అందమైన మనసు – 2

0
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి రచించిన ‘అందమైన మనసు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]“అ[/dropcap]న్నీ ఎక్కువే. ఇంతకీ మల్లికార్జున్ ఎలా వున్నాడు? ఆ ఏ.ఎస్.పి గారు ఇన్‌స్పెక్టర్‌తో ఫోన్ చేయించారు కదా! వర్కవుట్ అయిందా?” అడిగింది నివేద.

“అయింది. నా కన్నా ఒక రెండు నిముషాలు ముందే నిద్ర లేస్తున్నాడు”

“అవునా! చాలా హ్యాపీ కదా నువ్వు ఇప్పుడు? మరి ఆ ఏ.ఎస్.పి గారికి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పావా? ఆయన ఆరోజు నీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారుగా స్పెషల్‌గా” అంది నివేద.

“స్పెషల్ ఏం కాదులే. వాళ్ళు ఎవరికైనా అలాగే ఇస్తారేమో. నాకూ ఇచ్చారు. అయినా మల్లికార్జున్ ఉదయాన్నే నిద్ర లేచినా ఒకటే లేవకపోయినా ఒకటే. ఇక నేనేమి పట్టించుకోదలచుకోలేదు” అంది అలేఖ్య.

“అదేంటి అలా అంటున్నావ్? ఏంజరిగింది?” ఆతృతగా అడిగింది నివేద.

“నిద్ర లేవగానే బాల్కనీలో వున్న కుండీల దగ్గరకి వెళుతున్నాడు. వెళ్ళగానే అక్కడున్న పిల్లర్‌ని అనుకుని కళ్ళు మూసుకుని కూర్చుంటాడు. అక్కడేం చేస్తున్నావని అడిగితే ‘కనిపించట్లేదా యోగా చేస్తున్నా. కొద్దిసేపయ్యాక వచ్చి చూడు. ముక్కు మూసుకుని ప్రాణాయామం చేస్తాను. ఇక నన్ను కదిలించకుండా లోపలకి వెళ్ళు’ అంటాడు. అక్కడ యోగా లేదు. ప్రాణాయామం లేదు. కళ్ళు మూసుకుని నిద్ర పోతాడు. బెడ్ రూములో పడుకుంటే వూరుకోనని. ఒట్టి దొంగ” అంది అలేఖ్య.

“మరి ఆ నిద్రేదో బెడ్ రూములోనే పోనీయరాదు. కుండీల దగ్గరెందుకు?” అంది నవ్వి నివేద.

“అవసరం లేదు. అక్కడే పడుకోనీయ్. అలాగైనా కాస్త ఉదయాన్నే బయటకు రావడం అలవాటు అవుతుంది. ఎప్పుడు చూసినా ఆ బెడ్ రూములో కోడిలా ముడుక్కోవటం చూడలేకపోతున్నా. దానికన్నా ఇదే బెటర్” అంది అలేఖ్య.

“అలేఖ్యా! అంటే అన్నానంటావు గానీ అతను కుండీల దగ్గర పడుకోవటం ఏమిటి? ఇదంతా తెలిస్తే అతని తరుపు వాళ్ళు వూరుకుంటారా ? అదీ కాక నువ్వు ఇన్‌స్పెక్టర్‌తో ఫోన్ చేపించి బెదిరించావు” అంది నివేద

“ఊరుకోక ఏం చేస్తారు? అతనితో వుండేది వాళ్ళా, నేనా? నా మొగుడు ఎలా వుండాలో వుంచుకోవలసింది నేనా వాళ్ళా?” అంది అలేఖ్య.

“సరే అలేఖ్యా! నాకు కాలేజీకి వెళ్లే టైమైంది. ఈవినింగ్ కాల్ చేస్తాను” అంటూ కాల్ కట్ చేసింది నివేద.

***

నివేద తల్లితండ్రులు నాగేశ్వరి, బ్రహ్మయ్య సత్యవతిని చూడాలని వచ్చారు. వాళ్ళ వెంట వాళ్ళబ్బాయి చైత్రన్ కూడా వున్నాడు. వాళ్ళను చూడగానే సత్యవతి సంతోషపడుతూ కాలు నొప్పి కూడా మరచిపోయి లేచి తిరిగింది.

