[dropcap]ఆ[/dropcap]కార్ మూవీస్ వారు 2020 డిసెంబర్ లో విడుదల చేసిన చిత్రం ఇది. నిర్మాతలు దాము రెడ్డి కొసనం మరియు ‘దళం’ జీవన్ రెడ్డి. రచన – దర్శకత్వం మోహన్ బొమ్మిడి. సంభాషణలు అందించిన వారు బమ్మిడి జగదీశ్వర్రావు.
నాయిక శిరీషగా ప్రియాలాల్ నటించారు. సంగీతమే ఆమె ప్రపంచం. తండ్రిగా బుల్లి టీవి నటుడు ప్రభాకర్ నటించారు. 30 weds 21 ఫేం చైతన్య, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, మరి కొన్ని ముఖ్య పాత్రల్లో నటించారు.
నాయకుడు సదానంద్‌గా సత్యదేవ్ నటించారు. మెకానికల్ ఇంజనీరింగులో పి.హెచ్.డి. ఇతనికి శబ్దం నచ్చదు. అంచేత తనకి నచ్చే విధంగా శబ్ద కాలుష్యం కలిగించని బైక్ తయారు చెయ్యాలని ఒక గ్యారేజిలో పని చేస్తు ఉంటాడు.
ఇలా సంగీతమే ప్రపంచంగా బతికే అమ్మాయి, శబ్దం అస్సలు సరిపడని అబ్బాయి ఎలా ఒక గూటికి చేరారో చూద్దాం పదండి.
నాయిక వయొలిన్‌లో పి.హెచ్.డి చెయ్యాలనుకుంటుంది. ఆమె తండ్రి ఆమె పెళ్ళి చెయ్యాలనుకుంటాడు.
కేంద్ర విశ్వ విద్యాలయంలో తనకి ఎడ్మిషన్ దొరికిందని, అనుకున్న కోర్స్ పూర్తి చేశాక తండ్రి చూపించిన కుర్రాడినే పెళ్ళి చేసుకుంటానని వాగ్దానం చేసి హైదరాబాద్ వస్తుంది.
శిరీష తన ఫ్రెండ్ ఇంట్లో దిగుతుంది. ఫ్రెండ్ ప్రియుడితో కలిసి జీవిస్తూ ఉంటుంది.
దగ్గరలో ఉండే గ్యారేజిలో మన నాయకుడు సదానంద్ పని చేస్తూ ఉంటాడు. అక్కడే రామకృష్ణ అతని అనుచరులు సెల్ ఫోన్, సామాజిక మాధ్యమం మీద పాడిన వ్యంగ్య గీతం హాస్యంగానూ… ఆలోచింప చేసేట్లు ఉంది.
తన స్నేహితురాలి living together కి ఇబ్బంది కలగ కూడదని శిరీష వేరే ఇంటికి మారిపోతుంది.
అక్కడ రాత్రి పూట వస్తువులు వాటంతట అవి ఒక చోటి నించి మరో చోటికి జరగటం, ఏవో శబ్దాలు వినిపించటం జరుగుతుంటే భయపడి ఫ్రెండ్ ఇంటికి వస్తుంది. ఫ్రెండ్ భయం పోగొట్టటానికి మత్తు పానీయం తాగిస్తుంది.
ఆ రాత్రి ఇంట్లో వస్తువులు జరిగిపోవటం, గడియారం వెనక్కి తిరగటం చూసిన నాయిక దాని మీద గట్టిగా కొట్టి పగల కొడుతుంది. అప్పుడు తెలుస్తుంది పక్క వాటాలో ఉండే నాయకుడు తన పక్క వాటాలోకి ఎవరైనా వస్తే వాళ్ళు చేసే శబ్దాలు భరించలేక అయస్కాంతం సహాయంతో వస్తువులు జరుపుతూ పక్కింటి వాళ్ళని భయపెడుతున్నాడని!
ఆ ఫ్లాట్‌లో ఉన్న భార్యా భర్త చనిపోయాక వారి పిల్లలు రెండు భాగాలు చేసుకుని మధ్యలో ఒంటి వరస ఇటుక గోడ కట్టటం వల్ల ఒకరి శబ్దం మరొకరికి స్పష్టంగా వినిపిస్తుంది. అదీ సమస్య.
