[box type=’note’ fontsize=’16’] తెలుగువారి వెయ్యేండ్ల సారసత్వంలో అవధాన ప్రక్రియ విశిష్టమైనది. ఈ శీర్షిక ద్వారా అవధాన విద్య గూర్చిన సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]
ప్రాచీన అవధాన గురు పరంపర:
[dropcap]20[/dropcap]వ శతాబ్దంలో తిరుపతి వెంకటకవుల అవధాన ప్రదర్శనలు తిలకించి ఎందరో కవులు వారి శిష్య పరంపరలో చేరారు. వారిలో వేలూరి శివరామశాస్త్రి, అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి, జంధ్యాల సుబ్రమణ్యశాస్త్రి, పింగళి-కాటూరి కవులు, నెమలూరి వెంకటశాస్త్రి, ఓలేటి వెంకటరామశాస్త్రి ప్రముఖులు. అవధాన విద్య ఆంధ్రదేశమంతా విస్తరిల్లి పలువురు ప్రదర్శనలు జయప్రదంగా చేశారు. వేంకటరామకృష్ణ కవులు, కొప్పరపు సోదర కవులు, కోట సోదర కవులు, రాజశేఖర వేంకటశేష కవులు, పల్నాటి సోదర కవులు, సత్యదుర్గేశ్వర కవులు జంటలుగా ప్రదర్శనలిచ్చారు. వ్యక్తులుగా పిశుపాటి చిదంబరశాస్త్రి, దోమా వెంకటస్వామి గుప్త, గాడేపల్లి వీర రాఘవ శాస్త్రి, పోకూరి కాశీపతి, శ్రీరాం వీర బ్రహ్మకవి, పోతుకుచ్చి సుబ్రమణ్యశాస్త్రి, ప్రతివాది భయంకర రాఘవాచార్యులు, ప్రభాకర శాస్త్రులు, నెల్లూరి కాళహస్తి కవి, మండ నరసింహం, జంధ్యాల సుబ్రమణ్యశాస్త్రి, ప్రభృతులు ఆనాటి అవధాన శేఖరులు. వీరిలో కొందరు శతావధానాలే కాక సహస్ర, పంచసహస్రావధానాలు చేశారు.
ప్రాచీన కవులలో శ్రీనాథుడు ‘శివరాత్రి మాహత్యం’లో ‘అష్టావధానముల క్రీడించువారు’ అనీ; తెనాలి రామకృష్ణుడు ‘ఉద్భటారాధ్య చరిత్ర’లో ‘అవధానంబున నుండి శంకర కథా వాసక్తి భాసిల్లుచున్’ అనీ; శ్రీనాథుడు ‘హరవిలాసం’లో ‘అవధానంబున పాకశాసన సుతుండు’ అనీ ఏకాగ్రత గూర్చి పలికారు. పుష్పగిరి తిమ్మన తన శతకత్రయ గద్యంలో ‘కవిత్వ విద్యావధాని’నని సగర్వంగా పలికాడు.
19వ శతాబ్ది:
కృష్ణాజిల్లా నూజివీడు సంస్థాన ఆస్థాన కవి విద్వాన్ మాడభుషి వేంకటాచార్యులు తొలిసారిగా అష్టావధాన, శతావధానాలకు లక్షణం నిర్వచించి స్వయంగా అష్టావధాన, శతావధాన ప్రదర్శనలిచ్చి మెప్పు పొందారు. 1854లో నూజివీడులో అష్టావధానాలు, 1872లో ఆగిరిపల్లిలో, 1879లో పిఠాపురం సంస్థానంలో వేంకటార్యులు శతావధాన ప్రదర్శనలిచ్చి సత్కృతులందుకొన్నారు.
సాహిత్యేతరం:
పద్మశ్రీ డా. ఆశావాది ప్రకాశరావు తమ గ్రంథం – ‘అవధాన సాధన’లో “కుంటిమద్ది వాస్తవ్యులు తిరుమల రామాచార్య అసాధారణ ధారణా సామర్థ్యం గల వ్యక్తి. ఆయన సాహిత్యేతరావధానం మద్రాసులో ప్రారంభించారు. 100 మంది ఆంగ్లేయ జంటలను వీరికి పరిచయం చేసి, ఆ తర్వాత స్త్రీ పురుషులను విడివిడిగా కూర్చోబెట్టారు. కొంత విరామం తరువాత ఆయా జంటలను చూపి ఆందరినీ ఆశ్చర్యపరిచారు. మదరాసు గవర్నరు వీరిని కీర్తించారు. ఆంగ్లేయులు కట్టు, బొట్టు, రంగు పొంగులలో ఒకే విధంగా ఉంటారు. కొన్ని సందర్భాలలో స్త్రీలెవరో, పురుషులెవరో గుర్తు పట్టడం కష్టమే! అయినా ఈ జటిల పరీక్షలో నెగ్గి అవధానానికి అంతః ప్రాణమైన జ్ఞాపకశక్తి ప్రదర్శించారు” అంటారు.