వినీల్ పైన తన గదిలో వున్నాడు. డాక్టర్ సహస్ర ఫోన్ చేస్తే మాట్లాడుతూవున్నాడు. సహస్ర ఎప్పుడైనా చాలా ఉత్సాహంగా మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా అలాగే అతనికి నచ్చిన చక్కటి కబుర్లు చెప్పింది. ఇక చాలు నేను నవ్వలేను అని అతను అనేంత వరకు నవ్వించింది.

“సహస్రా! ఈరోజు నువ్విచ్చిన ఈ బలంతో ఎన్ని ఆపరేషన్లు చేస్తానో, ఎంత ఓపి చూస్తానో నాకే తెలియదు. బాబోయ్ ఇన్నిన్ని మాటలు ఎలా వస్తాయి నీకు? నీలో ఏదో వుంది” అన్నాడు వినీల్.

“నాలో ఏముంది డాక్టర్? మీతో మాట్లాడాలన్న కుతూహలం, తపన. అంతే! అంతకుమించి ఏమీ లేదు” అంది.

“అంతకు మించి ఏముందో, ఏం లేదో నాకు తెలుసు. మీ అన్నయ్య మిలటరీలో డాక్టర్ అన్నావ్ కదా! మన గురించి ఆయనతో ఎప్పుడు చెబుతున్నావ్?” అడిగాడు వినీల్.

“అన్నయ్య నన్ను చూడాలని వస్తున్నారు వినీల్! అప్పుడు చెబుతాను. ఇలాంటివి ఫోన్లో మాట్లాడటం బావుండదు. ఒకవేళ ఆయనకు నేను చెప్పేది నచ్చకపోతే ఆయన్ని కన్విన్స్ చెయ్యాలి. అదంతా ఫోన్లో కుదరదు” అంది సహస్ర.

“ఓకే..” అంటూ స్టెత్ పట్టుకుని ఫోన్లో మాట్లాడుతూనే క్రిందకి దిగాడు.

వినీల్‌ని చూడగానే నాగేశ్వరి, బ్రహ్మయ్య “బాగున్నావా బాబు?” అన్నారు ప్రేమగా.

“బాగున్నాను. మీరెలా వున్నారు?” అంటూ చైత్రన్ వైపు చూసి “ ఇప్పుడేం చేస్తున్నావు బావా? అప్పుడు చేస్తున్న జాబేదో కంఫర్ట్‌గా లేదని ఇంటికొచ్చావని విన్నాను. వేరే ఏమైనా ట్రై చేస్తున్నావా?” అడిగాడు వినీల్.

చైత్రన్ వినీల్ కన్నా రెండు సంవత్సరాలు పెద్దవాడు. ఎం.బి.ఎ చేసాడు. వినీల్ దగ్గర చాలా వినయంగా వుంటాడు.

“ప్రస్తుతం ఖాళీగానే వున్నాను వినీల్. చూడాలి. ఏమైనా దొరికేవరకు మా ఊరిలోనే వుంటాను” అన్నాడు.

“మీ ఊరిలో వుంటే జాబ్ ఎలా దొరుకుతుంది? సిటీకి వెళ్లి హాస్టల్లో వుండి జాబ్ కోసం ప్రయత్నించండి బావా!” అన్నాడు వినీల్.

“నాక్కూడా అలా వుండి ప్రయత్నించాలనే వుంది వినీల్! నాన్నతో కూడా చెప్పాను. నాన్న వద్దన్నారు. డబ్బుల్లేవు అన్నారు. ఎలా వెళ్ళాలి డబ్బులేకుండా? ఇంట్లోనే వున్నాను. బోర్‌గా వుంది ఇంట్లో ఖాళీగా వుండాలంటే” అన్నాడు చైత్రన్ తప్పంతా మా నాన్నదే అన్నట్లు.

సత్యవతి, వినీల్, నివేద మౌనంగా చూస్తున్నారు.

బ్రహ్మయ్య వెంటనే భార్య వైపు చూసాడు.

