[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి రచించిన ‘అందమైన మనసు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]
[dropcap]ఆ[/dropcap]ర్మీలో వుండే సహస్ర వాళ్ళ అన్నయ్య ఎప్పుడు వస్తాడా, సహస్రను ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అని ఎదురు చూస్తున్నాడు వినీల్.
***
వారం రోజుల తరువాత…
ఆఫీసర్స్ క్లబ్‌లో షెటిల్ ఆడుతూ పరధ్యానంగా వున్న డాక్టర్ వినీల్‌ని చూసి.
“ఏంటలా వున్నావ్ వినీల్? హాస్పిటల్లో ఏమైనా ప్రాబ్లమా?” అడిగాడు సూర్యదేవ్.
“అలాంటిదేం లేదు సూర్యదేవ్. నాలుగు రోజుల క్రితం ఆర్మీలో వున్న సహస్ర వాళ్ళ అన్నయ్య వచ్చారు. మా గురించి ఆయనతో చెప్పింది. ఆయన ఓకే అన్నారట. ఆ విషయం చాలా సంతోషపడుతూ చెప్పింది సహస్ర. కానీ ఎందుకో ఏమో ఆ మరుసటి రోజు నుండే నాకు కాల్ చెయ్యటం మానేసింది. నేను కాల్ చేసినా లిఫ్ట్ చెయ్యట్లేదు. ఇప్పటికి మూడు రోజులైంది మాట్లాడి. ఏమైందో అర్థం కావటం లేదు” అన్నాడు డాక్టర్ వినీల్.
“అక్కడ మీ కామన్ ఫ్రెండ్స్ లేరా?”
“లేరు. అంతా కొత్త డాక్టర్సే వున్నారు”
“హాస్పిటల్‌కి కాల్ చేసావా?”
“చేశాను. హాస్పిటల్‌కి రావట్లేదన్నారు. ఎందుకు రాలేదో తెలియదన్నారు”
“అవునా. అయితే ఇంకో పని చెయ్యొచ్చు వినీల్! మీ మామయ్యగారబ్బాయి చైత్రన్ ఆ ఏరియాలోనే హాస్టల్లో ఉంటున్నాడని చెప్పావు కదా, అతన్ని ఒకసారి హాస్పిటల్‌కి వెళ్లి ఎంక్వైరీ చెయ్యమని చెప్పు. ఈలోపలే సహస్రగారు నీకు ఫోన్ చేస్తే నో ప్రాబ్లం. ఓకేనా?” అన్నాడు సూర్యదేవ్.
“అతనక్కడ లేడు సూర్యదేవ్. నిన్ననే ఏదో జాబ్ అఫర్ వుందని బెంగుళూరు వెళ్ళాడు. వచ్చేసరికి టైం పట్టొచ్చు” అన్నాడు వినీల్.
“అయినా ఫోన్ చేస్తుందిలే వినీల్! కంగారెందుకు?” అంటూ పక్కనే వున్న టవల్ తీసుకుని చేతులు తుడుచుకున్నాడు.
కొద్దిసేపయ్యాక ఎవరి కారులో వాళ్ళు వెళ్లారు.
ఆ రాత్రి నిద్ర పోలేదు వినీల్.
తెల్లవారి టిఫిన్ తినకుండానే హాస్పిటల్‌కి వెళ్ళాడు. సగం ఓపి చూడగానే విసుగనిపించి ఇంటికి వెళ్ళాడు. ఇంటికెళ్ళాక ఆలోచిస్తూ పడుకున్నాడు. ఎంతసేపు ఆలోచించినా సహస్ర ఏమైందో అర్థం కాలేదు. లైట్లు వెలిగేవరకు అలాగే పడుకున్నాడు. క్లబ్‌కి వెళ్ళలేదు. డిన్నర్ చేయలేదు. సహస్ర ఎప్పుడు ఫోన్ చేస్తుందో అని ఎదురుచూస్తూ నిద్ర పోకుండా కూర్చున్నాడు. తెల్లవారుతుందనగా ఇక ఆపుకోలేక నిద్రపోయాడు.
