స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్

9
3

[dropcap]రూ[/dropcap]ప పొద్దున్నే ఇల్లు ఊడుస్తోంది.

“రూపా! టీ ఇవ్వు” అన్నాడు శేషు. చీపురు పక్కన పడేసి టీ పెట్టి తీసుకొచ్చింది.

“దీన్ని టీ అంటారా అసలు? నీళ్ల లాగా ఉంది. టీ పెట్టటం కూడా రాదు. ఛీ”

“నిన్న స్ట్రాంగ్‌గా ఉందన్నారని ఇవాళ టీ పొడి తక్కువేశాను” అంది రూప శాంతంగా.

“మాటకి మాట సమాధానానికేం తక్కువ లేదు.”

“మళ్ళీ పెట్టి తెమ్మంటారా?”

“అక్కర్లేదు”

కప్పు తీసుకుని వెళ్ళిపోయింది.

“రూపా, నా కళ్ళజోడెక్కడ?”

“నాకు తెలీదండి”

“ప్రతీది తెలీదు అనటానికి సిగ్గు లేదూ నీకు? భర్త బైటకి వెళుతుంటే కావలసిన కళ్ళజోడు, రుమాలు లాంటివి కూడా ఇవ్వలేవా?”

“మీరు పద్దతిగా ఒకేచోట పెట్టుకుంటానంటారు, నన్ను ముట్టుకోవద్దన్నారని, నేను చూడలేదండి”

“వంకలకేం తక్కువ లేదు, నేను ఎప్పుడూ అల్మరా లోనే పెడతాను. లేదేం మరి?”

గట్టిగా అరుస్తున్నాడు. తిడుతున్నాడు. వెతుకుతున్నాడు శేషు. రూపా వెతుకుతోంది నిశ్శబ్దంగా. సందులో బైట కిటికీలో ఉన్న కళ్ళజోడు మౌనంగా తెచ్చి ఇచ్చి, అడక్కుండానే ఎక్కడ దొరికిందో చెప్పి వంటింట్లోకి వెళ్లబోతోంది రూప.

“సాయంత్రం పెళ్లి కెళ్లాలి గుర్తుందా?” శేషు అన్నాడు. తలూపింది రూప.

“ఆ పసుపురంగుకు ఎరుపు పెద్ద బోర్డర్ పట్టుచీర కట్టుకో. నెక్లెస్, హారం, ముత్యాల గొలుసు వేసుకో, తెలిసిందా” శేషు గర్జించి వెళ్ళిపోయాడు.

ఆ చీర రూప కసలు ఇష్టముండదు. అన్ని నగలు ఒకేసారి ఎవరు పెట్టుకుంటున్నారు ఇప్పుడు! కాని, ఎలా చెపితే అలాగే చెయ్యాలి. లేకపోతే యుద్ధమే!

మధ్యాహ్నం భోజనానికి వచ్చి కూర్చున్నాడు శేషు. భోజనం వడ్డించింది. వంకాయ కూర, టమాటో పప్పు, కొబ్బరి పచ్చడి, సాంబారు అన్నీ శేషు కిష్టమైనవే! అన్నం వేడి పొగలు కక్కుతోంది.

“కూరలో ఉప్పు వేసావా అసలు? వంట ఇలా చచ్చిందేం? మనసు చేసే పని మీద ఉంటే బాగా కుదురుతుంది. రుచికరంగా భోజనం పెడదామనే ఉండదు నీకెప్పుడూ!”

‘ఇప్పుడేగా మామగారు వంటలన్నీ అద్భుతంగా ఉన్నాయమ్మా అని మెచ్చుకున్నారు’ అని మనసులో చాలా ఆశ్చర్యపోయింది రూప.

“ఏమిటీ సాంబారు? ఇందులో పులుపు కాని, కారం కాని ఏమైనా ఉన్నాయా? ఏం వంట ఇది, ఛీ” అంటూ తింటున్న కంచం రూప మొహం మీదకు విసిరికొట్టాడు.

విలువ లేని పని! గుర్తింపు లేని చాకిరీ! జుట్టు పట్టుకుని గోడ కేసి కొట్టటం, వేడి నీళ్లు మొహం మీద పోయటం, చుట్టాల ముందు చులకన చేసి అవమానించటం శేషు దారుణ కృత్యాలన్నీ రూప కళ్ళ ముందు సజీవ దృశ్యాలై కదలాడాయి. వేడి వేడి సాంబారు గిన్నె భళ్లున నేల మీద పడిన శబ్దం! శేషు తెల్లబోయాడు. కాలి వేళ్ళు వేడిగా కాలిపోయినట్లయింది. అంతే! కోపంతో శేషు కళ్ళు ఎరుపెక్కాయి. “ఎంత పొగరు నీకు? వేడి గిన్నె కింద పడేస్తావా? వేళ్ళు కాలిపోయాయి” అంటూ చేయేత్తాడు. రూప కోపంతో వణికి పోయింది. విసురుగా శేషు చేయి పట్టుకుని ఆపి, గుమ్మంలో నిల్చున్న మామగారిని చూస్తూ గబ గబా బెడ్ రూం లోకి వెళ్ళిపోయింది.

“ఆదివారం కూడా ప్రశాంతంగా ఉండదు ఇల్లు” తిట్టుకుంటూ బైటకి వెళ్ళి పోయాడు శేషు.

మామగారు, గది ముందు నిల్చుని “అమ్మా” అన్నారు.

కళ్ళు తుడుచుకుంటూ వచ్చి రూప “సారీ మామయ్యా” అంది.