“తప్పంతా మా నాన్నదే అన్నట్లు వాడు చూడు నాగేశ్వరీ ఏమంటున్నాడో. ఈ సంవత్సరం మనకు పంటలు లేవు. మళ్ళీ పంట పెట్టటానికే డబ్బులకు ఇబ్బందిగా వుంది. ఆ విషయం వాడికి తెలియదా? నా దగ్గర డబ్బులు వుండేమైనా ఇవ్వట్లేదా. ఎందుకలా చెబుతాడు? సొంతంగా ఒక్క సెంటు భూమి లేకపోయినా వేరే వాళ్ళ భూమిని కౌలుకి తీసుకుని సాగు చేసి అందులో వచ్చిన డబ్బుతోనే వాడిని ఎంబీఏ చదివించాను. ఇంత చదువు చదివి కూడా ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా గడుపుతున్నాడు. అలా ఉంటే డబ్బులెలా వస్తాయి? అదేమంటే తన చదువుకి సరిపోయే ఉద్యోగం వస్తేనే చేస్తానంటాడు. వస్తుందా? సర్దుకుపోయి ఏదో ఒక పని చేస్తే తప్పేంటి?” అన్నాడు బ్రహ్మయ్య.

నాగేశ్వరి మాట్లాడలేదు.

“ఏదో ఒకటి ఎందుకు చెయ్యాలి అన్నయ్యా. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని వుంటుంది ఎవరికైనా. సర్దుకుపోవటం అనేది ఎక్కడ వున్నా పర్వాలేదు కానీ జాబ్ విషయంలో వుండకూడదు. వాళ్ళు ఎదిగే పిల్లలు. ఎదగనివ్వాలి. వెనక్కి లాగకూడదు. నీ బాధలు నువ్వు పడు. వాటిని పిల్లల మీద పడనివ్వకు” అంది సత్యవతి.

సత్యవతి మాట్లాడిందంటే ఆయన దగ్గర మాటలుండవు. మౌనంతోనే ఆమెను గౌరవిస్తాడు. నాగేశ్వరి కూడా అంతే. వదిన ఏం మాట్లాడినా, ఏం చేసినా ఆమెకు బాగా నచ్చుతుంది. అందుకే వదినంటే ప్రాణం ఆమెకు. నాగేశ్వరి హరనాథరావు సొంత చెల్లెలు.

చైత్రన్ టక్కున లేచి సత్యవతి పక్కకి వెళ్లి కూర్చున్నాడు.

“చైత్రన్ నువ్వేమి కంగారుపడకు. ఒక దారి మూసుకుపోతే ఇంకో దారి తప్పకుండా కనిపిస్తుంది. నువ్వు డబ్బు అడిగేది జాబ్ కోసమే కదా! ఏవో సరదాలకైతే కాదుగా. అలాంటప్పుడు నీకు ఎవరైనా సహాయం చేస్తారు. ఎదిగే మొక్కకి నీళ్లు పోస్తే పుణ్యమే కానీ పాపం రాదు. నువ్వు దైర్యంగా వుండు” అంది.

“అలాగే అత్తయ్యా” అన్నాడు చైత్రన్.

సహాయం ఎవరు చేస్తారో అతనికి అర్థం కాలేదు. ఎవరు చేసినా అందుకోడానికి సిద్ధంగా వున్నాడు. ఎవరైతే ఏముంది. మామయ్య చేస్తాడా? ఆ నమ్మకం లేదు. మేనమామ అన్న పేరే కానీ సెలవుల్లో వచ్చినప్పుడు కూడా మంచి తిండి, కొత్త బట్టలు ఇస్తాడు కానీ డబ్బులు ఇవ్వడు. ఇప్పుడు కూడా ఆయన అంతే. ఆయన్ని ఆశించటం వేస్ట్.

“ఏంటి బావా ఆలోచిస్తున్నావ్?” అడిగాడు వినీల్.

“ఏం లేదు వినీల్” అన్నాడు చైత్రన్ ఉలిక్కిపడి.

“నువ్వేమి ఆలోచించకు బావా! మామయ్య చెప్పేవరకు నాకు మీ పరిస్థితులు తెలియవు. తెలిసాక కూడా మౌనంగా ఎలా వుంటాం. అమ్మ అన్నట్లు నువ్వు డబ్బులు అడిగేది ఉద్యోగం కోసమేగా. నేను ఇస్తాను” అన్నాడు.