***
తలుపును దబదబా బాదుతుంటే లేచి తలుపు తీసాడు వినీల్. ఎదురుగా సత్యవతి, నివేద కనిపించారు.
“ఏంటమ్మా?” అన్నాడు వినీల్. అతని గొంతు ఎప్పటిలా లేదు. చాలా నీరసంగా వుంది.
“ఒంట్లో బావుండలేదా నాన్నా అలా వున్నావ్?” కంగారుపడుతూ అడిగింది సత్యవతి.
“బాగుందమ్మా! నువ్వేం కంగారుపడకు. కిందకి వెళ్ళు. నేను వస్తున్నా” అంటూ ఆమెను కిందకి పంపాడు.
ఒక అరగంటలో రెడీ అయి స్టెత్ పట్టుకుని కిందకొచ్చాడు వినీల్.
“అమ్మా నేను హాస్పిటల్‌కి వెళుతున్నా” అన్నాడు.
“టిఫిన్ తినలేదు. కాఫీ తాగలేదు. అలాగే వెళతావా హాస్పిటల్‌కి? నివేద కాఫీ ఇస్తుంది. కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళు “ అంది సత్యవతి.
“వద్దమ్మా, నేను వెళ్ళాలి” అంటూ వెళ్ళిపోయాడు వినీల్.
కొద్దిసేపటి తరువాత వినీల్ హాస్పిటల్ ముందు అరుపులు, కేకలు, ఏడుపులు వినిపించాయి.
శవం తాలూకు బంధువులు శవాన్ని హాస్పిటల్ ముందు పెట్టుకుని ధర్నా చేస్తున్నారు.
“డాక్టర్ వినీల్ డౌన్ డౌన్” అంటూ పెద్ద ఎత్తున అరుస్తున్నారు.
హాస్పిటల్ ఇన్‌ఛార్జ్ పోలీసులకి ఫోన్ చేసాడు. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చారు. అప్పటికే అక్కడి పరిస్థితి పూర్తిగా అదుపు తప్పి వుంది.
హాస్పిటల్ ఫర్నిచర్‌ని ధ్వంసం చేస్తూ డాక్టర్ వినీల్ దగ్గరకి వెళ్లి తిట్టుకుంటూ, కొట్టుకుంటూ బయటకు లాక్కొచ్చారు.
ఈ లోపలే సంఘటనా స్థలానికి వస్తూ వస్తూ ఇన్‌స్పెక్టర్ గారు ఏ.ఎస్.పి గారికి పరిస్థితిని వివరించారు. వెంటనే ఏ.ఎస్.పి సూర్యదేవ్ అక్కడికి వచ్చారు. డాక్టర్ వినీల్‌ని లాక్కొచ్చి కొట్టటం సూర్యదేవ్ చూసాడు. సూర్యదేవ్ వేగంగా అక్కడకి వెళ్లి డాక్టర్ వినీల్‌ని వాళ్ళు కొట్టకుండా పక్కకి తప్పించాడు.
మృతుడి బంధువులని ఉద్దేశించి “మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. మామీద నమ్మకం ఉంచి అతన్ని వదిలిపెట్టండి. అలా కాకుండా మీరు డాక్టర్ గారిని కొట్టినట్లైతే విధి నిర్వహణలో వున్న డాక్టర్‌ని కొట్టినందుకు గాను మీ మీద కేసు అవుతుంది.
అలా కాక మీరు అతన్ని వదిలిపెడితే డ్యూటీని అశ్రద్ధ చేసి ఒకరి మృతికి కారణమైనందుకు డాక్టర్ పైన కేస్ పెట్టి చట్టరీత్యా చర్య తీసుకుంటాం. నేరస్థులు ఎంతటి వారైనా వదిలిపెట్టం. నా మీద నమ్మకం వుంచి మీరు ఆందోళన విరమించి వెళ్లిపోండి” అని అన్నాడు సూర్యదేవ్.
పరిస్థితి అదుపులోకి వచ్చింది.
వెంటనే డాక్టర్ వినీల్‌ని వాళ్ళ నుండి విడిపించి సురక్షితంగా పోలీస్ వాహనంలో ఎక్కించాడు.
