జీవన పరిమళం

2
3

[dropcap]పు[/dropcap]స్తకావిష్కరణ సభ పదిహేను నిమిషాల్లో ప్రారంభం కాబోతుందనగా నేను ఆ హాల్‍కి చేరుకున్నాను. వరండాలో నిర్వాహకులు వచ్చినవారికి సమోసాలు, టీలు అందిస్తున్నారు. పరిచయస్థులైన రచయితలూ, కవులూ, ఎవరి గుంపు వారే ఏర్పాటు చేసుకొని మాట్లాడుకుంటున్నారు. వచ్చినవాళ్ళలో నాకు తెలిసి సామాన్య పాఠకులెవరూ లేరని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇలాంటి ఆవిష్కరణ సభలెన్నింటికో హాజరైన నాకు, సభలో రచయితలు, కవులు ఆవిష్కరింపబడుతున్న పుస్తకం రచయిత తాలూకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కొలీగ్స్ తప్ప. పాఠకులెవరూ కనిపించలేదు!

నేను ఇటీవలే కథలు రాయడం మొదలుపెట్టాను. చాలా తక్కువ కథలు రాయడం వలన నేనెవరికీ పరిచయం లేను. కనపడినదల్లా చదువుతూ, ‘తొండ ముదిరి ఊసరవెల్లి’ అయిన చందాన నేనూ రచయితగా మారాను. అయితే అప్పుడప్పుడు ‘సాహితీలోక జ్ఞాన సముపార్జన’ నిమిత్తం నేను ఇలాంటి సభలకు హాజరవుతుంటాను. ఈ జ్ఞానం ఉంటేనే రచయిత తనను తాను ప్రమోట్ చేసుకోగలడన్న నిశ్చితాభిప్రాయం నాకెందుకో వుంది! దాదాపుగా చివరి బెంచీలలో కూర్చోవడానికే నేను ఇష్టపడతాను. చివరి బెంచీల్లో ఎందుకంటే అక్కడ నాకిష్టమైన స్వతంత్ర్య భంగిమలో కూర్చుని సభనాస్వాదించవచ్చు. ముందు వరుసలో కూర్చున్నవారికి, తమకిష్టమైన భంగిమకు మారే స్వాతంత్ర్యం లేకపోగా, పైపెచ్చు వక్తలు మాట్లాడినదాన్ని శ్రద్ధగా వింటున్నట్లు నటిస్తూ, మధ్యమధ్యలో చప్పట్లు కొడుతూ, నానా అవస్థలు పడాలి! వేదికమీద ఏ మంత్రిగారో, మంత్రిగారి బామ్మర్దో వుంటే ముందువరుస సీట్లకోసం పోటీపడి, వారి దృష్టిలో పడటానికి పడే అవస్థలూ చూశాను! చివరి బెంచీవారికి ఉన్న మరో సౌకర్యం – ఎవరినీ డిస్టర్బ్ చేయకుండా చడీచప్పుడు లేకుండా పారిపోవచ్చును. ఇవాళ మాత్రం నేను ముందు వరుసలోనే కూర్చున్నాను. నేను అమితంగా అభిమానించే కథా రచయిత ఆనంద్ స్వరూప్ గారు, ఈ ఆవిష్కరణ సభకు వక్తగా రానున్నారని ఆహ్వాన పత్రంలో చదివి, ఆయన్ని ప్రత్యక్షంగా చూసి, వీలైతే మాట్లాడవచ్చునని ఈ సభకు వచ్చాను.

“కార్యక్రమం మొదలవబోతోంది. దయచేసి బయటవున్న మిత్రులందరూ హాల్లోకి వచ్చి కూర్చోగలరని మనవి!” అంటూ మైకులో వినపడింది. కొందరి మెల్లగా హాలువైపు కదిలారు. మరికొందరు తమ కబుర్లను మధ్యలో ఆపేయడం ఇష్టం లేక ‘పోదాంలే! అక్కడ కొంపలేమీ మునిగిపోవు!’ అనే ధోరణిలో తమ కబుర్లను కొనసాగిస్తూనే వున్నారు.

పుస్తకావిష్కరణ చేయవలసిన పెద్దమనిషి ఆవిష్కరణ చేసేశాడు. ప్రసంగాలు మొదలైనాయి. మొదటి వక్త రచయితకు చిన్ననాటి మిత్రుడు. రచయితకూ అతనికీ సంబంధమే తప్ప, సాహిత్యానికీ, ఆయనకీ ఏ సంబంధమూ లేదని ఆయన మాటల వలన తెలిసిపోతున్నది. స్కూలు ఎగ్గొట్టి జామకాయల దొంగతనం చేసింది మొదలుకొని కాలేజీలో అమ్మాయిలనెలా ఏడిపించారో, మంచి మసాలా నింపి మరీ, ఆసక్తికరంగా సస్పెన్స్ థ్రిల్లర్‍లో వివరిస్తుంటే ఆ కాస్సేపు అది సాహితీ సభ అని అందరూ మర్చిపోయారు.