“అలాగే వినీల్” అంటున్న చైత్రన్ కళ్ళు నిజంగానే తడిసాయి.

కొడుకు మాటలు విని సత్యవతి కళ్ళు మెరిసాయి. నాగేశ్వరి, నివేద సంతోషంతో మూగవాళ్లయ్యారు.

బ్రహ్మయ్య వినీల్ వైపు చూసాడు.

“వినీల్ చిన్నవాడివి కాబట్టి నిన్ను పొగడకూడదు. కానీ నువ్వు చేస్తున్న పని చాలా గొప్పది. దాన్ని వాడు సరిగ్గా ఉపయోగించుకోవాలి” అన్నాడు.

“ఉపయోగించుకుంటాడు. మీరు ధైర్యంగా వుండండి మామయ్యా” అన్నాడు వినీల్.

“ధైర్యంగానే వుంటాను వినీల్! అమ్మా సత్యవతీ నీ కొడుకులో నువ్వే కనిపిస్తున్నావు. అప్పట్లో నా కూతుర్ని టెన్త్ అయ్యాక నేను చదివించలేక ఇంట్లో వుంచుకుంటే నువ్వే దాన్ని నీ దగ్గర వుంచుకుని బీటెక్ చదివించావు. అదిప్పుడు ఉద్యోగం కూడా చేస్తోంది. దాని దిగులు తీరింది. వీడిని కూడా నీ కొడుకు ఒక దారిలోకి తెస్తున్నాడు. ఇక నాకు భయమేముంది తల్లీ? సంతోషం తప్ప” అన్నాడు బ్రహ్మయ్య.

“సరే మామయ్యా ఇక నేను హాస్పిటల్‌కి వెళ్ళాలి. నువ్వు నాతోరా బావా” అంటూ చైత్రన్‌ని తనతోపాటు కార్లో కూర్చోబెట్టుకుని హాస్పిటల్‌కి తీసికెళ్ళాడు వినీల్.

వినీల్ వెళ్ళేసరికే హాస్పెటల్ మొత్తం పేషంట్లతో కిట కిట లాడుతోంది. కళకళ లాడుతోంది. ఏ డాక్టర్ కైనా కావలసింది ఇదే.

వినీల్ నేరుగా తన గదిలోకి వెళ్ళాడు. చైత్రన్ కూడా వెళ్ళాడు.

“కూర్చో బావా!” అంటూ చైత్రన్‌ని తనకి ఎదురుగా కూర్చోబెట్టుకున్నాడు వినీల్.

పేషంట్లు ఒక్కొక్కరే వినీల్ దగ్గరకి వచ్చి టెస్ట్ చేయించుకుని, మందులు రాయించుకుని వెళుతున్నారు.

వినీల్ ఒక డాక్టర్‌గా ఇప్పుడు ఎంత ఎదిగాడో, ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో ఆ వాతావరణం చూస్తూనే అర్థమైంది చైత్రన్‌కి.

అదంతా చూస్తుంటే అసూయ పడాలో, ఆనందపడాలో తెలియలేదు. ఏదిఏమైనా తన మేనమామ కొడుకు వినీల్ ఇప్పుడు శిఖరాగ్ర స్థాయిలో వున్నాడన్నది మాత్రం ఊహ కాదు నిజం.

ఇంత గొప్ప డాక్టర్‌కి తన చెల్లెలు నివేద భార్య అయితే వినీల్ తను బావమరిది స్థానంలోకి వస్తాడు. అప్పుడు ఇలా కాదు తమ రిలేషన్ ఇంకా బాగుంటుంది. తను డాక్టర్ కాకపోయినా ఈ హాస్పిటల్ మొత్తం పరోక్షంగా తనదే అవుతుంది. వాడుకోవటం రావాలే కాని ఆ బంధం, ఆ చనువు, ఆ చొరవ చాలా బాగుంటుంది.

వినీల్ ముందున్న పేషంట్ వెళ్ళిపోగానే ఇంకో పేషంట్ కోసం “నెక్స్ట్” అని అనకుండా “ఏంటి బావా ఆలోచిస్తున్నావ్?” అని అంటూనే కొంత డబ్బు తీసి చైత్రన్‌కి ఇచ్చాడు వినీల్.