“పోలీస్ స్టేషన్‌కి తీసుకుపోండి” అంటూ ఆర్డర్ వేసాడు సూర్యదేవ్.
పోలీస్ వాహనం వెళ్ళిపోయింది.
ఏ.ఎస్.పి సూర్యదేవ్ మృతుని భార్యను ఉద్దేశించి “మీరు వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి దరఖాస్తు ఇవ్వండి. డాక్టర్ పైన కేసు రిజిస్టర్ చేస్తారు. ఆయన్ను వెంటనే జైలుకు పంపిస్తారు. చనిపోయిన వ్యక్తిని మీకు ఎలాగూ తెచ్చివ్వలేము కానీ మీకు న్యాయం మాత్రం చేస్తాం” అంటూ ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు సూర్యదేవ్.
ఆమె వెళ్లి డాక్టర్ గారి మీద కంప్లైంట్ ఇవ్వగానే ఇన్‌స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేసారు. సాక్షుల వివరాలను సేకరించారు. డాక్టర్ వినీల్‌ని రిమాండ్‌కి తరలించారు.
అప్పుడే ముంబై నుండి వచ్చిన హరనాథరావు టీవీలో వస్తున్న స్క్రోలింగ్ చూసి షాకయ్యాడు.
సత్యవతి కళ్ళు తిరిగి పడిపోయింది.
ఆమె ముఖం మ్మీద పనిమనిషి నీళ్లు చల్లగానే లేచింది.
నివేద అప్పుడు ఇంట్లో లేదు. కాలేజీలో వుంది.
హరనాధరావు వెంటనే షాక్ లోంచి తేరుకుని కారుని వేగంగా డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్‌కి వెళ్ళాడు.
ఆయన్ని చూడగానే “డాక్టర్ గారిని పోలీసులు తీసుకు వెళ్లారు సార్” అని హాస్పిటల్ సిబ్బంది బాధ పడుతూ చెప్పారు.
“ఏం జరిగింది?” ఆతృతగా, ఆందోళనగా అడిగాడు హరనాథరావు.
“డాక్టర్ గారు చేసిన శస్త్ర చికిత్సలో జరిగిన పొరపాటు వల్ల పేషంట్ ప్రధానమైన రక్తనాళం తెగి రక్తస్రావం జరిగింది సార్! డాక్టర్ ఆ రక్తస్రావాన్ని కంట్రోల్ చెయ్యలేకపోయారు. పేషంట్ చనిపోయాడు” అన్నారు.
అయన అక్కడ నుండి వెళ్లి ఇన్‌స్పెక్టర్ గారిని కలిసాడు. విషయం అడిగాడు.
“కేసు రిజిస్టర్ అయింది. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. మీరు బెయిల్ తెచ్చుకుని డాక్టర్ గారిని విడిపించుకు వెళ్ళండి” అన్నారు ఇన్‌స్పెక్టర్.
హరనాధరావు వెంటనే లీడింగ్ అడ్వకేట్ దగ్గరకి వెళ్ళాడు. బెయిల్ గురించి మాట్లాడాడు. ఇంటికి వెళ్ళాడు.
కలలో కూడా ఊహించని ఆ విపత్తుకి అయన మనసంతా పుండులా తయారైంది. ఆయన్ని చూడగానే సత్యవతి ఏడుపు ఆగలేదు. మౌనంగా చూడటం తప్ప ఆయనేం మాట్లాడలేదు. సత్యవతిని ఓదార్చటం నివేద పని అయింది.
ఆ రాత్రంతా ఆ ఇంట్లో ఎవరూ నిద్ర పోలేదు. మనోవ్యథతో మానసిక నరకం చూసారు.
***
తెల్లవారి ఆ అడ్వకేట్ కోర్టులో బెయిల్ పేపర్‌ని మూవ్ చేసాడు. ఆ కోర్టులో పోలీసుల తరుపున గవర్నమెంట్ లాయర్ బెయిల్ ఇవ్వకూడదని గట్టిగా వాదించాడు. ఆ వాదోపవాదాలు జరిగేవరకు సాయంత్రం ఐదు దాటింది. జడ్జి గారు బెయిల్ ఇవ్వలేదు.
