతానేమో? అని. నా చదువు గురించి పట్టించుకునేదెవరు?
మళ్లీ మార్చి పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. తాత ఎప్పుడైనా ‘పుస్తకం తీయరా’ అనేవారు కానీ, దగ్గర కూర్చుని బోధపరిస్తే చదువబ్బి ఉండేదేమో?
అందరి పిల్లలతో పాటు బుడ్డీ దీపం పెట్టుకొని; చదువుదామని ప్రయత్నించినా, బుఱ్ఱకి ఎక్కేవి కావు.
మార్చిలో పరీక్షలు రాసేను. మళ్లీ ఫెయిల్ ఆయ్యేను. అందరూ “ఒరేయ్, రఘుగాడు మళ్లీ పరీక్ష తప్పేడురా” అంటూ… అప్పట్నించి నన్నందరు రఘు “ఎమ్ ఎస్ ఎమ్ (మార్చ్ సెప్టెంబర్ మార్చ్)” అనేవారు.
ఎవరు, ఎలా పిలిచినా నేను బింకంగా ఉండేవాడిని. ఎవరు ఇంటికి వస్తున్నా వాళ్ళని ఐదు మైళ్లు నడుచుకొని స్టేషన్ కెళ్లి తేవటం, తిరిగి ట్రైన్ ఎక్కించే పని నాదే.
అలా ఒకసారి మా చిన్నాన్న వచ్చినప్పుడు తాత చెప్పారు ఆయనకి “ఈ రఘుకి ఏదైనా ఉద్యోగం ఇప్పించరా” అని.
“ఎందుకు నాన్నా ఉద్యోగం? పొలం కొంటాను హాయిగా వ్యవసాయం చేసుకుంటాడు ఇక్కడే” అన్నారు చిన్నాన్న.
తాత మాత్రం…
“వద్దురా, ఏదైనా ఉద్యోగం వేయించు వాడికి” అనేవారు.
“వాడు కష్టపడగలడా? చదువు పెద్దగా లేదు. కళాసీ ఉద్యోగం అంటే చాలా కష్టం” అని చిన్నాన్న అన్నారు.
“ఇప్పుడు మేము ఉన్నామని ఫలసాయం ఇంటికి ఇస్తారు. తర్వాత మేము పోయాక వాడి జీవితం ఏమవుతుంది? ఏదైనా ఉద్యోగం వేయించు, కష్టపడి చేస్తాడువాడు” అని తాతయ్య మరీ మరీ చెప్పేవారు చిన్నాన్నకి.
చిన్నాన్న తీసుకువెళ్లి ఆరు నెలలు ఇంట్లో ఉంచుకున్నారు. వాళ్ల పిల్లలు చక్కగా చదువుతూ… ఉంటే నేనుకూడా మళ్లీ పరీక్షకు కట్టి, కష్టపడి చదివి పాసయ్యాను. ఆ మహానుభావుడు నాకు రైల్వేలో చిన్న ఉద్యోగం వేయించారు.
తర్వాత మెల్లిగా పర్మినెంట్ అయింది ప్రమోషన్స్ వచ్చాయి. తర్వాత పెళ్లి, ఇదిగో నువ్వు పుట్టడం. నిన్ను బాగా చదివించాలనే నా కల. నువ్వు చక్కగా చదువుకుని నా కలని నిజం చేస్తున్నావు.
నాకు చదువు విలువ తెలుసమ్మా! ఎప్పుడైనా ఈ రఘు ఎమ్ ఎస్ ఎం కూతురు మంచి స్థానంలోకి వస్తుంది” అంటూ రాఘవ గర్వంగా నవ్వుతుంటే… ఆ నవ్వులో వంత కలిపింది రాధ.