“ఏంలేదు వినీల్” అంటూనే వినీల్ ఇచ్చిన డబ్బుని మహాప్రసాదంలా తీసుకున్నాడు చైత్రన్.

“బావా నువ్వు సిటీకి వెళ్లి ఎలాంటి జాబ్ చెయ్యాలనుకుంటున్నావో సర్చ్ చెయ్యి. అవసరమైతే కోర్సెస్ కూడా నేర్చుకో. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ పేరుతో నీ అకౌంట్‌కి మనీ పంపుతాను. నీకు డ్రైవింగ్ వచ్చుగా. మన కారులో ఇంటికెళ్ళు. నీకోసం అత్తయ్య, మామయ్యలు చూస్తుంటారు” అన్నాడు వినీల్.

“ఇటునుండి ఇటే సిటీకి వెళతాను వినీల్! వెళ్ళాక ఫోన్ చేస్తాను. అమ్మా, నాన్నలు రెండు రోజులు ఇక్కడే వుండి ఊరు వెళ్తారు. నేనిప్పుడు వెళితే నన్ను కూడా వాళ్లతో వుండమంటారు. వెళ్లనివ్వరు” అంటూ లేచాడు చైత్రన్.

“ఓకే బావా! ఆల్ ద బెస్ట్” అని వినీల్ అనగానే చైత్రన్ వెళ్ళిపోయాడు.

చైత్రన్ వెళ్ళగానే తరువాత పేషంట్ లోపలకి వచ్చాడు.

***

అలేఖ్య నివేదకు ఫోన్ చేసి “వేదా! ఎక్కడున్నావ్? నిన్ను అర్జంటుగా కలవాలి?” అంది.

“ఇంట్లోనే వున్నా. మొన్ననే అమ్మా, నాన్నా వచ్చారు. రేపు వెళతారట. నువ్వు కూడా వాళ్ళను చూడాలన్నావుగా. ఇంటికే రా” అంది నివేద.

“సరే వస్తున్నా” అంటూ ఫోన్ కట్ చేసి ఆ ఫోన్ని కోపంగా బెడ్ మీదకు విసిరేసింది అలేఖ్య. వెంటనే నివేద దగ్గరకి వెళ్ళింది.

అలేఖ్యను చూడగానే తన గదిలోకి తీసుకెళ్లింది నివేద.

“ఏంటే అలా వున్నావ్? తన మీద కంప్లైంట్ చేసావని మల్లికార్జున్ కొట్టాడా ఏం?” అంది కంగారుగా నివేద.

“కొట్టడం కాదు. అంతా తిక్కతిక్కగా చేస్తున్నాడు. అతను చేసే ఏ పనీ నాకు నచ్చటం లేదు. చెప్పుకోడానికే సిల్లీగా వుంది. గిల్టీగా వుంది. అసలు నాకేంటే ఈ బాధ? నా బ్రతుకంతా అతని గురించి ఆలోచించటమేనా? ఇప్పుడు మనం ఏ.ఎస్.పి గారి దగ్గరకి వెళదాం” అంది అలేఖ్య.

“ఏ.ఎస్.పి గారి దగ్గరికా? అదేదో పుట్టింటికి పోయినట్లు ఇప్పుడాయన దగ్గరకి ఎందుకు? ఎప్పుడుపడితే అప్పుడు పోలీసుల దగ్గరకి వెళ్ళటం అంత మంచిదనుకుంటున్నావా? ఇలా చేస్తే నీకు తప్పకుండా మల్లికార్జున్ దూరమవుతాడు”

“ఏం కాడు. నన్ను భయపెట్టకు. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నా ఫోన్ బెడ్ మీద పడేసి మరచిపోయి వచ్చాను. కనీసం ఫోన్ అయినా చేస్తాను” అంది అలేఖ్య.

“తీసుకో. అక్కడే వుందిగా. నన్ను అడగాలా?” అంటూ ఐరన్ చేసిన తన డ్రెస్సు లను సెల్ఫ్‌లో పెట్టాలని సెల్ఫ్ దగ్గరకి వెళ్ళింది నివేద.

