వైకుంఠపాళి-9

0
3

[dropcap]కా[/dropcap]ర్లో వెళుతున్న మాళవిక డ్రైవరుతో “ఓసారి కారాపు..” అంది. కారు ఆగింది.

విండో అద్దం దించి, పేవ్‌మెంట్ మీద నడిచి వెళ్తున్న శశిధర్ వైపు చూసి నవ్వింది మాళవిక.

శశిధర్ కూడా ఆమె వైపు చూసాడు.

అతనికి అప్రయత్నంగా ఆమెని మొదటిసారి కలిసినప్పుడు ఆమె ప్రవర్తించిన తీరు గుర్తొచ్చింది. నందిని అమాయకపు మొహం కళ్ళల్లో మెదిలింది.

మాళవిక – పెరిగిన గడ్డంతో, పీక్కుపోయిన మొహంతో అతి దీనంగా బిచ్చగాడిలా వున్న అతనిని చూస్తోంది. ఆమె కళ్ళల్లో ఓ సంతృప్తి కదలాడింది. ఆ నవ్వులో కసి స్పష్టంగా మెరుస్తోంది!

శశిధర్‌కి ఒక్క క్షణం ఒళ్ళు గగుర్పొడిచింది.

“పోనీ…” నిర్లక్ష్యంగా తల తిప్పుకుంటూ డ్రైవర్‍తో చెప్పింది.

కారు రేపిన దుమ్ముతో మూసుకుపోయిన కళ్ళని నులుముకుంటూ శశిధర్ మిగిలిపోయాడు.

అతని మనసు కీడు శంకించింది. నందినిని ఆ రోజు కొట్టీ, తిట్టీ వచ్చేసిన తర్వాత అతను ఆమె గురించి పట్టించుకోలేదు. అతను ఒక్కసారిగా నిద్రలోంచి లేచినట్టు, “నందినీ… నందినీ” అంటూ ఆమె కోసం బయల్దేరాడు.

***

“నువ్వా?” గాబరాగా మంచం మీద నుండి లేస్తూ అంది నందిని.

“ఔను… నేనే! కంగారుపడకు… ఎవరూ రారు. వచ్చినా డిస్టర్బ్ చెయ్యరు” శ్యామ్ గది తలుపు గడియ పెడ్తూ అన్నాడు.

“దుర్మార్గుడా.. బయటకు నడు… లేకపోతే నీ ప్రాణం తీస్తాను” అరిచింది నందిని.

శ్యామ్ ఆమె అరుపులు పట్టించుకొనే స్థితిలో లేడు. బాగా తాగి తన కంట్రోల్‌లో తను లేడు.

“నిన్ను చూసినప్పటి నుండీ ఆపుకోలేని కోరిక… ఇన్నాళ్ళకి తీరబోతోంది… రా… టైమ్ వేస్ట్ చెయ్యకు” అని ఆమె మీదకి లంఘించాడు.

నందిని ఆ పట్టు విడిపించుకోవడానికి పెనుగులాడింది. కానీ అతని పశుబలం ముందు ఆమె ఓడిపోయింది. అతని కామతృష్ణ తీర్చుకుని లేస్తూ… “మీ అక్కకి ఇంత అందం వుంటే ప్రపంచాన్నే కొనేసేది!” అన్నాడు.

తృప్తితో మెరుస్తున్న వాడి కళ్లను చూసింది నందిని. ఆమెకి వాడ్ని చంపేయాలనిపించింది. ఆ నిమిషంలో ఆ ఆలోచన తప్ప ఆమె మెదడులో ఇంకో ఆలోచన లేదు.

సివంగిలా లేచెళ్ళి ఒక్క తన్ను తన్నింది. వాడు ముందుకు పడ్డాడు. వెంటనే టేబుల్ మీదున్న ఇత్తడి ఫ్లవర్ వాజ్‌తో తల మీద ఆగకుండా బాదింది. అతను అరుస్తున్నాడు. రక్తం కారిపోతోంది…. అయినా ఆమె ఉన్మాదంగా కొడుతూనే వుంది!

***

“ఎక్కడి కెళ్తున్నారూ?” అడిగింది సతీష్ చంద్ర భార్య వందన.

“ఇన్నాళ్ళూ నువ్వు నాకు చెప్పే తిరుగుతున్నావా?” అడిగాడు సతీష్ చంద్ర.

“ఔను! నేను ఎక్కువ సేపు మీతో గడపడం లేదనీ, సోషల్ వర్క్ పేరుతో, మహిళా సభల పేరుతో మిమ్మల్ని వదిలి తిరుగుతున్నాననీ మీ ఆరోపణ! కానీ మీరు మాత్రం ఖాళీగా వున్నారా? ఒక వేళ ఆ వ్యాపకాలే నాకు లేకుంటే – బిజినెస్… బిజినెస్… అంటూ నెలలో సగం రోజులు నన్ను ఒంటరిగా వదిలేసి తిరిగే మీతో కాపురం ఎలా చేస్తాను! పిచ్చెక్కిపోదూ?…. మీకు నాకంటే సంపాదనే ముఖ్యం. ఆ విషయం నాకు తెలుసు. దాన్ని వదులుకోమని చెప్పలేను. ఎందుకంటే డబ్బు అవసరం నాకు తెలుసు కాబట్టి. మిమ్మల్ని నేను నాతో ఎక్కువగా గడపమని వేధించడం, సాధించడం చెయ్యలేను కాబట్టి, ఓ వ్యాపకంగా ఈ పరిచయాలు, కార్యక్రమాలూ నెత్తిన వేసుకున్నాను. అవి మీ వ్యసనాల కంటే భయంకరమైనవి కావే…” అంది వందన.