ఇక అతని తర్వాత మాట్లాడిన ‘సాహితీవేత్తలు’ అతనికంటే తక్కువేం తినలేదు! కాకపోతే ఆయన రచయితకూ తనకూ వున్న వ్యక్తిగత సంబంధాన్ని వివరిస్తే వీళ్ళేమో పాశ్చాత్య రచయితలకూ, తమకూ ఉన్న సంబంధాలని వివరిస్తున్నారు. రచయిత ఈ పుస్తకంలో రాసిన విషయాల గురించి, స్పానిష్, లాటిన్ భాషల్లోని రచయితలు ఎలా రాశారో, మోకాలికీ బోడిగుండుకీ ముడేసి మరీ వివరిస్తున్నారు. మధ్య మధ్యలో నోరు తిరగని రష్యన్, జర్మన్ రచయితల పేర్లు ఉదహరిస్తూ, తమకున్న ‘జ్ఞానసంపద’ నంతా శ్రోతలకు ఉచితంగా పంచుతున్నారు. నేనేమో ఆనంద్ స్వరూప్ గారి వంతుకోసం ఓపిగ్గా ఎదురుచూస్తున్నాను.

ఆనంద్ స్వరూప్ గారిని నేనింతగా అభిమానించడానికి కారణాలున్నాయి. ఆయన రచనల్లోని పాత్రలు సజీవంగా రోజూ మన కళ్ళముందు కనిపిస్తాయి. మనని పలకరిస్తాయి. ఆ వ్యక్తులు తమ సహజమైన పరిసరాలలో, సహజమైన ప్రవర్తనతో మెసులుతుంటారు. పెద్ద పెద్ద ఆదర్శాలూ, నీతులూ బోధించకుండా తమ పరిధిలోనే ప్రవర్తిస్తుంటారు. ఆయన రచనలు చదివిన తర్వాతనే నాకూ రాయాలనిపించింది!

చివరగా మాట్లాడటానికి ఆనంద్ స్వరూప్ గారిని పిలిచారు! అప్పటికే దూరం వెళ్ళాల్సిన జీవులు సంచులు సర్దేస్తున్నారు. మొహమాటానికి మొహం చూపించి, మధ్యలోనే వెళ్ళిపోయిన వారు పోగా, కొద్దిమందే మిగిలారు సభలో!

“గత పదేళ్ళుగా ఒకే సంస్థలో పనిచేస్తున్న అనుబంధం మాది! పరిచయమైన చాలారోజులకు తెలిసింది వీరు కథలు కూడా రాస్తారని! వారి కథల గురించి ఇందాకనే వక్తలు చాలా వివరంగా, సోదాహరణంగా ఇంకా చెప్పాలంటే నాకేమీ మిగల్చకుండా మాట్లాడేశారు! అందుకని నేను వారికి అభినందనలు మాత్రమే తెలియజేస్తూ, వారు మరిన్ని రచనలు చేయాలని, వాటిని చదివి మీరు ఆనందించాలని కోరుతూ ముగిస్తున్నాను!”

నిజానికి ఆయన మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడొచ్చును. కానీ ఔచిత్యం కలిగిన సభామర్యాదను పాటించారనిపించింది. రచయిత స్పందన, వందన సమర్పణతో సభ ముగిసింది.

“నమస్కారం సార్! నా పేరు కమలాకర్! మీ అభిమానిని. మొదటినుండీ మీ రచనలు చదువుతున్నాను. మిమ్మల్ని కలుసుకోవాలని ఈ సభకు వచ్చాను సార్!”

వేదిక దిగి వస్తున్నప్పుడు ఆయన ఎదురుపడి మాట్లాడాను!

“నైస్ మీట్ యూ కమలాకర్! ఏం చేస్తుంటారు మీరు!” ప్రసన్నంగా అడిగారాయన.

“ప్రవేట్‍గా జాబ్ చేస్తున్నాను సార్! అయితే అప్పుడప్పుడు కథలు రాస్తుంటాను సార్! ఇటీవల ‘దివ్య’ వారపత్రికలో నా కథకు రెండవ బహుమతి వచ్చింది” ఎంతో ఉత్సాహంగా చెప్పాను.

“ఓహో! అలాగా! అభినందనలు! దివ్యలో బహుమతి కథలన్నీ చదివానే! అందులో ఏ కథ? కమలాకర్…! ఓహో! ‘రెక్కలు తొడిగిన ఊహ!’ కదూ!”

“అవును. అదే సార్! మీరు చదివారా?” ఆనందంతో అడిగాను.

“చదివాను. చాలా బాగుంది కమలాకర్! కథనం చాలా కొత్తగా ఉంది. నేనప్పుడే ఫోన్ చేయాలనుకున్నాను! మర్చిపోయాను! కానీ కథ నాకింకా గుర్తుంది!” అని నా కథలోని ఒక సన్నివేశాన్ని, కొన్ని వాక్యాలను ఆయన వినిపించారు. నా ఆశ్చర్యానికి అంతులేదు! అంతపేరున్న రచయిత నా కథను చదవడమే గాకుండా, కథలోని వాక్యాలను గుర్తుపెట్టుకొని అభినందిస్తూ వుంటే, కొంత గర్వంగా అనిపించింది. సాధారణంగా పెద్ద రచయితలు నాలాంటి అనామకుల రచనలు చదవరనే నా అపోహ తప్పని తేలింది.

“మీ మార్గదర్శనం కోసం మీ వద్దకు రావాలని వుంది! రావచ్చునా సార్!”