సాహిత్యావధానుల పురం అనంతపురం:
తిరుమల బుక్కపట్టణం రాఘవాచార్యులు, శ్రీనివాసాచార్య అనే పండితులు అవధానులు. రాఘవాచార్యులు కువలయాశ్వ విజయ పద్యకావ్య రచయిత. సంస్కృతాంధ్రాంగ్ల భాషలు మూడింటిలో అష్టావధానం చేసి మాడభూషి వేంకటాచార్యుల అభినందన లందుకొన్నారు. శ్రీనివాసాచార్యులు సంస్కృత ప్రాకృతాది అష్ట భాషాలలో ఆశుకవిత్వం చెప్పారు. మైసూరు మహారాజు సత్కారం పొందారు. తిరుపతి వెంకట కవులు ఒకానొక సందర్భంలో – ‘ఏనుగు నెక్కినాము ధరణీశులు మ్రొక్కగ నిక్కినాము’ అనే పద్యం వీరి సమక్షంలోనని భావిస్తారు.
ధర్మవరం రామకృష్ణమాచార్యులు ప్రసిధ్ధ నాటకకర్తయే గాక అవధాని. అల్లసాని రామనాథ కవి (పామురాయి), సోంపల్లి కృష్ణమూర్తి (కొక్కంటి) అష్టావధాన, శతావధాన ధురీణులు. 20వ శతాబ్ది పూర్వార్థానికి చెందిన జోస్యం జనార్దన శాస్త్రి (కర్నూలు), నాలుగు అష్టావధానలు చేసి హైదరాబాదులో కనకాభిషేకం పొందారు. పుట్టపర్తి నారాయణాచార్యులు (చియ్యేడు) తిరుపతిలో విద్వాన్ చదివే రోజుల్లోనే ఇరవై అవధానాలు చెశారు. వీరి శివతాండవ రచన సుప్రసిద్ధం. వీరిని భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. కడప ప్రభుత్వ కళాశాలలో నేను (పద్మనాభరావు) 1976 నవంబరు 18న చేసిన అష్టావధాన ప్రదర్శనకు పుట్టపర్తి వారు సభాధ్యక్షులు. ఆధ్యక్షోపన్యాసంలో వారు నాకొక హితవు చెప్పారు.
“గ్రంథ రచనపై ఆసక్తి చూపించు! అవధానాలు తాత్కాలిక ప్రయోజనాలు” అన్నారు.
ఆ సభలో నేను సభాధ్యక్ష స్థానంలో వున్న పుట్టపర్తి వారిపై ఆశువుగా ఇలా పలికాను:
“తరతరాల సంపద శివతాండవంబు
తెలుగు భారతి కర్పించే వెలుగు మీర
పుట్టపర్తి నారాయాణ బుధుడు గురుడు
త్వరగ చూతుము మేము ఆస్థాన కవిగ.”
అప్పట్లో ఆయనకు ఆస్థానకవి పదవి లభించవచ్చనే ఊహాగానాలు ప్రబలంగా ఉన్నాయి.
20వ శతాబ్ది ద్వితీయార్థంలో తిరుపతి, ప్రొద్దుటూరు, లేపాక్షి ప్రాచ్య కళాశాలల్లో చదువుకొన్న అనంతపురం జిల్లాకు చెందిన పలువురు యువకులు ‘స్పర్ధయా వర్ధతే విద్య’ అనే సూక్తి వలె అవధాన స్పర్ధతో ప్రదర్శనలకు పూనుకొన్నారు. వారిలో కొందరు – డా. కురుడి నాగప్ప (మడకశిర) తమ గురువుగా సి.వి. సుబ్బన్న శతావధానిని పేర్కొన్నారు.
లేపాక్షి ప్రాచ్య కళాశాల అధ్యాపకులైన పమిడికాల్వ చెంచుసుబ్బయ్య ఇరవై దాకా అష్టావధానాలు చేశారు. గౌరిపెద్ది రామసుబ్బశర్మ వీరికి తిరుపతి ప్రాచ్య కళాశాలలో గురువు. శీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆచార్య శలాక రఘునాథశర్మ పర్యవేక్షణలో – త్యాగరాజు కీర్తనలు – ఒక సమీక్ష అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. సాధించారు. వారి సిద్ధాంత గ్రంథానికి పద్మనాభరావు పరీక్షాధికారి.
