వైకుంఠపాళి-8

0
3

[dropcap]వా[/dropcap]సుదేవరావు సర్వం కోల్పోయిన వాడిలా గదిలోంచి బయటకి వచ్చాడు.

అతను పదమూడేళ్ళుగా ఏకఛత్రాధిపత్యంగా ఏలిన సంపాదక పీఠం ఆయనని జాలిగా చూసింది. సరస్వతీదేవి చనుబాలతో పాటు రక్తాన్ని కూడా పిండి అమ్ముకోజూసిన అతని అల్పత్వానికి తగిన శిక్ష పడిందన్నట్లు ఒక పికిలి పిట్ట అదే పనిగా అరిచి తన హర్షాన్ని వ్యక్తం చేసింది.

ఎంతో మంది కుర్రవాళ్ళు కొత్త ఉత్సాహంలో, సరికొత్త స్ఫూర్తితో వ్రాసి తెచ్చిన రచనలేవీ ఆయన ఎప్పుడూ చూడలేదు. చీకటి పడ్డాక వచ్చే బుడ్లూ, పచ్చనోట్లే చూసాడు. అన్నీ చీకటి పనులే చేసాడు. చివరకు కంటి ముందు అంతా చీకటే మిగిలింది!

ఫోనూ, కారూ, హోదా, అన్నీ మటుమాయం అయిపోయాయి.

వాసుదేవరావు కాళ్ళీడ్చుకుంటూ బయటికొచ్చాడు. మనసంతా మొద్దుబారినట్లనిపించింది. అర్జెంటుగా మందు కొట్టి పడుకోవాలనిపించింది. ఎవరికి తన బాధ చెప్పుకున్నా ఎద్దేవా చేస్తారనిపించింది. ఎడిటర్ పదవిలో తను అనుభవించిన అధికారాలతో ఎంతో మంది విసిగి, విరక్తి చెంది అస్త్ర సన్యాసం చేసారో, ఎన్ని కలాల విన్యాసాలు అరికట్టబడ్డాయో అతనికి తెలుసు!

అతనికి మాళవిక గుర్తొచ్చింది.

“మీ మేలు జన్మలో మరువలేను! నాకో కొత్త జన్మను ప్రసాదించారు” అని కన్నీళ్ళతో కరిగిపోయే ఆమె బాహువుల్లో సేద దీరాలనుకున్నాడు.

అతని కాళ్ళు ఆమె ఇంటికేసి సాగాయి.

***

మాళవిక ఇల్లంతా సందడిగా వుంది. కారణం ఆ రోజు ఆమె పుట్టినరోజు.

సతీష్ చంద్ర పెద్ద కేక్ తెప్పించాడు. కేండిల్స్ మాత్రం పెట్టలేదు.

ఓ సినీ నిర్మాత ఆ రోజే ఆమెకు ఎడ్వాన్స్ చెల్లించి ఆమె కొత్త సీరియల్ రైట్స్ కొనుకున్నాడు. ఇల్లంతా ప్రముఖులతో నిండిపోయింది.

ఫుడ్డుతో బాటు డ్రింక్స్ కూడా సర్వ్ చేయబడ్డాయి. నవ్వులతో, కేరింతలతో ఇల్లు ప్రతిధ్వనిస్తోంది.

వాసుదేవరావుకి ఆ సందడి చూడగానే షాకింగ్‍గా అనిపించింది. తనకు మాట మాత్రమైనా ఆమె తన బర్త్ డే గురించి చెప్పలేదు. ఇంత మందిని ఆహ్వానించింది! సంశయంగా ఆగిపోయాడు.

మాళవిక అతి ట్రాన్స్‌పరెంట్ లక్నో చుడీదార్‍లో తన వయసు కన్నా పదేళ్ళు చిన్నగా కనిపించే అలంకరణలో వుంది. ఆమె పకపకలాడ్తూ ఎవరితోటో మాట్లాడుతోంది. వాసుదేవరావుని చూసింది. వెంటనే అటు నడిచి “రండి… రండి… అనుకోకుండా వీళ్ళంతా హడావిడి చేస్తున్నారు” అని ఆహ్వానించింది.