“నా పర్సనల్ ఎఫైర్స్ నీకు అనవసరం” సతీష్ చంద్ర కటువుగా అన్నాడు.

“సరే… కానీ లాజికల్‌గా ఆలోచించి ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పండి. నేను ఇవ్వలేని కంపెనీనీ, స్నేహాన్నీ మీకు ఇంకో స్త్రీ ఇస్తోందా?”

“ఆ! ముమ్మాటికీ”

“హు! మీరెంత అమాయకులండీ! ఆమెకు కావలసింది మీ డబ్బూ, హోదా. అవి లేని నాడు మిమ్మల్ని వాకిట్లోకి కూడా రానియ్యదు. ఆ వాసుదేవరావుని తన్ని తగలేసినట్లే మిమ్మల్ని తరిమేస్తుంది!”

“వందనా!”

“ఇవన్నీ నాకెలా తెలుసని ఆశ్చర్యపోతున్నారా? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగడం లాంటివే ఈ అక్రమ సంబంధాలన్నీ. పనివాళ్ళు మన ముందు నోరు మూసుకుంటారు గానీ, లోకం ముందు కాదు! ఆ రోజు అతడ్ని వెళ్ళగొట్టడానికి మీరు ముందుకురికారు. రేపు మిమ్మల్ని గెంటెయ్యడానికి మీ స్థానంలో వేరొకడు తయ్యారవుతాడు” వ్యంగంగా నవ్వింది వందన.

“నోర్ముయ్… నీ కళ్ళకి లోకం అంతా నీలాగే డబ్బుమయంగా కనిపిస్తుంది” సతీష్ చంద్ర కోపంగా అరిచాడు.

“అయితే ఆ సినీ నిర్మాత రాజశేఖర్‌తో మీ ప్రియసఖి ఊటీ ఎందుకు వెళ్ళినట్లూ?” అడిగింది వందన.

సతీష్ చంద్ర షాక్ కొట్టినట్లుగా చూసాడు.

ఏదో సాహిత్య సభ కని బెంగుళూరు వెళ్తానంది మాళవిక. తనూ వస్తానంటే ‘అందరం ఆడ రచయిత్రులం వెళ్తున్నాం… మీరెందుకూ?’ అంది. తను నిజమనుకున్నాడు. మగాడెప్పుడూ అంతే, కట్టుకున్న భార్యని తప్ప ఏ స్త్రీనీ అనుమానించడు.

“మీ డ్రెవర్ కళ్ళారా చూసి, నాతో చెప్పాడు – వాళ్ళిద్దరూ ఊటీ వెళ్తున్నట్టు ఆమె ఫోన్‍లో ఎవరితోనో చెప్పడం! కావాలంటే కనుక్కోండి” అంది.

సతీష్ చంద్ర పళ్ళు పట పట కొరుకుతూ నిలబడిపోయాడు.

***

“నువ్వు… నువ్వు… మళ్ళీ నా మొహం చూస్తావనుకోలేదు లక్ష్మీ!” బలహీనంగా అన్నాడు వాసుదేవరావు.

లక్ష్మి కొంగు నోట్లో పెట్టుకుని ఏడుపు ఆపుకుంటూ చూసింది.

“లక్ష్మీ… క్షమించు అనే అర్హత కూడా నాకు లేదు” అతి కష్టం మీద అనగలిగాడు వాసుదేవరావు.

“వద్దండీ… డాక్టర్ గారు ఎక్కువగా మాట్లాడకూడదన్నారు” అతని గుండెల మీద తన చేత్తో మృదువుగా రాస్తూ అంది లక్ష్మి.

ఆ చేతి చలవని ఆనందిస్తూ… ‘నేనెంతటి మూర్ఖుడిని’ అనుకున్నాడు వాసుదేవరావు.

“సమయానికి వెనక్కి వచ్చాను కాబట్టి సరిపోయింది. అదే ఇంకో గంట ఆలస్యం అయితే నా పసుపు కుంకుమలు… అమ్మో!” తలచుకోవడానికే భయం వేస్తున్నట్లుగా ఆమె తల విదిలించేసింది.

“నేనంటే నీకు అసహ్యం లేదా లక్ష్మీ?” అడిగాడు.

“లేదు. జాలి!” జాలిగా అతని తల నిముర్తూ అంది లక్ష్మి.

అప్పుడు సిగ్గుతో తల వంచుకున్నాడు వాసుదేవరావు. ఇంక మాట్లాడడానికి నోరు పెగలలేదు.

“నేను ఉద్యోగం చూసుకున్నాను. ఓ ఇల్లు కూడా చూసాను. చాలా చిన్నదనుకోండి. ప్రస్తుతానికి మనకి సరిపోతుంది. మీరు కొన్నాళ్ళు ఏ ఆలోచనలూ పెట్టుకోకుండా బాబుని చూసుకుంటూ ఇంటి పట్టున విశ్రాంతిగా వుందురు కాని… ఏం?” అంది లక్ష్మి.

అతను విభ్రాంతిగా చూసాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here