అలేఖ్య మొబైల్ తీసుకుని “నెంబర్ నాకు గుర్తుంది” అంటూ నంబర్ టైప్ చేసి బటన్ ప్రెస్ చేసింది.

అవతలవైపున ఏ.ఎస్.పి గారు కాల్ లిఫ్ట్ చేసి “హలో” అన్నాడు.

“సర్ నేను అలేఖ్యని” అంది అలేఖ్య.

“చెప్పమ్మా!” అన్నాడు సూర్యదేవ్.

“ఆయనేం మారలేదు సర్! ఇంకా ఘోరంగా తయారయ్యారు. నిన్న మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. నెల ముందు నుండే అడుగుతున్నాను ఎక్కడికైనా వెళదామని. గోవా గ్గాని, కేరళా గ్గాని ఏదో ఒక ప్లేస్‌కి వెళ్లి సెలబ్రేట్ చేసుకుందామని. కానీ ఆయన ఏ ప్లేస్‌కి తీసికెళ్ళడని అర్థమైంది. అందుకే కనీసం ఆ రోజు గుడికి వెళ్లి, రెస్టారెంట్ కి వెళ్లి, సినిమాకు వెళ్లి, రాత్రికి చిన్న కేక్ కట్ చేసుకుని తిని పడుకుందామన్నాను. అలా చెయ్యలేదు. పెళ్లి రోజు కూడా నేను పడుకోటానికి లేదా అని మధ్యాహ్నం పన్నెండు వరకు పడుకున్నాడు. తర్వాత గబగబా లేచి రెడీ అయి ఎవరో పిల్లల బర్త్ డే పార్టీకి తీసికెళ్ళాడు. నీక్కావలసింది రెస్టారెంట్‌కి వెళ్లి తినడమే కదా! అదేదో అక్కడ పార్టీలో తిను అన్నాడు. కేక్ కట్ చేద్దామన్నావు కదా! వాళ్ళక్కడ కేక్ కూడా కట్ చేస్తారు తిందాం అన్నాడు. నిన్న మొత్తం అక్కడే గడిచిపోయింది. అది నాకు నచ్చలేదు. నేను రానని చెప్పినా వినకుండా తీసికెళ్ళి నన్ను బాధ పెట్టారు. చిన్న చిన్న ఎమోషన్స్ కూడా లేకుండా ఎలా సర్? దీన్నసలు లైఫ్ అంటారా? ఇది చెప్పాలని ఇప్పుడే నా ఫ్రెండ్ వేద దగ్గరకి వచ్చాను. వేదంటే నివేద సర్! నాతోటి ఆ రోజు మీ ఆఫీస్‌కి వచ్చింది కదా! ఆ అమ్మాయినే. ఇప్పుడు నేను ఫోన్ చేస్తున్నది వేద ఫోన్ లోంచే. తను కూడా మీకు చెయ్యమని చెప్పింది” అంది అలేఖ్య.

“అయ్యో అయ్యో నేనెప్పుడు చెప్పాను అలేఖ్యా? నన్ను బుక్ చేస్తావెందుకే” అంటూ కంగారు పడింది అక్కడే వున్న నివేద.

నివేద మాటలు సూర్యదేవ్ విన్నాడు.

అలేఖ్య ఫోన్ మీద చేయి పెట్టి “అలా చెబితేనే కాస్త ఎఫెక్టివ్‌గా వుంటుంది. లేకుంటే ఆ ఏ.ఎస్.పి గారు పట్టించుకోరు” అంది.

“అదికాదు అలేఖ్యా! ఇదంతా తెలిస్తే మల్లికార్జున్ నాతో మాట్లాడతాడా?” అంది నివేద.

“మాట్లాడకపోతే పోనియ్. నన్ను చూస్తుంటే నీకు బాధగా లేదానే?”

“ఉందిలే, అక్కడ సార్ లైన్లో వున్నారు ముందు ఆయనతో మాట్లాడు” అంది నివేద.

వెంటనే అలేఖ్య ఫోన్ మీద నుండి చెయ్యి తీసి “అదీ సర్ సంగతి” అంది.