“మార్గదర్శనమా? అంతపెద్ద మాటలెందుకు గానీ, రండి! తీరిగ్గా మాట్లాడుకుందాం! నా నెంబర్ ఫీడ్ చేసుకో! వచ్చేటప్పుడు ఫోన్ చేస్తే, ఎలా రావాలో చెప్తాను! మరోమాట! నేనుండేది సిటీకి ఔట్ స్కర్ట్స్‌లో ఉండే ఊళ్ళో! రాగలవా అంతదూరం.”

“తప్పకుండా వస్తాను సార్!

“సరే! అయితే వచ్చేటప్పుడు నీ ఇతర రచనల కాపీలు తీసుకురా! చదివేస్తాను”

“అలాగే సార్!”

నాకు చాలా సంతోషం అనిపించింది.

***

ఫోన్ చేస్తే సాయంత్రం రమ్మన్నారు. బయల్దేరాను. ఆయనని ఏమేం ప్రశ్నలు అడగాలో ఆలోచిస్తున్నాను బస్ ప్రయాణంలో. కథా రచనలో నాకున్న అనేకానేక అనుమానాలను ఆయన్ని అడిగి తీర్చుకోవాలి. ఇంతకూ ఆయన ఎలా ట్రీట్ చేస్తారోనన్న భయమూ వుంది. పేరున్న రచయితనే కాబట్టి, బహుశా బిజీగానే వుంటారు. నాకెంత సమయం కేటాయిస్తారో చూడాలి! ఆయనతో గడిపే ప్రతి నిమిషాన్నీ నేను సద్వినియోగం చేసుకోవాలి!

నిజంగానే సిటీ వాతావరణానికి చాలా దూరంగా వుంది ఆ వూరు. కాకపోతే హైవేను ఆనుకొని వుండటం వలన కనెక్టివిటీ ఎక్కువగా వుంది. ఎప్పుడంటే అప్పుడు సిటీకి తేలిగ్గా రావచ్చు పోవచ్చు.

ఆయన చెప్పిన గుర్తుల ప్రకారం ముందుకు వెళ్తున్నాను. ఒక మోస్తరు పల్లెటూరులా వున్నా ఆధునిక జీవితపు హంగులన్నీ కనిపిస్తున్నాయి. ‘ఆనంద నిలయం’ కనిపించింది! గేట్ పైనున్న కమాన్‍పైన ఒక పూలతీగ నిండా పూసి వుంది. గేటుకు వున్న కాలింగ్ బెల్ నొక్కాను. ఆయనే వచ్చి గేటు తీశారు.

“రా! రా! కమలాకర్! సంతోషం! అంతదూరం నుండి మా ఇంటికి వచ్చావు!” అత్మీయంగా ఆహ్వానించి చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళారు. ఆయన స్పర్శ ఊళ్ళోని మా నాన్నగారిని గుర్తుకు తెచ్చింది. ఆయన కొడుకు వయసు నాది.

గేటుకీ ఇంటికీ మధ్య చాలానే దూరం వుంది. తోవకు రెండు ప్రక్కలా రెండు మూడూ రకాల పూలచెట్లు విరగబూసి, రకరకాల రంగుల్లో కనువిందుగా వున్నాయి. పక్కన ఖాళీ స్థలంలో కూరగాయల మొక్కలూ, తీగలకు పందిళ్ళు కనిపిస్తున్నాయి. కాంపౌండ్ గోడనానుకుని మామిడి, వేప, కరివేప, మునగచెట్లూ ఇంకానాకు పేరు తెలియని చెట్లన్నీ వరుసగా కొలువుదీరిన హరిత వన దేవతల్లాగా ఉన్నాయి. పోర్టికో లాంటి పొడుగాటి వరండాలో ఐదారు కుర్చీలు, ఒక ఊయల బల్ల ఉన్నాయి. ఆనంద్ స్వరూప్ గారు ఊయల బల్లమీద పరిచిన మెత్తని బెడ్‍షీట్‍పై కూర్చుండి ఎదురుగా కుషన్‍తో వున్న కుర్చీని నాకు చూపించారు.

“చాలా బాగుంది సార్! మీ ఇల్లు! నాకు ఊళ్ళో వున్న మా తోట గుర్తుకు వస్తున్నది మీ హరిత వనాన్ని చూస్తే!”

“ఏం చెయ్యమంటావ్ బాబూ! సిటీలో ఏ మారుమూల అపార్ట్‌మెంట్ చూసినా ప్లాట్లు కోట్లలో ఉంటున్నాయి. అదే డబ్బుతో ఇక్కడ కొంత విశాలంగా ఉంటుందని కొనేశాను! ఇంత ఓపెన్‍గా, గ్రీనిష్‍గా సిటీలో వుండటం సాధ్యం కాదు గదా! అదీగాక రిటైరయిపోయాక నాకు సిటీతో ఇప్పుడేం పనిలేదు! ఎక్కడున్న ప్రశాంతంగా ఉండటమే నాకిష్టం!”

నేననుకున్నదానికి చాలా భిన్నంగా వున్నాయి ఆ పరిసరాలు! దర్పం ఉట్టిపడే కృత్రిమ అలంకరణలతో ఆధునికత తప్పనిసరిగా కొనిపించే అనేక వినియోగ వస్తువులతో నిండిన ఇల్లు వుంటుందనుకున్నాను. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నతమైన పదవిలోనే పనిచేశారట! పైగా రచయిత! ఆ మాత్రం ఠీవి ఉండకపోతుందా అనుకున్న నాకు ఇక్కడ అంతా సాదాసీదాగా సహజంగా, స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి. అయితే ఆ సాదాతనంలో ఒక హుందాతనం కనిపించింది నాకు. మొత్తానికి నాకు ఆ వాతావరణం చాలా సౌకర్యవంతంగా ఉండి, ఒక ధైర్యాన్ని కల్పించింది, వారిని ఏదైనా అడగటానికి!