విషయం అర్ధమయ్యాక ఇద్దరూ ఒక అవగాహనకి వస్తారు ఒకళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మరొకరు బయటికెళ్ళాలని!
పరీక్షలున్నాయని ఒక రోజు నాయకుడి టైంలో నాయిక వయొలిన్ వాయిస్తూ శబ్దం చేస్తుంటే… విన్న నాయకుడు సంగీతానికి స్వేచ్ఛ అవసరం అని దానికి కావలసిన చిట్కాలు చెబుతాడు.
ఆమె అతన్ని ‘సైలెన్సర్’ అని, అతను ఆమెని ‘వయొలిన్’ అని పిలుచుకుంటూ ఉంటారు.
తండ్రికి శబ్దం అంటే ఉన్న వ్యతిరేకత వల్ల చిన్నప్పటి నించీ తనకి కూడా శబ్దం పడదని చెబుతాడు.
శబ్దం రాని ఇంజన్ని తయారు చెయ్యాలని 7-8 సంలుగా ప్రయత్నిస్తున్న నాయకుడికి నెమ్మదిగా శబ్దం పట్ల అభిప్రాయం మారుతుంది. నాయిక వయొలిన్ మీద వాయించిన సంగీతం వల్ల స్పందించిన మనసు, హృదయంతో…. ఎప్పటి నించో పట్టు చిక్కని ‘silent engine’ ఫార్ములా స్ఫురించిందని నాయకుడు మిత్రులతో చెబుతాడు.
నాయిక….సహజీవనంలో ఉన్న తన ఫ్రెండ్ జీవితంలో చూసిన భేదాభిప్రాయాలు తనకి, ప్రియుడికి మధ్య రాకూడదని అతను కోరినా కూడా అతన్ని కలవటం ఆలస్యం చేస్తూ ఉంటుంది.
ఒకరి మొహాలు ఒకరు చూసుకోకుండా… గోడకి అవతల ఒకరు, ఇవతల ఒకరు మాట్లాడుకుంటూ స్నేహాన్ని, ప్రేమని కలబోసుకుంటుంటారు.
కొడుకుని చూడటానికి పట్నానికి వచ్చిన నాయకుడి తల్లిదండ్రులు అతనిలో వచ్చిన మార్పుని స్పష్టంగా తెలుసుకుంటారు.
వంట చెయ్యటం చేతకాని నాయిక, నాయకుడి నిర్దేశనంతో వంట చెయ్యటం నేర్చుకుంటుంది.
ఒక రోజు వర్షంలో తడిసి జ్వరం తెచ్చుకుని, నాయకుడితో సన్నిహితత్వం కోరుకుని, ఇద్దరూ partition గోడకి దగ్గర చెరో పక్కన కూర్చుని దగ్గరతనం అనుభవిస్తారు.
అనుకోకుండా నాయిక తండ్రి కూతురిని చూడటానికి హైదరాబాదు వస్తాడు. కాలేజికి వెళ్ళొస్తానని ఆమె బయటికి వెళ్ళినప్పుడు, రూం లోనే ఉన్న నాయకుడు ఆమె తండ్రి ఫోన్ సంభాషణ ద్వారా ఆమె చదువు అయిపోయాక తన బావని పెళ్ళి చేసుకుంటానని వాగ్దానం చేసిన విషయం తెలుసుకుని నిరుత్సాహపడతాడు.
ఆ విషయం తనకి చెప్పకుండా మోసం చేసిందని ఆమెని అపార్థం చేసుకుని ద్వేషం పెంచుకుని, తన మిత్రులకి జరిగింది చెబుతాడు. ఆడపిల్లలతో విచ్చలవిడిగా ప్రవర్తించే నాయకుడి మిత్రుడు, తన గర్ల్ ఫ్రెండ్‌తో గడపటానికి అతని ఇంటి తాళాలు తీసుకుంటాడు. గోడ అవతల నించి సన్నిహితంగా మసిలే ఒక ఆడ మగ సంభాషణ విన్న నాయిక ఆ వ్యక్తి నాయకుడే అని అపోహపడి, ఇల్లు ఖాళీ చేసెయ్యాలనుకుంటుంది. అది తను కాదు అని ఎంత చెప్పినా వినిపించుకోదు.