“నేను మాట్లాడతానులేమ్మా. నువ్వేమీ వర్రీ కాకు. నాకు వేరే కాల్ వస్తోంది. మాట్లాడాలి” అంటూ కాల్ కట్ చేసాడు సూర్యదేవ్.

అలేఖ్య, నివేద ఆ గదిలోంచి బయటకు వచ్చి సత్యవతిని, నాగేశ్వరీని కలిశారు. వాళ్ళు అలేఖ్యతో ప్రేమగా మాట్లాడారు.

అలేఖ్య వెళుతుంటే గేటు వరకు వెళ్ళింది నివేద.

అక్కడ కొద్దిసేపు మాట్లాడుకుంటూ నిలబడ్డారు.

వినీల్ తన అన్నయ్య చైత్రన్‌కి జాబ్ సర్చింగ్‌లో ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేస్తున్నట్లు చెప్పింది నివేద.

“వినీల్ చాలా మంచివాడిలా వున్నాడు కదూ” అంది అలేఖ్య.

అవునన్నట్లు తలవూపింది నివేద.

“సరే ఇక నేను వెళతాను” అని నివేదతో చెప్పి ఇంటికెళ్లింది అలేఖ్య.

***

ఆ రోజు రాత్రి నివేద పడుకునే ముందు లైట్ ఆపేస్తుంటే ఆమె మొబైల్ రింగ్ అయింది.

ఈ టైం లో ఫోన్ ఎవరు చేస్తున్నారు అని అనుకుంటూ మొబైల్ పట్టుకుని నెంబర్ చూసింది. కొత్త నెంబర్.

లిఫ్ట్ చేసి “హలో” అంది.

“ఏ.ఎస్.పి సూర్యదేవ్‌ని మాట్లాడుతున్నా” అన్నాడు సూర్యదేవ్.

నివేద గుండె దడదడ మంది.

“సార్ సార్ మీరా!” అంటూ తడబడింది. ఆశ్చర్యపోయింది.

“ఏం చేస్తున్నారు? ఈ రోజు కాలేజీకి వెళ్ళారా?” అడిగాడు మామూలుగానే సూర్యదేవ్. బయట వున్న వెన్నెల ఇప్పుడా గదిలోకి వచ్చినట్లైంది.

“హా.. కాలేజీకి వెళ్ళొచ్చాను. డిన్నర్ చేసి ఇక పడుకుందామంటే మీ ఫోన్ వచ్చింది సర్! మీరేం చేస్తున్నారు?” యాదృచ్ఛికంగానే అడిగింది.

“నేను నా డ్యూటీ అయ్యాక ఆఫీసర్స్ క్లబ్‌కి వెళ్ళాను. అక్కడ షెటిల్ ఆడి ఇంటికొచ్చి డిన్నర్ చేశాను. కొద్దిసేపు మీగురించి ఆలోచించాను. ఈ నెంబర్ మీది అని ఉదయం అలేఖ్య చెప్పింది కదా! అది గుర్తొచ్చి కాల్ చేశాను” అన్నాడు.

“ప్రాబ్లం తనది కదా! తన గురించి ఆలోచించాలి కానీ నా గురించి ఎందుకు ఆలోచించారు?” అడిగింది నివేద.

“ఎందుకంటే నివేద చాలా సాఫ్ట్ అమ్మాయి. ఊరికూరికే బెదిరిపోతుంది. అలేఖ్య కంచు. వీళ్ళిద్దరికి ఎలా సింక్ అయింది అని ఆలోచించాను” అన్నాడు సూర్యదేవ్.

“అలేఖ్య కంచు అని మీకెలా తెలిసింది?” అడిగింది నివేద.

“ఎలా అంటే నేను సివిల్ సర్వీస్ రాసి ఇరవైరెండు ఏళ్లకే ఏ.ఎస్.పి అయ్యాను. అలాంటి చిన్నచిన్న దేవరహస్యాలు నాకు తెలిసిపోతూ వుంటాయి చాలా చాలా ఈజీగా” అన్నాడు నవ్వు ఆపుకుంటూ.

నివేద ఆపుకోలేనంతగా నవ్వింది. ఆ నవ్వును విన్నాడు. ఇంకా నవ్వితే వినాలనుకున్నాడు. ఆమె నవ్వు ఆగింది. పూలు రాలటం ఆగినట్లైంది.