“సుజాతా! ఒకసారిటు వస్తావా?”

ఆయన శ్రీమతి లోపలి నుండి వచ్చింది. చాలా నిరాడంబరంగా ఉంది. మొహంలో ప్రసన్నతతో కూడిన చిరునవ్వు ఆమెకు ఆభరణంగా అమరింది!

“ఇందాక చెప్పానే! ఈయన కమలాకర్! ఇప్పుడిప్పుడే కథలు రాస్తున్నాడు! కానీ బాగా రాస్తున్నాడు!” పరిచయం చేశారాయన.

“నమస్కారమమ్మా!” లేచి నమస్కరించాను.

“నమస్కారం బాబు! కూర్చో! సంతోషం! మా ఇంటికి వచ్చావు!” అంటూ కొంచెం సేపు కూర్చొని నా వివరాలడిగి, చాయ్ తెస్తానని లోపలికి వెళ్ళింది.

ఇంతదాకా ఏమేం రాశానో అడిగి తెలుసుకున్నారు. దివ్యలో వచ్చిన కథ గురించి మళ్ళీ ఒకసారి మెచ్చుకుంటూ మాట్లాడినారు. కథకు ఆ విషయాన్ని ఎన్నుకోవడం తనకు బాగా నచ్చిందన్నారు. నేను అసలు విషయం మొదలుపెట్టాను.

“మీ కథలన్నీ చాలా వైవిధ్యంగా ఉంటాయి. అసలు ఒకదానికొకటి పోలికే వుండదు. ప్రతి కథలోనూ ఒక కొత్త జీవితాన్ని పరిచయం చేస్తారు. ఇంత సృజనాత్మకత ఎలా సాధ్యమయింది!”

“సృజనాత్మకత ఒక వ్యక్తి ప్రతిభకు సంబంధించిన విషయం. సృజనాత్మక ఆలోచనలు అధ్యయనం ద్వారా సాధ్యమవుతాయి. దానికి షార్ట్‌కట్స్ ఏవీ వుండవు! ఇక వైవిధ్యమంటావా ఏ వర్గానికి చెందిన జీవితాలైనా, ఏ పరిసరాలకు చెందిన జీవితాలైనా అన్నీ ఒకే మాదిరిగా ఉండవు గదా! వేటికవే వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. ఆ సహజ పరిణామాలను రచయిత అధ్యయనం చేసి, తనదైన శైలిలో అక్షరబద్దం చేసి పాఠకులకు కొత్తదనాన్ని అందించగలగాలి! అధ్యయనం చేసి రాసినపుడు ఖచ్చితంగా మంచి రచన పుడుతుంది!”

“అంత లోతుగా జీవితాలనూ, సమాజాన్నీ అధ్యయనం చేసే ఓపికా, సహనం ఇప్పటి రచయితల్లో ఉందంటారా?”

“నేను ఉందన్నా, లేదన్నా – ఉందో, లేదో వారి రచనలే చెప్తాయి గదా! నువ్వన్నట్లు ఇప్పుడు చాలామంది రచయితలు ఒక సంఘటననో, చిన్న విషయాన్నో తీసుకొని, దానికి తమ భాషాసృజనాత్మకతను జోడించి! …..! నిజానికి నా దృష్టిలో అది అనవసర ‘భాషావాచలత’! ….. అలాంటివి మరికొన్నింటిని కలిపి ఎడాపెడా కథలు రాసేస్తున్నారు! కానీ…. అవేవీ కాలానికి నిలిచే కథలు కావు!”

“అందుకనే ఎన్ని కథలు చదివినా, ఒక మంచి కథ చదివామన్న తృప్తి ఉండటం లేదు” నా అభిప్రాయాలను నిర్మొహమాటంగా చర్చించే వాతావరణం ఉందక్కడ!

“తృప్తి ఎలా వుంటుంది కమలాకర్! రచయితల ఊహలకు కూడా అందని సంక్లిష్టమైన సంఘర్షణలతో నిండి వున్నది ఈ ఆధునిక సమాజం. ఆ సమాజం ద్వారా ప్రభావితమైన జీవనశైలి కూడా ఏ రచనకూ లొంగనంత అస్తవ్యస్త మలుపులతో నిండి ఉన్నది. ఈ నేపథ్యంలో వాస్తవాలు రాయడానికి రచయితకు ధైర్యం కావాలి! నిజాయితీ ఉండాలి! అక్షర నిరాడంబరత ఇంకా ముఖ్యం!”

“మీరన్నది అక్షరాలా నిజం సార్! కథల్లో చదివే జీవితాలు ఎక్కడా కనబడవు! అసలు అలాంటి వ్యక్తులు ఎన్నడూ తారసపడరు. మరి ఈ రచయితలకు ఎక్కడ దొరుకుతారో అర్థం కాదు!”

“వాస్తవానికి కొంత కల్పన జోడించడం, పాఠకుడిని కథలో లీనం చేసే నాటకీకరణ కూడా కథకు అవసరమే! కానీ నేడు అవి మాత్రమే ఉండి అసలు కథ ఉండటం లేదన్నది సీరియస్‍గా సాహిత్యాన్ని చదివేవారి ఆరోపణ!”