తన పి.హెచ్.డి కోసం దీర్ఘకాలం కృషి చేసి రాసిన పేపర్ అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమయిందని, అందరు మెచ్చుకున్నారని గైడ్ చెప్పినప్పుడు నాయకుడు ఆ విషయానికి ప్రాధాన్యం ఇవ్వకపోవటాన్ని గుర్తించిన అతని మిత్రులు… తాత్కాలికంగా ప్రేయసితో కలిగిన మనస్పర్ధ వల్ల అతను తన లక్ష్యాన్ని వదలటం తప్పని చెబుతారు.
అలాగే తన మీద కోపంతో తన జీవిత లక్ష్యాన్ని పాడు చేసుకోవద్దని, ప్రశాంతంగా పరీక్ష రాయమని, ఆమె తిరిగి వచ్చేసరికి తనే ఇల్లు ఖాళీ చేసేస్తానని చెప్పి సామాను సర్దుతూ ఉద్వేగానికి లోనవుతాడు. అతని మిత్రులు కూడా మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోకుండా నిస్వార్ధంగా ప్రేమించుకున్నారు, కనుక అనవసరపు అపార్ధాలతో విడిపోకుండా కలిసి మాట్లాడుకోమని సలహా ఇచ్చి వారి సమస్యని పరిష్కరిస్తారు. అప్పుడు నాయిక వారి మధ్య గోడని బద్దలుగొట్టి నాయకుడిని కలుస్తుంది.
సహజీవనం చేస్తున్న నాయిక స్నేహితుల జంట కూడా ‘ప్రేమ అంటే ఒకరినొకరు ఇష్టపడటం కాదు… ఒకరి ఇష్టాన్ని ఇంకొకరు ఇష్టపడాలని, ఒకరు లేనిదే ఇంకొకరి జీవితం అసంపూర్ణం అనే భావన కలగాలని…అది తమ మధ్య ఉందా లేదా అని చర్చించుకుని చివరికి తమ మధ్య ఉన్నది ప్రేమే’ అని తేల్చుకోవటంతో కథ సుఖాంతం అవుతుంది.
యువత జీవితాలని ప్రతిబింబించే సంభాషణలు, పాటలు ఆకట్టుకునేట్లు ఉన్నాయి. ప్రతి వారి జీవితానికి ఒక లక్ష్యం ముఖ్యమని, అది సాధించటానికి కృషి చెయ్యాలని.. ఆ ప్రయాణంలో కొత్త పరిచయాలైనా లక్ష్యం మాత్రం మరచిపోకూడదని అన్యాపదేశంగా చెప్పారు.
ఒకరినొకరు చూసుకోకపోయినా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమికులు కావచ్చు. హుందాగా ప్రవర్తించచ్చు అని కొత్త కోణంలో చూపించిన చిత్రం ఇది.
సంగీతం మీద ఎంతో మక్కువ కలిగి, దాని కోసం ఇంట్లో వారిని ఎదిరించి, హైదరాబాద్ వచ్చిన నాయిక పాత్రకి వయొలిన్ మీద కనీస అవగాహన ఉన్న వ్యక్తిని ఎన్నుకుని ఉంటే బాగుండేది. ఫైనల్ పరీక్షకి వయొలిన్ వాయిస్తున్న అమ్మాయి fingering సరిగా ఉంటే ఆ పాత్రకి న్యాయం జరిగి ఉండేది. అలాగే చివరగా ఎన్నుకున్న రాగమైనా కాస్త కర్ణపేయంగా ఉంటే బాగుండేది. ఇలాంటివి చిన్న తప్పులుగా కనిపించే పెద్ద లోపాలు.
ఈ చిత్రం Prime video లో ఉన్నది.
రక్తపాతం, విలనిజం, అనవసర ఫైటింగ్స్ లేకుండా చూసినంత సేపు హాయిగా, నాయికా నాయకులు ఎప్పుడు..ఎలా కలుస్తారా అనే ఉత్కంఠ కలిగిస్తూ సాగిన చిత్రం.
ఇప్పటికే చాలా మంది చూసి ఉంటారు.