“ఎందుకమ్మా సారీ, నువ్వు గిన్నె కింద పడేసావు. వాడి ముఖం మీద కొట్టనందుకు బాధ పడుతున్నాను.”

“మామయ్యా!”

“అవునమ్మా, ఏం చూసుకుని వాడికి అహంకారం! అటు ఉద్యోగం, ఇటు ఇంటి బాధ్యత సమర్థవంతంగా చేసుకుంటూ ఇల్లు గడవటానికి వాడికి ఇంత సహకరిస్తున్న నిన్ను మనిషిగానైనా చూస్తున్నాడా! నువ్వేమిటో తెలియజేప్పటానికి పోరాటం చెయ్యాల్సిందేనమ్మా. నీలో ఈ మాత్రం ధైర్యం వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ఎదురు తిరుగుతుంటే వాడే దారిలోకి వస్తాడు” అన్నారు.

ఆ సాయంత్రం పెళ్ళికి వెళ్ళలేదు. అసలు శేషు ఇంటికే రాలేదు. అర్ధరాత్రి ఎప్పుడో వచ్చాడు.

మర్నాడు, రూప క్లాసులో తలొంచుకుని అటెండెన్స్ పిలుస్తుంటే పలకనివాళ్ళు, చేయెత్తే వాళ్ళు, ప్రతిరోజూ ఉండే గొడవే, విసుగొచ్చేస్తోంది అనుకుంది.

“మేడం, నెంబర్ 25కి వేయలేదండి” అన్నాడు ఓ విద్యార్థి లేచి నిల్చుని.

“వేయలేదేంటీ. పలకలేదు అను. పిలుస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు?”

“నేను వినలేదండి”

ఎంత నిర్లక్ష్యం.

“వీడు పక్కవాడితో మాట్లాడుతున్నాడు మేడం” ఇంకో కుర్రాడి ఫిర్యాదు. మరో ఐదుగురు లేచి నిల్చున్నారు అటెండెన్స్ వేయమని. వీడి వల్లే పలకలేదు అంటూ ఒకళ్ళ గురించి మరొకళ్ళు చెపుతూ నవ్వుతున్నారు.

“స్టాపిట్, తప్పు చేసింది చాలక నవ్వులా సిగ్గు లేకుండా. నేను పలకని వాళ్ళకి వేయను” రిజిస్టర్ మూసేసింది.

“ప్లీజ్ మేడం, ఈ సారి నుంచి పలికేస్తాము.”

‘అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఏమైనా ఇవాళ వేయకూడదు. రోజూ పోనీలే అని వేసేస్తుంటే అలుసుగా ఉంది వీళ్ళకి’ అక్కసుగా అనుకుంది రూప.

“నోట్స్ తెరవండి. ఇవాళ రెండో ప్రశ్న రాయండి” అంది.

“మేడం, మొదటిది చెప్పలేదుగా?” ఒకమ్మాయి అడిగింది.

మళ్ళీ కోపం!

“నిల్చో!”

నిల్చుంది అమ్మాయి.

“మొదటిది చెప్పకుండా రెండోది చెపుతారా ఎవరైనా? చెప్పలేదు అనకు. నువ్వు రాసుకోలేదు అను. నిన్న రాలేదా?”

“రాలేదు మేడం.”

“మరి, నువ్వు రాకపోతే, నేను చెప్పలేదని అంటావే! నీ ఇంటికి వచ్చి నోట్స్ చెప్పమంటావా? లెక్చరర్‌తో ఎలా మాట్లాడాలో తెలుసుకో ముందు” గట్టిగా అరిచింది రూప.

అమ్మాయి మాట్లాడకుండా కూర్చుంది. ఇంకా కోపం తగ్గట్లేదు. నోట్స్ తేని వాళ్ళందరిని నిల్చుని వేరే పుస్తకంలో రాసి చూపించమంది. నవ్విన వాళ్ళందరిని బైట నిల్చోబెట్టింది. ఎప్పుడూ గట్టిగా కేకలేయని రూపలో కొత్త రూపం చూసి పిల్లలు కిక్కురుమనలేదు. క్లాసంతా నిశ్శబ్దంగా గడిచింది. కొంచెం తృప్తిగా అనిపించింది.

నిజంగానే, రూప ఎప్పుడూ పిల్లలతో పరుషంగా మాట్లాడదు. ఎవరైనా, చెప్పలేదు అంటే నువ్వు అప్పుడు రాలేదేమో ఎవరినన్నా అడిగి రాసుకో అని ఇలాగే నెమ్మదిగా చెపుతుంది. వాళ్ళతో సామరస్యంగా మాట్లాడితే అలుసు, గట్టిగా కేకలేస్తే బిరుదులు ఇచ్చేస్తారు. తెలుగు సుబ్బలక్ష్మి పాపం వీళ్ళ గొడవను డామినేట్ చేయటానికి గట్టిగా అరుస్తూ బెల్లయ్యేదాకా చెపుతూనే ఉంటుంది. వీళ్ళకి తనేమిటో తెలియాలి. స్ట్రిక్టు గానే ఉండాలి ఇకనుంచి. ఇంట, బైట ఉనికి కోసం, గౌరవం కోసం పోరాటం, పోరాటం… చేయాల్సిందే. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఈ పోరాటంలో వెనక పడితే అస్తిత్వం ఉండదు. ఆగకూడదు ఈ పోరాటం అనుకుంది దృఢమైన మనసుతో రూప!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here