“మీ ఫ్రెండ్ అలేఖ్య గురించి మీతో మాట్లాడొచ్చా?” సూటిగా అన్నాడు.

ఏం మాట్లాడతాడో అన్నట్లు ఆగింది నివేద.

“అలేఖ్య చెప్పేవన్నీ నిజాలేనా? మల్లికార్జున్ ఎలాంటి వాడు?” అన్నాడు వెంటనే. అవి పోలీస్ ప్రశ్నల్లాగే వున్నాయి.

“కష్టమైన ప్రశ్నలు అడిగారు” అంది నివేద.

“మీకు తెలిసినంత వరకే చెప్పండి. మీరు తన ఫ్రెండ్ కదా. కొంతైనా తెలిసివుంటుంది కదా! జస్ట్ క్లారిటీ కోసం అంతే” అన్నాడు.

“అలేఖ్య చెప్పేవి నిజాలే. కానీ అవి మీలాంటి పెద్ద ఆఫీసర్స్ దగ్గరకు తీసుకొచ్చేంత పెద్దవి కావేమో. చెబితే వినదు. మల్లిని మార్చాలి అంటుంది. నిజానికి అతను ప్రపంచానికి ఒక వ్యక్తి మాత్రమే. అతన్ని నమ్ముకున్న అలేఖ్యకు మాత్రం అతనే ప్రపంచం. అది అతను తెలుసుకోవాలి. అప్పుడే ఏ మార్పు అయినా. మల్లికార్జున్ గురించి అలేఖ్య చెప్పింది తప్ప ఎక్కువేం తెలియదు నాకు” అంది నివేద.

“సరే ఇక నేను వుంటాను. గుడ్ నైట్ వేదా!” అన్నాడు.

“గుడ్ నైట్ సర్!” అంది నివేద.

సూర్యదేవ్ ఫోన్ కట్ చేసాడు.

ఇది నా నంబర్‌తో ఏ.ఎస్.పి గారికి ఫోన్ చేసి నన్ను ఇరికించింది కదా! ఇంకా ఎన్నెన్ని ప్రశ్నలు అడుగుతారో ఏమో అని మనసులో అనుకుంటూ పడుకుంది నివేద.

***

రోజులు చాలా వేగంగా గడుస్తున్నాయి.

హరనాథరావు ముంబై లోనే వున్నాడు.

సత్యవతికి కాలు బాగైంది. ఆమె ఎప్పటిలాగే నడుస్తూ అన్ని పనులు చేసుకుంటోంది.

చైత్రన్‌కి నెలనెలా డబ్బులు పంపుతున్నాడు వినీల్.

మల్లికార్జున్ చేసే పనులకు రోజుకో రకంగా ఆశ్చర్యపోతూ, అతను మారితే బాగుండని ఎదురు చూస్తోంది అలేఖ్య.

నివేద గొంతు వినాలనిపించినప్పుడు “అలేఖ్య ఎలా వుంది?” అంటూ సూర్యదేవ్ నివేదకు ఫోన్ చేస్తున్నాడు.

నివేద ఒక్క రింగ్‌కే అతని కాల్‌ని లిఫ్ట్ చేసి “హలో” అనటం అతనికి ఆశ్చర్యం కన్నా ఆనందం అనిపిస్తుంది.

కొన్ని వేల యుగాల నుండి అతను చెప్పాలనుకున్నది ఇప్పుడు చెబుతున్నట్లున్న అతని మాటల మంచు ధార ఆమె మనసును మెల్లగా తడపటం మొదలైంది. అతని మాటలు వింటున్నప్పుడు ఆమెలో అవ్యాజమైన, అవ్యక్తమైన ప్రకంపనలు పుడుతున్నాయి. అతను ఫోన్ చేసేది అలేఖ్య కోసం కాదు తన కోసమే అని ఆమెకు అర్థమైంది. కానీ మనసు ఎటు లాగితే అటు వెళ్లకుండా ఆపటం తప్పనిసరి అన్నట్లు ఆమె మనసును బాగా తొక్కిపెడుతోంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here