[dropcap]చే[/dropcap]తికి చిక్కినట్లే చిక్కి
వ్రేళ్ళ సందుల్లోంచి చేజారిపోతున్న మిణుగురుల్లా
కలాన్ని ముందుకు కదలనీయని అసంపూర్ణ వాక్యాలు…..!!!
గూట్లోకి వరుసగా వచ్చి వాలుతోన్న కవితా పిట్టల్ని
ఎవరో శబ్దం చేసి తరిమేసినట్లుగా
అభావ కుబుసాలతో గూడు ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తోంది…..!!!
అక్షరాలపక్షులు భావచిత్రాల వలలతో సహా ఎగిరిపోయాక
కనుచూపు మేరా విస్తరిస్తున్న
నిరఘాంతపు ఎడారి నిశిలో
నిట్టూర్పుల మేటలో చిక్కుకుని గుండె బేలగా రోదిస్తుంది…..!!!
తేమపరచుకున్న దిగులు నేలలో
ఆలోచనల చెలమ ఎంత తోడినా
జల కరుణించదు
దూప తీరదు……!!!
ఉండుండీ
ఏ తలపుల రాయో తగిలి
హృదయ తటాకాన్ని కల్లోల పరచినా
ఒక్క పదబంధమూ పద్మం లా వికసించదు
విరామ శిబిరం లో నిరాశ తాత్కాలిక విశ్రాంతి తీసుకుంటుంది…..!!!
కవన రెక్కలల్లార్చే ఏ కవిత్వ పిట్ట సంచారమూలేక
మనసాకాశం వట్టిపోయినప్పుడు
అభావ క్షేత్రం దిగులు పాటల పల్లవినే
పదే పదే శృతి చేసుకుంటుంది…..!!!
కలం ఆలోచనల వలలో చిక్కుబడి
పక్షిలా విలవిలాడుతుంటే….
కాలపు కొక్కేనికి ఒక ఆశాభంగమై
వ్రేళ్లాడుతున్న హృదయం ఖాళీ కాగితమై అల్లాడుతూనే ఉంటుంది….!!!