“రచయితలు తాము రాస్తున్న విషయం గురించి ప్రాథమిక అవగాహన కూడా కలిగిలేనటువంటి సందర్భాలను కూడా కొన్ని కథల్లో, రచనల్లో చూశాను సార్!”

“కమలాకర్! నీ అభిప్రాయాలు వింటుంటే చాలా పుస్తకాలను చదివి, మంచి అవగాహన కలిగివున్నట్లనిపిస్తోంది! అయితే, చాలాసార్లు వచ్చిన చిక్కేమిటంటే రచయితలు, భౌతికంగా, మానసికంగా తాము ఏర్పాటుచేసుకున్న కంఫర్ట్ జోన్‍ను దాటటానికి భయపడి, తన చుట్టూ గీసుకున్న గిరిలోనే వుంది రాయడం జరుగుతున్నది!”

“పాఠకులు కూడా ఈ కంఫర్ట్ జోన్‍కు అలవాటు పడిపోయారనిపిస్తుంది!”

“అలవాటు పడిపోయారన్నదానికన్నా ఇలాంటి రచనలు ప్రచురించే మాధ్యమాలు వారికి ఆ అలవాటు చేశాయనిపిస్తుంది. కానీ రచయితలు తమకున్న ఈ సౌకర్యవంతమైన పరిధిని దాటి, కొంత పరిశోధన మరికొంత పరిశీలనా చేసి రాస్తే తప్పకుండా ఈ మూసను ఛేదించే రచనలు వస్తాయి. అవే కాలానికి నిలబడతాయి కూడా! నువ్వు గమనించావో లేదో ఇటీవల తెలుగు కథా నవలా సాహిత్యంలో ఈ మూసను ఛేదించి, పాఠకులకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే రచనల జోరు పెరిగింది! ఇదొక మంచి పరిణామం!”

“చదువుతున్నాను సార్! చాలా కొత్త పరిసరాలను, జీవితాలనూ పరిచయం చేసే నవలలు వస్తున్నాయి. ఇటీవల ఒక నవలను చాలా కష్టపడి సినిమాగా కూడా తీశారు! చాలా ఏండ్లు తర్వాత ఒక భిన్నమైన కథాంశం కలిగిన నవలను సినిమాగా తీయడం ఆశ్చర్యం! అద్భుతం! అయితే ఇక్కడ కూడా నాకొక సందేహం ఉంది సార్!

“ఏమిటా సందేహం కమలాకర్!

“క్లాసిక్ నవలలుగా, లేదా గొప్ప రచనలుగా చెప్పుకునే వాటిల్లో పాత్రలు తమ స్థాయికి మించిన లౌక్యాన్ని ప్రదర్శించడం, గొప్ప తాత్వికతతో మాట్లాడటం, లేదా అద్భుతమైన సౌందర్యదృష్టిని కలిగి ఉన్నట్లు చూపించడం హేతుబద్ధంగా అనిపించదు సార్!”

“లౌక్యం, తాత్వికత గురించి నువ్వన్నది కొంత నిజమే కావచ్చు. అయితే సౌందర్య దృష్టి అంటే ‘ఈస్తటిక్ సెన్స్’ మాత్రం ఒక్కొక్కసారి రచయితకన్నా ఆయన సృష్టించిన పల్లెటూరు పాత్రలకే ఎక్కువ. రచయిత సమగ్రంగా చిత్రీకరించకపోవచ్చును. అది ఆ రచయిత స్వయంగా ఆ జీవితాన్ని అనుభవించినా నిశితమైన గమనింపూ, దృష్టి ఉంటే తప్ప సాధ్యపడదు! ఒక పల్లెటూరి రైతు తన చుట్టూ వున్న ప్రకృతితో మమేకమై జీవిస్తూ, వుంటాడు. ఆ ప్రకృతిలోని ప్రతి చెట్టూ, పుట్టా, వాగూ, వంకా అతనికి సహజమైన సృజనను నేర్పుతాయి. ఒక రైతన్న పండుగ కోసం తన జోడెద్దులను అలంకరించిన తీరు గమనిస్తే, ఆ కంపోజిషన్, ఆ సౌందర్య దృష్టి ప్రపంచంలోని ఏ కళా సూత్రాలకూ తీసిపోనిదిగా వుంటుంది!”

“మీరు చెప్తుంటే మా నాయన మా ఇంటి ఎడ్లమీద వేసే ‘జూండ్లు’ గుర్తుకువస్తున్నాయి. జూను అనేది ఒక అద్భుతమైన కాంపోజిషన్ కలిగిన వస్త్రకళాఖండం! దానితో పాటు జత కలిసే తోలుపటకాలపై డిజైనులు, గంటలు, గుగ్గుర్లు, జనపనారతో అల్లిన పూలమాలలు! నిజంగా ఒక అద్భుత సౌందర్య ప్రపంచం!”

“అవి తయారుచేసిన వారూ, వాటిని ఉపయోగించేవారూ తమ చుట్టూ వున్న ప్రకృతి నుండి ప్రేరణ పొందుతారు. వారి ప్రేరణను అక్షరబద్దం చేయగలగాలి రచయిత!”