సింగనమల మండలానికి చెందిన ఆశావాది ప్రకాశరావు అవధాన విద్యకు పద్మశ్రీ పొందిన తొలి వ్యక్తి. ఈ జిల్లాకు చెందిన చక్రాల లక్ష్మీకాంత రాజారావు (ఉరవకొండ) అరవైకి పైగా అవధాన ప్రదర్శనలిచ్చారు. పృచ్ఛక స్థానంలో వీరు కూర్చుంటే సమస్యా రాక్షసులుగా ప్రసిద్ధి. శాంతి నారాయణ (సింగనమల మండలం) విద్వాన్ చదువుతూ అవధానాలు ఆరంభించి ఆరు అష్టావధానాలు చెశారు. వి. వీరభద్రాచారి (కనగానపల్లి) ముప్ఫయి అష్టావధానాలు చేశారు. అవధాన కేసరి బిరుదాన్ని వీరికి సి.వి. సుబ్బన్న ప్రకటించారు.
కర్నూలు జిల్లా వాసి మేడవరం మల్లికార్జున శర్మ లేపాక్షి కళాశాల అధ్యాపకులు. 30 దాకా అష్టావధానాలు చేశారు. బెంగుళూరు వీరి అవధానం చూసి రా. గణేష్ కన్నడంలో అవధానాలు మొదలుపెట్టారు.
ఇతర అవధానాలు:
అమళ్లదిన్నె వెంకట రమణ ప్రసాద్ (ధర్మవరం మండలం) జాతీయోత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత. వారు 20 దాకా అష్టావధానాలు చేసి గ్రంథ రూపంలో ప్రచురించారు. 2020లో అనంతపురం జిల్లా పద్యకవులు అనే బృహద్గ్రంథం సంకలనం చేసి స్వయంగా ప్రచురించిన దిట్ట. మృచ్ఛకటికంపై పరిశోధనకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ పి.హెచ్.డి లభించింది.
బెళ్ళూరి శ్రీనివాసమూర్తి ఆశీస్సులతో గండ్లూరి దత్తాత్రేయశర్మ (డోన్) విద్యార్థి దశ నుంచి అవధానాలు చేసి అసంఖ్యాకమైన అష్టావధాన, శతావధానాలు ప్రదర్శించారు. అవధాన శారద పేర అవధాన పద్య సంపుటి ప్రచురించారు. ఆకాశవాణికి, తిరుమల బ్రహ్మోత్సవాలకు, శ్రీశైలం శివరాత్రికి వ్యాఖ్యాత. స్వర్ణ కంకణ సత్కార గ్రహీత.
సమ్మెట మాధవ రాజు (కొత్త చెరువు మండలం), గురుదేపల్లి నరసింహులు, జోస్యుల సంధానశాస్త్రి (కర్నూలు), మేడికుర్తి పుల్లయ్య (తాడిపత్రి), శంకర గంటి రమాకాంత్ (బత్తులపల్లి మండలం) ప్రభృతులు అవధాన విద్యా వ్యాప్తికి దోహదపడ్డారు.
తొలి మహిళావధాని:
గుంతకల్ రైల్వే జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ అయిన శ్రీమతి మడకశిర కృష్ణ ప్రభావతి తొట్ట తొలి మహిళావధాని. వీరు అనేక ప్రాంతాలలో ప్రదర్శనలిచ్చి సత్కృతులందారు. వీరి అవధానానికి నేను అధ్యక్షత పలుమార్లు వహించాను. ప్రతిబా పాండిత్యాలు గల విద్వాంసురాలు. 1946 ఆగస్టులో కర్నాటక మధురగిరి తాలూకా దొడ్దధాళిలో జన్మించారు. 80 దాకా అష్టావధానాలు నిర్వహించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారాం పొందారు. రాజారావు వీరికి గురువు.
ధూళిపాళ మహాదేవమణి శిష్యరికంలో పలువురు మహిళలు అవధానాలు చేస్తున్నారు. బులుసు అపర్ణ ప్రముఖం. లేపాక్షి నవోదయ విద్యార్థినులు బి. మాధవి (నేత్రావధానం), యం. అరుణ (అంగుష్టావధానం) చేసి కొత్త పుంతలు తొక్కారు. పాత తరానికి చెందిన దోమా వెంకటస్వామి గుప్తా అవధాన శేఖరులు. వారి స్మారకార్థం కడపలో వైశ్య ప్రబోధిని పత్రికా సంపాదకులు పాలాది లక్ష్మీకాంత శ్రేష్ఠి ఏటా పురస్కారాలు అందిస్తూ గత 20 సంవత్సరాలుగా సభా నిర్వహణ చేస్తున్నారు. 2006లో ఈ పురస్కారం పద్మనాభరావుకు లభించింది.
(ఆధార గ్రంథం – అవధాన సాధన – ఆశావాది ప్రకాశరావు – 2015).
(మళ్ళీ వచ్చే వారం)