[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా రామసముద్రంలోని లక్ష్మీ జనార్ధనస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
లక్ష్మీ జనార్ధనస్వామి ఆలయం, రామసముద్రం
ఇక్కడ అర్చక స్వామి చెప్పినదాని ప్రకారం క్రీ.శ.1580 హేవిళంబి, మాఘ శుధ్ధ సప్తమినాడు ఈ స్వామి ప్రతిష్ఠ జరిగింది. విజయనగర సామ్రాజ్యాధీశులైన అచ్యుతరాయల కుమారులు బొమ్మరాయలు, తిమ్మరాయలు, ఒకసారి చంద్రగిరికి వెళ్తూ దోవలో ఈ ప్రాంతంలో విశ్రమించారుట. అపుడు వీరి కలలో స్వామి కనుపించి తానక్కడ బావిలో వున్నానని, తీసి వారి రథంలో పెట్టుకుని వెళ్తుండగా, రథం ఇరుసు విరిగిన చోట ఆలయం కట్టించి, చెరువు తవ్వించమని చెప్పాడుట. ఇక్కడ ఇరుసు విరిగినదని ఆలయం కట్టించి, చెరువు తవ్వించారు.
అమ్మవార్లు శ్రీదేవి, భూదేవి. అప్పటిదాకా అక్కడ ఊరు లేదు. ఆలయం కట్టాక చుట్టూ ఊరు వచ్చింది. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత జరిగిన ప్రతిష్ఠ ఇది. ఆ సమయంలో వారు కొంతకాలం చంద్రగిరిని కూడా పాలించారు.
ఆలయ పరిరక్షణ కోసం హరిహర రాయలు, బుక్క రాయలు అక్కడే తమ పేరిట ఒక కోట నిర్మించినట్లు తెలుస్తోంది. కోట ఆలయం చుట్టూ వృత్తాకారంలో వుండి నాలుగు బురుజులు, ఒక సింహ ద్వారం కలిగి వుండేది. ప్రస్తుతానికి వీటి జాడ లేదుగానీ ఇదివరకు వీటి శిధిలాలను చూసిన పెద్దలున్నారు.
ఆలయం పెద్దదే. గర్భాలయంలో చతుర్భుజుడైన జనార్దనస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా విరాజిల్లుతున్నాడు.
విజయనగర రాజుల చిహ్నం వారు కట్టించిన అన్ని దేవాలయాల మీద వుంటుందని ప్రత్యేకించి చూపించారు. ఆ చిహ్నంలో వరాహం (విష్ణు అవతారం), పైన భూమి, పక్కన చంద్రుడు వున్నాయి. దాని అర్థం ఆ చంద్ర తారార్కం భూమి వున్నంతవరకు విజయనగర సామ్రాజ్యం వర్ధిల్లాలి.
ఈ ఊరుకి రామసముద్రం అనే పేరు రావటానికి ఒక కథ వున్నది. విజయనగర రాజులైన పెనుగొండ పాలకులు రామసముద్రం సమీపంలోని అగ్రహారం వద్ద కరువు పనిలో భాగంగా ఒక పెద్ద చెరువు నిర్మిస్తున్నారు. అగ్రహారంలోని రామలింగేశ్వర, చెన్న కేశవాలయాలు, రామసముద్రంలోని జనార్దనాలయాల్లో నాట్యం చేసే దేవదాసి రామక్క చెరువు చూడటానికి వెళ్ళిందట. చెరువు నిర్మించే పాలకులు రామక్కను ఎగతాళిగా ఇక్కడ ఓ నాట్యం చేసిపోరాదూ… అలసిపోయిన కూలీలు నిన్ను చూసి కష్టం మరచిపోనీ పాపం అన్నారుట. అయితే ఈ రోజు మీరెక్కడా చూడని నృత్యం చేసి చూపిస్తాను అని రామక్క ఏడు పచ్చి కుండలను తెమ్మన్నదట. ఏడు పచ్చి కుండలపై నాట్యం చేస్తూ కుండలు పగిలిపోకుండా తన నాట్యంతో అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరచిందట. బదులుగా ఏమి కావాలో కోరుకోమని నాట్యకత్తె రామక్కను పాలకులు అడిగారుట. అందుకు రామక్క తన పేరు శాశ్వతంగా వుండేటట్లు ఏమైనా చెయ్యమన్నదిట. ఆ రాజు ఆ గ్ర్రామానికి రమాసుందరి గ్రామం అనే పేరుపెట్టారు. ఆవిడని రామక్కఅని కూడా పిలిచేవారు కనుక రామక్కూరు, తర్వాత వాడుకలో రమాసుందరి గ్రామం కాస్తా రామసముద్రం అయింది. ఇదీ కథ.