“ఇవే కాదు సార్! సాహిత్యం వైపు చూస్తే, గ్రామీణులు అసంకల్పితంగా అప్పటికప్పుడు కైగట్టి పాడుకునే జానపదగీతాల్లో మన ఊహలకందని వర్ణనలు కనిపిస్తాయి!”

“నిజమే! సద్దిమూటను తలమీద పెట్టుకొని, పొలం గట్టుమీద వయ్యారంగా నడిచివచ్చే పల్లె పడుచు అందాలను, అప్పటికప్పుడు కైగట్టి వర్ణించే పడుచుపిలగాడి పాట, ఆధునిక కవిత్వంతో సరితూగుతుంది! సహజమైన అనుభూతికి లోనయితే తప్ప అలాంటి సాహిత్యం పుట్టదు. పొలం గట్ల మీద మట్టి అంటకుండా నడిచి, రైతు జీవితం గురించి రాస్తానంటే ఆ రచన మట్టివాసన (అంటకుండా) పంచకుండా మిగిలిపోక తప్పదు!

“గ్రామీణ నేపథ్యంలో రాసే కథల్లో ఎక్కువగా వారు దోపిడీకి గురయ్యే విధానం, దానిమీద తిరుగుబాటు ప్రకటించే థిక్కార ధోరణి ఇవే ఎక్కువగా కనిపిస్తాయి.”

“కనిపించనీ! వారి కష్టాలూ కన్నీళ్ళు రాయనీ! తరతరాలుగా ఆ వర్గం వారు ఎదుర్కొంటున్న వివక్షనూ, వారిలో వస్తున్న చైతన్యాన్ని ఎత్తిచూపనీ! కానీ ఆ చేత్తోనే వారికే ప్రత్యేకమైన నైపుణ్యాల గురించీ, వారి అనుభవాలూ – ఆనందాల గురించీ, జీవితాల మీద వారి వ్యాఖ్యానాల గురించీ రాయాలి! అయితేనే పాఠకుడికి మరోవైపున్న నిజాలు తెలుస్తాయి కదా!”

“అలా రాయాలంటే ముందు రచయితకు ఆ మరోవైపున్న నిజాలు తెలియాలి కదా! అవి అధ్యయనంలో మాత్రమే తెలుస్తాయి! ఆ ఓపికా, తీరికా రచయితల్లో ఇంకా చెప్పాలంటే మన తెలుగు రచయితల్లో కరువైనాయని నాకనిపిస్తుంది.”

“బాబూ! ఇప్పుడు చాలామంది రచయితలు రాయాలని రాస్తున్నారు తప్ప రాయకుండా వుండలేని పరిస్థితుల్లో కాదు! రచయిత అనుభవాలూ – అనుభూతులూ రచనకు మూల స్తంభాలుగా నిలుస్తాయన్న నిజాన్ని వారు గుర్తించాలి!”

జీవితం రొటీన్ అయిపోయిన ఈ మోడ్రన్ లివింగ్‌లో అనుభూతులు మిగలడం కష్టమే సార్!”

“నువ్వన్నది నిజమే బాబూ! జీవితాన్ని కొంత తీరికతో సహనంతో జీవించే ఓపికా, తీరికా ఉంటేనే కొన్ని అనుభూతులైనా మిగులుతాయి! ఉరుకులు, పరుగుల జీవితాల్లో అనుభవాలే తప్ప అనుభూతులకు చోటెక్కడుంది?”

“సార్! అనుభవానికీ అనుభూతికీ గల తేడాని మనం ఎలా గుర్తించగలం?”

ఇంతలో వారి శ్రీమతి చిరునవ్వుతో వచ్చి, చాయ్, బిస్కట్లు టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోయింది. ఆనంద్ స్వరూప్ గారు నా ప్రశ్నకు కొంత ఆలోచనలో పడ్డట్టున్నారు. కొంతసేపటికి ఆయన మొహంలో చిరునవ్వు కనిపించింది!

“కమలాకర్! ఇదిగో! తేడా నీముందుంది! ముందు చాయ్ తీసుకో!”

వారు చెప్పినట్లు చాయ్ తీసుకుని ఒక బిస్కట్ నమిలి, చాయ్ తాగుతున్నాను.

చాయ్ తాగడమన్నది ఒక అనుభవం! దాని రుచిని, పరిమళాన్ని ఆస్వాదించడం ఒక అనుభూతి! అలాగే జీవించడం ఒక అనుభవమైతే, ఆ జీవన పరిమళాలను ఆస్వాదించడం ఒక అనుభూతి!”

వావ్! చాలా సింపుల్‌గా అర్థమయ్యేటట్లు, సూటిగా చెప్పారు సార్! కానీ ఇక్కడే అర్థం కాని విషయం కూడా ఒకటున్నది సార్!”

“ఏమిటి కమలాకర్ చెప్పు”

అప్పటికి ఆయన చాయ్ తాగడం పూర్తయింది.

“కొన్నిసార్లు నాకెంతో బాగా నచ్చి, నేనెంతో ఇష్టపడిన రచనలని కొందరు మేధావులు అంటే విమర్శకులు తమ వాదనా పటిమతో, దాంట్లో ఏమీ లేదనీ, రచయిత నేల విడిచి సాము చేశాడనీ, విమర్శిస్తారు! ఒక్కొక్కప్పుడేమో నాకు అస్సలు అర్థం కాని, ఎన్నిసార్లు చదివినా ఏ అనుభూతిని మిగల్చని, రచనలను ఆకాశానికెత్తి, పొగుడుతారు! అలాంటప్పుడు నామీద నాకే అనుమానం వేస్తుంది. ఆ రచనల గొప్పదనాన్ని గుర్తించగలిగే స్థాయికి నేనింకా ఎదగలేదేమో అనిపిస్తుంది!”