తర్వాత రోజు ఆదివారం కావటం వల్ల సోమవారం సాయంత్రానికి బెయిల్ వచ్చింది.
బెయిల్ వచ్చిన తరువాత హరనాధరావు బెయిల్ పేపర్ పట్టుకుని సెంట్రల్ జైలు కి వెళ్ళాడు. అక్కడ జైలు అధికారులకు చూపించాడు.
వాళ్ళు అక్కడి పార్మాలిటీస్‌ని పూర్తి చేసి డాక్టర్ వినీల్‌ని బెయిల్‌పై బయటకు పంపించేసరికి రాత్రి తొమ్మిది గంటలు అయింది.
ఇంటికి వచ్చిన వినీల్‌ని చూసాకనే ఆ ఇంట్లో అందరు కలిసి కూర్చుని భోంచేసారు.
వినీల్ భోంచేసాక ఎవరితో మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు.
***
తెల్లవారింది…
పనంతా అయ్యాక స్నానం చేసి రెడీ అయ్యి కాలేజీకి వెళ్లాలని గదిలోంచి బయటకు వచ్చింది నివేద.
సత్యవతి ఏడుస్తుంటే “ఊరుకో సత్యా!” అంటూ సత్యవతి దగ్గరే కూర్చుని వున్నాడు హరనాధరావు.
వాళ్ళను చూడగానే “ఏమైంది మామయ్యా! అత్తయ్య ఏడుస్తున్నారెందుకు?” అంటూ వాళ్ళ దగ్గరకి వెళ్ళింది నివేద.
“వినీల్ ఇంకా గదిలో పడుకునే వున్నాడు నివేదా! మేం వెళ్లి పిలిచినా లేవటం లేదు. వాడినలా చూస్తుంటే భయంగా వుంది. ఈ ఇంటికి ఏదో అయిందనిపిస్తోంది. లేకుంటే ఎలా వున్న వినీల్ ఎలా అయ్యాడో చూడు” అన్నాడు బాధగా హరనాధరావు.
నివేదను చూడగానే సత్యవతి లేచి కూర్చుంది.
“వాడు అలాగే వుంటే నేను బ్రతకను వేదా! అంత బాధగా వుంది నాకు. నువ్వు లేపితే లేస్తాడేమో వెళ్లి లేపు. అత్తయ్య చచ్చిపోతానంటుంది అని వాడికి చెప్పు” అంది.
“చ చ అలా మాట్లాడకండి అత్తయ్యా! నువ్వు చచ్చిపోవటం ఏమిటి? నేను వెళ్లి బావను లేపుతాను వుండండి” అంటూ పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళింది నివేద.
వినీల్ వుండే గది తలుపు తీసే వుండటంతో లోపలకి వెళ్ళింది నివేద.
“నిద్ర పోతున్నావా బావా!” అంది బెడ్ దగ్గరకి వెళ్లి.
అతను కదల్లేదు. మెదల్లేదు.
“ఇప్పుడు టైం ఎంతయిందో తెలుసా! ఇంత సేపు ఎప్పుడైనా పడుకున్నావా? లే బావా లే” అంది నివేద.
అతను లేవలేదు.
కళ్ళ మీద చేయి పెట్టుకుని పడుకుని వున్నాడు. అతని చేతిని చనువుగా పట్టుకుని మెల్లగా లేపింది నివేద.
“లే బావా! నువ్విలా పడుకుంటే అత్తయ్య, మామయ్య బాధ పడుతున్నారు. ఏడుస్తున్నారు. చచ్చిపోతామంటున్నారు. ఇదేనా నువ్వు వాళ్లకు వెయ్యాల్సిన శిక్ష? ఇలా ఎందుకు బావా? వాళ్ళేం తప్పు చేసారు? ముందు నువ్వు లే బావా” అంది నివేద.