వాసుదేవరావుకి ఆ సందడిలో, సరదాలో పాలుపంచుకునే మానసిక పరిస్థితి లేదు! బాగా మందు కొట్టి కళ్ళు మూసుకొని పడుకోవాలనిపించింది.

“నాకో బాటిల్ పంపియ్యి. నేను గదిలో కెళ్ళి పడుకుంటాను” అన్నాడు.

మాళవిక కంగారుగా సతీష్ చంద్ర కేసి చూసింది.

సతీష్ సినీ నిర్మాత రాజశేఖరంతో మాట్లాడ్తూనే ఇటు కేసి చూస్తున్నాడు.

“పడుకోవడం ఏమిటి?” గొంతు తగ్గించి అడిగింది.

“నా మనసేం బాగాలేదు మాళవికా! నా ఉద్యోగం పోయింది” అన్నాడు.

ఆమె అదిరిపడి చూసింది. “ఏవన్నారు?” అంది.

“ఆఁ… నువ్వు విన్నది నిజమే!” అన్నాడు.

మాళవిక ఒక్క నిమిషం మౌనం దాల్చింది.

“నేను చాలా బాధలో వున్నాను. నాకు ఇలాంటి సమయంలోనే నీ కంపెనీ కావాలి. నే లోపల పడుకుంటాను. వాళ్ళని పంపేసి లోపలికి రా!” అని లోపలికి నడవబోయాడు.

“ఆగండి” అంది మాళవిక.

అతను ఆగి ఆమెకేసి విచిత్రంగా చూసాడు.

మాళవిక అతనికి మాత్రమే వినపడేలా గొంతు తగ్గించి “మనసు బాగాలేకపోతే ఇంటికి వెళ్ళి పడుకోండి… ఇక్కడ కుదరదు. నా ఫ్రెండ్స్ ముందు అసహ్యంగా వుంటుంది” అంది.

వాసుదేవరావుకి ఆ మూడ్‍లో ఆమెని చాచిపెట్టి కొట్టాలనిపించింది. “నువ్వేనా ఇలా మాట్లాడేది! మీ వల్లే నేను రైటర్‍నయ్యాను అంటూ కృతజ్ఞతతో కరిగిపోయేదానివి… అలాంటి నువ్వేనా?” అన్నాడు.

“దయచేసి మాటలు పెంచకండి. ప్లీజ్… వెళ్ళిపొండి” అంది.

ఈలోగా సతీష్ చంద్ర వాళ్ళ దగ్గరికి వచ్చి, “ఏంటీ? ఏం జరిగిందీ?” అన్నాడు.

“నథింగ్… నథింగ్!” అని నవ్వి అతని నడుము చుట్టూ చెయ్యి వేసి నడుస్తూ వెళ్ళిపోయింది మాళవిక.

వాసుదేవరావు వైపు అదోలా చూసి వెళ్ళిపోయాడు సతీష్ చంద్ర.

వాసుదేవరావు ఆ జనంలోంచి మాళవికని బయటకి లాగి, “నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న స్టేటసూ, డబ్బూ, అన్నీ నా వల్లనేనే! నా ఉద్యోగం ఊడిపోయి నేను రోడ్డున పడ్డది కూడా నీ వల్లనేనే!” అని అరవాలనిపించింది. కానీ ఆమె ఎంతకైనా తెగిస్తుంది అనిపించి, ఆగ్రహాన్నీ, వుక్రోషాన్నీ బిగబట్టుకుని చూస్తూ నిలబడ్డాడు.

అందరికీ డ్రింక్స్ సర్వ్ చేస్తున్నాడు బోయ్. వాసుదేవరావు – అతను తన దగ్గరకి రాగానే, ఒక గ్లాసు అందుకున్నాడు. ఆ బోయ్ వెంటనే “అమ్మగారు మిమ్మల్ని వెళ్ళిపొమ్మన్నారు బాబూ! మీకు డ్రింక్ ఇవ్వద్దని కూడా చెప్పారు!” అన్నాడు.