“కమలాకర్! లోతైన అవగాహనతో, నిష్పాక్షికంగా చేసే సద్విమర్శను మనం ఒప్పుకొని తీరాల్సిందే! కానీ వచ్చిన చిక్కేమిటంటే, కొందరు విమర్శకులనబడే మేధావులు, అపారమైన ‘జ్ఞాన’ భారంతో వంగిపోయి….!”

“జ్ఞానభారంతో వంగిపోయా!” నవ్వాను నేను. ఆయనా నవ్వారు!

“అంటే నా ఉద్దేశం వారు చాలా చాలా చదివేసి, ఇక చదవాల్సిందేమీ లేదనుకుంటున్న దశ వచ్చేసి, పరమ అనుభూతి రాహిత్యానికి గురవుతారు! అంటే తామెప్పుడో చదివేసిన, గొప్ప రచనలతో ఇప్పటి వాటిని పోలుస్తూ, అంతమంచి రచనలు మళ్ళీ రానే రావని ఒక గొప్ప ‘మూఢ’ నమ్మకంతో వుంటారు. ఇప్పుడు వస్తున్న ఎంతమంచి రచన అయినా వారిని కదిలించలేదు. వారిలో సహజమైన స్పందనలు కోల్పోయిన స్థితి దాపురిస్తుంది. అదే అనుభూతి రాహిత్యం! నిజానికి అదొక పెద్ద శాపం! అయితే అలాంటి వాటిని పట్టించుకోకపోవడమే మంచిది!”

“ఏది మంచి కథో, ఏది మంచి కథ కాదో తీర్మానించడానికి ఎవరి ఎజెండాలు వాళ్ళు నిర్ణయించుకుని బయలుదేరిన ఈ సమయంలో నాలాంటివారికి మీరిచ్చే సలహా ఏమిటి?” ముందుగా అడగవలసిన ప్రశ్నను చివరగా అడిగాను.

“కమలాకర్! ముందుగా ఎజెండాల గురించి మర్చిపో! నీ స్వంత ఎజెండా కూడా నీ రచనల్లో లేకుండా చూసుకో. నీ చుట్టూ వున్న జన జీవితమే నీ ఎజెండా కావాలి! ఏ విషయం తీసుకున్నా చెప్పే పద్ధతి ముఖ్యం! ఒక శిల్పి శిల్పం చెక్కినంత ఓపికతో దాన్ని చిత్రికపట్టు! ఒకటికి నాలుగుసార్లు తిరగరాయి! ఫలితం నీ ముందుంటుంది! రచయిత స్వయంగా మంచి పాఠకుడైతే తన రచన స్థాయి తెలిసిపోతుంది!”

ఈ లోపున గేటు తీసుకొని ఆ వూరి వాళ్ళు నలుగురైదుగురు లోపలికి వచ్చారు.

“దండాలు సార్! దండాలు! పట్నం బోయిండ్రట గదా! ఎప్పుడొస్తిరి?”

“దండాలు! దండాలు! రాండ్రి ఇట్ల గూసోండ్రి! చిన్నపని మీద పట్నంబోయిన! పగటీలే అచ్చేసిన! ఇగో గీయన మా దోస్తు పిలగాడు! నామెరంగనే రాతలు రాస్తడు. కలుస్తనని అచ్చిండు. మాట్లాడుతున్నం. సుజాతా! సుజాతా! నాలుగైదు చాయ్‍లు పట్టుకొస్తవా? మా దోస్తులచ్చిండ్రు!”

వచ్చిన వాళ్లని దోస్తులని సంభోదించడంతోనే ఆయన ఆ వూరి వాళ్ళతో ఎంతగా కలిసిపోయారో తెలుస్తున్నది! వారు మాట్లాడుతున్నంతసేపు నేను ఆ ఇంటి పరిసరాలను గమనిస్తూ ఆయన జీవనశైలిని అంచనా వేస్తున్నాను. చాలా ప్రశాంతమైన ప్రకృతిని తన చుట్టూ సృష్టించుకొని, నిరాడంబరంగా జీవిస్తున్నారనిపించింది.

“మీరు లేకపోతే భజన అంత గమ్మియ్యది సార్! మీరుంటే మావోళ్ళు గూడా గొంచెం జోష్ తోటి పాడుతరు. ఇయ్యాల మరి అస్తరా? రారా!” అడిగారు.

“లేదు! లేదు! తప్పక వొస్తా! పావుగంట అటీటు అయినా వొచ్చేస్తా!”

చాయ్‍లు తాగి వెళ్ళిపోయారు వాళ్ళు.

“ఇక్కడ ఈ వీధి చివరన విశాలమైన స్థలంలో రామాలయం వుంది కమలాకర్! వారానికి రెండుసార్లు భజన చేస్తారు! చాలా ప్రాచీనమైన గుడి. మళ్ళీ ఊరివారంతా కలిసి బాగా అభివృద్ధి చేసుకున్నారు. పర్మనెంటుగా మైకులూ స్పీకర్లూ అమర్చిన భజన మండపమే వుంది. నువ్వూ వస్తానంటే రావచ్చు. చాలా బాగుంటుంది. భజన తర్వాత భోజనం చేసి బస్సులుంటే వెళ్దువు లేకుంటే ఇక్కడే పడుకుని ఉదయం వెళ్ళిపోవచ్చు”

నిజానికి నాకు ఈ వాతావరణం నచ్చి ఇక్కడ గడపడం ఇష్టంగానే వుంది. కొంతసేపు తటపటాయించేసరికి ఆనంద్ స్వరూప్ గారే మళ్ళీ చెప్పారు.