“నా మనసేం బాగాలేదు నివేద” అంటూ లేచి కూర్చున్నాడు వినీల్.
“జరిగిన సంఘటన అలాంటిది కాబట్టి మనసు అలాగే వుంటుంది బావా! మరచిపోవాలి. దాన్నే గుర్తు చేసుకుంటే మనసు బాగుంటుందా? నువ్వొక డాక్టర్‌వి. ఇలాంటివి నీకు తెలియదా? అతన్నేమైనా నువ్వు కావాలని చంపావా? అయినా జైలుకి వెళ్ళావు. శిక్ష అనుభవించావు. ఇంకా నిన్ను నువ్వు ఇలా శిక్షించుకోవటం దేనికి? దీనివల్ల ఏమొస్తుంది? నీతోపాటు ఇంట్లో వాళ్ళు కూడా క్షోభ పడతారు. నువ్విలా వుండొద్దు బావా” అంది.
పక్కనే వున్న కుర్చీని లాక్కుని అతనికి ఎదురుగా కూర్చుంది.
“నువ్విక్కడ వుండొద్దు నివేద! ప్లీజ్ వెళ్ళు” అన్నాడు.
“నేను వెళ్ళను బావా! నువ్వెందుకిలా వుండాలి? ఏదో అలా జరిగిందని ఎప్పుడూ అలాగే జరుగుతుందా? నువ్వు మనుషుల ప్రాణాలను కాపాడేవాడివే కాని తీసేవాడివికావు. నువ్వు ఎన్నో ఆపరేషన్లు చెయ్యాలి. ఎందరో రోగుల్ని చూడాలి. నువ్వు ఆలోచించాల్సింది జరిగిపోయింది కాదు. ఇప్పుడు జరగాల్సింది. నువ్వు లేచి తిరిగితేనే అత్తయ్య ఎప్పటిలా వుంటుంది. లేకుంటే ఆమె మనకు దక్కదు. అత్తయ్యకు ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. అత్తయ్య అంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసు. లే బావా లేచి స్నానం చెయ్యి” అంటూ వినీల్ ని పట్టుకుని బలవంతంగా లేపింది.
“నువ్వు బాగా మొండిదానివి నివేదా! పట్టుబడితే వదలవు” అంటూ లేచి వాష్ రూమ్ లోకి వెళ్ళాడు వినీల్.
అతను స్నానం చేసి ప్రెషప్పయ్యే వరకు బయట బాల్కనీలో నిలబడింది. అతను మళ్ళీ పడుకోబోయాడు.
అది చూసి “ ప్లీజ్ బావా! పడుకోవద్దు. నీకోసం అత్తయ్య వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కిందకి వెళదాం” అంటూ అతని చేయి పట్టుకుని గదిలోంచి బయటకు తీసుకొచ్చింది.
ఇద్దరు కలిసి మెట్లు దిగుతుంటే సత్యవతి, హరనాధరావు అలాగే చూసారు. వినీల్ చేయి ఇంకా నివేద చేతిలోనే వుంది. వాళ్ళను చూడగానే సత్యవతి ముఖం వికసించింది. హరనాధరావు సంతోషపడ్డాడు.
“అత్తయ్యా! వినీల్ బావ వస్తున్నాడు చూడు. చెప్పానా తీసికొస్తానని” అంటూ నవ్వుతూ వెళ్లి వినీల్‌ని డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టింది. నివేద చేస్తున్న పనికి వినీల్ కూడా నవ్వాడు. వాళ్ళను చూస్తుంటే సత్యవతిలో ఎప్పుడూ రాని ఒక ఆలోచన వచ్చింది.
అందరు కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసారు.
నివేద కాలేజీకి వెళ్ళింది.
వినీల్ హాస్పిటల్‌కి వెళ్లలేదు. అసలు హాస్పిటల్‌కి వెళ్లాలంటేనే గిల్టీగా వుంది. అందుకే తల్లి దగ్గర కూర్చున్నాడు. హరనాధరావు ఆ రోజంతా బయట పనులేమీ పెట్టుకోకుండా ఇంట్లోనే గడిపాడు.
(సశేషం)