మూర్ఛరోగి ముఖాన కొట్టే నీళ్ళల్లా తెలివి తెప్పించాయి ఆ మాటలు అతనికి. నెమ్మదిగా గ్లాసు ట్రేలో పెట్టేసి బయటకి నడుస్తూ, వెనక్కి తిరిగి మాళవికని చూసాడు.

మాళవిక నోటికి సతీష్ చంద్ర కేక్ అందిస్తుంటే ఆమె పరమ సంతోషంగా నవ్వుతోంది!

‘నేనింత బాధలో వున్నానని చెప్తే… అదీ తన వల్లేనని చెప్తే కూడా అంత సంతోషంగా ఎలా వుండగలిగిందీ?’ అనుకున్నాడతను.

సతీష్ చంద్ర కోట్ పై గుండీ పెడ్తూ “ఉద్యోగం కాస్తా వూడిపోయిందట. చాతకాని వెధవల్ని ఎవరు మాత్రం భరిస్తారూ?” అంది మాళవిక.

సతీష్ చంద్రకి ఇన్నాళ్ళూ వాసుదేవరావు రాకపోకల వల్ల మనసులో కాస్త బాధుండేది. అది కాస్తా ఈ నిమిషంలో చేత్తో తీసేసినట్లనిపించింది.

“గుడినీ, గుడిలో లింగాన్నీ కూడా మింగెయ్యాలని చూస్తే ఇలాగే వుంటుంది మరి! పోనీ వెధవ పీడ… ఇకనైనా మా ఎడిటర్… ఎడిటర్ అంటూ నాకు మండించకు!” అన్నాడు.

మాళవిక అతని మీద వాలిపోయి “అబ్బో ఎంత జెలసీనో!” అని నవ్వింది.

నందిని ఓ మూలగా కూర్చుని ఆ వాతావరణాన్ని, మనుషుల్నీ వింతగా చూస్తోంది. అప్పుడే కలిసిన వాళ్ళు కూడా ఎంతో కాలంగా పరిచయం వున్నట్లే ఒకళ్ళ ప్లేట్ లోంచి ఒకళ్ళు తినడం, కలిసి తాగడం, తూలడం చేస్తున్నారు. ఆమెకి ఒంటికి కారం రాసుకున్నట్లుగా అనిపించి అక్కతో చెప్పి వెళ్ళిపోవాలనుకుంది.

నందిని లేస్తుండగా “హాయ్” అంటూ శ్యామ్ వచ్చాడు.

“హలో” అంది ముక్తసరిగా నందిని.

“డిన్నర్ చేసారా?” అడిగాడు.

“లేదు. వెళ్ళిపోతున్నాను” అంది.

“కనీసం కూల్ డ్రింక్ అయినా త్రాగండి” అంటూ లిమ్కా అందించాడు.

“నో… థాంక్స్” అంది,

“మీ అక్క బర్త్ డే లో నాకు మీరు మర్యాదలు చేయాల్సింది పోయి, నేను చేస్తుంటే వద్దంటారేం?” అన్నాడు.

ఆమె తప్పనిసరి అయి అందుకొంది.

ఆమె లిమ్కా సిప్ చేస్తుండగా అతను “మీరు నేను చెప్పిన విషయం ఏం చేసారూ?” అని అడిగాడు.

నందిని ప్రశ్నార్థకంగా చూసింది.

“బ్యూటీఫుల్ ఫిగర్… మీరు కనీసం ఒక్క ఏడ్‌లో ఏక్ట్ చేస్తే చాలు…” ఆమెను వెనుక నుండీ, ముందు నుండీ పరీక్షిస్తూ అన్నాడు శ్యామ్.

నందినికి కోపం వచ్చింది. ఏదో అనబోతుండగా తల తిరిగినట్లయింది. నాలిక మొద్దుబారి కళ్ళు చీకట్లయ్యాయి. ఆమె నెమ్మదిగా సోఫాలోకి జారింది.

“నందినీ… నందినీ…” అంటూ ఆమెని లేవదీసి పడిపోకుండా పట్టుకుని గదిలోకి తీసుకెళ్ళాడు శ్యామ్.