“ఫర్వాలేదు కమలాకర్! మా ఇల్లు పెద్దదే! ఇబ్బందేం లేదు!” వారితో ఒకరోజు గడిపే అవకాశం లభించినందుకు సంతోషంగా వుంది.

***

భజన మొదలయింది. తబలా, హార్మోనీ చెవులకింపుగా వున్నాయి. ప్రత్యక్షంగా వాటి నాదాన్ని విన్నట్టు నాకు గుర్తులేదు! చాలా కొత్తగా అనిపిస్తుంది. ఒకటి రెండు కీర్తనలు అయేదాకా బెరుకు బెరుకుగా ఉన్న నేను, అనుకోకుండా వారితో పాటు గొంతు కలపడమే గాకుండా, అసంకల్పితంగా గొంతెత్తి పాడటం కూడా మొదలుపెట్టాను. నా గొంతు నాకే కొత్తగా వుంది. హార్మోనియం శృతిలో కలిపి పాడుతుంటే ఎంతో శ్రావ్యంగా వినిపిస్తున్నది. అసలు ఇన్నాళ్ళూ నేనేం కోల్పోయానో నాకే ఆశ్చర్యంగా ఉంది, ఈ భజనలో పాల్గొన్న తర్వాత! ఆనంద్ స్వరూప్ గారయితే భజనలు పాడటంలో ఎంతో అనుభవమున్నవారిలా అనిపిస్తున్నారు. ఆయన గళ మాధుర్యం అద్భుతం అని చెప్పకపోయినా, అపశృతులు మాత్రం లేవు. ఎంతో అభ్యుదయ భావాలతో రచనలు చేసే ఈయనకు ఇంత భక్తా!

విరామ సమయం! చాయ్ వచ్చింది!

“ఎలా వుంది కమలాకర్! ఎంజాయ్ చేస్తున్నావా? బోర్ ఫీలవుతున్నావా?”

“సార్! నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను సార్! నేను గొంతెత్తి పాడటం ఇదే మొదటిసారి. కొత్తగా వుంది” నా ఆనందం నా మాటల్లో ఆయనకు తెలుస్తూనే వుంది.

“మీరిలా గుడికి వచ్చి ఇంత భక్తితో భజన చేస్తారని నేనూహించలేదు. మీ రచనలకూ, మీ భక్తి భావానికి నాకు పొంతన అందడం లేదు సార్!”

“బాబూ! మనకు నిజమైన ఆనందాన్నీ మానసిక సంతృప్తినీ ఇచ్చే ఏ పనినైనా మనం భేషజాలు లేకుండా చేసుకోవాలి! నువ్వన్నావే ఇంత భక్తా అని! భక్తి ఎవరికి వారికే వ్యక్తిగతం! కానీ ఇదొక సామూహిక ఆనందం! ఇలాంటిదాన్ని కూడా మన మేధాశక్తితో చర్చకు పెట్టి, దేవుడి పేరుమీద జరిగే తతంగాలన్నీ బూటకాలే అనీ, అసలు నైవేద్యం దేవుడి పేరుమీద మనమే తినేస్తున్నామని ఇలా అనేక రకాలుగా వాస్తవాలను మాట్లాడవచ్చును. కానీ మనకు కనిపించినదాన్నల్లా మంచీ, చెడూ అంటూ జడ్జ్ చేస్తూ పోతే మిగిలేదేమీ వుండదు! గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరడం కాని పని.”

“సార్! మీరొక కథలో చెప్పిన మాట నాకిప్పుడు గుర్తుకు వస్తున్నది!”

“ఏమిటా మాట కమలాకర్!”

“ఇన్నోసెన్స్ ఇన్ లివింగ్! ఇంటలిజెన్స్  ఇన్  థింకింగ్! అని రాశారు ఒక కథలో! అప్పుడా మాటకు పెద్దగా అర్థం స్ఫురించలేదు కానీ ప్రాక్టికల్‍గా మీ జీవనశైలిని చూశాక, మీరు అనుభూతి చెందే ఆ మాట రాశారు అని నాకర్థమయింది!”

“నిజానికి ఆ మాటలు నావి కావు! మేధావులెవరో చెప్పిన జీవిత సత్యమది! కానీ ఆ మాటలని నిజం చేయడానికి జీవితం పట్ల గొప్ప కమిట్‍మెంట్ ఉండాలి!”

మరో కీర్తన మొదలయింది! నేనూ రెట్టించిన ఉత్సాహంతో వంత పాడుతున్నాను. ఒకానొక పరవశత్వపు అనుభూతి దొంతరలు నా మనసునిండా నిండిపోయి నన్ను, నేనెప్పుడూ అనుభూతి చెందని ఆనందాల అంచులకు నడిపిస్తున్నాయి.

కొత్త జీవన పరిమళమేదో నా మనసు పుటాలను తాకుతూ నాలో చేరిపోతూ వుంది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here