సతీష్‌తో డాన్స్ చేస్తున్న మాళవిక ఇదంతా క్రీగంట గమనించింది. అయినా పట్టనట్టు వూర్కుంది.

ఇంతలో శశిధర్ వచ్చాడు.

మాళవిక గబుక్కున సతీష్ చంద్ర నుంచి విడివడి శశిధర్ దగ్గరకి వెళ్ళి, “రండి… రండి… నందిని ఇప్పటిదాకా ఇక్కడే వుండాలి… ఏమైందో మరి, చూస్తాను. కూర్చోండి” అని కంగారు పడినట్లు అభినయించింది.

శశిధర్ అనుమానంగా చూసాడు.

మాళవిక అటుగా వచ్చిన పని కుర్రాడితో “చిన్నమ్మాయి గారేరీ?” అని గొంతు తగ్గించి అడిగింది.

అతను గది వైపు చూపించాడు.

“మీరు కూర్చోండి… నే తీసుకొస్తాను” అంటూ మాళవిక అటు నడిచింది.

శశిధర్ ఆగలేకపోయాడు. తనూ ఆమె వెనకాలే నడిచాడు.

లోపల్నించి శ్యామ్ బయటకి వస్తూ కనపడ్డాడు. శశిధర్ కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి!

బెడ్ మీద నందిని మగతగా పడుకుని వుంది!

శశిధర్ ఆపుకోలేని ఆగ్రహంతో వెళ్ళి ఆమె రెక్క పట్టి లాగి ఈడ్చి కొట్టాడు.

నందిని మగతంతా ఒదిలిపోయి గభాల్న కళ్ళు తెరిచింది. ఎదురుగా కోపంతో వూగిపోతూ శశిధర్ ముఖం కనిపించింది. ఆమెకేమీ అర్థం కాలేదు. మండుతున్న చెంప పట్టుకుని “ఏవండీ!!” అంది విస్మయంగా.

“నేనేనే… అయిందా వాడితో కులకడం?” మళ్ళీ చెంప మీద కొట్టి అడిగాడు శశిధర్.

మాళవిక ముందుకు వచ్చి “ఆగు.. ఇది అడవనుకున్నావా? లేక నాగరిక సమాజం అనుకున్నావా? అదీ ఈ మాళవిక ఇంట్లో ఇలా ఓ ఆడపిల్లని గొడ్డుని బాదినట్టు బాదేస్తావా?” అరిచింది.

“ఛీ! నోర్ముయ్… ఇది ఇల్లా? సాని కొంపా? చెల్లెల్ని తీసుకొచ్చి వేరొకడితో గదిలోకి పంపిస్తావా? బుద్ధుండాలే….” అన్నాడు శశిధర్.

“మిస్టర్ మైండ్ యువర్ టంగ్!” అన్నాడు సతీష్ చంద్ర.

“నువ్వెవిడివిరా?” అడిగాడు శశిధర్.

సతీష్ చంద్ర గట్టిగా, “డ్రైవర్… వీడ్ని అవతలకి గెంటెయ్యండి” అన్నాడు.

శశిధర్ నందిని రెక్క పట్టి లాగుతూ “పదవే ఇంటికి, నీ పని చెప్తా” అన్నాడు.

నందినికి ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. కాస్త తేరుకుని, అమాంతం శశిధర్ కాళ్ళ మీద పడిపోయింది. “నన్ను నమ్మండి… నేనే పాపం ఎరుగను. కూల్ డ్రింక్ తాగగానే మగతగా అనిపించి పడిపోయా. నాకు అంతే తెలుసు! నేను ఆ గదిలోకి ఎలా చేరానో నాకు తెలీదు” అంది.

“వాడెవడో కూడా తెలీదా? నీకు సినిమాలో ఛాన్స్ ఇస్తానన్న సంగతి కూడా మర్చిపోయావు కదూ!” పళ్ళు పటపటా కొరుకుతూ అడిగాడు శశిధర్.

మాళవిక అతని కాళ్ళ దగ్గరున్న చెల్లెల్ని పట్టి లేపుతూ “కాళ్ళు పట్టుకుని దేబిరించే గతి నీకేమిటే? అతనే నిజం తెలుసుకుని నీ కాళ్ళ దగ్గరకొస్తాడు. పోనీవే” అంది.

“చచ్చినా రాను. నీ చెల్లెల్ని నీ దగ్గరే వుంచుకో! ఇటువంటి పతిత నాకు అఖ్కర్లేదు” అని అరిచి శశిధర్ దూకుడుగా వెళ్ళిపోయాడు.

“అక్కా… నన్ను వెళ్ళనీ… చేసినది చాలు… ఆయనని ఆపు” అని నందిని ఏడుస్తూ అతని వెనకాల పడబోయి తూలిపోయింది.

మాళవిక ఆమెని పొదివి పట్టుకుంటూ “ఎక్కడికి పోతాడే… అతనే వస్తాడు” అంది.

నందినికి స్పృహ తప్పింది.

***

వాసుదేవరావు ఇంటికి వెళ్ళేసరికి తాళం వుంది. పక్కింటి వాళ్ళని అడిగి తాళం చెవి తీసుకుని లోపలికి నడిచాడు. టేబుల్ మీద బరువు పెట్టిన కాయితం రెపరెపలాడ్తూ కనిపించింది. ఆత్రంగా తీసి చదివాడు.

“ఏవండీ… కట్టుకున్న భార్య, కన్న కొడుకు మీకు వెగటయ్యారు. ఎంతసేపూ దానితోటే గడుపుతారు. ఇంక మేమెందుకూ? అందుకే మిమ్మల్ని విడిచి మా దారి మేము చూసుకుంటున్నాం. శలవు… మీ లక్ష్మి.”

అతను నిస్సత్తువగా సోఫాలో కూలబడ్డాడు.

కళ్ళ ముందు తనని ఇంట్లో వుండమనీ, కొడుకుని ఎత్తుకోమనీ అర్థించే భార్య రూపం కదలాడింది. తన పెళ్ళిరోజున ఇంట్లో వుండకుండా మాళవికతో నాగార్జున సాగర్ వెళ్ళాడు. కొడుక్కి ప్రమాదంగా వుండి కబురు చేస్తే ఆఫీసులో దొరకలేదు. ఆ టైంలో మాళవిక సన్మానం కోసం గుంటూరు వెళ్ళాడు. మాళవికకి జ్వరం వస్తే రాత్రింబవళ్ళు ఆమె ఫ్లాట్‍లోనే గడిపాడు. ఆ సమయంలో తన కొడుక్కి పచ్చకామెర్లు వచ్చి ప్రాణాంతకమయిందట. ఇవన్నీ లక్ష్మి నోరు విప్పి ఎప్పుడూ చెప్పలేదు. నిశ్శబ్దంగా భరించింది. భరిస్తోంది కదా అని తనూ తన పంథా కొనసాగించాడు. చివరికిలా ఒక్కసారిగా, తనని ఏకాకిని చేసి అంధకారంలో వదిలి వెళ్ళిపోయింది! ఇప్పుడు విచారించి ఏం లాభం? వాసుదేవరావుకి మాళవిక చేసిన అవమానం మాటిమాటికీ జ్ఞాపకమొస్తోంది. బాధతో గుండె బరువెక్కింది. రేపటి నుండీ ఉద్యోగం లేదు. తిరగటానికి కారు రాదు. కొన్ని రోజులకి తినడానికి తిండి కూడా వుండదేమో… అతనికి లేస్తుంటే ఒళ్ళు తూలింది. హృదయంలో ఎవరో శూలం పెట్టి పొడిచినట్లు నెప్పొచ్చింది. అ… మ్మా… అంటూ క్రింద కూలబడిపోయాడు.

అదే ఆ ఇంట్లో అతని భార్య ఆ సమయంలో వుండి వుంటే… ఇల్లాల్లో ఓ తల్లి ఎప్పుడూ అంతర్గతంగా వుంటుంది. ‘అమ్మా’ అనగానే స్పందిస్తుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here